ఎన్నాళ్లో వేచిన సాయంత్రం. నగరమంతటా ఉత్కంఠమయం. చందమామపైకి విక్రమ్ ఎప్పుడెప్పుడు వెళ్తాడా అనే ఉద్విగ్న సమయం. చివరికి ‘మామ’ను ముద్దాడిన ఆనంద వీక్షణం. నగరం ఒక్కసారిగా హర్షాతిరేకాలతో తడిసిముద్దైన తన్మయత్వం.. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్– 3 ప్రయోగం విజయవంతం. అంబరమంటిన సంబరం.
అంతర్జాతీయ అంతరిక్ష యవనికపై ఇండియా జెండా సమున్నతంగా ఎగిసిన వేళ సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ అరుదైన క్షణాల కోసం నగర వాసులు నరాలు తెగే ఉత్కంఠగా ఎదురుచూశారు. విక్రమ్ రోవర్ ల్యాండింగ్‌ను చూడటానికి టీవీలకు అతుక్కుపోయారు. పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో విద్యార్థులు, పరిశోధకులతో పాటు పౌరులంతా ఈ అద్భుత క్షణాలను వీక్షించడానికి ప్రత్యేక ప్రసార వేదికలను ఏర్పాటు చేయడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో/కూకట్‌పల్లి/గన్‌ఫౌండ్రీ/సంతోష్‌నగర్/ ఉస్మానియా యూనివర్సిటీ
చంద్రయాన్– 3పై బుధవారం ఉదయం నుంచే సిటీజనులు సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్స్‌ను షేర్ చేస్తూ ఆసక్తి కనబరిచారు. సాయంత్రం 5.44 గంటలకు చంద్రయాన్ తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందని తెలియడంతో టీవీలకు అతుక్కుపోయారు. నగరంలోని బిర్లా ప్లానెటోరియం, సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లు వేదికలుగా లైవ్‌షోలు ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్లానెటోరియంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని సేఫ్ ల్యాండింగ్‌ను వీక్షించారు.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా వేదికగా, ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనలో వందల సంఖ్యలో విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. పలు రెస్టారెంట్లు, మాల్స్‌ల్లోనూ చంద్రయాన్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. సైఫాబాద్ సైన్స్ కాలేజ్ విద్యార్థులు త్రివర్ణ పతాకాలతో వేడుకలను నిర్వహించారు. చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావాలంటూ బంజారాహిల్స్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రయాన్ –3 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా పలువురు ప్రముఖులు తమ స్పందనలు ఇలా వ్యక్తం చేశారు.
అపుడే చెప్పెను రాకేశ్ శర్మ..
ఇటీవల నగరలోని ఉస్మానియా వేదికగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న భారత తొలి వ్యోమగామి రాకేష్ శర్మ ఇస్రో పరిశోధనల గురించి పలు అంశాలను వెల్లడించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3, గగన్‌యాన్‌లకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. చంద్రయాన్–3 ప్రయోగం విజవంతం అవుతుందని, ఈ ప్రయోగానికి ప్రణాళికలను పఠిష్టంగా రూపొందించారని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్–3 ఇతర దేశాల దృష్టిని ఆకర్షిస్తుందని ఆ రోజే పేర్కొన్నారు. తాను ఈ ప్రయోగంలో అడ్వయిజరీ మెంబర్‌గా కొనసాగుతున్నట్లు చెప్పారు.
చంద్రయాన్‌లో మన ప్రాతినిధ్యం
శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్–3లో హైదరాబాద్ నగరం కూడా కీలక పాత్ర పోషించింది. నగరంలోని మిధాని, బీహెచ్‌ఈఎల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ వంటి పలు కంపెనీలు, పరిశోధనా సంస్థలు చంద్రయాన్ ప్రయోగంలో వివిధ దశల్లో సేవలందించాయి. చంద్రయాన్–3కి కూకట్‌పల్లిలో తయారు చేసిన పరికరాలను అమర్చటం మరోసారి చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటివరకు 50 సార్లు నాగసాయి ప్రెసీషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఉపగ్రహాల తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 1998 నుంచి ఇస్రోకు విడిభాగాలు అందజేస్తున్న ఈ సంస్థ చంద్రయాన్–3కు కూడా సంబంధించిన వస్తువుల తయారీకోసం రక్షణ శాఖ ఎంపిక చేయటం విశేషం. ఈ సంస్థ వారు బ్యాటరీలు, ల్యాండర్, రోవర్, ప్రొఫెల్షన్ మాడ్యూల్ వంటి మాన్యుఫాక్చర్స్, మెకానికల్ బ్యాటరీ స్లీవ్స్ వంటి పరికరాలను అందజేశారు.
