మొత్తం విశ్వంలో భూమ్మీద మాత్రమే జీవం ఉందా? సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపైనో.. ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలపైనో ఏదైనా జీవం ఉందా అన్నది ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్న. ఈ గ్రహాంతర వాసుల (ఏలియన్లు) కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా ఏలియన్లు ఉంటే మనను గుర్తించేందుకు వీలుగా అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నళ్లు పంపడం వంటివీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల్లో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. ఏమిటా బంగారు డిస్కులు, వాటిపై ఏముందన్న వివరాలు తెలుసుకుందామా..
భూమి, మానవుల విశేషాలతో..
ఒకవేళ ఎక్కడైనా గ్రహాంతర జీవులు ఉండి ఉంటే.. వాటికి భూమి మీద జీవం, మనుషులు ఉన్నట్టు తెలిపేందుకు శాస్త్రవేత్తలు వ్యోమనౌకలలో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. వాటిపై మనుషులు సాధించిన ప్రగతి, వివిధ సాంస్కృతిక, సాంకేతిక అంశాలను వివరించేలా ఉన్న డిజైన్లు, ఆకారాలను నిక్షిప్తం చేశారు. అయితే ఇవి పూర్తిస్థాయి బంగారు ప్లేట్లు కాదు. పన్నెండు అంగుళాల వ్యాసం ఉన్న గట్టి రాగి ప్లేట్లపై మందంగా బంగారు పూత పూశారు.
ఇప్పటివరకు నాలుగు వ్యోమనౌకలలో..
అంతరిక్షంలో సుదూర ప్రయోగాల కోసం పంపిన వ్యోమనౌకలలో నాసా శాస్త్రవేత్తలు బంగారు డిస్‌్కలను అమర్చారు. ఇప్పటివరకు పయోనిర్–10, పయోనిర్–11, వోయేజర్–1, వోయేజర్–2 వ్యోమనౌకలు వీటిని తీసుకుని అంతరిక్షం అంచుల్లోకి చేరుకున్నాయి కూడా. వోయేజర్ వ్యోమనౌకల్లో పంపిన డిస్‌్కలపై పంపిన డేటాను శాస్త్రవేత్త కార్ల్ సాగన్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది.
ఏలియన్లకు అర్థమయ్యేలా..
1977లో వోయేజర్ వ్యోమనౌకలలో పంపిన బంగారు డిస్క్‌లను గ్రామ్‌ఫోన్ రికార్డుల తరహాలో రూపొందించారు. వాటిలో గణితం, సైన్స్‌కు సంబంధించిన వివరాలను, వివిధ ధ్వనులను నమోదు చేశారు. గణితం, సైన్స్‌కు సంబంధించిన అంశాలు యూనివర్సల్ అని.. ఎప్పటికైనా వీటిని గ్రహాంతర వాసులు అర్థం చేసుకోగలరని శాస్త్రవేత్తల భావన. అందుకే ఈ డిస్క్‌లను టైం క్యాప్సూల్స్ అని కూడా పేర్కొన్నారు.
ఈ బంగారు డిస్క్‌లకుపైన కవర్ను కూడా అమర్చారు. దీనిని అల్యూమినియంతో తయారు చేశారు. అంతరిక్షంలో పరిస్థితులను తట్టుకుని కోట్ల ఏళ్లు ఉండేందుకు వీలుగా.. యురేనియం–238ను పూత పూశారు. ఈ కవర్‌పై ‘‘అన్ని కాలాలు, అన్ని ప్రపంచాల్లో సంగీతాన్ని సృష్టించేవారి కోసం..’’ అని రాశారు.
బంగారు డిస్క్‌లలో ఏమేం నిక్షిప్తం చేశారు?
► మానవులు, భూమికి సంబంధించి అనలాగ్ పద్ధతిలో ఎన్‌కోడ్ చేసిన 115 చిత్రాలు (తింటూ, తాగుతూ ఉన్న మనుషులు, తాజ్‌మహల్ వంటి ప్రముఖ స్థలాలు, క్రీడాకారులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లి, ఎల్రక్టానిక్ పరికరాలు, న్యూటన్ రాసిన బుక్‌లోని ఓ పేజీ.. ఇలా ఎన్నో).
► హిందీ, బెంగాలీ, కన్నడ సహా 55 భాషల్లో పలకరింపులు.
► ప్రముఖ సంగీత విద్వాంసులకు సంబంధించిన 90 నిమిషాల సంగీతం.
► భూమిపై వినిపించే వివిధ రకాల ధ్వనులతో కూడిన (ఉరుములు, జంతువుల అరుపులు, మనుషుల మాటలు, ముద్దు ధ్వని సహా) 12 నిమిషాల ఆడియో.
► అంతరిక్షంలో మన సౌర కుటుంబం, భూమి ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలిగేలా డిస్క్ కవర్‌పై మ్యాప్.
► డిస్క్‌లోని వివరాలను డీకోడ్ చేసేందుకు వీలైన మేథమేటికల్, సైన్స్ ఆకృతులు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment