srihari kota
-
శ్రీహరికోట: PSLV C59 ప్రయోగం వాయిదా
తిరుపతి, సాక్షి: శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధన నిర్వహించాల్సిన పీఎస్ఎల్వీ C-59 ప్రయోగం వాయిదా పడింది. ప్రయోగానికి గంట ముందు.. ప్రోబా-3లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో అధికారులు కౌంట్‌డౌన్ నిలిపివేసి.. ప్రయోగాన్ని వాయిదా వేశారు. గురువారం సాయంత్రం 4.12 గంటలకు పీఎస్ఎల్వీ-సీ59 నింగిలోకి పంపుతామని ఇస్రో ప్రకటించింది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందుకోసం పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి!. -
ప్రోబా-3 రెడీ.. పీఎస్ఎల్వీ సీ-59 కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, తిరుపతి జిల్లా: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో అంతర్భాగమైన న్యూస్పెస్ ఇండియా వాణిజ్యపరంగా యూరోపియన్ స్పెస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా–3 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ-59కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.సతీష్‌ధవన్ స్పెస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ–సీ59 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. సోమవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం లాంచ్ అథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగ సమయాన్ని ప్రకటించారు. ప్రయోగానికి 25.30 గంటల ముందు.. అంటే మంగళవారం మధాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ–సీ59 ప్రయోగం నిర్వహిస్తారు. -
అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం సక్సెస్
సాక్షి, తిరుపతి: అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రెవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చేశారుఈ ప్రయోగం విజయంతో ప్రెవేటు రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం చేప్టటింది ఇస్రో. కాగా, ప్రైవేటు స్టార్టప్ కంపెనీ అగ్నికుల్ కాస్మోస్ ఈ రాకెట్‌ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఇప్పటికే 3సార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. -
రైతులకు ఉపగ్రహ ఊతం
ఉత్తర భారతదేశ రైతులు ఒకవైపు దేశ రాజధానిలో కనీస మద్దతు ధరతో పాటు ఇతర హక్కుల సాధన కోసం పోరు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వాన రాకడ, పోకడలతోపాటు వాతావరణానికి సంబంధించి మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించేందుకు ఉద్దేశించినది. రైతులతోపాటు, మత్స్యకారులకూ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వర్గాలకు సకాలంలో అందే హెచ్చరికలు, దీర్ఘకాలిక అంచనాలు ఎంతో ఉపయోగపడతాయి. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల 2050 నాటికి గోధుమ, వరి దిగుబడుల్లో గణనీయ మైన తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇన్షాట్–3డీఎస్ ప్రయోగం దేశంలోనే అతి పురాతనమైన ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం తాలూకూ పరిణతికి నిదర్శనం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్శాట్) కార్యక్రమానికి యాభై ఏళ్ల క్రితమే బీజం పడింది. 1975లో ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలకు అనుమతులు లభించాయి. 1982లో తొలి ఉపగ్రహం (ఇన్శాట్–1ఏ) ప్రయోగం జరిగింది. మొదట్లో ఈ ఉపగ్రహాల్లో అత్యధికం ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి, ఫ్లారిడా(యూఎస్)లోని కేప్ కానవెరల్ నుంచి ప్రయోగించేవారు. ఇన్శాట్–1 శ్రేణి ఉపగ్రహాల కారణంగా భారతీయ వాతావరణ విభాగం ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల రంగంలోకి అడుగుపెట్టింది. తుపానులు, ఈదురుగాలులతోపాటు అల్పపీడనా లను కూడా ఉపగ్రహాల సాయంతో పరిశీలించడం మొదలైంది. 1992లో ప్రయోగించిన ఇన్శాట్–2 శ్రేణి ఉపగ్రహాలు మునుపటి వాటి కంటే సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినవి కావడం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన చాలా హై రెజొల్యూషన్ రేడియో మీటర్లను ఇందులో ఉపయోగించారు. ఫలితంగా రోజువారీ వాతావరణ అంచనాలు, ముందస్తు అంచనాలు, మేఘాల ఛాయాచిత్రాల సేకరణ సులువు అయ్యింది. సమాచార వినిమయానికి కూడా... ఇన్శాట్–1, ఇన్శాట్– 2 శ్రేణి ఉపగ్రహాలు అటు వాతావరణ అంచనాలతోపాటు ఇటు సమాచార వినిమయం, బ్రాడ్‌కాస్టింగ్ రంగా లకూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్శాట్–2 శ్రేణిలోని కొన్ని ఉప గ్రహాల్లో వాతావరణ సంబంధిత పేలోడ్లు అసలు లేకపోవడం గమ నార్హం. కొన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు (తుపానుల మధ్య భాగం వంటివి) భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమెరికా రక్షణ శాఖ ఉపగ్రహాలపై ఆధారపడింది. ఈ సమస్యను అధిగ మించే లక్ష్యంతో ఐఎండీ 2002లో మెట్శాట్ను ప్రయోగించింది. తరు వాతి కాలంలో దీని పేరును కల్పన–1గా మార్చారు. కర్నాల్ (హరియాణా)లో పుట్టి, ‘నాసా’ వ్యోమగామిగా ఎదిగి 2002లో స్పేస్‌షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా స్మరణార్థమన్న మాట! ఈ సమయంలోనే వాతావరణ పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక ఉపగ్రహం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఐఎండీ వ్యక్తం చేసింది. ఫలితంగానే 2013లో ఇన్శాట్–3డీ శ్రేణి మూడోతరం వాతా వరణ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. 2016లో ఇదే శ్రేణిలో ఇంకో ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి –17న ప్రయోగించిన ఉపగ్రహం ఇన్శాట్–3డీ శ్రేణిలో తాజాది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఈ ఉపగ్రహానికి నిధులు సమకూర్చింది. ఐఎండీతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ (నోయిడా), ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (పూణే) వంటి సంస్థలు ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. వాతావరణం, సముద్ర సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇన్శాట్–3డీఎస్ ద్వారా అందుకోవచ్చు. దీంట్లోని పరికరాలు ఆరు రకాల పౌనఃపున్యాలలో ఛాయాచిత్రాలు తీయగలవు. నేల నుంచి మొదలుపెట్టి అంతరిక్షం వరకూ వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, తేమశాతం వంటి వివరాలూ సేకరించగలవు. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, మేఘాల లక్షణాలు, పొగమంచు, వాన, మంచు ఆవరించిన ప్రాంతం, పడిన మంచు మందం, కార్చిచ్చులు, వాతావరణంలోని కాలుష్యకారక కణాలు, టోటల్ ఓజోన్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. ఈ దశలో ఒక వైపు ఉపగ్రహ నిర్మాణంలో దేశీ టెక్నాలజీల వాడకం పెంచుకుంటూనే ఇంకోవైపున ఉపగ్రహ సమాచారాన్ని అందుకునేందుకు, విశ్లేషించేందుకు అవసరమైన భూతల సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకుంది. వాతావరణ ఉపగ్రహాల నుంచి సమా చారం అందుకునేందుకు ఐఎండీ కొత్త కొత్త ఎర్త్ స్టేషన్స్ నిర్మాణాన్ని చేపట్టింది. సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించేందుకు కంప్యూ టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. వాతావరణ మోడలింగ్ కోసం సూపర్ కంప్యూటర్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిన 1980లలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ– డాక్)ను ఏర్పాటు చేసి, దేశీయంగానే హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థ లను అభివృద్ధి చేసే పనిలో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ వాతావరణ సంబంధిత సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మా ణంలో అగ్రగామి దేశంగా నిలిచింది. తాజాగా అంటే గత ఏడాది మరింత అత్యాధునిక వాతావరణ పరిశోధనల కోసం కేంద్ర భూపరి శోధన మంత్రిత్వ శాఖ రెండు సూపర్ కంప్యూటర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ కంపెనీ సాయంతో పది కోట్ల డాలర్ల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు. నోయిడా, పూణెల్లోని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. టెక్నాలజీతోపాటు మారుతూ... వాతావరణ అంచనాల ఫలితాలను సామాన్యులకు చేర్చేందుకు ఐఎండీ టెక్నాలజీతోపాటుగా మారుతూ వచ్చింది. అడ్వయిజరీస్, ఎర్లీ వార్నింగ్, షార్ట్ – మీడియం రేంజ్ స్థానిక అంచనాల వంటివి అందించే వ్యవస్థలను కూడా కాలక్రమంలో ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని టెక్స్ట్ ఎస్ఎంఎస్ రూపంలో పంపితే, మొబైల్ ఫోన్ల కాలంలో వేర్వేరు భాషల్లో సమాచారాన్ని అందించే వీలేర్పడింది. అయితే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులకు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాట్సప్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల వంటి అనేకానేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యమూ ఏర్పడుతోంది. నకిలీ, తప్పుడు వార్తలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈ కాలంలో విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు భారత వాతావరణ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న భారత ప్రయత్నాల్లో ఇన్శాట్–3డీఎస్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. విదేశాల నుంచి ఉపగ్రహాల కొనుగోళ్లు, ప్రయోగాలు నిర్వహించే స్థితి నుంచి మనం సొంతంగా వాతావరణ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలను చేపట్టే స్థితికి చేరాము. అది కూడా భారతీయ రాకెట్ల సాయంతో మనకు కావాల్సిన కక్ష్యలో ప్రవేశ పెట్టగలుగుతున్నాము. సాంకేతిక పరిజ్ఞాన లభ్యతలో ఉన్న అంతరా లను జాగ్రత్తగా గుర్తించడం, విదేశీ టెక్నాలజీలను ఔపోసన పట్టడం, వ్యవస్థలు–ఉప వ్యవస్థల నిర్మాణానికి తగిన కార్యక్రమాలను అమల్లోకి తేవడం, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ , ఐఎండీ, ఇతర శాస్త్రీయ సంస్థలతో సన్నిహితంగా పనిచేయడం వంటి అనేకానేక చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది. ఇటీవలి కాలంలో దేశీ టెక్నాలజీ పరిశ్రమల ముఖచిత్రంలో గణనీమైన మార్పులు వస్తున్నాయి. మైక్రో ఉపగ్రహ సమూహాల ప్రయోగంలో ప్రైవేట్ సంస్థలు బిజీగా ఉంటున్నాయి. వేగంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో స్వావలంబ నకు, మరీ ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీల విషయంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
జీఎస్ఎల్వీ–ఎఫ్14 సక్సెస్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జియో సింక్రనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్14) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 27.30 గంటల అనంతరం నిర్దేశిత సమయానికి రాకెట్ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగంలోని మొత్తం మూడు దశలు విజయవంతమయ్యాయి. 2,275 కిలోల బరువు కలిగిన ఇన్శాట్–3డీఎస్ సమాచార ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు(పెరిజీ), భూమికి దూరంగా 36,647 కిలోమీటర్ల(అపోజీ) జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (భూ బదిలీ కక్ష్య)లో ప్రవేశపెట్టారు. ఇన్శాట్–3డీఎస్‌లో నింపిన 1,250 కిలోల ఇంధనాన్ని దశల వారీగా మండించి, మరో రెండు మూడు రోజుల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్(భూ స్థిరకక్ష్య)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. ఏమిటీ ఇన్శాట్–3డీఎస్? దేశంలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు, విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడానికి ఈ ఉపగ్రహం తోడ్పడనుంది. దీంతో వాతావరణంపై అంచనాల్లో మరింత స్పష్టత రానుంది. ఇన్శాట్–3, ఇన్శాట్–3ఆర్ ఉపగ్రహాలకు అనుసంధానంగా మూడో తరం ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహం పని చేస్తుంది. ఇప్పటిదాకా ఇన్శాట్ శ్రేణిలో 23 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ శాటిలైట్లకు కొనసాగింపుగా ఇన్శాట్–3డీఎస్‌ని అభివృద్ధి చేశారు. ఇందులో ఆరు చానెల్ ఇమేజర్స్, 19 చానెల్ సౌండర్స్తోపాటు మెట్రోలాజికల్ పేలోడ్స్, కమ్యూనికేషన్ పేలోడ్స్‌ను అమర్చారు. వాతావరణ పరిశీలనతోపాటు భూమి, సముద్ర ఉపరితలాల అధ్యయనం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇది ఐదేళ్ల నుంచి పదేళ్ల దాకా సేవలు అందించనుంది. త్వరలో నిస్సార్ ప్రయోగం: సోమనాథ్ నాసా–ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్(నిస్సార్) మిషన్ అనే జాయింట్ ఆపరేషన్ ఉపగ్రహాన్ని ఈ ఏడాది జూన్‌లో జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. పీఎస్ఎల్వీ–సీ59, ఎస్ఎస్ఎల్వీ–డి3, జీఎస్ఎల్వీ–ఎఫ్15 ప్రయోగాలతో పాటు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ఆర్ఎల్వీ–టీడీ–2 ప్రయోగం కూడా నిర్వహించబోతున్నట్లు ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ISRO: జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్శాట్-3డీఎస్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు దీనిని ప్రయోగించారు. పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్శాట్–3డీ, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్శాట్–3డీఎస్‌ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. సుమారు 2,275 కిలోల బరువైన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్లున్నాయి. ఈ పేలోడ్లు వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. ప్రయోగం మొదలైన 20 నిమిషాల తర్వాత జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో)లో శాటిలైట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం దశలవారీగా రెండు రోజులపాటు కక్ష్యను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్బిట్‌లోకి మారుస్తారు. -
ఇస్రో ఆదిత్య-ఎల్ 1 మిషన్.. భగభగల గుట్టు విప్పేనా?
బెంగళూరు: చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయోత్సాహంలో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO).. సూర్యుడిపై తొలిసారిగా ప్రయోగానికి సిద్ధమైంది. భగభగలాడే సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య- ఎల్ 1 (Aditya-L1) ఉపగ్రహాన్ని శ్రీహరి కోట(ఏపీ) అంతరిక్ష కేంద్రం షార్ వేదిక నుంచి ప్రయోగించబోతోంది. కాసేపట్లో ఇస్రో రాకెట్ ‘పీఎస్ఎల్వీ సీ-57 ఆదిత్య ఎల్-1ను నింగిలోకి మోసకెళ్లనుంది. ఈ క్రమంలో ఈ మిషన్ ప్రత్యేకతలు ఓసారి చూద్దాం.. సౌర వ్యవస్థలో భూమి నుంచి సూర్యుడి మధ్య దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఇస్రో ఇప్పుడు సూర్యుడి మీద పరిశోధనలకు ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఆ ప్రవేశపెట్టే ఎల్-1(లాగ్రేంజ్) పాయింట్.. భూమి నుంచి 9లక్షల మైళ్ల దూరం(15 లక్షల కి.మీల)లో ఉంది. భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. అదే భూమి నుంచి చంద్రుడి దూరంతో పోలిస్తే.. నాలుగు రెట్లు ఎక్కువ. మిషన్ ఇలా.. ‘ఆదిత్య-ఎల్ 1’ వ్యోమనౌకను తొలుత దిగువ భూకక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ పయనించిన అనంతరం ప్రొపల్షన్ వ్యవస్థలను ఉపయోగించి ఎల్1 పాయింట్ వైపు మళ్లిస్తుంది ఇస్రో. ఈ క్రమంలో భూమి గురుత్వాకర్షణ ప్రాంతం ప్రభావం (ఎస్ఓఐ) నుంచి బయటపడి, చివరికి ఎల్1 చుట్టూ కక్ష్యలోకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి నిరంతరం సూర్యుడిని కనిపెట్టుకోవటానికి వీలుంటుంది. లాగ్రేంజ్ 1 ప్రాంతానికి చేరుకునేందుకు ఉపగ్రహానికి 125 రోజుల సమయం పడుతుంది. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ).. ఆదిత్య-ఎల్1లో కీలకం. ఇది సూర్యుడికి సంబంధించి ఇది ఒక్కో నిమిషానికి ఒక్కో ఫొటో చొప్పున రోజుకు 1440 ఫొటోలు ఇస్రోకు చేరవేస్తుంది. మొత్తంగా ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ‘విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ)’తో పాటు సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటో మీటర్ ఉన్నాయి. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. శక్తివంతమైన రాకెట్ ‘ఆదిత్య-ఎల్ 1’ ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) రకం రాకెట్‌ను వినియోగిస్తున్నారు. పీఎస్ఎల్వీలో ఇది అత్యంత శక్తిమంతమైనది. 2008లో చంద్రయాన్-1 మిషన్‌లో, 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)లో ఈ రకం రాకెట్లనే వినియోగించారు. సూర్యుడే టార్గెట్ ఎందుకంటే.. అంత దూరంలో ఉన్నప్పటికీ.. సూర్యుడే మనకు సమీప నక్షత్రం. భూమిపై సమస్త జీవరాశి మనుగడకు ఆధారం కూడా. అందువల్ల మిగతా నక్షత్రాలతో పోలిస్తే సూర్యుడిని సవివరంగా అధ్యయనం చేయడం మనకు అవసరం. పైగా ‘పాలపుంత’తో పాటు ఇతర గెలాక్సీల్లోని నక్షత్రాల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడొచ్చు. మరోవైపు.. సూర్యుడిపై విస్ఫోటాల ద్వారా సౌర వ్యవస్థలోకి అపారమైన శక్తి విడుదలవుతుంటుంది. ఇది భూమి వైపు మళ్లినట్లయితే.. మన సమీప అంతరిక్ష వాతావరణంలో అవాంతరాలు ఏర్పడతాయి. ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. కాబట్టి.. ఇటువంటి ఘటనలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. తద్వారా దిద్దుబాటు చర్యలకు అవకాశం లభిస్తుంది అని ఇస్రో భావిస్తోంది. -
Aditya-L1: 2న ఆదిత్య–ఎల్1 ప్రయోగం
బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్ ఘన విజయంతో భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమయింది. సౌర వాతావరణంపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ57 వాహక నౌక ద్వారా సెప్టెంబర్ రెండో తేదీన ఉదయం 11.50 గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పూర్తి దేశీయంగా అభివృద్ధి పరిచిన ఈ శాటిలైట్‌ను రెండు వారాల క్రితమే శ్రీహరి కోటకు తరలించారు. సూర్యుడి వెలుపల పొరలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణ మండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై ఆదిత్య–ఎల్1 అధ్యయనం జరుపుతుంది. సౌర వాతావరణంతోపాటు అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణంపై దాని ప్రభావాన్ని ఇది అధ్యయనం చేస్తుందని ఇస్రో సోమవారం వెల్లడించింది. నిరాటంకంగా పరిశోధనలు భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజ్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుంచి లాంగ్రేజ్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది. లాంగ్రేజ్ పాయింట్ల వద్ద ఉపగ్రహాలు తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుని నిర్దేశిత కక్ష్యలో ఎక్కువ కాలం కొనసాగడంతోపాటు నిర్దేశిత లక్ష్యాలను అందుకునే అవకాశముంటుందని అంచనా. ఈ కక్ష్యలో ఉండే ఆదిత్య–ఎల్1కు గ్రహణాలు, ఇతర గ్రహాలు అడ్డురావు. పరిశోధనలను నిరాటంకంగా జరిపేందుకు వీలుగా ఉంటుందని ఇస్రో తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో.. సుమారు 1,500 కేజీల బరువైన ఈ శాటిలైట్‌లో ఏడు పేలోడ్లు ఉన్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్(ఐఐఏ) ఆధ్వర్యంలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్‌ను తయారు చేసింది. పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ అస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ)ని తయారు చేశారు. సూర్యుడి ఉపరితలంపై 6వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే కాగా, కొరోనా వద్ద 10 లక్షల డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండటానికి కారణాలపై వీఈఎస్సీ వివరాలు సేకరించనుందని ఇస్రో వివరించింది. యూవీ పేలోడ్‌ను, ఎక్స్‌రే పేలోడ్స్‌ను వినియోగించుకుంటూ కొరోనాతోపాటు సోలార్ క్రోమోస్ఫియర్లపై ఆదిత్య–ఎల్1 పరిశీలనలు జరపనుంది. స్పెషల్ వాంటేజ్ పాయింట్ ఎల్1ను ఉపయోగించుకుని నాలుగు పేలోడ్లు సూర్యుడిపై ప్రత్యక్ష పరిశీలన జరుపుతాయి. మిగతా మూడు పేలోడ్లలో అమర్చిన పరికరాలు సూర్య కణాలపై పరిశోధనలు సాగిస్తాయి. కొరోనాలో ఉండే మితిమీరిన ఉష్ణోగ్రతలు, కొరోనల్ మాస్ ఇంజెక్షన్(సీఎంఈ), అంతరిక్ష వాతావరణం వంటి వాటిపైనా ఎస్‌యూఐటీ అత్యంత కీలకమైన సమాచారం పంపుతుందని ఆశిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. -
2న ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
బెంగళూరు: చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగం మొదటి ప్రయత్నంలో విజయవంతమయ్యేలా ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ సీ57 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ‘‘ఆదిత్య–ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2న జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రెండు వారాల క్రితమే ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు తీసుకువచ్చాం’’ అని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. ప్రయోగం విశేషాలివే.. ► భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు ► భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది ► లాంగ్రేజియన్1 పాయింట్లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం వల్ల గ్రహణాలు వంటివి పరిశోధనలకి అడ్డంకిగా మారవు. ► ఆదిత్య ఎల్–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు ► సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, అంతరిక్ష వాతావరణం, భూవాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య–ఎల్1 అధ్యయనం చేస్తుంది. ► సూర్యుడి వెలువల పొరలు, సౌరశక్తి కణాలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణమండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపైన అధ్యయనం జరుగుతుంది. ► మొత్తం ఏడు పే లోడ్లను ఇది మోసుకుపోతుంది. ఈ పేలోడ్లతో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్ ద్వారా సూర్యగోళం నుంచి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ ఏడాది రికార్డే ► ఇస్రో చరిత్రలో 2023 ఒక రికార్డుగా మిగిలిపోనుంది. సూర్య చంద్రుల లోతుల్ని తెలుసుకోవడానికి రెండు నెలల వ్యవధిలో రెండు ప్రయోగాలు చేయడం చరిత్రే మరి. చంద్రయాన్–3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంతో ఇప్పుడు అన్ని దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఆదిత్య–ఎల్1 ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుందనే విశ్వాసం ఏర్పడింది. 2024 చివరికి అంతరిక్షంలోకి మనుషుల్ని పంపి భారతీయుల మరో స్వప్నాన్ని తీర్చాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఊహాచిత్రం -
మామా.. మేమొస్తున్నాం...!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అది శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ (షార్) కేంద్రం. అటు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇటు యావద్దేశం ఊపిరి కూడా బిగబట్టి మరీ అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలైంది. 25.3 గంటల కౌంట్‌డౌన్‌కు నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు తెర పడింది. ఆ వెంటనే ఇస్రో బాహుబలి ఎల్వీఎం3–ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. గత వైఫల్యాల నేపథ్యంలో అంతటా ఉది్వగ్న వాతావరణం. అందరిలోనూ మరింత ఉత్కంఠ. మనసు మూలల్లో ఎక్కడో కాసింత అనుమానం. కానీ, ఉత్కంఠకు తెర దించుతూ, అనుమానాలను పటాపంచలు చేస్తూ మన బాహుబలి దిగి్వజయంగా రోదసి చేరింది. అంతరిక్ష సీమలో విజయనాదం చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పదేళ్ల కల నెరవేరింది. చంద్రయాన్–1, 2 ప్రయోగాలు నిరాశ పరిచినా పట్టు వీడకుండా మొక్కవోని దీక్షతో మన శాస్త్రవేత్తల బృందం రాత్రింబవళ్లు పడిన కష్టం ఎట్టకేలకు ఫలించింది. ముచ్చటగా మూడోసారి చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైంది. మూడు దశల ఎల్వీఎం3–ఎం4 రాకెట్ చంద్రయాన్–3 త్రీ–ఇన్–ఒన్ మిషన్‌ను విజయవంతంగా రోదసి చేర్చి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలుకుని ప్రముఖులంతా ఇస్రోను, ఇంతటి విజయానికి కారకులైన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఆ ఉది్వగ్న క్షణాలు... తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి శుక్రవారం చేపట్టిన చంద్రయాన్–3 ప్రయోగం సూపర్ సక్సెసైంది. 640 టన్నుల ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహకనౌక, 3,920 కిలోల చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు వేగంగా దూసుకెళ్లింది. వెంటనే మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ కంటిమీద రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలించారు. మూడు దశలతో కూడిన ప్రయోగాన్ని 16.09 నిమిషాల్లో పూర్తిచేశారు. చంద్రయాన్–3 మిషన్‌ను భూమికి 36,500 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రోకు ఇది 89వ విజయం. గ్రహాంతర ప్రయోగాల్లో చంద్రయాన్–3 నాలుగో ప్రయోగం కాగా చంద్రునిపై పరిశోధనల నిమిత్తం చేసిన ప్రయోగాల్లో మూడోది. ఇది ఇస్రో బాహుబలి రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్–3 సిరీస్‌లో మూడు ప్రయోగాలు, ఎల్వీఎం–3గా పేరు మార్చాక నాలుగో ప్రయోగం! కార్యక్రమాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రధాని కార్యాలయ ప్రతినిధి జితేంద్రసింగ్ స్వయంగా షార్ కేంద్రం నుంచి వీక్షించారు. ప్రయోగం జరిగిందిలా... ► 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్వీఎం3–ఎం4 రాకెట్ 3,920 కిలోల చంద్రయాన్–3 మిషన్ మోసుకెళ్లింది. ► చంద్రయాన్–3లో 2,145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్ (విక్రమ్), 26 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)ల్లో ఆరు ఇండియన్ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్ అమర్చి పంపారు. ► ఎల్వీఎం3–ఎం4 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగి్వజయంగా ప్రయాణం ప్రారంభించింది. ► ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ► ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్–110) 108.10 సెకన్లకే మొదలైంది. ► 194.96 సెకన్లకు రాకెట్ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్–3 మిషన్ హీట్ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి. ► 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ► అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు. ► రాకెట్ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్ వన్ చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ► ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. ► రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ► ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీ టర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. ► ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ► చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ► చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకలి్పంచగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు. చంద్రుడిపైకి ఇలా వెళ్తుంది... ► చంద్రయాన్–3 మిషన్ మరో 41 రోజుల్లో, అంటే ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. ► 16 రోజుల్లో ప్రొపల్షన్ మాడ్యూల్లో నింపిన 1,696 కిలోల ఇంధనాన్ని మండించి నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ► ఆగస్టు 1న ఐదోసారి ప్రొపల్షన్ మాడ్యూల్‌ను ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుని దిశగా మళ్లిస్తారు. ► తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్‌కు చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు రెట్రో బర్న్ చేసి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యను తగ్గించే ప్రక్రియను నాలుగుసార్లు చేపడతారు. ► అలా ఆగస్టు 17న చంద్రయాన్–3 చంద్రుని కక్ష్యలోకి వెళుతుంది. తరవాత ప్రొపల్షన్ మాడ్యూల్ తన ఎత్తును 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించుకుంటూ ల్యాండర్‌ను విడిచిపెడుతుంది. ► తరవాత ల్యాండర్‌లోని ఇంధనాన్ని కూడా మండించి ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో సాఫ్ట్ లాండింగ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ► ల్యాండర్ విడిపోయిన తరువాత ల్యాండర్‌ను 15 నిమిషాల పాటు మండించి దాన్ని చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ► ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. మొట్టమొదటిగా భారతే చేయడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోంది. ► చంద్రయాన్–1లో వాడిన పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లోనూ వాడారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని కూడా చంద్రయాన్–2 తరహాలోనే నిర్వహించారు. ► చంద్రయాన్–2లో ల్యాండర్, రోవర్లను తీసుకెళిన్ల ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలోనే పని చేస్తూ విలువైన సమాచారం అందిస్తూనే వుంది. ► అందుకే ఈసారి ఆర్బిటర్‌కు బదులు ప్రొపల్షన్ మాడ్యూల్ ద్వారా ల్యాండర్, రోవర్లను పంపారు. ► ఈ ప్రయోగంలో ఇస్రో తొలిసారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజన్లను చంద్రుని ఉపరితలంపై మృదువైన చోట ల్యాండర్‌ను సురక్షితంగా దించేందుకు ఇప్పట్నుంచే ప్రయతి్నస్తున్నారు. మనకిక ఆకాశమే హద్దు మంత్రి జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్ సోమనాథ్ చంద్రయాన్–3 ప్రయోగం నిజంగా సవాలేనని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగం విజయవంతమయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. దేశీయంగా రూపొందించిన ఎల్వీఎం3–ఎం4 రాకెట్ ద్వారా ప్రయోగం తొలి దశను విజయవంతం చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు కలసికట్టుగా పని చేయడమే ఇంతటి భారీ విజయానికి కారణమన్నారు. ‘‘ఇక రాబోయే 41 రోజులు అత్యంత కీలకం. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రునిపై విజయవంతంగా దించేందుకు ప్రయతి్నస్తాం. ఆగస్టు మూడో వారంలో సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తాం. మిషన్ సూర్య, చంద్ర రెండింటినీ పూర్తి చేస్తామని నమ్మకముంది’’ అని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంలో త్వరలో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానానికి చేరనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. ఆగస్టు 23న ల్యాండర్ చంద్రునిపై దిగితే అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కు ఆకాశమే హద్దన్నారు. ఇస్రో చైర్మన్‌తో కలిసిరాకెట్, చంద్రయాన్–3 నమూనాలను ఆయన ఆవిష్కరించారు. భేటీలో చంద్రయాన్–3 ప్రాజెక్టు డైరెక్టర్ పి.వీరముత్తువేల్, మిషన్ డైరెక్టర్ ఎస్. మోహన్‌కుమార్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
జీఎస్ఎల్వీ ప్రయోగం సక్సెస్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): రెండోతరం నావిగేషన్ ఉపగ్రహ సిరీస్‌లో మొదటిదైన ఎన్వీఎస్–01 ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లోని రెండో లాంచింగ్ప్యాడ్ వేదికైంది. 27.5 గంటల కౌంట్‌డౌన్ ముగిశాక సోమవారం ఉదయం 10.42 గంటలకు ఎన్వీఎస్–01 ఉపగ్రహాన్ని 51 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువైన జీఎస్ఎల్వీ రాకెట్ భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు (పెరీజి), భూమికి దూరంగా 36,568 కిలోమీటర్లు (అపోజీ) దీర్ఘవృత్తాకార భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 2,232 కేజీల ఉపగ్రహం అక్కడ స్ధిరంగా ఉన్నట్లు బెంగళూరు దగ్గర్లోని హసన్‌లోని గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందాయి. జీఎస్ఎల్వీ వాహకనౌకను వాడటం ఇది 15వ సారి. 2021 ఆగస్టులో ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్10 అపజయం పాలవడంతో ఆనాటి క్రయోజనిక్ స్థాయి తప్పిదాలను సరిచేసి ఈసారి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో మూడు దశల్లో పెరీజీని పెంచుతూ అపోజీని తగ్గిస్తూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేరుస్తారు. అమెరికా జీపీఎస్, రష్యా గ్లోనాస్ తరహాలో భారత సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావ్ఐసీ(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్– గతంలో భారత క్షేత్రియ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ)ను బలోపేతం చేసే దిశగా ఈ కొత్త తరం ఉపగ్రహాన్ని ఒక పాత ఉపగ్రహం స్థానంలో భర్తీ చేస్తున్నారు. అయితే ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లోని మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడారు. ఇది ఇస్రో సాధించిన సమష్టి విజయమని అన్నారు. భారతదేశ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ ఉపగ్రహాలను ఆరు నెలకొకసారి ప్రయోగిస్తామని తెలిపారు. GSLV-F12/ NVS-O1 Mission is accomplished. After a flight of about 19 minutes, the NVS-O1 satellite was injected precisely into a Geosynchronous Transfer Orbit. Subsequent orbit-raising manoeuvres will take NVS-01 into the intended Geosynchronous orbit. — ISRO (@isro) May 29, 2023 తొలిసారిగా దేశీ అణుగడియారం ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ కొత్త ఉపగ్రహాలు ఎంతగానో దోహదపడతాయి. గతంలో పంపిన ఉపగ్రహాల్లో ఎస్–బ్యాండ్, కె–బ్యాండ్, కేయూ–బ్యాండ్ లాంటి ఉపకరణాలను అమర్చారు. ఈసారి నావిక్–01 ఉపగ్రహంలో ఎల్–1, ఎల్–5, ఎస్–బ్యాండ్ సిగ్నల్స్ వ్యవస్థను అమర్చారు. ఎల్–1లో పౌరులకు ఉపయోగపడే సివిలియన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను పరిచయం చేశారు. సమయం, స్థానం అత్యంత ఖచ్చితంగా తెలిపే తొలిసారిగా దేశీయంగా తయారుచేసిన రుబీడియం అణుగడియారాన్ని ఉపగ్రహంలో అమర్చారు. ఆటమిక్ క్లాక్‌ను తయారుచేస్తే సత్తా ప్రపంచంలో చాలా తక్కువదేశాలకే ఉంది. నావిగేషన్ ఉపగ్రహాల వ్యవస్థలో ఇప్పటికే ఏడు ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థను అందిస్తున్నారు. ఇందులో నాలుగు ఉపగ్రహాలకు కాలపరిమితి ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవాటిని పంపుతున్నారు. కొత్త ఉపగ్రహాలతో భూ, జల, వాయు మార్గాల్లో పొజిషన్‌ను 20 మీటర్ల అత్యంత ఖచ్చితత్వంతో, 50 నానోసెకన్ల రియల్‌టైమ్‌తో చూపించడం, అత్యవసర సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశా నిర్ధేశం, ఇంటర్నెట్తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. దేశానికి ఆవల సైతం 1,500 కిలోమీటర్లదాకా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. -
మరోసారి 36 ఉపగ్రహాలు ప్రయోగానికి ‘వన్‌వెబ్’ ఏర్పాట్లు
న్యూఢిల్లీ: ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు గ్లోబల్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ సంస్థ వన్‌వెబ్ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక మార్క్–3 నుంచి ఈ ఏడాది మార్చి తొలివారంలో ఈ ప్రయోగం చేపట్టనున్నారు. 36 ఉపగ్రహాలు తమ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరాయని, వాటి గమ్యస్థానం భారత్ అంటూ వన్‌వెబ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మాసిమిలియానో లాడోవెజ్ ట్వీట్ చేశారు. వన్‌వెబ్ సంస్థ గత అక్టోబర్ 22న శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక ఎల్వీఎం–3 నుంచి 36 శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించడం తెలిసిందే. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ54 విజయవంతం కావడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు.సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్ఎస్ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్‌తో పాటు.. 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం. చదవండి: ఇస్రో జైత్రయాత్ర: పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం -
అంతరిక్షమే హద్దుగా..
-
Chandrayaan-2: జాబిల్లిని ముద్దాడి రెండేళ్లు
సూళ్లూరుపేట: చందమామ రహస్యాలు, గుట్టుమట్లను విప్పడమే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. చంద్రయాన్–2ను ప్రయోగించి రెండేళ్లు పూర్తయ్యాయి. 2019లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్–2ను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం బెంగళూరులో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చంద్రయాన్–2లో భాగంగా మొదట ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి చంద్రుడి వైపు సుమారు కోటి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్య సమీపానికి చేరుకుంది. సెప్టెంబర్ 6న ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జాబిల్లి రహస్యాలను తెలుసుకోవడానికి వీలుగా మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను అమర్చి పంపారు. శాటిలైట్.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను చంద్రుడిపై సురక్షితంగా జారవిడిచింది. అయితే చివరి రెండు నిమిషాల్లో ఆందోళన నెలకొంది. ల్యాండర్ చంద్రుడిపై దిగే క్రమంలో దాని ఉపరితలాన్ని ఢీకొనడంతో రోవర్ కనిపించకుండా పోయింది. దీంతో ల్యాండర్, రోవర్ల నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ దేశాల సాయం తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. జాబిల్లిపై పలు పరిశోధనలు చేస్తూ ఛాయాచిత్రాలను అందించడంలో విజయవంతంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు పరిభ్రమించి అద్భుతమైన సమాచారాన్ని భూమికి చేరవేసింది. చంద్రుడిపై తేమ ఉనికి.. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇస్రో సోమవారం నుంచి రెండు రోజులపాటు బెంగళూరులో లూనార్ సైన్స్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం మాట్లాడుతూ.. చంద్రయాన్–2లో ఐదు ఉపకరణాలు ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ రెండేళ్లలో ఆర్బిటర్ పంపిన సమాచారాన్ని మీడియాకు వివరించారు. కొన్ని రోజుల క్రితం చంద్రుడి ఉపరితలంపై హైడ్రాక్సిల్ నీటి అణువులను ఆర్బిటర్ కనుగొందన్నారు. ఈ సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. చంద్రుడిపై తేమ ఉనికి ఉన్నట్టుగా కూడా తెలుస్తోందన్నారు. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా పరిభ్రమిస్తూ ఎప్పటికప్పుడు డేటాను ఇస్తోందని తెలిపారు. ఆర్బిటర్‌తోపాటు ఐదు పేలోడ్స్.. వాటి పనులివే.. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారుచేసింది. ఆర్బిటర్.. చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇందులో అమర్చిన లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్.. చంద్రుడి ఉపరితలంపై ప్రధాన మూలకాలను మ్యాపింగ్ చేస్తుంది. ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్.. చంద్రుడిపై నీరు, మంచు వంటి వాటి ఉనికిని శోధిస్తుంది. ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్.. చంద్రుడిపై ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని అందజేస్తుంది. టెరియన్ మ్యాపింగ్ కెమెరా.. చంద్రుడిపై ఖనిజాల అధ్యయనానికి అవసరమైన త్రీడీ మ్యాప్‌లను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. కొనసాగింపుగా చంద్రయాన్–2 అతి తక్కువ ఖర్చుతో ఇస్రో 2008లో తొలిసారిగా చంద్రయాన్–1 ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి కక్ష్యలో ఉపగ్రహాన్ని తిప్పి పరిశోధనలు చేసింది. చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసేలా రూపొందించగా సాంకేతిక లోపంతో పది నెలలు మాత్రమే పనిచేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి చరిత్ర సృష్టించింది. దీనికి కొనసాగింపుగా చంద్రయాన్–2ను ప్రయోగించారు. -
నిప్పులు కక్కుతూ నింగిలోకి..
సాక్షి,అమరావతి/శ్రీహరికోట(సూళ్లూరుపేట ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–50 ఉపగ్రహ వాహక నౌకను గురువారం సాయంత్రం 3.41 గంటలకు విజయవంతంగా ప్రయోగించి ఈ ఏడాది రెండో విజయాన్ని అందుకుంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 20.11 నిమిషాల వ్యవధిలో 1,410 కిలోలు బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహంలో కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరు సమీపంలోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం వారు అదుపులోకి తీసుకున్నారు. ఉపగ్రహానికి ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా వెంటనే విచ్చుకున్నట్టు వారు చెప్పారు. 320 టన్నుల బరువుతో ప్రయాణం 44.4 మీటర్ల పొడవు గల పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది. కౌంట్‌డౌన్ ముగిసే సమయం దగ్గర పడడంతో మిషన్ కంట్రోల్ రూమ్‌లో శాస్త్రవేత్తలు టెన్ నుంచి వన్ దాకా అంకెలు చెబుతూ జీరో రాగానే మంచు తెరలతో కూడిన మబ్బులను చీల్చుకుంటూ పీఎస్ఎల్వీ సీ–50 ఉపగ్రహ వాహకనౌక విజయవంతంగా నింగి వైపునకు దూసుకెళ్లింది. అది ఒక్కో దశను విజయవంతంగా దాటి వెళుతుంటే శాస్త్రవేత్తల వదనాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ రూంలోని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ సంతోషంగా లేచి సహచర శాస్త్రవేత్తలతో కరచాలనం చేశారు. విజయ పరంపర: ఇస్రోకు బ్రహ్మాస్త్రం లాంటి పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ 52వ సారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయబావుటా ఎగురవేసింది. షార్ నుంచి 77వ ప్రయోగం, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 52 ప్రయోగాలు జరగ్గా.. 50 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. గగన్‌యాన్–01 ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం 2021 ప్రారంభంలో పీఎస్ఎల్వీ సీ–51 ప్రయోగాన్ని ఫిక్సల్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆనంద్ అనే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం, యూనిటిశాట్ అనే ఉపగ్రహాన్ని పంపనున్నట్టు చెప్పారు. స్పేస్ కిడ్స్ ప్రోగ్రాం కింద దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసే ఉపగ్రహాలను పంపిస్తామని చెప్పారు. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు చంద్రయాన్–3, సూర్యుడిపైనా పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్–01 గ్రహాంతర ప్రయోగాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ తర్వాత గగన్‌యాన్–01 పేరుతో మానవ సహిత ప్రయోగానికీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) పేరుతో సరికొత్త ప్రయోగాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అనంతరం ప్రయోగాన్ని విజయంతం చేసేందుకు కృషిచేసిన మిషన్ టీం, శాటిలైట్ టీంలను అభినందించారు. పీఎస్ఎల్వీ సీ–50 ద్వారా ప్రయోగించిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) ఉపగ్రహం సేవలు ఎంతో మెరుగ్గా ఉంటాయన్నారు. 11 ఏళ్ల కిందట ప్రయోగించిన జీశాట్–12 స్థానంలో ఈ ఉపగ్రహం సేవలందిస్తుందని తెలిపారు. సీఎంఎస్–01 ఉపగ్రహాన్ని విజయవంతంగా సబ్ జీటీవో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టామని, శుక్రవారం నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు సార్లు మండించి సబ్ జీటీవో ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతామన్నారు. ఈ ప్రక్రియ నాలుగు రోజుల పాటు నిర్వహించి 21వ తేదీన భూమికి 36 వేల కి.మీ ఎత్తులోని జియో ఆర్బిట్‌కు పంపిస్తామని శివన్ వివరించారు. ప్రయోగంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, పలు సెంటర్ల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు.. పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినదందనలు తెలిపారు. భారీ ప్రయోగాలే లక్ష్యం : ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఈ ఏడాది కోవిడ్–19 పరిస్థితుల దృష్ట్యా 8 నెలల పాటు ప్రయోగాలన్నింటికీ బ్రేక్ పడ్డాయని, ప్రస్తుతం ఆ పరిస్థితులను అధిగమించి రెండు ప్రయోగాలను విజయ వంతం చేయగలిగామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ చెప్పారు. 2021 సంవత్సరం స్పేస్ రీఫామ్ ఇయర్‌గా ఉంటుం దని తెలిపారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–50 ప్రయోగం విజయవంతం కావడంతో ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రసంగించారు. -
విదేశీ ఉపగ్రహ మార్కెట్‌పై ఇస్రో దృష్టి
సాక్షి, అమరావతి: ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం గమనార్హం. అతి తక్కువ వ్యయంతో ఒకేసారి పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సామర్థ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కలిగి ఉండటంతో విదేశాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. 1999లో తొలిసారిగా జర్మనీకి చెందిన డీఎల్ఆర్–టబ్‌సాట్ రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్‌ను విజయవం తంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇస్రో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఇస్రో స్వయం ప్రతిపత్తి... విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో 2018–19లో రికార్డు స్థాయిలో రూ.324.19 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2017–18లో రూ.232.56 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. గడిచిన ఐదేళ్లలో రూ.1,245.17 కోట్ల నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇస్రో తన ప్రయోగాలకు సొంతంగానే నిధులను సమకూర్చుకునే స్థితికి చేరుకుంటోంది. విదేశీ ఉపగ్రహా ప్రయోగాల కోసం బెంగళూరు కేంద్రంగా ఆంట్రిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1992లో ఏర్పాటైన ఈ సంస్థ గడిచిన మూడేళ్లలో 239 ఒప్పందాల ద్వారా రూ.6,280 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సముపార్జించింది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో పీఎస్ఎల్వీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు పీఎస్ఎల్వీ 52.7 టన్నుల శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. గత నెలలోనే పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. వచ్చే మార్చిలోగా ఆరుసార్లు ఉపగ్రహలను నింగిలోకి పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. పదేళ్లలో రూ.20,300 కోట్లు రానున్న పదేళ్లలో అంతర్జాతీయ శాటిలైట్ మార్కెట్ వేగంగా విస్తరించనుందని బీఐఎస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17,000కుపైగా మినీ శాటిలైట్లను ప్రయోగిస్తారని చెబుతోంది. ప్రస్తుతం రూ.3,591 కోట్లుగా ఉన్న శాటిలైట్ లాంచింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20,300 కోట్లకు చేరుతుందని బీఐఎస్ లెక్కగట్టింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఇస్రో వాటా కేవలం 2 శాతమే. ఈ వ్యాపార అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి ఆంట్రిక్స్కు అనుబంధంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) పేరిట 2019లో మరో సంస్థను ఇస్రో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విదేశాలకు చెందిన ఉపగ్రహ ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధి వ్యాపారంపై దృష్టి సారిస్తుంది. -
‘విక్రమ్’ ఎక్కడ..?
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైంది. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎంతో ఆసక్తితో ప్రయోగాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల్లో ఒక్కసారిగా గందరగోళం, నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు దేశ ప్రజలు, అటు శాస్త్రసాంకేతిక నిపుణుల్లో నైతికస్థైర్యం నింపేలా ఇస్రో కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి 90 నుంచి 95 శాతం లక్ష్యాలను అందుకున్నామని తెలిపింది. చంద్రుడికి సంబంధించి తమ పరిశోధనలు కొనసాగుతాయంది. విక్రమ్ ల్యాండర్ అనుకున్న ప్రకారం తన వేగాన్ని తగ్గించుకుని చంద్రుడికి 2.1 కి.మీ దగ్గరకు సమీపించగానే సంకేతాలు నిలిచిపోయాయని చెప్పింది. రాబోయే 14 రోజుల్లో విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను తాము ప్రస్తుతం విశ్లేషిస్తున్నామని చెప్పింది. ఏడేళ్ల పాటు ఆర్బిటర్ సేవలు.. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి ఇస్రో కీలక విషయాన్ని ప్రకటించింది. ఇందులో ప్రయోగించిన ఆర్బిటర్ జీవితకాలం ఏడు రెట్లు పెరిగిందని చెప్పింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్–2ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రయోగించిన ఆర్బిటర్ జీవితకాలం 12 నెలలు కాగా, ఇప్పుడు ఏడేళ్ల పాటు పనిచేసే అవకాశముందని ఇస్రో తెలిపింది. వాహకనౌకను అత్యంత కచ్చితత్వంతో ప్రయోగించడం, మిషన్ నిర్వహణ పద్ధతుల కారణంగా ఆర్బిటర్ జీవితకాలం 7 సంవత్సరాలు పెరిగిందని వెల్లడించింది. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో మార్పులు, ఖనిజాలు, నీటి అణువులను ఈ ఆర్బిటర్ విశ్లేషిస్తుందని చెప్పింది. ఇందులోవాడిన అంత్యంత శక్తిమంతమన కెమెరా, చంద్రుడికి సంబంధించిన కీలక ఫొటోలను చిత్రీకరిస్తుందని ఇస్రో పేర్కొంది. అసలేమైంది..? కూలిపోయిందా?... సమాచార వ్యవస్థ మాత్రమే పనిచేయడం లేదా? మళ్లీ పనిచేసే అవకాశముందా? విక్రమ్‌పై ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? శనివారం ఉదయం నుంచి భారతీయులందరి మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవే. కచ్చితమైన సమాధానాలకు కొంత కాలం వేచి చూడాల్సిందేగానీ.. నిపుణులు మాత్రం విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ వైఫల్యానికి పలు కారణాలు చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్‌తో సమాచారం తెగిపోయేందుకు ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చునని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ అభిప్రాయపడ్డారు. సెన్సర్లు పనిచేయకపోవడం మొదలుకొని, విక్రమ్‌లోని సాఫ్ట్వేర్ పనితీరులో తేడాలు, చివరి సెకనులో ఇంజిన్లు అందించే థ్రస్ట్ (చోదక శక్తి)లో మార్పులు వంటి కారణాలు ఉండవచ్చునని.. అసలు కారణమేదో ఇస్రో సమాచార విశ్లేషణతో తెలుస్తుందన్నారు. విక్రమ్ ప్రయాణించాల్సిన మార్గం, వేగాల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెగిపోయేంత వరకూ ఉన్న వివరాలను పరిశీలిస్తే కారణమేమిటో తెలియకపోదు అని ఆయన అన్నారు. జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో విక్రమ్ దిశ మారిపోయి ఉండవచ్చునని లేదా ఇంజిన్లు పనిచేయకపోవడం, కంప్యూటర్ సంబంధిత సమస్యలు వచ్చి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని సాట్సెర్చ్ సంస్థ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ నారాయణ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇంకో 2.1 కిలోమీటర్లు మాత్రమే దిగాల్సిన స్థితిలో సమాచార సంబంధాలు తెగడం చూస్తే ఇంజిన్ సమస్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయన్నారు. విక్రమ్ క్రాష్‌ల్యాండ్ అవడంతో, దాని యంటెన్నా ధ్వంసమై సిగ్నల్స్ ఆగిపోయి ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. గతి తప్పిందా? సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి విడిపోయి విక్రమ్ ల్యాండర్ క్రమేపీ తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరవడం తెల్సిందే. ఈ క్రమంలో ఇది సుమారు 35 కిలోమీటర్ల ఎత్తు నుంచి నెమ్మదిగా తన వేగాన్ని తగ్గించుకుంటూ ఉపరితలంపైకి నెమ్మదిగా ల్యాండ్ కావాలి. అయితే సమాచార సంబంధాలు తెగిపోయేందుకు క్షణం ముందు వరకూ విక్రమ్ ప్రయాణించిన మార్గాన్ని పరిశీలిస్తే... అది ముందుగా ల్యాండింగ్‌కు నిర్దేశించిన స్థానం నుంచి చాలా పక్కకు జరిగిందని ఒక నిపుణుడు తెలిపారు. విక్రమ్‌లోని నాలుగు ఇంజిన్లలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా... వేగాన్ని నియంత్రించుకోవడం విక్రమ్ వల్ల అయ్యే పనికాదని, దీంతో అది వేగంగా పడిందేమోనన్నారు. విక్రమ్ ప్రయాణమార్గాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. విక్రమ్ కిందకు దిగే సమయంలో జాబిల్లిపై గురుత్వాకర్షణ శక్తి వివరాలు కచ్చితంగా అందించాల్సిన అవసరముందని.. ఇందులో వచ్చే సూక్ష్మమైన మార్పులనూ లెక్కించాలని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సీఈవో పవన్ చందన చెప్పారు. విక్రమ్‌లోని ఆటానమస్ ల్యాండింగ్ సిస్టమ్ (తనంతట తానే కిందకు దిగేందుకు ఏర్పాటైన వ్యవస్థ), సమాచార వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విజయావకాశాలు 37 శాతమే విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ ఆషామాషీ వ్యవహారం కాదని.. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రయోగంలో విజయావకాశాలు కేవలం 37 శాతమే అని శివన్ గతంలో అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు జరిగిన ప్రయత్నాల్లో విజయవంతమైంది 37 శాతమే. ఇస్రో ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. కాబట్టి అందరిలో ఉత్సుకత నెలకొంది’ అని శివన్ శుక్రవారం అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్–2 చివరిక్షణంలో ఎదురుదెబ్బ ఎదుర్కోన్నా 95 శాతం సక్సెసే అనేది నిపుణుల మాట. -
చంద్రయాన్-2: కీలక దశ విజయవంతం
సాక్షి, న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ ఆర్బిటర్ నుంచి విడిపోయే కార్యక్రమం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నాం 1:15 గంటలకు ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది. ఈ దృశ్యాలనంతా ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిరంగా తిలకించారు. ఈనెల 7న చంద్రుని ఉపరితలంపైకి విక్రమ్ ల్యాండర్ చేరుకోనుంది. దీంతో చంద్రయాన్-2 ప్రయోగం జాబిల్లికి అత్యంత చేరువలోకి చేరుకోగలిగింది. జూలై 22న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 కొద్దిరోజుల పాటు భూకక్ష్యలో పరిభ్రమించి ఆగస్ట్20న చంద్రుడి కక్ష్యలోని ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నాలుగుసార్లు దాని కక్ష్యని శాస్త్రవేత్తలు తగించారు. ఆదివారం సాయంత్రం ఐదోసారి తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయగలిగారు. దీంతో చంద్రయాన్-2 అత్యంత కీలక దశను విజయవంతంగా పూర్తిచేయగలిగింది. -
తదుపరి లక్ష్యం సూర్యుడే!
సూళ్లూరుపేట: భారత, అమెరికా అంత రిక్ష పరిశోధనా సంస్థలు (ఇస్రో, నాసా) సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. గతేడాదే దీనిపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ఇటీవలే సూర్యుడిపై పరిశోధనలకు సోలార్ ప్రోబ్ అనే ప్రయోగాన్ని చేపట్టింది. దీని తర్వాత ఇస్రో–నాసా కలిసి మరో ప్రయోగాన్ని చేపట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో హ్యూమన్ స్పేస్ ప్రోగ్రాం ముందుగానే ప్రయోగించే అవకాశముం టుందని గతంలోనే ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజియన్ బిందువు–1 (ఎల్–1)లోకి చేరవేస్తారు. అక్కడి నుంచి ఎలాంటి అడ్డంకుల్లేకుండా సూర్యుడిని నిత్యం పరిశీలించడం వీలవు తుందని భావిస్తున్నారు. సూర్యుడి వెలు పలి వలయాన్ని కరోనా అంటారు. అక్కడ దాదాపు పది లక్షల డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుడి అంతర్భాగంలో ఆరు వేల డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత ఉంటుంది. కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం అంతుచిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1తో పరిశోధనలు చేస్తారు. అన్నీ సమకూరితే 2020 ఆఖరులోపు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని పలుమార్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
ఫొటోలు పంపిన చంద్రయాన్–2
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్–2 తొలిసారి అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలను పంపింది. ప్రస్తుతం చంద్రయాన్–2 భూమికి–చంద్రుడికి మధ్యలోని భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమిస్తోంది. శనివారం సాయంత్రం 5.28 గంటలకు భూమిని ఉత్తరం ధృవం వైపు నుంచి తీసిన ఐదు ఫొటోలను ఆదివారం ఇస్రో తన సొంత వెబ్సైట్లో అధికారికంగా విడుదల చేసింది. చంద్రయాన్–2 కక్ష్య దూరాన్ని ప్రస్తుతం భూమికి దగ్గరగా 277 కిలోమీటర్లకు, దూరంగా 89,472 కిలోమీటర్ల ఎత్తుకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమికి 5,000 కిలోమీటర్ల దగ్గరగా వచ్చిన సమయంలో 10 నిమిషాల వ్యవధిలో ఐదు ఫొటోలను తీసి బెంగళూరు సమీపంలోని బైలాలు భూ నియంత్రిత కేంద్రానికి పంపింది. చంద్రయాన్–2లో ఉన్న ల్యాండర్ (విక్రమ్)లో ఎల్–14 కెమెరా ఈ చిత్రాలను తీసింది. చంద్రుడి ఉపరితలం మీద దిగే 15 నిమిషాలు విజయవంతమైతే చంద్రయాన్–2 యాత్ర సజావుగా సాగినట్టేనని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫొటోలు ఎప్పుడెప్పుడంటే.. భూమికి ఉత్తర ధృవం నుంచి 5 వేల కిలోమీటర్ల ఎత్తులో ఒక ఛాయా చిత్రం, 5.29 గంటలకు 4,700 కిలోమీటర్ల్ల ఎత్తులోకి వచ్చాక మరో ఛాయాచిత్రాన్ని తీసింది. ఆ తరువాత 5.31 గంటలకు 4,100 కిలోమీటర్ల్ల ఎత్తు నుంచి, 17.34 గంటలకు 3,200 కిలో మీటర్ల ఎత్తు నుంచి, 17.37 గంటలకు 2,450 కిలోమీటర్ల ఎత్తు నుంచి మరో మూడు ఛాయా చిత్రాలను తీసి పంపింది. -
చంద్రయాన్–2 ఆగడానికి కారణమిదే
నెలల ఉత్కంఠకు బ్రేక్ పడింది.. జాబిల్లిని ఇంకోసారి అందుకోవాలన్న ఇస్రో ప్రణాళిక వాయిదా పడింది.. అంతా బాగుంది.. చంద్రయాన్ –2 నింగికి ఎగురుతుంది.. అని ఆశించినా.. సాంకేతిక లోపం కారణంగా ప్రయోగం వాయిదా అన్న ప్రకటన భారతీయుల్లో తీవ్ర నిరాశ నింపింది. అయితే.. మలి ప్రయోగం ఎప్పుడు? శ్రీహరికోట (సూళ్లూరుపేట)/సాక్షి నాలెడ్జ్ సెంటర్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం ప్రయోగించతలపెట్టిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1–చంద్రయాన్–2 ప్రయోగం సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. క్రయోజనిక్ దశలో సాంకేతిక లోపం కారణంగానే ప్రయోగం ఆగిపోయిందని తెలిసింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ 19.4 గంటల సమయం పూర్తై, ఇంకా 56.24 నిమిషాల కౌంట్‌డౌన్ ఉన్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. 19.4 గంటలపాటు నిర్వహించిన కౌంట్‌డౌన్ సమయంలో ఎల్–110 దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. తర్వాత సీ–25 దశలో అంటే.. మూడో దశలో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. ప్రయోగం ఇక 56.24 నిమిషాల్లో జరుగుతుందనగానే ఉన్నట్టుండి కౌంట్‌డౌన్ ప్రక్రియను నిలిపేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని, ప్రయోగం మళ్లీ ఎప్పుడు జరిపేదీ త్వరలోనే తెలియజేస్తామన్న ఇస్రో ప్రకటనతో ఏం జరిగిందన్న అంశానికి ప్రాధాన్యం పెరిగిపోయింది. పోగో గ్యాస్ బాటిల్లో లీకేజీ వల్లే.. ఉపగ్రహ వాహకనౌకలో అత్యంత కీలకంగా భావించే క్రయోజనిక్ దశలో గ్యాస్ బాటిల్ (పోగో బాటిల్) లీకేజీ వల్ల ప్రయోగాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. క్రయోజనిక్ ఇంజన్లకు అతిముఖ్యమైన పోగో గ్యాస్ బాటిల్స్‌లో గ్యాస్ లీకేజీ జరిగితే ఇంజన్లకు తగిన థ్రస్ట్ రాదని భావించి 56.24 నిమిషాలకు ముందే ప్రయోగాన్ని ఆపేశారు. ఎస్–200 బూస్టర్లు, ఎల్–110 దశలో బాగా పనిచేసినా సీ–25 దశలో తగిన వేగం రాదని భావించి కౌంట్‌డౌన్ ప్రక్రియను శాస్త్రవేత్తలు నిలిపేశారు. క్రయోజెనిక్ ఇంజన్లో ఇంధనం లీకేజీ కారణంగానే ప్రయోగం వాయిదా పడిందని కొందరు నిపుణుల అంచనా. శాస్త్రవేత్తలు రాత్రికి రాత్రే క్రయోజనిక్ దశలో 25 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని వెనక్కి తీసేశారు. ఇంకా అందులో అడుగు భాగాన, పక్కన ఆనుకుని ఉన్న ఇంధనపు పొరలను తొలగించేందుకు నైట్రోజన్ వ్యాపర్స్‌ను లోపలకు పంపించి పూర్తిగా శుభ్రం చేయాల్సి ఉంది. దీనికి మరో ఐదు రోజులు పడుతుంది. అయితే.. రాకెట్‌ను మొత్తం విప్పదీయాల్సి ఉండడంతో క్రయో ఇంధనంతోపాటు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని వెనక్కి తీసే ప్రక్రియను సోమవారం ఉదయం నుంచి చేపట్టారు. రాకెట్ విడి భాగాలను మొత్తంగా విప్పదీసి మళ్లీ అసెంబ్లింగ్ చేయాల్సి ఉండడంతో ఈ ప్రయోగం ఈ ఏడాది చివరి వరకు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే.. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్లో క్రయోజనిక్ దశలో సాంకేతిక లోపం తలెత్తడం ఇదే మొదటిసారి కావడంతో దీనిపై పట్టు సాధించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాంకేతిక లోపం ఎలా జరిగిందనే దానిపై ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నారు. దీనిపై ఒక కమిటీని సైతం వేయనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రయోగాన్ని నిలిపివేసి సుమారు రూ.600 కోట్లు ఆదా చేయగలిగారు. జీఎస్ఎల్వీతోనే సమస్య? చంద్రయాన్–2 ప్రయోగానికి వాడుతున్న జీఎస్ఎల్వీ కారణంగానే ప్రయోగం వాయిదా పడిందా? అంటే అవునని అంటున్నారు కొందరు నిపుణులు. జీఎస్ఎల్వీకి చంద్రయాన్–2 కేవలం నాలుగో ప్రయోగం కావడం ఇందుకు ఒక కారణమైతే.. అందులో వాడుతున్న క్రయోజనిక్ ఇంజన్‌తోనూ ఇస్రోకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా ఒత్తిడి మేరకు రష్యా నాలుగు క్రయోజనిక్ ఇంజన్లను మాత్రమే మనకు అందజేసింది. వాటిలో కొన్ని ఇప్పటికే విఫలం కాగా మిగిలి ఉన్న ఒకే ఒక్క ఇంజన్ సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు సొంతంగా పరిశోధనలు చేపట్టి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కొత్త ఇంజన్లను తయారుచేశారు. చంద్రయాన్–1 తర్వాత ఇస్రో సొంతంగా తయారుచేసిన క్రయోజనిక్ ఇంజన్ సాయంతో జీశాట్–4 ఉపగ్రహాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది. అయితే.. ఇంజన్ ఆన్ కాకపోవడంతో రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఆ తర్వాత చేసిన మూడు ప్రయోగాలు విజయవంతం కావడంతో చంద్రయాన్–2కు ఈ రాకెట్‌ను ఎంపిక చేశారు. అయితే క్రయోజనిక్ ఇంజన్ నుంచి అతిశీతల పరిస్థితుల్లో ఉండే ఇంధనం లీక్ కావడం, ఇంజన్‌లోని కొన్ని వాల్వ్‌లు సక్రమంగా పనిచేయకపోవడాన్ని గుర్తించడం వల్ల ప్రయోగాన్ని ఆపేశారని కొంతమంది నిపుణుల అంచనా. ‘అంత పెద్ద ప్రయోగంలో చిన్నచిన్న సమస్యలు సహజమే. సమస్య ఉందని గుర్తించాక ఏ మాత్రం అవకాశం తీసుకోకూడదు’అని డీఆర్డీవో శాస్త్రవేత్త రవిగుప్తా అన్నారు. ‘ప్రయోగం కోసం దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. సమస్య సాధారణమైందా? సంక్లిష్టమైందా? అన్నది ప్రధానం కాదు. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రయోగాన్ని కొనసాగించలేం’అని ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ మాజీ డైరెక్టర్ జి.బాలచంద్రన్ తెలిపారు. నిరాశగా వెనుదిరిగిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం సాయంత్రం షార్కు వచ్చిన ఆయన జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్‌ను సందర్శించి రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. రాత్రి 12.30 గంటలకు ప్రయోగాన్ని తిలకించేందుకు మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. ప్రయోగం వాయిదా పడటంతో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పి సోమవారం ఉదయాన్నే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు. -
చంద్రయాన్- 2 వాయిదా
శ్రీహరికోట/సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత పదేళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కఠోర శ్రమ చేసి రూపొందించిన చంద్రయాన్-2 ప్రయోగం సాంకేతిక కారణాల కారణంగా ఆదివారం అర్థరాత్రి వాయిదా పడింది. సోమవారం తెల్లవారుజామున 2.51 నిమిషాలకు తలపెట్టిన జీఎస్ఎల్వీ-3 ఎం–1 రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం కారణంగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆదివారం ఉదయం 6.51 నిమిషాలకు ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఆధ్వర్యంలో కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ప్రయోగానికి 56.24 నిమిషాల ముందుగా అంటే1.55 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. రాకెట్లో అత్యంత కీలక దశగా ఉన్న మూడో దశలో క్రయోజనిక్ ఇంజిన్‌కు సంబంధింన బ్యాటరీలు చార్జ్ కాకపోవడంతో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలు స్తోంది. దీంతో పాటు క్రయోజనిక్‌లో ఉండే గ్యాస్ బాటిల్ లీకేజీ రావడం కూడా సాంకేతిక లోపానికి మరో కారణంగా గుర్తించారు. దీంతో ప్రస్తుతానికి ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. ఈ విధమైన సాంకేతిక లోపం గతంలో ఎన్నడూ జరిగిన దాఖలాలు లేవు. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు ఈ లోపం జరిగిందో దానిపై ఆత్మ విమర్శ చేసుకుంటున్నారు. కాగా, చంద్రయాన్-2 ప్రయోగాన్ని సెప్టెంబర్ 9న నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ‘షార్’కు రాష్ట్రపతి : భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చంద్రయాన్-2 ప్రయోగాన్ని వీక్షించడానికి ‘షార్’కు వచ్చారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆయన రేణిగుంట నుంచి షార్ కేంద్రానికి చేరుకున్నారు. షార్‌లోని హెలీప్యాడ్ వద్ద ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్, షార్ డైరెక్టర్ ఎ.రాజరాజన్, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అక్కడ నుంచి నక్షత్ర అతిథిగృహానికి చేరుకున్నారు. అనంతరం 7 గంటలకు చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించిన రెండో ప్రయోగ వేదిక వద్దకు చేరుకుని జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్‌ను సందర్శించారు. ఆ తరువాత షార్‌లో సుమారు రూ.650 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 60 ఏళ్లుగా పరిశోధనలు.. చంద్రుడి గురించి తెలుసుకోవడానికి గడిచిన 60 ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలు ఇప్పటివరకు 125 ప్రయోగాలు చంద్రుడి పైనే చేశాయని ఐక్యరాజ్య సమితి వెల్లడిస్తోంది. ఆ వివరాలు.. 1958 నుంచి అమెరికా చంద్రుడిపై పరిశోధనలను ప్రారంభించింది. 12 ప్రయోగాలు చేసిన తరువాత 13వ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి చేరుకుంది. అలా ఇప్పటిదాకా 58 ప్రయోగాలు చేసి 41 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. 1969లో అపోలో రాకెట్ ద్వారా నీల్ ఆమ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్ర్న్, మైఖేల్ పోలీన్స్ అనే ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించిన ఘనత అమెరికా పేరు మీదే వుంది. ఇక రష్యా కూడా 1958 నుంచి 53 ప్రయోగాలు చంద్రునిపైకి చేసింది. అందులో 35 మాత్రమే విజయవంతమయ్యాయి. జపాన్ అయితే 1990 నుంచి ఆరు ప్రయోగాలు సొంతంగా, ఒక్క ప్రయోగం నాసాతో కలిసి చేసింది. ఇందులో ఐదు విజయవంతమయ్యాయి. 2010 నుంచి చైనా కూడా ఏడు ప్రయోగాలు చేయగా ఒక్క ప్రయోగం ద్వారా మాత్రమే చంద్రుని దాకా వెళ్లగలిగింది. ఇజ్రాయిల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రునిపైకి ల్యాం డర్‌ను పంపించినా అది విజయవంతం కాలేదు. జర్మనీ 2003లో చంద్రుని మీదకు ఆర్బిటర్‌ను విజయవంతంగా పంపించింది. భారత్ విషయానికొస్తే 2008లో చంద్రుడి మీదకు ఆర్బిటర్‌ను ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని కనుగొంది. ఈ దేశాలన్నీ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగాలు చేసినపప్పటికీ ప్రధానంగా అమెరికా, రష్యాలే ఈ రంగంలో ఇప్పటికీ పోటీపడుతున్నాయి. తాజాగా.. భారత్ రెండోసారి ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దింపి అందులో అమర్చిన రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. -
చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?
చందమామ చుట్టూ ఎన్నో కథలు, కల్పనలు... చందమామ చుట్టూ ఎన్నెన్నో పాటలు, ఆటలు... చంద్రుని మీద కనిపించే మచ్చ కుందేలులా కనిపిస్తుంది. నిజానికి అక్కడ కుందేలేమైనా ఉందా? అక్కడ లేకుంటే భూమ్మీద నుంచి కుందేలును పంపితే– ఆ కుందేలు అక్కడ సంతోషంగా ఉంటుందా? చంద్రుని గురించి మనకు కొంత తెలుసు. చాలా తెలీదు. చంద్రుడి మీద మానవుడు అడుగుమోపి ఐదు దశాబ్దాలు గడిచాయి. అయినా, చంద్రుడి గురించి తెలుసుకోవలసిన సంగతులు కొండంత. నేడు చంద్రయాన్–2 ప్రయోగం సందర్భంగా... అందిన చందమామను మరోసారి అందుకోవడానికి సిద్ధపడుతున్నారు మన శాస్త్రవేత్తలు. చందమామ మీద అందీ అందని రహస్యాలను అందిపుచ్చుకోవడానికి నేడు ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని తలపెడుతున్నారు. ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని మైలస్వామి అన్నాదురై నేతృత్వంలో ఇదివరకు విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలోనే ‘చంద్రయాన్–2’ ప్రయోగం జరుగుతోంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో ఈ ప్రయోగం మరో మైలురాయిగా నిలిచిపోతుంది. రష్యా అంతరిక్ష సంస్థ (రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ–రాస్‌కాస్మోస్) సహకారంలో ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు మరోసారి చంద్రుడి మీద పరిశోధనలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ‘చంద్రయాన్–2’ మిషన్‌లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జియోసెంట్రిక్ లాంచ్ వెహికల్–మార్క్3 (జీఎస్ఎల్వీ–మార్క్3 ) వాహనం ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను నేడు చంద్రుని దిశగా అంతరిక్షంలోనికి పంపనున్నారు. ఇందులో మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు తయారు చేసిన లూనార్ ఆర్బిటర్, రోవర్లతో పాటు రష్యా అంతరిక్ష సంస్థ తయారు చేసిన ల్యాండర్‌ను ప్రయోగించనున్నారు. ఇందులో చక్రాలు కలిగిన రోవర్ యంత్రం సౌరశక్తితో పనిచేస్తూ, చంద్రుని ఉపరితలంపై సంచరించి, అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి, వాటి రసాయనిక విశ్లేషణ జరిపి, ఆ సమాచారాన్ని ‘చంద్రయాన్–2’ ఆర్బిటర్ ద్వారా భూమిపైనున్న ‘ఇస్రో’ పరిశోధన కేంద్రానికి చేరవేస్తుంది. ‘చంద్రయాన్–2’ ప్రయోగం కోసం దాదాపు పుష్కరకాలం నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రయోగంలో కలసి పాల్గొనాలని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు, రష్యా అంతరిక్ష సంస్థ (రాస్‌కాస్మోస్) 2007 నవంబరు 12న ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందానికి 2008 సెప్టెంబర్ 18న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కేబినెట్ బృందం ఆమోదం తెలిపింది. ‘ఇస్రో’, రాస్కాస్మోస్ల ఒప్పందం ప్రకారం రోవర్, ఆర్బిటర్ల తయారీ బాధ్యతను ‘ఇస్రో’ తీసుకోగా, ‘రాస్‌కాస్మోస్’ ల్యాండర్ తయారీ బాధ్యతలను చేపట్టింది. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్ చంద్రునికి 200 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ‘రాస్‌కాస్మోస్’ తయారు చేసిన ల్యాండర్.. ‘ఇస్రో’ తయారు చేసిన రోవర్‌ను చంద్రుని ఉపరితలంపైకి దిగవిడుస్తుంది. వీటిని అంతరిక్షంలోకి చేరవేసే జీఎస్ఎల్వీ–మార్క్3 వాహనం ఆకృతిని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2009 ఆగస్టులోనే సిద్ధం చేశారు. దీని బరువు 2650 కిలోలు. ల్యాండర్, రోవర్ల బరువు దాదాపు 1250 కిలోలు. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్‌లో ఐదు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిలో మూడు కొత్తగా రూపొందించినవైతే, మిగిలిన రెండూ చంద్రయాన్–1లో ప్రయోగించిన పాత ఉపగ్రహాలే. అయితే, మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు వీటిని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేశారు. అన్నీ స్వదేశీ పరికరాలే... చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా జీఎస్ఎల్వీ–మార్క్3 వాహనాన్ని భారతీయ కాలమానం ప్రకారం జూలై 14న వేకువ జామున 2.51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందులోని ల్యాండర్ ద్వారా రోవర్ యంత్రం చంద్రుని ఉపరితలం మీదకు సెప్టెంబర్ 6న చేరుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్బిటర్ ద్వారా ఐదు, ల్యాండర్ ద్వారా నాలుగు, రోవర్ ద్వారా రెండు సాంకేతిక పరికరాలను ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపుతున్నారు. చంద్రయాన్–2లో భాగంగా, అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, యూరోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్ఏ) కూడా కొన్ని సాంకేతిక పరికరాలను పంపాలని భావించినా, బరువు పరిమితుల కారణంగా విదేశీ పరికరాలనేవీ ఈ ప్రయోగంలో పంపరాదని ‘ఇస్రో’ బృందం నిర్ణయించింది. చంద్రయాన్–1 తరహాలోనే చంద్రుని ఉపరితలంపై విశేషాలను మరింత లోతుగా తెలుసుకునే ఉద్దేశంతో ‘ఇస్రో’ ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా అంతరిక్షంలోకి పంపుతున్న సాంకేతిక పరికరాల ద్వారా చంద్రుని ఉపరితలాన్ని రోవర్ ద్వారా జల్లెడపట్టి, ఉపరితలంపై మట్టిలోని రసాయనాల విశేషాలను, ఒకవేళ చంద్రునిపై నీటి అణువుల జాడ ఏమైనా ఉందేమో తెలుసుకోవాలని భావిస్తోంది. రోవర్‌కు అమర్చిన టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా–2 (టీఎంసీ–2), మినియేచర్ సింథటిక్ అపెర్చర్ రాడార్ (మినీ–సార్) పరికరాలు చంద్రయాన్–1లో ఉపయోగించిన పరికరాల కంటే మరింత మెరుగైనవి. వీటిలో టీఎంసీ–2 చంద్రుని ఉపరితలానికి చెందిన త్రీడీ మ్యాప్‌లను ఆర్బిటర్‌లోని పరికరాల ద్వారా భూమిపైకి పంపుతుంది. అలాగే, మినీ–సార్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పేరుకుపోయి ఉన్న మంచులోని నీటి కణాలను, అక్కడి మట్టిని, మట్టి మందాన్ని విశ్లేషించి, ఆ సమాచారాన్ని భూమిపైకి పంపుతుంది. చంద్రుని చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణంలోని అత్యంత ఎగువ పొర అయిన ‘అయానోస్ఫియర్’లోని ఎలక్ట్రాన్ల సాంద్రతను ‘డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్’ (డీఎఫ్‌ఆర్‌ఎస్) పరికరం విశ్లేషిస్తుంది. ఐఆర్ స్పెక్ట్రోమీటర్ పరికరం చంద్రునిపై నీటి అణువుల జాడను, ఖనిజాలను గుర్తించి, ఆ సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. ఆర్బిటర్‌కు అమర్చిన హైరిజల్యూషన్ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ల్యాండర్ చంద్రుని ఉపరితలంపైన నిర్దేశిత ప్రదేశానికి సురక్షితంగా చేరుకోగానే త్రీడీ ఫొటోలు తీసి, వాటిని భూమిపైకి పంపిస్తుంది. చంద్రయాన్–2లోని ‘సోలార్ ఎక్స్‌రే మానిటర్’ చంద్రుని వాతావరణానికి ఎగువన ఆవరించి ఉన్న ‘కరోనా’ ప్రాంతంలో సూర్యకిరణాల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదీ కొలవడానికి ఉపయోగపడుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంలో సంచరించనున్న రోవర్ తెలుసుకునే సమాచారాన్ని ఆర్బిటర్ ఎప్పటికప్పుడు భూమిపైకి చేరవేస్తూ ఉంటుంది. ఇది చంద్రుని కక్ష్యలో ఏడాది పాటు పరిభ్రమిస్తుంది. చందమామ అందిన రోజు చంద్రుని చుట్టూ ఎన్నో పురాణాలు ఉన్నాయి. అభూత కల్పనలు ఉన్నాయి. అందరాని చందమామను అందుకోవాలనే తపన మానవుల్లో చాలా ఏళ్లుగానే ఉండేది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ ఈ తపన మరింత ఎక్కువైంది. మానవుడికి సంకల్పబలం ఉండాలే గాని, అసాధ్యమైనదేదీ లేదని నిరూపిస్తూ అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 జూలై 16న భూమిపై నుంచి చంద్రునిపైకి ప్రయాణించాడు. చందమామ మానవుడి చేతికందిన అద్భుతమైన రోజు అది. అపోలో–11 వ్యోమనౌకలో బయలుదేరిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై అడుగు మోపిన తొట్టతొలి మానవుడిగా చరిత్ర సృష్టించాడు. చంద్రుడి ధూళిని సేకరించి భూమిపైకి విజయవంతంగా తిరిగివచ్చాడు. అయితే, అంతకు పదేళ్ల ముందే, 1959లో రష్యా చంద్రునిపైకి లూనా–2 వ్యోమనౌకను విజయవంతంగా పంపింది. చంద్రుడిపైకి మానవులు పంపిన వస్తువు ఒకటి చేరుకోవడం చరిత్రలో అదే మొదటిసారి. చంద్రునిపైకి వ్యోమనౌకలను పంపడానికి రష్యా అంతకు ముందు మూడుసార్లు చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. రష్యన్ శాస్త్రవేత్తలు 1958 సెప్టెంబర్ 23, అక్టోబర్ 12, డిసెంబర్ 4లలో పంపిన వ్యోమనౌకలేవీ చంద్రునిపైకి చేరుకోలేకపోయాయి. వరుస వైఫల్యాల తర్వాత ‘లూనా’ ప్రయోగాలకు రష్యా నడుం బిగించింది. ఇందులో భాగంగా 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ చంద్రునికి 5,965 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని తప్పింది. తిరిగి లోపాలను దిద్దుకుని అదే ఏడాది సెప్టెంబర్ 13న పంపిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రునిపైకి చేరుకోగలిగింది. అయితే, చంద్రునిపైకి మనిషిని తొలిసారిగా పంపిన ఘనత మాత్రం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) దక్కించుకోగలిగింది. ‘నాసా’ ఆధ్వర్యంలో జరిపిన ప్రయోగంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 జూలై 20న చంద్రునిపై తొలి అడుగు మోపి, అక్కడి నుంచి ‘చంద్రుని మీద మనిషి మోపిన తొలి అడుగు మానవాళికే ముందడుగు’ అంటూ సందేశం పంపాడు. చంద్రునిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మోపిన