Sivan
-
యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను..
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ చీఫ్ డాక్టర్ కె శివన్ తన మొదటి ప్రయత్నంలో అంతరిక్ష సంస్థలో జాబ్ పొందలేకపోయాయని 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (NIT) గోవా తొమ్మిదవ కాన్వకేషన్‌లో వెల్లడించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదువు పూర్తయిన తరువాత నేను టీచర్ అవ్వాలనుకున్నాను, అయితే అంతరిక్ష సంస్థకు ఛైర్మన్‌గా మారాను అంటూ గుర్తు చేసుకున్నారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం కోసం ఇస్రో కేంద్రానికి వెళితే అక్కడ యూజ్లెస్ ఫెలో.. నీకు జాబ్ రాదు.. గెట్ లాస్ట్ అన్నారని వెల్లడించాడు. ఇలా అనిపించుకున్న తరువాత, చివరకు అదే సెంటర్‌కు చైర్మన్ అయ్యానని చెప్పుకొచ్చాడు. మొదట శాటిలైట్ సెంటర్లో ఉద్యోగం రాకపోవడంతో రాకెట్ సెంటర్లో ఉద్యోగం సంపాదించి ఆ తరువాత అప్పటికే నాలుగు సార్లు విఫలమైన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యత తీసుకున్నప్పుడు స్నేహితులు, సన్నిహితులు నువ్వు పెద్ద మూర్ఖుడివి అంటూ విమర్శించారని వెల్లడించారు. ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొని జీఎస్ఎల్వీ ప్రాజెక్టును విజయవంతం చేసానని శివన్ చెప్పాడు. ఈ విజయం ఇస్రో కమ్యూనిటీకి కనపడేలా చేయడంతో ఇస్రో చైర్మన్ పదవి కూడా వరించిందని తెలిపాడు. నిజానికి నా జీవితంలో ఓ గొప్ప విషయం నేర్చుకున్నాను, అదేంటంటే.. మీరు ఎక్కడైనా విమర్శలకు, తిరస్కరణకు గురైతే తప్పకుండా మీ కోసం మరో గొప్ప అవకాశం మరొకటి వేచి ఉంటుందని శివన్ చెప్పారు. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? ఆ తరువాత చంద్రయాన్ 2 మిషన్ ప్రారంభమైంది. దీనిని 2019 జూలై 22న అంతరిక్షంలో పంపించారు, కానీ అది 2019 సెప్టెంబరు 7 విఫలమైనట్లు తెలిసింది. ఆ తరువాత చంద్రయాన్-3తో ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆమోదం లభించిందని చెప్పారు. డాక్టర్ కె శివన్ గురించి ఏప్రిల్ 1957లో కన్యాకుమారిలోని తారక్కన్‌విలై గ్రామంలో ఒక మామిడి రైతుకు జన్మించిన 'శివన్' పాఠశాల విద్యను తమిళ మాధ్యమ పాఠశాల నుంచి, ఆ తరువాత 1980లో మద్రాస్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ డిగ్రీ పూర్తి చేసాడు.1982లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొంది ఇస్రోతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. 2006లో ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డాక్టరల్ డిగ్రీ కూడా సొంతం చేసుకున్నాడు. ఈయన పీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి MkIII వంటి ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు. ఆ తరువాత 2022 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా ఎస్ సోమనాథ్ బాధ్యతలు స్వీకరించాడు. -
ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్ నియామకం
న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి చీఫ్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. విక్రంసారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్ జీఎస్ఎల్వీ ఎంకే-III లాంచర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. కొల్లాంలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె శివన్ పదవీ కాలం పూర్తయిన తర్వాత (జనవరి 12, 2022) ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థల్లో ఒకటైన ఇస్రోకి సోమనాథ్ అధిపతిగా వ్యవహరించనున్నారు. చదవండి: (యూపీలో బీజేపీకి భారీ షాక్.. 24 గంటల వ్యవధిలో..) -
EOS-03: సిద్ధమవుతున్న 'జీఎస్ఎల్వీ ఎఫ్10'
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 12న తెల్లవారుజామున 5.43 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ప్రయోగానికి సన్నద్ధం చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా కరోనా కారణంగా షార్‌లో ప్రయోగాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక పీఎస్ఎల్వీ ప్రయోగం తరువాత షార్ కేంద్రంలో కరోనా విజృంభించడంతో ప్రయోగాలకు బ్రేక్ పడింది. 2020లో నాలుగు సార్లు వాయిదా పడిన జీఎస్ఎల్వీ ఎఫ్10 ప్రయోగం ఐదో ప్రయత్నంలో విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేయనున్నారు. – సూళ్లూరుపేట కొత్త అధ్యాయానికి నాంది.. జీఎస్ఎల్వీ ఎఫ్10 (జీఎస్ఎల్వీ మార్క్2) రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–03) అనే ఈ నూతన ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి దాకా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు) భూమికి 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్థన ధృవ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. ఈసారి ఈవోఎస్–03 అనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రత్యేకతలు.. ► శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇది 79వ ప్రయోగం. ► జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల సిరీస్‌లో 14వ ప్రయోగం. ► సొంత క్రయోజనిక్ టెక్నాలజీలో ఇది 8వ ప్రయోగం. ► దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్–03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ► ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (6 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్ఫ్రారెడ్ (158 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ షార్ట్ వేవ్–ఇన్ఫ్రారెడ్ (256 బాండ్స్) పేలోడ్స్‌గా అమర్చారు. ► ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపిస్తుంది. సుమారు 10 సంవత్సరాలు ఈ ఉపగ్రహం తన సేవలను అందిస్తుంది. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-49
-
ఇస్రో ఎన్నటికీ ప్రైవేటుపరం కాదు: శివన్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రైవేటుపరం చేయనున్నారనే వార్తలను సంస్థ చైర్మన్ కె.శివన్ కొట్టిపారేశారు. ఇస్రో ప్రైవేటీకరణ ఎన్నటికీ జరగబోదని స్పష్టం చేశారు. అంతరిక్ష పరిశోధనా కార్యకలాపాల్లో అంకుర సంస్థలను (ప్రైవేటు సంస్థలు) భాగస్వామ్యం చేయడమే సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సెక్టార్‌లోకి ప్రైవేటు సంస్థలను అనుమతిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ జూన్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇస్రోను ప్రైవేటికరించనున్నారనే కోణంలో అనేక సందేహాలు తలెత్తాయి. (అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ మంచిదే: శివన్) ఈ విషయం గురించి గురువారం ఓ వెబినార్‌లో మాట్లాడిన ఇస్రో చైర్మన్ శివన్.. కేంద్రం తీసుకురానున్న సంస్కరణలు భారత అంతరిక్ష రంగంలో సరికొత్త మార్పులకు నాంది పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇస్రో కార్యకలాపాలు, పరిశోధనలు మరింతగా పెరుగుతున్నాయన్న ఆయన.. గతంలో కంటే మెరుగ్గా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సంస్థ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనేవి కేవలం అపోహలు మాత్రమేనని.. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా విధివిధానాలు ఉంటాయని స్పష్టం చేశారు. సంస్కరణల్లో భాగంగా.. ప్రైవేటు కంపెనీలు, భారత ప్రభుత్వ అంతరిక్ష సంబంధిత సాంకేతికత, ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను వాడుకునేందుకు వీలుగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్(ఐఎన్–ఎస్ పీఏసీఈ) ఏర్పాటు జరుగనుందని తెలిపారు. -
అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ మంచిదే: శివన్
న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చైర్మన్ కె.శివన్ గురువారం స్వాగతించారు. ‘ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను యువత వినియోగించుకుంటుందని భావిస్తున్నా. ఇప్పటికే కొన్ని స్టార్టప్ కంపెనీలు మమ్మల్ని సంప్రదించాయి. గ్లోబల్ స్పేస్ ఎకానమీకి ఇండియా హబ్ గా మారుతుందని బలంగా నమ్ముతున్నా. అంతరిక్ష సంబంధిత విషయాలు పాలుపంచుకునేందుకు ప్రైవేటు కంపెనీలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. (గూగుల్ పే సేవలపై ఆర్బీఐ స్పష్టత) అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతిస్తూ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్(ఐఎన్–ఎస్ పీఏసీఈ)ను ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చింది. ఇది ప్రైవేటు కంపెనీలకు, భారత ప్రభుత్వ అంతరిక్ష సంబంధిత ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను వాడుకునేందుకు అనుమతులు జారీ చేస్తుంది. (పాప్‌కార్న్ కొనాలంటే చుక్కలే!) ఐఎస్ఎస్పీఏసీఈను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని శివన్ వెల్లడించారు. ఇస్రో అన్ని రకాలుగా కొత్త సంస్థకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. కొత్త సంస్కరణలు భారత అంతరిక్షంలో ఇస్రో పాత్రను తగ్గించవని పేర్కొన్నారు. ‘ఇస్రో ప్రయోగాలు నడుస్తూనే ఉంటాయి. ఆర్ అండ్ డీ, వేరే గ్రహాలపైకి ప్రయోగాలు, మానవ సహిత అంతరిక్ష యాత్రలు తదితరాలు ఎప్పటిలానే ఉంటాయి’ అని తెలిపారు. -
వచ్చే ఏడాది చంద్రయాన్–3
బెంగళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 ప్రయోగంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) బుధవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది(2021)లో చంద్రయాన్–3 ప్రయోగాన్ని చేపట్టే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. ఇక మరో ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందడానికి భారత వాయు సేనకు చెందిన నలుగురు సిబ్బందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. జనవరి మూడో వారంలో వీరికి రష్యాలో శిక్షణ ప్రారంభంకానున్నట్లు చెప్పారు. చంద్రయాన్–3 ప్రాజెక్టుతోపాటు మొట్టమొదటి భారతదేశ మానవ సహిత గగన్‌యాన్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివన్ వెల్లడించారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని 2020లోనే చేపడతామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఇస్రో నుంచి ప్రకటన రావడం గమనార్హం. చంద్రయాన్–2లో మాదిరిగానే చంద్రయాన్–3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్–2లో ఆర్బిటర్ మిషన్ జీవితకాలం 7 సంవత్సరాలని, చంద్రయాన్–3లోనూ దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. చంద్రయాన్–2 ప్రయోగంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చంద్రయాన్–3పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. చంద్రయాన్–2 కంటే చంద్రయాన్–3 ప్రయోగానికి తక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ ప్రయోగానికి రూ.250 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేశారు. తమ ప్రయోగాలకు 2020–21 సంవత్సర బడ్జెట్లో రూ.14 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇస్రో విజ్ఞప్తి చేసింది. 2020లో 25 ప్రయోగాలు ప్రస్తుత ఏడాదిలో ఇస్రో సుమారు 25 వరకు ప్రయోగాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించిందని శివన్ వివరించారు. 2019లో పూర్తిచేయని ప్రయోగాలను ఈ ఏడాది మార్చి కల్లా చేపడతామని అన్నారు. వేగంలోనే విఫలం వేగాన్ని నియంత్రించే వ్యవస్థ విఫలమవడంతో చంద్రయాన్–2లోని విక్రమ్ ల్యాండర్ వైఫల్యానికి కారణమని శివన్ వివరించారు. అంతర్గత కారణాల వల్లే వేగాన్ని నియంత్రించే వ్యవస్థ వైఫల్యం చెందిందని వెల్లడించారు. ఇక విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనుగొనడంలో సాయపడిన చెన్నైకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను శివన్ అభినందించారు. క్రాష్ ల్యాండింగ్ అయిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలను బయటకు విడుదల చేయకూడదన్నది సంస్థ పాలసీ అని తెలిపారు. త్వరలోనే ఇస్రో టెలివిజన్ చానెల్‌ను ఆవిష్కరించనున్నట్లు శివన్ తెలిపారు. -
చంద్రయాన్ 3 పై ఇస్రో అధికారిక ప్రకటన
-
ప్లూట్ వాయిద్యంతో అదరగొట్టిన ఇస్రో డైరెక్టర్
బెంగుళూరు : ఇస్రో అధికారులు ఎల్లప్పుడు అంతరిక్షంలోకి శాటిలైట్లను, రాకెట్లను పంపే పనిలో బిజీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశ ముగింపు కార్యక్రమాన్ని ఒక సీనియర్ అధికారి తన ప్లూట్ పరికరంతో సంగీతం వినిపించి ముగించారు. వివరాల్లోకి వెళితే.. ప్రతి ఏడాది చివరలో బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వహిస్తుంటారు. ఇస్రో చైర్మన్ కె. శివన్ ఆధ్వర్యంలో ఈసారి కూడా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కార్యక్రమం చివర్లో ఇస్రో డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ పి. కున్హికృష్ణన్ తన వెంట తెచ్చుకున్న ప్లూట్ పరికరంతో 'వాతాపి గణపతిం భజే' పాటను అందరికి వినిపించారు. .అయితే ఈ వీడియోనూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ' స్వతహాగా ప్రొఫెషనల్ ప్లూట్ వాయిద్యకారుడైన ఇస్రో డైరక్టర్ పి. కున్హికృష్ణన్ ఈరోజు తన ప్లూట్‌తో మ్యాజిక్ చేశారు. ఆయన 'వాతాపి గణపతిం భజే' పాటను వినిపించి ఇస్రో పార్లమెంటరీ సమావేశాన్ని ముగించడం నాకు ఆనందం కలిగించింది. ఆ సమయంలో పార్లమెంటరీ సమావేశం కాస్తా ఒక సంగీత విభావిరి కేంద్రంగా మారిందంటూ' ట్వీట్ చేశారు. The Parliamentary Standing Committee ended it's last meeting at ISRO with a flute performance by the Director of its Satellite Centre in Bengaluru, P. Kunhikrishnan, who is also a professional flute player! He played the evergreen Vatapi Ganapatim Bhaje. Sharing a snippet. pic.twitter.com/AkwwPh9oZY — Jairam Ramesh (@Jairam_Ramesh) December 29, 2019 -
ప్లాటినం షార్, శాస్త్రవేత్తల సంబురాలు
సాక్షి, సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ-48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. అయిదేళ్లపాటుసేవలు అందించనున్న ఈ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మరోవైపు రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. పీఎస్ఎల్వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్–0129, ఆరు ఐహోప్‌శాట్ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్–సార్, ఇటలీకి చెందిన తైవాక్–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. రిశాట్-2బీఆర్1 ఉపగ్రహం.. వ్యవసాయం, అటవీ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఉపయోగపడనుంది. గత మే 22న ప్రయోగించిన రిశాట్-2బీకి కొనసాగింపుగా దీన్ని ప్రయోగించారు. ఇక ఇస్రో ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ రాకెట్‌కు ప్రత్యేక స్థానమున్నది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఒకటిగా దీనికి పేరుంది. 49 ప్రయోగాల్లో కేవలం రెండు మాత్రమే విఫలమయ్యాయి. మూడో తరం లాంచ్ వెహికల్ అయిన పీఎస్ఎల్వీ.. చంద్రయాన్-1, మంగళ్యాన్ మిషన్లను విజయవంతం చేసింది. కాగా ఇప్పటివరకూ 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో... ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది. అంతేకాకుండా పీఎస్ఎల్వీ సిరీస్‌లో 50వ ప్రయోగానికి విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రాయన్-1,2, మంగళ్యాన్-1 వంటి గ్రహాంతర ప్రయోగాలకు వేదికిగా నిలిచింది. 2020లో గగన్‌యాన్‌కు సమాయత్తమవుతోంది. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని ప్రయోగాలు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మాట్లాడుతూ... ‘ ఈ రోజు చారిత్రాత్మకమైన 50వ పీఎస్ఎల్వీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించాం. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. 26 సంవత్సరాల పీఎస్ఎల్వీ రాకెట్ విజయాలలో ఎందరో శాస్త్రవేత్తల కృషి ఉంది. పీఎస్ఎల్వీని వివిధ రకాలుగా అభివృద్ధి చేశాం. భవిష్యత్‌లో ఎన్నో ప్రయోగాలకు ఇస్రో సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఓ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీఎస్ఎల్వీ ఆధునీకరణలో కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తల వివరాలను ఈ పుస్తకంలో సవివరంగా ప్రచురించారు. సీఎం వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సీ–48 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
నాసా ప్రకటనను వ్యతిరేకించిన శివన్
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ జాడలను కనిపెట్టామంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించడాన్ని ఇస్రో చైర్మన్ శివన్ వ్యతిరేకించారు. చంద్రయాన్-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ ఇంతకుముందే ఆ పని చేసిందని పేర్కొన్నారు. ‘ ఇస్రోకు చెందిన ఆర్బిటార్ విక్రమ్ ల్యాండర్ జాడను ఎప్పుడో కనిపెట్టింది. ఈ విషయాన్ని మేము మా వెబ్సైట్లో ప్రకటించాం కూడా. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి’ అని శివన్ అసహనం వ్యక్తం చేశారు. కాగా సెప్టెంబరు 7న ఇస్రో... చంద్రుడి ఉపరితలం పైకి పంపిన విక్రమ్ ల్యాండర్ జాడలను తాము గుర్తించినట్లు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ సాయపడటంతో విక్రమ్ పడిన ప్రాంతాన్ని, శకలాలను కనుగొన్నామని నాసా పేర్కొంది. (చదవండి: ఎట్టకేలకు ‘విక్రమ్’ గుర్తింపు) ఇక ఈ ఏడాది జూలై 22న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2 నింగికి ఎగిరిన విషయం విదితమే. నెలల ప్రయాణం తర్వాత సెప్టెంబర్‌లో జాబిల్లి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2 నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడి నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించింది. అయితే సెప్టెంబర్ 7న చివరిక్షణంలో విక్రమ్ ల్యాండర్‌తో సమాచార సంబంధాలు తెగిపోయాయి. నెమ్మదిగా ల్యాండ్ అవడానికి బదులు కొంత ఎత్తు నుంచి కుప్ప కూలిపోయినట్లు నాసా నిర్థారించింది. చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్‌ను నాసా అంతరిక్ష నౌక లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) గుర్తించిందని, వివరాల కోసం ఫొటోలు చూడాల్సిందిగా నాసా మంగళవారం ఒక ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ కూలిపోయిన పదిరోజులకు అంటే సెప్టెంబర్ 17న ఎల్ఆర్ఓ తీసిన కొన్ని ఛాయాచిత్రాలను నాసా విడుదల చేసింది. సెప్టెంబర్ 26న విడుదల చేసిన ఈ ఫొటోలను అదే ప్రాంతపు ఇతర ఫొటోలతో పోల్చి చూసి ల్యాండర్ జాడలను గుర్తించాలని నాసా ప్రజలను ఆహ్వానించింది. ఇందుకు స్పందించిన చెన్నై మెకానికల్ ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్ (33) తన ప్రయత్నం చేశారు. అయితే శివన్ మాత్రం నాసా ప్రకటనను ఖండించడం గమనార్హం. -
చంద్రయాన్–2తో కథ ముగియలేదు
న్యూఢిల్లీ: చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌లో విఫలమైన చంద్రయాన్ –2 తో కథ ముగియలేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు సన్నద్ధం అవుతోందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు. ఢిల్లీ ఐఐటీ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న శివన్ రాబోయే మరికొద్ది నెలల్లో మరింత అభివృద్ధి చెందిన అంతరిక్ష పరిశోధనలు చేయబోతున్నట్టు తెలిపారు. చంద్రయాన్–2 సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయాం. అయితే జాబిల్లి ఉపరితలంపై 300 మీటర్ల దూరం వరకు సాంకేతికంగా అన్ని వ్యవస్థలూ సరిగ్గానే పనిచేశాయి. చంద్రయాన్–2 నుంచి గుణపాఠాలను తీసుకుని భవిష్యత్‌లో సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని హామీ ఇస్తున్నానని శివన్ వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌లాంటి భవిష్యత్ ప్రణాళికలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ శివన్ చంద్రయాన్–2 తో కథ అంతంకాలేదనీ, ఆదిత్య ఎల్–1 సోలార్ మిషన్, మానవ స్పేస్‌ఫ్లైట్ ప్రోగ్రామ్స్ ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు. మీకు నైపుణ్యం, ఆసక్తి ఉన్న రంగంలో ఇష్టమైన కెరీర్‌ని ఎంచుకుని ముందుకుసాగాలని విద్యార్థులకు శివన్ సూచించారు. అయితే విజయం సాధించడమన్నది కేవలం అభిరుచిపైనే ఆధారపడి ఉండదనీ, విజయానికి అభిరుచి దోహదపడగలదని మాత్రమే గుర్తించాలని అన్నారు. -
లవ్ థ్రిల్లర్
కల్వకోట సాయితేజ, తరుణిక జంటగా తెరకెక్కిన చిత్రం ‘శివన్’. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్.ఆర్. సినీ ఎంటర్టైన్మెంట్పై వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. శివన్ మాట్లాడుతూ– ‘‘లవ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మా చిత్రం టీజర్లో కొంత బోల్డ్ కంటెంట్ ఉంది. అయితే ట్రైలర్ అలా లేదు, కొత్తగా కట్ చేశాం. నిర్మాత డి.ఎస్. రావుగారి పాత్ర ఓ హైలెట్. సాయితేజ మంచి హీరోగా ఎదుగుతాడు. తరుణిక బాగా నటించింది. మీరన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ప్రయోగాలు ప్రారంభమయ్యాయి: శివన్
అహ్మదాబాద్ : చంద్రయాన్- 2 ఆర్బిటార్ సమర్థవంతంగా పనిచేస్తోందని.. ఇప్పటికే ప్రయోగాలు ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చైర్మన్ కె.శివన్ అన్నారు. పేలోడ్ ఆపరేషన్లు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే విక్రమ్ ల్యాండర్ నుంచి మాత్రం సిగ్నల్స్ రాకపోవడం బాధించిందని.. ల్యాండర్ విఫలమవడానికి గల కారణాలను జాతీయ స్థాయి కమిటీ విశ్లేషిస్తుందని తెలిపారు. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి శివన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సూర్యుడిపై ప్రయోగాలకు సంబంధించిన మిషన్లపై ఇస్రో దృష్టిసారించిందని పేర్కొన్నారు. త్వరలోనే గగన్‌యాన్ ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు. అదే విధంగా చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే రాకెట్‌ను రూపొందించే అంశంపై ఇస్రో పనిచేస్తుందని తెలిపారు. కాగా ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్ ల్యాండర్ గల్లంతైంది. ఈ క్రమంలో విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకై ఇస్రో సహా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ల్యాండర్ విక్రమ్ కథ కంచికి చేరినట్లైంది. ఇక ఇస్రో వెబ్సైట్లో ఉన్న వివరాల మేరకు... చంద్రయాన్-2 ఆర్బిటార్‌లో ఉన్న ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నిజానికి ఆర్బిటార్ జీవితకాలం ఏడాది మాత్రమే అయినా.. ఇస్రో దాని జీవితకాలాన్ని పొడగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్బిటార్ ద్వారా.. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పలు వివరాల గురించి తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన త్రీడీ మ్యాపుల రూపకల్పన చేయవచ్చు. అదే విధంగా చంద్రుడి ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం, ఐరన్, సోడియం వంటి మూలకాల ఉనికిని గుర్తించేందుకు తోడ్పడడం వంటి మరెన్నో ప్రయోజనాలు కలిగి ఉంది. -
‘చంద్రయాన్-2 వందకు వంద శాతం సక్సెస్’
న్యూఢిల్లీ : ‘చంద్రయాన్-98 శాతం సక్సెస్’ అని ఇస్రో చైర్మన్ శివన్ చేసిన వ్యాఖ్యల్ని మాజీ శాస్త్రవేత్తలు తప్పుబడుతున్నారు. కీలకమైన ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయినా కూడా ప్రయోగం విజయవంతమైందని చెప్పడమేంటని ఆక్షేపిస్తున్నారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయిన సమయంలోనే చంద్రయాన్-2 ప్రయోగం 90 నుంచి 95 శాతం సక్సెస్ అయిందని చెప్పారని, విక్రమ్ పత్తా లేకుండా పోయినా మరో మూడు శాతం కలిపి ప్రయోగం 98 శాతం విజయవంతమైందని చెప్పడం దేనికి సంకేతమని విమర్శించారు. మరో నాలుగు రోజులు ఆగితే.. ‘చంద్రయాన్-2 వందకు వంద శాతం సక్సెస్’ అంటారని చురకలంటించారు. వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ముందుకు సాగాలని సూచించారు. అంతర్జాతీయ మీడియా మనల్ని గమనిస్తోందని, శివన్ అర్థవంతమైన ప్రకటనలు చేస్తే మంచిదని హితవు పలికారు. (చదవండి : విక్రమ్ ల్యాండర్ కథ కంచికి!) ఇక చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ల కథ దాదాపుగా ముగిసిపోయింది. చంద్రగ్రహంపై శుక్రవారం-శనివారం అర్ధరాత్రి మధ్య రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయ్యాయి. చంద్రగ్రహంపై రాత్రివేళ మైనస్ 180 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉంటుంది. అలాంటి ప్రతికూల వాతావరణంలో పనిచేసే విధంగా విక్రమ్ రూపొందలేదు. చంద్రుడిపై రాత్రి అంటే.. భూమిపై 14 రోజులకు సమానం. అక్కడ పగలు కూడా పద్నాలుగు రోజలుంటుంది. చంద్రుడిపై రాత్రి ప్రారంభం కావడంతోనే విక్రమ్ ల్యాండర్ పనిచేయడం ఆగిపోతుంది. పైగా, చంద్రుడిపై విక్రమ్ ‘హార్డ్ ల్యాండింగ్’ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సోలార్ ప్యానెళ్లు అనుకున్నరీతిలో సెట్‌కాకపోతే.. చార్జింగ్ అయిపోయే.. విక్రమ్ మూగబోయే అవకాశముంది. -
చంద్రయాన్-2 ముగిసినట్లే.. ఇక గగన్‌యాన్!
భువనేశ్వర్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. చంద్రయాన్-2 ప్రయోగం 98శాతం విజయం సాధించిందన్న ఇస్రో ఛైర్మన్ శివన్.. ఇక తమ తదుపరి లక్ష్యం గగన్‌యాన్ అని ప్రకటించారు. శనివారం ఆయన ఐఐటీ భువనేశ్వర్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్-2లోని ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని వివరించారు. ఇక విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం తాము ఎంతో శ్రమించామని కానీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. చంద్రుడి దక్షిణధ్రువంపై శుక్రవారం-శనివారం అర్ధరాత్రి మధ్య రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్‌తో మళ్లీ సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయిన విషయం తెలిసిందే. దీని నుంచి వెంటనే తేరుకున్న ఇస్రో ఇకతమ తదుపరి లక్ష్యం గగన్‌యాన్ అని స్పష్టం చేసింది. కాగా సాయుధ బలగాల్లోని టెస్ట్ పైలట్లను వ్యోమగాములుగా పంపాలని ఇస్రో భావిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టింది. ముగ్గురిని ఎంపిక చేసి తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. గగన్‌యాన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వయంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఈ ప్రయోగాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. విక్రమ్ ల్యాండర్ అసాధ్యమేనా.. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్ ల్యాండర్ గల్లంతైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది. చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్ ల్యాండర్.. అందులోని రోవర్ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. ఇక, 14 రోజుల తర్వాత పగటి సమయం మళ్లీ ప్రారంభమయ్యాక.. చంద్రయాన్-2 ఆర్బిటర్ మళ్లీ విక్రమ్ ల్యాండర్ కోసం వెతకనుంది. కానీ, అప్పటికీ విక్రమ్ దొరికే అవకాశాలు తక్కువేనని, మళ్లీ విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు ఏర్పరుచుకోవడం అసాధ్యమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
‘విక్రమ్’ చాంద్రాయణం చిరంజీవం!
‘‘చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వేగాన్ని తట్టుకుని దాని ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ ఆ వేగాన్ని అధిగమించలేక అమిత బలంతో చంద్రతలాన్ని ఢీకొని ఉంటుంది. ఫలితంగా చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’తో సంబం ధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాం.’’ – ఇస్రో ఛైర్మన్ కైలాసవదివు శివన్ ‘‘చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారిగా కాలూనడం కోసం భారత్ రోదసీ ప్రయోగ కేంద్రం చేసిన ప్రయోగం ప్రశంసనీయం. అంతరిక్ష ప్రయోగాలన్నవి చాలా సంక్లిష్టమైనవైనప్ప టికీ ‘ఇస్రో’ తాజా ప్రయోగం అద్భుతం. దీనితో భారత ఇంజనీరింగ్ వ్యవస్థ నైపుణ్యం, సామర్థ్యం ప్రపంచం మొత్తానికి వెల్లడయింది’’ – అమెరికా పత్రికలు ‘న్యూయార్క్ టైమ్స్’, ‘వాషింగ్టన్ పోస్ట్’ అనాదిగా చేతికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న జాబిల్లిని చేరడానికి, వీలైతే చేజిక్కించుకోవడానికి వేల సంవత్సరాలుగా మాన వులు పడుతున్న తపనను, శాస్త్రవేత్తలు పడుతున్న తపనను, పోటా పోటీలను, అందుకు అంగలు పంగలుగా వేస్తున్న పరుగుల్ని చూస్తూ వచ్చాం. అందుకోసం తొక్కిన పుంతలు, ఆరాటపడిన పాలపుం తలూ ఎన్నెన్నో విన్నాం. ఆ చందమామ కోసం పాటలతో ఆరాటప డుతూ పాటలు అల్లుకున్నాం, దాన్ని దించి పిల్లల చేతిలో అల్లారు ముద్దుగా పెడదామని కలలు కన్నాం. దానిపేరిట పిల్లలకు ‘గోరు ముద్దలు’ తినిపించాం. గోగుపూలు తెచ్చిపెట్టమని ఆవాహనం చేశాం. చివరికి ఈ అన్వేషణ ఎందాకా వెళ్లిందంటే– పాలుపోక శశి చాటున ‘నిశి’లో ముసలమ్మ రాట్నం వడుకుతున్నట్టుగా ఓ పాలు పోని కథలల్లి భువిలోని పిల్లలకు.. మొన్న అర్ధ శతాబ్దం క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ తొలి మానవులుగా చంద్రునిపై చంద్రమం డలాధిపతులుగా కాలుమోపే వరకూ అశాస్త్రీయమైన కుంటి సాకులు కథలుగానే చెబుతూ వచ్చాం. ఈ సందర్భంగా, అతి సామాన్య పేద వ్యవసాయ కుటుంబం నుంచి భారత రోదసీ పరిశోధనా శాస్త్రవేత్తగా ‘ఇస్రో’ అధినేత స్థాయికి ఎదిగివచ్చిన ప్రొఫెసర్ శివన్ ఆధ్వర్యంలో మన శాస్త్రవేత్తలు చంద్రయాన్–2 రోదసీ యాత్ర ద్వారా దాని ఆర్బి టర్ జీవితాన్ని ఉద్దేశించిన కాల వ్యవధి కన్నా మించి 6–7 సంవ త్సరాలు మనగలిగేటట్టు రూపొందించడం భారత విజ్ఞాన శాస్త్రం, ఇంజనీరింగ్ వ్యవస్థ సాధించిన ఘన విజయం. ఇదే సమయంలో, దేశంలో ఎలాంటి పాలనా వ్యవస్థ మనుగడ సాగించుకుంటున్న సమయంలో ఈ విజయం సాధ్యమయింది? దేశ నవీన విశ్వ విద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో, విద్యా వ్యవస్థలో, శాస్త్ర సాంకేతిక కేంద్రాలలో పురాణ కవిత్వాలు విన్పించడానికి ప్రయ త్నాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో, శరవేగాన విస్తరి స్తున్న ప్రకృతి పరిణామవాద సిద్ధాంతాల్ని, అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం, ఖగోళ విజ్ఞాన శాస్త్రాన్ని రోదసీ పరిశోధనలో మానవుడు సాధిస్తున్న విజయ పరంపరను గేలి చేస్తున్న కొందరు మూఢులు పాలనా వ్యవస్థలో తిష్ట వేసి ఉన్నప్పుడు, పాలనా వ్యవస్థలో చరిత్ర గతిని, దేశ ప్రగతిని పక్కదారులు తొక్కించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నప్పుడు.. మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అమోఘ ప్రయోగ వైచిత్రిలో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ పాలకుల్లో ఒకరు వేదాల పేరిట చార్లెస్ డార్విన్ పరిణామవాదాన్ని తిరస్కరిస్తాడు, మరొక పాలక మండలి సభ్యుడు స్టీఫెన్ హాకింగ్ ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని రూఢమైన ‘బ్లాక్‌హోల్స్ (నల్ల బిలాలు)’ సిద్ధాంత తారళ్యతనూ ప్రశ్నిస్తాడు. మరొక ముక్కలో చెప్పాలంటే చరిత్రను, చరిత్ర పాఠాల్ని న్యూనపరుస్తూ దేశ చరిత్రకు ‘సున్న’ చుట్టి మూఢ విశ్వాసాల వ్యాప్తికి పాఠ్య గ్రంథాల్లో పెద్దపీట వేయమంటాడు మరొక పాలకమండలి ‘విజ్ఞాని’! మరో పురాణ ‘విజ్ఞాని’ వినాయకుడికి ఏనాడో ‘ప్లాస్టిక్ సర్జరీ’ చేసినందున ఆ స్వరూపం వచ్చిందంటాడు. నిజానికి ఆరెస్సెస్–బీజేపీ ‘హిందూత్వ’ పాక్షిక మత రాజకీయాల ఫలితంగా పూర్వ వైదికంలోని మీమాంస పరిజ్ఞానం, ఉపనిషత్తులలోని ప్రశ్నోత్తర సంవాద సంప్రదాయాల ద్వారా అను మాన నివృత్తి అవకాశాలు కూడా నేటి భారతంలో అడుగంటిపోయి, మూఢత్వం చాటలతో చెలుగుతూ స్వైర విహారం చేస్తోంది. మాన వుణ్ణి తొలిసారిగా చరిత్రలో చంద్రాధినేతగా నిలిపినవారు తొలి అమె రికన్ ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1969 జూలై 20) కాగా, రోదసీలో కాలుమోపి, భూమిని చుట్టి జయించిన తొలి మానవుడు సోషలిస్టు సోవియట్ యూనియన్ పౌరుడైన యూరీ గగారిన్ (1961 ఏప్రిల్), ఆ పిమ్మట మేడం వలెంటీనా, అంతకుముందు రోదసీలో వాతావ రణ పరిస్థితులు జీవరాశిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో పరీక్షిం చడానికి సోవియట్ ‘లైకా’ (కుక్క)తో జరిపిన సఫల ప్రయోగమూ! ఆ వరసనే రోదసీ గుహ్వరంలోని పలు రకాల పాలపుంతలకు (గెలా క్సీలు), గ్రహరాశులకు మానవులు యాత్రలు జరపడానికి రకరకాల ప్రయత్నాలలో ఉన్నారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఎదురైన విచిత్ర అనుభవం! తొలిసారి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలూనడానికి బయలుదేరే ముందు భూమ్మీద జరిపిన శాస్త్ర ప్రయోగ, తర్ఫీదు విన్యాసాల సంద ర్భంగా ఒక విచిత్రానుభవం కల్గింది. అమెరికా పశ్చిమ ప్రాంతాల్లోని ఓ మారుమూల ఎడారి ప్రాంతంలో ఆర్మ్‌స్ట్రాంగ్ అభ్యాస శిక్షణలో ఉన్నాడు. అతను శిక్షణ పొందుతున్న ప్రాంతం అనేకమంది అమెరి కన్ ఆదివాసీ (స్థానిక) తెగల నివాస కేంద్రం. ఆర్మ్‌స్ట్రాంగ్ బృందానికి వారికి మధ్య సాగిన సంభాషణ ఒక ఐతిహ్యంగానే చెప్పుకోవచ్చు. శిక్షణలో ఉన్న రోదసీ యాత్రికులైన ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లను ఆ స్థానిక ఆదివాసీ అడిగాడు: ‘ఇంతకూ మీరిక్కడ ఏం చేస్తున్నారు’ అని. అందుకు ఆర్మ్‌స్ట్రాంగ్ సమాధానమిస్తూ ‘త్వరలో చంద్రుడి ఉనికి తబిశీళ్లను కనుక్కోడానికి చేసే ప్రయత్నంలో శిక్షణ పొందు తున్నాం’ అన్నాడు. అందుకు నిర్ఘాంతపోయిన ఆదివాసీ ‘నాకో పని చేసి పెడతావా’ అని అడిగాడు. ‘మీకేం కావాలి?’ అని అడిగాడు ఆర్మ్ స్ట్రాంగ్. అందుకు ఆదివాసీ పెద్ద ‘ఆ చంద్రునిపైన కొన్ని పవిత్ర ఆత్మలు, శక్తులూ నివసిస్తుంటాయి. వాటికి మా ప్రజలిచ్చే ఓ ముఖ్య సందేశాన్ని మీరు అందజేస్తారా’ అని ప్రశ్నించాడు. ఆస్ట్రోనాట్ ఆర్మ్‌స్ట్రాంగ్: చెప్పండి, ఆ సందేశం ఏమిటో అన్నాడు కానీ ఆదివాసీ పెద్ద మనిషి ఆదివాసీ తెగల భాషలో మాట్లాడుతూ ‘మీరు విన్నదేమిటో ఒకటికి రెండుసార్లు చెప్పండి’ అన్నాడు. ‘మాకర్థం కావడం లేదు. ఇంతకూ మీరు ఏం చెబుతున్నారు?’ అనడి గాడు ఆస్ట్రోనాట్. ఆదివాసీ పెద్ద ‘అదో రహస్యం, ఆ చంద్రుడిలో దాగిన ఆ శక్తులు, ఆత్మలకు మాత్రమే మా భాష అర్థమవుతుంది’ అన్నాడు. దాంతో తికమకైపోయిన ఆస్ట్రోనాట్స్ తిరిగి తమ స్థానిక క్యాంపుకు వెళ్లిపోయి, ఆదివాసీ తెగల భాషలో మాట్లాడగల వ్యక్తి కోసం గాలించి కనిపెట్టారు. ఇంతకూ ఆ చంద్రునిలో దాగిన ఆ అజ్ఞాత శక్తులు అందించే సందేశం ఏమిటో అనువదించి చెప్పమ న్నారు ఆస్ట్రోనాట్స్. అలా వాళ్ల భాషని ఆస్ట్రోనాట్స్ పదే పదే వల్లి స్తుంటే ఆ ఆదివాసీ దుబాసీ విరగబడి నవ్వేశాడు. ఎందుకని? ఆ ఆదివాసీ పెద్ద అన్న మాటకు అసలు అర్థం– ‘ఆస్ట్రోనాట్స్ చెప్పే ఏ మాటా నమ్మొద్దు. రోదసీ యాత్రికుల పేరుతో వచ్చిన వీళ్లు మన ఆది వాసీల భూముల్ని కాజేయడానికి వచ్చినవాళ్లు’ అని ఆ ఆదివాసీ మాటల అర్థమట! వలస వాదంపై ఇదో వ్యంగ్యాస్త్రం. క్రీ.శ. 1500 సంవత్సరందాకా మానవులు ఈ భూమి ఉపరిత లాన్ని అధిగమించి పోనివాళ్లే. మççహా అయితే పెద్ద పెద్ద కోటలు, దుర్గాల నిర్మాణానికి, పర్వతారోహణకు పరిమితమైనవాళ్లు. ఆకాశ తలాన్ని మాత్రం పక్షులకు, పరమాత్మలకు ఏ దేవదూతలకో వదిలేసే వాళ్లు. ఇప్పుడలా కాదుగదా, రోదసీలో నక్షత్రాల దీవి ‘ఆండ్రోమీడా’ దీవికేసి, పాలపుంత (మిల్కీవే) కేసి శాస్త్ర పరిశోధకులు మెడలు రిక్కించి చూడగల్గుతున్నారు. లక్షల కాంతి సంవత్సరాల వ్యాసార్థం గల నక్షత్ర రాశిని లెక్కగట్టి గుర్తించగలుగుతున్నారు. శాస్త్ర పరిశోధనల్లో, ప్రయోగాల్లో జయాపజయాలు కావడి కుండ ల్లాంటివి. అందుకే ప్రస్తుత చంద్రయాన్–2 ప్రయోగంలో చంద్రుని పార్శా్వలకి చేరువదాకా వెళ్లినట్టు వెళ్లి, తొట్రుపాటుకు గురైన తాత్కా లిక అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్ర విశ్లేషకుడు, వ్యాఖ్యాత వాసుదేవన్ ముకుంత ఇలా అలంకారప్రాయంగా అని ఉంటాడు. ‘‘తాత్కాలిక ఉప్పెనలకు ఎంత దూరంగా ఉంటే వీచే ఈదురుగాలు లకూ అంత దూరంగా ఉండగల్గుతాం’’! అంతేగాదు, చంద్రుని దక్షిణ దిక్కులో పరిశోధనలకు ప్రయత్నించిన చంద్రయాన్–2 ‘విక్రమ్’ ల్యాండ్ రోవర్ ప్రయాణం దాదాపు 95 శాతం వరకూ సజా వుగా జరిగి చివరి క్షణంలో అనూహ్యంగా సశేషంగా ముగింపునకు వచ్చిన యాత్ర సందర్భంగా డాక్టర్ శివన్ హుందాగా, ఒద్దికగా చేసిన ప్రకటన ప్రశంసార్హం. ఆయన మాటల్లోనే ‘‘ఇదే ఆఖరి యత్నం కాదు, చంద్రుని దగ్గరకు మరో యాత్రను ఇస్రో నిర్వహించనున్నది. మానవుణ్ణి ఇస్రో రోదసీయాత్రకు సిద్ధం చేసే కార్యక్రమం ప్రాథమిక దశలో ఉంది, అలాగే రోదసీపై రోబోటిక్ ప్రయోగం కూడా పరిశో ధనలో ఉంది. చంద్ర, అంగారక గ్రహరాశికి ఇండియా 21వ శతాబ్ది లోనే దూసుకుపోయే దశలో ఉంది’’ అందుకే మహాకవి వాక్కు (1954) దార్శనిక దృక్కు. ‘‘చంద్ర మండలానికి ప్రయాణం/ సాధించరాని స్వప్నం కాదు/ గాలికన్నా బరువైన వస్తువుని/ నేలమీద పడకుండా నిలబెట్టడం లేదూ!/ అయితే ఇక్కడ మా భూలోకంలో అంతా బాగానే ఉందని/ అంతా సుఖంగానే ఉన్నారని/ అన్నానంటే మాత్రం అది/ అబద్ధమే అవుతుంది/ దరి ద్రాల శాతం ఇంకా/ చిరాకు కలిగిస్తూనే ఉంది’’! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చంద్రునిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్
-
హత్తుకోవాల్సిన క్షణాలు
సందర్భం పద్నాలుగేళ్ల అరణ్యవాసం ఖరారైంది. రామచంద్రుడు అయోధ్యను వదిలి, రాజ ప్రసాదాన్ని వదిలి, సకల ఐశ్వర్యాలను వదిలి, తల్లిదండ్రుల సన్నిధిని వదిలి, కన్నబిడ్డల వంటి ప్రజలను వదిలి సీతా సమేతంగా నారబట్టలతో బయలుదేరాలి. మొదటి శోకం ఎవరికి? దశరథుడికి. తన ప్రియమైన కుమారుడు... నీలమేఘ శ్యాముడు తనకు దూరమవుతున్న సమయంలో ఆ తండ్రికి కావలసింది ఏమిటి? ఓదార్పు మాటలా? తుది పలుకులా? చేయి ఊపుతూ కనుమరుగయ్యే రూపమా?కాదు. ఒక్క హత్తుకోదగ్గ క్షణం. గుండెలకు హత్తుకోవాల్సిన క్షణం. శ్రీరాముణ్ణి మనసారా హత్తుకుని ఆ స్పర్శను దాచుకోవాలన్న ఆతృత. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నతండ్రికి కొడుకు గుండెలకు హత్తుకొని ధైర్యం చెప్పడమే అప్పుడు కావాలసింది. రాముడు ఇవ్వగలిగింది కూడా అదే. యుద్ధం చేయలేనని విల్లంబులు పారేసిన అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు లేవదీసి కావలించుకోలేదు. అక్కడే నిలబెట్టి గీతాసారం చెప్పాడు. కర్తవ్యబోధ చేశాడు. కాని కురుక్షేత్రంలో, కపట పన్నాగంలో, పసికూన అయిన అభిమన్యుడిని పద్మవ్యూహంలో చుట్టుముట్టి ఏకదాడి చేసి వధించినప్పుడు కడుపుకోతతో విలపించిన అభిమన్యుడికి కావలసింది బోధ కాదు. మాయ కాదు. మాట కూడా కాదు. ఒక్క ఆలింగనం. గుండెలకు హత్తుకుని మౌనంగా వెన్నుతట్టే స్పర్శ. కృష్ణుడు కచ్చితంగా ఆ సమయంలో ఆ చికిత్సను అందించి ఉంటాడు. శాస్త్రవేత్తల మధ్య శివన్ ఎవరూ వెళ్లని, ఒక్కరూ తొంగి చూడటానికి ఇష్టపడని, ఆర్తనాదాలకు చెవి ఒగ్గని కుష్టువ్యాధిగ్రస్తుల వాడలలోకి ఏసుక్రీస్తు అడుగుపెట్టి అక్కడ తారసపడిన మొదటి కుష్టువాడికి ఇచ్చింది రొట్టెముక్కా కాదు.. మంచినీరూ కాదు. ఒక మానవుడికి సాటి మానవుడి మీద నమ్మకం కుదిర్చే కావలింతే. ఏసుప్రభువును హత్తుకుని ఆ కుష్టువ్యాధిగ్రస్తుడు రాల్చిన ఆశ్రువుల వందల ఏళ్ల మానవ దాష్టికాలకు ఆనవాళ్లు. అతనికి కుష్టు మాయమయ్యింది. ఒక సరైన ధైర్యస్పర్శ దొరికితే ఆత్మవిశ్వాసం బలపడి తమ సమస్యలను తాము దూరం చేసుకునే శక్తిపొందుతారు మనుషులు. మరల ప్రయత్నించడానికి ప్రయత్నిస్తారు మనుషులు. దగ్గరకు తీసుకోవడమే ధైర్యం చెప్పడం. ఎదుటివారు గెలిచినప్పుడు భుజాల మీదకు ఎక్కించుకోవచ్చు. ఓడినప్పుడు మాత్రం కచ్చితంగా గుండెలకు హత్తుకోవాలి. గుండెలకే హత్తుకోవాలి. పురుషోత్తముణ్ణి అలెగ్జాండర్ జయించాక సంకెలలో బంధించి దర్బార్‌లోకి తీసుకొచ్చి నిలబెట్టి అడుగుతాడు– ‘నేను నిన్ను ఇప్పుడు ఎలా చూడమంటావ్?’ అని. మహా యుద్ధం చేసి, విఫలుడయ్యి, ఓటమిని అంగీకరించినప్పటికి, పౌరుషం ఆత్మాభిమానం నశించని పురుషోత్తముడు ‘ఒక చక్రవర్తి సాటి చక్రవర్తిని ఎలా చూస్తాడో అలాగే చూడు’ అని సమాధానం చెప్పాడు. అటువంటి ధీరోదాత్తుడికి అలెగ్జాండర్ స్వేచ్ఛను ప్రసాదించి తన ప్రతినిధిగా నియమించాడు... సరే దానికంటే ముందు అతడు సన్మానించింది తన ఆలింగనం తోటే. బక్క పలుచటి గుప్పెడంత మనిషి మదర్ థెరిస్సా. తన దగ్గర ఒక్క రూపాయి లేకున్నా మహా మహా ఐశ్వర్యవంతుల కంటే ఐశ్వర్యవంతురాలామె. కారణం చేతులు సాచి అన్నార్తులను, అదృష్ట హీనులను, అనారోగులను గుండెలకు హత్తుకోగల ఐశ్వర్యం ఆమె వద్ద ఉంది. పుత్రోత్సాహం ఎప్పుడు కలగాలో సుమతీ శతకకారుడు చెప్పాడు. కొడుకు ఉన్నది తండ్రికి పుత్రోత్సాహం కలిగించడానికే అన్న బరువు పెట్టాడు. కాని ఆగిన కొడుకును, ఓడిన కొడుకును, ఎదురు దెబ్బ తిన్న కొడుకును, ఒక్క మార్కు తక్కువ తెచ్చుకున్న కొడుకును, ఒక్క సబ్జెక్ట్ ఫెయిలైన కొడుకును, తెలియక ఒక్క తప్పు చేసి బెదిరి ఉన్న కొడుకును దగ్గరకు తీసుకొని, గుండెలకు హత్తుకుని, భరోసా ఇచ్చి, ట్రై అగైన్ చెప్పేవాడే గొప్ప తండ్రి. అలాంటి తండ్రిని చూసి కొడుక్కు పిత్రోత్సాహం కలుగుతుంది అని చెప్పి ఉంటే బాగుండేది. ఇంట్లో ఇల్లాలు ఉంటుంది. ఆమె వంట చేస్తూ ఉంటుంది. ఇంటిని కనిపెట్టుకుని ఉంటుంది. తనను తాను కోల్పోయి భర్తా పిల్లలకు తన జీవితాన్ని ఇచ్చి ఉంటుంది. ఆమెను ఎప్పుడైనా ఒకసారి నిర్మోహంగా హత్తుకుని కృతజ్ఞత ప్రకటించి హృదయం నుంచి హృదయానికి గౌరవాన్ని ప్రసారం చేయాలని భర్త ఒక్కనాడూ ఆలోచించడు. సోదరుడు ఊరుగాని ఊరిలో ఉంటాడు. ఏవో కంప్లయింట్స్‌తో మాటా పలుకూ లేకుండా ఉంటాడు. ఒక్కసారి వెళ్లి, చూసి, దగ్గరకు తీసుకొని, ఆలింగనం చేసుకుంటే ఆ బంధం ఎంత ఆనందభరితం అవుతుంది. కాలూ చేయీ ఆడటం ఆగిపోతే ప్రాణం పోదు. గుండె ఆగినప్పుడే ప్రాణం పోతుంది. ఆ గుండెకు ప్రాణం ఉన్నప్పుడే ప్రాణం ఉన్న మరో గుండెను తాకించి బంధాన్ని బలపరుచుకోవాలి. భరోసాను ఇచ్చి పుచ్చుకోవాలి. గెలిచినప్పుడు భుజాల మీదకు ఎక్కించుకోవచ్చు. కానీ ఓడినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుండెలకు హత్తుకోవాలి. గుండెతోనే మాట్లాడాలి. వివక్షను ఎదుర్కొంటున్నవారిని, పీడనను ఎదుర్కొంటున్నవారిని, ద్వేషాన్ని ఎదుర్కొంటున్నవారిని, ఆధిపత్యాన్ని ఎదుర్కొంటున్నవారిని, ఈ సమాజంపై, వ్యవస్థపై, సాటి మనిషి పై విశ్వాసం కోల్పోయి కుంగుబాటులో ఉన్నవారిని గుండెలకు హత్తుకోవడం, దగ్గరకు తీసుకోవాల్సిన బాధ్యతను గుర్తెరగడం, వారి కోసమై మొదటి అడుగు వేయడం అసలైన సంస్కారం. ముందుకు చేయవలసిన ప్రయాణం. ఒక మనిషి మరో మనిషిని ఆలింగనం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన రసాయనాలు శరీరంలో ఊరి మేలు చేస్తాయని పరిశోధనలో తేలింది. రక్తసరఫరాను క్రమబద్ధీకరిస్తుందని సరఫరా అయ్యింది. కుంగుబాటులో, వైఫల్యంలో ఉన్న మనిషిని క్రమం తప్పకుండా 21 రోజుల పాటు కనీసం 21 సెకండ్ల పాటు ఆలింగనం చేసుకోగలిగితే ఆ మనిషి కోలుకుని తనను తాను కూడగట్టుకొని ముందుకు నడుస్తాడని అమెరికాలో నిరూపించారు. నమస్కారాలు, షేక్హ్యాండ్లు కేవలం పైపూత మందులు. హత్తుకోవాల్సిన వేళ దగ్గరకు తీసుకుని హత్తుకొని ఇచ్చే దిలాసాయే అసలైన చికిత్స. అటువంటి చికిత్సలో మనందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోవాలని ఆశిద్దాం. – కె. -
‘విక్రమ్’ ఎక్కడ..?
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైంది. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎంతో ఆసక్తితో ప్రయోగాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల్లో ఒక్కసారిగా గందరగోళం, నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు దేశ ప్రజలు, అటు శాస్త్రసాంకేతిక నిపుణుల్లో నైతికస్థైర్యం నింపేలా ఇస్రో కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి 90 నుంచి 95 శాతం లక్ష్యాలను అందుకున్నామని తెలిపింది. చంద్రుడికి సంబంధించి తమ పరిశోధనలు కొనసాగుతాయంది. విక్రమ్ ల్యాండర్ అనుకున్న ప్రకారం తన వేగాన్ని తగ్గించుకుని చంద్రుడికి 2.1 కి.మీ దగ్గరకు సమీపించగానే సంకేతాలు నిలిచిపోయాయని చెప్పింది. రాబోయే 14 రోజుల్లో విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను తాము ప్రస్తుతం విశ్లేషిస్తున్నామని చెప్పింది. ఏడేళ్ల పాటు ఆర్బిటర్ సేవలు.. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి ఇస్రో కీలక విషయాన్ని ప్రకటించింది. ఇందులో ప్రయోగించిన ఆర్బిటర్ జీవితకాలం ఏడు రెట్లు పెరిగిందని చెప్పింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్–2ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రయోగించిన ఆర్బిటర్ జీవితకాలం 12 నెలలు కాగా, ఇప్పుడు ఏడేళ్ల పాటు పనిచేసే అవకాశముందని ఇస్రో తెలిపింది. వాహకనౌకను అత్యంత కచ్చితత్వంతో ప్రయోగించడం, మిషన్ నిర్వహణ పద్ధతుల కారణంగా ఆర్బిటర్ జీవితకాలం 7 సంవత్సరాలు పెరిగిందని వెల్లడించింది. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో మార్పులు, ఖనిజాలు, నీటి అణువులను ఈ ఆర్బిటర్ విశ్లేషిస్తుందని చెప్పింది. ఇందులోవాడిన అంత్యంత శక్తిమంతమన కెమెరా, చంద్రుడికి సంబంధించిన కీలక ఫొటోలను చిత్రీకరిస్తుందని ఇస్రో పేర్కొంది. అసలేమైంది..? కూలిపోయిందా?... సమాచార వ్యవస్థ మాత్రమే పనిచేయడం లేదా? మళ్లీ పనిచేసే అవకాశముందా? విక్రమ్‌పై ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? శనివారం ఉదయం నుంచి భారతీయులందరి మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవే. కచ్చితమైన సమాధానాలకు కొంత కాలం వేచి చూడాల్సిందేగానీ.. నిపుణులు మాత్రం విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ వైఫల్యానికి పలు కారణాలు చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్‌తో సమాచారం తెగిపోయేందుకు ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చునని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ అభిప్రాయపడ్డారు. సెన్సర్లు పనిచేయకపోవడం మొదలుకొని, విక్రమ్‌లోని సాఫ్ట్వేర్ పనితీరులో తేడాలు, చివరి సెకనులో ఇంజిన్లు అందించే థ్రస్ట్ (చోదక శక్తి)లో మార్పులు వంటి కారణాలు ఉండవచ్చునని.. అసలు కారణమేదో ఇస్రో సమాచార విశ్లేషణతో తెలుస్తుందన్నారు. విక్రమ్ ప్రయాణించాల్సిన మార్గం, వేగాల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెగిపోయేంత వరకూ ఉన్న వివరాలను పరిశీలిస్తే కారణమేమిటో తెలియకపోదు అని ఆయన అన్నారు. జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో విక్రమ్ దిశ మారిపోయి ఉండవచ్చునని లేదా ఇంజిన్లు పనిచేయకపోవడం, కంప్యూటర్ సంబంధిత సమస్యలు వచ్చి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని సాట్సెర్చ్ సంస్థ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ నారాయణ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇంకో 2.1 కిలోమీటర్లు మాత్రమే దిగాల్సిన స్థితిలో సమాచార సంబంధాలు తెగడం చూస్తే ఇంజిన్ సమస్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయన్నారు. విక్రమ్ క్రాష్‌ల్యాండ్ అవడంతో, దాని యంటెన్నా ధ్వంసమై సిగ్నల్స్ ఆగిపోయి ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. గతి తప్పిందా? సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి విడిపోయి విక్రమ్ ల్యాండర్ క్రమేపీ తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరవడం తెల్సిందే. ఈ క్రమంలో ఇది సుమారు 35 కిలోమీటర్ల ఎత్తు నుంచి నెమ్మదిగా తన వేగాన్ని తగ్గించుకుంటూ ఉపరితలంపైకి నెమ్మదిగా ల్యాండ్ కావాలి. అయితే సమాచార సంబంధాలు తెగిపోయేందుకు క్షణం ముందు వరకూ విక్రమ్ ప్రయాణించిన మార్గాన్ని పరిశీలిస్తే... అది ముందుగా ల్యాండింగ్‌కు నిర్దేశించిన స్థానం నుంచి చాలా పక్కకు జరిగిందని ఒక నిపుణుడు తెలిపారు. విక్రమ్‌లోని నాలుగు ఇంజిన్లలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా... వేగాన్ని నియంత్రించుకోవడం విక్రమ్ వల్ల అయ్యే పనికాదని, దీంతో అది వేగంగా పడిందేమోనన్నారు. విక్రమ్ ప్రయాణమార్గాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. విక్రమ్ కిందకు దిగే సమయంలో జాబిల్లిపై గురుత్వాకర్షణ శక్తి వివరాలు కచ్చితంగా అందించాల్సిన అవసరముందని.. ఇందులో వచ్చే సూక్ష్మమైన మార్పులనూ లెక్కించాలని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సీఈవో పవన్ చందన చెప్పారు. విక్రమ్‌లోని ఆటానమస్ ల్యాండింగ్ సిస్టమ్ (తనంతట తానే కిందకు దిగేందుకు ఏర్పాటైన వ్యవస్థ), సమాచార వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విజయావకాశాలు 37 శాతమే విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ ఆషామాషీ వ్యవహారం కాదని.. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రయోగంలో విజయావకాశాలు కేవలం 37 శాతమే అని శివన్ గతంలో అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు జరిగిన ప్రయత్నాల్లో విజయవంతమైంది 37 శాతమే. ఇస్రో ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. కాబట్టి అందరిలో ఉత్సుకత నెలకొంది’ అని శివన్ శుక్రవారం అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్–2 చివరిక్షణంలో ఎదురుదెబ్బ ఎదుర్కోన్నా 95 శాతం సక్సెసే అనేది నిపుణుల మాట. -
రాయని డైరీ.. డాక్టర్ కె. శివన్ (ఇస్రో చైర్మన్)
అంతా వెళ్లిపోయారు. ప్రధాని వెళ్లిపోయారు. మూడొందల మంది జర్నలిస్టులు వెళ్లిపోయారు. అరవై మంది స్కూలు పిల్లలు వెళ్లిపోయారు. నూటా ముప్ఫై కోట్ల మంది భారతీయులూ టీవీల ముందు నుంచి వెళ్లిపోయే ఉంటారు. ఇస్రో స్టాఫ్ కూడా వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయారు. ఆపరేషన్స్ కాంప్లెక్స్‌లో ఒక్కడినే కూర్చొని ఉన్నాను. రైల్వే స్టేషన్లో ఒంటరి ప్రయాణికుడిలా ఏ నంబరూ లేని ప్లాట్‌ఫాం మీద నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. ‘దయచేసి వినండి. చంద్రుడిపైకి మీరు పంపిన ఉపగ్రహం మరికొద్ది నిమిషములలో చంద్రునిపై దిగబోవుచున్నది’ అనే ఒక అనౌన్స్‌మెంట్‌ను నా మనసు పిచ్చిగా కల్పించుకుంటోంది. కట్ అయిన సిగ్నల్స్ మళ్లీ కనెక్ట్ కావనేముంది?! ట్రాకింగ్ రూమ్‌లో గోడలపై వరుసగా కంప్యూటర్ స్క్రీన్లు. అంతరిక్షంలో ఏం జరగలేదో ఆ జరగని దానిని మాత్రమే అవి చూపగలవు. ఏం జరిగితే బాగుండేదని నా అంతరంగంలో ఉందో, ఆ బాగుండే దానిని చూపిస్తే అవి కంప్యూటర్లు ఎందుకవుతాయి? ఓదార్చి, భుజం తట్టి, ‘నెక్స్›్ట టైమ్ బెటర్ లక్’ అని చెప్పే మనుషులు అవుతాయి. వెళ్లే ముందు భుజం తట్టి వెళ్లారు ప్రధానమంత్రి. ఇంతవరకు సాధించిన దానికి, ఇక ముందు సాధించబోయే దానికీ! వెళ్లే ముందు బొటనవేళ్లు ఎత్తి చూపి వెళ్లారు జర్నలిస్టులు.. ‘మిస్టర్ శివన్, మీ అంతరిక్షంలో జరిగేది, జరగనిదీ ఏదైనా మాకు బిగ్ ఈవెంటే..’ అని అంటూ! వెళ్లే ముందు స్కూల్ పిల్లలు ‘ఫీల్ అవకండి అంకుల్’ అన్నట్లు చూసి వెళ్లిపోయారు. రాత్రి కలలోకి చందమామ వస్తే కనుక క్లాస్ పీకాలన్న కృతనిశ్చయం ఆ పిల్లల కళ్లలో కనిపించింది! ‘ఇంత కష్టపడ్డాం కదా, నువ్వెందుకు అందలేదు చందమామా?’ అని గొడవపడతారేమో వీళ్లంతా. ‘అయినా అందనంత దూరంలో ఉండటం ఏంటి నువ్వు! ఎక్కడానికి ఎవరెస్టులా, ఈదడానికి హిందూ మహాసముద్రంలా అందుబాటులో ఉండొచ్చుగా అంటారేమో వీళ్లలోనే కాస్త పెద్దపిల్లలు. మరీ చిన్నవాళ్లయితే.. ‘మాకు అందొద్దులే చందమామా.. మా అమ్మ మా తమ్ముడిని ఎత్తుకుంటే వాడి చేతికి అందేలా నువ్వుంటే చాలు’ అని బంపర్ ఆఫర్ ఇస్తారేమో చంద్రుడికి. ఆలోచనలు తెగట్లేదు. ఎక్కడ తెగి ఉంటుంది కమ్యూనికేషన్! ఎటువైపు తిరిగి ఉంటుంది ల్యాండర్ డైరెక్షన్! చంద్రుడికి రెండు కిలో మీటర్ల దగ్గరి వరకూ వెళ్లి మిస్ అయిందని కాదు, కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని కాదు, ల్యాండ్ అయి ఉంటే ఇండియాకు గొప్పగా ఉంటుందని కాదు. స్కూలు పిల్లల కేరింతల కోసమైనా చంద్రయాన్ సక్సెస్ అయి ఉండవలసింది. ‘‘సర్’’ అని పిలుపు! తల తిప్పి చూశాను. టీమ్‌లోని కుర్ర సైంటిస్ట్. ‘‘నువ్వింకా వెళ్లలేదా?’’ అన్నాను. ‘‘రండి సర్ వెళ్దాం’’ అన్నాడు. ‘‘కూర్చో. బయటికెళ్తే చంద్రుడికి ముఖమెలా చూపిస్తాం’’ అన్నాను నవ్వుతూ. అతడూ నవ్వాడు. జర్నలిస్టు అవుదామని ఇంటి నుంచి బయల్దేరి, సైంటిస్టు అయి ఇస్రోకి వచ్చిన కుర్రాడు అతడు. ‘‘సర్, మనం సక్సెస్ అయి ఉంటే మీడియా ఏం రాసేదో చెప్పమంటారా?’’ అన్నాడు నవ్వుతూ. చెప్పమన్నట్లు చూశాను. ‘‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇక బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిన ల్యాండ్ అవడమే మిగిలింది అని రాసేవి సర్’’ అని నవ్వాడు. అది నన్ను నా మూడ్‌లోంచి బయటికి లాగే ప్రయత్నమని అర్థమైంది. వాత్సల్యంగా అతడి భుజం తట్టాను. -
అంతరిక్షాన్ని గెలుద్దాం!
‘‘ఇంతింతై, వటుడింతై, మరియు తానింతై/ నభో వీధిపైనంతై, తోయద మండలాగ్రమునకల్లంతై,/ ప్రభా రాశిపై నంతై, చంద్రునికంతౖయె, / ధృవునిపైనంతై, మహ ర్వాటిపైనంతై, / సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్థిౖయె’’... బలిచక్రవర్తి దగ్గరకు వామనుడిగా వచ్చిన శ్రీమహావిష్ణువు మహాకాయుడిగా ఎలా ఎదుగుతు న్నాడో వర్ణిస్తూ శ్రీ మద్భాగవతంలో బమ్మెర పోతన చెప్పిన పద్యం. ఆకాశాన్నీ, అంతరిక్షాన్నీ, చంద్రగోళాన్నీ, నక్షత్ర మండలాన్ని దాటుతూ ఎదుగుతున్నాడు వామను డని చెబుతూ అనంతమైన ఈ విశ్వరూపాన్ని పోతన కవి సాక్షాత్కరింపజేశాడు. వామన మూర్తి పెరుగుతున్న క్రమాన్ని ‘రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రం బై...’ అంటూ మరో పద్యంలో సూర్యుడితో పోలుస్తూ వర్ణిస్తాడు. ఒక దశలో సూర్యుడు వామనమూర్తికి గొడుగులా కనిపించాడట. కొంతసేపటికి శిరోరత్నమై కనిపించాడట. ఆ తరువాత క్రమంగా చెవికున్న ఆ కుండలంలాగా, కంఠహారంలాగా, నడుముకున్న వడ్డాణం గంటలాగా, చివరికి పాదాలకున్న అందెలా, పాదాల కింద వున్న పీటలాగా కనిపించాడట. సూర్య బింబం తన పాదాలకింద ఉందా అన్నంతగా వామనుడి రూపం పెరిగింది అంటే ఈ విశ్వానికి ఎల్లలు ఎక్క డున్నాయో మన ఊహలకు ఎలా అందగలదు? ఎనిమిది వందల కోట్ల మంది మానవులు, ఆ సంఖ్యకు కొన్ని కోట్ల రెట్లు అధికమైన జీవరాశిని మోస్తున్న మన భూమి లాంటివి కొన్ని కోట్లు కలిస్తే ఒక నక్షత్రమండలమట. దాన్ని గెలాక్సీ అని పిలుస్తారు. అలాంటి గెలాక్సీలు కొన్ని కోట్లున్నాయట ఈ విశ్వంలో. మన నక్షత్ర మండలంలో మనకు అత్యంత సమీపాన వున్న నక్షత్రం దగ్గరకు అత్యంత వేగంగా ప్రయాణించే యుద్ధ విమానంలో బయల్దేరితే పది లక్షల సంవత్స రాలకు గానీ చేరుకోలేము. ఒక సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లు ప్రసరించే కాంతివేగంతో వెళితే పాల పుంతగా పిలుచుకునే మన గెలాక్సీని దాటడానికి ఒక లక్ష సంవత్సరాలు పడుతుంది. చిన్నతనంలో రాత్రిపూట ఆరుబయట వెల్లకిలా పడుకొని ఆకాశంలోని చుక్కలను లెక్కించడానికి ప్రయత్నించనివారు బహుశా ఎవరూ వుండరు. ఆకాశం దూరమెంత? అనంతకోటి నక్ష త్రాలకు ఆవలితీరంలో ఏముంటుంది? ఈ భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఏవీ లేకుంటే ఏమ య్యేది? ఏమీ లేని శూన్యస్థితిని మనం ఎలా ఊహిం చాలి? ఇలా బుర్ర బద్దలు చేసుకున్న బుద్ధి జీవులు కూడా ఎంతోమంది వుండి వుంటారు. ఈ భూమ్మీద వున్న కోట్ల రకాల జీవరాశిలో తెలివైన జీవి మానవుడు. తన తెలివితేటలతో మానవుడు భూగోళాన్ని పాదాక్రాంతం చేసుకున్నాడు. భూగోళం లాంటి గ్రహాలు ఈ సృష్టిలో కోట్ల సంఖ్యలో పరిభ్ర మిస్తున్నపుడు అందులో జీవం మనగలిగే అవకాశాలు న్నవి ఎక్కడున్నాయి? మానవుడి లాంటి జీవి లేదా అంతకంటే తెలివైన జీవి ఎక్కడుంది? ఈ అన్వేషణల ఫలితంగా ఉద్భవించిన అంతరిక్షశాస్త్రం ముందున్న ప్రధమ లక్ష్యం మరికొన్ని మానవ ఆవాస యోగ్యమైన గ్రహాలను కనిపెట్టడం. మానవుని స్వార్థం, దురాశల ఫలితంగా పర్యావరణం ధ్వంసమవుతున్న భూగోళం మరికొన్నాళ్ల తర్వాత జీవరాశికి ఆవాస యోగ్యం కాక పోవచ్చు లేకపోతే ఏ భారీ గ్రహశకలమో, తోకచుక్కనో తగిలి భూమిని ధ్వంసం చేయవచ్చు. ‘భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో...’ అంటాడు దాశరథి ఒక అద్భుతమైన గేయంలో. అనంత విశ్వంలోంచి అలా రాలిపడుతున్న గోళ శకలాల్లో భూమివైపు వచ్చే అవకాశం వున్నవి సుమారు 25 వేల వరకు ఉండొచ్చని ‘నాసా’ అంతరిక్ష పరిశోధనకేంద్రం అంచనా. ఇందులో భూమిని పూర్తిగా గానీ, పాక్షికంగా గాని ధ్వంసం చేయగలిగినవి ఏమైనా వున్నాయా అనే అంశంపై నాసాలో పరిశోధనలు జరుగుతున్నవి. ఈ రెండు కార ణాలవల్ల భవిష్యత్తులో మానవజాతి అంతరించిపోకుండా ఉండాలంటే విశ్వంలోని ఆవాస యోగ్య గ్రహాలను కనిపెట్టి క్రమంగా విస్తరించాలని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. గ్రహాల్లో వలస రాజ్యాలను స్థాపించడానికి ముందు సమీప భవిష్యత్తులో భూగోళంలోని దేశాల మధ్య యుద్ధాలు జరిగితే అవి అంతరిక్ష యుద్ధాలుగానే ఉండే అవకాశం ఉంది. యుద్ధట్యాంకులు, వైమానిక దాడులకు ఇక క్రమంగా కాలం చెల్లుతుంది. శత్రుదేశాల కమ్యూని కేషన్ ఉపగ్రహాల మీద గురిపెట్టి క్షిపణులతో పేల్చగలి గితే చాలు, ఆ దేశపు నవనాడులు కృంగిపోవడం ఖాయం. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏఎస్ఏటి)ని ఇటీవలే భారతదేశం విజయవంతంగా ప్రయోగించింది. భారత్‌తో పాటు అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ప్రస్తుతానికి ఈ శక్తి వుంది. అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో సాధించిన విజయాల ప్రాతిపదికపై చూస్తే భారత్ ఇప్పుడు నాలుగో స్థానంలో వుంది. పురోగమిస్తున్న వేగాన్ని చూస్తే ఈ స్థానం మరింత మెరుగుపడవచ్చు. గణిత, విజ్ఞాన శాస్త్రాల్లో సహజ ప్రతిభావంతులైన భారతీయ బాలబాలికలకు నాణ్యమైన విద్యను, శిక్షణను ఉచితంగా అందించ గలిగితే ఎందరో విక్రమ్సారా భాయ్‌లు, మరెందరో సునీతా విలియమ్స్‌లు భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్ట వచ్చునేమో! అగ్రస్థానానికి చేరుకున్న భారతదేశం, అటు పిమ్మట అనతికాలంలోనే నివాసయోగ్యమైన గ్రహాలను కనిపెట్టి వలసలుగా మార్చుకోవచ్చునేమో! డెబ్బయ్ రెండేళ్ల కిందటి వరకు ఈ భూ ప్రపంచంపై ఒక వలస దేశంగా వున్న భారతదేశం మరో డెబ్బయ్యేళ్లకో, వందేళ్లకో విశ్వవేదికపై అగ్రరాజ్యంగా వలస గ్రహాలను పరిపాలించడం ఎంతటి మధురోహ! ఏమో... ఆ ఊహ నిజమౌతుందేమో! నిన్నటి చంద్రయాన్–2 ప్రయోగం ఔననే సంకేతాలనే పంపిస్తు న్నది. చివరి క్షణంలో సిగ్నల్స్ నిలిచిపోయినంత మాత్రాన ఈ ప్రయోగం విఫలమైనట్టుగా భావించడం పొరపాటు. నిర్దేశించిన మార్గంలో రవ్వంత తేడా లేకుండా ప్రయాణించి, ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడివడి వేగాన్ని నియంత్రించుకుంటూ చందమామ బుగ్గను ముద్దాడేంత చేరువగా వెళ్లి సంబంధాలను కోల్పోయింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, తెల్లవారితే శనివారమనగా ఒంటి గంటా ముప్ఫైఎని మిది నిమిషాలకు ల్యాండర్ చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. ఆఖరి పదిహేను నిమి షాల ఉత్కంఠ ఘట్టం. అందులో 13 నిమిషాలు విక్రమ్ ల్యాండర్ సజావుగానే కిందకు జారింది. స్వీయ మేథ స్సుతో అది క్రమంగా తన వేగాన్ని తగ్గించుకున్నది. ఎందుకో ఆఖరి రెండు నిమిషాల్లోనే దాని వేగం నియం త్రణకు లొంగలేదు. అంటే 3,84,000 కిలోమీటర్ల ప్రయాణంలో 3,83,997.9 కిలోమీటర్లు సజావుగా వెళ్లింది. ఇక కేవలం 2.1 కిలోమీటర్లు కిందకు దిగి చంద్రుని ఉపరితలాన్ని సున్నితంగా తాకవలసి వుంది. ఆ సమయంలో అది అదుపు కోల్పోయినట్టు స్పష్టమ వుతున్నది. ఏం జరిగిందో ఇంకా తెలియవలసి వుంది. అదుపుకాని వేగంతో క్రాష్ ల్యాండింగ్ జరిగి వుండొచ్చు. క్షేమంగా దిగి కూడా ఉండవచ్చునేమో, కమ్యూనికేషన్ల వ్యవస్థలో లోపం ఏర్పడడం వల్ల సంబంధాలు తెగి పోయి ఉండవచ్చు కూడా. కానీ ఇందుకు అవకాశాలు స్వల్పమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతా సజావుగా జరిగితే ఆర్బిటర్, ల్యాండర్, అందులోంచి బయటకు రావాల్సిన రోవర్లు అక్కడ 14 రోజులు పనిచేసి తగిన సమాచారాన్ని పంపించి ఉండేవి. ఇప్పుడు ఆర్బిటర్ సవ్యంగానే వుంది. భూ కేంద్రంతో నిరంతర సంబంధంలో వున్నది. ఏడాది పాటు అది సంచరిస్తూ చంద్రుడి ఛాయాచిత్రాలను, విలువైన సమాచారాన్ని పంపిస్తుంది. ఆఖరి క్షణంలో ఎదురైన ఆటంకానికి కారణాలను ఇస్త్రో విశ్లేషిస్తున్నది. మీరు సాధించిన విజయాలు తక్కువేమీ కాదు, ఈ చివరి నిమిషం అడ్డంకిని చూసి నిరాశపడవలసిన అవ సరం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తల వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. దేశమంతా అండగా నిల బడింది. ఈ ఆత్మీయత చాలు, మన శాస్త్రవేత్తలు ఉరిమే ఉత్సాహంతో అతి త్వరలో చందమామపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయడానికి. అసలు చంద్రయాన్–2 ప్రయోగమే ఒక సవాల్‌గా ఇస్రో తీసుకున్నది. ఈ ప్రయాణానికి క్రయోజనిక్ ఇంజిన్ కీలకం. అప్పటికి దాన్ని తయారుచేసే సాంకేతిక సామర్ధ్యం మనకు లేదు. ఇస్తానన్న రష్యా మొండిచేయి చూపింది. అమెరికా ఒత్తిడి కారణంగానే రష్యా మాట తప్పినట్టు తెలిసింది. ఇస్రో శాస్త్రవేత్తలు పట్టుదలతో స్వయంగా ఇంజిన్‌ను తయారు చేసుకున్నారు. ఇంజిన్ ఒక్కటే కాదు, ఈ ప్రయోగానికి వాడిన సాంకేతిక పరిజ్ఞానమంతా నూటికి నూరుపాళ్లు స్వదేశీ. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా, ఇప్పటి వరకూ ఎవరూ సాహసించని చంద్రుని దక్షిణ ధృవ మండలం లక్ష్యంగా ప్రయోగించి నూటికి నూరుపాళ్లు కచ్చితత్వంతో దాదాపుగా గమ్యాన్ని తాకించిన శాస్త్రవేత్త లారా సాహో. ఈ మహాయజ్ఞానికి ఇస్రో చేసిన ఖర్చు 142 మిలియన్ డాలర్లు. అంటే మన రూపాయల్లో దాదా పుగా వెయ్యి కోట్లు. తెలుగు తమ్ముళ్లు ఒక్క ఏడాదిలో ఇసుకలో నాకేసినంత విలువ కూడా కాదు. బాహు బలి–2 సినిమా కొచ్చిన కలెక్షన్ల కంటే తక్కువ. ‘‘రాశి చక్రగతులలో రాత్రిందివాల పరిణామాలలో, బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో, కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువు సంకల్పంలో ప్రభవం పొందినవాడా! మానవుడా! మానవుడా!’’ అంటాడు శ్రీశ్రీ. అలా ప్రభవించిన మానవుడు వామన మూర్తి లాగా వ్యాపించి, నిరంతరం విస్తరిస్తున్న విశ్వం రహస్యాలను తరుముకుంటూ దిగంతాల దాకా పరు గులు తీసేందుకు సిద్ధం కావాలని, అందుకు తొలి అడుగు భారతీయుడు వేయాలని ఆకాంక్షిద్దాము. వ్యాసకర్త: వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
‘చంద్రయాన్–2’ది విజయమే!
సాక్షి, న్యూఢిల్లీ : చంద్రుడి భూ ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు అక్కడికి ఇస్రో పంపించిన ఉపగ్రహం ‘చంద్రయాన్–2’ చివరి నిమిషంలో విఫలం అవడం పట్ల ఇస్రో చైర్మన్ కే. శివన్, ఇతర శాస్త్రవేత్తలు తీవ్రంగా నిరాశ చెందడం, వారిని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓదార్చడం తెల్సిందే. వాస్తవానికి చంద్రయాన్–2 విఫలమైందని చెప్పడానికి బదులు విజయవంతమైందనే విషయాన్నే ఎక్కువ చెప్పాలి. ఈ ప్రయోగంలో రెండు ప్రధాన దశలు ఉన్నాయి. మొదటి దశ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ప్రారంభమయ్యే 30 కిలోమీటర్ల దూరం వరకు ఉపగ్రహాన్ని తీసుకెళ్లడం, రెండో దశ చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి తీసుకెళ్లడం. ఈ రెండో దశనే కాస్త క్లిష్టమైనది. మొదటి దశలో చంద్రయాన్ ఉపగ్రహం అంతరిక్షంలో 3,84,400 కిలోమీటర్లు సునాయాసంగా ప్రయాణించి రెండో దశలోనూ, అంటే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోనికి కూడా 28 కిలోమీటర్లు చొచ్చుకొని పోయింది. చంద్రుడికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి ‘విక్రమ్ ల్యాండర్’ దూసుకుపోవడం సాధారణ విషయం కాదని, దీన్ని సక్సెస్ కిందనే పరిగణించాల్సి ఉంటుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. ఈ దిశగా భారత శాస్త్రవేత్తలు చేసిన కృషిని అభినందించారు. ఇక చంద్రుడి ఉపరితలంపై ఉపగ్రహాన్ని దించే మూడవ ప్రక్రియలోనూ భారత్ తదుపరి ప్రయత్నంలో విజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: వారం రోజులు పస్తులున్నాను: శివన్) -
వారం రోజులు పస్తులున్నాను: శివన్
చెన్నై: ఈ రోజు సోషల్ మీడియా వేదికలన్నింటిలో ఓ ఫోటో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో చీఫ్ శివన్ కంటతడి పెట్టారు. దాంతో మోదీ ఆయనను దగ్గరకు తీసుకుని ఓదారుస్తోన్న ఫోటో యావత్‌దేశాన్ని కదిలించింది. మిషన్ పట్ల ఎంత అంకిత భావం లేకపోతే.. అంతలా బాధపడతారు అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఈ ప్రయోగాన్ని శివన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించారు. కనుకే తొలిసారి ఏర్పడిన ఆటంకాన్ని కేవలం ఏడు రోజుల్లో సరి చేసి.. ప్రయోగాన్ని తిరిగి ప్రారంభించారు. ఆఖరి నిమిషంలో విఫలం కావడం బాధగా ఉన్నా అక్కడి దాకా చేరుకున్నామంటే అదంతా శివన్ కృషి వల్లే అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో శివన్ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ సమీపంలో మేళా సారకల్విలైలో జన్మించారు శివన్. అతని తల్లిదండ్రులు కైలాసవదీవానదార్, చెల్లమాల్. రైతు కుటుంబంలో జన్మించిన శివన్ పట్టుదలతో శ్రమించి ఇస్రో చీఫ్‌గా ఎదిగారు. కాలేజీలో చేరే వరకు ధోతి ధరించి.. ఉత్త కాళ్లతోనే తిరిగారు. అయితే ఈ కష్టాలేవి ఆయనను లక్ష్యం నుంచి దూరం చేయలేదు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో శివన్ మాట్లాడుతూ.. ‘కోరుకున్నది నాకు ఎప్పుడు లభించలేదు.. దాని గురించి బాధ లేదు. నాకు దక్కిన వాటితో నేను సంతృప్తిగా ఉన్నాను’ అన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.. చెప్పులు లేకుండా తిరిగే వాడిని ‘మా గ్రామంలో నేను చాలా ఆసక్తికర జీవితాన్ని గడిపాను. మా నాన్న వ్యవసాయం చేసేవారు. దాంతో స్కూల్ నుంచి రాగానే మేం పొలం వెళ్లేవాళ్లం. వేసవిలో మా నాన్న మామిడిపళ్ల వ్యాపారం చేసేవారు. మాకు స్కూల్ లేని రోజు మా నాన్న లేబర్‌ను పిలిచేవారు కాదు. మమ్మల్ని పొలం తీసుకెళ్లి పని చేయించేవారు. పొలం పనుల్లో సాయం చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజీలోనే నన్ను చేర్పించారు. కాలేజీలో చేరే వరకు ధోతినే ధరించేవాడిని. కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కావు. అయితే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడు పస్తులుంచలేదు. మూడు పూటలా కడుపు నిండా భోజనం పెట్టేవారు’ అన్నారు. ఇంజనీరింగ్‌లో చేరడానికి వారం రోజులు పస్తులు ఇక ఉన్నత చదువులు గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను. కానీ అది చాలా ఖరీదైన కోర్సు కావడంతో మా నాన్న నన్ను బీఎస్సీ(బ్యాచిలర్ ఆఫ్ సైన్స్)లో చేరమన్నారు. నేను దానికి అంగీకరించలేదు. మా నాన్న నిర్ణయం మార్చాలని వారం రోజుల పాటు తిండి తినడం మానేశాను. అయినా ఫలితం లేదు. చివరకు నా నిర్ణయాన్నే మార్చుకున్నాను. అలా బీఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేశాను. నేను బాగా చదవడంతో మా నాన్నలో మార్పు వచ్చింది. అప్పుడాయన ‘ఒకప్పుడు నీకు నచ్చిన కోర్సులో చేరడానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడలా చేయాలనుకోవడం లేదు. నువ్వు కోరుకున్నట్లే ఇంజనీరింగ్‌లో చేరు’’ అన్నారని తెలిపారు శివన్. ‘నన్ను ఇంజనీర్‌గా చూడటం కోసం మా నాన్న భూమి కూడా అమ్మారు. అలా ఇంజనీరింగ్‌లో చేరాను. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాను. కానీ నాకు వెంటనే ఉద్యోగం దొరకలేదు. ఇప్పటిలా అప్పట్లో ఎక్కువ ఉద్యోగాలు ఉండేవి కావు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో మాత్రమే ఉద్యోగాలు ఉండేవి. దాంతో ఉన్నత చదువుల కోసం ఐఐఎస్సీలో చేరాను’ అన్నారు. అయితే తన జీవితంలో తాను కోరుకుంది ఎప్పుడు దొరకలేదన్నారు శివన్. ‘నేను శాటిలైట్ సెంటర్లో చేరాలని భావించాను.. కానీ విక్రమ్ సారాభాయ్ సెంటర్లో చేరాల్సి వచ్చింది. అక్కడ కూడా ఏరోడైనమిక్స్‌లో జాయిన్ అవ్వాలనుకున్నాను. కానీ పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్‌లో చేరాల్సి వచ్చింది. ఇలా ప్రతి చోటా నేను కోరుకున్నది నాకు లభించలేదు’ అన్నారు శివన్. తాను ఇష్ట పడింది లభించకపోవడంతో.. వచ్చిన దాన్నే ప్రేమించి ఉన్నతంగా ఎదిగారు శివన్. (చదవండి: నా ప్రధాని మంచి మనస్సున్న మనిషి) -
వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్
సాక్షి, శ్రీహరికోట : అంతరిక్ష చరిత్రలోనే భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో చైర్మన్ కే.శివన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్-2 ప్రయోగానంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందన్నారు. అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశ విజయవంతంగా ముగిసిందని, నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశించిందని తెలిపారు. చంద్రుడిపై భారత్ చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఇదని అభివర్ణించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని చెప్పారు. ఇస్రో టీమ్ అహర్నిశలు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మూడు ఉపగ్రహాలను ఒకే రోవర్ ద్వారా ప్రయోగించినట్లు తెలిపారు. ఊహించనదానికంటే చంద్రయాన్-2 తొలిదశ ఎక్కు విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. అభినందనల వెల్లువ.. చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి.. భారత్ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఇస్రోశాస్త్ర వేత్తలను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్వీటర్ వేదికగా శాస్త్రవేత్తలను కొనియాడారు. ‘ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగంతో దేశం మొత్తం గర్వించేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇస్రో ఇలానే మరిన్ని కొత్త విషయాల కోసం ప్రయోగాలు చేపడుతూ విజయవంతం కావాలి.’ అని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చరిత్రలోనే ఇదో అద్భుత ఘట్టమని, మన శాస్త్రవేత్తల శక్తిని,130 కోట్ల భారతీయుల అంకిత భావాన్ని చంద్రయాన్ ప్రయోగం ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కొనియాడిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను తెలంగాణ గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ‘చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు అభినందనలు. కోట్ల కలలను చంద్రునిపైకి తీసుకెళ్లడం చారిత్రాత్మక సందర్భం. మన శాస్త్రవేత్తలు, ఇస్రో భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Congratulations to ISRO on the successful launch of #Chandrayaan2. Historical occasion for India as a billion dreams are being carried to the moon. Best wishes to our scientists and ISRO for their future endeavors. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019 చదవండి: జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్–2