మామ్ కెమెరాలో 'అరుణ' చంద్రుడు | mars moon camera | Sakshi
Sakshi News home page

మామ్ కెమెరాలో 'అరుణ' చంద్రుడు

Published Wed, Oct 15 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

మామ్  కెమెరాలో 'అరుణ' చంద్రుడు

మామ్ కెమెరాలో 'అరుణ' చంద్రుడు

 ఇరవై రోజుల క్రితమే అంగారకుడి చెంతకు చేరిన మన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్; మంగళ్‌యాన్)’ ఉపగ్రహం తాజాగా అరుణగ్రహానికి సహజ ఉపగ్రహమైన ఫోబోస్‌ను త న కెమెరాలో బంధించింది. మార్స్‌కు 66,275 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మామ్ ఈ ఫొటోలు తీసిందని పేర్కొంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మంగళవారం తన ఫేస్‌బుక్ పేజీలో చిన్న వీడియో ఫుటేజీని ఉంచిం ది. అన్నట్టూ... అంగారకుడికి రెండు చంద్రుళ్లు ఉన్నారండోయ్. వీటిలో పెద్దదైన ఫోబోస్ సగటు వ్యాసార్థం 11 కిలోమీటర్లే. మార్స్‌కు జస్ట్ 6 వేల కిలోమీటర్ల దూరం నుంచే తిరుగుతుండటం వల్ల ఇది 7:39 గంటలకే ఒకసారి అంగారకుడిని చుట్టి వస్తుంది.

మన చంద్రుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాడు కదా.. ఈ అరుణ చంద్రుడు మాత్రం పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణిస్తాడట! అంతేకాదు.. ఫోబోస్ ప్రతి వందేళ్లకు ఓ మీటరు చొప్పున మార్స్‌కు దగ్గరవుతున్నాడట. అందువల్ల మరో 5 కోట్ల ఏళ్లలో ఈ చంద్రుడు అంగారకుడిని ఢీకొట్టడం లేదా.. పేలిపోయి ఉంగరం ఆకారంగా మిగిలి పోవడం జరగవచ్చట! ఇక మార్స్‌కు రెండో ఉపగ్రహమైన డైమోస్.. ఫోబోస్ కన్నా 7 రెట్లు చిన్నది. ఇది 30 గంటలకు ఓసారి అంగారకుడిని చుట్టి వస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement