వారం రోజులు పస్తులున్నాను: శివన్‌ | Inspiring Life Details Of K Sivan | Sakshi
Sakshi News home page

శివన్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు

Published Sat, Sep 7 2019 5:47 PM | Last Updated on Sat, Sep 7 2019 7:14 PM

Inspiring Life Details Of K Sivan - Sakshi

చెన్నై: ఈ రోజు సోషల్‌ మీడియా వేదికలన్నింటిలో ఓ ఫోటో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. చంద్రయాన్‌-2  ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో చీఫ్‌ శివన్‌ కంటతడి పెట్టారు. దాంతో మోదీ ఆయనను దగ్గరకు తీసుకుని ఓదారుస్తోన్న ఫోటో యావత్‌దేశాన్ని కదిలించింది. మిషన్‌ పట్ల ఎంత అంకిత భావం లేకపోతే.. అంతలా బాధపడతారు అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఈ ప్రయోగాన్ని శివన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించారు. కనుకే తొలిసారి ఏర్పడిన ఆటంకాన్ని కేవలం ఏడు రోజుల్లో సరి చేసి.. ప్రయోగాన్ని తిరిగి ప్రారంభించారు. ఆఖరి నిమిషంలో విఫలం కావడం బాధగా ఉన్నా అక్కడి దాకా చేరుకున్నామంటే అదంతా శివన్‌ కృషి వల్లే అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో శివన్‌ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ సమీపంలో మేళా సారకల్విలైలో జన్మించారు శివన్‌. అతని తల్లిదండ్రులు కైలాసవదీవానదార్, చెల్లమాల్. రైతు కుటుంబంలో జన్మించిన శివన్‌ పట్టుదలతో శ్రమించి  ఇస్రో చీఫ్‌గా ఎదిగారు. కాలేజీలో చేరే వరకు ధోతి ధరించి.. ఉత్త కాళ్లతోనే తిరిగారు. అయితే ఈ కష్టాలేవి ఆయనను లక్ష్యం నుంచి దూరం చేయలేదు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో శివన్‌ మాట్లాడుతూ.. ‘కోరుకున్నది నాకు ఎప్పుడు లభించలేదు.. దాని గురించి బాధ లేదు. నాకు దక్కిన వాటితో నేను సంతృప్తిగా ఉన్నాను’ అన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు..

చెప్పులు లేకుండా తిరిగే వాడిని
‘మా గ్రామంలో నేను చాలా ఆసక్తికర జీవితాన్ని గడిపాను. మా నాన్న వ్యవసాయం చేసేవారు. దాంతో స్కూల్‌ నుంచి రాగానే మేం పొలం వెళ్లేవాళ్లం. వేసవిలో మా నాన్న మామిడిపళ్ల వ్యాపారం చేసేవారు. మాకు స్కూల్‌ లేని రోజు మా నాన్న లేబర్‌ను పిలిచేవారు కాదు. మమ్మల్ని పొలం తీసుకెళ్లి పని చేయించేవారు. పొలం పనుల్లో సాయం చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజీలోనే నన్ను చేర్పించారు. కాలేజీలో చేరే వరకు ధోతినే ధరించేవాడిని. కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కావు. అయితే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడు పస్తులుంచలేదు. మూడు పూటలా కడుపు నిండా భోజనం పెట్టేవారు’ అన్నారు.

ఇంజనీరింగ్‌లో చేరడానికి వారం రోజులు పస్తులు
ఇక ఉన్నత చదువులు గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇంజనీరింగ్‌ చేయాలనుకున్నాను. కానీ అది చాలా ఖరీదైన కోర్సు కావడంతో మా నాన్న నన్ను బీఎస్సీ(బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌)లో చేరమన్నారు. నేను దానికి అంగీకరించలేదు. మా నాన్న నిర్ణయం మార్చాలని వారం రోజుల పాటు తిండి తినడం మానేశాను. అయినా ఫలితం లేదు. చివరకు నా నిర్ణయాన్నే మార్చుకున్నాను. అలా బీఎస్సీ మ్యాథ్స్‌ పూర్తి చేశాను. నేను బాగా చదవడంతో మా నాన్నలో మార్పు వచ్చింది. అప్పుడాయన ‘ఒకప్పుడు నీకు నచ్చిన కోర్సులో చేరడానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడలా చేయాలనుకోవడం లేదు. నువ్వు కోరుకున్నట్లే ఇంజనీరింగ్‌లో చేరు’’ అన్నారని తెలిపారు శివన్‌.

‘నన్ను ఇంజనీర్‌గా చూడటం కోసం మా నాన్న భూమి కూడా అమ్మారు. అలా ఇంజనీరింగ్‌లో చేరాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తి చేశాను. కానీ నాకు వెంటనే ఉద్యోగం దొరకలేదు. ఇప్పటిలా అప్పట్లో ఎక్కువ ఉద్యోగాలు ఉండేవి కావు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌, నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో మాత్రమే ఉద్యోగాలు ఉండేవి. దాంతో ఉన్నత చదువుల కోసం ఐఐఎస్సీలో చేరాను’ అన్నారు. అయితే తన జీవితంలో తాను కోరుకుంది ఎప్పుడు దొరకలేదన్నారు శివన్‌.

‘నేను శాటిలైట్‌ సెంటర్‌లో చేరాలని భావించాను.. కానీ విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌లో చేరాల్సి వచ్చింది. అక్కడ కూడా ఏరోడైనమిక్స్‌లో జాయిన్‌ అవ్వాలనుకున్నాను. కానీ పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్ట్‌లో చేరాల్సి వచ్చింది. ఇలా ప్రతి చోటా నేను కోరుకున్నది నాకు లభించలేదు’ అన్నారు శివన్‌. తాను ఇష్ట పడింది లభించకపోవడంతో.. వచ్చిన దాన్నే ప్రేమించి ఉన్నతంగా ఎదిగారు శివన్‌.
(చదవండి: నా ప్రధాని మంచి మనస్సున్న మనిషి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement