Space research
-
‘ఐఎస్ఎస్’ కూల్చడమెందుకు? ‘నాసా’ ఏం చెప్పింది?
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) ఫ్యూచరేంటి..? 400కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో తిరుగుతున్న ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి ఎలా కూలుస్తారు. ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించేందుకు సిద్ధం చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్ వెహిహికిల్(యూఎస్‌డీవీ)ని ఎలా ఉపయోగిస్తారు..?అసలు ఐఎస్ఎస్ను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతా సజావుగా జరిగి 2030లో ఐఎస్ఎస్ నింగి నుంచి మాయమైన తర్వాత అంతరిక్ష పరిశోధనల మాటేమిటి..? ఈ విషయాలన్నింటిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అసలు ఐఎస్ఎస్ ఏంటి.. ఎందుకు..?అమెరికా, రష్యా, కెనడా, జపాన్, యూరప్‌లు 1998 నుంచి 2011వరకు శ్రమించి ఐఎస్ఎస్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాయి. 2000 సంవత్సరం నవంబర్ 2వ తేదీనే ఐఎస్ఎస్ కమిషన్ అయింది. అప్పటినుంచే అది అంతరిక్షంలో వ్యోమగాములకు ఆశ్రయమిస్తూ ఎన్నో పరిశోధనలకు వేదికైంది. ప్రస్తుతం 15 దేశాలు ఐఎస్ఎస్ను నిర్వహిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భారీ ఖర్చుతో ఐఎస్ఎస్ను నిర్మించారు. ఆశించినట్లుగానే స్పేస్ రీసెర్చ్‌లో 24 ఏళ్లుగా ఐఎస్ఎస్ గొప్పగా సేవలందిస్తోంది.డీ కమిషన్ చేయడం ఎందుకు..?ఐఎస్ఎస్ నింగిలో పనిచేయడం ప్రారంభించి 2030నాటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి ఐఎస్ఎస్ చాలా పాతదవుతుంది. అంతరిక్ష వాతావరణ ప్రభావం వల్ల దాని సామర్థ్యం తగ్గిపోతుంది. అందులోని చాలా విడిభాగాలు పనిచేయవు. ఐఎస్ఎస్లోని పరికరాలన్నీ నెమ్మదిస్తాయి. ఐఎస్ఎస్లో వ్యోమగాములు నివసించే మాడ్యూళ్లు పనికిరాకుండా పోతాయి. అది ప్రస్తుతం తిరుగుతున్న 400 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్ నుంచి దానికదే కిందకు దిగడం ప్రారంభమవుతుంది. నిజానికి ఐఎస్ఎస్ను నిర్దేశిత కక్ష్యలో ఉంచడం మళ్లీ సాధ్యమే అయినప్పటికీ అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇందుకే 2030లో ఐఎస్ఎస్ను డీ కమిషన్ చేయాలని నిర్ణయించారు.ఎలా కూలుస్తారు..?ఐఎస్ఎస్ను తొలుత కక్ష్యలో నుంచి తప్పించి(డీఆర్బిట్) నెమ్మదిగా భూమిపై కూల్చేస్తారు. ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి భూమిపై కూల్చేయడం సాధారణ విషయం కాదు. దీనిని చాలా అడ్వాన్స్డ్ సైంటిఫిక్ నైపుణ్యంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తయరు చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్ వాహనాన్ని నాసా వాడనుంది. 2030లో ఐఎస్ఎస్ను డీ కమిషన్ చేయనున్నప్పటికీ 18 నెలల ముందే డీ ఆర్బిట్ వెహికిల్ నింగిలోకి వెళ్లి ఐఎస్ఎస్తో అనుసంధానమవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి జాగ్రత్తగా భూ వాతావరణానికి తీసుకువస్తారు. భూ వాతావరణానికి రాగానే ఐఎస్ఎస్ మండిపోతుంది. దాని శకలాలను మనుషులెవరూ ఉండని దక్షిణ పసిఫిక్ ఐలాండ్లలో పడేలా చేస్తారు. డీఆర్బిట్ వెహిహికల్ ఎలా పనిచేస్తుంది..సాధారణంగా ఐఎస్ఎస్కు వ్యోమగాములను మోసుకెళ్లి దానితో అనుసంధానమయ్యే డ్రాగన్ కాప్స్యూల్స్‌తో పోలిస్తే డీఆర్బిట్ వెహికిల్ యూఎస్‌డీవీకి ఆరు రెట్ల ఎక్కువ శక్తి కలిగిన ప్రొపల్లెంట్ ఉంటుంది. డీ ఆర్బిట్ వెహికిల్ ఐఎస్ఎస్ డీ కమిషన్‌కు 18 నెలల ముందే వెళ్లి దానితో అనుసంధానమవుతుంది. ఇంకో వారంలో ఐఎఎస్ఎస్ డీ ఆర్బిట్ అవనుందనగా యూఎస్‌డీవీలోని ఇంధనాన్ని మండించి ఐఎస్ఎస్ను కక్ష్య నుంచి తప్పించి భూమివైపు తీసుకురావడం మొదలుపెడతారు. చివరిగా భూ వాతావరణంలోకి రాగానే ఐఎస్ఎస్ మండిపోతుంది. దీంతో ఐఎస్ఎస్ 30 ఏళ్ల ప్రస్థానం ముగిసిపోతుంది.ఐఎస్ఎస్ తర్వాత నాసా ప్లానేంటి..? పరిశోధనలు ఎలా..? ఐఎస్ఎస్ చరిత్రగా మారిన తర్వాత సొంతగా కొత్త స్పేస్ స్టేషన్లను అభివృద్ధి చేసే ప్లాన్ అమెరికాకు లేదు. ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న స్పేస్ స్టేషన్లను అద్దెకు తీసుకుని అంతరిక్ష పరిశోధనలు చేసే అవకాశముంది. ఒకవేళ 2030కల్లా ప్రైవేట్ కంపెనీల స్పేస్ స్టేషన్లు సిద్ధం కాకపోతే డీ ఆర్బిట్ వెహికిల్‌ను వాడి ఐఎస్ఎస్ జీవితకాలాన్ని పొడిగించాలన్న ప్లాన్ బీ కూడా నాసాకు ఉండటం విశేషం. -
చరిత్ర సృష్టించిన చాంగ్యీ–6
బీజింగ్: చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(సీఎన్ఎస్ఏ) సరికొత్త చరిత్ర సృష్టించింది. చందమామపై మనకు కనిపించని అవతలివైపు భాగం నుంచి మట్టి నమూనాలను విజయవంతంగా భూమిపైకి తీసుకొచి్చంది. చైనా ప్రయోగించిన లూనార్ ప్రోబ్ మాడ్యూల్ చాంగ్యీ–6 జాబిల్లి నుంచి మట్టిని మోసుకొని స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.07 గంటల సమయంలో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో క్షేమంగా దిగింది. చంద్రుడి అవతలి వైపు భాగంలోని మట్టిని భూమిపైకి సురక్షితంగా చేర్చిన మొట్టమొదటి దేశంగా చైనా రికార్డుకెక్కింది.చైనా అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు. చాంగ్యీ–6 మిషన్ పూర్తిస్థాయిలో విజయవంతమైందని సీఎన్ఎస్ఏ ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల చైనా అధినేత షీ జిన్‌పింగ్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధకులకు అభినందనలు తెలిపారు. చాంగ్యీ–6 వ్యోమనౌక ఈ ఏడాది మార్చి 3న జాబిల్లి దిశగా తన ప్రస్థానం ప్రారంభించింది. ఇందులో అర్బిటార్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే భాగాలు ఉన్నాయి.53 రోజులపాటు అవిశ్రాంతంగా ప్రయాణం సాగించి, జూన్ 2న చందమామ దక్షిణ ధ్రువంలోని సౌత్‌పోల్–అయిట్కెన్(ఎస్పీఏ) ప్రాంతంలో సురక్షితంగా దిగింది. రోబోటిక్ హస్తం సాయంతో రెండు రోజులపాటు మట్టి నమూనాలను సేకరించిన అసెండర్ జూన్ 4న తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. జూన్ 6న భూకక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆర్బిటార్–రిటర్నర్కు మట్టి నమూనాలను బదిలీ చేసింది.భూమిపై అడుగుపెట్టడానికి తగిన సమయం కోసం వేచి చూస్తూ ఆర్బిటార్–రిటర్నర్ 13 రోజలపాటు కక్ష్యలోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు మంగళవారం భూమిపైకి క్షేమంగా చేరుకుంది. అరుదైన మట్టి నమూనాలను తీసుకొచి్చంది. వీటిలో వేల ఏళ్ల నాటి అగి్నపర్వత శిలలు కూడా ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాకు దీటుగా చైనా దూసుకెళ్తోంది. 2030 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపించబోతున్నామని గతంలోనే ప్రకటించింది. -
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
‘సెమీ క్రయోజనిక్’ టెస్ట్... సూపర్ సక్సెస్.. ఇస్రో కీలక ప్రకటన
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఇంటరీ్మడియట్ కాన్ఫిగరేషన్ పరీక్ష (పవర్ హెడ్ టెస్ట్ ఆరి్టకల్)ను సంస్థ మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి వద్ద ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ) సెంటర్లో జూలై 1న ఈ పరీక్ష జరిపినట్టు సోమవారం ఇస్రో ప్రకటించింది. ‘‘భవిష్యత్తు ప్రయోగ వాహనాలను దృష్టిలో ఉంచుకుని బూస్టర్ దశలను శక్తిమంతం చేయడం, 2000 కేఎన్ థ్రస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేయడం ఈ పరీక్ష లక్ష్యం. గ్యాస్ జనరేటర్, టర్బో పంపులు, ప్రీ–బర్నర్, కంట్రోల్ కాంపోనెంట్ల వంటి కీలకమైన సబ్ సిస్టమ్‌ల సమగ్ర పనితీరును 4.5 సెకండ్ల స్వల్ప వ్యవధిలో హాట్ ఫైరింగ్ చేసి ధ్రువీకరించడం దీని ముఖ్య ఉద్దేశం’’ అని తన వైబ్సైట్లో వెల్లడించింది. ఇంధనం, ఆక్సిడైజర్ పంపులను నడపడానికి ప్రధాన టర్బైన్ను నడిపించే ప్రీ బర్నర్ ఛాంబర్లోని వేడి–గ్యాస్ జ్వలన, ఉత్పత్తిని పరీక్షించారు. ఇప్పటిదాకా లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్‌తో కలిపి క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేశారు. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను మాత్రం సరికొత్తగా తయారు చేస్తున్నారు. ఇందులో లిక్విడ్ ఆక్సిజన్‌కు తోడుగా కిరోసిన్ ప్రపొల్లెంట్ కలయికతో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. కిరోసిన్ కలయికతో సెమీ క్రయోజనిక్ ఇంజన్ తయారు చేయాలని చిరకాల ప్రయత్నం ఇప్పటికి కార్యరూపు దాల్చింది. తదుపరి పరీక్షల్లో పనితీరును మరింత మెరుగు పరుచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునే దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది. 13న చంద్రయాన్–3 ప్రయోగం న్యూఢిల్లీ: చంద్రుడిపై అన్వేషణకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్–3 మిషన్ ఏర్పాట్లు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ నెల 13వ తేదీన ఇస్రో దీనిని ప్రయోగించనుంది. ల్యాండర్–రోవర్ కాంబినేషన్‌తో చేపట్టే ఈ ప్రయోగం లక్ష్యం చంద్రుడిలోని సుదూర ప్రాంతాల అన్వేషణ. ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు లాంచ్ విండో అందుబాటులో ఉంటుంది. అయితే, తొలిరోజే ప్రయోగం చేపట్టాలనుకుంటున్నామని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. -
విశ్వంలో భూమ్మీద మాత్రమే జీవం ఉందా? బంగారు డిస్క్‌లతో ప్రయోగం
మొత్తం విశ్వంలో భూమ్మీద మాత్రమే జీవం ఉందా? సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపైనో.. ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలపైనో ఏదైనా జీవం ఉందా అన్నది ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్న. ఈ గ్రహాంతర వాసుల (ఏలియన్లు) కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా ఏలియన్లు ఉంటే మనను గుర్తించేందుకు వీలుగా అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నళ్లు పంపడం వంటివీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల్లో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. ఏమిటా బంగారు డిస్కులు, వాటిపై ఏముందన్న వివరాలు తెలుసుకుందామా.. భూమి, మానవుల విశేషాలతో.. ఒకవేళ ఎక్కడైనా గ్రహాంతర జీవులు ఉండి ఉంటే.. వాటికి భూమి మీద జీవం, మనుషులు ఉన్నట్టు తెలిపేందుకు శాస్త్రవేత్తలు వ్యోమనౌకలలో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. వాటిపై మనుషులు సాధించిన ప్రగతి, వివిధ సాంస్కృతిక, సాంకేతిక అంశాలను వివరించేలా ఉన్న డిజైన్లు, ఆకారాలను నిక్షిప్తం చేశారు. అయితే ఇవి పూర్తిస్థాయి బంగారు ప్లేట్లు కాదు. పన్నెండు అంగుళాల వ్యాసం ఉన్న గట్టి రాగి ప్లేట్లపై మందంగా బంగారు పూత పూశారు. ఇప్పటివరకు నాలుగు వ్యోమనౌకలలో.. అంతరిక్షంలో సుదూర ప్రయోగాల కోసం పంపిన వ్యోమనౌకలలో నాసా శాస్త్రవేత్తలు బంగారు డిస్‌్కలను అమర్చారు. ఇప్పటివరకు పయోనిర్–10, పయోనిర్–11, వోయేజర్–1, వోయేజర్–2 వ్యోమనౌకలు వీటిని తీసుకుని అంతరిక్షం అంచుల్లోకి చేరుకున్నాయి కూడా. వోయేజర్ వ్యోమనౌకల్లో పంపిన డిస్్కలపై పంపిన డేటాను శాస్త్రవేత్త కార్ల్ సాగన్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఏలియన్లకు అర్థమయ్యేలా.. 1977లో వోయేజర్ వ్యోమనౌకలలో పంపిన బంగారు డిస్క్‌లను గ్రామ్‌ఫోన్ రికార్డుల తరహాలో రూపొందించారు. వాటిలో గణితం, సైన్స్‌కు సంబంధించిన వివరాలను, వివిధ ధ్వనులను నమోదు చేశారు. గణితం, సైన్స్‌కు సంబంధించిన అంశాలు యూనివర్సల్ అని.. ఎప్పటికైనా వీటిని గ్రహాంతర వాసులు అర్థం చేసుకోగలరని శాస్త్రవేత్తల భావన. అందుకే ఈ డిస్క్‌లను టైం క్యాప్సూల్స్ అని కూడా పేర్కొన్నారు. ఈ బంగారు డిస్క్లకుపైన కవర్‌ను కూడా అమర్చారు. దీనిని అల్యూమినియంతో తయారు చేశారు. అంతరిక్షంలో పరిస్థితులను తట్టుకుని కోట్ల ఏళ్లు ఉండేందుకు వీలుగా.. యురేనియం–238ను పూత పూశారు. ఈ కవర్‌పై ‘‘అన్ని కాలాలు, అన్ని ప్రపంచాల్లో సంగీతాన్ని సృష్టించేవారి కోసం..’’ అని రాశారు. బంగారు డిస్క్‌లలో ఏమేం నిక్షిప్తం చేశారు? ► మానవులు, భూమికి సంబంధించి అనలాగ్ పద్ధతిలో ఎన్కోడ్ చేసిన 115 చిత్రాలు (తింటూ, తాగుతూ ఉన్న మనుషులు, తాజ్‌మహల్ వంటి ప్రముఖ స్థలాలు, క్రీడాకారులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లి, ఎల్రక్టానిక్ పరికరాలు, న్యూటన్ రాసిన బుక్‌లోని ఓ పేజీ.. ఇలా ఎన్నో). ► హిందీ, బెంగాలీ, కన్నడ సహా 55 భాషల్లో పలకరింపులు. ► ప్రముఖ సంగీత విద్వాంసులకు సంబంధించిన 90 నిమిషాల సంగీతం. ► భూమిపై వినిపించే వివిధ రకాల ధ్వనులతో కూడిన (ఉరుములు, జంతువుల అరుపులు, మనుషుల మాటలు, ముద్దు ధ్వని సహా) 12 నిమిషాల ఆడియో. ► అంతరిక్షంలో మన సౌర కుటుంబం, భూమి ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలిగేలా డిస్క్ కవర్‌పై మ్యాప్. ► డిస్క్‌లోని వివరాలను డీకోడ్ చేసేందుకు వీలైన మేథమేటికల్, సైన్స్ ఆకృతులు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
దెబ్బ తిన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. నాసా ఆందోళన
వాషింగ్టన్ డీసీ: అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సంచలనంగా.. అదే సమయంలో కీలకంగానూ మారింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తివంతమైన టెలిస్కోప్‌గా దీనికి ఒక పేరు ముద్రపడింది. అంతెందుకు అంతరిక్ష శూన్యంలో ఆరు నెలల కాలం పూర్తి చేసుకుని.. అద్భుతమైన చిత్రాలను విడుదల చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే, తాజాగా ఓ నివేదిక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా National Aeronautics and Space Administration ను ఆందోళనకు గురి చేస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దెబ్బ తిందని.. రాబోయే రోజుల్లో అది టెలిస్కోప్ పని తీరుపై ప్రభావం చూపనుందన్నది ఆ నివేదిక సారాంశం. కమీషనింగ్ ఫేజ్‌లో టెలిస్కోప్ పని తీరును పరిశీలించిన సైంటిస్టుల బృందం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. ప్రస్తుతం, అనిశ్చితి యొక్క అతిపెద్ద మూలం సూక్ష్మ ఉల్కలతో దీర్ఘకాలిక ప్రభావాలు ప్రాధమిక అద్దాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. మే 22వ తేదీన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రాథమిక అద్దం, ఆరు మైక్రోమెటీరియోరైట్స్(సూక్ష్మ ఉల్కలు) కారణంగా దెబ్బ తింది. చివరి ఉల్క ఢీకొట్టడంతోనే టెలిస్కోప్ అద్దం దెబ్బతిందని సైంటిస్టులు స్పష్టం చేశారు. ప్రభావం చిన్నదిగానే చూపిస్తున్నప్పటికీ.. అది రాబోయే రోజుల్లో ఎంత మేర నష్టం చేకూరుస్తుందన్న విషయంపై ఇప్పుడే ఒక అంచనాకి రాలేమని సదరు సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అబ్జర్వేటరీ ప్రభావం ఎంతవరకు ఉందో చూపించే చిత్రాన్ని శాస్త్రవేత్తలు విడుదల చేశారు. అదే సమయంలో డ్యామేజ్ గురించి స్పందించిన జేమ్స్ వెబ్ రూపకర్తలు.. టెలిస్కోప్ అద్దాలు, సన్‌షీల్డ్(టెన్నిస్ కోర్టు సైజులో ఉంటుంది)లు ఉల్కల దెబ్బతో నెమ్మదిగా పని చేయడం ఆపేస్తాయని తేల్చడంపై నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ సమస్యను వీలైనంత త్వరగతిన పరిష్కరించాలనే ఆలోచనలో ఉంది నాసా. ఇదిలా ఉంటే హబుల్ టెలిస్కోప్ తర్వాత.. ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్‌గా పేరు దక్కించుకుంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నాసా NASA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(CSA)ల సహకారంతో సుమారు 10 బిలియన్ల డాలర్లు వెచ్చించి తయారు చేయించింది. ఈ టెలిస్కోప్ మిర్రర్స్ చాలా చాలా భారీ సైజులో ఉంటాయి. డిసెంబర్ 25, 2021లో దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించగా.. ఫిబ్రవరి నుంచి భూమికి 1.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో L2 పాయింట్ వద్ద ఇది కక్ష్యలో భ్రమిస్తూ ఫొటోలు తీస్తోంది. వెబ్ యొక్క అద్దం అంతరిక్షంలో తీవ్ర వేగంతో ఎగురుతున్న దుమ్ము-పరిమాణ కణాలతో బాంబు దాడిని తట్టుకునేలా రూపొందించబడిందని నాసా గతంలో ప్రకటించుకుంది. కానీ, ఇప్పుడు చిన్న చిన్న ఉల్కల దాడిలో దెబ్బ తింటుండడం ఆసక్తికరంగా మారింది. -
సౌర తుపాను!.. జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం
న్యూయార్క్: సౌర తుపాను మంగళవారం భూమిని తాకనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే జీపీఎస్, రేడియో సిగ్నళ్ల ప్రసారంలో అంతరాయం తప్పదు. ఈ నెల 19న సూర్యగోళం నుంచి విడుదలయ్యే పాము ఆకారంలోని ఫిలమెంట్ (సౌర తుపాను) ప్రభావం నేరుగా భూమికి ఢీకొట్టే ఆస్కారముందని డాక్టర్ తమిథా స్కోవ్ చెప్పారు. దీనివల్ల భూమిపై పలు ప్రాంతాల నుంచి ఆకాశంలో ధ్రువకాంతి (అరోరా) వీక్షించవచ్చని అన్నారు. అనంతరం మరికొన్ని చిన్నపాటి సౌర తుపాన్లు విరుచుకుపడే ప్రమాదముందన్నారు. ఈ నెల 20, 21న జి1–క్లాస్ తుపాను రావచ్చని స్పేస్‌వెదర్ సంస్థ ప్రకటించింది. సౌర తుపాను సమయంలో సూర్యుడి నుంచి వెలువడే శక్తి భూమిపై అన్ని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏడాదిపాటు ఉత్పత్తి చేసే కరెంటు కంటే లక్ష రెట్లు అధికం. -
నూతన సంవత్సరంలో నింగికి నిచ్చెనలు
కొత్త సంవత్సరంలో నింగిని మరింత లోతుగా శోధించేందుకు భారత్ సిద్ధమవుతోంది. 2022లో వివిధ అంతరిక్ష ప్రయోగాలను దిగ్విజయంగా నిర్వహించి, అగ్రరాజ్యాలకే పరిమితమైన ఘనతను భారత్‌కు కూడా కట్టబెట్టాలని ఇస్రో (ఇండియన్ స్పేస్రీసెర్చ్ ఆర్గనైజేషన్) పట్టుదలగా కృషి చేస్తోంది. గతంలో కరోనా కారణంగా నిలిచిపోయిన కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా సరికొత్త ప్రయోగాలను కూడా చేపడతామని ఇస్రో వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2022ను అంతరిక్ష నామ సంవత్సరంగా మార్చేందుకు ఇస్రో చేపట్టనున్న కీలక ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి... గగన్ యాన్ అంతరిక్షంలోకి భారత వ్యోమగాములను తొలిసారి సొంతంగా పంపేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకోసం ముందుగా ఇస్రో మానవ రహిత యాత్రను చేపట్టనుంది. క్రూ ఎస్కేప్సిస్టం పనితీరు పరిశీలనకు, గగన్ యాన్ మానవ రహిత మిషన్ కోసం 2022 ద్వితీయార్ధంలో ఇస్రో ఒక టెస్ట్ వెహికిల్ ఫ్లైట్‌ను నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. దీని అనంతరం ఏడాది చివరిలో మరోమారు మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో భావిస్తోంది. ఈ రెండు మిషన్లు విజయవంతంగా పూర్తైతే అప్పుడు నింగిలోకి వ్యోమగాములను పంపుతారు. ఇందుకోసం ముగ్గురు భారతీయ వాయు సేన అధికారులను ఎంచుకొని శిక్షణ ఇస్తారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి నలుగురిని ఎంపిక చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వీరి వివరాలు బహిర్గతం కాలేదు. మానవ సహిత గగన్ యాన్‌ను 2023లో ఎలాగైనా పూర్తి చేయాలని పనిచేస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేందర్‌సింగ్ చెప్పారు. లో ఎర్త్ ఆర్బిట్‌లోకి దేశీయ లాంచ్ వెహికిల్ ద్వారా మనుషులను పంపి, తిరిగి దిగ్విజయంగా భూమికి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఆదిత్య మిషన్ సూర్యుడిపై అధ్యయనానికి భారత్ తొలిసారి ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఆదిత్య ఎల్1 మిషన్‌ను చేపట్టింది. 2021లో ఆరంభించాలనుకున్నా, కోవిడ్ కారణంగా వాయిదా పడింది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్ 1 పాయింట్(లాంగ్రేజియన్ పాయింట్) చుట్టూ ఉండే కక్ష్యలోకి ఈ మిషన్‌ను ప్రవేశపెడతారు. మార్స్ ఆర్బిటర్ తర్వాత ఇస్రో చేపట్టే రెండో హైప్రొఫైల్ స్పేస్ మిషన్ ఇదే కావడం విశేషం చంద్రయాన్ 3 2008లో ఆరంభించిన చంద్రయాన్‌కు కొనసాగింపుగా 2022 మూడో త్రైమాసికంలో ఇస్రో చంద్రయాన్ 3 మిషన్ చేపట్టనుంది. చంద్రయాన్ విజయవంతమైన తర్వాత చేపట్టిన చంద్రయాన్ 2 విఫలమైంది. ప్రయోగించిన లాండర్, రోవర్లు చంద్రుడిపై పడిపోయాయి. కానీ ఆర్బిటర్ మాత్రం ఇంకా భద్రంగానే ఉంది. దీన్ని చంద్రయాన్ 3లో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది. ఎస్ఎస్ఎల్వీ లో ఎర్త్ ఆర్బిట్ (భూ ఉపరితలం నుంచి 160 కి.మీ. – 2 వేల కి.మీ. ఎత్తు లోపు ఉపగ్రహాలు సంచరించే కక్ష్య)లో ఉప గ్రహాలను ప్రవేశపెట్టే మిషన్ల విషయంలో భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఇస్రో ఒక స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ)ని అభివృద్ది చేస్తోంది. ఈ వెహికిల్‌ను 2022 తొలి త్రైమాసికంలో ప్రయోగిస్తారు. సుమారు 500 కిలోలను 500 కిలోమీటర్ల కక్ష్యలోకి తీసుకుపోయే పేలోడ్ సామర్ధ్యం దీని సొంతం. పీఎస్ఎల్వీతో పోలిస్తే ఇది చిన్న, తేలికపాటి ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి తీసుకుపోగలదు. దీని అభివృద్ధికి కేంద్రం రూ. 169 కోట్లు కేటాయించింది. ఈ వెహికిల్ ఒకేమారు పలు నానో, మైక్రో ఉపగ్రహాలను మోయగలదు. 2021–23 కాలంలో నాలుగు దేశాలతో ఉపగ్రహ ప్రయోగాలకు సంబం ధించి ఇస్రో ఆరు ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా సంస్థకు సుమారు 13.2 కోట్ల యూరోల ఆదాయం సమకూరుతుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్, అవునా.. నిజమా?!
గ్రహాంతర జీవనం.. మనిషికి ఎప్పటికీ ఓ ఆసక్తికర అంశమే. ముఖ్యంగా గ్రహాంతర జీవుల గురించి తెలుసుకోవాలనే తాపత్రయం.. అందుకోసం బిలియన్ల డాలర్లు వెచ్చించే చేసే పరిశోధనలు ఆ ఆసక్తి ఏపాటిదో చెప్పకనే చెప్తుంటాయి. అయితే ఇన్నేళ్లలో ఏలియన్ లైఫ్ గురించి ఓ క్లారిటీ కాదు కదా కనీసం ఓ అంచనా కూడా రాలేకపోయారు. అయినప్పటికీ రకరకాల థీయరీలు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా వచ్చిన ప్రచారం ఏంటంటే.. సెప్టెంబర్ 2న నల్లని ఆకారంలో ఉన్న వస్తువు ఒకటి అంతరిక్షంలో కనిపించింది. ‘బ్లాక్ నైట్ శాటిలైట్ కాన్స్పిరెన్సీ థియరీ’.. ప్రకారం ఇది అన్ఐడెంటిఫైడ్ అండ్ మిస్టీరియస్ శాటిలైట్ అంటూ ఓ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ప్రచారం మొదలైంది. ఇక సైంటిస్టులేమో ‘బ్లాక్ నైట్ శాటిలైట్’ అని పేరు కూడా పెట్టారు. ఇంకో విశేషం ఏంటంటే.. 1930 నుంచి ఈ శాటిలైట్ నుంచి వింత రేడియో సిగ్నల్స్ వెలువడుతున్నాయి. అలా ఇది గ్రహాంతరవాసులకు చెందిన శాటిలైట్‌గా ప్రచారం మొదలుపెట్టారు. నాసా, సొవియట్ యూనియన్లు స్పేస్‌లోకి ఉపగ్రహాలు పంపక ముందు నుంచే ఇది పని చేస్తుందన్నమాట. టిక ఈ మిస్టరీ శాటిలైట్ గత పది రోజుల్లో విపరీతంగా షేర్ అయ్యింది. మరి నాసా దీని గురించి ఏం చెబుతుందో చూద్దాం.. అదసలు శాటిలైట్ కాదని తేల్చేసింది నాసా. 1998లో స్పేస్ షెట్టల్ మిషన్‌లో భాగంగా.. ఇదొక శకలంగా గుర్తించారు. డిసెంబర్ 11, 1998న దీనిని ఫొటో తీశారు కూడా. ఇలాంటి శకలాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని నాసా చెబుతోంది. ఒక్కోసారి రాకెట్ల నుంచి వదిలే శకలాలు కూడా ఇలా భూ కక్క్ష్యలో పరిభ్రమిస్తుంటాయి. లేదంటే విశ్వంలో విస్పోటనాల వల్ల కూడా శకలాలు విడుదల కావొచ్చని చెప్తున్నారు. పైగా భూ కక్క్ష్యలో ఇలాంటి ముక్కలు పాతిక వేల దాకా ఉన్నట్లు నాసా చెబుతోంది. కాబట్టి.. భూమికి దగ్గరగా ఏలియన్ల శాటిలైట్ అనేది ఉత్త ప్రచారమే అని నాసా తేల్చేసింది. చదవండి: వారెవ్వా.. ఖగోళంలో మునుపెన్నడూ చూడని దృశ్యం ఇది -
పోటాపోటీ.. చైనా దూకుడు
స్పేస్ రేస్.. ఇప్పుడు ఒక హాట్ బిజినెస్‌గా మారింది. ఈ బిజినెస్‌లో కుబేరుల ఎంట్రీతో ప్రస్తుతం బిలియన్ల డాలర్ల వ్యాపారం నడుస్తోంది. ఈ రంగంలో అమెరికాతో పాటు రష్యాలు నువ్వా-నేనా అన్నట్లు పోటీతత్వం ప్రదర్శిస్తున్నాయి. మధ్యలో దూరుతున్న చైనా.. అంతరిక్ష పరిశోధనల్లో దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే స్పేస్ స్టేషన్ ద్వారా పరిశోధనలు ముమ్మరం చేసిన డ్రాగన్ కంట్రీ.. త్వరలో మిలియన్ల డాలర్ల ఖర్చుతో ఓ భారీ స్పేస్ అబ్జర్వేటరీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. అయితే అది సొంత గడ్డపై కాదు. టిబెట్ క్వింఘై ప్రావిన్స్‌లోని లెంగూ టౌన్లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. చైనాలో గత రెండేళ్లుగా అసాధారణమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనివల్ల అంతరిక్ష పరిశోధనలకు తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి. స్పేస్ రేసులో పురోగతి దిశగా అడుగులు వేస్తున్న టైంలో ఈ పరిస్థితులకు చైనాకు ఇబ్బందికరంగా మారాయి. ఈ దశలో తమ ఆధీనంలో ఉన్న లెంగూ టౌన్‌పై చైనా కన్నుపడింది. ఈ ప్రాంతం చాలా ఎత్తైన ప్రాంతంలో ఉంది. పైగా జనాభా తక్కువ. అందుకే సంపూర్ణ వ్యవస్థను పరిశీలించేందుకు నిర్మించబోతున్నట్లు వెల్లడించింది. పైగా ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ దేశ స్పేస్ ఏజెన్సీ ఉపయోగించనంత టెక్నాలజీని.. ఈ అబ్జర్వేటరీ సెంటర్ కోసం చైనా ఉపయోగించబోతోంది. ఇదీ చదవండి: స్పేస్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్!! వచ్చే ఏడాదే! 1959లో చైనా లెంగూ టౌన్‌ను ఆక్రమించుకుంది. ఇక్కడ సాలీనా 18మిమీ వర్షపాతం, 3,500 గంటల సూర్యరశ్మి ఉంటుంది. పైగా 200 కిలోమీటర్లలోపు రవాణా సౌకర్యం ఉంది. అందుకే ఈ ఏరియాను ఎంచుకుంది చైనా. వైడ్ ఫీల్డ్ సర్వే టెలిస్కోప్ ద్వారా ఈ పరిశోధనల్ని నిర్వహించబోతున్నారు. 2021 చివరిల్లా టెలిస్కోప్ సెటప్ పూర్తి కానుందని, 2022 నుంచి పని ప్రారంభిస్తుందని చైనా అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు. -
అంతరిక్ష రంగంలో ప్రైవేటు
సాక్షి, న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇక గ్రహాంతర అన్వేషణ ప్రయోగాలు సహా అన్ని అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం లభించనుందని ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర వెల్లడించారు. భారత అంతరిక్ష రంగ మౌలిక వసతులను ప్రైవేటు సంస్థలు వినియోగించుకునేందుకు అనుసంధాన సంస్థగా కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్)’ వ్యవహరిస్తుందన్నారు. అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలకు కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. భారత అంతరిక్ష ప్రయోగ వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అంతరిక్ష విభాగం నియంత్రణలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్)’ వీలు కల్పిస్తుందన్నారు. సంస్కరణల వల్ల ఇస్రో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై, మానవసహిత అంతరిక్ష ప్రయోగాలపై మరింత దృష్టి పెట్టే అవకాశం లభిస్తుందన్నారు. ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం ద్వారా దేశీయంగా అంతరిక్ష రంగ అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, ఇంటర్నేషనల్ స్పేస్ ఎకానమీలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం లభిస్తుందని, అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఓబీసీల వర్గీకరణ కమిషన్ గడువు పొడిగింపు ఓబీసీ వర్గీకరణ కోసం ఏర్పడిన కమిషన్ కాలపరిమితిని జనవరి 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల్లో కొన్ని కులాలకు సరైన రిజర్వేషన్ ఫలాలు అందకపోవడం వల్ల విద్య, ఉద్యోగ అవకాశాల్లో వారికి న్యాయం జరగడం లేదని, ఈ విషయంలో తగిన సిఫారసులు చేయాలని ఓబీసీ వర్గీకరణ కమిషన్‌ను కేంద్రం 2017లో ఏర్పాటు చేసింది. -
నాసా గుప్పిట్లో ఆ గ్రహం గుట్టు..!
వాషింగ్టన్ : అంతరిక్షంలో భూమిని పోలిన నివాసయోగ్యత కలిగిన గ్రహానికి అన్వేషణ సాగించే పరిశోధనలకు ఊతమిచ్చేలా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. మొదటిసారిగా భూమిని పోలిన పరిమాణం కలిగిన గ్రహాన్ని కనుగొన్నారు. ఈ ప్లానెట్‌లో ద్రవ నీరు ఉనికిని గుర్తించారు. మరొక సానుకూల అంశంగా ఈ గ్రహం మన సౌర వ్యవస్థకు సమీపాన ఉండటం వెలుగులోకి వచ్చింది. నాసాకు చెందిన గ్రహాల అన్వేషణ విభాగం ఇటీవల జరిగిన అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ సమావేశం సందర్భంగా ఈ వివిరాలు వెల్లడించింది. ఈ గ్రహం మన నుండి 100 కాంతి సంవత్సరాల కన్నా ఎక్కువ దూరంలో లేని ఒక నక్షత్రం (టీఓఐ 700) చుట్టూ తిరుగుతున్నట్టు ప్రకటించింది. ఈ నక్షత్రం చుట్టూ తిరిగే మూడు గ్రహాల్లో ఈ గ్రహం ఒకటిగా పరిశోధకులు తేల్చారు. అంతరిక్ష పరిశోధన సంస్థ స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఈ గ్రహం సామర్ధ్యాన్నిఅంచనా వేశారు. టీఓఐ 700 అనే గ్రహం ఇతర రెండు గ్రహాలతో పోల్చితే దాని నక్షత్రాన్ని చాలా దూరం నుండి కక్ష్యలో తిరుగుతుంది. ఈ గ్రహంలో ఒక వైపు ఎప్పుడూ పగటి వెలుగు ఉంటుందని గుర్తించారు. గతంలో టీఓఐ 700 గ్రహం వేడిగా ఉంటుందని భావించారు, వ్యోమగాములు ఈ మూడు గ్రహాలూ మానవులకు నివాస యోగ్యం కాదని భావిస్తున్నా, ఈ గ్రహం భూ మండలంతో సమానంగా ప్రవర్తిస్తుందో లేదో నిర్ణయించలేమని, ఏదో ఒక రోజు, మనకు ఈ గ్రహం స్పెక్ర్టం లభించినప్పుడు దీని ఆంతర్యాన్ని పసిగట్టవచ్చని, వాటిని దగ్గరి అనుకరణ స్పెక్ట్రమ్‌తో సరిపోల్చవచ్చని నాసా గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పరిశోధకుడు గాబ్రియెల్ ఎంగెల్మన్ సుయిసా వెల్లడించారు. -
అభివృద్ధి కోసం పరిశోధనలపై దృష్టి పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక, సామాజిక శక్తిగా ఎదగాలన్న భారత్ ఆకాంక్ష నెరవేరాలంటే మౌలిక పరిశోధనలపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సిందేనని పద్మభూషణ్ జి.పద్మనాభన్ స్పష్టం చేశారు. ఐటీ, అంతరిక్ష పరిశోధనల్లో దేశం ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానవాభివృద్ధి సూచీల్లో 129వ స్థానంలో ఉండటం, ఆరోగ్య సేవల విషయంలో ప్రపంచదేశాల జాబితాలో అట్టడుగు భాగంలో ఉండటం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్లో (నార్మ్) శనివారం ఓ జాతీయ సదస్సు ప్రారంభమైంది. ‘శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వ్యాపారాభివృద్ధి’ అనే అంశంపై నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఇండియా (నాసి) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పద్మనాభన్ మాట్లాడుతూ.. దేశ వ్యవసాయ, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఐటీ, అంతరిక్ష పరిశోధనలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ ఎ.వి.రామారావు, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మంజు శర్మ, నాసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ సత్యదేవ్, నార్మ్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
చరిత్ర సృష్టించిన న్యూ హారిజాన్!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్షంలోకి పంపిన న్యూ హారిజాన్ అంతరిక్ష నౌక నూతన సంవత్సరం ప్రారంభంలో కొత్త చరిత్ర సృష్టించింది. మన సౌర కుటుంబంలో దాదాపు చివరన ఉన్న ‘అల్టిమా టూలే’ అనే చాలా చిన్న గ్రహానికి చాలా దగ్గరి నుంచి వెళ్లింది. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక చేరని, దూరాన్ని ఈ న్యూహారిజాన్ ఛేదించింది. అంతేకాదు దాదాపు చాలా పురాతనమైన ఖగోళ వస్తువును ఈ హారిజాన్ తొలిసారిగా సందర్శించి, దాని ఫొటోలు తీసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అల్టిమా ద్వారా మన సౌర వ్యవస్థ రహస్యాలను చేధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సూర్యుడికి దాదాపు 400 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న ఈ అల్టిమా.. నెప్ట్యూన్‌కు ఆవల మన సౌర వ్యవస్థలోని క్యూపర్ బెల్టులో ఉంది. దీని అసలు పేరు 2014 ఎంయూ69 కాగా, ముద్దుగా అల్టిమా టూలే అని పిలుచుకుంటున్నారు. లాటిన్ పదమైన దీనర్థం ‘మన ప్రపంచానికి చాలా దూరం’. అన్ని గ్రహాల మాదిరిగా కాకుండా సూర్యుడి చుట్టూ అల్టిమా దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతోందని నాసా పేర్కొంది. -
స్పేస్ ఎలివేటర్...!
అంతరిక్షంలో ఎలివేటర్..! ఇదేదో కొత్తగా ఉందని అనుకుంటున్నారా ? జపాన్ శాస్త్రవేత్తల కృషి ఫలిస్తే...ఇది త్వరలోనే వాస్తవరూపం దాల్చే అవకాశాలున్నాయి. ‘స్పేస్ ఎలివేటర్’పై ఇప్పటికే పరిశోధనలు కొనసాగిస్తున్న ఆ దేశ సైంటిస్టుల బృందం ఈ నెలలో దానిని మొదటిసారిగా పరీక్షించనున్నారు. దీనికోసం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సూక్ష్మస్థాయిలో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు షిజౌక యూనివర్సిటీ ఓ టెస్ట్ ఎక్విప్మెంట్ను రూపొందించింది. వచ్చేవారం తనేగషిమ ద్వీపంలో జపాన్ అంతరిక్ష కేంద్రం హేచ్–2బీ రాకెట్‌తో కలిపి ఈ ఎలివేటర్‌ను ప్రయోగించనుంది. ఇందులో అతి చిన్న సైజున్న ఎలివేటర్ (2.4 అంగుళాల పొడుగు, 1.2 అంగుళాల వెడల్పు, 1.2 అంగుళాల ఎత్తు) ఉపయోగిస్తున్నారు. పది మీటర్ల పొడవున్న కేబుల్ సహాయంతో అంతరిక్షంలో రెండు చిన్న ఉపగ్రహాల మధ్య ఇది ప్రయాణం సాగించగలదా అన్నది తేల్చేందుకు ఈ ప్రయోగం దోహదపడనుంది. ప్రస్తుతం ప్రయోగిస్తున్న‘మినీ ఎలివేటర్’ శాటిలైట్‌లోని కంటెయినర్‌తో పాటు కేబుల్ సహాయంతో ప్రయాణం చేస్తుంది. ‘అంతరిక్షంలో ఎలివేటర్ కదలికలను ప్రయోగాత్మకంగా పరిశీలించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి’ అని షిజొక వర్సిటీ తెలిపింది. శాటిలైట్లలోని కెమెరాల ద్వారా ఎలివేటర్ బాక్స్ కదలికలు పర్యవేక్షిస్తారు. స్పేస్ ఎలివేటర్ రూపకల్పనపై వందేళ్లకు పైగానే ఆలోచనలు సాగుతున్నా అవి ఇంకా పూర్తిస్థాయిలో వాస్తవరూపాన్ని సంతరించుకోలేదు. 1895లో పారిస్‌లో ఐఫిల్ టవర్‌ను చూసిన సందర్భంగానే రష్యా శాస్త్రవేత్త కొన్‌స్టాంటిన్ సియోల్కొవస్కీ మొట్టమొదట ఈ ఆలోచన చేశారు. దాదాపు వందేళ్ల తర్వాత ఆర్థర్ సి.క్లార్క్ రాసిన నవలలో ఇలాంటి ఎలివేటర్ ప్రస్తావన ఉంది. ఆ తరువాత కూడా సాంకేతికంగా పూర్తిస్థాయిలో స్పష్టత సాధించని కారణంగా ఇది సైద్ధాంతిక దశ దాటి ముందుకు సాగలేదు. షిజౌక వర్సిటీ ప్రాజెక్టులో సహకారం అందిస్తున్న జపాన్ నిర్మాణ సంస్థ ఒబయాశి కూడా సొంతంగా స్పేస్ ఎలివేటర్‌ను తయారుచేసేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తోంది. 2050 కల్లా పర్యాటకులను అంతరిక్షంలోకి పంపించేందుకు సొంతంగా స్పేస్ ఎలివేటర్‌ను రూపొందించుకోవాలనే ఆలోచనతో ఈ సంస్ధ ఉంది. దీని కోసం స్టీల్ కంటే 20 రెట్లు ధడంగా ఉండే కార్భన్ నానోట్యూబ్ టెక్నాలజీని తాము ఉపయోగించే అవకాశాలున్నాయని ఈ కంపెనీ పేర్కొంది. ఈ టెక్నాలజీతో భూమికి 96 వేల కి.మీ ఎత్తులో (దాదాపు 60 వేల మైళ్లు) వెళ్లేగలిగేలా లిఫ్ట్ షాఫ్ట్ను తయారుచేయాలని భావిస్తోంది. స్పేస్ ఎలివేటర్ ప్రయోగం ఫలిస్తే మనుషులతో పాటు సరుకులను కూడా అతిచవకగా అంతరిక్షంలోకి రవాణా చేయవచ్చు. -
భూమికి మరో ముప్పు!
భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలంపేరు బెన్నూ.. ఇది వంద అంతస్తుల భవనం కన్నా ఎక్కువ సైజు ఉంటుందని అంచనా. 2135లో భూమిని ఢీకొడుతుందని నాసా ఆధ్వర్యంలో పనిచేస్తున్న నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్(నియో) చెబుతోంది. ఇంత భారీ సైజున్న గ్రహశకలం భూమివైపు రావడం చాలా అరుదు. సుమారు 6 కోట్ల ఏళ్ల కింద రాక్షసబల్లులను అంతమొందించింది ఇలాంటి భారీ గ్రహశకలమే. అందుకే బెన్నూ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. దీని బరువు దాదాపు 7,900 కోట్ల కిలోలు. ఇది గనుక భూమిని ఢీకొంటే మనిషి అన్నవాడు ఉండబోడని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 2135 డెడ్‌లైన్.. అంతరిక్షంలో కొన్ని చోట్ల భారీ సంఖ్యలో గ్రహశకలాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. కక్ష్య నుంచి బయటపడి ఇష్టారీతిగా తిరిగే కొన్ని గ్రహశకలాలు వేల కిలోమీటర్ల వేగంతో భూమివైపు దూసుకొస్తుంటాయి. వీటిల్లో చాలా తక్కువ మాత్రమే భూమిని ఢీకొడతాయి. నియో అంచనా ప్రకారం 2135 సెప్టెంబర్ 25న బెన్నూ భూమిని ఢీకొట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో బెన్నూను ఎదుర్కొనేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన అంతరిక్ష నౌకతో బెన్నూను ఢీకొట్టించాలని.. దీంతో అది దారితప్పి ముప్పు నుంచి భూమి బయటపడుతుందని అంచనా. అయితే అంతరిక్ష నౌకతో ఢీకొట్టించడం కన్నా అణుబాంబుతో గ్రహశకలాన్ని పేల్చేయడం మేలని కొంతమంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. బోలెడన్ని అంతరిక్ష నౌకలను గ్రహశకలం వైపు పంపితే.. ఒక్కోదాన్ని ఢీకొన్నప్పుడల్లా బెన్నూ వేగం తగ్గుతూ వస్తుందని మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. గ్రహశకలం చిన్నదైతే ఢీకొట్టేందుకు చాలా సమయం ఉందని తెలిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు మొదటి పద్ధతి సరిపోతుందని లారెన్స్ లివర్మూర్ నేషనల్ లేబొరేటరీకి చెందిన డేవిడ్ డియర్‌బార్న్ అంటున్నారు. అయితే అణుబాంబులతో పేల్చేయడం మేలైన పని అని ఓ తాజా అధ్యయనంలో తేలింది. 8 టన్నుల హ్యామర్.. బెన్నూను అణుబాంబులతో పేల్చేసేందుకు అమెరికాకు చెందిన నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ సంస్థ (ఎన్ఎన్ఎస్ఏ) అంతరిక్ష నౌకను సిద్ధం చేస్తోంది. హైపర్ వెలాసిటీ ఆస్టరాయిడ్ మిటిగేషన్ మిషన్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ (హ్యామర్) అని పిలుస్తున్న ఈ అంతరిక్ష నౌక దాదాపు 8.8 టన్నుల బరువు ఉంటుంది. దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు. అధిక వేగంతో ప్రయాణిస్తూ బెన్నూను ఢీకొనడం ఒక పద్ధతి. లేదంటే అణుబాంబులను మోసుకెళ్లి ఆ గ్రహశకలంపై వాటిని పేల్చేయడం రెండో పద్ధతి. మొదటి పద్ధతిని పాటిస్తే ఎంత శక్తి పుడుతుందో తెలుసా? హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 80 వేల రెట్లు ఎక్కువ. ఈ భారీ శక్తి కాస్తా గ్రహశకలం దారిని మార్చేస్తుందని, తద్వారా అది భూమికి దూరంగా జరుగుతుందని శాస్త్రవేత్తల అంచనా. అయితే గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న బెన్నూను దారి మళ్లించేందుకు ఇది సరిపోదని.. అణుబాంబులతో ముక్కలు చేయడమే కరెక్ట్ అని ఎన్ఎన్ఎస్ఏ శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. – సాక్షి హైదరాబాద్ -
డిసెంబర్ 14న ఏం తేలబోతుంది?
వాషింగ్టన్ : ప్రపంచం మొత్తం ఇప్పుడు డిసెంబర్ 14న నాసా చేయబోయే ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గ్రహాంతర వాసులు ఉన్నాయా?.. వాటి మనుగడ ఎలా కొనసాగుతోంది? వాటి వల్ల మానవాళికి నిజంగా ముప్పు ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆరోజే దొరకబోతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా గత కొన్నేళ్లుగా ఈ విషయపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో 2009 నుంచి పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తలకి 2500కి పైగా ఏలియన్ల జాడలు కనిపించినట్లు సమాచారం. ఈ మేరకు అందులో నిక్షిప్తమైన సమాచారాన్ని గురువారం నిర్వహించబోయే సమావేశంలో వెల్లడించనున్నారు. గోల్డీలాక్ జోన్లో ఇవి పరిభ్రమించే ప్రాంతాలను గుర్తించారు. జీవజాలం అభివృద్ధి చెందడానికి ఆ ప్రాంతాల పరిస్థితులు అనుకూలిస్తాయని శాస్త్రవేత్తలు గతంలోనే వెల్లడించారు. గూగుల్ సంస్థ అందించిన మెషీన్ లెర్నింగ్ విధానం ద్వారా కెప్లర్ టెలిస్కోప్ గుర్తించిన గ్రహాలను నాసా అధ్యయనం చేసింది. వాషింగ్టన్‌లోని నాసా హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ పౌల్ హెర్ట్జ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. -
ఎస్వీయూలో అంతరిక్ష పరిశోధనలు
అత్యాధునిక మీటియోర్ రాడార్ కేంద్రం ఏర్పాటు ఇలాంటి కేంద్రం ఏర్పాటైన తొలి విశ్వవిద్యాలయం ఎస్వీయూనే యూనివర్సిటీ క్యాంపస్ : అంతరిక్షం.. అదో అంతుచిక్కని మాయాజాలం. ఇందులో ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు, ఉల్కలు మరె న్నో... ఎన్నెన్నో వింతలు, విడ్డూరాలు ఉన్నాయి. అ టువంటి అంతరిక్ష పరిశోధనలకు ఎస్వీయూ కేంద్రం వేదిక అవుతోంది. ఇందుకోసం ఎస్వీయూలో మీటియోర్ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ మనదేశంలో కోలాపూర్‌లో ఒక రాడార్ కేంద్రం, త్రివేండ్రంలో మరో రాడార్ కేంద్రం ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కేంద్రాన్ని ఎస్వీయూలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. అంతరిక్షంలోని గ్రహశకలాల నుంచి వెలువడే ఉల్కపాతం, వాటి పరిణామం, వాటి దశ, దిశ మొదలైన విషయాలను శోధించడానికి మీటియోర్ రాడార్ కేంద్రం ఉపయోగపడుతుంది. దీంతో అంతరిక్ష పరిశోధనలో కీలక అంశాలైన గ్రహాంతర శకలాల ఉనికిని, భూవాతావరణంలోని మీసో(Meso)ధర్మో(Thermo)అవరణాల నిర్మాణం, ఈ పొరల మధ్య పరస్పరం జరిగే అనేక చర్యలకు గల కారణాలను కనుగొనడానికి వీలవుతుంది. ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగంలో యూజీసీ సహకారంతో రూ.1.5 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అత్యాధునిక రాడార్‌ను ఆస్ట్రేలియాలోని అట్రాడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసి జర్మన్, ఆస్ట్రేలియన్ ఇంజనీర్ల పర్యవేక్షణలో 2 నెలల పాటు కష్టించి ఏర్పాటు చేశారు. అంతరిక్ష, వాతావరణ ప్రయోగాల కోసం అత్యాధునిక స్వంత రాడార్ వ్యవస్థను కల్గిన తొలి విశ్వవిద్యాలయం ఎస్వీయూ కావడం విశేషం. ఈ రాడార్ వ్యవస్థ పనితీరు ప్రయోగాలను ప్రొఫెసర్ విజయభాస్కర్ రావు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం దూరవిద్యావిభాగం పక్కను న్న ఖాళీ స్థలంలో 6 ఏంటినాలు, ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇందులో ఒక లైడార్ ఉం టుంది. దీని(లైడార్) ద్వారా రాత్రివేళల్లో కాంతి పుంజాన్ని అంతరిక్షంలోకి పంపుతారు. వాతావరణాన్ని అధ్యయనం చేస్తారు. ఈ రాడార్ 24 గం టలూ పని చేస్తుంది. ఇది 70 నుంచి 110 కిలోమీటర్లు ఎత్తులో ప్రవేశించే ఉల్కలను పరిశీలించి లెక్కిస్తుంది. ఇస్రో సహకారంతో.. ఇస్రో సంస్థ సహకారంతో సెంటర్ ఫర్ అట్మాస్పియర్ సెన్సైస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నాం. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా వచ్చిన గణాంకాలు ఇతర పరిశోధన కేంద్రాల్లో లభించిన గణాంకాలకన్నా మెరుగ్గా ఉన్నాయి. మీటియోర్ రాడార్‌తో పాటు లైడార్ వ్యవస్థను, వర్షపాతాన్ని వివ్లేషణ చేసే మైక్రో రైన్ రాడార్, డిస్ట్రో మీటర్లను ఏర్పాటు చేశాం. ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఇలాంటి అధ్యయనకేంద్రం లేదు. - ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కర్‌రావు, యూజీసీ, ఎస్వీయూ సెంటర్ డెరైక్టర్