Union Minister Jitendra Singh
-
రాజ్యసభ సాక్షిగా మళ్లీ దొరికేసిన చంద్రబాబు
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ సాక్షిగా చంద్రబాబుది దుష్ప్రచారమని తేట తెల్లమైంది. విశాఖపట్నంలో దొరికింది డ్రగ్స్ కాదని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖపట్నంలో సీబీఐ 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్‌ను సీజ్ చేసిందని పేర్కొంది. అయితే అందులో నార్కోటిక్స్ లాంటి మత్తు పదార్థాలు లేవని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నిర్ధారించిందని తెలిపింది. ఈ విషయాన్ని సంబంధిత కోర్టులో ఫైల్ చేశామని.. ఆ కేసు సెప్టెంబర్ 21, 2024లో క్లోజ్ అయిందని రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు.సంధ్యా ఆక్వా ప్రతినిధులు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ పెట్టగా, మార్చి 16న విశాఖ పోర్టుకు ఎస్‌ఈకేయూ4375380 కంటెయినర్లో వెయ్యి బ్యాగుల సరుకు వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు అందులో తనిఖీ చేశారు. మార్చి 19న గుజరాత్ ల్యాబ్ నుంచి వచ్చిన నిపుణులు 49 నమూనాలు సేకరించి, 27 నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ, జడ్జి ఆధ్వర్యంలో మరో 100 నమూనాలు సేకరించింది. ఆ నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. 8 నెలల తర్వాత నివేదిక వచ్చింది. -
డీ–డాకింగ్ సక్సెస్
సాక్షి బెంగళూరు: ఖగోళంలో భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఉపకరించే కీలక సాంకేతికతను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఇప్పటికే అనుసంధానం(డాకింగ్) ద్వారా ఒక్కటిగా జతకూడిన స్పెడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో బుధ వారం తొలిప్రయత్నంలోనే విజయవంతంగా వేరు చేసింది. స్పెడెక్స్ ఉపగ్రహాల డీ–డాకింగ్(విడదీత) ప్రక్రియ సజావుగా సాగిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘‘చందమామపై పరీక్షలు, మానవ సహిత వ్యోమనౌక ప్రయాణాలు, చంద్రయాన్–4, గగన్ యాన్ ప్రయోగాలకు బాటలు వేస్తూ ఛేజర్ (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ (ఎస్ డీఎక్స్02) శాటిలైట్ల తో డీ–డాకింగ్ సాంకేతికతను పరీక్షించాం. ఇస్రో బృందానికి అభినందనలు. ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడి ఎదను ఉప్పొంగేలా చేసింది’’ అని మంత్రి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. ఇప్పటికే ఇటీవల డాకింగ్ సాంకేతికతను పరీక్షించి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశాల సరసన నిలిచిన భారత్ తాజాగా డీ–డాకింగ్ సాంకేతికతనూ ఒడిసిపట్టి అంతరిక్ష రంగంలో మరోసారి తన సత్తా చాటింది. డాకింగ్ సాంకేతికతను పరీక్షించేందుకు గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఇస్రో స్పేడెక్స్ మిషన్‌ను ప్రయోగించింది. ఇందులో భాగంగా ఛేజర్ (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ (ఎస్‌డీఎక్స్02) శాటిలైట్లను వేర్వేరు కక్ష్యల్లో నింగిలోకి ప్రవేశపెట్టింది. ఇవి కొద్దిరోజుల వ్యవధిలో దశలవారీగా చాలా నెమ్మదిగా ఒకే లక్ష్యలోకి చేరుకున్నాక వీటి అనుసంధానం(డాకింగ్) కోసం ప్రయత్నించారు. పలుమార్లు విఫలయత్నంచేసి ఎట్టకేలకు ఈఏడాది జనవరి 16వ తేదీన విజయవంతంగా వాటి డాకింగ్‌ను పూర్తిచేసింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా వీటిని డీ–డాకింగ్ సైతం చేయాల్సి ఉంది. డాకింగ్‌ను విజయవంతం చేసేందుకు పలుమార్లు ప్రయత్నించిన ఇస్రో.. డీ–డాకింగ్‌ను మాత్రం తొలి ప్రయత్నంలో పూర్తిచేయడం విశేషం. శాటిలైట్లు, మాడ్యూళ్ల వంటి వస్తువులను అంతరిక్షంలో అనుసంధానం చేయగల్గితేనే భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష ప్రయోగ కేంద్రంవంటి వాటిని అంతరిక్షంలో నిర్మించగలం. ‘‘ 45 డిగ్రీల కోణంలో 460 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో అన్‌డాకింగ్ ప్రక్రియను గురువారం విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో తదుపరి ప్రయోగాలను త్వరలో మొదలుపెట్టబోతున్నాం. విడిపోయాక ఈ రెండు ఉపగ్రహాలు పూర్తి ‘ఆరోగ్యవంతం’గా ఉన్నాయి. డీ–డాకింగ్‌కు మార్చి 10 నుంచి 25వ తేదీ వరకు అనువైన సమయం. అందుకే ఈ సమయంలోనే డీ–డాకింగ్ చేపట్టాం. బెంగళూరు, లక్నో, మారిషస్‌లోని గ్రౌండ్ స్టేషన్ల నుంచి నియంత్రిస్తూ ఈ అన్డాకింగ్ను పూర్తిచేశాం’’ అని ఇస్రో ప్రకటించింది. ‘‘ ఇస్రో శాస్త్రవేత్తలకు అంతరిక్షంలో కూడా హద్దే లేదు. భారత ఘనత అంతరిక్షంలో మరోసారి ప్రభవించింది. డీ–డాకింగ్‌ను పూర్తిచేసిన ఇస్రో బృందానికి నా అభినందనలు. దేశం సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవాలన్న ప్రధాని మోదీ కల సాకారమయ్యేందుకు ఇస్రో బాటలువేసిందని గర్వపడాల్సిన క్షణమిది’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తంచేశారు. -
అమర్నాథ్ యాత్రకు బ్రేక్
జమ్మూ: అమర్నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు శనివారం కూడా నిలిచిపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతూ ఉండడంతో అధికారులు యాత్రను నిలిపివేశారు. యాత్రకు వెళ్లే మార్గం మధ్యలో వేలాది మంది భక్తులు చిక్కుకుపోయారు. భక్తులెవరూ ఆందోళనకు గురి కావొద్దని అధికారులు అనుక్షణం పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలను భక్తులందరూ తూచ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో రెండు మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్ ఆలయం ఉన్న ప్రాంతంలో విపరీతంగా మంచుకురుస్తోంది. ‘‘అమర్నాథ్ యాత్రకు వెళ్లే రెండు మార్గాలైన పాహల్గామ్, బాల్టాల్ మార్గాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాత్రను నిలిపివేస్తున్నాం’అని ఒక అధికారి వెల్లడించారు. బేస్ క్యాంప్ అయిన భగవతి నగర్ నుంచి శనివారం కొత్త బ్యాచ్ ఎవరినీ అనుమతించలేదు. జులై 1న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31తో ముగుస్తుంది. 80 వేల మందికి పైగా భక్తులు ఈ ఏడాది యాత్రకు డబ్బులు చెల్లించారు. -
రోజ్‌గార్ మేళాల ద్వారా 1.47 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రోజ్‌గార్ మేళాల కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్య్ర సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో కొత్తగా 1.47 లక్షల మందిని నియమిస్తూ నియామకపత్రాలు అందజేశామని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇంకా భర్తీకాని పోస్టులకుగాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేశారు. 2020–21 కాలానికిగాను దేశంలో నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదే కాలానికి దేశంలోని మొత్తం జనాభాలో ఏదైనా ఒక వృత్తిలో నిమగ్నమైన జనాభా(వర్కర్ పాపులేషన్ రేషన్–డబ్లూపీఆర్) 52.6 శాతంగా నమోదైందని తెలిపారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు, కోవిడ్ సంక్షోభం నుంచి దేశార్థికాన్ని ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ.27 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అమలుచేసిందన్నారు. ఈ పథకం కింద లబ్దిపొందాలనుకునే సంస్థల రిజిస్ట్రేషన్ గడువు ఈ ఏడాది మార్చి 31నాడే ముగిసిందన్నారు. 60 లక్షల ఉద్యోగాల సృష్టి కోసం రూ.1.97 లక్షల కోట్లతో ఉత్పత్తి ప్రోత్సాహక రాయితీ పథకం తెచ్చామని మంత్రి చెప్పారు. -
ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’కి నో ఎంట్రీ
న్యూఢిల్లీ: ముందస్తు అనుమతిలేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం బుధవారం వెల్లడించింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్రసింగ్ సభలో పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంతో బేదాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలను చూపుతూ కొన్ని రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతికి నిరాకరించిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని కేంద్రం బుధవారం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. ఇదీ చదవండి: Tawang dominates Parliament: ‘చైనా’పై చర్చించాల్సిందే -
అంతరిక్ష రంగంలో ప్రైవేటు
సాక్షి, న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇక గ్రహాంతర అన్వేషణ ప్రయోగాలు సహా అన్ని అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం లభించనుందని ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర వెల్లడించారు. భారత అంతరిక్ష రంగ మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలు వినియోగించుకునేందుకు అనుసంధాన సంస్థగా కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్)’ వ్యవహరిస్తుందన్నారు. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. భారత అంతరిక్ష ప్రయోగ వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అంతరిక్ష విభాగం నియంత్రణలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్)’ వీలు కల్పిస్తుందన్నారు. సంస్కరణల వల్ల ఇస్రో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై, మానవసహిత అంతరిక్ష ప్రయోగాలపై మరింత దృష్టి పెట్టే అవకాశం లభిస్తుందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం ద్వారా దేశీయంగా అంతరిక్ష రంగ అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, ఇంటర్నేషనల్ స్పేస్ ఎకానమీలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం లభిస్తుందని, అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఓబీసీల వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు ఓబీసీ వర్గీకరణ కోసం ఏర్పడిన కమిషన్ కాలపరిమితిని జనవరి 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల్లో కొన్ని కులాలకు సరైన రిజర్వేషన్ ఫలాలు అందకపోవడం వల్ల విద్య, ఉద్యోగ అవకాశాల్లో వారికి న్యాయం జరగడం లేదని, ఈ విషయంలో తగిన సిఫారసులు చేయాలని ఓబీసీ వర్గీకరణ కమిషన్‌ను కేంద్రం 2017లో ఏర్పాటు చేసింది. -
లాక్డౌన్ నుంచి నిష్క్రమణ ఎలా?
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటం, లాక్డౌన్ నుంచి నిష్క్రమణ ప్రణాళికపై కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ శనివారం మాజీ సివిల్ సర్వీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వారికి వివరించారు. కరోనా కట్టడి విషయంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడానికి లాక్డౌన్ తర్వాత అమలు చేయాల్సిన చర్యలు, లాక్డౌన్ నుంచి నిష్క్రమణ ప్రణాళికపై సంప్రదింపులు జరిపారు. -
సరళతర పాలన.. సులభతర జీవనం
సాక్షి, హైదరాబాద్: పాలనను సరళ తరం చేసి మానవ జీవనాన్ని సులభతరం చేయడమే ఈ–గవర్నెన్స్ ప్రధాన ధ్యేయం కావాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ‘న్యూ ఇండియా’ ఆవిర్భావానికి ఇది అత్యవసరమని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ హైటెక్స్‌లో ఈ–గవర్నెన్స్‌పై జరిగిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘కనిష్ట ప్రభుత్వంతో గరిష్ట పాలన అందించడానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఈ–గవర్నెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఎన్నో విజయాలు సాధించింది. సీపీజీఆర్ఏఎంఎస్ పోర్టల్‌కు మూడేళ్ల కింద 2 లక్షల ఫిర్యాదులొస్తే ఈ ఏడాది 16 లక్షల ఫిర్యాదులు అందాయి. వీటిలో 86 శాతం పరిష్కరించాం. ప్రభుత్వం నుంచి మెరుగైన స్పందనే ఇందుకు కారణం’ అని అన్నారు. ప్రభుత్వంలో కింది స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ పద్ధతి, దస్తా వేజు పత్రాలపై గెజిటెడ్ అధికారుల ప్రమాణీకరణ తొలగింపు, ఇలా కాలం చెల్లిన 1,500కు పైగా నియమాలు రద్దు చేశామని చెప్పారు. తెలంగాణ ‘మీ–సేవ’కు పతకం.. కార్యక్రమంలో జాతీయ ఈ–గవర్నెన్స్ పురస్కారాలను మంత్రి జితేంద్రసింగ్ ప్రదానం చేశారు. 8 కేటగిరీల్లో 19 అవార్డులు అందజేశారు. ప్రతి కేటగిరీలో స్వర్ణ పతకానికి రూ. 2 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం.. రజత పతకానికి రూ.1 లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందించారు. తెలంగాణ ‘మీ–సేవా’విభాగానికి రజత పతకం దక్కింది. కార్యక్రమంలో పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి కె.వి. ఇయాపెన్, డీఏఆర్పీజీ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా, తెలంగాణ అదనపు ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల చట్టంలో సవరణకు ఆమోదం
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య భూభాగాల మార్పిడితో దేశ పౌరులైన వారికి ఓటుహక్కు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఎన్నికల చట్టం(సవరణ) బిల్లు, 2016ను న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2002 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 11, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9లో సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. లోక్‌సభలో... 8 బొగ్గు శాఖకు చెందిన నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు మార్చి 29న సమ్మె చేస్తున్నట్లు నోటీసులిచ్చాయని విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. యూనియన్లతో చర్చలు జరుపుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజ్యసభలో... 8 సివిల్ సర్వీసు పరీక్షలకు సంబంధించి వివిధ అంశాల అధ్యనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, ఆగస్టులో నివేదిక అందిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయండి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ)ను కేంద్ర ప్రభుత్వం కోరింది. సిలబస్, పరీక్షా విధానంపై స్పష్టత వచ్చేంత వరకు పరీక్ష వాయిదా వేయాలని యూపీఎస్సీని కోరినట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అన్నివర్గాలు చేస్తున్న డిమాండ్లపై కమిటీ నియమించాలని సూచించినట్టు చెప్పారు. సివిల్ సర్వీసెస్ అప్టిట్యూట్ టెస్ట్(సీఎస్ఏటీ)ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది ఆగస్టు 24న జరగాల్సివుంది. మెయిన్స్ డిసెంబర్ 14వ తేదీన జరిగే అవకాశముంది. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయండి
-
నెలనెలా ఇంటికే పెన్షన్: కేంద్రం యోచన
న్యూఢిల్లీ: విశ్రాంత ఉద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. వృద్ధులు, వికలాంగులైన విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా పెన్షన్ వారింటికే వచ్చి అందించే విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. వృద్ధులు, వికలాంగులైన విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా పెన్షన్ వారింటికే వెళ్లి అందించే యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. అలాగే, పెన్షన్ పేమెంట్ ఆర్డర్‌ను ఉద్యోగ విరమణ రోజే అందించడంతో పాటు, ఇతర అన్ని రకాల నగదు బాకీలను వారి ఇంటికి వెళ్లి అందించాలన్నది తమ లక్ష్యమని అన్ని రాష్ట్రాల పెన్షన్ కార్యదర్శులతో సమావేశమైన సందర్భంగా మంత్రి చెప్పారు. ఈ దిశగా పెన్షన్ విభాగం పనిచేస్తోందని తెలిపారు. ఇక, మెరుగైన సమాజం కోసం పెన్షనర్ల నైపుణ్యం, అనుభవాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి పెడతామన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు విరమణ పొందుతుండడం, జీవిత కాలం పెరిగిపోవడంతో ఇది అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు.