‘ఇస్రో’ రోబో హస్తం | India First Space Robotic Arm in Action | Sakshi
Sakshi News home page

‘ఇస్రో’ రోబో హస్తం

Published Sun, Jan 5 2025 5:58 AM | Last Updated on Sun, Jan 5 2025 10:39 AM

India First Space Robotic Arm in Action

కీలక ప్రయోగం విజయవంతం  

న్యూఢిల్లీ:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో అభివృద్ధి చేసిన రోబోటిక్‌ హస్తం అంతరిక్షంలో తన  కార్యాచరణ ప్రారంభించింది. భారతదేశ  అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక  పరిణామమని నిపుణులు చెబుతున్నారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకొనే దిశగా స్పేడెక్స్‌(స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పర్మెంట్‌) మిషన్‌లో భాగంగా ఈ రిమోట్‌ రోబోటిక్‌ చెయ్యిని అంతరిక్షంలోకి పంపించారు.

 శ్రీహరికోటలోని షార్‌ నుంచి గత నెల 30వ తేదీన అంతరిక్షంలోకి వెళ్లింది. మన దేశానికి చెందిన మొట్టమొదటి రోబోటిక్‌ హస్తం  రీలొకేటబుల్‌  రోబోటిక్‌ మ్యానిప్యులేటర్‌–టెక్నాలజీ డెమాన్ర్‌స్టేటర్‌(ఆర్‌ఆర్‌ఎం–టీడీ) కార్యాచరణ మొదలుపెట్టిందని, ఇది మనకు గర్వకారణమని ఇస్రో వెల్లడించింది. పూర్తి స్థాయిలో విజయవంతమైన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

ఆర్‌ఆర్‌ఎం–టీడీని నడిచే రోబోటిక్‌ హస్తంగా పరిగణిస్తారు. ఇండియాలో ఇలాంటిది అభివృద్ధి చేయడంలో ఇదే మొదటిసారి. ఇందులో ఏడు జాయింట్లు ఉన్నాయి. అవి అన్ని వైపులా కదులుతాయి. అంతరిక్షంలోని స్పేడెక్స్‌ మిషన్‌లో భాగమైన పీఎస్‌4–ఆర్బిటాల్‌ ఎక్స్‌పెరిమెంట్‌  మాడ్యూల్‌(పోయెం–4) ఫ్లాట్‌పామ్‌పై చురుగ్గా నడవగలదు. నిర్దేశించిన చోటుకు వెళ్తుంది.

 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మర చెయ్యిని రూపొందించారు. ఇందులో కంట్రోలర్లు, కెమెరాలు, అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ను అమర్చారు. భారతీయ అంతరిక్ష స్టేషన్‌(బీఏఎస్‌) పేరిట సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి భారత్‌ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీఏఎస్‌ నిర్మాణం, నిర్వహణకు రోబోటిక్‌ టెక్నాలజీ అవసరం. ఈ టెక్నాలజీని స్వయంగా అభివృదిచేసుకొనే దిశగా రోబోటిక్‌ హస్తం కీలకమైన ముందడుగు అని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement