24న అంగారకుడి కక్ష్యలోకి మామ్!
బెంగళూరు: అంగారకుడి దిశగా పది నెలలుగా అంతరిక్షంలో దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం 98 శాతం ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తం 66.60 కోట్ల కి.మీ. దూరానికి గాను 65.30 కోట్ల కి.మీ. దూరాన్ని మామ్ పూర్తి చేసిందని, ఇంకా 1.30 కోట్ల కి.మీ. ప్రయాణిస్తే అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని సోమవారం బెంగళూరులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రీయ కార్యదర్శి వి.కోటేశ్వరరావు వెల్లడించారు. ఉపగ్ర హం సెప్టెంబరు 24న ఉదయం 7:30 గంటలకు మార్స్ క క్ష్యలోకి ప్రవేశిస్తుందని, దీనిపై పూర్తి ధీమాతో ఉన్నామన్నారు. అరుణగ్రహ కక్ష్యలోకి ప్రవేశం కోసం ఉపగ్రహానికి ఆదేశాలు ఇవ్వడం సోమవారం నాటికి పూర్తి కానున్నట్లు తెలిపారు.
లిక్విడ్ అపోజీ మోటారు (ఎల్‌ఏఎం) ఇంజిన్‌ను 24 నిమిషాల పాటు మండించి ఉపగ్రహ వేగాన్ని సెకనుకు 22.2 కి.మీ నుంచి 2.14 కి.మీకి తగ్గించడం ద్వారా అంగారక కక్ష్యలోకి ప్రవేశపెడతారని, అయితే తొమ్మిది నెలలుగా నిద్రాణ స్థితిలో ఇంజిన్‌ను తిరిగి పనిచేయించడమే సవాలు అని తెలిపారు. ఇంతకుముందు కొన్ని దేశాలు పంపిన ఉపగ్రహాలు ప్రారంభంలో లేదా మార్గమధ్యంలో లేదా అంగారకుడి సమీపంలోకి ప్రయాణించగలిగినా.. చేరలేకపోయాయన్నారు. మామ్ అంగారకుడి కక్ష్యలోకి చేరగలిగితే గనక.. ఈ ఘనత సాధించిన నాలుగో అంతరిక్ష సంస్థగా ఇస్రో రికార్డు సృష్టించనుందని తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం బెంగళూరులోని బైలాలు వద్ద 32 మీటర్ల యాంటెన్నాతో ఉన్న ఇండియన్ డీప్‌స్పేస్ నెట్‌వర్క్(ఐడీఎస్‌ఎన్)ను, అమెరికాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలలో గల డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లను ఇస్రో ఉపయోగించుకోనుందని పేర్కొన్నారు.