Chandrayaan-3
-
‘మూన్ స్నైపర్’ బతికేనా?.. జపాన్ ‘దింపుడు కళ్ళం’ ఆశ!
జపాన్ ప్రయోగించిన ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ మూడు రోజుల క్రితం చంద్రుడిపైనున్న షియోలీ బిలం వాలులో దిగింది. ఆ ప్రదేశంలో ప్రస్తుతం భానోదయం. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి ఆగమిస్తున్నాడు. ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) మాత్రం పడమటి దిక్కు వైపు మోహరించి ఉన్నాయి. ఫలితంగా వ్యోమనౌకలో సౌర విద్యుత్ తయారీకి ఇప్పుడు అవకాశం లేదు. అందుకే... భవిష్యత్తులో ల్యాండర్ పునఃప్రారంభ అవసరాల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా తమ ‘మూన్ స్నైపర్’ బ్యాటరీని స్విచ్ ఆఫ్ చేసినట్టు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సోమవారం ప్రకటించింది. వ్యోమనౌక ఆన్‌బోర్డ్ బ్యాటరీలో 12% (కనీస) పవర్ ఉందని, చంద్రుడిపై ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ దిగిన మూడు గంటలకు దాని బ్యాటరీని స్విచాఫ్ చేశామని ‘జాక్సా’ తెలిపింది. అవసరమైనప్పుడు ల్యాండరును రీ-స్టార్ట్ చేయడానికి అందులో ఉన్న 12% పవర్ సరిపోతుందని సంస్థ పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత సూర్యుడు పడమటి దిక్కుకు వాలినప్పుడు ల్యాండర్ సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశముంది. అప్పుడు ల్యాండరును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం ‘జాక్సా’ వివరించింది. ప్రస్తుతం ల్యాండర్ నిద్రాణ స్థితిలో ఉంది. సౌరవిద్యుత్ తయారీ దృష్ట్యా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు వంటి వ్యోమనౌకల్ని సాధారణంగా జాబిలిపై సూర్యుడు సరిగ్గా ఉదయించే వేళల్లోనే/ప్రదేశాల్లోనే దిగేలా చూస్తుంటారు. చంద్రుడిపై పగటి సమయం (పగలు) 15 రోజులు ఉంటుంది. అలాగే రాత్రి సమయం కూడా 15 రోజుల పాటు ఉంటుంది. చంద్రుడిపై ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రదేశంలో భానుడు ప్రస్తుతం తూర్పు దిక్కు నుంచి పడమటి వైపుగా ప్రయాణం సాగిస్తున్నాడు. అక్కడ సూర్యుడు నడి నెత్తి నుంచి అంటే... మధ్యాహ్నం తర్వాత కాస్త ఆవలకు దిగి పొద్దు వాలితే గానీ ‘మూన్ స్నైపర్’ సోలార్ ప్యానెళ్లకు సూర్యరశ్మి సోకదు. సూర్యకాంతి తగిలితేనే, దాని నుంచి సౌరవిద్యుత్ తయారుచేసి వినియోగించుకోగలిగితేనే ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కోలుకున్నట్టు. జపాన్ మూన్ మిషన్ విజయవంతమైనట్టు. తమ ‘స్లిమ్’ ల్యాండర్ నుంచి చాలా డేటా సేకరించామని, త్వరలో దాన్ని వెల్లడిస్తామని ‘జాక్సా’ ప్రకటించింది. - జమ్ముల శ్రీకాంత్ -
చంద్రయాన్-3.. స్లీప్‌మోడ్‌లోనూ సిగ్నల్.. ఇస్రో కీలక అప్డేట్
చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కీలక అప్డేట్ అందించింది. చంద్రునిపై 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుందని సంగతి తెలిసిందే. ఈ కారణంగా రాత్రిళ్లు ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 వరకు ఉంటోంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో పరిశోధనలు సాధ్యం కాకపోవడంతో సెప్టెంబర్ 2 రోవర్, సెప్టెంబర్ 4న ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచారు. అయితే చంద్రయాన్-3లో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందుకు సంబందించిన వివరాలను బెంగళూరులో వారు ధ్రువీకరించారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్-3 ల్యాండర్లో వివిధ దేశాలకు చెందిన కొన్ని పరికరాలను అమర్చారు. అయితే అందులో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ)లోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ అరే (ఎల్ఆర్ఏ) చంద్రుడి దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించిందని తెలిపారు. డిసెంబరు 12 నుంచి ఎల్ఆర్ఏ నుంచి సంకేతాలు అందినట్లు ఇస్రో పేర్కొంది. చంద్రయాన్-3లో పలు సంస్థలకు చెందిన ఎల్ఆర్ఏలను అమర్చినా నాసాకు చెందిన ఎల్ఆర్ఏ నిత్యం పనిచేస్తోందని ఇస్రో చెప్పింది. దక్షిణ ధ్రువంలోని రాత్రి సమయాల్లో ఎల్ఆర్ఏ పర్యవేక్షణ ప్రారంభిస్తుంది. చంద్రయాన్-3లోని 8 ఫలకల రెట్రో రిఫ్లెక్టర్లు దక్షిణ ధ్రువంలోని వాతావరణాన్ని తట్టుకునేలా ఏర్పాటు చేశారు. దాదాపు 20 గ్రాముల బరువుండే ఈ పరికరం పదేళ్ల పాటు చంద్రుని ఉపరితలంపై మనుగడ సాగించే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: రాబోతోంది మరతరం.. కాఫీ చేస్తున్న హ్యుమనాయిడ్ రోబోలు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని భారత్ ‘శివ శక్తి పాయింట్’గా నామకరణం చేసింది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించింది. 14 రోజులపాటు అక్కడి వాతావరణ, నీటి పరిస్థితి, ఖనిజాల గురించి అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది. ఇస్రో మొదట రోవర్ 300-350 మీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల రోవర్ ఇప్పటి వరకు 105 మీటర్లు మాత్రమే కదిలింది. అయినప్పటికీ, మిషన్ దాని లక్ష్యాలను అధిగమించింది. -
సైన్సులో మన ఘన విజయాలు
చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయమిది. చంద్రయాన్ సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటి. ‘లిగో ఇండియా’ ప్రాజెక్టుకు మన దేశం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా నిర్మాణం ప్రారంభమైంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ కు కూడా 2023లోనే శ్రీకారం పడింది. అయితే, సెన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లను జాబిల్లి పైకి మోసుకెళ్లిన అపోలో–11 లూనార్ మాడ్యూల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ కెమెరా ఉండేది. ఆ ఇద్దరు వ్యోమగాములు చందమామపై మొదటిసారి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టపు లైవ్ ప్రసారం ఈ కెమెరా ద్వారానే జరిగింది. అప్పట్లో ఈ ప్రసారాన్ని 53 కోట్ల మంది వీక్షించారు. అంతరిక్ష పరిశోధనల్లో 1969 జూలై 20 నాటి ఈ ఘటన అత్యంత కీలకమైందనడంలో సందేహం లేదు. అలాగే టెలివిజన్ ప్రసారాల్లోనూ ఓ మైలురాయిగా నిలిచింది. యాభై ఏళ్ల తరువాత 2023 ఆగస్టు 23న కూడా దాదాపు ఇలాంటి చారిత్రక ఘటనే భారత్ లోనూ నమోదైంది. చంద్రయాన్ –3 జాబిల్లిపై అడుగుపెట్టిన ఘట్టాన్ని యూట్యూబ్‌లోనే 80.9 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించి ఇదో రికార్డు. చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయ మిది. చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటిగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం తొలివారంలో ఈ అంతరిక్ష నౌక సూర్యుడిని పరిశీలించేందుకు అనువైన స్థానానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రయోగాలు మాత్రమే కాకుండా 2023లో ‘ఇస్రో’ ఖాతాలో పలు కీలకమైన ప్రాజె క్టులను అమలు చేసిన ఖ్యాతి చేరింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడం, రెండోతరం నావిగేషన్ ఉప గ్రహాల్లో తొలి ప్రయోగం, మానవ సహిత ప్రాజెక్టు ‘గగన్‌యాన్ ’లో క్రూ ఎస్కేప్ మోడల్ పరీక్ష ఈ జాబితాలో కొన్ని మాత్రమే. అంతరిక్ష ప్రయోగాలకు ఆవల... దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలకు ఆవల కూడా మన దేశం పలు విజయాలను నమోదు చేసింది. లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో ఇండియా)కి ప్రభుత్వం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అరుదైన గురుత్వ తరంగాల వేధశాలగా, అతి సున్నితమైన నాలుగు కిలోమీటర్ల పొడవైన ఇంటర్ఫెరోమీటర్ సొరంగం ఉన్నదిగా ఇది రికార్డులకు ఎక్కింది. కృష్ణ బిలాలు, న్యూట్రాన్ నక్షత్రాల వంటివి కలిసిపోయినప్పుడు పుట్టే గురుత్వ తరంగాలను గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికాలో ఇప్పటికే పని చేస్తున్న లిగో వేధశాలలతో కలిసి హింగోలి వేధశాల పనిచేస్తుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్‌కు కూడా 2023లోనే అడుగు పడింది. సూపర్ కండక్టింగ్, ఫొటోనిక్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతో మధ్యమ స్థాయి క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీంతోపాటే కృత్రిమ మేధ ద్వారా దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను గుర్తించేందుకు కూడా జాతీయ స్థాయి కార్య క్రమం ఒకటి ఈ ఏడాది మొదలైంది. కృత్రిమ మేధను బాధ్యతా యుతమైన టెక్నాలజీగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరిశోధనల్లోనూ ఉన్నత స్థితిలో... భారతదేశంలో ప్రచార ఆర్భాటాలకు చిక్కని, అత్యుత్తమ, అంత ర్జాతీయ స్థాయి పరిశోధనలు ఎన్నో నమోదయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి హైదరాబాద్‌లోని లాకోన్స్లో ఒక పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యతను గుర్తించేందుకు అభివృద్ధి చేసిన పద్ధతి. సీసీఎంబీ అనుబంధ సంస్థ అయిన లాకోన్స్లో ఎస్. మను, జి.ఉమాపతి ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. నీరు, మట్టి, గాలుల్లోని డీఎన్ ఏ పోగుల ఆధారంగా జీవవైవిధ్యతను కొలవడం ఈ పద్ధతి ప్రత్యేకత. కర్నాల్(హరియాణా)లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దేశీ గిర్ జాతి ఆవును క్లోనింగ్ పద్ధతి ద్వారా సృష్టించడం 2023 విశేషాల్లో ఇంకోటి. బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన జ్ఞానేశ్వర్ చౌబే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దక్షిణాసియా జన్యుక్రమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సింహళీయులకు, శ్రీలంకలోని తమిళులకు మధ్య దగ్గరి జన్యు సంబంధాలు ఉన్నట్లు పరిశోధన పూర్వకంగా నిర్ధారించింది. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏమిటంటే, ఈ రెండు వర్గాల ప్రజలకూ మరాఠా జనాభాకూ మధ్య సంబంధాలు ఉండటం! కోవిడ్ విషయానికి వస్తే, పుణె కేంద్రంగా పనిచేస్తున్న జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ దేశీయంగా తయారు చేసిన ఎంఆర్ఎన్ ఏ టీకాను విడుదల చేసింది. ఒమిక్రాన్ వైరస్ నియంత్రణకు పనికొస్తుందీ టీకా. విధాన నిర్ణయాలను పరిశీలిస్తే... దేశం మొత్తమ్మీద శాస్త్ర పరిశోధనలకు అవసరమై నిధుల కేటా యింపును పర్యవేక్షించేందుకు ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ ఒకదాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. వివరాలు పూర్తిగా బహిరంగం కాలేదు. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా పనిచేస్తున్న విజ్ఞాన్ ప్రసార్‌ను 2023లో మూసివేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సీఏ)కు నిధుల కేటాయింపులు తగ్గించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఏటా జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. సైన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో జనవరిలో సైన్స్ కాంగ్రెస్ జరిగే అవకాశాలు లేవు. డీఎస్టీ తమ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరించిందని ఐఎస్‌సీఏ ఆరోపిస్తోంది. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను లక్నోలో కాకుండా జలంధర్ సమీపంలోని పగ్వారాలో నిర్వహించాలన్న ఐఎస్‌సీఏ నిర్ణయం డీఎస్టీకి రుచించలేదు. 2023లో సైన్స్ కాంగ్రెస్‌ను నాగ్‌పూర్‌లో నిర్వహించారు. మరోవైపు పలు శాస్త్ర సంబంధిత విభాగాలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విజ్ఞాన్ భారతి ప్రాయో జకత్వం వహిస్తున్న వార్షిక్ సైన్స్ ఫెస్టివల్‌కు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందిస్తూండటం గమనార్హం. దురదృష్టవశాత్తూ చాలా సంస్థలు రాజకీయ పెద్దల అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయాయి. లక్నోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ 108 రేకులున్న కమలాన్ని అభివృద్ధి చేసి దానికి ‘నమో 108’ అని నామకరణం చేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ ‘నమో 108’ను ఆవిష్కరిస్తూ ‘మతపరంగా కమలానికి, 108 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కొత్త రకం కమలం చాలా ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘నిరంతర కృషీవలుడు నరేంద్ర మోదీ అంతః సౌందర్యానికి ఈ కమలం ఓ గొప్ప బహుమానం’ అని కూడా అన్నారు. ఇంకో సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ నికోటిన్ మోతాదు తక్కువగా ఉన్న పొగాకు వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ వంగడం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి అని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎన్ .కళైసెల్వి వ్యాఖ్యానించారు. ఇంకో పక్క ఎన్సీఈఆర్టీ చంద్రయాన్ ప్రయోగ కీర్తి ప్రధానికి దక్కుతుందని పొగడటం ప్రస్తావనార్హం. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వంటి స్వతంత్ర సంస్థలు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనూ నిశ్శబ్దంగా ఉండటం ఆశ్చర్య పరు స్తోంది. 2023లో భారతదేశం సాధించిన అతి గొప్ప విజయం చంద్రయాన్ అనుకుంటే... సైన్స్ సంస్థల రాజకీయీకరణ అత్యంత దురదృష్టకరమైనదిగా చెప్పాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Year End 2023: ఆవిష్కరణల ఏడాది
అంతరిక్ష అన్వేషణ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా, గ్లోబల్ వారి్మంగ్ నుంచి పలు మానవ వికాసపు మూలాల దాకా శాస్త్ర సాంకేతిక రంగాల్లో 2023లో పలు నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ప్రపంచం దృష్టిని తమవైపుకు తిప్పుకోవడమే గాక భవిష్యత్తుపై కొంగొత్త ఆశలు కూడా కల్పించాయి. వినాశ హేతువైన గ్లోబల్ వారి్మంగ్‌లో కొత్త రికార్డులకూ ఈ ఏడాది వేదికైంది! 2023లో టాప్ 10 శాస్త్ర సాంకేతిక, పర్యావరణ పరిణామాలను ఓసారి చూస్తే... 1. చంద్రయాన్ దశాబ్దాల కృషి అనంతరం భారత్ ఎట్టకేలకు చందమామను చేరింది. తద్వారా చంద్రయాన్–3 ప్రయోగం చరిత్ర సృష్టించింది. పైగా ఇప్పటిదాకా ఏ దేశమూ దిగని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువంవైపు చీకటి ఉపరితలంపై దిగిన రికార్డును కూడా చంద్రయాన్–3 సొంతంచేసుకుంది. ఇంతటి ప్రయోగాన్ని ఇస్రో కేవలం 7.5 కోట్ల డాలర్ల వ్యయంతో దిగి్వజయంగా నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచిందనే చెప్పాలి. చంద్రుని ఉపరితలంపై సల్ఫర్ జాడలున్నట్టు చంద్రయాన్–3 ప్రయోగం ధ్రువీకరించింది. రెండు వారాల పాటు చురుగ్గా పని చేసి దాన్ని ప్రయోగించిన లక్ష్యాన్ని నెరవేర్చింది. 2. కృత్రిమ మేధ ఈ రంగంలో కీలక ప్రగతికి 2023 వేదికైంది. 2022 చివర్లో ఓపెన్ఏఐ విడుదల చేసిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఈ ఏడాది అక్షరాలా సంచలనమే సృష్టించింది. ఆకా శమే హద్దుగా అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోయింది. లీవ్ లెటర్లు ప్రిపేర్ చేసినంత సులువుగా సృజనాత్మకమైన లవ్ లెటర్లనూ పొందికగా రాసి పెడుతూ వైవిధ్యం చాటుకుంది. అప్పుడప్పుడూ తడబడ్డా, మొత్తమ్మీద అన్ని అంశాల్లోనూ అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యూజర్ల మనసు దోచుకుంది. గూగుల్ తదితర దిగ్గజాలు కూడా సొంత ఏఐ చాట్బోట్లతో బరిలో దిగుతుండటంతో ఏఐ రంగంలో మరిన్ని విప్లవాత్మక పరిణామాలు వచ్చేలా ఉన్నాయి. 3. ఆదిమ ‘జాతులు’! మనిషి పుట్టిల్లు ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం... ఆఫ్రికా. అంతవరకూ నిజమే అయినా, మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామని ఇప్పటిదాకా నమ్ముతున్న సిద్ధాంతం తప్పని 2023లో ఓ అధ్యయనం చెప్పింది. మన మూలాలు కనీసం రెండు ఆదిమ జాతుల్లో ఉన్నట్టు తేలి్చంది! 10 లక్షల ఏళ్ల కింద ఆఫ్రికాలో ఉనికిలో ఉన్న పలు ఆదిమ జాతులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి దారి తీసినట్టు డీఎన్ఏ విశ్లేషణ ఆధారంగా అది చెప్పడం విశేషం! మూలవాసులైన అమెరికన్లు దాదాపు 20 వేల ఏళ్ల కింద ఉత్తర అమెరికాకు వలస వెళ్లి యురేషియాకు తిరుగు పయనమైనట్టు మరో అధ్యయనం తేల్చింది. 4. గ్రహశకలం ఓసిరిస్ నాసా ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ రోబోటిక్ అంతరిక్ష నౌక ఏడేళ్ల ప్రయాణం అనంతరం బెన్నూ గ్రహశకలంపై దిగింది. అక్కడి దాదాపు పావు కిలో పరిమాణంలో రాళ్లు, ధూళి నమూనాలను సేకరించి భూమికిపైకి పంపింది. అవి సెపె్టంబర్ 24న అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగాయి. వాటిని విశ్లేషించిన సైంటిస్టులు నీటితో పాటు భారీ మొత్తంలో కార్బన్ జాడలున్నట్టు తేల్చారు. బెన్నూ గ్రహశకలం భూమి కంటే పురాతనమైనది. దాని నమూనాల విశ్లేషణ ద్వారా భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలకమైన రహస్యాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు. 5. అత్యంత వేడి ఏడాది చరిత్రలో ఇప్పటిదాకా నమోదైన అత్యంత వేడి ఏడాదిగా 2023 ఓ అవాంఛనీయ రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా ప్రతి నెలా ఇప్పటిదాకా అత్యంత వేడిమి మాసంగా నమోదవుతూ వచి్చంది! ఫలితంగా ఏడాది పొడవునా లిబియా నుంచి అమెరికా దాకా తీవ్ర తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు ఉత్పాతాలు సృష్టిస్తూనే వచ్చాయి. పైగా నవంబర్‌లో అయితే 17వ తేదీన భూ తాపంలో చరిత్రలోనే తొలిసారిగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! 2 డిగ్రీల లక్ష్మణ రేఖను తాకితే సర్వనాశనం తప్పదని సైంటిస్టులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం వణికిస్తోంది. 6. సికిల్ సెల్‌కు తొలి జన్యుచికిత్స సికిల్ సెల్, బెటా థలస్సీమియా వ్యాధులకు తొలిసారిగా జన్యు చికిత్స అందుబాటులోకి వచి్చంది. వాటికి చికిత్స నిమిత్తం కాస్జెవీ 9క్రిస్పర్ కేస్9) జన్యు ఎడిటింగ్ టూల్ వాడకానికి బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం లభించింది. ఈ థెరపీ ద్వారా రోగులకు నొప్పి నిదానించిందని, ఎర్ర రక్త కణాల మారి్పడి ఆవశ్యకత కూడా తగ్గుముఖం పట్టిందని తేలింది. కాకపోతే ఈ చికిత్స ఖరీదే ఏకంగా 20 లక్షల డాలర్లు! పైగా భద్రత అంశాలు, దీర్ఘకాలిక పనితీరు తదితరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 7. ఊబకాయానికి మందు మధుమేహానికి ఔషధంగా పేరుబడ్డ వెగోవీ ఊబకాయాన్ని తగ్గించే మందుగా కూడా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించింది. బరువును తగ్గించడం మాత్రమే గాక గుండెపోటు, స్ట్రోక్ తదితర ముప్పులను కూడా ఇది బాగా తగ్గిస్తుందని తేలడం విశేషం. వీటితో పాటు పలురకాల అడిక్షన్లకు చికిత్సగా కూడా వెగోవీ ప్రభావవంతంగా ఉపయోగపడుతోందని తేలింది. అయితే దీని వాడకం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్టులు రావచ్చంటున్నారు! 8. పాపం పక్షిజాలం ప్రపంచవ్యాప్తంగా జంతుజాలానికి, మరీ ముఖ్యంగా పక్షిజాలానికి మరణశాసనం రాసిన ఏడాదిగా 2023 నిలిచింది! ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ పక్షి జాతుల జనాభాలో ఈ ఏడాది విపరీతమైన తగ్గుదల నమోదైనట్టు సైంటిస్టులు తేల్చారు. గత నాలుగు దశాబ్దాలుగా పెరుగుతూ వస్తున్న ఈ ధోరణి 2023లో బాగా వేగం పుంజుకున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. పురుగుమందుల విచ్చలవిడి వాడకమే పక్షుల మనుగడకు ముప్పుగా మారిందని తేలింది! 9. మూల కణాధారిత పిండం అండం, శుక్ర కణాలతో నిమిత్తం లేకుండానే కేవలం మూల కణాల సాయంతో మానవ పిండాన్ని సృష్టించి ఇజ్రాయెల్ సైంటిస్టులు సంచలనం సృష్టించారు. అది కూడా మహిళ గర్భంతో నిమిత్తం లేకుండా ప్రయోగశాలలో వారీ ఘనత సాధించారు. ఈ నమూనా పిండం ప్రయోగశాలలో 14 రోజుల పాటు పెరిగింది. ఆ సమయానికి సహజంగా తల్లి గర్భంలో ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఎదిగిందని తేలింది. మానవ పునరుత్పత్తి రంగంలో దీన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నారు. 10. కార్చిచ్చులు 2023లో కార్చిచ్చులు కొత్త రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా కెనడాలోనైతే పెను వినాశనానికే దారి తీశాయి. వీటి దెబ్బకు అక్కడ గత అక్టోబర్ నాటికే ఏకంగా 4.5 కోట్ల ఎకరాలు బుగ్గి పాలయ్యాయి! అక్కడ 1989లో నమోదైన పాత రికార్డుతో పోలిస్తే ఇది ఏకంగా రెట్టింపు విధ్వంసం. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, నార్వే వంటి పలు ఇతర దేశాల్లోనూ కార్చిచ్చులు విధ్వంసమే సృష్టించాయి. వీటి దెబ్బకు జూన్ నెలంతా అమెరికాలో వాయు నాణ్యత ఎన్నడూ లేనంతగా తగ్గిపోయింది. హవాయి దీవుల్లో కార్చిచ్చుకు ఏకంగా 100 మంది బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Leif Erikson Lunar Prize: ఇస్రోకు ఐస్లాండ్ ‘అన్వేషణ’ అవార్డ్
న్యూఢిల్లీ: చంద్రుడిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు ఐస్‌ల్యాండ్‌కు చెందిన సంస్థ నుంచి అవార్డ్ దక్కింది. చంద్రయాన్–3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకుగాను 2023 ఏడాదికి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్‌ను ఇస్తున్నట్లు హుసావిక్ నగరంలోని ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం తెలిపింది. క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 400 సంవత్సరాల ముందే అమెరికా గడ్డపై కాలుమోపిన తొలి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్కు గుర్తుగా ఈ అవార్డును ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం ఇస్తోంది. నూతన అన్వేషణలతో చేస్తున్న కృషికిగాను ఈ అవార్డ్‌ను ప్రదానంచేస్తోంది. ఇస్రో తరఫున భారత రాయబారి బి.శ్యామ్ ఈ అవార్డ్‌ను అందుకున్నారు. అవార్డ్ ఇచి్చనందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధన్యవాదాలు తెలిపారు. -
చందమామపై మన అడుగే తరువాయి!
అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తిన చంద్ర యాన్–3 విజయం తర్వాత, ఏ మాత్రం ఆలస్యం చేయ కుండా 2040 నాటికి భార తీయ వ్యోమగాములు చంద్రు నిపైకి వెళ్ళే దిశగా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. భవి ష్యత్తుపై దృష్టితో, ‘గగన్ యాన్’ ప్రోగ్రామ్‌లో భాగంగా, ఇద్దరి నుంచి ముగ్గురు వరకూ భారతీయ వ్యోమగాములను ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈఓ) లోకి పంపించి, మూడు రోజుల వరకు అక్కడ ఉంచి, మన దేశంలోని ఒక నీటి వనరుపై వారిని ల్యాండ్ చేసే (దించే) కార్యక్రమంలో మరొక అడుగు ముందుకు వేయాలని ప్రయత్నిస్తోంది ఇస్రో. ఈ మిషన్ కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురు టెస్ట్ పైలట్లను ఆస్ట్రోనాట్– డెసిగ్నేట్లుగా ఎంపిక చేశాం. ప్రస్తుతం, వారు బెంగ ళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ (ఏటీఎఫ్)లో మిషన్–నిర్దిష్ట శిక్షణ పొందుతున్నారు. హ్యూమన్– రేటెడ్ (మానవులను సురక్షితంగా రవాణా చేయగల సామర్థ్యం) లాంచ్ వెహికల్ (హెచ్ఎల్వీఎమ్3), క్రూ మాడ్యూల్ (సీఎమ్), సర్వీస్ మాడ్యూల్ (ఎస్ఎమ్) లతో కూడిన ఆర్బిటల్ మాడ్యూల్; లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లతో సహా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో ప్రారంభ దశలో ఉంటుంది. ఇంటి గ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ ఫ్లైట్లతో పాటు రెండు ఒకేలా ఉండే అన్– క్రూడ్ మిషన్లు (జీ1, జీ2) మనుషులతో కూడిన మిషన్‌కు ముందు ఉంటాయి. సీఎమ్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. సీఎమ్ అనేది సిబ్బంది కోసం అంతరిక్షంలో భూమి–వంటి వాతా వరణంతో నివాసయోగ్యంగా ఉండే స్థలం. వ్యోమగా ములు సురక్షితంగా తిరిగి రావడం కోసం ఉద్దేశించింది ఇది. భద్రతా చర్యలలో అత్యవసర పరిస్థితుల కోసం క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) కూడా ఉంటుంది.టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) యొక్క మొదటి డెవలప్మెంట్ ఫ్లైట్ 2023 అక్టోబరు 21న ప్రారంభించబడింది. ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క ఫ్లైట్ అబార్ట్‌ను విజయవంతంగా పరీక్షించగలిగింది. ఆ తర్వాత క్రూ మాడ్యూల్ వేరుపడటం, బంగాళాఖా తంలో ఇండియన్ నావికదళం దానిని సురక్షితంగా రికవర్ చేయడం కూడా జరిగాయి. మానవ రహిత మిషన్లూ, అంతిమంగా మానవ సహిత అంతరిక్ష మిషన్ 2025లో ప్రారంభించబడుతుందనీ అంచనా వేయడానికి ఈ టెస్ట్ ఫ్లైట్ విజయం కీలకమైనది. ఇస్రో మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్, భారతదేశపు తొలి సౌర అన్వేషణ మిషన్ అయిన ఆదిత్య ఎల్1. ఇది ‘లాగ్రేంజ్ పాయింట్ 1’ యొక్క ప్రత్యేకమైన వాన్టేజ్ పాయింట్ నుండి సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. చంద్రునిపైనా సూర్యునిపైనా చేసే పరిశోధ నల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. వివిధ ఇస్రో కేంద్రాలు, విద్యా సంస్థల సహకారంతో దేశీయంగా అభివృద్ధి చేసిన ఏడు సైంటిఫిక్ పేలోడ్లతో నిండిన ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక çసూర్యుని రహస్యాలను ఛేదించడానికి ప్రయోగిస్తున్నాం. 2023 సెప్టెంబర్ 2న ప్రారంభించిన ఆదిత్య ఎల్1 ఐదేళ్ల పాటు పని చేస్తుందని భావిస్తున్నాం. ఇది భూమి నుండి సుమారు 1.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉన్న సూర్యుడు–భూమి లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1) వైపు ఉద్దేశించిన మార్గంలో ఉంది. ఇక్కడే అది జనవరి 2024లో హాలో కక్ష్యలోకి చేర్చబడుతుంది. చంద్రయాన్–3 మిషన్ ఒక చరిత్రాత్మక విజయం. ఆ విజయం సిద్ధించిన ఆగస్టు 23ను ‘భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించడం ముదావహం. 14 రోజుల (ఎర్త్ డేస్) మిషన్ జీవిత కాలంలో, ఇది చంద్రుని మట్టిలో అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సల్ఫర్, మేంగనీస్, సిలికాన్, ఆక్సి జన్లను కనుగొన్న విలువైన డేటాను అందించింది. మనం తలపెట్టిన చిన్న శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ), పునర్వినియోగ ప్రయోగ వాహనం (ఆర్ఎల్వీ) ప్రోగ్రామ్, ఎక్స్–రే ఆస్ట్రానమీ మిషన్ ‘ఎక్స్‌పోశాట్’, స్పేస్ డాకింగ్ ప్రయోగం, ఎల్‌ఓఎక్స్ –మీథేన్ ఇంజన్ వంటి పరివర్తనాత్మక కార్యక్రమాలు కలిసి, భారత్ అంతరిక్ష అన్వేషణలో కొత్త శకాన్ని నిర్వచించాయి. మూడు దశల లాంచ్ వెహికల్ అయిన ఎస్ఎస్ ఎల్వీ 500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 500 కి.మీ. ప్లానార్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టగలదు. బహుళ ఉప గ్రహాలను తీసుకెళ్లగలదు. ఉపగ్రహాలను ఎప్పుడు ఎక్కడ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టాలనుకుంటే అప్పుడు ప్రవేశపెట్టగల (లాంచ్–ఆన్–డిమాండ్ ) సామర్థ్యం దీనికి ఉంది. దీన్ని ప్రయోగించడానికి కనీçస మౌలిక సదుపాయాలు ఉంటే చాలు. అలాగే ప్రయోగించ డానికి ఖర్చు కూడా తక్కువే! ఎక్స్‌పోశాట్ అనేది భారత్ మొట్టమొదటి నిర్దిష్ట సైన్స్ మిషన్. ఇది శాస్త్రీయ పేలోడ్లను ఉపయోగించి తీవ్ర పరిస్థితుల్లోనూ ప్రకాశవంతమైన ఖగోళ ఎక్స్–రే మూలాలను పరిశోధిస్తుంది. అటువంటి దీనిని 2023–2024లో ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధ మయింది. స్పాడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్)ను 2024 మూడవ త్రైమాసికంలో ప్రారంభించాలనేది ప్రణాళిక. ఇది మానవ అంతరిక్షయానంలో అనువర్తనాల పరిధితో డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినజంట అంతరిక్ష నౌక. ఈ మిషన్‌లో రెండు చిన్న– ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటి ఛేజర్గా, మరొకటి టార్గెట్‌గా, సహ–ప్రయాణికులుగా కలిపి ప్రయోగించబడతాయి. ‘భవిష్యత్తులో ‘చంద్రయాన్’ మిషన్ లలో చంద్రుని నుంచి శాంపిల్స్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం చేయడంలో డాకింగ్ ప్రయోగ విజయం గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. రానున్న కాలంలో సాంకేతికత పరంగా అత్యంత ప్రాముఖ్యం కలిగిన ‘ఎల్‌ఓఎక్స్ మీథేన్’ (లిక్విడ్ ఆక్సి జన్ ఆక్సిడైజర్, మీథేన్ ఇంధనం) ఇంజిన్ల అభివృద్ధి కూడా ముఖ్యమైనదే. ఇది అంగారక గ్రహం వంటి ఇతర గ్రహాలపై పర్యావరణాల ఉనికి కోసం మాన వుడు చేసే అన్వేషణను సులభతరం చేస్తుంది. అంత రిక్షంలో నీరు, కార్బన్ డై ఆక్సైడ్ లను సంశ్లేషణ చేయడం ద్వారా తయారు చేయగలిగిన మీథేన్ అంత రిక్షంలో సుదూరం ప్రయాణించే నౌకలకు ఇంధనంగా ఉపయోగిస్తారని భావిస్తున్నారు. అందుకే ఎల్‌ఓఎక్స్ మిథేన్ ఇంజిన్ల అభివృద్ధి చాలా ప్రాముఖ్యం కలిగిందని చెప్పాలి. 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష స్టేషన్’ ప్రారంభించడం, వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్‌తో కూడిన అంతర్ గ్రహ అన్వేషణను ప్రారంభించడం వంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను ప్రధాన మంత్రి నిర్దేశించుకున్నారు. ఇవన్నీ ప్రపంచ అంతరిక్ష పరిశోధనా వేదికపై భారత్ ఉనికిని మరింత పటిష్టం చేస్తాయి. ‘భారత్ అంతరిక్ష కార్యక్రమం రాబోయే సంవత్సరాల్లో కొత్త శిఖరాలను చేరుకోవ డానికి సిద్ధంగా ఉంది. ప్రయోగించబడిన ప్రతి మిషన్, ప్రతి ఆవిష్కరణతో ఇస్రో ప్రపంచ వేదికపై తన స్థానాన్ని సగర్వంగా పునరుద్ఘాటిస్తుంది. (‘మలయాళ మనోరమ’కు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అందించిన కథనం ఆధారంగా) -
కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత భారతదేశంలో ఒక వ్యక్తి బిలియనీర్ జాబితాలోకి చేరాడు. ఇంతకీ ఈయన ఎవరు? ఇతని వల్ల చంద్రయాన్-3కు ఉపయోగం ఏమిటి? నెట్ వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం. కేన్స్ టెక్నాలజీ ఇండియా ఫౌండర్ 'రమేష్ కున్హికన్నన్' (Ramesh Kunhikannan) చంద్రయాన్-3 మిషన్‌లో కీలక పాత్ర పోషించారు. రోవర్, ల్యాండర్ రెండింటికీ అవసరమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లను అందించి చంద్ర మిషన్ విజయంలో భాగస్వామి అయ్యారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి కేన్స్ షేర్లు విపరీతంగా పెరిగాయి. కేన్స్ షేర్లు భారీగా పెరగటం వల్ల కంపెనీలో 64 శాతం వాటా కలిగిన కున్హికన్నన్ ఆస్తులు తారాస్థాయికి చేరి బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచాడు. ఈయన మొత్తం సంపద 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. వంద కోట్లు కంటే ఎక్కువ. కేన్స్ టెక్నాలజీ ఇండియా తన 137 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంలో సగానికి పైగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీలను తయారు చేయడం ద్వారా పొందుతుందని ఫోర్బ్స్ నివేదించింది. ఈ సంస్థ ఆటోమోటివ్, ఏరోస్పేస్, మెడికల్ అండ్ డిఫెన్స్ పరిశ్రమలకు ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు సరఫరా చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా వల్ల లాభం మైసూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన కున్హికన్నన్ 1988లో ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారుగా కేన్స్‌ను స్థాపించారు. అతని భార్య సవిత రమేష్ 1996లో కంపెనీలో చేరి ప్రస్తుతం సంస్థ చైర్‌పర్సన్‌గా ఉంది. స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం కేన్స్ ఇండియాకు చాలా ఉపయోగపడింది. ఇదీ చదవండి: భవిష్యత్తు అంతా ఇందులోనే.. లింక్డ్ఇన్ సంచలన రిపోర్ట్! భారతీయ పరిశ్రమలలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ వినియోగం కారణంగా, కంపెనీ వార్షిక ఆదాయం 2020 ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2024 మార్చి నాటికి కంపెనీ ఆదాయం సుమారు 208 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
World Cup 2023: లక్కీ పోజులు సరదా సెంటిమెంట్లు
అమితాబ్ ఇరకాటంలో పడ్డారు. ‘నేను చూడకపోతే ఇండియా గెలుస్తుంది’ అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనను మొహమాట పెడుతోంది. ‘ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్స్ చూడకండి సార్’ అని అందరూ ఆయనతో మొరపెట్టుకుంటున్నారు. న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో మనం గెలవాలని ఒక అభిమాని 240 అగరుబత్తులు వెలిగించాడు. క్రికెట్ అంటే ఒక పిచ్చి. వెర్రి. అభిమానులకే కాదు ఆటగాళ్లకు బోలెడన్ని సెంటిమెంట్లు. రేపు ఫైనల్స్. ప్రతి ఫ్యామిలీ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు, సరదా విశ్వాసాల స్పెల్ చూద్దామా.. ‘జులాయి’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ కోసం పబ్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌కు అక్కడ ఒంగి నీలుక్కుపోయి నిలబడి ఉన్న సప్తగిరి కనపడతాడు. ‘వీడేంటి ఇలా?’ అని అడుగుతాడు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్‌ని. ‘వీడా... ఇందాక వీడు ఇలా నిలుచున్నప్పుడు ధోని ఫోర్ కొట్టాడు. సెంటిమెంట్‌గా బాగుంటుందని అలా ఉంచేశాం’ అంటాడు ప్రదీప్. మనవాళ్ల సెంటిమెంట్స్ ఇలా ఉంటాయి. 1970ల నుంచి క్రికెట్‌ను విపరీతంగా ఫాలో అవుతూ స్టేడియంలకు వెళ్లి మరీ మ్యాచ్‌లు చూసిన ఒక తెలుగు అభిమాని తన సెంటిమెంట్లు ఇలా చెప్పుకొచ్చారు– ‘మా నాన్న క్రికెట్ చూసేటప్పుడు మా అమ్మను పక్కన కూచోబెట్టుకొని ఇవాళ నీకు వంట లేదు అనేవారు. ఆయనకు అదొక సెంటిమెంట్ అమ్మ పక్కనుంటే గెలుస్తుందని. నేను ఆ తర్వాత మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు మధ్యలో మా అమ్మ వచ్చి పలకరిస్తే మనం ఓడిపోతామని సెంటిమెంట్ పడింది. అందుకని మ్యాచ్ ఉన్న రోజు మా అమ్మకు ఉదయాన్నే చెప్పేసేవాణ్ణి ఇవాళ పలకరించవద్దని. పెద్దవాళ్లు కదా. ఊరికే ఉండరు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చి పలకరిస్తుంది. ఇంకేముంది... మ్యాచ్ హరీ’... ఎనభైల్లో ఊరూ వాడా క్రికెట్ ఫీవర్ మొదలయ్యింది. హైస్కూళ్లకు వ్యాపించింది. 1990లు దాటాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇళ్ల కప్పుల మీదకు యాంటెన్నాలు లైవ్ టెలికాస్ట్‌లు మొదలయ్యాయి. ఒక నెల్లూరు వాసి ఇలా చెప్పాడు– ‘మా ఫ్రెండ్స్‌లో నలుగురైదుగురి ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాని ఎందుకనో విజయ్‌గారి ఇంట్లో చూస్తేనే ఇండియా గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో ఇండియా మేచ్ ఉన్న ప్రతిసారీ వాడింట్లో చేరి కిష్కిందకాండ చేసేవాళ్లం. ఇదేం గోలరా... ఇంకెక్కడా టీవీలు లేవా అని వాళ్లమ్మ మొత్తుకునేది. అదో సరదా’... అయితే ప్రతి గ్రూప్‌లో మచ్చనాలుకోడు ఒకడు ఉంటాడు. వాడు ‘ఫలానా వాళ్లు పోతారు’ అంటే గ్యారంటీగా పోతారు. వాడు తక్కిన రోజుల్లో ఎంత ప్రేమాస్పదమైన ఫ్రెండ్ అయినా క్రికెట్ వచ్చే రోజుల్లో అందరికీ కంటగింపు అవుతాడు. ‘మా ఫ్రెండ్ శేషుగాడు ఇలాగే ఉండేవాడు. మేమందరం ఉదయాన్నే లైవ్ చూడ్డానికి ఎగ్జయిట్ అవుతుంటే ఇండియా ఢమాల్ అనేవాడు. ఇండియా అలాగే పోయేది. అందుకని మ్యాచ్‌లు జరిగే కాలంలో వాడు కనిపిస్తే రాళ్లెత్తి కొట్టి మరీ తరిమేసేవాళ్లం’ అంటాడొక అభిమాని నవ్వుతూ. అభిమానులు మందుబాబులైతే వాళ్ల సెంటిమెంట్లకు కూడా లెక్కే లేదు. ‘మనకు అలవాటైన బార్లో మిగిలిన రోజుల్లో ఎక్కడైనా సరే కూచుంటాం. కాని ఇండియా మ్యాచ్ ఉన్న రోజు మాత్రం నాకొక పర్టిక్యులర్ సీట్లో కూచుని చూస్తే గెలుస్తామని సెంటిమెంట్. అక్కడే కూచునేవాణ్ణి. బార్వాళ్లు కూడా నా సీట్ నాకే అట్టి పెట్టేవాళ్లు. అంతేనా? గ్లాస్లో మందైపోతే వికెట్ పడిపోతుందని ఒక సెంటిమెంట్. అందుకే మందైపోయేలోపు ఒక పెగ్ రెడీగా పెట్టుకునేవాణ్ణి’ అని తెలియచేశాడు ఆ క్రికెట్ నిషా అభిమాని. అదేముంది... ఆటగాళ్లకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. టెస్ట్ మేచ్‌ల రోజుల్లో బాగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆ ప్లేయర్లు ఆ డ్రస్సుల్ని వాష్ చేయకుండా మేచ్ అయ్యేంతవరకూ అవే డ్రస్సుల్ని వేసుకునేవారు. ‘నిన్న రాత్రి ఫలానా సినిమా చూసి నిద్రపోయి ఉదయం బ్రహ్మాండంగా ఆడాను. అందుకే మళ్లీ అదే సినిమా చూసి ఆడతాను అనుకునే వరకు క్రికెటర్ల సెంటిమెంట్లు ఉంటాయి’ అని ఒక క్రికెటర్ తెలిపాడు. ‘పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు గుచ్చి రెండు రోజులుగా ఉంచిన అరటి పండును బౌలర్ శ్రీశాంత్ వికెట్లు పడతాయన్న నమ్మకంతో తినడం చూశానని’ ఆ క్రికెటర్ చెప్పాడు. సునీల్ గవాస్కర్‌కు గురువారం గండం ఉండేది. 1980లో రెండు వరస గురువారాల్లో ఇద్దరు అనామక బౌలర్లకు వికెట్స్ ఇచ్చి సున్నాకు ఔట్ అయ్యాడతడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌కు చేతిలో ఉన్న బ్యాట్‌ను గిర్రున తిప్పితే బాగా కొడతాననే నమ్మకం ఉండేది. అతని మ్యాచులు చూస్తే బ్యాట్ హ్యాండిల్‌ని తిప్పడం కనిపిస్తుంది. మొహిందర్ అమర్నాథ్ ఎర్ర కర్చీఫ్‌ను జేబులో పెట్టుకుని ఉండేవాడు. సచిన్‌కు ముందు ఎడమ కాలు ప్యాడ్ కట్టుకుంటే కలిసొస్తుందని నమ్మకం. జహీర్ ఖాన్ పసుపు రంగు చేతిగుడ్డను జేబులో పెట్టుకునేవాడు. బౌలర్ అశ్విన్ అయితే ఒకే బ్యాగ్‌ను అన్ని మ్యాచ్‌లకు తెచ్చేవాడు. అది అతని లక్కీ బ్యాగ్. ఇక అజారుద్దీన్ తావీజ్ లేకుండా మ్యాచ్ ఆడడు. 1987 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మీద కపిల్ దేవ్ బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఇండియన్ ఆటగాళ్లు ఆశలు వదలుకుని డ్రస్సింగ్ రూమ్ బయటకు వచ్చి నిలబడ్డారు. కపిల్ దేవ్ బాదడం మొదలు పెట్టాడు. అంతే టీమ్ మేనేజర్ మాన్ సింగ్ ఎక్కడి వాళ్లను అక్కడే నిలబడమన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ను పాస్‌కు వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా చాలా సెంటిమెంట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్‌కు తాను మేచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుంది అనే సెంటిమెంట్ ఉంది. మరోవైపు ఫైనల్స్‌కు ఆహ్వానం ఉంది. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. మరోవైపు అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు చెప్పుకుంటున్నారు. 2011 నుంచి వరల్డ్ కప్ పోటీల్లో హోస్ట్ కంట్రీలే గెలిచాయి కాబట్టి ఈసారి హోస్ట్ కంట్రీ ఇండియా గెలుస్తుందని ఒక సెంటిమెంట్. మరోవైపు 2019 వరల్డ్ కప్ సమయంలో చంద్రయాన్–2 ఫెయిల్ అయ్యింది. ఇండియా కప్ కోల్పోయింది. 2023లో చంద్రయాన్ –3 సక్సెస్ అయ్యింది. అంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామని ఒక సెంటిమెంట్. కాని ఆట ఎప్పుడూ టీమ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది... సెంటిమెంట్స్ మీద కాదు. కాకుంటే కొంచెం అదృష్టం కలిసి రావాలంతే. ఆ అదృష్టం కోసం అభిమానుల ఆకాంక్షే సెంటిమెంట్ల రూపంలో బయటకు వస్తుంది. ఈసారి భారత్ గెలవాలని... అందుకు అందరి సెంటిమెంట్లు పని చేయాలని కోరుకుందాం. -
Chandrayaan-3: ఆ శకలంతో ఎటువంటి ప్రమాదం లేదు: ఇస్రో
బెంగళూరు: చంద్రయాన్–3 అంతరిక్ష నౌకను జూలై 14న నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడంలో కీలకమైన క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్‌లోని ఒక భాగం భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని ఇస్రో తెలిపింది. ఎల్వీఎం–3 ఎం4కు చెందిన ఈ శకలం బుధవారం మధ్యాహ్నం 2.42 సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు గుర్తించామని గురువారం ఇస్రో వివరించింది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ఇది ఉత్తర పసిఫిక్ సముద్రంలో పడే అవకాశాలున్నాయని తెలిపింది. భారత గగనతలంలోకి ప్రవేశించే అవకాశాల్లేవని ఒక ప్రకటనలో ఇస్రో స్పష్టం చేసింది. -
శాస్త్ర విజ్ఞానంలోనూ రాజకీయాలా?
