
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం
ప్రజాప్రతినిధులకు సరైన భద్రత ఎందుకు కల్పించలేదు?
ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు
ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
సాక్షి, నూఢిల్లీ : తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ప్రజాప్రతినిధులపై దాడి జరుగుతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. దాడికి పాల్పడ్డ వారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదని నిలదీసింది. ఈ ఘటనపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి శుక్రవారం నోటీసులిచ్చింది. తిరుపతి ఘటనపై వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి 18న ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. ‘ఫిబ్రవరి 3న తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు నేను, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం బస్సులో వెళ్తున్నాం. మాతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు.
వేరే పార్టీకి చెందిన కొందరు మా బస్సును అడ్డగించారు. రాడ్లతో బస్సు అద్దాలు ధ్వంసం చేసి లోపలకు చొరబడ్డారు. నాపైన, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లపైన భౌతిక దాడికి పాల్పడ్డారు. చొక్కాలు చించి మరీ భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన అంతా పోలీసుల సాక్షిగానే జరిగింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే’ అంటూ ఎంపీ గురుమూర్తి ఆ ఫిర్యాదులో తెలిపారు.
ఎఫ్‌ఐఆర్‌లో ఎంపీ ఫిర్యాదు చేసిన వారి పేర్లేవి?
ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ ఘటనకు సంబంధించిన వార్తలు కూడా న్యూస్ ఛాన్నెళ్లు, పత్రికల్లో కూడా వచ్చాయి. దాడికి పాల్పడ్డ వారి పేర్లను ప్రస్తావిస్తూ తిరుపతి ఎస్పీకి ఎంపీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఎస్‌వీయూ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ నంబర్ 18/2025లో ఎంపీ ప్రస్తావించిన పేర్లు లేవు.
ప్రజా ప్రతినిధులు వెళుతున్న బస్సుకు పోలీసు ఎస్కార్ట్ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్‌ను సైతం ఎస్పీకి ఇచ్చారు. అయినా వారికి పోలీసులు సరైన భద్రత ఎందుకు కల్పించలేదు?’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు ఎందుకు చేర్చలేదో, ప్రస్తుతం ఆ ఎఫ్‌ఐఆర్‌పై జరిపిన విచారణ, పూర్తి సమాచారం, ఆధారాలతో సహా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది.