న్యూయార్క్: సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌గా ‘నాసా’ పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించబోతోంది. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటినుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది. మంగళవారం ఇది లోకబాంధవుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది. అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి చేరుకుంటుంది. ఒక ఫుట్‌బాల్ మైదానాన్ని ఊహించుకుంటే ఒకవైపు సూర్యుడు, మరోవైపు భూమి ఉంటాయని, 4–యార్డ్ లైన్ వద్ద పార్కర్ ఉంటుందని నాసా సైంటిస్టు జో వెస్ట్‌లేక్ చెప్పారు.
సూర్య భగవానుడికి ఇంత సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక ఇప్పటిదాకా ఏదీ లేదు. సూర్యుడికి దగ్గరిగా వెళ్లిన తర్వాత పార్కర్ నుంచి సమాచారం నిలిచిపోనుంది. అప్పుడు దాని పరిస్థితి ఏమటన్నది అంచనా వేయలేకపోతున్నారు. క్షేమంగా వెనక్కి వస్తుందా? లేక ఏదైనా జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో పార్కర్ అత్యంత వేగవంతమైనది. ఇది గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బతినకుండా బలమైన హీట్ షీల్డ్ అమర్చారు. ఇది 1,371 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. సూర్యుడికి దగ్గరగా వెళ్లిన తర్వాత వచ్చే ఏడాది సెపె్టంబర్ దాకా అదే కక్ష్యలోకి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఎందుకు వందల రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుందన్న సంగతి తెలుసుకోవడానికి పార్కర్ తగిన సమాచారం ఇస్తుందని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment