సాక్షి, న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇక గ్రహాంతర అన్వేషణ ప్రయోగాలు సహా అన్ని అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం లభించనుందని ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర వెల్లడించారు. భారత అంతరిక్ష రంగ మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలు వినియోగించుకునేందుకు అనుసంధాన సంస్థగా కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్)’ వ్యవహరిస్తుందన్నారు. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు.
భారత అంతరిక్ష ప్రయోగ వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అంతరిక్ష విభాగం నియంత్రణలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఐఎల్)’ వీలు కల్పిస్తుందన్నారు. సంస్కరణల వల్ల ఇస్రో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై, మానవసహిత అంతరిక్ష ప్రయోగాలపై మరింత దృష్టి పెట్టే అవకాశం లభిస్తుందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం ద్వారా దేశీయంగా అంతరిక్ష రంగ అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, ఇంటర్నేషనల్ స్పేస్ ఎకానమీలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం లభిస్తుందని, అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
ఓబీసీల వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు
ఓబీసీ వర్గీకరణ కోసం ఏర్పడిన కమిషన్ కాలపరిమితిని జనవరి 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల్లో కొన్ని కులాలకు సరైన రిజర్వేషన్ ఫలాలు అందకపోవడం వల్ల విద్య, ఉద్యోగ అవకాశాల్లో వారికి న్యాయం జరగడం లేదని, ఈ విషయంలో తగిన సిఫారసులు చేయాలని ఓబీసీ వర్గీకరణ కమిషన్‌ను కేంద్రం 2017లో ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment