అహ్మదాబాద్ : చంద్రయాన్- 2 ఆర్బిటార్ సమర్థవంతంగా పనిచేస్తోందని.. ఇప్పటికే ప్రయోగాలు ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చైర్మన్ కె.శివన్ అన్నారు. పేలోడ్ ఆపరేషన్లు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే విక్రమ్ ల్యాండర్ నుంచి మాత్రం సిగ్నల్స్ రాకపోవడం బాధించిందని.. ల్యాండర్ విఫలమవడానికి గల కారణాలను జాతీయ స్థాయి కమిటీ విశ్లేషిస్తుందని తెలిపారు. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి శివన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సూర్యుడిపై ప్రయోగాలకు సంబంధించిన మిషన్లపై ఇస్రో దృష్టిసారించిందని పేర్కొన్నారు. త్వరలోనే గగన్‌యాన్ ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు. అదే విధంగా చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే రాకెట్‌ను రూపొందించే అంశంపై ఇస్రో పనిచేస్తుందని తెలిపారు.
కాగా ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్ ల్యాండర్ గల్లంతైంది. ఈ క్రమంలో విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకై ఇస్రో సహా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ల్యాండర్ విక్రమ్ కథ కంచికి చేరినట్లైంది.
ఇక ఇస్రో వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల మేరకు... చంద్రయాన్-2 ఆర్బిటార్‌లో ఉన్న ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నిజానికి ఆర్బిటార్ జీవితకాలం ఏడాది మాత్రమే అయినా.. ఇస్రో దాని జీవితకాలాన్ని పొడగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్బిటార్ ద్వారా.. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పలు వివరాల గురించి తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన త్రీడీ మ్యాపుల రూపకల్పన చేయవచ్చు. అదే విధంగా చంద్రుడి ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం, ఐరన్, సోడియం వంటి మూలకాల ఉనికిని గుర్తించేందుకు తోడ్పడడం వంటి మరెన్నో ప్రయోజనాలు కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment