
విజయవంతంగా విడిపోయిన స్పెడెక్స్ జంట ఉపగ్రహాలు
తొలి ప్రయత్నంలోనే సఫలమైన ఇస్రో
సాక్షి బెంగళూరు: ఖగోళంలో భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఉపకరించే కీలక సాంకేతికతను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఇప్పటికే అనుసంధానం(డాకింగ్) ద్వారా ఒక్కటిగా జతకూడిన స్పెడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో బుధ వారం తొలిప్రయత్నంలోనే విజయవంతంగా వేరు చేసింది. స్పెడెక్స్ ఉపగ్రహాల డీ–డాకింగ్(విడదీత) ప్రక్రియ సజావుగా సాగిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
‘‘చందమామపై పరీక్షలు, మానవ సహిత వ్యోమనౌక ప్రయాణాలు, చంద్రయాన్–4, గగన్ యాన్ ప్రయోగాలకు బాటలు వేస్తూ ఛేజర్ (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ (ఎస్ డీఎక్స్02) శాటిలైట్ల తో డీ–డాకింగ్ సాంకేతికతను పరీక్షించాం. ఇస్రో బృందానికి అభినందనలు. ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడి ఎదను ఉప్పొంగేలా చేసింది’’ అని మంత్రి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు.
ఇప్పటికే ఇటీవల డాకింగ్ సాంకేతికతను పరీక్షించి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశాల సరసన నిలిచిన భారత్ తాజాగా డీ–డాకింగ్ సాంకేతికతనూ ఒడిసిపట్టి అంతరిక్ష రంగంలో మరోసారి తన సత్తా చాటింది. డాకింగ్ సాంకేతికతను పరీక్షించేందుకు గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఇస్రో స్పేడెక్స్ మిషన్‌ను ప్రయోగించింది. ఇందులో భాగంగా ఛేజర్ (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ (ఎస్‌డీఎక్స్02) శాటిలైట్లను వేర్వేరు కక్ష్యల్లో నింగిలోకి ప్రవేశపెట్టింది. ఇవి కొద్దిరోజుల వ్యవధిలో దశలవారీగా చాలా నెమ్మదిగా ఒకే లక్ష్యలోకి చేరుకున్నాక వీటి అనుసంధానం(డాకింగ్) కోసం ప్రయత్నించారు.
పలుమార్లు విఫలయత్నంచేసి ఎట్టకేలకు ఈఏడాది జనవరి 16వ తేదీన విజయవంతంగా వాటి డాకింగ్‌ను పూర్తిచేసింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా వీటిని డీ–డాకింగ్ సైతం చేయాల్సి ఉంది. డాకింగ్‌ను విజయవంతం చేసేందుకు పలుమార్లు ప్రయత్నించిన ఇస్రో.. డీ–డాకింగ్‌ను మాత్రం తొలి ప్రయత్నంలో పూర్తిచేయడం విశేషం. శాటిలైట్లు, మాడ్యూళ్ల వంటి వస్తువులను అంతరిక్షంలో అనుసంధానం చేయగల్గితేనే భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష ప్రయోగ కేంద్రంవంటి వాటిని అంతరిక్షంలో నిర్మించగలం.
‘‘ 45 డిగ్రీల కోణంలో 460 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో అన్‌డాకింగ్ ప్రక్రియను గురువారం విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో తదుపరి ప్రయోగాలను త్వరలో మొదలుపెట్టబోతున్నాం. విడిపోయాక ఈ రెండు ఉపగ్రహాలు పూర్తి ‘ఆరోగ్యవంతం’గా ఉన్నాయి. డీ–డాకింగ్‌కు మార్చి 10 నుంచి 25వ తేదీ వరకు అనువైన సమయం. అందుకే ఈ సమయంలోనే డీ–డాకింగ్ చేపట్టాం. బెంగళూరు, లక్నో, మారిషస్‌లోని గ్రౌండ్ స్టేషన్ల నుంచి నియంత్రిస్తూ ఈ అన్‌డాకింగ్‌ను పూర్తిచేశాం’’ అని ఇస్రో ప్రకటించింది.
‘‘ ఇస్రో శాస్త్రవేత్తలకు అంతరిక్షంలో కూడా హద్దే లేదు. భారత ఘనత అంతరిక్షంలో మరోసారి ప్రభవించింది. డీ–డాకింగ్‌ను పూర్తిచేసిన ఇస్రో బృందానికి నా అభినందనలు. దేశం సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవాలన్న ప్రధాని మోదీ కల సాకారమయ్యేందుకు ఇస్రో బాటలువేసిందని గర్వపడాల్సిన క్షణమిది’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment