చంద్రయాన్‌– 3 సక్సెస్‌లో మన పాత్ర | - | Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌– 3 సక్సెస్‌లో మన పాత్ర

Aug 26 2023 6:30 AM | Updated on Aug 26 2023 7:26 AM

- - Sakshi

హైదరాబాద్: చంద్రయాన్‌– 3లో కీలకమైన ల్యాండర్‌, రోవర్‌, ప్రొఫెల్లషన్‌ మాడ్యూల్‌, బ్యాటరీ స్లీవ్స్‌ పరికరాలను అందించి ఇస్రో చరిత్రలో కూకట్‌పల్లి స్థానాన్ని నిలబెట్టిన బి.నాగభూషణ్‌రెడ్డి (బీఎన్‌ రెడ్డి)పై నగర వాసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా 50 ప్రయోగాల్లో తన భాగస్వామ్యాన్ని నిలబెట్టుకొని అన్నింటిలో సమర్థతను నిరూపించుకొని ఇస్రో వంటి సంస్థల్లో శభాష్‌ అనిపించుకున్న నాగభూషణ్‌రెడ్డికి అడుగడుగునా ప్రశంసలు అందుతున్నాయి. ఆయన ప్రస్థానం ఇలా సాగింది..

మొదట చిన్నతరహా పరిశ్రమలో ఉద్యోగం..
విజయవాడలో ఇంజినీరింగ్‌ 1982లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన బీఎన్‌ రెడ్డి చిన్న తరహా పరిశ్రమలో ఉద్యోగం చేసి అనంతరం 1984లో బాలానగర్‌ సీఐటీడీలో ఎంటెక్‌ మెకానికల్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌ ఆల్విన్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరిన బీఎన్‌ రెడ్డి తాను కూడా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో 1994లో నాగసాయి పెసిషియన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని స్థాపించారు.

హెచ్‌ఎఎల్‌, బీఈఎల్‌తో పాటు యూఏఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ వంటి సంస్థలకు విమాన విడి భాగాలను అందజేసిన నాగసాయి కంపెనీ ఇస్రోకు బీఎన్‌ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఆయనతో పలు దఫాల ఇంటర్వ్యూలతో పాటు ఆయన తయారు చేసిన పరికరాలపై ప్రమాణాల పరీక్షలు నిర్వహించిన అనంతరం అవకాశం కల్పించారు. మొట్టమొదటగా ఇన్సాట్‌ 2ఈలో ఆయనకు భాగస్వామ్యం కల్పించారు. దీంతో ఆయన తయారు చేసిన వస్తువుల నాణ్యతతో కన్పించటంతో అప్పటి నుంచి 25 సంవత్సరాలుగా ఇస్రోకు పరికరాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్‌– 3 సక్సెస్‌తో బీఎన్‌ రెడ్డి ప్రతిభ సమున్నత శిఖరాలకు చేరింది.

చంద్రయాన్‌కు ఏయే పరికరాలు అందించారంటే..
చంద్రయాన్‌– 3లో బ్యాటరీలు, ల్యాండర్‌, రోవర్‌, ప్రొఫెల్లషన్‌ మాడ్యూల్‌ వంటి పరికరాలు అందజేశారు. ప్రస్తుతం ల్యాండర్‌ చంద్రమండలంలో ఉంది. రోవర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయింది. అంతకు ముందు ప్రొఫెల్లషన్‌ మాడ్యూల్‌ చంద్రునికి 153 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించింది. ఇంత సాహసోపేతమైన కార్యాచరణలో తాను భాగస్వామి కావడం ఎంతో అదృష్టమని బీఎన్‌ రెడ్డి హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు..
1998 నుంచి ఇన్సాట్‌ 2ఈ మొదలుకొని ఆదిత్య ఎల్‌1తో పాటు గగన్‌యాన్‌లో కూడా బీఎన్‌ రెడ్డి భాగస్యామ్యం అవుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల్లో అన్నింటిల్లో ఆయనకు ఇస్రో నుంచి సంపూర్ణ మద్దతు లభించటమే కాకుండా ప్రశంసలు కూడా అందాయి.

ఇస్రోకు పరికరాలు ఎందుకు అందించాలనుకున్నారంటే..
బీఎన్‌ రెడ్డి 1992లో ఆల్విన్‌ కంపెనీలో ఉద్యోగం చేసిన తర్వాత 1994లో నాగసాయి పెసిషియన్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌తో పాటు యూఏఐ ఎయిర్‌క్రాఫ్ట్‌ వంటి సంస్థలకు పరికరాలు అందజేశారు. 1998లో ఇస్రోకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఇస్రో వారు పలు దఫాలుగా తన పరికరాల నాణ్యతా పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను 1998లో ఇన్సాట్‌– 2ఈ ద్వారా ఈ ప్రయోగాలకు పరిచయం చేశారు. అప్పటి నుంచి తన కార్యాచరణ కొనసాగుతూనే ఉంది.

ఎన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయి?
1998 నుంచి బీఎన్‌ రెడ్డి తయారు చేసే ప్రతి పరికరం ఉపయోగపడింది. 50 ప్రయోగాల్లో ఒక్క ప్రయోగం మినహా మిగిలిన ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయి. ఇన్సాట్‌ సిరీస్‌, జీ శాట్‌ సిరీస్‌, చంద్రయాన్‌– 1, 2, 3, గగన్‌యాన్‌, కార్టో శాట్‌, ఐఆర్‌ఎన్‌ఎస్‌ శాటిలైట్‌ వంటి అనేక ప్రయోగాల్లో పరికరాలను అందజేశారు.

విశ్వవ్యాప్తంగా ప్రశంసలు..
‘మారుమూల గ్రామం నుంచి నేను హైదరాబాద్‌కు వచ్చి ఇస్రోకు అవసరమైన పరికరాలు తయారు చేయడం ఎంతో గర్వకారణం. జీవితంలో ఇంకేం సాధించాలి? రాష్ట్రాలు దాటితేనే ఒక గొప్ప. అలాంటిది దేశాలే కాకుండా అంతరిక్షంలోకి నేనే వెళ్లినట్లుగా సంతోషపడుతున్నాను. ఇప్పటికే నాకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. బంధువులతో పాటు శాస్త్రవేత్తలు ప్రతి రోజూ ఫోన్‌ చేయటం నా అదృష్టం’గా భావిస్తున్నా అన్నారు బీఎన్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement