చంద్రయాన్–2 ప్రయోగం చివరి క్షణంలో ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కోల్పోయిన క్షణాన ఉద్వేగానికి గురైన ఇస్రో చీఫ్ శివన్‌ను గుండెలకు హత్తుకొని ఓదార్చిన ప్రధాని మోడీ
సందర్భం
పద్నాలుగేళ్ల అరణ్యవాసం ఖరారైంది. రామచంద్రుడు అయోధ్యను వదిలి, రాజ ప్రసాదాన్ని వదిలి, సకల ఐశ్వర్యాలను వదిలి, తల్లిదండ్రుల సన్నిధిని వదిలి, కన్నబిడ్డల వంటి ప్రజలను వదిలి సీతా సమేతంగా నారబట్టలతో బయలుదేరాలి. మొదటి శోకం ఎవరికి? దశరథుడికి. తన ప్రియమైన కుమారుడు... నీలమేఘ శ్యాముడు తనకు దూరమవుతున్న సమయంలో ఆ తండ్రికి కావలసింది ఏమిటి? ఓదార్పు మాటలా? తుది పలుకులా? చేయి ఊపుతూ కనుమరుగయ్యే రూపమా?కాదు.
ఒక్క హత్తుకోదగ్గ క్షణం. గుండెలకు హత్తుకోవాల్సిన క్షణం. శ్రీరాముణ్ణి మనసారా హత్తుకుని ఆ స్పర్శను దాచుకోవాలన్న ఆతృత. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నతండ్రికి కొడుకు గుండెలకు హత్తుకొని ధైర్యం చెప్పడమే అప్పుడు కావాలసింది. రాముడు ఇవ్వగలిగింది కూడా అదే.
యుద్ధం చేయలేనని విల్లంబులు పారేసిన అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు లేవదీసి కావలించుకోలేదు. అక్కడే నిలబెట్టి గీతాసారం చెప్పాడు. కర్తవ్యబోధ చేశాడు. కాని కురుక్షేత్రంలో, కపట పన్నాగంలో, పసికూన అయిన అభిమన్యుడిని పద్మవ్యూహంలో చుట్టుముట్టి ఏకదాడి చేసి వధించినప్పుడు కడుపుకోతతో విలపించిన అభిమన్యుడికి కావలసింది బోధ కాదు. మాయ కాదు. మాట కూడా కాదు. ఒక్క ఆలింగనం. గుండెలకు హత్తుకుని మౌనంగా వెన్నుతట్టే స్పర్శ. కృష్ణుడు కచ్చితంగా ఆ సమయంలో ఆ చికిత్సను అందించి ఉంటాడు.
శాస్త్రవేత్తల మధ్య శివన్
ఎవరూ వెళ్లని, ఒక్కరూ తొంగి చూడటానికి ఇష్టపడని, ఆర్తనాదాలకు చెవి ఒగ్గని కుష్టువ్యాధిగ్రస్తుల వాడలలోకి ఏసుక్రీస్తు అడుగుపెట్టి అక్కడ తారసపడిన మొదటి కుష్టువాడికి ఇచ్చింది రొట్టెముక్కా కాదు.. మంచినీరూ కాదు. ఒక మానవుడికి సాటి మానవుడి మీద నమ్మకం కుదిర్చే కావలింతే. ఏసుప్రభువును హత్తుకుని ఆ కుష్టువ్యాధిగ్రస్తుడు రాల్చిన ఆశ్రువుల వందల ఏళ్ల మానవ దాష్టికాలకు ఆనవాళ్లు. అతనికి కుష్టు మాయమయ్యింది. ఒక సరైన ధైర్యస్పర్శ దొరికితే ఆత్మవిశ్వాసం బలపడి తమ సమస్యలను తాము దూరం చేసుకునే శక్తిపొందుతారు మనుషులు. మరల ప్రయత్నించడానికి ప్రయత్నిస్తారు మనుషులు.
దగ్గరకు తీసుకోవడమే ధైర్యం చెప్పడం. ఎదుటివారు గెలిచినప్పుడు భుజాల మీదకు ఎక్కించుకోవచ్చు. ఓడినప్పుడు మాత్రం కచ్చితంగా గుండెలకు హత్తుకోవాలి. గుండెలకే హత్తుకోవాలి.
పురుషోత్తముణ్ణి అలెగ్జాండర్ జయించాక సంకెలలో బంధించి దర్బార్‌లోకి తీసుకొచ్చి నిలబెట్టి అడుగుతాడు– ‘నేను నిన్ను ఇప్పుడు ఎలా చూడమంటావ్?’ అని. మహా యుద్ధం చేసి, విఫలుడయ్యి, ఓటమిని అంగీకరించినప్పటికి, పౌరుషం ఆత్మాభిమానం నశించని పురుషోత్తముడు ‘ఒక చక్రవర్తి సాటి చక్రవర్తిని ఎలా చూస్తాడో అలాగే చూడు’ అని సమాధానం చెప్పాడు. అటువంటి ధీరోదాత్తుడికి అలెగ్జాండర్ స్వేచ్ఛను ప్రసాదించి తన ప్రతినిధిగా నియమించాడు... సరే దానికంటే ముందు అతడు సన్మానించింది తన ఆలింగనం తోటే.
బక్క పలుచటి గుప్పెడంత మనిషి మదర్ థెరిస్సా. తన దగ్గర ఒక్క రూపాయి లేకున్నా మహా మహా ఐశ్వర్యవంతుల కంటే ఐశ్వర్యవంతురాలామె. కారణం చేతులు సాచి అన్నార్తులను, అదృష్ట హీనులను, అనారోగులను గుండెలకు హత్తుకోగల ఐశ్వర్యం ఆమె వద్ద ఉంది.
పుత్రోత్సాహం ఎప్పుడు కలగాలో సుమతీ శతకకారుడు చెప్పాడు. కొడుకు ఉన్నది తండ్రికి పుత్రోత్సాహం కలిగించడానికే అన్న బరువు పెట్టాడు. కాని ఆగిన కొడుకును, ఓడిన కొడుకును, ఎదురు దెబ్బ తిన్న కొడుకును, ఒక్క మార్కు తక్కువ తెచ్చుకున్న కొడుకును, ఒక్క సబ్జెక్ట్ ఫెయిలైన కొడుకును, తెలియక ఒక్క తప్పు చేసి బెదిరి ఉన్న కొడుకును దగ్గరకు తీసుకొని, గుండెలకు హత్తుకుని, భరోసా ఇచ్చి, ట్రై అగైన్ చెప్పేవాడే గొప్ప తండ్రి. అలాంటి తండ్రిని చూసి కొడుక్కు పిత్రోత్సాహం కలుగుతుంది అని చెప్పి ఉంటే బాగుండేది.
ఇంట్లో ఇల్లాలు ఉంటుంది. ఆమె వంట చేస్తూ ఉంటుంది. ఇంటిని కనిపెట్టుకుని ఉంటుంది. తనను తాను కోల్పోయి భర్తా పిల్లలకు తన జీవితాన్ని ఇచ్చి ఉంటుంది. ఆమెను ఎప్పుడైనా ఒకసారి నిర్మోహంగా హత్తుకుని కృతజ్ఞత ప్రకటించి హృదయం నుంచి హృదయానికి గౌరవాన్ని ప్రసారం చేయాలని భర్త ఒక్కనాడూ ఆలోచించడు. సోదరుడు ఊరుగాని ఊరిలో ఉంటాడు. ఏవో కంప్లయింట్స్‌తో మాటా పలుకూ లేకుండా ఉంటాడు. ఒక్కసారి వెళ్లి, చూసి, దగ్గరకు తీసుకొని, ఆలింగనం చేసుకుంటే ఆ బంధం ఎంత ఆనందభరితం అవుతుంది.
కాలూ చేయీ ఆడటం ఆగిపోతే ప్రాణం పోదు. గుండె ఆగినప్పుడే ప్రాణం పోతుంది. ఆ గుండెకు ప్రాణం ఉన్నప్పుడే ప్రాణం ఉన్న మరో గుండెను తాకించి బంధాన్ని బలపరుచుకోవాలి. భరోసాను ఇచ్చి పుచ్చుకోవాలి.
గెలిచినప్పుడు భుజాల మీదకు ఎక్కించుకోవచ్చు. కానీ ఓడినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుండెలకు హత్తుకోవాలి. గుండెతోనే మాట్లాడాలి.
వివక్షను ఎదుర్కొంటున్నవారిని, పీడనను ఎదుర్కొంటున్నవారిని, ద్వేషాన్ని ఎదుర్కొంటున్నవారిని, ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్నవారిని, ఈ సమాజంపై, వ్యవస్థపై, సాటి మనిషి పై విశ్వాసం కోల్పోయి కుంగుబాటులో ఉన్నవారిని గుండెలకు హత్తుకోవడం, దగ్గరకు తీసుకోవాల్సిన బాధ్యతను గుర్తెరగడం, వారి కోసమై మొదటి అడుగు వేయడం అసలైన సంస్కారం. ముందుకు చేయవలసిన ప్రయాణం.
ఒక మనిషి మరో మనిషిని ఆలింగనం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన రసాయనాలు శరీరంలో ఊరి మేలు చేస్తాయని పరిశోధనలో తేలింది. రక్తసరఫరాను క్రమబద్ధీకరిస్తుందని సరఫరా అయ్యింది. కుంగుబాటులో, వైఫల్యంలో ఉన్న మనిషిని క్రమం తప్పకుండా 21 రోజుల పాటు కనీసం 21 సెకండ్ల పాటు ఆలింగనం చేసుకోగలిగితే ఆ మనిషి కోలుకుని తనను తాను కూడగట్టుకొని ముందుకు నడుస్తాడని అమెరికాలో నిరూపించారు.
నమస్కారాలు, షేక్‌హ్యాండ్‌లు కేవలం పైపూత మందులు. హత్తుకోవాల్సిన వేళ దగ్గరకు తీసుకుని హత్తుకొని ఇచ్చే దిలాసాయే అసలైన చికిత్స. అటువంటి చికిత్సలో మనందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోవాలని ఆశిద్దాం.
– కె.
Comments
Please login to add a commentAdd a comment