తొలి ప్రయోగంలోనే భారత్ కు దక్కనున్నఘనత!
బెంగళూరు: అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తిపతాక మరోసారి వినువీధిన ప్రకాశించనుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఇంకా అంగారకుడిని అందుకోవడానికి 72 గంటల సమయం మాత్రమే ఉంది. సవాళ్లను అధిగమిస్తూ.. సాఫీగా సాగుతూ ముందుకుపోతున్న మామ్ ఇప్పటివరకూ సుదీర్ఘ దూరం పయనించింది. పది నెలలుగా అంతరిక్షంలో దూసుకుపోతున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం 98 శాతం ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసింది.
ఇంకా కొద్ది దూరం మాత్రమే పయనిస్తే ఎర్రగ్రహం(కుజుడు) కక్ష్యలోని చేరుకుంటుంది. దీనిపై ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ జాతీయ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటూర్యూలో పలువిషయాలను వెల్లడించారు. 680 మిలియన్ కిలో మీటర్లు (82 కోట్ల కిలోమీటర్లు) సుదీర్ఘ పయనంతో మామ్ సరికొత్త రికార్డు నెలకొల్పుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై తాము ఎటువంటి ఆందోళనకు గురికావడం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమయంలో తాము ప్రశాంతంగా ఉండటమే మేలని తెలిపారు. మార్స్ ఆర్బిట్ మిషన్ విజయవంతంగా కక్ష్యను చేరుకునే దిశగా ముందుకు వెళుతుందన్నారు. భారత్ నుంచి మార్స్ పైకి ప్రవేశపెట్టిన మామ్ సురక్షితంగా గమ్యానికి చేరుకుంటే ఆసియాలోనే ఒక చరిత్రగా మిగిలిపోతుందన్నారు. తొలి ప్రయోగంలోనే ఆసియా నుంచి సక్సెస్ ఫుల్ గా మామ్ ను కుజుని కక్ష్యలోనికి ప్రవేశపెట్టిన ఘనత భారత్ కు దక్కనుందని ఆయన స్పష్టం చేశారు.
మామ్ ఆగస్టు 30 నాటికి 62.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. సెకనుకు 22.33 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం కొనసాగిస్తోంది. మిగిలి ఉన్న మరో 19.9 కోట్ల కిలోమీటర్లు కలిపి మొత్తం.. 82.1 కోట్ల కిలోమీటర్ల మహా ప్రయాణం ముగింపుతో మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇస్రో అంగారకయాత్రకు అక్టోబరు 31 నాటికి మొత్తం రూ.450 కోట్ల బడ్జెట్‌లో ఇప్పటివరకూ రూ.244.06 కోట్లే ఖర్చుచేసింది. ఇదిలా ఉండగా అమెరికా, రష్యా అంతరిక్ష సంస్థలు సైతం సాధించలేని ‘తొలి ప్రయత్నంలోనే విజయా’న్ని ఇస్రో సాధించబోతోంది. అంగారక యాత్ర దిగ్విజయంగా చేపట్టిన నాలుగో దేశంగా అవతరించబోతోంది. అరుణగ్రహం దిశగా నిరంతరం సెకనుకు 22 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న మామ్.. సరిగ్గా సెప్టెంబరు 24వ తేదీన అర్ధరాత్రి అరుణుడి కక్ష్యలోకి చేరుకోబోతోంది.