‘విక్రమ్’ ల్యాండింగ్ సమయంలో వెబ్‌క్యాస్ట్ ద్వారా ఇస్రో తీసిన ఫొటో
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైంది. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎంతో ఆసక్తితో ప్రయోగాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల్లో ఒక్కసారిగా గందరగోళం, నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు దేశ ప్రజలు, అటు శాస్త్రసాంకేతిక నిపుణుల్లో నైతికస్థైర్యం నింపేలా ఇస్రో కీలక ప్రకటన చేసింది.
చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి 90 నుంచి 95 శాతం లక్ష్యాలను అందుకున్నామని తెలిపింది. చంద్రుడికి సంబంధించి తమ పరిశోధనలు కొనసాగుతాయంది. విక్రమ్ ల్యాండర్ అనుకున్న ప్రకారం తన వేగాన్ని తగ్గించుకుని చంద్రుడికి 2.1 కి.మీ దగ్గరకు సమీపించగానే సంకేతాలు నిలిచిపోయాయని చెప్పింది. రాబోయే 14 రోజుల్లో విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను తాము ప్రస్తుతం విశ్లేషిస్తున్నామని చెప్పింది.
ఏడేళ్ల పాటు ఆర్బిటర్ సేవలు..
చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి ఇస్రో కీలక విషయాన్ని ప్రకటించింది. ఇందులో ప్రయోగించిన ఆర్బిటర్ జీవితకాలం ఏడు రెట్లు పెరిగిందని చెప్పింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్–2ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రయోగించిన ఆర్బిటర్ జీవితకాలం 12 నెలలు కాగా, ఇప్పుడు ఏడేళ్ల పాటు పనిచేసే అవకాశముందని ఇస్రో తెలిపింది. వాహకనౌకను అత్యంత కచ్చితత్వంతో ప్రయోగించడం, మిషన్ నిర్వహణ పద్ధతుల కారణంగా ఆర్బిటర్ జీవితకాలం 7 సంవత్సరాలు పెరిగిందని వెల్లడించింది. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో మార్పులు, ఖనిజాలు, నీటి అణువులను ఈ ఆర్బిటర్ విశ్లేషిస్తుందని చెప్పింది. ఇందులోవాడిన అంత్యంత శక్తిమంతమన కెమెరా, చంద్రుడికి సంబంధించిన కీలక ఫొటోలను చిత్రీకరిస్తుందని ఇస్రో పేర్కొంది.
అసలేమైంది..?
కూలిపోయిందా?... సమాచార వ్యవస్థ మాత్రమే పనిచేయడం లేదా?
మళ్లీ పనిచేసే అవకాశముందా? విక్రమ్‌పై ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందేనా?
శనివారం ఉదయం నుంచి భారతీయులందరి మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవే.
కచ్చితమైన సమాధానాలకు కొంత కాలం వేచి చూడాల్సిందేగానీ..
నిపుణులు మాత్రం విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ వైఫల్యానికి పలు కారణాలు చెబుతున్నారు.
విక్రమ్ ల్యాండర్‌తో సమాచారం తెగిపోయేందుకు ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చునని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ అభిప్రాయపడ్డారు. సెన్సర్లు పనిచేయకపోవడం మొదలుకొని, విక్రమ్‌లోని సాఫ్ట్‌వేర్ పనితీరులో తేడాలు, చివరి సెకనులో ఇంజిన్లు అందించే థ్రస్ట్ (చోదక శక్తి)లో మార్పులు వంటి కారణాలు ఉండవచ్చునని.. అసలు కారణమేదో ఇస్రో సమాచార విశ్లేషణతో తెలుస్తుందన్నారు. విక్రమ్ ప్రయాణించాల్సిన మార్గం, వేగాల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెగిపోయేంత వరకూ ఉన్న వివరాలను పరిశీలిస్తే కారణమేమిటో తెలియకపోదు అని ఆయన అన్నారు.
జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో విక్రమ్ దిశ మారిపోయి ఉండవచ్చునని లేదా ఇంజిన్‌లు పనిచేయకపోవడం, కంప్యూటర్ సంబంధిత సమస్యలు వచ్చి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని సాట్‌సెర్చ్ సంస్థ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ నారాయణ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇంకో 2.1 కిలోమీటర్లు మాత్రమే దిగాల్సిన స్థితిలో సమాచార సంబంధాలు తెగడం చూస్తే ఇంజిన్ సమస్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయన్నారు. విక్రమ్ క్రాష్‌ల్యాండ్ అవడంతో, దాని యంటెన్నా ధ్వంసమై సిగ్నల్స్ ఆగిపోయి ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.
గతి తప్పిందా?
సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి విడిపోయి విక్రమ్ ల్యాండర్ క్రమేపీ తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరవడం తెల్సిందే. ఈ క్రమంలో ఇది సుమారు 35 కిలోమీటర్ల ఎత్తు నుంచి నెమ్మదిగా తన వేగాన్ని తగ్గించుకుంటూ ఉపరితలంపైకి నెమ్మదిగా ల్యాండ్ కావాలి. అయితే సమాచార సంబంధాలు తెగిపోయేందుకు క్షణం ముందు వరకూ విక్రమ్ ప్రయాణించిన మార్గాన్ని పరిశీలిస్తే... అది ముందుగా ల్యాండింగ్‌కు నిర్దేశించిన స్థానం నుంచి చాలా పక్కకు జరిగిందని ఒక నిపుణుడు తెలిపారు.
విక్రమ్‌లోని నాలుగు ఇంజిన్లలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా... వేగాన్ని నియంత్రించుకోవడం విక్రమ్ వల్ల అయ్యే పనికాదని, దీంతో అది వేగంగా పడిందేమోనన్నారు. విక్రమ్ ప్రయాణమార్గాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. విక్రమ్ కిందకు దిగే సమయంలో జాబిల్లిపై గురుత్వాకర్షణ శక్తి వివరాలు కచ్చితంగా అందించాల్సిన అవసరముందని.. ఇందులో వచ్చే సూక్ష్మమైన మార్పులనూ లెక్కించాలని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సీఈవో పవన్ చందన చెప్పారు. విక్రమ్‌లోని ఆటానమస్ ల్యాండింగ్ సిస్టమ్ (తనంతట తానే కిందకు దిగేందుకు ఏర్పాటైన వ్యవస్థ), సమాచార వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
విజయావకాశాలు 37 శాతమే
విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ ఆషామాషీ వ్యవహారం కాదని.. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రయోగంలో విజయావకాశాలు కేవలం 37 శాతమే అని శివన్ గతంలో అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు జరిగిన ప్రయత్నాల్లో విజయవంతమైంది 37 శాతమే. ఇస్రో ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. కాబట్టి అందరిలో ఉత్సుకత నెలకొంది’ అని శివన్ శుక్రవారం అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్–2 చివరిక్షణంలో ఎదురుదెబ్బ ఎదుర్కోన్నా 95 శాతం సక్సెసే అనేది నిపుణుల మాట.
Comments
Please login to add a commentAdd a comment