వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్షంలోకి పంపిన న్యూ హారిజాన్ అంతరిక్ష నౌక నూతన సంవత్సరం ప్రారంభంలో కొత్త చరిత్ర సృష్టించింది. మన సౌర కుటుంబంలో దాదాపు చివరన ఉన్న ‘అల్టిమా టూలే’ అనే చాలా చిన్న గ్రహానికి చాలా దగ్గరి నుంచి వెళ్లింది. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక చేరని, దూరాన్ని ఈ న్యూహారిజాన్ ఛేదించింది. అంతేకాదు దాదాపు చాలా పురాతనమైన ఖగోళ వస్తువును ఈ హారిజాన్ తొలిసారిగా సందర్శించి, దాని ఫొటోలు తీసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మన సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అల్టిమా ద్వారా మన సౌర వ్యవస్థ రహస్యాలను చేధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సూర్యుడికి దాదాపు 400 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న ఈ అల్టిమా.. నెప్ట్యూన్‌కు ఆవల మన సౌర వ్యవస్థలోని క్యూపర్ బెల్టులో ఉంది. దీని అసలు పేరు 2014 ఎంయూ69 కాగా, ముద్దుగా అల్టిమా టూలే అని పిలుచుకుంటున్నారు. లాటిన్ పదమైన దీనర్థం ‘మన ప్రపంచానికి చాలా దూరం’. అన్ని గ్రహాల మాదిరిగా కాకుండా సూర్యుడి చుట్టూ అల్టిమా దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతోందని నాసా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment