సజావుగా‘మార్స్ ఆర్బిటర్’
చెన్నై/బెంగళూరు/బీజింగ్: ‘ఇస్రో’ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ వ్యోమనౌక భూ కక్ష్యలో సజావుగా సాగుతోంది. పీఎస్‌ఎల్‌వీ సీ-25 రాకెట్ ద్వారా దీనిని మంగళవారం భూ కక్ష్యలోకి విజయవంతంగా పంపిన తర్వాత ఇది సజావుగానే ముందుకు సాగుతోందని, దీని కక్ష్యను గురువారం పొడిగించనున్నామని ‘ఇస్రో’ ప్రతినిధి ఒకరు తెలిపారు. కక్ష్యను పొడిగించేందుకు గురువారం వేకువ జామున 1.17 గంటలకు బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి ఫైరింగ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మార్స్ ఆర్బిటర్ డిసెంబర్ 1న భూకక్ష్యను దాటి అంగారకుని కక్ష్య వైపు సాగనుంది. ఈలోగా ఇది భూమి చుట్టూ ఐదుసార్లు పరిభ్రమించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు మార్స్ ఆర్బిటర్‌ను ప్రయోగించగా, 44 నిమిషాల వ్యవధిలో ఇది భూ కక్ష్యను చేరుకున్న సంగతి తెలిసిందే.
భూకక్ష్యలో తొలివిడత పరిభ్రమణంలో ఉన్న మార్స్ ఆర్బిటర్, బుధవారం మధ్యాహ్నం 1.09 గంటల సమయానికి ఆఫ్రికాలోని నైజీరియాను దాటి చాద్ మీదుగా ముందుకు సాగుతున్నట్లు ‘ఇస్రో’ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, అంతరిక్షంలో చైనాదే ముందంజ అని, చైనాతో పోటీపడటంలో మనం దారుణంగా విఫలమయ్యామని ‘ఇస్రో’ మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. ఐదేళ్ల కిందట అంతరిక్షరంగంలో భారత్, చైనాలు సమ ఉజ్జీలుగా ఉండేవని, కొన్ని సాంకేతిక నైపుణ్యాల్లోనైతే భారత్ ముందంజలో ఉండేదని చెప్పారు. గ త ఐదేళ్లలో భారత్ నిద్రపోతుంటే, చైనా నిలకడగా ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. చైనా నుంచి పదిమంది వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్లి తిరిగి వచ్చారని అన్నారు. అంతరిక్షంలోని దిగువ కక్ష్యలోకి ఏకంగా 25 టన్నుల బరువు తీసుకుపోగలిగే హెవీలిప్ట్ లాంచర్‌ను కూడా తయారు చేసుకుందని, దీంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోనే చైనా ముందంజకు చేరుకుందని అన్నారు.
‘మార్స్ ఆర్బిటర్’ మిషన్ గొప్ప విజయం: చైనా నిపుణులు
భారత్ చేపట్టిన మార్స్ ఆర్బిటర్ ప్రయోగాన్ని గొప్ప విజయంగా చైనా నిపుణులు అభివర్ణించారు. ఒకవేళ ఇది పూర్తిగా విజయవంతమైతే, ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టిన తొలి ఆసియా దేశంగా భారత్ ఘనత సాధిస్తుందని చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లోని దక్షిణాసియా అధ్యయన కేంద్రం నిపుణుడు యె హైలిన్ అన్నారు. ‘మార్స్ ఆర్బిటర్’ మిషన్ ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా చేపట్టడంపై చైనా అధికారిక దినపత్రికలన్నీ పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించాయి. దీంతో భారత్ అంగారకునిపై పరిశోధనల్లో చైనా కంటే ముందంజలోకి చేరగలదని వ్యాఖ్యానించాయి. అయితే, అంతరిక్ష రంగంలో పోటీకి బదులు భారత్, చైనాలు కలసి కృషి చేస్తే మంచిదని యె హైలిన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, అమెరికన్ మీడియా కూడా మార్స్ ఆర్బిటర్ మిషన్‌పై ప్రముఖంగా కథనాలను ప్రచురించింది. సాంకేతిక రంగంలో భారత్‌కు ఇది గొప్ప ముందడుగు అని అమెరికా మీడియా అభివర్ణించింది.
తిరుమలలో రాధాకృష్ణన్ పూజలు
సాక్షి, తిరుమల: మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతం కావడంతో ‘ఇస్రో’ చైర్మన్ రాధాకృష్ణన్ సతీసమేతంగా తిరుమల విచ్చేశారు. బుధవారం వేకువ జామున 3 గంటలకు సుప్రభాత సేవలో వెంకన్నను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు రాధాకృష్ణన్ దంపతులను ఆశీర్వదించారు. రాధాకృష్ణన్‌ను జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు పట్టువస్త్రంతో సత్కరించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. రాధాకృష్ణన్ మాట్లాడుతూ, నిర్ణీత కక్ష్యలో మార్స్ ఆర్బిటర్ సజావుగా ముందుకు సాగుతోందని, డిసెంబర్ 1న దీనిని అంగారక కక్ష్యలోకి ప్రవేశపెడతామన్నారు.