అరుణ గ్రహం దారిలో..
* భూ కక్ష్యను దాటి మలిదశ యాత్రను మొదలుపెట్టిన ‘మామ్’
* అంగారకుని వైపు పది నెలలు సాగనున్న ప్రయాణం
చెన్నై/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)(మంగళ్‌యాన్) వ్యోమనౌక ప్రస్థానంలో మలిదశ మొదలైంది. ఈ వ్యోమనౌక ఆదివారం వేకువ జామున భూ కక్ష్యను అధిగమించి, అంగారకుని వైపుగా తన కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది.
అంగారకుని వైపు 68 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు ‘మామ్’ పది నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. ఇది 2014 సెప్టెంబర్‌లో అంగారకుని కక్ష్యలోకి చేరుకోగలదు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నవంబర్ 5న ‘మామ్’ను ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ప్రయోగించిన సంగతి తెలిసిందే. తొలిదశలో భూ కక్ష్యలో పరిభ్రమించిన ఈ వ్యోమనౌక, ఆదివారం 00.49 గంటలకు భూ కక్ష్యను అధిగమించింది.
భూ కక్ష్య నుంచి బయటకు నిర్ణీత దిశలో పంపేందుకు వ్యోమనౌకలోని 440 న్యూటన్ లిక్విడ్ ఇంజన్‌ను 22 నిమిషాల సేపు మండించారు. దీంతో అంగారకుని దిశగా సెకనుకు 648 మీటర్ల వేగాన్ని పుంజుకుంది. బెంగళూరులోని ‘ఇస్రో’ ప్రధాన కార్యాలయం నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. కాగా, ‘మామ్’ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కాలంలో శాస్త్రవేత్తలు ఐదుసార్లు దీని కక్ష్యను పొడిగించిన సంగతి తెలిసిందే.