అంతరిక్షంలో ఎలివేటర్..! ఇదేదో కొత్తగా ఉందని అనుకుంటున్నారా ? జపాన్ శాస్త్రవేత్తల కృషి ఫలిస్తే...ఇది త్వరలోనే వాస్తవరూపం దాల్చే అవకాశాలున్నాయి. ‘స్పేస్ ఎలివేటర్’పై ఇప్పటికే పరిశోధనలు కొనసాగిస్తున్న ఆ దేశ సైంటిస్టుల బృందం ఈ నెలలో దానిని మొదటిసారిగా పరీక్షించనున్నారు. దీనికోసం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సూక్ష్మస్థాయిలో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు షిజౌక యూనివర్సిటీ ఓ టెస్ట్ ఎక్విప్‌మెంట్‌ను రూపొందించింది. వచ్చేవారం తనేగషిమ ద్వీపంలో జపాన్ అంతరిక్ష కేంద్రం హేచ్–2బీ రాకెట్‌తో కలిపి ఈ ఎలివేటర్‌ను ప్రయోగించనుంది.
ఇందులో అతి చిన్న సైజున్న ఎలివేటర్ (2.4 అంగుళాల పొడుగు, 1.2 అంగుళాల వెడల్పు, 1.2 అంగుళాల ఎత్తు) ఉపయోగిస్తున్నారు. పది మీటర్ల పొడవున్న కేబుల్ సహాయంతో అంతరిక్షంలో రెండు చిన్న ఉపగ్రహాల మధ్య ఇది ప్రయాణం సాగించగలదా అన్నది తేల్చేందుకు ఈ ప్రయోగం దోహదపడనుంది. ప్రస్తుతం ప్రయోగిస్తున్న‘మినీ ఎలివేటర్’ శాటిలైట్‌లోని కంటెయినర్‌తో పాటు కేబుల్ సహాయంతో ప్రయాణం చేస్తుంది. ‘అంతరిక్షంలో ఎలివేటర్ కదలికలను ప్రయోగాత్మకంగా పరిశీలించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి’ అని షిజొక వర్సిటీ తెలిపింది. శాటిలైట్లలోని కెమెరాల ద్వారా ఎలివేటర్ బాక్స్ కదలికలు పర్యవేక్షిస్తారు.
స్పేస్ ఎలివేటర్ రూపకల్పనపై వందేళ్లకు పైగానే ఆలోచనలు సాగుతున్నా అవి ఇంకా పూర్తిస్థాయిలో వాస్తవరూపాన్ని సంతరించుకోలేదు. 1895లో పారిస్‌లో ఐఫిల్ టవర్‌ను చూసిన సందర్భంగానే రష్యా శాస్త్రవేత్త కొన్‌స్టాంటిన్ సియోల్కొవస్కీ మొట్టమొదట ఈ ఆలోచన చేశారు. దాదాపు వందేళ్ల తర్వాత ఆర్థర్ సి.క్లార్క్ రాసిన నవలలో ఇలాంటి ఎలివేటర్ ప్రస్తావన ఉంది. ఆ తరువాత కూడా సాంకేతికంగా పూర్తిస్థాయిలో స్పష్టత సాధించని కారణంగా ఇది సైద్ధాంతిక దశ దాటి ముందుకు సాగలేదు.
షిజౌక వర్సిటీ ప్రాజెక్టులో సహకారం అందిస్తున్న జపాన్ నిర్మాణ సంస్థ ఒబయాశి కూడా సొంతంగా స్పేస్ ఎలివేటర్‌ను తయారుచేసేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తోంది. 2050 కల్లా పర్యాటకులను అంతరిక్షంలోకి పంపించేందుకు సొంతంగా స్పేస్ ఎలివేటర్‌ను రూపొందించుకోవాలనే ఆలోచనతో ఈ సంస్ధ ఉంది. దీని కోసం స్టీల్ కంటే 20 రెట్లు ధడంగా ఉండే కార్భన్ నానోట్యూబ్ టెక్నాలజీని తాము ఉపయోగించే అవకాశాలున్నాయని ఈ కంపెనీ పేర్కొంది. ఈ టెక్నాలజీతో భూమికి 96 వేల కి.మీ ఎత్తులో (దాదాపు 60 వేల మైళ్లు) వెళ్లేగలిగేలా లిఫ్ట్ షాఫ్ట్‌ను తయారుచేయాలని భావిస్తోంది. స్పేస్ ఎలివేటర్ ప్రయోగం ఫలిస్తే మనుషులతో పాటు సరుకులను కూడా అతిచవకగా అంతరిక్షంలోకి రవాణా చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment