‘మామ్’ కక్ష్య పెంపు దిగ్విజయం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్/చెన్నై: అరుణగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్/మంగళ్‌యాన్) ఉపగ్రహాన్ని కక్ష్యలో ఎత్తుకు చేర్చే ప్రక్రియ దిగ్విజయంగా పూర్తయింది. శనివారం తెల్లవారుజామున 1:27 గంటలకు ఉపగ్రహంలోని ఇంధనాన్ని 243.5 సెకన్లపాటు మండించి కక్ష్య పెంపులో తుది దశను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
నవంబర్ 5న రోదసీకి చేరిన మామ్‌ను తర్వాత కక్ష్యలో ఎత్తుకు చేర్చేందుకు చేపట్టిన తొలి మూడు దశలు విజయవంతం కాగా, నాలుగోసారి మాత్రం ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్ల అవాంతరం ఎదురైంది. దీంతో మరోసారి అనుబంధ పెంపు ప్రక్రియ చేపట్టి ఉపగ్రహం కక్ష్యను 1.18 లక్షల కి.మీ. అపోజీ(భూమికి దూరపు బిందువు)కి పెంచారు. శనివారంనాటి తుది పెంపుతో ఉపగ్రహం కక్ష్యలో 1,92,874 కి.మీ. అపోజీకి చేరిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఉపగ్రహం డిసెంబర్ 1 తెల్లవారుజామున 12:42 గంటలకు అంగారకుడి దిశగా ప్రయాణం మొదలుపెట్టనుందని, 2014 సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యను చేరుకోనుందన్నారు.