Mars Orbiter Mission
-
వారెవ్వా! అదిరిపోయిన ఎలన్ మస్క్ మార్స్ విజన్ వీడియో..!
స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ గతంలో రాబోయే ఐదేళ్లలో మనిషి మార్స్ మీదకు చేరడం ఖాయమని, అందుకు తనది హామీ అని, అదీ స్పేస్ఎక్స్ ద్వారానే సాధ్యం అవుతుందని గతంలో చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా మస్క్ వేగంగా చర్యలు చేపట్టారు. స్పేస్ఎక్స్ తన ప్రతిష్టాత్మక స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్ మొదటి కక్ష్య ప్రయోగం పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతరిక్ష నౌకలో అంగారక గ్రహాన్ని ఎలా చేరుకొనున్నారో అనే దాని గురించి బిలియనీర్ ఎలన్ మస్క్ తన ట్విటర్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఎలన్ మస్క్ ట్వీట్ చేస్తూ.. "ఇది మన జీవితకాలంలో నిజం కాబోతుంది" అంటూ స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్ మార్స్ టూర్ కి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ పోస్టును 58 వేల మందికి పైగా లైక్ చేశారు. ఇప్పటివరకు నిర్మించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్ ఇది. స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ ఎత్తు 390 అడుగుల(119 మీటర్ల) వరకు ఉంటుంది. Starship to Mars simulation https://t.co/fkpYvv5pMR — Elon Musk (@elonmusk) February 15, 2022 2050 నాటికి 10 లక్షల మందిని అంగారక గ్రహానికి పంపాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2025లో తొలిసారి మనిషిని అక్కడికి తీసుకొని వెళ్లాలని చూస్తున్నారు. మార్స్ మీదకు మనిషి ప్రయాణం అనేది ఎలన్ మస్క్ చిన్ననాటి కల. ఆ కలే అతనితో రాకెట్ ఇంజినీరింగ్‌తో పాటు స్పేస్ఎక్స్ ప్రయోగానికి బీజం వేయించింది. (చదవండి: బంగారం కొనేవారికి భారీ శుభవార్త..!) -
మామ్ @ 1000 రోజులు
బెంగళూరు: అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)అరుణగ్రహం కక్ష్యలో తిరుగుతూ విజయవంతంగా వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ‘6 నెలల వ్యవధి కోసం రూపొందించిన ఈ అంతరిక్ష నౌక లక్ష్యాన్ని అధిగమించి తన కక్ష్యలో 1000 రోజులు (భూమిపై 1000 రోజులు కాగా, అరుణ గ్రహంపై 973.24 రోజులు) విజయవంతంగా పూర్తి చేసుకుంది. 388 సార్లు తన కక్ష్యలో తిరిగింది’అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ ఉపగ్రహం పనితీరు మెరుగ్గా ఉందని, అనుకున్నట్లుగానే పని చేస్తోందని, అక్కడి సమాచారాన్ని అందిస్తూనే ఉందని ఇస్రో వివరించింది. 2014 సెప్టెంబర్ 24న మామ్‌ను అరుణగ్రహం కక్ష్యలోకి ఇస్రో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రవేశపెట్టింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన పీఎస్ఎల్వీ రాకెట్ సాయంతో శ్రీహరికోట నుంచి 2013 నవంబర్ 5న ఈ నౌకను ప్రయోగించారు. అనేక సంవత్సరాలకు సరిపడా ఇంధనం ఉండటంతో నౌక విజయవంతంగా పనిచేస్తూనే ఉందని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. అరుణగ్రహం ఉపరితలంపై ఖనిజాల జాడ వెతికేందుకు, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసి జీవం ఉందని సూచించే మీథేన్‌ను కనిపెట్టేందుకు రూ.450 కోట్లతో తయారుచేసిన ఈ మామ్‌ను అక్కడికి పంపించారు . లీమన్ ఆల్ఫా ఫొటోమీటర్ (లాప్), మీథేన్ సెన్సార్ ఫర్ మార్స్ (ఎంఎస్ఎం), మార్స్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైజర్ (ఎంఈఎన్‌సీఏ), మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ), థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ (టీఐఎస్) అనే పరికరాలు మామ్‌లో ఉన్నాయి. కలర్ కెమెరాతో ఇప్పటివరకు మామ్ 715కు పైగా ఫొటోలను పంపిందని ఇస్రో తెలిపింది. -
మామ్ కెమెరాలో 'అరుణ' చంద్రుడు
ఇరవై రోజుల క్రితమే అంగారకుడి చెంతకు చేరిన మన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్; మంగళ్యాన్)’ ఉపగ్రహం తాజాగా అరుణగ్రహానికి సహజ ఉపగ్రహమైన ఫోబోస్‌ను త న కెమెరాలో బంధించింది. మార్స్‌కు 66,275 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మామ్ ఈ ఫొటోలు తీసిందని పేర్కొంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మంగళవారం తన ఫేస్బుక్ పేజీలో చిన్న వీడియో ఫుటేజీని ఉంచిం ది. అన్నట్టూ... అంగారకుడికి రెండు చంద్రుళ్లు ఉన్నారండోయ్. వీటిలో పెద్దదైన ఫోబోస్ సగటు వ్యాసార్థం 11 కిలోమీటర్లే. మార్స్‌కు జస్ట్ 6 వేల కిలోమీటర్ల దూరం నుంచే తిరుగుతుండటం వల్ల ఇది 7:39 గంటలకే ఒకసారి అంగారకుడిని చుట్టి వస్తుంది. మన చంద్రుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు కదా.. ఈ అరుణ చంద్రుడు మాత్రం పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణిస్తాడట! అంతేకాదు.. ఫోబోస్ ప్రతి వందేళ్లకు ఓ మీటరు చొప్పున మార్స్‌కు దగ్గరవుతున్నాడట. అందువల్ల మరో 5 కోట్ల ఏళ్లలో ఈ చంద్రుడు అంగారకుడిని ఢీకొట్టడం లేదా.. పేలిపోయి ఉంగరం ఆకారంగా మిగిలి పోవడం జరగవచ్చట! ఇక మార్స్‌కు రెండో ఉపగ్రహమైన డైమోస్.. ఫోబోస్ కన్నా 7 రెట్లు చిన్నది. ఇది 30 గంటలకు ఓసారి అంగారకుడిని చుట్టి వస్తోంది. -
అంగారకుడిపై ధూళి తుపాను!
బెంగళూరు: అరుణగ్రహం ఉత్తరార్ధగోళంపై ఆదివారం భారీ ధూళి తుపాను చెలరేగింది. ప్రాంతీయ స్థాయిలో ఏర్పడిన ఈ తుపానును మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం తన కలర్ కెమెరాలో బంధించింది. ధూళి తుపాను సంభవించినప్పుడు అంగారకుడికి 74,500 కి.మీ. ఎత్తులో ఉన్న మామ్ ఈ ఫొటోను తీసిందని పేర్కొంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది. గత బుధవారమే అంగారకుడి కక్ష్యలోకి చేరి చరిత్ర సృష్టించిన మామ్.. గురువారం మార్స్ తొలి ఫొటోను పంపిన విషయం తెలిసిందే. -
మార్స్ మిషన్‌లో సెయిల్ ఉక్కు
హైదరాబాద్: అంగారక గ్రహానికి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)లో తమ భాగస్వామ్యం కూడా ఉందని ఉక్కు దిగ్గజం సెయిల్ పేర్కొంది. అరుణ గ్రహానికి వెళ్లిన పీఎస్ఎల్వీకి సంబంధించి ఇంధనం, ఆక్సిడైజర్ ట్యాంకుల ఫ్యాబ్రికేషన్‌లో సెయిల్ ఉక్కును ఉపయోగించినట్లు వివరించింది. ఇందుకోసం సేలంలోని స్టీల్ ప్లాంటులో తయారైన ఉక్కును వినియోగించినట్లు సంస్థ చైర్మన్ సీఎస్ వర్మ తెలిపారు. ఇంధన, ఆక్సిడైజర్ల ప్రతిచర్యలను ఎదుర్కొని దీర్ఘకాలం పాటు ఎటువంటి లీకేజీలు లేకుండా ఇది మన్నుతుందని ఆయన వివరించారు. గతంలోనూ పలు పీఎస్ఎల్వీలకు స్టెయిన్లెస్ స్టీల్‌ను అందించినట్లు ఆయన వివరించారు. -
'మంగళ్ యాన్' తొలి ఫోటో మోడీకి బహుకరణ!
-
'మంగళ్ యాన్' తొలి ఫోటో మోడీకి బహుకరణ!
న్యూఢిల్లీ: అంగారక గ్రహం ఉపరితలంపై మంగళ్ యాన్ చిత్రీకరించిన తొలి చిత్రాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం ప్రధాని నరేంద్రమోడీకి బహుకరించారు. తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంగారక గ్రహ కక్ష్యలోకి మామ్ ప్రవేశ కార్యక్రమాన్ని బుధవారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో మోడీ స్వయంగా చూశారు. మామ్ చరిత్ర సృష్టించిన సందర్భంగా మంగళ్ యాన్ చిత్రీకరించిన ఫోటోను ప్రధాని బహుకరించామని ఇస్రో అధికారులు వెల్లడించారు. తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో మామ్ సుమారు 650 మిలియన్ల కిలో మీటర్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. -
అసాధ్యం సుసాధ్యమైంది: మోదీ
బెంగళూరు: ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) అంగారక కక్ష్యలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయాన్ని పలు విధాల కీర్తించారు. అవరోధాలను అధిగమించి.. దాదాపు అసాధ్యమనుకున్న దానిని భారతదేశం సుసాధ్యం చేసిందన్నారు. ‘‘ఎన్నో ప్రతికూలాంశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 51 ప్రయోగాలు జరిగితే కేవలం 21 మాత్రమే విజయం సాధించాయి. మనం తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాం’’ అని మంగళయాన్ (మామ్) విజయం సాధించిన సందర్భంగా ఇక్కడి ఇస్రో కమాండ్ కేంద్రంలో మాట్లాడుతూ మోదీ చెప్పారు. ఈ రోజు మామ్ మంగళ్ (అంగారక) గ్రహాన్ని కలుసుకుందని, ఈ రోజు మంగళ్ మామ్‌ను పొందిందని మోదీ చమత్కరించారు. మిషన్‌కు మామ్ అనే పేరు ఖరారు చేసినపుడే.. ఆ మామ్ మనల్ని నిరాశ పరచదని తాను భావించానన్నారు. అరుణ గ్రహం కక్ష్యలోకి మామ్ చేరే చివరి క్షణాల్ని శాస్త్రవేత్తలతో కలసి ఉత్కంఠగా చూసిన మోదీ.. అది కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ భుజం తడుతూ అభినందించారు. ‘‘భారతదేశం విజయవంతంగా అంగారక గ్రహాన్ని చేరుకుంది. మీకు, దేశ ప్రజలకు అభినందనలు. ఈ రోజు చరిత్ర సృష్టించాం. కొద్ది మందికే తెలిసిన దారిలో 65 కోట్ల కిలోమీటర్ల దూరం మన వ్యోమనౌకను పూర్తి కచ్చితత్వంతో నడిపాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. అరుణ గ్రహాన్ని చేరుకున్న మరో మూడు ఏజెన్సీల సరసన భారత్ నిలిచిందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి విజన్ చంద్రుడిపై కాలుపెట్టడానికి స్ఫూర్తినిచ్చిందని, చంద్రయాన్ విజయం మామ్ రూపకల్పనకు దోహద పడిందని పేర్కొన్నారు. చివరగా రవీంద్రనాథ్ ఠాగూర్.. ఎక్కడైతే నీ మనస్సు ఎప్పు డూ విసృ్తతం కాని ఆలోచనలు, చర్యలవైపు నిన్ను నడుపుతుందో.. అది స్వేచ్ఛా స్వర్గంలోకి.. మై ఫాదర్, నా దేశాన్ని జాగృతం కానీయి.. పద్యపాదం ఉదహరిస్తూ ప్రసంగం ముగించారు. విజయంపై ఎవరేమన్నారంటే... ►మంగళ్యాన్ విజయంతో చరిత్రాత్మక విజయం సాధించిన ఇస్రోకు అభినందనలు. ఈ విజయం దేశానికే గర్వకారణం - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ► ఘన విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్తు దేశంతో కలసి సెల్యూట్ చేస్తున్నాను - ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ► ఈ విజయం ఉదయిస్తున్న భారత్‌కు గుర్తు. ఇస్రో కృషి, అంకితభావానికి అభినందనలు. - కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ► మామ్ విజయం ఇస్రో శాస్త్రవేత్తలు దశాబ్దంపాటు చేసిన కృషికి దక్కిన ఫలితం. దీని వెనక కృషిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ► తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకున్న ఏకైక దేశంగా అవతరించి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇదో మహాద్భుత ఘట్టం. భారత అంతరిక్ష రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. దేశానికి ఇంతటి అరుదైన ఘనవిజయాన్ని కట్టబెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు. - వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ► మామ్ ప్రయోగం విజయవంతం కావడం గర్వకారణం. ప్రయోగం విజయవంతం కావడానికి కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ► అంగారక యాత్ర విజయంతో అంతరిక్ష యానంలో అత్యున్నత విజయాలు సాధించిన దేశాల గ్రూపులో చేరినందుకు భారత్‌కు అభినందనలు. - అమెరికా ► బాలీవుడ్ అభినందనలు: భారత అంగారక యాత్ర విజయంపై బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, శ్రీదేవి, సునిధి చౌహాన్, షాహిద్ కపూర్, అభిషేక్ కపూర్, తదితరులు కూడా ట్విట్టర్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. నమస్తే ఇస్రో... థాంక్యూ మావెన్ మావెన్, మామ్ ఉపగ్రహాలను అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఇస్రోలు బుధవారం పరస్పరం ట్విట్టర్ ద్వారా అభినందనలు చెప్పుకొన్నాయి. రెండు రోజుల క్రితమే మావెన్‌ను మార్స్‌కు పంపిన నాసా మావెన్ టీం.. చరిత్రాత్మక విజయంపై ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపింది. దీనికి ప్రతిగా ‘థాంక్యూ మావెన్ టీం’ అంటూ ఇస్రో బదులు తెలిపింది. అలాగే నాసా క్యూరియాసిటీ బృందం కూడా ఇస్రోకు ట్విట్టర్ ద్వారా ‘నమస్తే’ చెబుతూ శుభాభినందనలు తెలిపింది. కాగా, భారత అంగారక యాత్ర విజయవంతం కావడంతో బుధవారం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు, అభినందనలు, సందేశాలు వెల్లువెత్తాయి. ఇస్రో, మామ్ ఫేస్బుక్ పేజీల్లో పది లక్షల మంది సందర్శించగా.. తొలి రెండు గంటల్లోనే 1,47,000 లైక్‌లు, కామెంట్లు, షేర్లు వచ్చాయి. మామ్ ట్విట్టర్ ఖాతాకు సైతం గంటల్లోనే 55 వేల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. విజయ సారథులు వీరే.. సూళ్లూరుపేట: సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన మామ్ ఉపగ్రహం విజయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్‌కు 9 మంది శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు. కున్షికృష్ణన్, మిషన్ డెరైక్టర్ పీఎస్ఎల్వీ సీ25కు మిషన్ డెరైక్టర్‌గా వ్యవహరించారు. ఈయన ఆధ్వర్యంలో రాకెట్ అనుసంధానం పనులు జరిగాయి. ఎం.చంద్రదత్తన్, ఎల్పీఎస్సీ డెరైక్టర్ రాకెట్ ప్రయోగంలో రెండు, నాలుగోదశలోని ఘన ఇంధనం దశలు లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్ సెంటర్ డెరైక్టర్ ఆధ్వర్యంలోనే జరిగాయి. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఎల్పీఎస్సీలో ఈ రెండు దశలను తయారు చేశారు. ఎస్ రామకృష్ణన్, వీఎస్ఎస్సీ డెరైక్టర్ పీఎస్ఎల్వీకి ఉపయోగించే రెండో దశ నుంచి నాల్గో దశదాకా ఉపయోగించిన రాకెట్ పరికరాలు త్రివేండ్రంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఈయన ఆధ్వర్యంలో జరిగాయి. డాక్టర్ శివకుమార్, శాటిలైట్ డెరైక్టర్ బెంగళూరులోని ఐజాక్ సెంటర్ లో మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని ఈయన ఆధ్వర్యంలో తయారు చేశారు. బెంగళూరులో ఈయన ఆధ్వర్యంలోనే మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని రూపొందించారు. ఏఎస్ కిరణ్‌కుమార్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్ ఈయన స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్‌కు డెరైక్టర్‌గా వ్యవహరిస్తూ ఈ ప్రయోగంలో కూడా కీలక పాత్ర పోషించారు. రాకెట్ డిజైనింగ్, శాటిలైట్ డిజైనింగ్ ప్రక్రియ ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. వీకే దడ్వాల్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డెరైక్టర్ హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ డెరైక్టర్‌గా ఉంటూ ఈ ప్రయోగంలో ఉపగ్రహం తయారీలో పాలుపంచుకున్నారు. అరుణన్, శాటిలైట్ ప్రాజెక్ట్ డెరైక్టర్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టుకు డెరైక్టర్‌గా వ్యవహరించారు. ఈయన ఆధ్వర్యంలోనే ఉపగ్రహాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి రాకెట్‌కు అనుసంధానం చేశారు. డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ దేశంలో ఇస్రోకు చెందిన పలు కేంద్రాల్లో తయారు చేసిన అన్ని పరికరాలను షార్కు చేర్చి రాకెట్ అనుసంధానం ప్రక్రియ పనులు ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయి. వీ శేషగిరిరావు, రేంజ్ ఆపరేషన్ డెరైక్టర్ రాకెట్ గమనాన్ని సూచించే రేంజ్ అపరేషన్‌ను డెరైక్ట్ చేసింది ఈయన ఆధ్వర్యంలోనే. ఎస్వీ సుబ్బారావు, డిప్యూటీ డెరైక్టర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదికపై రాకెట్ అనుసంధానం పనులు ఈయన పర్యవేక్షణలో జరిగాయి. మామ్ శాస్త్రీయ పరికరాలివే... మీథేన్ సెన్సర్: మార్స్ వాతావరణంలో మీథేన్ వాయువుని అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్నా పసిగడుతుంది. ఒకవేళ మీథేన్ ఉంటే.. అది రసాయన ప్రక్రియల వల్ల పుట్టిందా? లేక జీవరాశి జీవక్రియల వల్ల పుట్టిందా? అన్నదీ తేలుతుంది. లైమన్ ఆల్ఫా ఫొటోమీటర్: మార్స్ వాతావరణంలో డ్యుటీరియం, హైడ్రోజన్ల శాతాన్ని అంచనా వేస్తుంది. దీని వల్ల అక్కడ నీరు ఎలా నాశనమైందో తెలుస్తుంది.మార్స్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కాంపొజిషన్ అనలైజర్: మార్స్ వాతావరణంలో తటస్థ మూలకాల సమ్మేళనాన్ని గుర్తిస్తుంది. షార్ డెరైక్టర్‌కు ప్రధాని అభినందనలు సూళ్లూరుపేట: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. షార్ డెరైక్టర్‌తో పాటు మామ్ విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఉద్యోగులను కూడా అభినందించారు. థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్: పరారుణకాంతి పరిధిలో మార్స్ నుంచి వెలువడే ఉష్ణ ఉద్గారాలను గుర్తిస్తుంది. మార్స్ కలర్ కెమెరా: ఇది తీసే ఫొటోలు మార్స్ ఉపరితలాన్ని మరింత బాగా అర్థం చేసుకునేందుకు తోడ్పడతాయి. ప్రయోగం అమలు ఇలా... నవంబర్ 5: పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా భూకక్ష్యలోకి ప్రవేశించింది. మామ్ ఇంజన్లను మండించడం ద్వారా ఐదు దశల్లో కక్ష్య ఎత్తును పెంచారు. డిసెంబర్ 1: ఇంజన్‌ను ఆరోసారి మండించారు. సెకనుకు 11.2 కి.మీ. వేగంతో భూకక్ష్య నుంచి అంగారక కక్ష్య వైపు దూసుకుపోయింది. రోదసిలో అంగారక కక్ష్య వైపు 300 రోజుల పాటు నిరంత రం 66.6 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. సెప్టెంబర్ 22: మార్స్ గురుత్వాకర్షణ క్షేత్రంలోకి అడుగుపెట్టింది. ► సెప్టెంబర్ 24: అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మామ్ మహాయానం! ► నింగికి: నవంబర్ 5, 2013న ఏపీలోని శ్రీహరికోట నుంచి ► ప్రయోగం ఖర్చు రూ.450 కోట్లు ► మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహ బరువు 1,337 కిలోలు ► ఇంధనం 852 కిలోలు ► 5 శాస్త్రీయ పరికరాలు 13 కిలోలు -
అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశం
-
సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు: వైఎస్ జగన్
పులివెందుల: అంగారక కక్ష్యలోకి మార్స్ అర్బిటర్ మిషన్ విజయవంతంగా ప్రవేశించడం భారత అంతరిక్ష యుగంలో సువర్ణాక్షరాలతో లిఖించే అరుదైన రోజు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో ఇదో మహాద్బుత చారిత్రక రోదసీ ఘట్టం అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మామ్ ప్రయోగం సక్సెస్ కావడంతో భారత శాస్త్రవేత్తల శక్తి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినట్లయింది అని వైఎస్ జగన్ అన్నారు. అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగానే కాకుండా, తొలి ప్రయత్నంలోనే ఆ ఘనతను సాధించిన దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది, -
అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించిందిలా...
బెంగళూరు: తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం ఉపరితలానికి 515 కిలో మీటర్ల దూరం, భూమికి 215 కిలోమీటర్ల దూరంలో మామ్ ను విజయవంతంగా ప్రవేశపెట్టడంలో భారత శాస్త్రవేత్తలు విజయం సాధించారు. మంగళవారం ఉదయం 4.17 నిమిషాలకు అంగారక కక్ష్యలోకి మామ్ ప్రవేశించడం జరిగింది. దాంతో రెడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన యాంటెనాను ఏర్పాటు చేశారు. అంగారక గ్రహం వైపు 6.57 నిమిషాలకు మామ్ దూసుకెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత అంగారక కక్ష్యలోకి వెళ్లడానికి 7.17 నిమిషాలకు ప్రధాన ఇంజన్ పనిచేయడం ప్రారంభించింది. ఈ కీలక ఘట్టంలో 7.12 నిమిషాలకు అంగారక గ్రహంలో గ్రహణం ఏర్పడింది. 7.30 నిమిషాలకు ప్రధాన ఇంజన్ లోని 440 న్యూటన్ లిక్విడ్ అపోజి మోటర్ నిప్పులు గక్కుతూ పనిచేయడం ప్రారంభించింది. ఆతర్వాత 24 నిమిషాలకు అంటే 7.54 గంటలకు అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించింది. మామ్ ప్రయోగం విజయవంతమమైనట్టు యూఎస్, యూరప్, భారత్, ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన ఎర్త్ స్టేషన్లలోని రాడార్స్ కు సిగ్నల్ అందాయి. -
మామ్ ప్రయోగం ఒక చరిత్రాత్మక ఘట్టం
-
మామ్ ప్రయోగం ఒక చారిత్రాత్మక ఘట్టం: మోడీ
బెంగళూరు: అసాధ్యమనుకున్న ప్రయోగాన్ని సుసాధ్యం చేసి చూపించారని భారత ప్రధాని నరేంద్రమోడీ శాస్త్రజ్క్షులపై ప్రశంసల వర్షం కురిపించారు. అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించిన తర్వాత ప్రసంగిస్తూ 'ప్రపంచ సాంకేతిక రంగంలో భారత్ చరిత్ర సృష్టించింది' మోడీ అన్నారు. ఇతరులు అసాధ్యమని, ఊహించడానికి కూడా ధైర్యం చేయలేకపోయిన కార్యాన్ని మనం సుసాధ్యం చేసి చూపించామని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. మామ్ ఎప్పుడూ నిరాశపరచదనే గట్టి నమ్మకం అని అన్నారు. ఇస్రోను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారని ప్రధాని అన్నారు. మొదటి ప్రయత్నంలోనే విజయం భారత శాస్త్రవేత్తలకే దక్కడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రయోగం ఒక చారిత్రత్మక ఘటం అని ఉద్వేగభరిత ప్రసంగంలో మోడీ వెల్లడించారు. -
అమెరికా, రష్యా, యూరప్...ఇప్పుడు భారత్
తిరుపతి : మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) కు నేడు కీలక పరీక్ష చేపట్టనున్నట్లు షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ మధ్యాహ్నం 2.30 గంటలకు ట్రయిల్ ఆపరేషన్‌లో భాగంగా ప్రధాన ఇంజన్‌కు ఫైర్ చేస్తామన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం మన దేశానికి ఎంతో కీలకమైందని ఆయన అన్నారు. గత ఏడాది నవంబర్ 5న శ్రీహరి కోట నుంచి ప్రయోగించామన్నారు. అంగారకుడిపై ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగమని ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటివరకు అనుకున్నట్లుగానే ప్రయోగం విజయవంతంగా సాగుతోందని, పది నెలలుగా రోదసిలో నిరంతరం మార్స్ వైపు ప్రయాణిస్తున్న మామ్ ఈ నెల 24న.. బుధవారం తెల్లవారుజామున అరుణుడిని చేరుకోన్నట్లు తెలిపారు. తమకు ఈ ప్రయోగంలో మొత్తం 5 దశలు ఉన్నాయని, ఇప్పటికే మూడు దశలు విజయవంతం అయినట్లు ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రయోగం కీలక దశలో ఉందని, ఇప్పటివరకు ప్రపంచంలో ఆంగారకుడిపై అమెరికా, రష్య, యూరప్ దేశాలు మాత్రమే ప్రయోగాలు చేశాయన్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే ప్రపంచంలో భారత్ నాలుగో దేశంగా గుర్తింపు పొందుతుందన్నారు. మామ్ ప్రయోగం భారతదేశ భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భారత్ గ్రహాంతర యానం చేపట్టడం ఇదే తొలిసారి. గతేడాది నవంబరు 5న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-25 రాకెట్ ద్వారా మామ్‌ను నింగికి పంపి అంగారక యాత్రను ఇస్రో ప్రారంభించడం తెలిసిందే. రోదసిలో 300 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసిన మామ్ మరో 48 గంటల్లోనే మార్స్‌ను చేరుకోనుంది. ఇస్రో అంగారక యాత్రలో ఈ తుది ఘట్టం కూడా విజయవంతం అయితే గనక.. మార్స్‌కు ఉపగ్రహాన్ని పంపిన ఏకైక ఆసియా దేశం, తొలిప్రయత్నంలోనే మార్స్‌కు వ్యోమనౌకను పంపిన ఒకే ఒక్క దేశం, అమెరికా, రష్యా, ఐరోపాల తర్వాత అంగారక యాత్రను విజయవంతంగా చేపట్టిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. -
తొలి ప్రయోగంలోనే భారత్ కు దక్కనున్నఘనత!
