ISRO chief
-
ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ వివాదమే కారణమా?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చైర్మన్ 'ఎస్ సోమనాథ్' (S.Somanath) ‘నిలవు కుడిచ సింహగల్' (వెన్నెల తాగిన సింహాలు) పేరుతో మలయాళంలో తన ఆత్మకథను రాసారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను యువతరానికి అందించి వారిలో స్ఫూర్తి నింపడానికి ఈ పుస్తకం రాసారు. ప్రచురణకు సిద్దమైన ఈ పుస్తకం ఇప్పుడు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోమనాథ్ ఆత్మకథలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్‌పై కొన్ని విమర్శలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి రావడంతో సోమనాథ్ స్పందించారు. పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించారు. స్పేస్ కమిషన్ సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ పదవి వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ సమయంలో మరో డైరెక్టర్‌ను నియమిస్తే అలాంటి అవకాశాలు తగ్గుతాయని మాత్రమే పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. నా పబ్లిషర్ కొన్ని కాపీలను విడుదల చేసి ఉండవచ్చు.. కానీ ఈ వివాదం తర్వాత, ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను రాసిన పుస్తకం విమర్శనాస్త్రం కాదని, జీవితంలో సమస్యలను అధిగమించి తమ కలలను సాధించాలనుకునే వ్యక్తులకు స్ఫూర్తిదాయకమైన కథ అని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. -
శుక్రయాన్‌కు పేలోడ్లు సిద్ధం
న్యూఢిల్లీ: చంద్రయాన్ ప్రయోగం విజయవంతం అయింది. ఆదిత్యయానం కొనసాగుతోంది. ఇక శుక్ర గ్రహంపై జెండా పాతేందుకు భారత్ సిద్ధమవుతోంది. శుక్ర యాత్రకు ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తవుతున్నట్టు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. దానికి సంబంధించిన పేలోడ్లు ఇప్పటికే సిద్ధమైనట్టు ఆయన బుధవారం వివరించారు. శుక్రుని అధ్యయనం భూగోళం భవితవ్యానికి సంబంధించి కీలక సమాచారం అందజేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ ప్రయోగానికి ఇంకా ఒకట్రెండేళ్లు పట్టవచ్చు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే శుక్రయానాలకు తెర తీశాయి. -
చంద్రయాన్-3 ల్యాండింగ్ వాయిదా..?
అహ్మదాబాద్(గుజరాత్): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23, సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్ ఒక వేళ చంద్రుడిపై పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులు సరిగ్గా లేకపోయినా ఆగస్టు 27కి వాయిదా వేస్తామని తెలిపారు. ఆగస్టు 23న భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉంది. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు ల్యాండర్ స్థితిగతులను చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తామని ఒకవేళ పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నా చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆగస్టు 27 కు వాయిదా వేస్తామని తెలిపారు ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్. ప్రస్తుతానికైతే చంద్రయాన్-3లో ఎటువంటి లోపాలు తలెత్తలేదని నిర్ణీత సమయానికే ల్యాండ్ అవుతుందని అన్నారు. సోమవారం ఇస్రో చైర్మన్, స్పేస్ డిపర్ట్మెంట్ సెక్రెటరీ ఎస్.సోమ్‌నాథ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌కు చంద్రయాన్ స్థితిగతుల గురించి వివరించారు. ఈ రెండు రోజులు కూడా చంద్రయాన్-3 స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ల్యాండర్ నిర్ణీత సమయానికే చంద్రుడిపై కాలుమోపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చంద్రయాన్-3 విజయవంతమవుతుందని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ దేశం చరిత్ర సృష్టిస్తుందన్నారు. చివరి దశలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన చంద్రయాన్-2తో చంద్రయాన్-3 కక్ష్యలో సంబంధాలు పునరుద్ధరించింది. అమెరికా, రష్యా, చైనా ఇదివరకే చంద్రుడిపై అడుగుపెట్టినా దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీరు ఉండటాన్ని గుర్తించి సంచలనాన్ని సృష్టించగా ఆ ప్రయోగంలోని కొన్నిఅంశాలను ఆయా అగ్రదేశాలు తమ ప్రయోగాలకు ఇన్‌పుట్స్‌గా స్వీకరించాయని గుర్తుచేశారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ కారణంగా విఫలమవగా చంద్రయాన్-3 2020 జనవరిలో ప్రారంభమైందని 2021లోనే దీన్ని ప్రయోగించాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా ప్రయోగం వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ఒకవేళ అన్ని పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారినా కూడా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయన అన్నారు. ఇది కూడా చదవండి: మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో? -
Chandrayaan-3: చంద్రయాన్-3పై మాజీ ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో మాజీ ఇస్రో చీఫ్ కె.శివన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-2 తరహాలో కాకుండా ఇందులోని విక్రమ్ ల్యాండర్ పూర్తిగా ఆటోమేటెడ్ టెక్నాలజీతో తయారుచేసిందని.. ఎటువంటి గ్రౌండ్ సహాయం లేకుండానే ఇది దానంతటదే ల్యాండ్ అవుతుందన్నారు. మాజీ ఇస్రో చీఫ్ కైలాసవడివూ శివన్ మాట్లాడుతూ చంద్రయాన్-3 ప్రయోగంలో ప్రపల్షన్ మాడ్యూల్ నుండి విక్రమ్ ల్యాండర్ విడిపోవడంతోనే ప్రయోగం కీలక దశకు చేరుకుందని అన్నారు. ఇక్కడి నుండి ఎటువంటి సహకారం అవసరం లేకుండానే ల్యాండర్ దానంతటదే ఆటోమేటిగ్గా ల్యాండ్ అవుతుంది. అంతర్గతంగా ఏర్పాటు చేసిన మేధస్సు ఆధారంగానే అది పనిచేస్తుందని.. దాని వేగాన్ని నియంత్రించుకుని ల్యాండర్ నిర్ణీత సమయానికి నిలువుగా చంద్రుడిపై అడుగుపెడుతుంది. ల్యాండర్ స్థిరపడిన తర్వాత రెండు గంటలకు ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైన తర్వాత అందులో జరిగిన తప్పిదాలను ఒక్కొక్కటిగా సవరించి ఈసారి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందులోని ప్రపల్షన్ వ్యవస్థ, మార్గదర్శక వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థ అంతా అప్ గ్రేడ్ చేయబడింది. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు సరిచేసుకునేందుకు వీలుగా అందులోని సెన్సార్ వ్యవస్థ సహాయపడుతుందని ఈసారి ల్యాండర్ ఎంత వేగంతో వెళ్లినా ప్రయోగం మాత్రం విజయవంతం కావడం ఖాయమని అన్నారు. ఇంతవరకు ఎవ్వరూ చంద్రుడి దక్షిణ భాగాన్ని చేరుకోని నేపథ్యంలో అక్కడ ఆడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-3 అందించే సమాచారం ఆధారంగా ప్రపంచ దేశాల్లో ఎవ్వరైనా చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రయోగాలు చేసుకోవచ్చని తెలిపారు మాజీ ఇస్రో చీఫ్. ఇది కూడా చదవండి: 'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధికి చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్ కమిటీని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఏర్పాటు చేసింది. ఆయన గతంలో జాతీయ విద్యా విధానం–2020 డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. కాగా మూడేళ్ళ కాలపరిమితితో నిర్ణయించిన ఈ నూతన కమిటీ జాతీయ విద్యావిధానం 2020 దృక్పథాల ప్రకారం నాలుగు జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను అభివృద్ధి చేస్తుంది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా, ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య కోసం జాతీయ పాఠ్యాంశాలు, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక, వయోజన విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను ఈ కమిటీలోని మొత్తం 12మంది సభ్యులు సిద్ధం చేయనున్నారు. ప్రతిపాదనలు.. సలహాలు.. ఎన్ఈపీ–2020 అన్ని సిఫార్సులను పాఠశాల విద్య, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ), టీచర్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్‌కు సం బంధించిన పాఠ్యాంశాల సంస్కరణలను ఈ కమి టీ ప్రతిపాదిస్తుంది. జాతీయ పాఠ్యాంశాల ముసా యిదా కోసం టెక్ ప్లాట్‌ఫారమ్‌లో అందుకున్న రాష్ట్ర పాఠ్యాంశాల ముసాయిదా నుంచి కమిటీ ఇన్పుట్లను తీసుకుంటుంది. అంతేగాక జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా తయారీలో వాటాదారులైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందుకున్న సలహాలతో పాటు ఎన్సీఈఆరీ్టకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, జనరల్ బాడీ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సమా వేశాల్లో సూచనలను చేర్చిన తర్వాత కమిటీ జాతీ య పాఠ్యాంశాల ఫ్రేమ్‌వర్క్‌లను ఖరారు చేస్తుంది. పలువురు సభ్యులు.. జాతీయ స్టీరింగ్ కమిటీకి భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కె.కస్తూరిరంగన్ నేతృత్వం వహిస్తుండగా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుత ఛాన్సలర్ మహేష్ చంద్ర పంత్, నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్ గోవింద్ ప్రసాద్ శర్మ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నజ్మా అక్తర్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి వైస్–ఛాన్సలర్ టి వి కత్తిమణి, పద్మశ్రీ మిచెల్ డానినో, జమ్మూ ఐఐఎం చైర్పర్సన్ మిలింద్ కాంబ్లే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జగ్బీర్ సింగ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ గణిత శాస్త్రవేత్త మంజుల్ భార్గవ, ఎన్ఈపీ–2020 డ్రాఫ్ట్ కమిటీ సభ్యుడు ఎంకె శ్రీధర్, మాజీ ఐఏఎస్ అధికారి ధీర్ జింగ్రాన్, ఏక్ స్టెప్ ఫౌండేషన్ సీఈఓ శంకర్ మరువాడలు సభ్యులుగా వ్యవహరించనున్నారు. -
చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం
బెంగళూర్ : చంద్రయాన్ 3 మిషన్‌కు శ్రీకారం చుట్టామని, పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఇస్రో చీఫ్ కే శివన్ బుధవారం వెల్లడించారు. చంద్రమండలానికి మానవ మిషన్‌ను ఇస్రో చేపట్టే ప్రయత్నాలపై ఆయన స్పందిస్తూ ఇది ఇప్పటికిప్పుడే సాధ్యం కాకున్నా ఏదోఒక రోజు ఇది సాకారమవుతుందని అన్నారు. ఇక చంద్రయాన్ 3 ల్యాండర్, క్రాఫ్ట్ ఖర్చు దాదాపు రూ 250 కోట్లు కాగా, లాంఛ్‌కు రూ 350 కోట్ల వ్యయమవుతుందని శివన్ వెల్లడించారు. చంద్రయాన్–2లో మాదిరిగానే చంద్రయాన్–3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్–2లో ఆర్బిటర్ మిషన్ జీవితకాలం 7 సంవత్సరాలని, చంద్రయాన్–3లోనూ దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. మరోవైపు గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములు ఈ మాసాంతానికి శిక్షణ నిమిత్తం రష్యా వెళతారని చెప్పారు. 1984లో రాకేష్ శర్మ రష్యన్ మాడ్యూల్లో అంతరిక్షంలోకి వెళ్లగా, ఈసారి భారత వ్యోమగాములు దేశీ మాడ్యూల్లోనే భారత్ నుంచి వెళతారని ఆయన తెలిపారు. చదవండి : వాళ్ల వివరాలు రహస్యంగా ఉంచిన ఇస్రో -
హత్తుకోవాల్సిన క్షణాలు
సందర్భం పద్నాలుగేళ్ల అరణ్యవాసం ఖరారైంది. రామచంద్రుడు అయోధ్యను వదిలి, రాజ ప్రసాదాన్ని వదిలి, సకల ఐశ్వర్యాలను వదిలి, తల్లిదండ్రుల సన్నిధిని వదిలి, కన్నబిడ్డల వంటి ప్రజలను వదిలి సీతా సమేతంగా నారబట్టలతో బయలుదేరాలి. మొదటి శోకం ఎవరికి? దశరథుడికి. తన ప్రియమైన కుమారుడు... నీలమేఘ శ్యాముడు తనకు దూరమవుతున్న సమయంలో ఆ తండ్రికి కావలసింది ఏమిటి? ఓదార్పు మాటలా? తుది పలుకులా? చేయి ఊపుతూ కనుమరుగయ్యే రూపమా?కాదు. ఒక్క హత్తుకోదగ్గ క్షణం. గుండెలకు హత్తుకోవాల్సిన క్షణం. శ్రీరాముణ్ణి మనసారా హత్తుకుని ఆ స్పర్శను దాచుకోవాలన్న ఆతృత. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నతండ్రికి కొడుకు గుండెలకు హత్తుకొని ధైర్యం చెప్పడమే అప్పుడు కావాలసింది. రాముడు ఇవ్వగలిగింది కూడా అదే. యుద్ధం చేయలేనని విల్లంబులు పారేసిన అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు లేవదీసి కావలించుకోలేదు. అక్కడే నిలబెట్టి గీతాసారం చెప్పాడు. కర్తవ్యబోధ చేశాడు. కాని కురుక్షేత్రంలో, కపట పన్నాగంలో, పసికూన అయిన అభిమన్యుడిని పద్మవ్యూహంలో చుట్టుముట్టి ఏకదాడి చేసి వధించినప్పుడు కడుపుకోతతో విలపించిన అభిమన్యుడికి కావలసింది బోధ కాదు. మాయ కాదు. మాట కూడా కాదు. ఒక్క ఆలింగనం. గుండెలకు హత్తుకుని మౌనంగా వెన్నుతట్టే స్పర్శ. కృష్ణుడు కచ్చితంగా ఆ సమయంలో ఆ చికిత్సను అందించి ఉంటాడు. శాస్త్రవేత్తల మధ్య శివన్ ఎవరూ వెళ్లని, ఒక్కరూ తొంగి చూడటానికి ఇష్టపడని, ఆర్తనాదాలకు చెవి ఒగ్గని కుష్టువ్యాధిగ్రస్తుల వాడలలోకి ఏసుక్రీస్తు అడుగుపెట్టి అక్కడ తారసపడిన మొదటి కుష్టువాడికి ఇచ్చింది రొట్టెముక్కా కాదు.. మంచినీరూ కాదు. ఒక మానవుడికి సాటి మానవుడి మీద నమ్మకం కుదిర్చే కావలింతే. ఏసుప్రభువును హత్తుకుని ఆ కుష్టువ్యాధిగ్రస్తుడు రాల్చిన ఆశ్రువుల వందల ఏళ్ల మానవ దాష్టికాలకు ఆనవాళ్లు. అతనికి కుష్టు మాయమయ్యింది. ఒక సరైన ధైర్యస్పర్శ దొరికితే ఆత్మవిశ్వాసం బలపడి తమ సమస్యలను తాము దూరం చేసుకునే శక్తిపొందుతారు మనుషులు. మరల ప్రయత్నించడానికి ప్రయత్నిస్తారు మనుషులు. దగ్గరకు తీసుకోవడమే ధైర్యం చెప్పడం. ఎదుటివారు గెలిచినప్పుడు భుజాల మీదకు ఎక్కించుకోవచ్చు. ఓడినప్పుడు మాత్రం కచ్చితంగా గుండెలకు హత్తుకోవాలి. గుండెలకే హత్తుకోవాలి. పురుషోత్తముణ్ణి అలెగ్జాండర్ జయించాక సంకెలలో బంధించి దర్బార్‌లోకి తీసుకొచ్చి నిలబెట్టి అడుగుతాడు– ‘నేను నిన్ను ఇప్పుడు ఎలా చూడమంటావ్?’ అని. మహా యుద్ధం చేసి, విఫలుడయ్యి, ఓటమిని అంగీకరించినప్పటికి, పౌరుషం ఆత్మాభిమానం నశించని పురుషోత్తముడు ‘ఒక చక్రవర్తి సాటి చక్రవర్తిని ఎలా చూస్తాడో అలాగే చూడు’ అని సమాధానం చెప్పాడు. అటువంటి ధీరోదాత్తుడికి అలెగ్జాండర్ స్వేచ్ఛను ప్రసాదించి తన ప్రతినిధిగా నియమించాడు... సరే దానికంటే ముందు అతడు సన్మానించింది తన ఆలింగనం తోటే. బక్క పలుచటి గుప్పెడంత మనిషి మదర్ థెరిస్సా. తన దగ్గర ఒక్క రూపాయి లేకున్నా మహా మహా ఐశ్వర్యవంతుల కంటే ఐశ్వర్యవంతురాలామె. కారణం చేతులు సాచి అన్నార్తులను, అదృష్ట హీనులను, అనారోగులను గుండెలకు హత్తుకోగల ఐశ్వర్యం ఆమె వద్ద ఉంది. పుత్రోత్సాహం ఎప్పుడు కలగాలో సుమతీ శతకకారుడు చెప్పాడు. కొడుకు ఉన్నది తండ్రికి పుత్రోత్సాహం కలిగించడానికే అన్న బరువు పెట్టాడు. కాని ఆగిన కొడుకును, ఓడిన కొడుకును, ఎదురు దెబ్బ తిన్న కొడుకును, ఒక్క మార్కు తక్కువ తెచ్చుకున్న కొడుకును, ఒక్క సబ్జెక్ట్ ఫెయిలైన కొడుకును, తెలియక ఒక్క తప్పు చేసి బెదిరి ఉన్న కొడుకును దగ్గరకు తీసుకొని, గుండెలకు హత్తుకుని, భరోసా ఇచ్చి, ట్రై అగైన్ చెప్పేవాడే గొప్ప తండ్రి. అలాంటి తండ్రిని చూసి కొడుక్కు పిత్రోత్సాహం కలుగుతుంది అని చెప్పి ఉంటే బాగుండేది. ఇంట్లో ఇల్లాలు ఉంటుంది. ఆమె వంట చేస్తూ ఉంటుంది. ఇంటిని కనిపెట్టుకుని ఉంటుంది. తనను తాను కోల్పోయి భర్తా పిల్లలకు తన జీవితాన్ని ఇచ్చి ఉంటుంది. ఆమెను ఎప్పుడైనా ఒకసారి నిర్మోహంగా హత్తుకుని కృతజ్ఞత ప్రకటించి హృదయం నుంచి హృదయానికి గౌరవాన్ని ప్రసారం చేయాలని భర్త ఒక్కనాడూ ఆలోచించడు. సోదరుడు ఊరుగాని ఊరిలో ఉంటాడు. ఏవో కంప్లయింట్స్‌తో మాటా పలుకూ లేకుండా ఉంటాడు. ఒక్కసారి వెళ్లి, చూసి, దగ్గరకు తీసుకొని, ఆలింగనం చేసుకుంటే ఆ బంధం ఎంత ఆనందభరితం అవుతుంది. కాలూ చేయీ ఆడటం ఆగిపోతే ప్రాణం పోదు. గుండె ఆగినప్పుడే ప్రాణం పోతుంది. ఆ గుండెకు ప్రాణం ఉన్నప్పుడే ప్రాణం ఉన్న మరో గుండెను తాకించి బంధాన్ని బలపరుచుకోవాలి. భరోసాను ఇచ్చి పుచ్చుకోవాలి. గెలిచినప్పుడు భుజాల మీదకు ఎక్కించుకోవచ్చు. కానీ ఓడినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుండెలకు హత్తుకోవాలి. గుండెతోనే మాట్లాడాలి. వివక్షను ఎదుర్కొంటున్నవారిని, పీడనను ఎదుర్కొంటున్నవారిని, ద్వేషాన్ని ఎదుర్కొంటున్నవారిని, ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్నవారిని, ఈ సమాజంపై, వ్యవస్థపై, సాటి మనిషి పై విశ్వాసం కోల్పోయి కుంగుబాటులో ఉన్నవారిని గుండెలకు హత్తుకోవడం, దగ్గరకు తీసుకోవాల్సిన బాధ్యతను గుర్తెరగడం, వారి కోసమై మొదటి అడుగు వేయడం అసలైన సంస్కారం. ముందుకు చేయవలసిన ప్రయాణం. ఒక మనిషి మరో మనిషిని ఆలింగనం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన రసాయనాలు శరీరంలో ఊరి మేలు చేస్తాయని పరిశోధనలో తేలింది. రక్తసరఫరాను క్రమబద్ధీకరిస్తుందని సరఫరా అయ్యింది. కుంగుబాటులో, వైఫల్యంలో ఉన్న మనిషిని క్రమం తప్పకుండా 21 రోజుల పాటు కనీసం 21 సెకండ్ల పాటు ఆలింగనం చేసుకోగలిగితే ఆ మనిషి కోలుకుని తనను తాను కూడగట్టుకొని ముందుకు నడుస్తాడని అమెరికాలో నిరూపించారు. నమస్కారాలు, షేక్హ్యాండ్లు కేవలం పైపూత మందులు. హత్తుకోవాల్సిన వేళ దగ్గరకు తీసుకుని హత్తుకొని ఇచ్చే దిలాసాయే అసలైన చికిత్స. అటువంటి చికిత్సలో మనందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోవాలని ఆశిద్దాం. – కె. -
ప్రభుత్వమే నిర్ణయించాలి
మానవసహిత అంతరిక్ష ప్రయోగంపై ఇస్రో చీఫ్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి హాజరు సాక్షి, హైదరాబాద్: మానవసహిత అంతరిక్ష ప్రయోగం ఎప్పుడు జరగాలని నిర్ణయించాల్సింది ఈ దేశ ప్రజలు, ప్రభుత్వమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ ఎ.ఎస్.కిరణ్ కుమార్ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలను మానవ సమాజాభివృద్ధికి మెరు గ్గా ఉపయోగించుకోవాలన్నదే ఇస్రో లక్ష్యమన్నారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 15వ వార్షికోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిరణ్ కుమార్ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. శాస్త్రవేత్తలైనా, ఆధ్యాత్మికవేత్తలైనా ఇద్దరి లక్ష్యం సత్యాన్వేషణేనని చెప్పారు. దాదాపు వందేళ్ల క్రితమే వివేకానందుడి ఆలోచనల ఫలితంగా బెంగళూరులో దేశం గర్వించదగ్గ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పడిందని... అక్కడ చదివిన విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధావన్ వంటి మహామహులు ఇస్రోకు ప్రాణం పోశారని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న పరిశోధనలను గమనిస్తే ప్రతిసృష్టితోపాటు ప్రకృతి వైపరీత్యాలను అధిగమించడం కష్టం కాకపోవచ్చన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు జ్ఞానానంద మహారాజ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డెరైక్టర్ వి.కె.గాడ్గిల్ తదితరులు పాల్గొన్నారు.