దేశంలో గడచిన దశాబ్దాల్లో అంతరిక్షం, అణుశక్తి, వాతావరణం వంటి అంశాలను రాజకీయాలకు అతీతంగా ఉంచారు. రాజకీయ నేతలు కూడా ఈ విషయంలో ఆరోగ్యకరమైన, స్పష్టమైన విభజనను పాటించారు. అయితే రాజకీయ మద్దతుకూ, సైన్స్‌ను రాజకీయం చేయడానికీ మధ్య చాలా తేడా ఉంది. శాస్త్ర పరిశోధనలకు కావాల్సినన్ని నిధులు సమకూర్చేందుకు రాజకీయ వర్గాల మద్దతు అవసరం. దేశ విస్తృత ప్రయోజనాలు, లక్ష్యాలు, ఆర్థిక వృద్ధికీ, పరిశోధనలకూ మధ్య పొంతన కుదరాలన్నా ఇది అవసరమే. కానీ చంద్రయాన్ –3 విజయం 2014 తరువాతి ఘనతగా కీర్తించడం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దశాబ్దాలుగా విజయవంతంగా అనుసరిస్తున్న ప్రాజెక్టు ప్లానింగ్ పద్ధతులను అవమానించడమే! దేశంలోని చాలా శాస్త్రీయ సంస్థలు, పరిశో ధన సంస్థలు ఇటీవలి కాలంలో ‘సెల్ఫీ పాయింట్’లు ఏర్పాటు చేశాయి. ఇక్కడ సందర్శకులు సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ రీళ్లు, ఫేస్బుక్ స్టోరీల కాలంలో ప్రభుత్వ సంస్థలు ఇలాంటి గిమ్మిక్కులకు తెగబడటం ఎక్కువైంది. అయితే పరిశోధన సంస్థల విషయంలో ఉద్దేశం వేరు. సెల్ఫీ కేంద్రాలను ఒక నిర్దిష్ట శైలిలో నిర్మించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రతిదాంట్లో ప్రధాని ఛాయాచిత్రం ఒకపక్క, ఆ సంస్థ విజయాలు ఇంకోపక్క ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ప్రాథమిక జ్ఞానం ఉన్నవారికి కూడా దీని వెనుక మతలబు ఏమిటో అర్థం అవుతుంది. ఆయా సంస్థల విజయాలు ఒక వ్యక్తి దయాదాక్షిణ్యాలని పరోక్షంగా చెప్పే ప్రయత్నం ఇది. శాస్త్రీయ పరి శోధన సంస్థలు కూడా సులభంగా ఇందుకు అంగీకరించడం ఆశ్చర్య కరమైన విషయం కాదు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి చిన్న పోస్టర్ల స్థానంలో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టేశారు. భారతీయ సైన్స్‌కు ప్రధాని దైవదూత అన్న మాదిరిగా సందేశాలివ్వడం కేవలం సెల్ఫీ పాయింట్లకే పరిమితం కాలేదు. వెబ్సైట్లు, సోషల్ మీడియా హాండిల్స్, సైంటిఫిక్ ల్యాబ్స్‌తోపాటు పాఠ్య పుస్తకాల్లోకీ చేరుతోంది. ‘ఎన్సీఈఆర్టీ’ గత నెలలో విడుదల చేసిన ‘చంద్రయాన్ ఉత్సవ’ పుస్తక శ్రేణిలోనూ ఇది కనిపించింది. పది పుస్తకాలతో కూడిన ఇవి వేర్వేరు తరగతులకు ఉద్దేశించారు. అన్నింటి లోనూ ప్రధాన ఇతివృత్తం చంద్రయాన్ –3 విజయానికి ప్రధాన సూత్ర ధారి ప్రధాని అని చూపడమే. అది కూడా 2019 నాటి చంద్రయాన్ –2 వైఫల్యం తరువాత! సెకండరీ స్టేజ్ (కోడ్ 1.4ఎస్)లో ‘గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాల ఫలితంగానే చంద్రయాన్ –3 విజయం సాధించింది’ అని స్పష్టంగా చెప్పారు. చంద్రయాన్ –2 పాక్షిక విజయంపై విశదీకరిస్తూ... ‘వనరులు, శ్రమ, డబ్బు నష్టపోయినా ప్రధాని నిరుత్సాహ పడలేదు. బదులుగా మరింత ఆత్మవిశ్వాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రజలను చైతన్యవంతులను చేశారు. సరికొత్త దార్శనికత ప్రదర్శించారు’ అని రాశారు.ఇందులో ప్రధాని ప్రస్తావన తొమ్మిది సార్లుంది. కానీ 2008లో చంద్ర యాన్ –1 ద్వారా జాబిల్లిపై నీటి ఉనికిని మొదటిసారిగా గుర్తించిన కీలకమైన విషయాన్ని మాత్రం విస్మరించారు. ఆత్మ విశ్వాసానికి దెబ్బ... చంద్రయాన్–3 విజయం 2014 తరువాతి ఘనతగా కీర్తించడం భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ దశాబ్దాలుగా విజయవంతంగా అనుసరిస్తున్న ప్రాజెక్టు ప్లానింగ్ పద్ధతులను అవమానించడమే. ఓ ప్రాజెక్టు విజయానికి రాజకీయ నేతలను కర్తలుగా చేస్తూ పొగడటం సైన్స్‌ను రాజకీయం చేయడమే అవుతుంది. రాజకీయ మద్దతుకూ, సైన్స్‌ను రాజకీయం చేయడానికీ మధ్య చాలా తేడా ఉంది. శాస్త్ర పరిశోధనలకు కావాల్సినన్ని నిధులు సమకూర్చుకునేందుకు రాజ కీయ వర్గాల మద్దతు అవసరం. దేశ విస్తృత ప్రయోజనాలు, లక్ష్యాలు, ఆర్థిక వృద్ధికీ, పరిశోధనలకూ మధ్య పొంతన కుదరాలన్నా ఇది అవసరమే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వయంగా దేశ శాస్త్ర పరి శోధన రంగాల తీరుతెన్నులను పర్యవేక్షించారు. సైన్స్‌లో పెట్టుబడుల ఆవశ్యకత గురించి అటు ప్రజలకు, ఇటు అధికారులకు, పార్లమెంటేరియన్లకు అర్థమయ్యేందుకు కృషి చేశారు. ఇవన్నీ ఆయన వెసులు బాటు కల్పించే వాడిగా చేశారు కానీ, నేరుగా పరిశోధన కౌన్సిళ్ల వ్యవహారాల్లో తలదూర్చలేదు. గడచిన కొన్ని దశాబ్దాల్లోనూ అంతరిక్షం, అణుశక్తి, వాతావరణం వంటి అంశాలను రాజకీయాలకు అతీతంగా ఉంచారు. రాజకీయ నేతలు కూడా ఆరోగ్యకరమైన, స్పష్టమైన విభజనను పాటించారు. శ్రీహరికోట నుంచి జరిగిన ముఖ్యమైన ప్రయోగాల్లో అప్పట్లో ప్రధాని రాజీవ్ గాంధీ రాజకీయంగా బద్ధ శత్రువైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావును వేదిక పైకి ఆహ్వానించిన విషయం గుర్తుచేసు కోవాలి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా చంద్రయాన్ –1 ఆలోచన రూపుదిద్దుకుంది. కానీ పలు పార్లమెంటరీ కమిటీల్లో దీనిపై చర్చలు జరిగిన తరువాత గానీ ఆమోదించలేదు. తన పంద్రాగస్టు ప్రసంగంలో వాజ్‌పేయి చంద్రయాన్ –1 గురించి తొలిసారి ప్రకటించారు. ఇస్రో ఈ ప్రాజెక్టుకు సోమయాన్ అని పేరు పెడితే వాజ్‌పేయి దాన్ని చంద్రయాన్ అని మార్చారు. అయితే దీన్ని ఎప్పుడూ ఆయన తన వ్యక్తిగత విజయంగా చెప్పుకోలేదు. భారత్– అమెరికా అణు ఒప్పందం తుది దశ చర్చల వివరాలు ప్రతిపక్షాలకూ అందించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన సీనియర్ సలహాదారును నియమించారు. అలాగే ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులను వాతావరణ మార్పులపై జరిగే సదస్సులకు హాజరయ్యే ప్రతినిధి బృందాల్లో భాగస్వాములను చేశారు. జోక్యంతో ప్రమాదం... శాస్త్ర పరిశోధనల విషయంలో రాజకీయాలు ప్రమాదకరం. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ పలుమార్లు తన బాస్ అయిన ప్రధాని మోదీ నేతృత్వం కారణంగానే 2014 తరువాత శాస్త్ర రంగంలో అనేక విజయాలు నమోదయ్యాయని పదేపదే చెప్పుకొన్నారు. ఇదే ఇప్పుడు ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోనూ వ్యక్తమైంది. ఇలాంటి ప్రకటనలు ఏళ్లుగా పని చేస్తున్న శాస్త్రవేత్తల నిబద్ధతను తక్కువ చేసి చూపుతాయి. చంద్రయాన్ –1 ఆలోచనకు బీజం 1999లో పడితే వాస్తవరూపం దాల్చింది 2008లో. దీని తరువాత చేపట్టిన ప్రయోగాలు... ఉదాహరణకు చంద్రయాన్ –3, ఆదిత్య ఎల్–1 కూడా 2014కు ముందే మొదలైనవి. వీటి విజయాలకు 2014 తరువాతి రాజకీయ నేతృత్వం కారణమని చెప్పుకోవడం అత్యంత కచ్చితత్వంతో ఎంతోకాలంగా విజయవంతంగా ఇస్రో అమలు చేస్తున్న ప్రాజెక్ట్ ప్లానింగ్, మేనేజ్మెంట్ వ్యవస్థలను అవమానించడమే. 2014 కంటే ముందు ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్యను, తరువాతి సంఖ్యను పోల్చడం కూడా సరికాదు. 2014 తరువాత ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యధికం మైక్రో శాటిలైట్ల మార్కెట్ పెరగడం పుణ్యంగా వచ్చినవి అని గుర్తుంచు కోవాలి. ఇంకో విషయం... సైన్స్ విషయాల్లో రాజకీయ జోక్యం పరిశోధన సంస్థల స్వతంత్రత తగ్గిపోయేందుకూ కారణమవుతుంది. ఇది కేంద్రీ కృత నిర్ణయాల అమలును ప్రోత్సహిస్తుంది. పరిశోధనల దిశను మారుస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఇప్పుడు కేటాయిస్తున్న నిధులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇలాంటి చర్యల వల్ల రాజకీయ సిద్ధాంతాలకు నప్పని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను తొక్కిపెట్టడం వంటివి జరగొచ్చు. జోషీమఠ్‌కు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఇస్రో తన వెబ్సైట్ నుంచి తొలగించాల్సి రావడం గమనించాలి. సైన్స్ అవార్డులను ప్రస్తుత గవర్నమెంటు రద్దు చేసింది. గుట్టుచప్పుడు కాకుండా అనేక పరిశోధన కేంద్రాలను కూడా మూసేసింది. ఫ్యామిలీ హెల్త్ సర్వేల ఇన్ ఛార్జ్ శాస్త్రవేత్తను ఇటీవలే సస్పెండ్ చేసి, రాజీనామా చేసేలా చేశారు. జన్యుమార్పిడి పంటల విషయంలో గతంలో స్వతంత్రంగా వ్యవహరించిన ‘ద ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ’ కూడా ఇప్పుడు సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు సంతోషంగా అంగీకరిస్తోంది. ఎగిరే యంత్రాల విషయంలో భారతీ యుల జ్ఞానానికి డాక్యుమెంటరీ రుజువుగా వైమానిక శాస్త్రాన్ని ఎన్సీఈఆర్టీ ప్రస్తావిస్తే శాస్త్రవేత్తలు నోరెత్తకుండా ఉన్నారు. ఇవన్నీ సైన్స్ పురోగతికి ఏమాత్రం మేలు చేసేవి కావు. దినేశ్ శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రూ.225 కోట్ల నిధులు సమీకరించిన స్కైరూట్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంకుర సంస్థ, స్కైరూట్ ఏరోస్పేస్ ‘ప్రీ సిరీస్-సీ ఫైనాన్సింగ్ రౌండ్’లో భాగంగా రూ.225 కోట్లు సమీకరించింది. అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశీయ అంకుర సంస్థ నిధులు సేకరించడం ఇది రెండోసారి. గతంలో 2022లో రూ.400 కోట్లు నిధులు సమీకరించింది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్ నేతృత్వంలోని ప్రీ-సిరీస్ సి ఫండింగ్ ద్వారా రూ.225 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది. అయితే ఫండ్‌రైజింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రాకెట్ లాంచింగ్ సమయంలో ప్రయోగ ఫ్రీక్వెన్సీ, సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. దాంతోపాటు నైపుణ్యాలు కలిగిన ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించడానికి వెచ్చిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో సంస్థ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సమీకరించిన నిధులతోపాటు తాజా ప్రకటనతో కలిపి కంపెనీ మొత్తం రూ.790కోట్లను సేకరించింది. రానున్న రెండేళ్లలో సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ల అవసరాల కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన అన్నారు. చంద్రయాన్ 3 మూన్ ల్యాండింగ్ మిషన్ విజయవంతం కావడంతో భారతదేశ అంతరిక్ష రంగంపై ప్రపంచం ఆసక్తిగా ఉందన్నారు. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తుందని తెలిపారు. టెమాసెక్ వంటి ప్రసిద్ధి చెందిన పెట్టుబడి సంస్థ తమపై విశ్వాసాన్ని ఉంచి నిధులు కూడగట్టడంపై స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ భరత్ డాకా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు. గతేడాది స్కైరూట్ సంస్థ విక్రమ్ ఎస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో విక్రమ్ 1ను ప్రయోగించనుంది. -
‘దుమ్ము’ రేపిన విక్రమ్!