బెంగళూరు: అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తిపతాక మరోసారి వినువీధిన ప్రకాశించనుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఇంకా అంగారకుడిని అందుకోవడానికి 72 గంటల సమయం మాత్రమే ఉంది. సవాళ్లను అధిగమిస్తూ.. సాఫీగా సాగుతూ ముందుకుపోతున్న మామ్ ఇప్పటివరకూ సుదీర్ఘ దూరం పయనించింది. పది నెలలుగా అంతరిక్షంలో దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం 98 శాతం ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసింది. ఇంకా కొద్ది దూరం మాత్రమే పయనిస్తే ఎర్రగ్రహం(కుజుడు) కక్ష్యలోని చేరుకుంటుంది. దీనిపై ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ జాతీయ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటూర్యూలో పలువిషయాలను వెల్లడించారు. 680 మిలియన్ కిలో మీటర్లు (82 కోట్ల కిలోమీటర్లు) సుదీర్ఘ పయనంతో మామ్ సరికొత్త రికార్డు నెలకొల్పుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై తాము ఎటువంటి ఆందోళనకు గురికావడం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమయంలో తాము ప్రశాంతంగా ఉండటమే మేలని తెలిపారు. మార్స్ ఆర్బిట్ మిషన్ విజయవంతంగా కక్ష్యను చేరుకునే దిశగా ముందుకు వెళుతుందన్నారు. భారత్ నుంచి మార్స్ పైకి ప్రవేశపెట్టిన మామ్ సురక్షితంగా గమ్యానికి చేరుకుంటే ఆసియాలోనే ఒక చరిత్రగా మిగిలిపోతుందన్నారు. తొలి ప్రయోగంలోనే ఆసియా నుంచి సక్సెస్ ఫుల్ గా మామ్ ను కుజుని కక్ష్యలోనికి ప్రవేశపెట్టిన ఘనత భారత్ కు దక్కనుందని ఆయన స్పష్టం చేశారు. మామ్ ఆగస్టు 30 నాటికి 62.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. సెకనుకు 22.33 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం కొనసాగిస్తోంది. మిగిలి ఉన్న మరో 19.9 కోట్ల కిలోమీటర్లు కలిపి మొత్తం.. 82.1 కోట్ల కిలోమీటర్ల మహా ప్రయాణం ముగింపుతో మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇస్రో అంగారకయాత్రకు అక్టోబరు 31 నాటికి మొత్తం రూ.450 కోట్ల బడ్జెట్లో ఇప్పటివరకూ రూ.244.06 కోట్లే ఖర్చుచేసింది. ఇదిలా ఉండగా అమెరికా, రష్యా అంతరిక్ష సంస్థలు సైతం సాధించలేని ‘తొలి ప్రయత్నంలోనే విజయా’న్ని ఇస్రో సాధించబోతోంది. అంగారక యాత్ర దిగ్విజయంగా చేపట్టిన నాలుగో దేశంగా అవతరించబోతోంది. అరుణగ్రహం దిశగా నిరంతరం సెకనుకు 22 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న మామ్.. సరిగ్గా సెప్టెంబరు 24వ తేదీన అర్ధరాత్రి అరుణుడి కక్ష్యలోకి చేరుకోబోతోంది. -
మార్స్‌కి చేరువలో మామ్
వివరం: 82 కోట్ల కిలోమీటర్లు.. 323 రోజులు.. చందమామను దాటి అంతరిక్షంలో సుదీర్ఘ ప్రయాణం.. సవాళ్లను అధిగమిస్తూ.. సాఫీగా సాగుతూ.. మార్స్ ఆర్బిటర్ మిషన్.. మామ్.. మంగళ్యాన్! అంగారకుడిని అందుకునే వేళ.. మరో మూడు రోజులే..! అరుణుడి గగనంపై మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడబోతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తిపతాక మరోసారి వినువీధిన ప్రకాశించనుంది. ఈ వైనమే... ఈవారం మన ‘వివరం’. నవంబరు 5, 2013. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం. సమయం మధ్యాహ్నం 2:38 గంటలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘గెలుపు గుర్రం’ పీఎస్ఎల్వీ-సీ25 ఉపగ్రహ వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసింది. తనతోపాటు మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం-మామ్; మంగళ్యాన్) ఉపగ్రహాన్ని మోసుకెళ్లి భూకక్ష్యలోకి విజయవంతంగా విడిచిపెట్టింది. ఇస్రోకు ఇది 109వ ప్రయోగం. మామూలుగానైతే దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కానీ.. భారత్‌కు సంబంధించినంత వరకూ ఇది మహాయానం. చందమామను దాటి.. తొలిసారిగా గ్రహాంతరానికి చేపట్టిన మహా ప్రయోగం. గ్రహాంతరాలకు వెళ్లే సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు చేసిన తొట్ట తొలి ప్రయత్నం. అంతేకాదు.. అమెరికా, రష్యా అంతరిక్ష సంస్థలు సైతం సాధించలేని ‘తొలి ప్రయత్నంలోనే విజయా’న్ని ఇస్రో సాధించబోతోంది. అంగారక యాత్ర దిగ్విజయంగా చేపట్టిన నాలుగో దేశంగా అవతరించబోతోంది. అరుణగ్రహం దిశగా నిరంతరం సెకనుకు 22 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న మామ్.. సరిగ్గా సెప్టెంబరు 24వ తేదీన అర్ధరాత్రి అరుణుడి కక్ష్యలోకి చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో.. 10 నెలలుగా మామ్ ప్రయాణం ఎలా సాగింది? మార్స్ కక్ష్యలోకి ఎలా చేరుకుంటుంది? అరుణుడి చుట్టూ తిరుగుతూ ఏం చేస్తుంది? తదితర ఆసక్తికర సంగతులు తెలుసుకుందాం. ఎర్త్ టు మార్స్.. ప్రయాణం సాగిందిలా భూకక్ష్యలోకి చేరిన తర్వాత ఉపగ్రహంలోని ఇంజన్‌ను కొద్ది సెకన్లపాటు మండిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలు దశలవారీగా కక్ష్య ఎత్తును ఐదు దశల్లో పెంచారు. చివరగా భూమికి దగ్గరగా 250 కి.మీ.(పెరిజీ), భూమికి దూరంగా 2 లక్షల కి.మీ.(అపోజీ) పరిధిలోనిదీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చేర్చారు. మొత్తంగా భూమి చుట్టూ ఐదుసార్లు చక్కర్లు కొట్టిన మామ్ డిసెంబరు 1వ తేదీ తెల్లవారుజామున మనకు వీడ్కోలు పలుకుతూ అంగారకుడి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. వెళుతూ వెళుతూ భూమిని తన కలర్ కెమెరాతో ఫొటో తీసి మనకు కానుకగా పంపింది. ఇంజన్‌ను మండించి వేగం పెంచి, దిశను మార్చడంతో ఉపగ్రహం ఒక్క ఉదుటున అంగారక కక్ష్య వైపు దూసుకుపోయింది. దీంతో అంగారకయాత్రలో మొదటిదైన జియోసెంట్రిక్ దశ ముగిసి.. రెండోదైన హీలియోసెంట్రిక్ దశ మొదలైంది. సూర్యుడి చుట్టూ అంగారకుడు తిరిగే కక్ష్య ఆధారంగా ఈ దశ ప్రయాణం సాగింది. మార్గమధ్యంలో ఉపగ్రహాన్ని సరైన దారిలో పెట్టేందుకు రెండు సార్లు మోటార్లను కొన్ని సెకన్లపాటు మండించి మార్గ సవరణలు చేశారు. సుదీర్ఘమైన ఈ దశలో 300 రోజులుగా నిరంతరం ప్రయాణిస్తున్న మామ్.. అంతరిక్షంలో సోలార్, కాస్మిక్ రేడియేషన్‌ను, మారిపోయే ఉష్ణోగ్రతలను తట్టుకుంటూనే 80 కోట్ల కి.మీ. అధిగమించి మూడోదశకు చేరువైంది. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల భూమి నుంచి ఉపగ్రహానికి సంకేతాలు పంపేందుకు సగటున 20 నిమిషాలు పడుతుంది. తిరిగి అక్కడి నుంచి భూమికి సంకేతాలు అందేందుకు మరో 20 నిమిషాలు పడుతుంది. అంటే.. 40 నిమిషాల పాటు ఉపగ్రహం ఎటుపోతోంది? అన్నది తెలియదు. అందుకే.. పరిస్థితులను బట్టి సొంత నిర్ణయాలు తీసుకునేలా ఉపగ్రహానికి సాంకేతికతను జోడించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇక చివరిది, అత్యంత కీలకమైన మూడోదశ మార్షియన్ ఫేజ్‌లో ఉపగ్రహం అంగారకుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించాల్సి ఉంది. అందుకోసం ద్రవ ఇంధన మోటారును మండించి ఉపగ్రహం వేగాన్ని కచ్చితత్వంతో నియంత్రించాల్సి ఉంటుంది. వేగం తగ్గకపోతే గనక.. ఉపగ్రహం అంగారకుడిని దాటేసి చాలా ముందుకు దూసుకుపోతుంది. అదే గనక జరిగితే ఇక మామ్ సంగతి మరిచిపోవాల్సిందే! అందుకే నెలల తరబడి పనిచేయకుండా ఉన్న ద్రవ ఇంధన మోటారు కచ్చితత్వంతో పనిచేయడం అన్నదే ఇప్పుడు మామ్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆగస్టు నాటికి 62 కోట్ల కిలోమీటర్లు... మామ్ ఆగస్టు 30 నాటికి 62.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. సెకనుకు 22.33 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం కొనసాగిస్తోంది. మిగిలి ఉన్న మరో 19.9 కోట్ల కిలోమీటర్లు కలిపి మొత్తం.. 82.1 కోట్ల కిలోమీటర్ల మహా ప్రయాణం ముగింపుతో మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. తర్వాత మార్స్‌కు దగ్గరగా 366 కి.మీ.(పెరిజీ), దూరంగా 80 వేల కి.మీ.(అపోజీ) ఉండే కక్ష్యలో స్థిరపడుతుంది. బెంగళూరులోని బైలాలు వద్ద గల ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ సాయంతో, ఇస్ట్రాక్(ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్) ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు మామ్‌ను నియంత్రిస్తున్నారు. ఉపగ్రహ పర్యవేక్షణకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ సాయం కూడా తీసుకుంటున్నారు. ప్రయోగ సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో నలంద, యమున అనే రెండు నౌకలను మోహరించి వాటిపై ఉన్న రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలతో, భూమిపై ఇతర చోట్ల ఉన్న గ్రౌండ్ స్టేషన్ల సాయంతోనూ ఉపగ్రహాన్ని పర్యవేక్షించారు. ‘మంగళ్యాన్’ ఏమిటి? మంగళ్యాన్ అంటే హిందీలో అంగారక నౌక అని అర్థం. వాస్తవానికి ఈ ఉపగ్రహానికి పేరు పెట్టలేదు. మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్, మంగళ్యాన్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అంగారకయాత్ర చేపట్టే సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం, డీప్ స్పేస్‌లో ఉపగ్రహాన్ని నియంత్రించడం, సుదీర్ఘ ప్రయాణంలో ఉపగ్రహం స్వతంత్రంగా వ్యవహరించేలా చూడటం వంటి సాంకేతికతలను పరీక్షించుకోవడం కోసమే ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్షంలో రేడియేషన్‌ను, అకస్మాత్తుగా పడిపోతూ, పెరిగిపోతూ ఉండే ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ చోదక, విద్యుత్, సమాచార, దిక్సూచీ వ్యవస్థలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేస్తేనే.. ఉపగ్రహం సురక్షితంగా ప్రయాణించగలదు. అందువల్ల అంగారకయాత్ర విజయవంతంగా చేపట్టడం అంటే క్లిష్టమైన సాంకేతిక సవాళ్లను అధిగమించడమే. భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు, మానవసహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేసుకోవడమే. అలాగే మార్స్ ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడం, అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడం ప్రధాన లక్ష్యాలుగా కూడా ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. మామ్ కన్నా ముందు మావెన్ ఇస్రో మామ్‌ను ప్రయోగించిన 13 రోజులకు నవంబరు 18న నాసా కూడా మావెన్ అనే ఉపగ్రహాన్ని అంగారక యాత్రకు పంపింది. అయితే ఆలస్యంగా ప్రయాణం మొదలుపెట్టినా.. మామ్ కన్నా రెండు రోజుల ముందుగానే మావెన్ అంగారకుడిని చేరుకోనుంది. మామ్ 82 కోట్ల కి.మీ. ప్రయాణిస్తుండగా.. మావెన్ 71 కోట్ల కి.మీ. మాత్రమే ప్రయాణించి మార్స్‌ను చేరుతుంది. అయితే.. మావెన్ ప్రయోగం, నిర్వహణకు అమెరికా ఏకంగా 67.10 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుండగా.. మామ్‌కు అయ్యే ఖర్చు 7.50 కోట్ల డాలర్లు మాత్రమే. ఇస్రో అంగారకయాత్రకు అక్టోబరు 31 నాటికి మొత్తం రూ.450 కోట్ల బడ్జెట్లో రూ.244.06 కోట్లే ఖర్చుచేసింది. నాసాతో సమానంగా ఖర్చు పెడితే గనక భారత్ మరో 9 మామ్‌లను అంగారకుడిపైకి పంపగలదు. అంటే చాలా తక్కువ ఖర్చుతోనే అంగారకయానం సాధ్యం చేసిన ఘనత మన ఇస్రోదే అన్నమాట! అంగారకయాత్ర... వైఫల్యాలే ఎక్కువ ! మన సౌరకుటుంబంలో భూమి తర్వాత జీవులకు కాస్తోకూస్తో అనుకూలంగా ఉన్న ఒకే ఒక్క గ్రహం అంగారకుడే. ఒకప్పుడు అక్కడ మంచినీటి సరస్సులు, సూక్ష్మజీవుల మనుగడకు అనుకూలమైన వాతావరణం, గాలిలో ఆక్సీజన్ సైతం ఉండేవని అంచనా. అందుకే మార్స్‌పై పరిశోధనలకు ప్రపంచదేశాలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఇప్పటిదాకా అంగారకుడిపైకి ఉపగ్రహాలు, రోవర్ల ప్రయోగాలు మొత్తం 51 జరగగా అందులో 21 మాత్రమే విజయవంతమయ్యాయి. రష్యా, అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) మాత్రమే ఈ ఘనత సాధించాయి. పొరుగుదేశం చైనా కూడా 2011లో అంగారకయాత్ర చేపట్టినా, భూకక్ష్య నుంచి అంగారకుడి మార్గం వైపు వెళ్లాల్సిన తరుణంలో ఉపగ్రహంలోని ఇంజన్లు మొరాయించాయి. దీంతో అది ఎటూగాకుండాపోయి భూకక్ష్యలోనే నిరుపయోగంగా తిరుగుతోంది. ఇక జపాన్ 1998లో పంపిన ఉపగ్రహంలో మార్గమధ్యంలోనే ఇంధనం అయిపోవడంతో అంగారకుడిని చేరలేకపోయింది. అన్నిదేశాల కంటే ముందే 1960లో అంగారకుడిపైకి ప్రయోగాలు మొదలుపెట్టిన రష్యా వరుస వైఫల్యాల తర్వాత ఎట్టకేలకు పదో ప్రయత్నంలో 1971లో మార్స్2 ఆర్బిటర్‌ను పంపగలిగింది. అయితే 1964లో రెండో ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుని మార్స్‌కు ఉపగ్రహాన్ని పంపిన తొలి దేశంగా అమెరికా చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా 7 వైఫల్యాలు ఎదుర్కొన్నా, 17 విజయాలను దక్కించుకుని తిరుగులేని సత్తా చాటింది. మార్స్‌పై ఇప్పుడు పనిచేస్తున్నవి ఇవే... నాసాకు చెందిన మార్స్ ఒడిస్సీ, ఎంఆర్వో, ఈసాకు చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ ఉపగ్రహాలు ప్రస్తుతం అరుణుడి చుట్టూ తిరుగుతున్నాయి. అంగారకుడి ఉపరితలంపై సంచరిస్తూ క్యూరియాసిటీ, ఆపర్చునిటీ రోవర్లు కూడా భూమికి సమాచారం పంపుతున్నాయి. వీటితోపాటు మామ్, మావెన్లు కూడా అంగారకుడి కక్ష్యకు చేరుకుని నిరంతరం పరిశీలిస్తూ భూమికి సమాచారం పంపనున్నాయి. తోకచుక్క... లక్కీచాన్స్ వెంటే ప్రమాదం! అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సైడింగ్ స్ప్రింగ్ అనే ఓ భారీ తోకచుక్క అక్టోబరు 19న అంగారకుడి సమీపం నుంచి దూసుకుపోనుంది. సౌర కుటుంబం చివరలో ఉండే ఊర్ట్ క్లౌడ్ ప్రాంతం నుంచి వస్తున్న ఆ తోకచుక్క మార్స్ ఉపరితలానికి 1.34 లక్షల కి.మీ. సమీపం నుంచే వెళుతుండటంతో దానిని పరిశీలించే అద్భుత అవకాశం మామ్, మావెన్, ఇతర వ్యోమనౌకల ముంగిట ఉంది. అయితే.. ఆ తోకచుక్క కేంద్ర భాగం 2 కిలోమీటర్ల పరిమాణంలోనే ఉన్నా.. దానితోక సుమారు అన్ని వైపులా కలిపి ఏకంగా లక్ష కిలోమీటర్ల పరిమాణంలో ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. సెకనుకు 57 కి.మీ. వేగంతో దూసుకెళ్లే తోకచుక్క నుంచి రాలిపడే అవశేషాలు సైతం మితిమీరిన వేగంతో అంగారకుడి వైపు దూసుకొచ్చే అవకాశం ఉంటుంది. వాటిల్లో ఓ చిన్న ముక్క తగిలినా కూడా ఉపగ్రహాలు తీవ్రంగా ధ్వంసం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అందుకే.. వీలైనంత వరకూ తోకచుక్కను ఫొటోలు తీయించాలని, అంతగా ప్రమాదం ముంచుకొస్తే.. తోకచుక్క వచ్చే సమయానికి ఉపగ్రహాలను అంగారకుడి వెనక వైపున దాగిఉండేలా చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మామ్ ప్రత్యేకతలు... బరువు : 1,336 కిలోలు (ఇంధనం బరువే 860 కిలోలు) జీవితకాలం : ఆరు నెలలు తయారీ ఖర్చు : రూ.150 కోట్లు నియంత్రణ ఖర్చు : రూ.90 కోట్లు పీఎస్ఎల్వీ తయారీకి : రూ.110 కోట్లు మొత్తం మిషన్ ఖర్చు : 450 కోట్లు శాస్త్రీయ పరికరాలు : ఐదు మామ్ పరికరాలు... చేసే పనులు లైమన్ ఆల్ఫా ఫొటోమీటర్: అంగారకుడి వాతావరణంలో డ్యుటీరియం, హైడ్రోజన్ల శాతాన్ని అంచనా వేస్తుంది. దీనివల్ల అక్కడ నీరు ఎలా నాశనమైందో తెలుస్తుంది. మీథేన్ సెన్సర్: మార్స్ వాతావరణంలో మీథేన్ వాయువుని అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్నా పసిగడుతుంది. దీనివల్ల అది రసాయన ప్రక్రియల వల్ల పుట్టిందా? లేక జీవరాశి జీవక్రియల వల్ల పుట్టిందా? అన్నది తెలుసుకోవచ్చు. మార్స్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కాంపొజిషన్ అనలైజర్: వాతావరణంలో తటస్థ మూలకాల సమ్మేళనాన్ని గుర్తిస్తుంది. మార్స్ కలర్ కెమెరా: ఇది తీసే ఫొటోలు మార్స్ ఉపరితలాన్ని మరింత బాగా అర్థం చేసుకునేందుకు తోడ్పడతాయి. థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్: పరారుణకాంతి పరిధిలో మార్స్ నుంచి వెలువడే ఉష్ణ ఉద్గారాలను గుర్తిస్తుంది. అరుణుడి సంగతులు... భూమిపై మనకు 24 గంటలకు ఒక రోజు. 365 రోజులకు ఒక సంవత్సరం. అంగారకుడిపై మాత్రం 24.37 గంటలకు ఒక రోజు, 687 రోజులకు ఒక ఏడాది అవుతుంది. సూర్యుడికి భూమి కన్నా అంగారకుడు ఎక్కువ దూరంలో ఉండటమే దీనికి కారణం. అంగారకుడి సైజు భూమిలో సగం కంటే కాస్త ఎక్కువ, భూమి గురుత్వాకర్షణలో 38 శాతమే ఉంటుంది. ఆక్సీజన్ మట్టిలో కలిసి, ఆక్సీకరణం జరిగి ఉపరితలంపై ఐరన్ ఆకై ్సడ్ పోగుపడటం వల్ల అది అరుణవర్ణంలో కనిపిస్తుంది. మనకు ఒకటే చందమామ. కానీ అంగారకుడిపై నుంచి చూస్తే రెండు చందమామలు ఫోబోస్, డైమోస్లు కనువిందు చేస్తాయి.. అంగారకుడు భూమికి సగటున 22.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో, అతి దగ్గరగా వచ్చినప్పుడు 5 కోట్ల కి.మీ. దూరంలో ఉంటాడు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు స్థానాలు మారుతుంటాయి కాబట్టి దూరం కూడా మారిపోతుంటుంది. మార్స్ కూడా భూమిలాగే 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడింది. సగటు ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్లు. రాత్రుళ్లు మైనస్ 100 డిగ్రీలూ దాటుతుంది. వాతావరణం చాలా పలుచగా ఉండటం వల్ల రేడియేషన్ తీవ్రంగా ఉంటుంది. భారత్ సహా అనేక దేశాలవారు అంగారకుడికి మంగళవారాన్నే కేటాయించుకున్నారు. రోమన్లు, గ్రీకులు మార్స్‌ను తమ యుద్ధదేవతగా భావించేవారు. ఆమె పేరు మీదే ఈ గ్రహానికి మార్స్ అని పేరు పెట్టుకున్నారు. మానవాళికి మరో ప్రపంచం!? రాత్రిపూట ఆకాశంలో ఎర్రటి చుక్కలా కనిపించే అంగారకుడి గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సంస్కృతుల్లో పురాతన కాలం నుంచీ అనేక విశ్వాసాలు ఉన్నాయి. రాక్షసగ్రహం అనీ, మార్స్‌పై ఎంతో తెలివైన, ఆధునిక మనుషులు ఉంటారనీ, అంగారక వాసులు భూమిపై దండెత్తుతారనీ భావించేవారు. మొత్తానికి.. మిణుకు మిణుకుమనే తారలాంటి అరుణుడిపైకి ఎట్టకేలకు మనిషి వ్యోమనౌకలు పంపగలిగాడు. వచ్చే 2024 నుంచీ అంగారకుడిపైకి శాశ్వత నివాసం కోసం ఏటా ఇద్దరు చొప్పున మనుషులను పంపాలని మార్స్ వన్ అనే కంపెనీ ముమ్మర ప్రయత్నాలు కూడా చేస్తోంది. 2030ల నాటికి మానవసహిత అంగారక యాత్ర చేపట్టాలని నాసా సైతం భావిస్తోంది. ప్రస్తుత అంచనాలను బట్టి చూస్తే.. భవిష్యత్తులో టెక్నాలజీతో పాటు వేగం కూడా పెరిగి కొద్ది రోజుల్లోనే భూమి నుంచి మార్స్‌ను చేరుకునే రోజు త్వరలోనే రావొచ్చు. అంగారకుడిపై మానవ కాలనీలు వెలిసి.. టెర్రాఫార్మింగ్ పద్ధతుల ద్వారా కొన్ని వందల ఏళ్లలో అక్కడి వాతావరణాన్ని సైతం మార్చేసి అరుణగ్రహాన్ని హరితగ్రహంగా మార్చే ప్రయత్నాలూ జరగొచ్చు. ఇదంతా జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. కానీ.. ఏమో.. గుర్రం ఎగరావచ్చు! - హన్మిరెడ్డి యెద్దుల -
24న అంగారకుడి కక్ష్యలోకి మామ్!
బెంగళూరు: అంగారకుడి దిశగా పది నెలలుగా అంతరిక్షంలో దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం 98 శాతం ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 66.60 కోట్ల కి.మీ. దూరానికి గాను 65.30 కోట్ల కి.మీ. దూరాన్ని మామ్ పూర్తి చేసిందని, ఇంకా 1.30 కోట్ల కి.మీ. ప్రయాణిస్తే అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని సోమవారం బెంగళూరులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రీయ కార్యదర్శి వి.కోటేశ్వరరావు వెల్లడించారు. ఉపగ్ర హం సెప్టెంబరు 24న ఉదయం 7:30 గంటలకు మార్స్ క క్ష్యలోకి ప్రవేశిస్తుందని, దీనిపై పూర్తి ధీమాతో ఉన్నామన్నారు. అరుణగ్రహ కక్ష్యలోకి ప్రవేశం కోసం ఉపగ్రహానికి ఆదేశాలు ఇవ్వడం సోమవారం నాటికి పూర్తి కానున్నట్లు తెలిపారు. లిక్విడ్ అపోజీ మోటారు (ఎల్ఏఎం) ఇంజిన్‌ను 24 నిమిషాల పాటు మండించి ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 22.2 కి.మీ నుంచి 2.14 కి.మీకి తగ్గించడం ద్వారా అంగారక కక్ష్యలోకి ప్రవేశపెడతారని, అయితే తొమ్మిది నెలలుగా నిద్రాణ స్థితిలో ఇంజిన్‌ను తిరిగి పనిచేయించడమే సవాలు అని తెలిపారు. ఇంతకుముందు కొన్ని దేశాలు పంపిన ఉపగ్రహాలు ప్రారంభంలో లేదా మార్గమధ్యంలో లేదా అంగారకుడి సమీపంలోకి ప్రయాణించగలిగినా.. చేరలేకపోయాయన్నారు. మామ్ అంగారకుడి కక్ష్యలోకి చేరగలిగితే గనక.. ఈ ఘనత సాధించిన నాలుగో అంతరిక్ష సంస్థగా ఇస్రో రికార్డు సృష్టించనుందని తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం బెంగళూరులోని బైలాలు వద్ద 32 మీటర్ల యాంటెన్నాతో ఉన్న ఇండియన్ డీప్‌స్పేస్ నెట్వర్క్(ఐడీఎస్ఎన్)ను, అమెరికాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలలో గల డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లను ఇస్రో ఉపయోగించుకోనుందని పేర్కొన్నారు. -
అంగారకుడి దిశగా మార్స్ అర్బిటర్: ఇస్రో
బెంగళూరు: అంతరిక్ష ప్రయోగంలో కీలక ఘట్టానికి ఇస్రో తెర తీయడానికి సిద్దమవుతోంది. అంతరిక్షంలో ప్రవేశపెట్టిన మార్స్ ఆర్బిటర్ అంగారకుడి దిశగా ప్రయాణిస్తోందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. మార్స్ ఆర్బిటర్ 98శాతం యాత్ర పూర్తి చేసుకుందని, 300 రోజుల పాటు ప్రయాణం సాగించిందని, ఈ ప్రయోగంలో లిక్విడ్ ఇంజన్10నెలల తర్వాత పనిచేయనున్నదని ఇస్రో వెల్లడించింది. అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించేందుకు ఇస్రో కమాండ్స్ ఇవ్వనుందన్నారు. సెప్టెంబర్ 24 ఉదయం 7.30 ని.లకు మార్స్ఆర్బిటర్ అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భూమికి 22.4 కోట్ల కిలోమీటర్ల దూరంలో మార్స్ ఆర్బిటర్ ఉందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఆర్బిటర్‌లోని అన్ని పరికరాలు సజావుగా పనిచేస్తున్నాయని, బెంగళూరు, అమెరికాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా నుంచి ఆర్బినేటర్కు సంకేతాలు అందయాని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. -
‘మామ్’కు అంతరిక్షంలో 300 రోజులు
చెన్నై: అరుణగ్రహం దిశగా నిరంతరం దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(మంగళ్యాన్-మామ్) ఉపగ్రహం అంతరిక్షంలో 300 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. మామ్ అంగారకుడి కక్ష్యను చేరేందుకు మరో 22 రోజులే మిగిలి ఉంది. ప్రస్తుతం భూమికి 19.90 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న మామ్ సెకనుకు 22.33 కి.మీ. వేగంతో దూసుకెళుతోందని, ఇప్పటిదాకా మొత్తం 62.20 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. ఉపగ్రహం అన్ని రకాలుగా బాగుందని, సెప్టెంబర్ 24న మార్స్ కక్ష్యను చేరనుందని తెలిపింది. -
యాంటెన్నా విప్పుకొన్న మామ్...
బెంగళూరు: అంగారకుడిపై పరిశోధనల కోసం ఇస్రో గత నవంబరు 5న పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్-మంగళ్యాన్) ఉపగ్రహం తన ‘మీడియం గెయిన్ యాంటెన్నా’ను విజయవంతంగా విప్పుకొంది. అంగారకుడి కక్ష్యలోకి చేరేటప్పుడు కీలకమైన ఈ యాంటెన్నా ద్వారానే మామ్ భూమికి సమాచారం పంపనుంది. అలాగే మార్స్ దిశగా మామ్ ప్రయాణం మరో 14 శాతమే మిగిలి ఉందని, మరో 49 రోజుల్లో (సెప్టెంబరు 24న) ఉపగ్రహం అంగారకుడి కక్ష్యలోకి చేరనుందని ఇస్రో ఈ మేరకు గురువారం తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. ప్రస్తుతం ఉపగ్రహం సరైన దిశలోనే ప్రయాణిస్తోందని, మార్గసవరణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. -
11.70 కోట్ల కి.మీ. దూరంలో ‘మంగళ్యాన్’!
బెంగళూరు: అంగారకుడిపై పరిశోధనల కోసం ఇస్రో గతేడాది నవంబరులో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్-మంగళ్యాన్) ఉపగ్రహం భూమి నుంచి 11.70 కోట్ల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తోంది. సెకనుకు 23 కి.మీ. వేగంతో దూసుకుపోతున్న మామ్ మరో 92 రోజుల్లో 2.40 కోట్ల కి.మీ. ప్రయాణించి మార్స్ కక్ష్యను చేరుకోనుందని ఇస్రో వెల్లడించింది. మామ్ నుంచి భూమిపై ఉన్న గ్రౌండ్ స్టేషన్లకు సంకేతాలు అందేందుకు 6 నిమిషాల 30 సెకన్లు పడుతోంది. ఉపగ్రహం మార్స్ వైపుగా సరైన మార్గంలోనే వెళ్లేందుకుగాను జూన్ 11న రెండో మార్గ సవరణ ప్రక్రియను నిర్వహించారు. -
భూ ప్రభావాన్ని దాటిన ‘మామ్’
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) అంగారకునిపైకి ప్రయోగించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ (మామ్)(మంగళ్యాన్) వ్యోమనౌక బుధవారం పూర్తిగా భూ ప్రభావాన్ని దాటింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు నవంబర్ 5న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ‘మంగళయాన్’ ఇటీవల భూకక్ష్యను విజయవంతంగా అధిగమించి, అంగారకుని వైపు తన పది నెలల ప్రయాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. భూకక్ష్యను దాటిన తర్వాత కూడా భూమి నుంచి 9.25 లక్షల కిలోమీటర్ల దూరం వరకు భూ ప్రభావం ఉంటుంది. ‘మామ్’ ఈ పరిధిని కూడా బుధవారం వేకువ జామున 1.14 గంటలకు దాటినట్లు ‘ఇస్రో’ వెల్లడించింది. -
‘మామ్’ పర్యవేక్షణలో స్వల్ప అంతరాయం!
చెన్నై: చంద్రుడి క క్ష్యను దాటి అరుణగ్రహం దారిలో నిరంతరాయంగా దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్-మంగళ్యాన్) ఉపగ్రహంపై పర్యవేక్షణలో గత ఆదివారం ఐదు నిమిషాలపాటు అంతరాయం కలిగిందట. గత ఆదివారం తెల్లవారుజామున మామ్‌లోని ద్రవ ఇంధన ఇంజన్‌ను మండించి దానిని భూకక్ష్య నుంచి అంగారక గ్రహం దారిలోకి పంపిన సంగతి తెలిసిందే. అయితే అందుకు కొన్ని సెకన్లకు ముందుగానే.. మామ్‌ను పర్యవేక్షించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)దక్షిణాఫ్రికాలో ఏర్పాటుచేసుకున్న హార్ట్బీస్తోక్(హెచ్‌బీకే) గ్రౌండ్ స్టేషన్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఉపగ్రహాన్ని అరుణగ్రహం దారిలోకి మళ్లిస్తున్నా.. ఈ గ్రౌండ్ స్టేషన్‌కు ఐదు నిమిషాలపాటు సమాచారమేదీ అందలేదట. ఇస్రో ఈ మేరకు సోమవారం తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది. -
చంద్ర కక్ష్యను దాటిన మంగళ్యాన్
చెన్నై: భూమి చుట్టూ నిర్ణీత పరిభ్రమణాలను పూర్తిచేసుకుని, అంగారకుడి వైపు దూసుకెళ్తున్న ‘మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్- మంగళ్యాన్)’.. చంద్రుడి కక్ష్య పరిధిని దాటింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు ‘మామ్’ ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి, అంగారకుడి దిశగా పంపిన విషయం తెలిసిందే. రోజుకు పది లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ‘మంగళ్యాన్’.. దాదాపు 300 రోజుల అనంతరం అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇప్పటివరకూ చంద్రయాన్ ఉపగ్రహం మాత్రమే అత్యంత దూరం వెళ్లింది. తాజాగా.. ‘మంగళ్యాన్’ భూమి పరిధిని దాటి ఎక్కువ దూరం ప్రయాణించిన తొలి ఉపగ్రహంగా నిలుస్తోంది. -
అరుణ గ్రహం దారిలో..
-
అరుణ గ్రహం దారిలో..
* భూ కక్ష్యను దాటి మలిదశ యాత్రను మొదలుపెట్టిన ‘మామ్’ * అంగారకుని వైపు పది నెలలు సాగనున్న ప్రయాణం చెన్నై/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)(మంగళ్యాన్) వ్యోమనౌక ప్రస్థానంలో మలిదశ మొదలైంది. ఈ వ్యోమనౌక ఆదివారం వేకువ జామున భూ కక్ష్యను అధిగమించి, అంగారకుని వైపుగా తన కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. అంగారకుని వైపు 68 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు ‘మామ్’ పది నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. ఇది 2014 సెప్టెంబర్‌లో అంగారకుని కక్ష్యలోకి చేరుకోగలదు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నవంబర్ 5న ‘మామ్’ను ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ప్రయోగించిన సంగతి తెలిసిందే. తొలిదశలో భూ కక్ష్యలో పరిభ్రమించిన ఈ వ్యోమనౌక, ఆదివారం 00.49 గంటలకు భూ కక్ష్యను అధిగమించింది. భూ కక్ష్య నుంచి బయటకు నిర్ణీత దిశలో పంపేందుకు వ్యోమనౌకలోని 440 న్యూటన్ లిక్విడ్ ఇంజన్‌ను 22 నిమిషాల సేపు మండించారు. దీంతో అంగారకుని దిశగా సెకనుకు 648 మీటర్ల వేగాన్ని పుంజుకుంది. బెంగళూరులోని ‘ఇస్రో’ ప్రధాన కార్యాలయం నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. కాగా, ‘మామ్’ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కాలంలో శాస్త్రవేత్తలు ఐదుసార్లు దీని కక్ష్యను పొడిగించిన సంగతి తెలిసిందే. -
నేడు భూకక్ష్యను వీడనున్న ‘మామ్’
బెంగళూరు: అరుణగ్రహంపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 5న పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మలిదశ యాత్రను ప్రారంభించనుంది. ఆదివారం తెల్లవారుజామున 12:49 గంటలకు మామ్‌ను భూమి కక్ష్య నుంచి అరుణగ్రహ మార్గంలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కీలకమైన ట్రాన్స్-మార్స్ ఇంజెక్షన్(టీఎంఐ) ప్రక్రియను చేపట్టనున్నారు. మామ్‌లోని ద్రవ అపోజీ మోటార్(ఎల్ఏఎం)ను 23 నిమిషాల పాటు మండించి ఉపగ్ర హ వేగాన్ని సెకనుకు 648 మీటర్లకు పెంచనున్నారు. దీనివల్ల భూ ప్రభావ క్షేత్రాన్ని తప్పించుకుని మామ్ అంగారక మార్గంలోకి వెళ్లనుంది. అనంతరం రోదసీలో 10 నెలలపాటు 68 కోట్ల కి.మీ. ప్రయాణించి వచ్చే సెప్టెంబరులో అంగారకుడి సమీపానికి, 24న ఆ గ్రహ కక్ష్యలోకి చేరనుంది. -
‘మామ్’ కక్ష్య పెంపు దిగ్విజయం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్/చెన్నై: అరుణగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్/మంగళ్యాన్) ఉపగ్రహాన్ని కక్ష్యలో ఎత్తుకు చేర్చే ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయింది. శనివారం తెల్లవారుజామున 1:27 గంటలకు ఉపగ్రహంలోని ఇంధనాన్ని 243.5 సెకన్లపాటు మండించి కక్ష్య పెంపులో తుది దశను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 5న రోదసీకి చేరిన మామ్‌ను తర్వాత కక్ష్యలో ఎత్తుకు చేర్చేందుకు చేపట్టిన తొలి మూడు దశలు విజయవంతం కాగా, నాలుగోసారి మాత్రం ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్ల అవాంతరం ఎదురైంది. దీంతో మరోసారి అనుబంధ పెంపు ప్రక్రియ చేపట్టి ఉపగ్రహం కక్ష్యను 1.18 లక్షల కి.మీ. అపోజీ(భూమికి దూరపు బిందువు)కి పెంచారు. శనివారంనాటి తుది పెంపుతో ఉపగ్రహం కక్ష్యలో 1,92,874 కి.మీ. అపోజీకి చేరిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఉపగ్రహం డిసెంబర్ 1 తెల్లవారుజామున 12:42 గంటలకు అంగారకుడి దిశగా ప్రయాణం మొదలుపెట్టనుందని, 2014 సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యను చేరుకోనుందన్నారు. -
మార్స్ ఆర్బిటర్‌కు తొలి ఆటంకం
సూళ్లూరుపేట : ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మార్స్మిషన్కు ఈరోజు చిన్నపాటి ఆటంకం ఎదురయింది. 450 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన మంగళయాన్.. వేర్వేరు దశల్లో వేర్వేరు కక్ష్యలు మారుతూ లక్ష్యం దిశగా సాగాలి. కాగా ఈ ఉదయం అంగారక యాత్రలో ఆర్బిటర్ తొలి ఆటంకం ఎదుర్కొంది. కక్ష్య పెంపులో ఇబ్బందులు ఎదుర్కొన్న మార్స్ ఆర్బిటర్.. లక్ష కిలోమీటర్ల కక్ష్యను అందుకోలేకపోయింది. నిర్దేశిత దూరంకన్నా 10వేల కిలోమీటర్ల దిగువలో ఉంది. దీనిపై స్పందించిన ఇస్రో ఛైర్మన్ రాధా కృష్ణన్, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నవంబర్ 5న ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ ఈ నెల 7 అర్థరాత్రి ఒంటి గంట పదినిమిషాలకు భూమికి 23550 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యను అందుకుంది. ఆ తర్వాత క్రమక్రమంగా కక్ష్య దూరాన్ని పెంచుతూ పోయారు. ప్రస్తుతం 78వేల కిలోమీటర్ల దూరంలో మార్స్ ఆర్బిటర్ ఉంది. -
మరింత ఎత్తుకు ‘మామ్’
చెన్నై: అంగారకగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) అంతరిక్ష నౌకను శుక్రవారం భూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో మరింత ఎత్తుకు పంపించింది. భూమికి దూరంగా (అపోజీ) కక్ష్యలో 28,814 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్బిటర్‌ను 40,186 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చారు. దీనికోసం ఆర్బిటర్‌లోని ఇంజన్‌ను శుక్రవారం తెల్లవారుజామున 2:18 గంటలకు 570.6 సెకన్ల పాటు మండించారు. మంగళవారం శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసిలోకి పంపిన మార్స్ ఆర్బిటర్ భూ కక్ష్య ఎత్తును గురువారం తెల్లవారుజామున మొదటిసారి పెంచిన విషయం తెలిసిందే. శుక్రవారం రెండో విడత ఎత్తు పెంపును విజయవంతంగా పూర్తిచేశారు. శనివారం మూడోసారి, 11వ తేదీన నాలుగోసారి, 16వ తేదీన ఐదోసారి ఆర్బిటర్ ఎత్తును పెంచుకుంటూ వెళతారు. ఐదో విడతలో ఆర్బిటర్ కక్ష్య ఎత్తును 1,92,000 కిలోమీటర్లకు పెంచిన తర్వాత.. డిసెంబర్ 1న తెల్లవారుజామున 12:42 గంటలకు అంగారక మార్గంలోకి ప్రవేశపెడతారు. -
తొలి దశ ఫైరింగ్ సఫలం.. మామ్ ఉపగ్రహ కక్ష్య పెంపు
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: అంగారక యాత్రకు బయల్దేరిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం కక్ష్యను భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) విజయవంతంగా పెంచింది. ఇందుకోసం గురువారం వేకువజామున 1.17 గంటలకు చేపట్టిన ఫైరింగ్ విజయవంతమైంది. ఉపగ్రహంలో అమర్చిన 440 న్యూటన్ ద్రవ ఇంజన్‌ను 416 సెకంన్లపాటు మండించి కక్ష్య దూరాన్ని పెంచారు. 1,337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ఈ నెల 5న 248.4 కి.మీ. పెరిజీ (భూమికి దగ్గరగా), 23,550 కి.మీ. అపోజీ (భూమికి దూరంగా)లో భూమధ్య రేఖకు 19.2 డిగ్రీల వాలులో భూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా 252 కి.మీ. పెరిజీ, 28,825 కి.మీ. అపోజీకి భూ దీర్ఘ వృత్తాకార కక్ష్యను పెంచినట్టు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రక్రియను బెంగళూరు సమీపంలోని పీన్యా వద్ద వున్న ఇస్ట్రాక్ సెంటర్ (ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం) నుంచి నిర్వహించారు. కక్ష్యలో ఉపగ్రహం క్షేమంగా ఉండటమే గాక సోలార్ ప్యానెళ్లు, మెయిన్ డిష్ ఆకృతిలోని యాంటెనాలు విజయవంతంగా విచ్చుకున్నాయి. ఇదేతరహాలో త్వరలో రెండోసారి కక్ష్య దూరాన్ని మరికొంత పెంచుతారు. ఇలా నవంబర్ 30 లోపు ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి నాలుగుసార్లు భూ దీర్ఘ వృత్తాకార కక్ష్యను పెంచుతూ 300 కి.మీ. పెరిజీ, 2 లక్షల కి.మీ. అపోజీకి తీసుకెళ్లాక డిసెంబర్ 1 నాటికి అంగారకుడి కక్ష్య వైపు మిషన్ ప్రయాణిస్తుందని ఇస్రో ప్రకటించింది. మూత్రం పోయడం నుంచి బఠాణీ తినడం దాకా.. అంతరిక్ష శాస్త్రవేత్తల నమ్మకాల జాబితా ఇదీ.. చెన్నై: మూఢ నమ్మకాలు, విశ్వాసాలు.. వీరికి ఎవరూ అతీతులు కారు.. చివరికి అంతరిక్ష శాస్త్రవేత్తలు కూడా! వీరిలో కొందరివి నమ్మకాలైతే.. మరికొందరివి మూఢనమ్మకాలు.. ఎందుకంటే.. రష్యా వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేముందు ప్రయోగకేంద్రానికి తమను తీసుకొచ్చే బస్సు కుడివైపు వెనుక చక్రంపై మూత్రం పోస్తారట!! నాసా శాస్త్రవేత్తలు ప్రయోగ సమయంలో బఠాణీలు తింటారు. ఇక మన విషయానికొస్తే.. వెంకన్నపై మన శాస్త్రవేత్తలకు అపారవిశ్వాసం. అందుకే ప్రతి ప్రయోగ సమయంలోనూ తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం సంప్రదాయమైపోయింది. ఇక వ్యక్తిగత నమ్మకాల విషయానికొస్తే.. ఇస్రోలోని ఓ ప్రాజెక్ట్ డెరైక్టర్ ప్రయోగం రోజున తప్పనిసరిగా కొత్త షర్ట్ ధరించి వస్తారని ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఇస్రోకు సంస్థపరంగా ఇలాంటి విశ్వాసాలు లేవని చెబుతూనే.. పీఎస్ఎల్వీ శ్రేణిలో 13వ నంబర్ లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. ‘పీఎస్ఎల్వీ-సీ12 పంపాక.. తర్వాత పంపాల్సింది సీ-13.. కానీ ఇస్రో ఆ సంఖ్యను వాడకుండా తర్వాత పీఎస్ఎల్వీ-సీ14ను ప్రయోగించింది’ అని ఆయన గుర్తు చేశారు. -
సజావుగా‘మార్స్ ఆర్బిటర్’
చెన్నై/బెంగళూరు/బీజింగ్: ‘ఇస్రో’ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ వ్యోమనౌక భూ కక్ష్యలో సజావుగా సాగుతోంది. పీఎస్ఎల్వీ సీ-25 రాకెట్ ద్వారా దీనిని మంగళవారం భూ కక్ష్యలోకి విజయవంతంగా పంపిన తర్వాత ఇది సజావుగానే ముందుకు సాగుతోందని, దీని కక్ష్యను గురువారం పొడిగించనున్నామని ‘ఇస్రో’ ప్రతినిధి ఒకరు తెలిపారు. కక్ష్యను పొడిగించేందుకు గురువారం వేకువ జామున 1.17 గంటలకు బెంగళూరులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి ఫైరింగ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. మార్స్ ఆర్బిటర్ డిసెంబర్ 1న భూకక్ష్యను దాటి అంగారకుని కక్ష్య వైపు సాగనుంది. ఈలోగా ఇది భూమి చుట్టూ ఐదుసార్లు పరిభ్రమించనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు మార్స్ ఆర్బిటర్‌ను ప్రయోగించగా, 44 నిమిషాల వ్యవధిలో ఇది భూ కక్ష్యను చేరుకున్న సంగతి తెలిసిందే. భూకక్ష్యలో తొలివిడత పరిభ్రమణంలో ఉన్న మార్స్ ఆర్బిటర్, బుధవారం మధ్యాహ్నం 1.09 గంటల సమయానికి ఆఫ్రికాలోని నైజీరియాను దాటి చాద్ మీదుగా ముందుకు సాగుతున్నట్లు ‘ఇస్రో’ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, అంతరిక్షంలో చైనాదే ముందంజ అని, చైనాతో పోటీపడటంలో మనం దారుణంగా విఫలమయ్యామని ‘ఇస్రో’ మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. ఐదేళ్ల కిందట అంతరిక్షరంగంలో భారత్, చైనాలు సమ ఉజ్జీలుగా ఉండేవని, కొన్ని సాంకేతిక నైపుణ్యాల్లోనైతే భారత్ ముందంజలో ఉండేదని చెప్పారు. గ త ఐదేళ్లలో భారత్ నిద్రపోతుంటే, చైనా నిలకడగా ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు. చైనా నుంచి పదిమంది వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్లి తిరిగి వచ్చారని అన్నారు. అంతరిక్షంలోని దిగువ కక్ష్యలోకి ఏకంగా 25 టన్నుల బరువు తీసుకుపోగలిగే హెవీలిప్ట్ లాంచర్‌ను కూడా తయారు చేసుకుందని, దీంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోనే చైనా ముందంజకు చేరుకుందని అన్నారు. ‘మార్స్ ఆర్బిటర్’ మిషన్ గొప్ప విజయం: చైనా నిపుణులు భారత్ చేపట్టిన మార్స్ ఆర్బిటర్ ప్రయోగాన్ని గొప్ప విజయంగా చైనా నిపుణులు అభివర్ణించారు. ఒకవేళ ఇది పూర్తిగా విజయవంతమైతే, ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టిన తొలి ఆసియా దేశంగా భారత్ ఘనత సాధిస్తుందని చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సెన్సైస్లోని దక్షిణాసియా అధ్యయన కేంద్రం నిపుణుడు యె హైలిన్ అన్నారు. ‘మార్స్ ఆర్బిటర్’ మిషన్ ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా చేపట్టడంపై చైనా అధికారిక దినపత్రికలన్నీ పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించాయి. దీంతో భారత్ అంగారకునిపై పరిశోధనల్లో చైనా కంటే ముందంజలోకి చేరగలదని వ్యాఖ్యానించాయి. అయితే, అంతరిక్ష రంగంలో పోటీకి బదులు భారత్, చైనాలు కలసి కృషి చేస్తే మంచిదని యె హైలిన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, అమెరికన్ మీడియా కూడా మార్స్ ఆర్బిటర్ మిషన్‌పై ప్రముఖంగా కథనాలను ప్రచురించింది. సాంకేతిక రంగంలో భారత్‌కు ఇది గొప్ప ముందడుగు అని అమెరికా మీడియా అభివర్ణించింది. తిరుమలలో రాధాకృష్ణన్ పూజలు సాక్షి, తిరుమల: మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతం కావడంతో ‘ఇస్రో’ చైర్మన్ రాధాకృష్ణన్ సతీసమేతంగా తిరుమల విచ్చేశారు. బుధవారం వేకువ జామున 3 గంటలకు సుప్రభాత సేవలో వెంకన్నను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. వేదపండితులు రాధాకృష్ణన్ దంపతులను ఆశీర్వదించారు. రాధాకృష్ణన్‌ను జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు పట్టువస్త్రంతో సత్కరించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. రాధాకృష్ణన్ మాట్లాడుతూ, నిర్ణీత కక్ష్యలో మార్స్ ఆర్బిటర్ సజావుగా ముందుకు సాగుతోందని, డిసెంబర్ 1న దీనిని అంగారక కక్ష్యలోకి ప్రవేశపెడతామన్నారు. -
వెంకన్న సేవలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్
తిరుపతి : 'మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రయోగంలో తొలి దశ విజయవంతం కావటంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో రాధాకృష్ణన్ దంపతులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు...వారికి రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం సందర్భంగా రాధాకృష్ణన్ నిన్న కూడా వెంకన్న దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. -
అసలు పరీక్ష మొదలైంది!
భూ కక్ష్య నుంచి మార్స్ కక్ష్య వరకూ సవాళ్లే గ్రహాంతర అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో విజయవంతంగా తొలి అడుగు వేసింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. అయితే అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఆర్బిటర్ అంగారక గ్రహం వరకూ సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. దీనిని అంగారక కక్ష్యా మార్గంలోకి ప్రవేశపెట్టడం వరకూ జరిగేది ఒక ఎత్తై ఆ తరువాత అరుణగ్రహం చేరేవరకూ ఉపగ్రహం ఇతర గ్రహాల ప్రభావానికి లోనుకాకుండా చూసుకోవడం, చేరిన తరువాత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టడం కూడా భారత శాస్త్రవేత్తలకు సవాలు విసిరే అంశాలే. మంగళవారం విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన మార్స్ ఆర్బిటర్ మరో 11 రోజుల తరువాత గానీ అంగారకుడి కక్ష్య మార్గంలోకి చేరదు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నారు. మొత్తం ఐదు దశల్లో కక్ష్య ఎత్తును పెంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఏడో తేదీ తెల్లవారుజామున చేపట్టే తొలి దశలో ఉపగ్రహం ప్రయాణించే కక్ష్యను భూమి నుంచి 28,790 కిలోమీటర్ల దూరానికి పెంచుతారు. రెండు మూడు దశలు 8, 9 తేదీల్లో చేపడతారు. ఈ రెండు దశల్లో అపోగీ (భూమి నుంచి దూరంగా ఉండే దశ) 40 వేలు, 71,650 కిలోమీటర్లు చొప్పున ఉంటుంది. చివరి రెండు దశలను ఈ నెల 11, 16వ తేదీల్లో చేపడతారు. దీంతో ఉపగ్రహం అపోగీ ఏకంగా లక్ష నుంచి 1.92 లక్షల కిలోమీటర్లకు చేరుతుంది. ఆ తరువాత అన్నీ సవ్యంగా సాగితే డిసెంబర్ ఒకటో తేదీ అర్ధరాత్రి 0.42 గంటల సమయంలో ఆర్బిటర్‌ను మార్స్ కక్ష్య మార్గంలోకి ప్రవేశపెడతారు. దీనిని అత్యంత ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడి నుంచి ఆర్బిటర్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2014 సెప్టెంబర్ 24వ తేదీన అంగారక గ్రహపు నిర్దేశిత కక్ష్యలోకి ఖచ్చితంగా చేర్చదలచుకున్న స్థానానికి ఒక 50 కిలోమీ టర్లు అటూ ఇటూగా చేరాలి. ఆర్బిటర్ అంగారకుడి సమీపంలోకి వెళ్లేందుకు దాదాపు 300 రోజుల సమయంపడుతుంది. ఈ క్రమంలో ఏదైనా తేడా వచ్చి ఉపగ్రహం దారితప్పినా, లేదా అంగారక గ్రహ కక్ష్యను చేరిన తరువాత ఈ రకమైన సమస్య వచ్చినా.. దాని మార్గాన్ని సవరించి మళ్లీ దారిలో పెట్టేందుకు కొంత ఇంధనాన్ని కేటాయించారు. మార్గ సవరణ కోసం ఇంధనాన్ని ఉపయోగిస్తే దాని ప్రభావం ఆర్బిటర్ ఆయుష్షుపై పడుతుంది. ఏ విధమైన సవరణలు లేకున్నా ఈ ఉపగ్రహం గరిష్టంగా కొన్ని నెలలు మాత్రమే పనిచేస్తుంది. మార్గ సవరణ కోసం ఎంత ఇంధనం ఉపయోగిస్తే అంతమేరకు ఆర్బిటర్ జీవితకాలం తరిగిపోతుంది. మార్స్ ఆర్బిటర్ అంగారకుడి వైపు వెళుతున్నపుడు.. దానిని నియంత్రించేందుకు, ఇతరత్రా పంపించే సమాచార సంకేతాలు ఆర్బిటర్‌ను చేరటానికి 20 నిమిషాల సమయం పడుతుంది. అలాగే అది తిరిగి పంపించే సంకేతాలు భూమి మీది నియంత్రణ స్టేషన్లను చేరటానికి మరో 20 నిమిషాలు పడుతుంది. అంటే.. దాదాపు 40 నిమిషాల పాటు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆర్బిటర్ అంగారకుడిని సమీపిస్తుండగానే దాని వేగాన్ని తగ్గించాలి. అలాగైతేనే అంగారక గ్రహపు కక్ష్యలోకి ఈ ఆర్బిటర్ వెళ్లగలదు. అలాకాకుండా అదే వేగం తో ప్రయాణిస్తే ఆర్బిటర్ అరుణగ్రహాన్ని దాటి దూసుకెళ్లిపోతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన పక్షంలో మార్స్ ఆర్బిటర్ తనకు తానుగా సేఫ్ మోడ్ (సురక్షితమైన వ్యవస్థ)లోకి వెళ్లేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చారు. ఈ విధానంలో.. భూమి నుంచి సంకేతాలతో ఆజ్ఞలు అందే వరకూ మార్స్ ఆర్బిటర్ తనకు తానే సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏంటెనాను భూమి వైపు తిప్పి, సోలార్ ప్యానళ్లను సూర్యుడి వైపు తిప్పి సాధ్యమైనంత ఎక్కువ సౌరశక్తిని సంగ్రహించుకుంటుంది. - సైన్స్ బ్యూరో, సాక్షి ప్రయోజనం లేదా? అంగారక యాత్ర ద్వారా దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనమేదీ ఉండదు. అయితే కేవలం రూ. 450 కోట్ల ఖర్చుతో గ్రహాంతరాలకు సైతం తాము ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలమని ఇస్రో ఈ ప్రయోగంతో ప్రపంచానికి చాటింది. కేవలం 15 నెలల వ్యవధిలో ఇంతటి సంక్లిష్టమైన ప్రయోగానికి రూకల్పన చేయడం, రాకెట్, ఉపగ్రహాలను నిర్మించి ప్రయోగించడం ఇస్రో సత్తాకు నిదర్శనమనడంలో ఎటువంటి సందేహమూ లేదు. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు, అంగారకుడిపైకి ల్యాండర్ లేదా రోవర్ వంటి అత్యాధునిక పరికరాలను పంపించేందుకు ఈ ప్రయో గం పునాదిగా నిలుస్తుంది. -
ఆ పది నిముషాల్లో ఏం జరిగింది?
-
మ.. మ.. మార్స్
-
శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం: వైఎస్ జగన్
హైదరాబాద్ : మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం తొలి ప్రయత్నంలోనే విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. భారత్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు అగ్రదేశాల సరసన నిలిపారని ఆయన అన్నారు. ఇస్రో మరిన్ని విజయలు సాధించాలని జగన్ ఆకాంక్షించారు. మరోవైపు మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతం అవటంపై గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఆనం రాంనారాయణరెడ్డి, డీకె అరుణ....తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. -
గర్వించదగ్గ విజయం: సోనియా
న్యూఢిల్లీ: మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం తొలి ప్రయత్నంలోనే విజయవంతం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ మధ్యాహ్నం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహననౌక విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. షార్ నుంచి బయలుదేరిన 44 నిమిషాల తర్వాత మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం అంగారకుడిపై జీవాన్వేషణ, వాతావరణం అధ్యయనం చేయనుంది. ఈ విజయంతో అగ్రరాజ్యాల సరసన భారత్ చేరింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలో పాలుచుకున్న శాస్త్రవేత్తలపై అభినందల వర్షం కురుస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు సూర్ఫిదాయక విజయం సాధించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. ప్రతిభారతీయుడు గర్విందగ్గ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించారని సోనియా గాంధీ ప్రశంసించారు. ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్‌కు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. -
పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతం
-
పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట: అంతరిక్ష రంగంలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగం విజయవంతమైంది. ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి బయలుదేరిన పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌక 44 నిమిషాల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. షార్ శాస్తవేత్తలకు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. ప్రయోగంలో పాలుపంచుకున్న సీనియర్ శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలి ప్రయత్నంలోనే మంగళయాన్ విజయవంతం కావడం పట్ల హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మార్స్ మిషన్ కీలకమైనది మిషన్ డైరెక్టర్ కున్హికృష్ణన్ అన్నారు. ఈ విజయం తొలి అడుగు అని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ రామకృష్ణన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి విజయమిదని షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రయోగంలో పాలుపంచుకున్న వారందరికీ ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు. -
అంగారక యాత్రలో నాలుగో దశ విజయవంతం
సూళ్లూరుపేట : శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంగారక యాత్ర విజయవంతంగా నాలుగు దశలను పూర్తి చేసుకుంది. కీలక మైన నాలుగో దశను విజయవంతంగా దాటింది. లక్షిత వేగంతో దూసుకెళ్తున్న పీఎస్ఎల్వీ సి 25 గురించి సమాచారం అందినట్లు షార్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అత్యంత కీలకమైన పీఎస్-4 ఇంజిన్ ప్రారంభమైందని వారు తెలిపారు. కాగా అంతకు ముందు ప్రయోగానంతరం మార్స్ ఆర్బిటర్ మిషన్ భూమి చుట్టూ దాదాపు 5 సార్లు చక్కర్లు కొట్టింది. ఆ తరువాత అంగారక కక్ష్య మార్గంలోకి ప్రవేశించింది. ఈ చక్కర్లు కూడా దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో పద్ధతి ప్రకారం జరిగాయి. తొలి దశలో పెరిగీ (భూమికి అతి దగ్గరగా ఉండే దశ) దాదాపు 250 కి.మీ. ఉంటే.. అపొగీ(భూమికి అతి దూరంగా ఉండే దశ) దాదాపు 23,000 కిలోమీటర్లుంటుంది. తరవాతి 4 దశల్లో పెరిగీలో పెద్ద మార్పుండదు గానీ అపొగీ మాత్రం 40,000 నుంచి దాదాపు 2 లక్షల కి.మీ వరకు పెరిగింది. ఈ దశల తరువాత ఉపగ్రహం అంగారక గ్రహ కక్ష్య మార్గంలోకి దూసుకెళ్లింది. ఇక రెండోది హీలియో సెంట్రిక్ దశ. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అంగారకుడుండే నిర్దిష్ట స్థానం ఆధారంగా ఈ దశ ప్రయాణం ఉంటుంది. ఇక అంగారక గ్రహ ప్రభావముండే ప్రాంతం (ఆ గ్రహం నుంచి 5.7 లక్షల కిలోమీటర్లు)లోకి ప్రవేశించడంతో మూడో దశ మొదలవుతుంది. వేగాన్ని తగ్గించుకుంటూ ఉపగ్రహం క్రమేపీ ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. కాగా మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం మొత్తం బరువు దాదాపు 1,336 కిలోలు. దీంట్లో 860 కిలోలు ఇంధనం. మిగతా బరువులో దాదాపు 15 కిలోల బరువుతో 5 శాస్త్రీయ పరికరాలుంటాయి. -
వివాదాస్పదమవుతున్న అంగాకర యాత్ర!
-
వివాదాస్పదమవుతున్న అంగాకర యాత్ర!
హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా జరపనున్న అంగారక యాత్ర వివాదాస్పదం అవుతోంది. కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న పనికి నిర్ణయించిన ముహూర్తంపై జ్యోతిష్యులు పెదవి విరుస్తున్నారు. జ్యోతిషశాస్త్రంలో అమంగళానికి చిహ్నమైన మంగళవారం ప్రయోగం జరపడం అంత సమంజసం కాదని ప్రముఖ జ్యోతిష, వాస్తు సిద్ధాంతి పుల్లెల సత్యనారాయణ వాదిస్తున్నారు. అనుకూలమైన శుభ ముహుర్తంలో ప్రయోగం జరిపితే మరిన్ని ఫలితాలు వస్తాయని ఆయన చెబుతున్నారు. మరోవైపు అంగారక యాత్రకు సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మంగా చేపడుతున్న మార్స్ మిషన్ కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 44.5 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ 25 ఉపగ్రహ వాహకనౌక, 1337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ ఈ మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో గ్రహాంతర ప్రయోగాలకు భారత్ శ్రీకారం చుట్టనుంది. ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ మాటల్లో చెప్పాలంటే మన సాంకేతిక పరిజ్ఞాన సమార్ధ్యాన్ని ప్రపంచడానికి చాటడమే ప్రధాన లక్ష్యం. అమెరికా, రష్యా, చైనా, యూరప్ తదితరాలు ఇప్పటికే అంగారకుడిపై పరిశోధనలు చేపట్టిన నేపధ్యంలో మనకూ ఆ సామర్ధ్యముందని నిరూపించేందుకు ఈ అంగారకయాత్ర. చేపడుతున్నారు. సుమారు 445కోట్ల వ్యయంతో ఈ అంగారకయాత్ర కోసం చేపట్టారు. ఈ యాత్రను అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదావేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్ధేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్ట్రాక్ సెంటర్లో 32 డీప్ స్పేష్ నెట్వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్వర్క్, స్పెయిన్, ఆస్ట్రేలియా, అమెరికాల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలి రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. -
సవ్యంగా మార్స్ ఆర్బిటర్ కౌంట్‌డౌన్ : ఇస్రో
-
సవ్యంగా మార్స్ ఆర్బిటర్ కౌంట్‌డౌన్ : ఇస్రో
సూళ్లూరుపేట : భారత అంతరిక్ష ప్రయోగంలో ఇస్రో మరో మైలు రాయిని అధిగమించనుంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల 38 నిముషాలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్ వీ సీ -25 ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను అంతరిక్షంలోకి పంపనుంది. అంగారక గ్రహంపై పరిశోధనలు జరిపేందుకు ఈ మిషన్ దోహదం చేయనుంది. ప్రస్తుతం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రాకెట్ రెండో దశకు ఇంధనం నింపే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రయోగ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ ఇప్పటికే షార్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ సవ్యంగా సాగుతోందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగ సమయం సమీపిస్తుండటంతో షార్ లో భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేశారు. పులికాట్ సరస్సుతో పాటు బంగాళాఖాతంలో కూడా నావికాదళం భద్రతను పర్యవేక్షిస్తోంది. -
ఆల్ ది బెస్ట్.. బఠానీలు తినడం మర్చిపోకండి!
బెంగళూరు: అంగారకగ్రహంపై పరిశోధన కోసం మంగళవారం మార్స్ ఆర్బిటర్ మిషన్(ఎంవోఎం) ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్న నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శుభాకాంక్షలు తెలిపింది. ఇస్రో ఎంవోఎం ఫేస్బుక్ పేజీలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ (జేపీఎల్) ఈ మేరకు గురువారం ఓ సందేశం పోస్టు చేసింది. ‘మీరు మార్స్ యాత్ర ప్రారంభిస్తున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ప్రయోగం సమయంలో తప్పనిసరిగా బఠానీలు పంచుకుని తినండి’ అంటూ ‘లక్కీ పీనట్స్(బఠానీలు)’ పేరుతో సందేశం ఉంచింది. ‘1960 క్రితం వరకూ మేం ఆరుసార్లు చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాం. ఎట్టకేలకు 1964లో ఏడోసారి విజయం సాధించాం. ఆ ప్రయోగం సందర్భంగా మా సిబ్బందిలో ఒకరు బఠానీలు తింటూ ఇతరులకూ పంచారు. దాంతో ఆ విజయం తాలూకు క్రెడిట్ మేం బఠానీలకు కట్టబెట్టేశాం. ఆ తర్వాత ప్రతిసారీ బఠానీలు పంచుకుంటున్నాం. అందుకే మీరూ విజయం సాధించాలని ఈ రహస్యాన్ని చెబుతున్నాం. గో ఎంవోఎం!!! గుడ్ లక్ ఎంవోఎం! డేర్ మైటీ థింగ్స్’ అంటూ నాసా శుభాకాంక్షలు తెలిపింది. -
'మార్స్ ఆర్బిటెర్ మిషన్' ప్రయోగం వెనుక రాజకీయాల్లేవు: ఇస్రో
దేశ అణు పరిశోధన కార్యక్రమాల్లో తలమానికంగా నిలిచే మార్స్ ఆర్బిటెర్ మిషన్(ఎంఓఎమ్)కు ఆదివారం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ25 ను నవంబర్ 5న 2.36నిమిషాలకు మార్స్ ఆర్బిటెర్ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించనున్నారు. అక్టోబర్ 31 తేదిన బెంగుళూరు లోని స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ లో కూడా ప్రారంభ కార్యక్రమాన్ని రిహార్సల్ చేయనుంది. రిహార్సల్ సవ్యంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు,జాగ్రత్తలు తీసుకున్నామని.. ఇస్పో చైర్మన్ కే రాధకృష్ణన్ తెలిపారు. చంద్రయాన్-1 మిషన్ తర్వాత జి మాధవన్ నాయర్ కు 'మూన్ మ్యాన్' అన్నారని.. అయితే మార్స్ మ్యాన్ అనిపించుకోవాలని లేదు అని ఓ ప్రశ్నకు రాధకృష్ణన్ సమాధానమిచ్చారు. ఎన్నికల సంవత్సరం కావడంతో మార్స్ ఆర్బిటెర్ మిషన్ ప్రయోగాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. మార్స్ ప్రయోగం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. -
5న ‘మార్స్ మిషన్’ ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహ ప్రయోగం నవంబర్ 5న మధ్యాహ్నం 2.36 గంటలకు నిర్వహించనున్నారు. మంగళవారం బెంగళూరు నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారికంగా ప్రయోగ తేదీని ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించి 56.30 గంటల ముందు అంటే నవంబర్ 3న ఉదయం 6 గంటలకు కౌంట్‌డౌన్ మొదలవుతుంది. నవంబర్ 5న ప్రయాణం మొదలు పెట్టే ఎంవోఎం వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 19న లాంచింగ్ తేదీ ప్రకటించాల్సి ఉన్నా పసిఫిక్ మహా సముద్రంలో వాతావరణం అనుకూలించలేదని వాయిదా వేశారు. దానిని ఇప్పుడు ప్రకటించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదికపై నుంచి అత్యాధునిక ఎక్స్ఎల్ సాంకేతికతతో కూడిన పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహకనౌకద్వారా 1,350 కిలోల బరువు, రూ. 450 కోట్ల విలువైన ఎంవోఎం ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. -
అక్టోబర్ 28న అంగారక యాత్ర!
బెంగళూరు: ఇస్రో చేపట్టిన ‘మార్స్ ఆర్బిటార్ మిషన్’ ప్రయోగానికి సర్వం సన్నద్ధమవుతోంది. అంతరిక్ష నిపుణులతో కూడిన జాతీయ కమిటీ పచ్చజెండా ఊపింది. అన్నీ సజావుగా సాగితే అక్టోబర్ 28న ‘అంగారక యాత్ర’ మొదలవుతుందని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. అంగారకుడిపై జీవాన్వేషణ, అక్కడి వాతావరణంపై పరిశోధన చేయడానికి ఇస్రో ‘మార్స్ ఆర్బిటార్ మిషన్’ను చేపట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 19 మధ్య జరిపేందుకు ఇస్రో ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే, ఈ ప్రాజెక్టుపై గురు, శుక్రవారాల్లో నిపుణుల కమిటీ సమావేశాలను నిర్వహించింది. ఇస్రో మాజీ చైర్మన్ యూఆర్ రావు, అంతరిక్ష నిపుణుడు రొద్దం నరసింహతో పాటు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇస్రోలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పాల్గొన్నారు. ‘మార్స్ ఆర్బిటార్ మిషన్’ ప్రయోగం, ప్రస్తుత ఏర్పాట్లు, సాధ్యాసాధ్యాలపై చర్చించిన నిపుణుల కమిటీ ప్రయోగానికి పచ్చజెండా ఊపింది. తొలుత భావించినట్లుగా కాకుండా ప్రయోగాన్ని అక్టోబర్ 28 నుంచి నవంబర్ 19 మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. వాతావరణం అనుకూలిస్తే అక్టోబర్ 28న అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్త చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని ఉపగ్రహ పరీక్షా కేంద్రంలో ‘మార్స్ ఆర్బిటార్ మిషన్’ ఉపగ్రహంపై ప్రకంపన, ధ్వని సంబంధ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30న శ్రీహరికోట ప్రయోగ కేంద్రానికి తరలిస్తారని వెల్లడించారు.