► చంద్రయాన్‌తో పాటు ఇస్రో చేస్తున్న పరిశోధనల్లో నాగసాయి కంపెనీ అధినేత బీఎన్ రెడ్డి పరికరాలను అందజేస్తున్నారు. చంద్రయాన్ మిషన్‌కు అవసరమైన నికెల్, టైటానియం లోహ మిశ్రమాలను, ఉక్కు తదితర ప్రత్యేక శాసీ్త్రయ పదార్థాలను ‘మిధాని’ సంస్థ అభివృద్ధి చేసి సరఫరా చేసింది. ఇస్రో చేపట్టే పలు పరిశోధనల్లో ఈ సంస్థ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఈ ప్రయోగంలో వినియోగించిన బ్యాటరీలను భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ తయారు చేసింది. వీటితో పాటు బై–మెటాలిక్ అడాప్టర్లను, క్రయోనిక్ దశలో ఉపయోగించిన పలు భాగాలను కూడా ఈ సంస్థే రూపొందించింది.
గగన్‌యాన్‌కూ నాగసాయి సేవలు
కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని నాగసాయి ప్రెసీషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 25 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాల్లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లకు సంబంధించిన కీలకమైన పరికరాలను తయారు చేసింది. అత్యంత నాణ్యమైన నాసిల్స్‌తో పాటు గతంలో నాసిల్స్‌ను తయారు చేసేందుకు ఇజ్రాయల్ నుంచి అల్యూమినియం తీసుకొచ్చి బాలానగర్‌లో తయారు చేసి విమానాల తయారీకి సంబంధించిన విడి పరికరాలను ఇక్కడి నుంచే సప్లై చేయటం విశేషం. నాగసాయి కంపెనీ ఈసారి చంద్రయాన్–3తో పాటు ఆదిత్య–ఎల్ 1, గగన్‌యాన్‌లకూ పరికరాలు అందజేసి రికార్డు సృష్టించింది.
50సార్లు అంతరిక్ష ప్రయోగాలు..
హైదరాబాద్ ఆల్విన్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన బీఎన్ రెడ్డి.. తాను కూడా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో 1994లో నాగసాయి కంపెనీని స్థాపించారు. అప్పటి నుంచి అనేక రకాలుగా ప్రయోగాత్మక వస్తువులు తయారు చేస్తూ రక్షణ శాఖ దృష్టిలో పడటం ఆయనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టింది. నాసా, ఇస్రోలకు తన కంపెనీ పరికరాలను అందజేయాలనే సంకల్పంతో కొన్ని వ్యయ ప్రయాసలకు గురైనా కార్యాచరణ మొదలు పెట్టారు. బీఎన్ రెడ్డి కార్యాచరణ నైపుణ్యంపై పలు దశల్లో పరీక్షలు నిర్వహించిన జాతీయ సంస్థలు ఆయనకు అవకాశమిచ్చారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకూ 50 సార్లు అంతరిక్ష ప్రయోగాల్లో పరికరాలు అందజేసిన ఘనత ఆయనకే సాధ్యమైంది. దేశ, విదేశాలతో పాటు అంతరిక్షంలో కూడా కూకట్‌పల్లి ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లిన బీఎన్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్–3 విజయవంతం కావడం తనకెంతో గర్వంగా ఉందన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తలు గ్రేట్
ఇస్రో ద్వారా చంద్రయాన్–3 విజయవంతం కావడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3 నిలవడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఖ్యాతి ఇనుమడించిందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషితో దేశం గర్విస్తోందని అభిప్రాయపడ్డారు. – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment