అహ్మదాబాద్(గుజరాత్): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23, సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్ ఒక వేళ చంద్రుడిపై పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులు సరిగ్గా లేకపోయినా ఆగస్టు 27కి వాయిదా వేస్తామని తెలిపారు.
ఆగస్టు 23న భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉంది. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు ల్యాండర్ స్థితిగతులను చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తామని ఒకవేళ పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నా చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆగస్టు 27 కు వాయిదా వేస్తామని తెలిపారు ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్. ప్రస్తుతానికైతే చంద్రయాన్-3లో ఎటువంటి లోపాలు తలెత్తలేదని నిర్ణీత సమయానికే ల్యాండ్ అవుతుందని అన్నారు.
సోమవారం ఇస్రో చైర్మన్, స్పేస్ డిపర్ట్‌మెంట్ సెక్రెటరీ ఎస్.సోమ్‌నాథ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌కు చంద్రయాన్ స్థితిగతుల గురించి వివరించారు. ఈ రెండు రోజులు కూడా చంద్రయాన్-3 స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ల్యాండర్ నిర్ణీత సమయానికే చంద్రుడిపై కాలుమోపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చంద్రయాన్-3 విజయవంతమవుతుందని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ దేశం చరిత్ర సృష్టిస్తుందన్నారు.
చివరి దశలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన చంద్రయాన్-2తో చంద్రయాన్-3 కక్ష్యలో సంబంధాలు పునరుద్ధరించింది. అమెరికా, రష్యా, చైనా ఇదివరకే చంద్రుడిపై అడుగుపెట్టినా దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది.
చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీరు ఉండటాన్ని గుర్తించి సంచలనాన్ని సృష్టించగా ఆ ప్రయోగంలోని కొన్నిఅంశాలను ఆయా అగ్రదేశాలు తమ ప్రయోగాలకు ఇన్‌పుట్స్‌గా స్వీకరించాయని గుర్తుచేశారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ కారణంగా విఫలమవగా చంద్రయాన్-3 2020 జనవరిలో ప్రారంభమైందని 2021లోనే దీన్ని ప్రయోగించాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా ప్రయోగం వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు.
చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ఒకవేళ అన్ని పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారినా కూడా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయన అన్నారు.
ఇది కూడా చదవండి: మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో?
Comments
Please login to add a commentAdd a comment