తొలి అడుగు ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే చాలా దేశాలు చంద్రుడిని చేరుకోవడానికి, చంద్రుడి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నాటి నుంచి నేటి వరకు వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు చంద్రుడి వద్దకు ఉపగ్రహాలు, వ్యోమనౌకలు పంపుతూ కీలకమైన సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చందమామ ఏనాటికైనా మానవులకు ఆవాసం కాకపోతుందా అనే ఆశతో చేస్తున్న ప్రయోగాల్లో ఇప్పటికే అనేక విజయాలు సాధించాయి. చంద్రునిపై పంటలు పండించడం ఎంతవరకు సాధ్యమవుతుందో తెలుసుకోవడానికి చైనా ఇటీవల ఒక ప్రయత్నం చేసింది. చంద్రునిపై పత్తి విత్తనాలను మొలకెత్తించింది. చంద్రుని ఉపరితలంపై రాత్రివేళ అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మొలకెత్తిన విత్తనం జీవాన్ని పుంజుకోకుండానే అంతరించిపోయింది. ‘చంద్రయాన్–1’ సాధించిందేమిటంటే..? చంద్రునిపై పరిశోధనల కోసం ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇదివరకు చేపట్టిన చంద్రయాన్–1 గణనీయమైన ఫలితాలనే సాధించింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2008 అక్టోబర్ 22న ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని చేపట్టారు. అందులో భాగంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ–సీ 11) ద్వారా పంపిన ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3,400 సార్లు పరిభ్రమించి, కీలకమైన సమాచారాన్ని చేరవేసింది. దీని నుంచి 2009 ఆగస్టు 29న కమ్యూనికేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ (ఓహెచ్), నీరు (హెచ్2ఓ) అణువుల ఉనికిని తొలిసారిగా గుర్తించగలగడం ‘చంద్రయాన్–1’ సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు. ‘చంద్రయాన్–1’ చంద్రుని ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, క్యాల్షియం వంటి మూలకాల ఉనికిని కూడా గుర్తించింది. ‘చంద్రయాన్–1’లో భాగంగా చంద్రునిపైకి చేరుకున్న టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా (టీఎంసీ) ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత స్పష్టతతో కూడిన త్రీడీ చిత్రాలను భూమిపైకి చేరవేయగలిగింది. దీని ద్వారా చంద్రుని ఉపరితలంపై లావా ట్యూబుల ఉనికిని గుర్తించడం సాధ్యమైంది. ఇలాంటి లావా ట్యూబులు భవిష్యత్తులో చంద్రుడు మానవుల ఆవాసంగా ఉపయోపడే అవకాశాలపై గల ఆశలకు ఊపిరిపోస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. చంద్రునిపై ఆసక్తి ఏనాటిదంటే? గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో చంద్రునిపై మనుషుల్లో ఆసక్తి ఆధునిక పరిశోధనలు మొదలు కావడానికి వేల సంవత్సరాల ముందు నుంచే ఉండేది. నాగరికతలు మొదలు కాక ముందు నుంచే భూమ్మీద నివసించే మనుషులు సూర్యచంద్రులను గమనిస్తూనే ఉన్నారు. నాగరికతలు మొదలైన తొలినాళ్లలో సూర్యచంద్రులను దేవతలుగా ఆరాధించడం మొదలైంది. శాస్త్రీయంగా సూర్యచంద్రుల స్వరూప స్వభావాలను తెలుసుకోవాలనే ఆసక్తి క్రీస్తుపూర్వమే మొదలైంది. సూర్యచంద్రులు రెండూ అంతరిక్షంలోని భారీ రాతిగోళాలని క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్ తొలిసారిగా ప్రకటించాడు. శాస్త్రీయమైన దృష్టితో తన పరిశీలనకు తోచిన సంగతి చెప్పిన పాపానికి నాటి గ్రీకు పాలకులు మత విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడనే ఆరోపణతో ఆయనను ఖైదులో పెట్టారు. నిండు పున్నమినాడు భూమ్మీద మనుషులకు చంద్రుడు పూర్ణ కాంతులతో దర్శనమిస్తాడు. ఎంత పూర్ణకాంతులతో ధగధగలాడుతున్నా చంద్రుడిపై అక్కడక్కడా మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలను సైతం నాటి మనుషులు నిశితంగా పరిశీలించారు. చంద్రుడిపై కుందేలు ఆకారంలోని నీడను చూసి అనేక అభూత కల్పనలను ఊహించుకున్నారు. చంద్రుడిపై భారీస్థాయి ఎత్తు పల్లాలు ఉన్నందు వల్లనే చంద్రుడి ఉపరితలంలోని కొన్ని ప్రదేశాలకు సూర్యకాంతి చేరుకోలేకపోతోందని, అందుకే మనకు అక్కడక్కడా మచ్చల్లా కనిపిస్తున్నాయని మొట్టమొదటిసారిగా క్రీస్తుశకం రెండో శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త ప్లూటార్క్ తన ‘ఆన్ ది ఫేస్ ఇన్ ది మూన్స్ ఆర్బ్’ గ్రంథం ద్వారా తెలిపాడు. చంద్రుడిపై పడి పరావర్తనం చెందిన సూర్యకాంతి కారణంగానే చంద్రుడు మనకు వెన్నెల వెలుగులతో కనిపిస్తున్నాడని క్రీస్తుశకం ఐదో శతాబ్దికి చెందిన మన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట తొలిసారిగా ప్రకటించాడు. కొంతకాలానికి మనుషులు ఖగోళ విశేషాలను మరింత నిశితంగా తెలుసుకోవడానికి దుర్భిణుల వంటి సాధనాలను రూపొందించుకున్నారు. గ్రహాలు, నక్షత్రాల తీరుతెన్నులను తెలుసుకునే ఉద్దేశంతో వేధశాలలను ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో బాగ్దాద్‌లో ఏర్పాటు చేసిన వేధశాల నుంచి పర్షియన్ ఖగోళ శాస్త్రవేత్త హబాష్ అల్ హసీబ్ అల్ మర్వాజీ చంద్రుని వ్యాసం 3,037 కిలోమీటర్లు ఉంటుందని, భూమికి చంద్రునికి మధ్యనున్న దూరం 3,46,345 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశాడు. ఆయన అంచనాలు అధునాతన పరిశోధనల్లో నిగ్గుతేలిన అంచనాలకు దాదాపు దగ్గరగా ఉండటం విశేషం. పదహారో శతాబ్దికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో శక్తిమంతమైన టెలిస్కోప్‌ను రూపొందించి, దాని ద్వారా చంద్రుడు, నక్షత్రాలు, గ్రహచలనాలను ఏళ్ల తరబడి పరిశీలించి, అనేక విషయాలను వెల్లడించాడు. అంతరిక్షంలో భారతీయుడు సోవియట్ రష్యా 1984 ఏప్రిల్ 2న ప్రయోగించిన సోయజ్ టీ–11 రాకెట్ ద్వారా భారత పైలట్ రాకేశ్ శర్మ చంద్రమండలానికి చేరువగా అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లాడు. అంతరిక్షంలో అడుగు మోపిన తొలి భారతీయుడిగా ఘనత సాధించిన రాకేశ్ శర్మ అంతరిక్షంలో దాదాపు ఎనిమిది రోజులు గడిపాడు. తిరిగి భూమిపైకి చేరుకున్న తర్వాత రష్యన్ బృందంతో కలసి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు, ఇందిరాగాంధీ ఆయనను ‘అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎలా కనిపించింది?’ అని అడిగారు. ఆమె ప్రశ్నకు రాకేశ్ శర్మ ‘సారే జహా సే అచ్ఛా’ (ప్రపంచంలోనే అత్యుత్తమంగా) కనిపించిందని బదులిచ్చాడు. ప్రచ్ఛన్న యుద్ధంతో అందిన చందమామ అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒకరకంగా చంద్రునిపై ఆధునిక పరిశోధనల పురోగతికి దోహదపడింది. ఇరవయ్యో శతాబ్దిలో నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రెండు దేశాలూ అంతరిక్షంపై ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. చంద్రునిపై ప్రత్యేకించి దృష్టి సారించాయి. ఎలాగైనా చంద్రునిపైకి చేరుకోవాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలను రంగంలోకి దించి, భారీ స్థాయి పరిశోధనలకు నడుం బిగించాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న హోరాహోరీ పోటీలో కొన్ని విఫలయత్నాల తర్వాత 1959లో లూనా–2 ప్రయోగం ద్వారా రష్యా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత లూనా–3 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా చేసింది. చంద్రుని ఉపరితలం ఫొటోలను తీసి ప్రపంచానికి చూపింది. రష్యాను మించిన స్థాయిలో ఏకంగా మనిషినే చంద్రునిపైకి పంపాలని నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ తలచాడు. జాతీయ సత్వర అవసరాల సభలో ఆయన ఈ అంశాన్ని ముందుకు తెచ్చాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు భారీగా నిధులు మంజూరు చేశాడు. ఫలితంగా రష్యా చేపట్టిన లూనా–2 ప్రయోగానికి పదేళ్ల తర్వాత 1969లో అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుమోపగలిగాడు. వేగం పుంచుకున్న ‘ఇస్రో’ చంద్రునిపై పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్లతో పోల్చుకుంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఇస్రో ఆధ్వర్యంలో చంద్రునిపై చేపట్టిన తొలి ప్రయోగం 2008 నాటి ‘చంద్రయాన్–1’. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘చంద్రయాన్–2’ కోసం అప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. చంద్రునిపై ‘ఇస్రో’ ప్రయోగాలు ‘చంద్రయాన్–1’ నుంచి వేగం పుంజుకున్నాయి. ‘చంద్రయాన్–2’ పూర్తయిన తర్వాత 2024లో ‘చంద్రయాన్–3’ ప్రయోగం చేపట్టడానికి ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ44
సాక్షి, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పీఎస్ఎల్వీ-సీ44 రాకెట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. గురువారం రాత్రి 11 గంటల 37 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ44 కక్ష్యలోకి తీసుకెళ్లింది. తమిళనాడుకు చెందిన విద్యార్థులు రూపొందించిన కలాంశాట్‌తో పాటు మైక్రోశాట్ ఉపగ్రహాలను కూడా నిగింలోకి పంపారు. మైక్రోశాట్ ఉపగ్రహాలు దేశ రక్షణ రంగానికి సమాచారాన్ని అందించనుంది. డీఆర్డీవో రక్షణ విభాగంలో మైక్రోశాట్ ఉపగ్రహాల సేవలను వినిమోగించనున్నారు. కాగా పీఎస్ఎల్వీ సీరిస్‌లో ఇది 46వ ప్రయోగం తెలిసిందే. నూతన సంవత్సరంలో (2019) ఇస్రో ప్రయోగించిన తొలి ప్రయోగం విజయవంతం కావడం విశేషం. దీనికి కృషిచేసిన విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ శివన్ అభినందనలు తెలిపారు.