బెంగళూరు: చంద్రయాన్–3లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన సందర్భంగా భారీ పరిమాణంలో దుమ్మును వెదజల్లింది. ఫలితంగా అక్కడ చిన్న గుంతలాంటి ప్రదేశం ఏర్పడినట్టు ఇస్రో శుక్రవారం వెల్లడించింది. ‘ఉపరితలంలోని ఏకంగా 2.09 టన్నులకు పైగా దుమ్ము, ధూళి, ఖనిజ శకలాల వంటివి 108 మీటర్ల పరిధిలో చెల్లాచెదురయ్యాయి. దాంతో విక్రమ్ చుట్టూ భారీ వలయాకార పరిధి (గుంత వంటిది) ఏర్పడింది’’ అని వివరించింది. ల్యాండింగ్‌కు ముందు, జరిగిన వెంటనే తీసిన ఫొటోలను ఉపగ్రహ ఆర్బిటార్‌లోని హై రిజల్యూషన్ కెమెరా సాయంతో హైదరాబాద్ జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం సైంటిస్టులు ఈ మేరకు వెల్లడించారు. -
డాక్టర్ అవ్వాలనుకున్న ఇస్రో ఛైర్మన్..!
సంక్లిష్టమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని సుసాధ్యం చేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఛైర్మన్ సోమనాథ్ తాను చిన్నతనంలో డాక్టర్ కావాలనుకున్నానని చెప్పారు. ఇటీవల చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ యూనివర్శిటీలో జరిగిన వైద్యుల సదస్సులో ఆయన్ ప్రసంగించారు. ఆయనకు బయాలజీ అంటే ఇష్టమనీ, తాను చిన్ననాటి నుంచి జీవశాస్త్రంలో టాపర్‌గా ఉండేవాడినని గుర్తుచేసుకున్నారు. డాక్టర్ కావాలనే ఆకాంక్ష బలంగా ఉండేదన్నారు. అయితే వైద్య వృత్తి చాలా కఠినమైందని, ఇంజినీరింగ్ లేదా గణితాన్ని ఎంచుకోవాలని ఆయన తండ్రి చెప్పినట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఎలాంటి స్పెషలైజేషన్ చేయలేదని సోమనాథ్ వెల్లడించారు. తాను మెకానికల్ ఇంజినీర్ కోర్సు చేస్తున్నపుడు ప్రొపల్షన్‌పై ఆసక్తి కలిగిందన్నారు. వైద్య నిపుణులు సాఫ్ట్వేర్, ఏఐ టూల్స్ గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. టెక్నాలజీ వినియోగం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. -
2040నాటికి చంద్రునిపైకి వ్యోమగామి..సరికొత్త లక్ష్యాలతో భారత్
న్యూఢిల్లీ: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను (చంద్రయాన్-3) ల్యాండ్ చేసిన తొలి దేశంగా అవతరించిన ఇండియా అంతరిక్షం, పరిశోధనలు విషయంలో మరింత వేగం పెంచింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కార్ సరికొత్త వ్యూహంతో దూసుకుపోనుంది. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపే లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఆదేశాలు జారీ చేశారని కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ గగన్‌యాన్ మిషన్ పురోగతి, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశాశం జరిగింది. ఈ సందర్బంగా మోదీ భవిష్యత్తు రోదసి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రానికి ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి సంబంధించిన ప్రణాళికలతో సహా సరికొత్త వ్యూహంతో సాగాలని ఆదేశించారు. సొంత 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (ఇండియన్ స్పేస్ స్టేషన్) ఏర్పాటుతోపాటు చంద్రునిపైకి తొలి భారతీయుడిని పంపడం లాంటి సరికొత్త ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఆయన కోరారు. అలాగే వీనస్,అంగారక గ్రహాలకు సంబంధించిన మిషన్లపై పనిచేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇస్రో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న స్పేస్ డిపార్ట్మెంట్ భారత భావి చంద్ర మిషన్ల కోసం రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయాలని తదుపరి తరం లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)అభివృద్ధి, రిటర్న్ మిషన్లను చేపట్టడానికి సన్నద్ధం కావాలని ప్రధాని శాస్త్రవేత్తలకు సూచించారు. కొత్త లాంచ్ ప్యాడ్, మానవ-కేంద్రీకృత ప్రయోగశాలలు, అనుబంధ సాంకేతికతలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా ఇస్రో ఆధ్వర్యంలో చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్నిచేపట్టింది. ఈ మిషన్లోపీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించిన సంగతి తెలిసిందే. మరోవైపు గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించిన తొలి మానవరహిత విమాన టెస్టింగ్ ఈనెల(అక్టోబర్) 21న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరగనుంది. గగన్‌యాన్ ప్రాజెక్ట్ అనేది మానవ అంతరిక్ష యాత్రల నిర్వహణలో భారతదేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలవనుంది. ఈ మూడు రోజుల మిషన్‌లో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షయాత్ర చేయనున్నారు. కాగా గగన్‌యాన్ మిషన్ మనుషులను సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి మానవ రేటింగ్ పొందిన ప్రయోగ వాహనం. ఇది అంతరిక్షంలోని వ్యోమగాములకు భూమి తరహా పర్యావరణాన్ని అందించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, అత్యవసర ఎస్కేప్ సదుపాయంతోపాటు పలు క్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధి చేయనుంది. మానవ అంతరిక్ష విమాన మిషన్ ప్రయోగంలో ముందుగా మిషన్ సాంకేతిక సంసిద్ధత స్థాయిలను ప్రదర్శించనున్నామని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ డెమోన్స్ట్రేటర్ మిషన్లలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ), ప్యాడ్ అబార్ట్ టెస్ట్ (పీఏటీ) టెస్ట్ వెహికల్ (టీవీ) విమానాలు ఉన్నాయి. టీవీ-డీ1 పరీక్ష వాహనం ఈ అబార్ట్ మిషన్ కోసం అభివృద్ధి చేసిన ఏక దశ లిక్విడ్ రాకెట్. పేలోడ్లలో క్రూ మాడ్యూల్ (సీఎం), క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లు (సీఈఎస్) వాటి వేగవంతమైన సాలిడ్ మోటార్లతో పాటు సీఎం ఫెయిరింగ్ (సీఎంఎప్), ఇంటర్ఫేస్ అడాప్టర్లు ఉంటాయి. ఈ ఫ్లైట్ గగన్‌యాన్ మిషన్‌లో మాదిరి మ్యాక్ నంబర్ 1.2కి అనుగుణంగా ఆరోహణ పథంలో అబార్ట్ స్థితిని అనుసరిస్తుంది. సిఎంతో కూడిన సీఇఎస్ పరీక్ష వాహనం నుండి సుమారు 17 కి.మీ ఎత్తులో వేరు అవుతుంది. తదనంతరం అబార్ట్ సీక్వెన్స్ స్వయంప్రతిపత్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పడు సీఈఎస్ని వేరు చేయడం, పారాచూట్ల శ్రేణిని మోహరించడం మొదలవుతుంది చివరకు శ్రీహరికోట తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో సురక్షిత టచ్‌డౌన్‌తో ప్రయోగం ముగుస్తుంది’అని అంతరిక్ష సంస్థ వెల్లడించింది. TV-D1 Flight Test: The test is scheduled for October 21, 2023, at 0800 Hrs. IST from the First launchpad at SDSC-SHAR, Sriharikota. It will be a short-duration mission and the visibility from the Launch View Gallery (LVG) will be limited. Students and the Public can witness… pic.twitter.com/MROzlmPjRa — ISRO (@isro) October 17, 2023 -
చంద్రయాన్ 3 పోర్టల్ ప్రారంభం
ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టుపై కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్ 3పై పోర్టల్‌ను నేడు ప్రారంభించనుంది. కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. చంద్రయాన్‌పై ప్రత్యేక కోర్సు మాడ్యూళ్లను ప్రారంభించినట్లు పేర్కొంది.'అప్నా చంద్రయాన్' వెబ్సైట్ ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. పోర్టల్‌ను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా సంస్థలను కోరింది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో అవగాహన కల్పించి ప్రచారం చేయాలని తెలిపింది. విద్యార్థులందరినీ ఈ ప్రత్యేక కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరింది. చంద్రయాన్-3 మహా క్విజ్‌కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యా సంస్థలను కోరింది. చంద్రయాన్-3 మిషన్, అంతరిక్ష శాస్త్రం గురించి విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు వీలుగా క్విజ్ నిర్వహించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలపై తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధాన లక్ష్యం. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చు. ఇదీ చదవండి: స్వలింగ జంటల వివాహంపై సుప్రీంకోర్టు తీర్పు -
మన టెక్నాలజీని అమెరికా కావాలంది
రామేశ్వరం: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడంతో అమెరికా నిపుణులు సైతం మన అంతరిక్ష టెక్నాలజీని కోరుతున్నారని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. సంక్లిష్టమైన రాకెట్ మిషన్లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన అమెరికాలో నిపుణులు, చంద్రయాన్–3 మిషన్‌ను చూశాక, భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని కోరుకుంటున్నారన్నారు. రోజులు మారాయని, అత్యుత్తమైన పరికరాలను, రాకెట్లను నిర్మించగల సత్తా భారత్ సొంతం చేసుకుందని ఆయన చెప్పారు. అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ద్వారాలు తెరిచారని ఆయన అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ మాట్లాడారు. ‘మనది చాలా శక్తిమంతమైన దేశం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన విజ్ఞానం, మేధస్సు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. చంద్రయాన్–3 వాహకనౌకను మనమే డిజైన్ చేసి, అభివృద్ధి పరిచాం. ప్రయోగం చేపట్టడానికి కొన్ని రోజులు ముందు ఈ మిషన్‌ను తిలకించేందుకు నాసా నిపుణులను ఆహ్వానించాం. వారు ఇస్రో ప్రధాన కార్యాలయానికి రాగా చంద్రయాన్–3 మిషన్ గురించి వివరించాం. వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనం చాలా తక్కువ ఖర్చుతో పరికరాలు, సామగ్రిని రూపొందించడం చూసి, ఆశ్చర్యపోయారు. తమ దేశానికి ఈ పరిజ్ఞానాన్ని విక్రయించాలని అడిగారు’అని ఆయన వివరించారు. రాకెట్లు, శాటిలైట్ల నిర్మాణంలో పాల్గొని, అంతరిక్ష రంగంలో మన దేశాన్ని మరింత శక్తివంతమైందిగా మార్చాలని కోరుతున్నాను. ఇక్కడున్న కొందరికి ఆ నైపుణ్యం ఉంది. చంద్రుణ్ని చేరుకునే రాకెట్‌ను డిజైన్ చేయగలరు’అని ఆయన పిలుపునిచ్చారు. ‘భారత మహిళా వ్యోమగామి చంద్రయాన్–10 మిషన్‌లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. ఆ మిషన్‌లో మీలో ఒకరు, ముఖ్యంగా ఓ బాలిక సైతం ఉండి ఉండొచ్చు’అని ఆయన అన్నారు. -
భారత్ స్వరం మరింత బలపడుతోంది
పితోర్‌గఢ్: సవాళ్లతోనిండిన ప్రపంచంలో భారత్ వాణి మరింత బలపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించి భారత్ సత్తా చాటుకుందని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి గత 30, 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలపై సైతం తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. చంద్రయాన్–3 మిషన్ విజయవంతమైందని తెలిపిన ప్రధాని మోదీ, చంద్రుడిపై వేరే ఏ దేశమూ చేరుకోని ప్రాంతంలోకి మనం వెళ్లగలిగామన్నారు. ‘ఒక సమయంలో దేశంలో నిరాశానిస్పృహలు ఆవరించి ఉండేవి. వేల కోట్ల రూపాయల కుంభకోణాల చీకట్ల నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుందా అని ప్రజలు ప్రార్థించేవారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిని అప్పటి ప్రభుత్వాలు విస్మరించాయి. వెనుకబడిన ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల ప్రజలు వలస బాట పట్టారు. పరిస్థితులు మారి అలా వెళ్లిన వారంతా ఇప్పుడు తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు’అని ప్రధాని చెప్పారు. ‘ప్రపంచమంతటా సవాళ్లు నిండి ఉన్న ప్రస్తుత తరుణంలో భారత్ వాణి గట్టిగా వినిపిస్తోంది. ప్రపంచానికే భారత్ మార్గదర్శిగా మారడం మీకు గర్వకారణం కాదా? ఈ మార్పు మోదీ తీసుకువచ్చింది కాదు. రెండోసారి మళ్లీ అధికారం అప్పగించిన 140 కోట్ల దేశ ప్రజలది’అని ప్రధాని అన్నారు. గత అయిదేళ్లలో 13.50 కోట్ల ప్రజలను పేదరికం నుంచి తమ ప్రభుత్వం బయటకు తీసుకువచ్చిందన్నారు. పేదరికాన్ని అధిగమించగలమని దేశం నిరూపించిందని చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రజలు తనను కుటుంబసభ్యునిగా భావించారని చెప్పారు. రూ.4,200 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆదికైలాస శిఖరంపై ప్రధాని ధ్యానం అంతకుముందు, రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉదయం జోలింగ్‌కాంగ్ చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన స్వాగతం పలికారు. జోలింగ్‌కాంగ్‌లోని పార్వతీ కుండ్ వద్ద ఉన్న శివపార్వతీ ఆలయంలో ఆరతిచ్చి, శంఖం ఊదారు. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రధాని పరమేశ్వరుని నివాసంగా భావించే ఆది కైలాస పర్వత శిఖరాన్ని సందర్శించుకున్నారు. అక్కడ కాసేపు ధ్యానముద్రలో గడిపారు. అనంతరం అక్కడికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిహద్దు గ్రామం గుంజికి చేరుకున్నారు. అక్కడి మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. స్థానికులను ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. ఉన్ని దుస్తులు, కళారూపాలతో ఏర్పాటైన ప్రదర్శనను తిలకించారు. భద్రతా సిబ్బందితోనూ ప్రధాని ముచ్చటించారు. అక్కడ్నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్మోరా జిల్లాలో పురాతన శివాలయం జగదేశ్వర్ ధామ్‌కు వెళ్లారు. అక్కడున్న జ్యోతిర్లింగానికి ప్రదక్షిణలు, పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రధాని పితోర్‌గఢ్‌కు చేరుకున్నారు. అత్యల్పానికి నిరుద్యోగిత: మోదీ న్యూఢిల్లీ: నానాటికీ దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫలితంగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత గత ఆరేళ్లలో అతి తక్కువగా నమోదైందని తెలిపారు. తాజాగా జరిపిన ఓ సర్వేలో ఈ మేరకు తేలిందని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్, ఆంట్రప్రెన్యూర్షిప్ శాఖ కౌశల్ దీక్షాంత్ సమారోహ్ను ఉద్దేశించి గురువారం ఆయన వీడియో సందేశమిచ్చారు. భారత్‌లో కొన్నేళ్లుగా ఉపాధి కల్పన కొత్త శిఖరాలకు చేరుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగిత బాగా తగ్గుముఖం పడుతోంది. అభివృద్ధి ఫలాలు పల్లెలను చేరుతున్నాయనేందుకు ఇది నిదర్శనం. ప్రగతిలో అవిప్పుడు పట్టణాలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాయి. అంతేకాదు, పనిచేసే మహిళల సంఖ్య భారీగా పెరుగుతుండటం మరో సానుకూల పరిణామం. ఇదంతా మహిళా సాధికారత దిశగా కొన్నేళ్లుగా కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలు, కార్యక్రమాల పర్యవసానమే’’ అని మోదీ చెప్పారు. -
అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దృష్టి ఇప్పుడు ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులపై పడిందని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్)కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, దీర్ఘకాల మానవ అంతరిక్షయానంతోపాటు భవిష్యత్తు మిషన్ల కోసం వివిధ అవకాశాలను అన్వేíÙస్తోందని తెలిపారు. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోబోటిక్ ఆపరేషన్‌తో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి మానవ సహిత అంతరిక్ష యానంపై దృష్టిసారించామన్నారు. గగన్‌యాన్ కార్యక్రమం అదే దిశగా సాగుతోందని చెప్పారు. అది నెరవేరితే, ఆ తర్వాత వచ్చే 20–25 ఏళ్లలో చేపట్టే మిషన్లలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు ఉంటుందన్నారు. తద్వారా ఇప్పటికే ఈ దిశగా విజయం సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుందన్నారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్) -
చంద్రయాన్-3 సక్సెస్ పేరిట రైస్ పుల్లింగ్.. పాత్ర పేరుతో 20కోట్లు..
సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రయాన్-3 సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగ్రుతోంది. అయితే, కొందరు కేటుగాళ్లు చంద్రయాన్-3 పేరును వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ ఉదంతంపై హైదరాబాద్‌లో కేసు నమోదు అయ్యింది. వివరాల ప్రకారం.. కొందరు కేటుగాళ్లు చివరిని చంద్రయాన్-3ని కూడా వదిలిపెట్టలేదు. చంద్రయాన్ సక్సెస్‌కు రైస్ పుల్లింగ్ కారణమని భారీ మోసానికి తెర లేపారు. చంద్రయాన్-3 విజయానికి ఉపయోగించిన పాత్ర అమ్ముతామని కొందరు కేటుగాళ్లు ఓ వ్యాపారవేత్త వద్ద నుంచి ఏకంగా రూ.20కోట్లు దోచేశారు. ఇది మహిళ గల పాత్ర అంటూ కలరింగ్ ఇచ్చి బురిడీ కొట్టించారు. దీంతో, బాధితుడు.. నగరంలోని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి విజయ్ కుమార్ అనే వ్యక్తితో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: ఉజ్జయిని ఘోరం.. బాధితురాలి దత్తతకు ముందుకు వచ్చిన పోలీసాయన -
చంద్రయాన్-3.. ఏం పర్వాలేదు
అహ్మదాబాద్: చంద్రయాన్-3 ప్రాజెక్టుపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిపై అడుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ తనకు అప్పగించిన పనిని ఇప్పటికే పూర్తి చేసేసిందని, స్లీప్ మోడ్ నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేం లేదని వెల్లడించారాయన. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా స్లీప్ మోడ్‌లోనే ఉండడం గురించి మీడియా ఆయన్ని ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. స్లీప్ మోడ్‌లోనే ఉన్నా పర్వాలేదని సమాధానం ఇచ్చారు. ‘‘చంద్రుడిపై రాత్రి పూట (భూమిపై 15 రోజులకు సమానం) పగలు కంటే దాదాపు 200 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ఒకవేళ ప్రజ్ఞాన్ రోవర్‌లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఈ ఉష్ణోగ్రత మార్పును తట్టుకొని నిలబడగలిగితే.. రోవర్ కచ్చితంగా మేల్కొంటుంద’’ని చెప్పారు. అయితే.. ప్రజ్ఞాన్ తిరిగి యాక్టివ్ కాకపోయినా పర్వాలేదని, ఇప్పటికే దాని పని అది పూర్తి చేసిందని అన్నారు. చంద్రుడిపై రాత్రి సమయం పూర్తయిన తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను మేల్కొలిపేందుకు ప్రయత్నించినట్లు ఇటీవల ఇస్రో వెల్లడించిన సంగతి తెలిసిందే. చంద్రుడిపై వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 2న రోవర్, 4న ల్యాండర్‌ను ఇస్రో స్లీప్ మోడ్‌లోకి పంపింది. Chandrayaan-3 Mission: Efforts have been made to establish communication with the Vikram lander and Pragyan rover to ascertain their wake-up condition. As of now, no signals have been received from them. Efforts to establish contact will continue. — ISRO (@isro) September 22, 2023 మరోవైపు.. ఖగోళాన్ని మరింతలోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్‌రే పోలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)పై ప్రస్తుతం దృష్టి సారించినట్లు చెప్పారు. నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అధ్యయనానికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందన్నారు. అలాగే.. రాబోయే రోజుల్లో శుక్ర గ్రహ పరిశోధనలకు ఇస్రో సంసిద్ధమవుతోందని తెలిపారాయన. -
ఆ కాలమానం కొలతలెలా?
చంద్రయాన్ –3 విజయవంతం కావడంతో చందమామపై మానవాళి పరిశోధనలో మరో ముందడుగు పడిన ట్లయింది. 2025 సంవత్సరం నాటికి మళ్ళీ మనుషులు చంద్రుని మీద దిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ పరిశోధన కేంద్రాలను స్థాపించాలని కూడా ప్రణాళికలు తయారవు తున్నాయి. వాటిలో నేరుగా మనుషులు ఉండకపోవచ్చు. కానీ మరమనుషులు తప్పకుండా ఉంటారు. ఆ యంత్రాలు అక్కడ బయట తిరిగి ఖనిజ వనరులను గురించి పరిశీలనలు, పరిశోధనలు కొనసాగిస్తాయి. వాటి కొరకు మనుషులు కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటారు. అంటే, భూమి మీద లాగే అక్కడ కూడా కార్యక్రమాలన్నీ ఒక కాల మానం ప్రకారం పద్ధతిగా జరగవలసిన అవసరం వస్తుందన్నమాట! అందుకే చంద్రుని మీద కాలాన్ని లెక్కిండడం ఎలా అనేది ఇప్పుడు మానవాళి ముందున్న ముఖ్య మైన ప్రశ్నగా నిలిచింది. అపోలో వ్యోమగాములు చంద్ర గోళం మీద దిగారు. తమ పని తాము ముగించి తిరిగి వచ్చేశారు. అక్కడ వారికి కాలం కొలతలతో అవసరం రాలేదు. కానీ శాశ్వతంగా అక్కడి కేంద్రాలు ఉంటాయంటే మాత్రం, తప్పకుండా కాలం లెక్కలు అవసరం అవుతాయి. భూమి మీద ఏదో ఒక ప్రాంతంలో ఉన్న పద్ధతిలోనే సమయాన్ని లెక్కించే పద్ధతిని అక్కడ కూడా అనుసరించవలసి ఉంది. ఈ మాట అనడానికి సులభంగానే ఉన్నా... అటు సాంకేతిక పరంగానూ, ఇటు రాజకీయపరంగానూ ఇది గొప్ప సమస్యగా ఉంది. అసలు చంద్రుని మీద కాలం లెక్కకు ఆధారం ఏమిటి? భూమి మీద ఒక సెకండ్ అంటే ఎంతో తెలుసు. అందరూ తెలుసు అనుకుంటున్నారు కానీ అసలు లెక్క ఒకటి ఉంది. అది అంత సులభంగా తలకెక్కదు. ఎక్కినా మన దినసరి జీవితంలో దాన్ని వాడే అవకాశం ఉండదు. ఒక గడియారాన్ని సరైన సమయానికి మార్చాలన్నా, అంటే సెట్ చేయాలన్నా మరి ఏ పని చేయాలన్నా ఒక పద్ధతి అవసరం. భూమి మీద మనకు ఆ పద్ధతి అలవాటయింది. మానవుల శరీరాలు కూడా ఆ పద్ధతి ప్రకారమే పనిచేస్తున్నాయి. భూమి తన చుట్టు తాను తిరిగే కాలం మనకు తెలుసు. అది సూర్యుని చుట్టూ తిరిగే సమయం కూడా తెలుసు. వీటి ఆధారంగానే మన కాలం కొలతలు కొనసాగుతున్నాయి. చంద్రగోళం మాత్రం తన చుట్టూ తాను, భూమితో పోలిస్తే, చాలా నెమ్మదిగా తిరుగుతుంది. ఆ గోళం మీద కొంత ప్రాంతం వెలుగు లేకుండానే ఎక్కువ కాలం ఉండిపోతుంది. చంద్రగోళం ఒకసారి తాను తన చుట్టూ తిరగడానికి 29.5 భూమి దినాలు పడుతుంది. చంద్రగోళం తిరుగుతున్నట్టు భూమి మీద మనకు కనిపించదు. మనకు ఎప్పుడూ చంద్రుని మీది ఒక దిక్కు మాత్రమే కనపడుతుంది. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. చంద్రగోళం తను తిరుగుతున్న వేగంతోనే భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. కనుక ఎప్పుడూ ఆ గోళం మీద ఒక భాగం మాత్రమే మనకు కనబడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి కొంత ప్రయత్నం అవసరం. మనకు భూమి మీద సూర్యో దయం, అస్తమయం లాంటి కొలతలు ఉన్నాయి. చంద్రుని మీద ఈ కొలతలు వేరుగా ఉంటాయి. అంటే చంద్రగోళం మీద కాలం కొలతలు అంత సుల భంగా కుదరవు అని అర్థం. కనుకనే వాటి గురించి పరిశోధకులు గట్టి ప్రయ త్నాలు చేస్తున్నారు. చంద్రగోళం మీదకి బహుశా మన దేశం వాళ్లు కూడా వెళతారు. మరెన్నో దేశాల వాళ్ళు వెళతారు. కనుక అందరికీ అంగీకారమయ్యే లెక్కలు రావాలి. అక్కడికి వెళ్లిన అంతరిక్ష యాత్రికులు, తాము ఏ సమయంలో, ఏ ప్రదేశంలో, ఎంతకాలం పాటు ఉన్నాము అన్న సంగతులను లెక్క వేసుకోగలగాలి. భూమి మీద ఇటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయి. కొత్త కదలిక వేగాల ఆధారంగా చంద్రుని మీద కూడా ఇటువంటి కొలతలు రావాలి. ఇందుకు కావలసిన సాంకేతిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. మొత్తం మీద కొత్త రకం కాలం కొలతలు వచ్చేస్తున్నాయి అని మాత్రం అర్థం చేసుకోక తప్పదు. మానవ చరిత్ర మొత్తం మీద ఒక పద్ధతి కొనసాగింది. ఇప్పుడు మరో మరో పద్ధతీ వస్తున్నదని అంటున్నారు పరిశోధకులు. కె.బి. గోపాలం వ్యాసకర్త ప్రముఖ సైన్స్ రచయిత ‘ 98490 62055 -
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!!
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!! -
Chandrayaan 3: లాండర్, రోవర్ నుంచి సంకేతాలు లేవు
బెంగళూరు: జాబిలిపై పరిశోధనల కోసం ప్రయోగించిన చంద్రయాన్–3 తాలూకు లాండర్, రోవర్లతో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ఇస్రో శుక్రవారం ప్రకటించింది. విక్రమ్‌గా పిలుస్తున్న లాండర్, ప్రజ్ఞాన్‌గా పిలుస్తున్న రోవర్లను ఈ నెల మొదట్లో ఇస్రో సుప్తావస్థలోకి పంపడం తెలిసిందే. ఇప్పుడు అవి తిరిగి యాక్టివేట్ అయే స్థితిలో ఏ మేరకు ఉన్నదీ పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. కానీ ఇప్పటిదాకా అయితే వాటినుంచి తమకు ఎలాంటి సంకేతాలూ అందలేదని వివరించింది. వాటిని కాంటాక్ట్ చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. సెపె్టంబర్ 20 దాకా చంద్రుని మీద రాత్రి వేళ. 14 రోజులు రాత్రి ఉంటుంది. అప్పుడక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 120 డిగ్రీల దాకా పడిపోతాయి. దాంతో చంద్రయాన్ లాండర్, రోవర్ పాడయ్యే ప్రమాదముంది. అందుకే వాటిని ఇస్రో స్లీప్ మోడ్‌లోకి పంపింది. ఇప్పుడు పగటి సమయం కావడంతో వాటిని యాక్టివేట్ చేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. -
PRS Legislative Research: నిర్ణీత సమయానికి మించి పనిచేసిన పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో లోక్‌సభ, రాజ్యసభలు షెడ్యూల్ సమయానికి మించి పనిచేశాయి. 17వ లోక్‌సభ సెషన్లలో ఎటువంటి వాయిదాలు లేకుండా పూర్తి సమయంపాటు కార్యకలాపాలు కొనసాగించిన ఏకైక సెషన్ కూడా ఇదే. ఈ విషయాలను పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ తెలిపింది. గురువారంతో ముగిసిన ఈ ప్రత్యేక సెషన్లో 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానం, చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ జరిగింది. ఒకే ఒక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. స్పెషల్ సెషన్లో లోక్‌సభ షెడ్యూల్ సమయం 22 గంటల 45 నిమిషాలు కాగా ఎనిమిదిగంటల కంటే ఎక్కువగా మొత్తం 31 గంటలపాటు పనిచేయడం విశేషం. దీంతో, లోక్‌సభ 137 శాతం ఎక్కువ సమయం పనిచేసింది. అదే విధంగా, రాజ్యసభ షెడ్యూల్ సమయం 21 గంటల 45 నిమిషాలు కాగా, 27 గంటల 44 నిమిషాల సేపు కార్యకలాపాలు సాగాయి. దీంతో, రాజ్యసభ 128 శాతం ఎక్కువ సమయం పనిచేసినట్లయిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివరించింది. -
లోక్‌సభలో డానిష్ అలీపై వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ సందర్భంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు కలకలం రేపాయి. గురువారం రాత్రి లోక్‌సభలో తమ పార్టీ ఎంపీ బిధూరి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ఎంపీ బిధూరీని ఆదేశించింది. ఎంపీ బిధూరి వ్యాఖ్యలపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ విచారం వ్యక్తం చేశారు. బిధూరి వ్యాఖ్యలను తీవ్రమైనవిగా పరిగణిస్తున్నామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనపై కఠిన చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. ముస్లిం ఎంపీని ఉద్దేశిస్తూ చేసిన అన్ పార్లమెంటరీ వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. సదరు ఎంపీని సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. రమేశ్ బిధూరీకి బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వడం, మంత్రి రాజ్‌నాథ్ క్షమాపణ చెప్పడం సరే కానీ, సదరు ఎంపీపై సరైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే నేతలు రమేశ్ బిధూరి వ్యాఖ్యల విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రివిలేజ్ కమిటీకి నివేదించండి: స్పీకర్‌కు డానిష్ అలీ లేఖ లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి తనను అసభ్య పదజాలంతో దూషించడం విద్వేష ప్రసంగం కిందికే వస్తుందని, విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. విద్వేష ప్రసంగం వినడానికి ప్రజలు తనను పార్లమెంట్‌కు పంపలేదన్నారు. తక్షణమే ఈ అంశంపై విచారణ చేయించాలని స్పీకర్‌ను కోరారు. బిధూరిపై చర్యలు తీసుకోకుంటే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎంపీ బిధూరి వాడిన అత్యంత దుర్మార్గమైన భాష తీరని వేదన కలిగించిందన్నారు. అవి లోక్‌సభ రికార్డులో భాగమని కూడా తెలిపారు. ‘ఇది అత్యంత దురదృష్టకరం. స్పీకర్‌గా మీ నేతృత్వంలోని పార్లమెంట్ కొత్త భవనంలో ఇలా జరగడం ఈ గొప్ప దేశంలోని మైనారిటీ వర్గానికి చెందిన ఎంపీగా నాకు తీవ్ర హృదయ వేదన కలిగించింది’అని డానిష్ అలీ తెలిపారు. విచారణ జరిపి నివేదిక అందించేందుకు లోక్‌సభ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్లోని రూల్ నంబర్ 227 కింద ప్రివిలేజ్ కమిటీకి ఈ విషయాన్ని రెఫర్ చేయాలని స్పీకర్‌ను ఆయన కోరారు.