కూకట్‌పల్లి: చంద్రయాన్–3కు కూకట్‌పల్లిలో తయారు చేసిన పరికరాలను అమర్చటంతో ఈ ప్రాంతం మరోసారి చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటి వరకు యాభై సార్లు నాగసాయి ప్రెసిషన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉపగ్రహాల తయారీలో కీలక పాత్ర పోషించింది. 1998 నుంచి ఇస్రోకు విడిభాగాలు అందజేస్తున్న ఈ సంస్థ చంద్రయాన్–3కు కూడా పరికరాల తయారీ కోసం రక్షణ శాఖ ఎంపిక చేయటం విశేషం.
ఈ సంస్థ బ్యాటరీలు, ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ వంటి మాన్యుఫాక్చర్స్, మెకానికల్ బ్యాటరీ స్లీవ్స్ వంటి పరికరాలను అందజేశారు. గతంలో చంద్రయాన్‌తో పాటు ఇస్రో చేస్తున్న పరిశోధనల్లో కూకట్‌పల్లికి చెందిన నాగసాయి కంపెనీ అధినేత బి.ఎన్. రెడ్డి పరికరాలను అందజేశారు. నాగసాయి కంపెనీపై కేంద్ర రక్షణ శాఖ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమోదముద్ర వేసింది.
దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు..
కూకట్‌పల్లి పారిశ్రామిక ప్రాంతం ప్రశాంత్‌నగర్‌లోని నాగసాయి ప్రెసిషన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పాతికేళ్ల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు అనేక ప్రయోగాల్లో తనదైన పాత్ర పోషించి దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. చంద్రయాన్–1, చంద్రయాన్–2 ప్రయోగాల్లో కీలకమైన ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లకు సంబంధించిన పరికరాలను తయారు చేసింది. అత్యంత నాణ్యమైన నాజిల్స్‌తో పాటు గతంలో నాజిల్స్‌ను తయారు చేసేందుకు ఇజ్రాయిల్ నుంచి అల్యూమినియం తీసుకొచ్చి బాలానగర్‌లో తయారు చేసి విమానాల తయారీకి సంబంధించిన విడి పరికరాలను ఇక్కడి నుంచే సప్లయ్ చేయటం విశేషం. హెచ్‌ఏఎల్, బీఈఎల్‌తో పాటు యూఏఐ ఎయిర్‌క్రాఫ్ట్ వంటి సంస్థలకు విమానాల విడి భాగాలను అందజేసిన నాగసాయి కంపెనీ ఈసారి చంద్రయాన్–3తో పాటు ఆదిత్య–ఎల్1, గగన్‌యాన్‌లకు కూడా పరికరాలు అందజేసి రికార్డు సృష్టించింది.
అంచెలంచెలుగా ఎదిగి..
► నాగసాయి ప్రెసిషన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యజమాని నాగభూషణ్ రెడ్డి (బీఎన్ రెడ్డి) 40 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఆల్విన్ కంపెనీలో ఉద్యోగం అనంతరం సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా అభివృద్ధి చెంది అంతరిక్షంలో కూడా తన పాత్రను కనిపించేలా అభివృద్ధి చెందారు. 1982లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన బీఎన్ రెడ్డి చిన్న తరహా పరిశ్రమలో ఉద్యోగం చేసి అనంతరం 1984లో బాలానగర్ సీఐటీడీలో ఎంటెక్ మెకానికల్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఆల్విన్ కంపెనీలో ఉద్యోగంలో చేరి కొందరికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో 1994లో నాగసాయి కంపెనీని స్థాపించారు. అప్పటి నుంచి అనేక రకాలుగా ప్రయోగాత్మక వస్తువులు తయారు చేస్తూ రక్షణ శాఖ దృష్టిలో పడటం ఆయనకు పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టింది.
► నాసా, ఇస్రోలకు తమ కంపెనీ పరికరాలను అందజేయాలనే సంకల్పంతో వ్యయ ప్రయాసలకోర్చి కార్యాచరణ మొదలు పెట్టారు. బీఎన్ రెడ్డి నైపుణ్యంపై పలు దశల్లో పరీక్షలు నిర్వహించిన జాతీయ సంస్థలు ఆయనకు అవకాశమిచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 50 సార్లు అంతరిక్ష ప్రయోగాల్లో పరికరాలు అందజేసిన ఘనత బీఎన్ రెడ్డికి చెందుతుంది. దేశ, విదేశాలతో పాటు అంతరిక్షంలో కూడా కూకట్‌పల్లి ఖ్యాతిని ముందుకు తీసుకెళ్లిన బీఎన్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రుడిపై మానవ మనుగడ ఏ విధంగా ఉందో తెలుసుకునే అవకాశంలో తన పాత్ర ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చంద్రయాన్–3ని నేడు ప్రయోగించనున్నారు. అందులో తాను తయారు చేసిన పరికరాలు బ్యాటరీల కోసం వాడే స్లీవ్స్‌ను ఇప్పటికే అమర్చినట్లు ఆయన తెలిపారు. చంద్రయాన్–3 విజయవంతమైతే భారత్ అరుదైన గౌరవం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment