spacecraft
-
‘నియర్’ వెరీ డియర్
‘నియర్’ అనుభవంతో దాన్ని అడ్డుకునే పనిలో నాసా సరిగ్గా 24 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన ఒక అంతరిక్ష నౌక అనూహ్యంగా ఒక గ్రహశకలంపై దిగింది. దానికి ఆ సామర్థ్యం ఏమాత్రమూ లేకపోయినా రాతితో కూడిన నేలపై అతి సున్నితంగా లాండైంది. అన్ని ప్రతికూలతలను తట్టుకుంటూ అక్కడి నుంచి రెండు వారాల నిక్షేపంగా పనిచేసింది. సదరు అస్టరాయిడ్కు సంబంధించిన విలువైన డేటాను భూమికి చేరవేసింది. గ్రహంపై కాకుండా ఓ గ్రహశకలంపై కాలుమోపిన తొలి స్పేస్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది. ఇదంతా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అప్పట్లో ప్రయోగించిన నియర్ ఎర్త్ అస్టరాయిడ్ రెండీవ్ (నియర్) స్పేస్‌క్రాఫ్ట్ గురించే. ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమి వైపుగా శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో నాసా సైంటిస్టులు నాటి నియర్ ఘనతను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. వైఆర్4 భూమిని ఢీకొనే అవకాశాలు 2 శాతం దాకా ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. ఇది బహుశా 2032లో జరిగే చాన్సుందట. భూమికేసి రాకుండా దాన్ని దారి మళ్లించాలని భావిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో నాడు ‘నియర్’ అందించిన వివరాలు ఎంతగానో ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. అలా జరిగింది... భూమికి 35.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘433 ఏరోస్’ అనే ఎస్–క్లాస్ గ్రహశకలం లక్షణాలు, అందులోని ఖనిజాలు, అయస్కాంత క్షేత్రం తదితరాలను అధ్యయనం చేయాలని నాసా భావించింది. దాని చుట్టూ కక్ష్యలో పరిభ్రమించే లక్ష్యంతో నియర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను 1996 ఫిబ్రవరి 17న ప్రయోగించింది. అంతరిక్షంలో వెళ్లిన ఏడాదికి అది అస్టరాయిడ్ ఉపరితలానికి 1,200 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అక్కణ్నుంచి మరింత ముందుకెళ్లి ఏరోస్ చుట్టూ కక్షలోకి తిరగాల్సి ఉండగా నియర్ జాతకమే తిరగబడింది. 1998 డిసెంబర్ 20న సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజన్ బర్న్ కారణంగా నియర్ అనుకున్నట్లుగా పనిచేయలేని పరిస్థితి! దాంతో బ్యాకప్ ఇంధనం సాయంతో దాన్ని ఏకంగా అస్టరాయిడ్పైనే దించాలని నాసా నిర్ణయించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా నియర్ 2001 ఫిబ్రవరి 12న ఏరోస్కు అత్యంత సమీపానికి చేరుకుంది. చివరికి నెమ్మదిగా ఏరోస్పై దిగి చరిత్ర సృష్టించింది. ఒక అంతరిక్ష నౌక గ్రహశకలాన్ని తాకడం అదే మొదటిసారి. అలా నియర్ కాస్తా సైంటిస్టులకు వెరీ డియర్గా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శూన్య స్థితిలో క్రయోజనిక్ ఇంజన్ పరీక్ష సక్సెస్
బెంగళూరు: ‘నిల్వచేసిన గ్యాస్ వ్యవస్థ’లో కాకుండా బూట్ర్‌స్టాప్ విధానంలో శూన్యంలో క్రయోజనిక్ ఇంజన్(సీఈ20)ను విజయవంతంగా మండించి చూశామని ఇస్రో శనివారం ప్రకటించింది. అంతరిక్షంలో ఎలాంటి వాయువులు లేని శూన్య స్థితి మాత్రమే ఉంటుంది. లాంఛ్ వెహికల్ మార్క్(ఎల్వీఎం3) వ్యో మనౌకలోని పైభాగాన్ని మరింత పైకి తీసుకెళ్లేందుకు దోహదపడే సీఈ20ను శుక్రవారం విజయవంతంగా పరీక్షించామని ఇస్రో పేర్కొంది. వ్యోమగాములతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గగన్‌యాన్ వంటి ప్రాజెక్టులో ఈ కొత్త విధానంతో క్రయోజనిక్ ఇంజన్లను సమర్థవంతంగా మండించవచ్చని ఇస్రో వెల్లడించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఉన్న హై ఆలి్టట్యూడ్ పరీక్షా కేంద్రంలో ఈ పరీక్ష జరిపారు. మార్గమధ్యంలో ఉన్నప్పుడు క్రయోజనిక్ ఇంజన్‌ను ట్యాంక్ ఒత్తిడి పరిస్థితుల్లో రీస్టార్ట్ చేసేందుకు, శూన్యంలో విభిన్న మూలకాలతో తయారుచేసిన ఇగ్నైటర్తో ఇంజన్‌ను మండించి చూశామని ఇస్రో పేర్కొంది. పరీక్ష ఫలితాలు అనుకున్న రీతిలో సాధారణంగా వచ్చాయని వెల్లడించింది. క్రయోజనిక్ ఇంజన్‌ను రీస్టార్ట్చేయడం అనేది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. సంప్రదాయకమైన గ్యాస్ సిస్టమ్‌లో కాకుండా బూట్‌స్ట్రాప్ విధానంలో టర్బోపంప్లను ఉపయోగించి క్రయోజనిక్ ఇంజన్‌ను మళ్లీ మండించడం కష్టమైన పని. దీనిని ఇస్రో విజయవంతంగా చేసి చూపింది. ఈ ఇంజన్‌ను ఇస్రో వారి లికివ్డ్ ప్రొపల్షన్ సెంటర్ వారు అభివృద్ధిచేశారు. ఇంజన్ పరీక్ష మేలిమి మలుపు ఇంజన్ పరీక్ష విజయవంతం అనేది తదుపరి ప్రాజెక్టుల పురోగతికి ముందడుగు వేసేలా చేసిందని ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష విభాగ కార్యదర్శి వి.నారాయణన్ వ్యాఖ్యానించారు. శనివారం బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ఇంటర్నేషనల్ సెమినార్,2025 కార్యక్రమంలో నారాయణన్ మాట్లాడారు. ‘‘ఇస్రో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కొందరు యథాలాపంగా అనేస్తుంటారు. వాస్తవానికి ఇస్రో చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎంతో సంక్లిష్టత, శ్రమ, ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పటికే క్రయోజనిక్ టెక్నాలజీని సముపార్జించిన దేశాలు దానికి భారత్‌కు ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో భారత్ సొంతంగా జీఎస్ఎల్వీ మ్యాక్3 కోసం సీ25 క్రయోజనిక్ ప్రొపల్షన్ వ్యవస్థను, ఇంజన్‌ను తయారుచేసుకుంటోంది. ఇప్పుడు సీ25 ప్రాజెక్టుతో భారత్ ప్రపంచ రికార్డులు నెలకొల్పబోతోంది. ఇంజన్ డిజైన్ దశ నుంచి తయారీ, పరీక్ష స్థాయికి చేరుకోవడానికి ఇతర దేశాలకు 42 నెలల సమయంపడితే భారత్ కేవలం 28 నెలల్లో ఈ ఘనత సాధించింది. సాధారణంగా ఈ స్థాయికి చేరడానికి 10, 12 రకాల ఇంజన్లను తయారుచేస్తే మనం కేవలం మూడు ఇంజన్లతోనే ఈ స్థాయికి ఎదిగాం. ఈ విజయంలో గత ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ కృషి దాగి ఉంది. డిజిటల్ సిములేషన్ తర్వాత నేరుగా పరీక్షకు వెళ్లేలా ఆయనే నాడు మార్గదర్శకం చేశారు. గతంలో మేం విఫలమయ్యాం. దాదాపు రూ.1,200 కోట్లు వృథా అయ్యాయి. కానీ ఇప్పుడు మేం చరిత్ర సృష్టించాం’’అని నారాయణన్ ఆనందం వ్యక్తంచేశారు. -
విత్తనాలకు రెక్కలొచ్చాయ్!
సూళ్లూరుపేట: అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానం కోసం ఉద్దేశించిన ప్రయోగంతోపాటు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన మాడ్యూల్లో ఇస్రో చేపట్టిన ప్రయోగం మలి దశలోనూ విజయవంతమైంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో విత్తనాలు మొలకెత్తగలవా? మొలకెత్తితే పూర్తిస్థాయిలో ఆకుల స్థాయిని సంతరించుకోగలవా? అని తెల్సుకోవడంతోపాటు ఆక్సిజన్, కార్భన్ డయాక్సైడ్ స్థాయిలను కొలిచేందుకు ఈ ప్రయోగం చేపట్టిన విషయంతెల్సిందే. స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్(స్పేడెక్స్) కోసం నింగిలోకి పంపిన జంట ఉపగ్రహాలతోపాటు కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (క్రాప్స్)పేరిట ఇస్రో ఓ పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెల్సిందే. ఇందులో ఎనిమిది అలసంద విత్తనాలను ఉంచగా అవి ఇటీవల మొలకెత్తాయి. మొలకెత్తిన విత్తనాలు తాజాగా ఆకులను సంతరించుకోవడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆకులు వచ్చిన సమయంలో మాడ్యూల్లో ఆర్ర్థత, ఉష్ణోగ్రత, మట్టిలో తేమ తదితరాలను అందులో అమర్చిన కెమెరా, ఇతర ఉపకరణాలతో కొలిచామని ఇస్రో సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అంతరిక్షంలో మొక్కల పెంపకానికి సంబంధించిన పరిశోధనలకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడిందని వెల్లడించింది. భవిష్యత్తులో అంతరిక్షంలో గడిపే వ్యోమగాముల ఆహార అవసరాలు తీర్చే చెట్ల పెంపకం, ఆ చెట్లు సూక్ష్మ గురత్వాకర్షణ స్థితిలోనూ ఏ మేరకు ఆకులు, ఫలాలను అందివ్వగలవు, ఎంత మేరకు నీరు అవసరం తదతర అంశాలపై శోధనకూ తాజా ప్రయోగం సాయపడిందని ఇస్రో పేర్కొంది. -
‘అంతరిక్ష అనుసంధానత’ను పరీక్షించనున్న ఇస్రో
న్యూఢిల్లీ: అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానత (డాకింగ్), విడదీత (అన్‌డాకింగ్) ప్రక్రియలను విజయవంతంగా పరీక్షించేందుకు ఇస్రో రంగం సిద్ధంచేస్తోంది. ఇందుకోసం ఉపయోగించే రెండు ఉపగ్రహాలను నేడు నింగిలోకి పంపనుంది. దీనికి శ్రీహరికోటలోని ప్రయోగవేదిక సిద్ధమైంది. సోమవారం రాత్రి ఎస్‌డీఎక్స్01, ఎస్‌డీఎక్స్02 శాటిలైట్లను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. అంతరిక్షంలో 476 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో డాకింగ్, అన్‌డాకింగ్ ప్రక్రియలను జనవరి తొలివారంలో స్పేస్ డాకింగ్ ఎక్స్పర్మెంట్(స్పేడెక్స్)ను చేపడతామని ఇస్రో అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ సాంకేతికతను సాధించాయి. చంద్రమండలం నుంచి చంద్రశిలల సేకరణ, భారతీయ అంతరక్ష స్టేషన్ ఏర్పాటు, చందమామపై భారత వ్యోమగామిని దింపడం వంటి కీలక ఘట్టాలకు ఈ స్పేడెక్స్ మిషన్ తొలి సోపానంగా మారనుందని ఇస్రో పేర్కొంది. -
సూర్యుడి ‘కరోనా’ను తాకింది...
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ స్పేస్‌క్రాఫ్ట్ చరిత్ర సృష్టించింది. నాసా ప్రయోగించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సూర్యుడికి అత్యంత సమీపానికి చేరుకుంది. ఈ విషయాన్ని నాసా శుక్రవారం ధ్రువీకరించింది. 2018లో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక కొద్దిరోజుల క్రితమే భగభగ మండే సూర్యుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6.1 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి విజయవంతంగా చేరుకుంది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా గుండా ప్రయాణించింది. ఎలాంటి ముప్పు లేకుండా సురక్షింగా ఉంది. చరిత్రలో ఇప్పటిదాకా లోకబాంధవుడికి ఇంత సమీపానికి వెళ్లి, సురక్షితంగా ఉన్న అంతరిక్ష నౌక మరొకటి లేదు. అంతా సవ్యంగా ఉన్నట్లు పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి గురువారం రాత్రి నాసాకు సందేశం అందింది. పార్కర్ రాబోయే కొన్ని రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలో చక్కర్లు కొట్టనుంది. దాంతో అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోతాయి. సురక్షిత ప్రాంతానికి తిరిగివచ్చిన తర్వాత మళ్లీ సంకేతాలు అందుతాయి. మానవులు ఇప్పటిదాకా నిర్మించిన అంతరిక్ష నౌకల్లో ఇదే అత్యంత వేగవంతమైంది కావడం గమనార్హం. గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 2,500 డిగ్రీల సెల్సియస్ ఫారెన్‌హీట్(1,370 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతను సైతం తట్టుకొనేలా పటిష్టమైన హీట్ షీల్డ్‌ను పార్కర్‌పై అమర్చారు. సూర్యుడి నుంచి అత్యధిక ఉష్ణోగ్రత జనించడానికి కారణం ఏమిటన్నది మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఇదిలా ఉండగా, పార్కర్ సోలార్ ప్రోబ్ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ సూర్యుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించనుంది. -
రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్
న్యూయార్క్: సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌గా ‘నాసా’ పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించబోతోంది. సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది. అప్పటినుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది. మంగళవారం ఇది లోకబాంధవుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది. అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి చేరుకుంటుంది. ఒక ఫుట్‌బాల్ మైదానాన్ని ఊహించుకుంటే ఒకవైపు సూర్యుడు, మరోవైపు భూమి ఉంటాయని, 4–యార్డ్ లైన్ వద్ద పార్కర్ ఉంటుందని నాసా సైంటిస్టు జో వెస్ట్‌లేక్ చెప్పారు.సూర్య భగవానుడికి ఇంత సమీపంలోకి వెళ్లిన అంతరిక్ష నౌక ఇప్పటిదాకా ఏదీ లేదు. సూర్యుడికి దగ్గరిగా వెళ్లిన తర్వాత పార్కర్ నుంచి సమాచారం నిలిచిపోనుంది. అప్పుడు దాని పరిస్థితి ఏమటన్నది అంచనా వేయలేకపోతున్నారు. క్షేమంగా వెనక్కి వస్తుందా? లేక ఏదైనా జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకల్లో పార్కర్ అత్యంత వేగవంతమైనది. ఇది గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బతినకుండా బలమైన హీట్ షీల్డ్ అమర్చారు. ఇది 1,371 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. సూర్యుడికి దగ్గరగా వెళ్లిన తర్వాత వచ్చే ఏడాది సెపె్టంబర్ దాకా అదే కక్ష్యలోకి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఎందుకు వందల రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుందన్న సంగతి తెలుసుకోవడానికి పార్కర్ తగిన సమాచారం ఇస్తుందని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. -
వోయేజర్–1 పునరుత్థానం!
వోయేజర్–1 అంతరిక్ష నౌక గుర్తుందా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్మిట్టర్లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి. భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్మిట్టర్కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు. ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఎస్ఎస్ చేరిన డ్రాగన్
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు బయల్దేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. సోమవారం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. కాసేపటికే అందులోని వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బనోవ్ ఐఎస్ఎస్లో ప్రవేశించారు. సునీత, విల్మోర్ తదితరులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. స్పేస్ ఎక్స్ క్రూ–9 మిషన్‌ను అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్‌కెనవెరల్ నుంచి శనివారం ప్రయోగించడం తెలిసిందే. జూన్‌లో బోయింగ్ తొలిసారి ప్రయోగాత్మకంగా పంపిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ చేరుకున్నారు. 8 రోజుల్లో వారు తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుబడిపోయారు. చివరికి స్టార్‌లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. సునీత, విల్మోర్ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఫిబ్రవరిలో తిరిగి రానున్నారు. వారికి చోటు కలి్పంచేందుకు వీలుగా నాలుగు సీట్ల సామర్థ్యమున్న డ్రాగన్ క్యాప్సూల్‌లో హేగ్, గోర్బనోవ్లను మాత్రమే పంపడం తెలిసిందే. -
స్పేస్ఎక్స్ మిషన్‌లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్‌లో స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
Butch Wilmore and Sunita Williams: ఐఎస్ఎస్లో ఇబ్బందేమీ లేదు
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎగువన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో సుదీర్ఘకాలం సభ్యులుగా కొనసాగడానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చెప్పారు. మానసికంగా, శారీరకంగా తమను తాము సిద్ధం చేసుకున్నామని, పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడానికి ప్రయతి్నస్తున్నామని తెలిపారు. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన సీఎస్టీ–100 స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఏడాది జూన్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంలో అది సాధ్యపడలేదు. స్టార్‌లైనర్ ఒంటరిగానే భూమిపైకి తిరిగివచి్చంది. ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సునీతా విలిమమ్స్, విల్మోర్ శుక్రవారం ఐఎస్ఎస్ నుంచి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. మనం నియంత్రించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆందోళన చెందడం అనవసరమని విల్మోర్ అన్నారు. ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు కంటే ఉండడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడ్డామని వివరించారు. తాము ప్రొఫెషనల్ వ్యోమగాములం కాబట్టి అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పనులు చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎల్లప్పుడు ఆసక్తికరంగానే ఉంటుందని సునీతా విలియమ్స్ వ్యాఖ్యానించారు. స్టార్‌లైనర్‌లో వెనక్కి వెళ్లలేకపోవడం పట్ల తమకు ఎలాంటి విచారం లేదన్నారు. అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్, విల్మోర్ ఓటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం ముఖ్యమైన బాధ్యత అని సునీతా విలియమ్స్ చెప్పారు. ఓటు వేసే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేయడానికి ‘నాసా’ తగిన ఏర్పాట్లు చేస్తోందని విల్మోర్ వెల్లడించారు. -
Jared Isaacman: మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్
కేప్ కెనావెరాల్: ప్రైవేట్ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్లి, స్పేస్‌వాక్ చేసిన మొట్టమొదటి నాన్–ప్రొఫెషనల్ వ్యోమగామిగా బిలియనీర్, టెక్నాలజీ వ్యాపారవేత్త జేర్డ్ ఐజాక్మాన్(41) రికార్డు సృష్టించారు. గురువారం భూమి నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల ఎగువన ‘డ్రాగన్’ స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వచి్చ, దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించారు. అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించారు. పరిపూర్ణమైన ప్రపంచాన్ని కళ్లారా దర్శించానని ఆయన పేర్కొన్నారు. ఐజాక్మాన్ తర్వాత స్పేస్ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. స్పేస్ఎక్స్ తలపెట్టిన ‘పోలారిస్ డాన్’ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్–9 రాకెట్ ద్వారా మంగళవారం ఐజాక్మాన్ సహా మొత్తం నలుగురు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరారు. గురువారం తమ లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన స్పేస్‌వాక్‌ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ వ్యాపారాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎలాన్ మస్క్‌తోపాటు ఐజాక్మాన్ భారీగా∙పెట్టుబడి పెట్టారు. ఆయన పెట్టుబడి ఎంత అనేది బహిర్గతం చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్ అంతరిక్ష యాత్రలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తిరిగొచ్చిన స్టార్‌లైనర్
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లిన స్టార్ లైనన్ స్పేస్‌క్రాఫ్ట్ ఒంటరిగానే తిరిగొచ్చింది. ఆరు గంటల ప్రయాణం తర్వాత స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 9.31 గంటలకు అమెరికాలో న్యూమెక్సికో ఎడారిలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ సమీపంలో క్షేమంగా దిగింది. ఐఎస్ఎస్ నుంచి కేవలం 10 రోజుల్లో తిరిగి రావాల్సిన స్టార్ లైనర్ సాంకేతిక లోపాల వల్ల మూడు నెలలకు పైగా ఆలస్యంగా భూమిపై అడుగుపెట్టింది. స్టార్ లైనర్‌లో వెనక్కి రావాల్సిన సునీత, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారు భూమిపైకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఐఎస్ఎస్లోనే ఉండి, అంతరిక్ష పరిశోధనల్లో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లి, ఒంటరిగా తిరిగివచ్చిన మొట్టమొదటి స్పేస్‌క్రాఫ్ట్‌గా స్టార్ లైనర్ రికార్డుకెక్కింది. ఏమిటీ స్టార్ లైనర్? ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన తొలి అంతరిక్ష వాహక నౌక స్టార్ లైనర్. ఈ ఏడాది జూన్ 5వ తేదీన ప్రయోగాత్మకంగా ఇద్దరు వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించారు. సునీతా విలియమ్స్, విల్మోర్ స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రయాణం మధ్యలో ఉండగానే సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇంజన్‌లోని కొన్ని థ్రస్టర్లు విఫలమయ్యాయి. హీలియం గ్యాస్ లీకైనట్లు గుర్తించారు. తాత్కాలిక మరమ్మత్తులతో స్టార్ లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వాస్తవానికి సునీతా విలియమ్స్, విల్మోర్ 8 రోజులపాటు అక్కడే ఉండి, ఇదే స్టార్‌లైనర్‌లో వెనక్కి తిరిగిరావాలి. మరమ్మత్తులు చేయడం సాధ్యం కాకపోవడంతో వారిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేకుండాపోయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ‘డ్రాగన్’ స్పేస్‌క్రాఫ్ట్‌లో వారిద్దరూ భూమిపైకి తిరిగి రానున్నారు. ‘డ్రాగన్’లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి వీలుంది. కానీ, ఇద్దరే ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. వచ్చేటప్పుడు సునీతా విలియమ్స్, విల్మోర్ను కూడా తీసుకురానున్నారు. – వాషింగ్టన్ -
నింగిలోనే వ్యోమగాములు.. భూమిపైకి ‘స్టార్‌లైనర్’
అంతరిక్షానికి వ్యోమగాములను మోసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ అర్ధంతరంగా భూమికి తిరిగివచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌విల్మోర్‌ను తీసుకు రాకుండానే భూమికి వచ్చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్(ఐఎస్ఎస్) నుంచి బయలుదేరిన ఆరు గంటల తర్వాత శుక్రవారం(సెప్టెంబర్ 6) రాత్రి స్టార్‌లైనర్ వ్యోమనౌక న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో భూమిపై దిగింది.అసలు స్టార్‌లైనర్‌కు ఏమైంది..?బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకైంది. ఒక దశలో స్టార్‌లైనర్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయన్న ప్రచారం జరిగింది. నాసా ఎందుకు ఒప్పుకోలేదు..?హీలియం లీకేజీ సమస్యను సరిచేసే క్రమంలో వ్యోమగాములు భూమికి తిరిగిరావడం ఆలస్యమవుతూ వచ్చింది. చివరిగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ సంస్థ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్ సురక్షితమే అని ప్రకటించింది. అయితే గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాసా అందుకు అంగీకరించలేదు.వ్యోమగాముల తిరిగి రాక ఎలా..వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి నాసా ఒప్పుకోకపోవడంతో స్టార్‌లైనర్ ఖాళీగా భూమికి రావాల్సి వచ్చింది. వ్యోమగాములను తిరిగి తీసుకురావడం కోసం ఇలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ మరో వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు వ్యోమగాములు సునీతా, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీత వచ్చేది అప్పుడేనా..స్పేక్స్ ఎక్స్‌కు చెందిన క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను నాసా ఐఎస్ఎస్కు పంపే ఛాన్సుంది. సెప్టెంబరులోనే ఈ ప్రయోగం ఉండొచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రూ డ్రాగన్‌లో సునీత, విల్మోర్ను భూమి మీదకు తీసుకురావాలని నాసా యోచిస్తోంది. -
అంతరిక్ష కేంద్రం మీదుగా గగన్‌యాన్!
అంతరిక్షంలోకి చేరిన తొలి భారత వ్యోమగామిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించిన నలభై ఏళ్లకు మరో భారతీయుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టడం గర్వకారణమే. మానవ సహిత అంతరిక్ష యాత్ర (గగన్ యాన్ ) కోసం భారత్ ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. బెంగళూరులో వీరికి రష్యా ఆధ్వర్యంలో శిక్షణ నడుస్తోంది. శుక్లాను ఐఎస్ఎస్ పైకి పంపే విషయాన్ని ప్రకటిస్తూ ఇస్రో ఆయన్ని గగన్ యాత్రి అని పిలిచింది. దీంతో ఈయనకూ, మనం సమీప భవిష్యత్తులో చేపట్టే గగన్ యాన్కూ సంబంధం ఉన్నట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్, గగన్ యాన్ రెండూ వేర్వేరు రకాల అంతరిక్ష యాత్రలు. కాకపోతే ఐఎస్ఎస్ అనుభవాలు గగన్ యాన్ కూ ఉపయోగపడవచ్చునని ఇస్రో భావిస్తూండవచ్చు.1969లో మనిషి తొలిసారి జాబిల్లిపై అడుగు పెట్టింది మొదలు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు బోలెడన్ని జరిగాయి. భూమి చుట్టూ తిరుగు తున్న స్పేస్స్టేషన్లకు వ్యోమగాములను పంపుతూనే ఉన్నాం. ఇలాంటి ప్రయోగాలకు సాధారణంగా శక్తిమంతమైన రాకెట్లను వాడుతూంటారు. అంతరిక్ష నౌక ఐఎస్ఎస్కు అనుసంధానమై కొన్ని రోజులు లేదా వారాలపాటు ఉంటుంది. ఆ తరువాత భూమికి తిరిగి వస్తుంది. 1970లలో సోవియట్ ‘సాల్యూట్’, అమెరికా ‘స్కైలాబ్’ ప్రయోగా లతో అంతరిక్ష కేంద్రాల యుగం ప్రారంభమైంది. తరువాతి కాలంలో సోవియట్ యూనియన్ మరింత పెద్దదైన మిర్ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చివరగా అమెరికా, రష్యా, యూరప్ సంయుక్తంగా ఐఎస్ఎస్ను నిర్మించాయి. చైనా తియాన్ గాంగ్ పేరుతో ప్రత్యేకంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని పదేళ్లుగా నిర్మిస్తోంది. 2035 కల్లా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తామని భారత్ కూడా సంకల్పించడం విశేషం.భూ కక్ష్యలో తిరిగే అంతరిక్ష కేంద్రాన్ని చేరాలంటే శక్తిమంతమైన రాకెట్లు, మానవులను మోసుకెళ్లగల సామర్థ్యమున్న మంచి అంతరిక్ష నౌక అవసరం. ఇందుకు సోవియట్ యూనియన్ ‘సోయుజ్’, అమె రికా స్పేస్ షటిల్స్ తయారు చేసుకున్నాయి. ముప్ఫై ఏళ్లుగా వీటినే వాడుతున్నాయి. స్పేస్ షటిల్ రాకెట్ మాదిరిగా నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. అంతరిక్ష నౌక మాదిరిగా సమాంతరంగానూ దూసు కెళ్లగలదు. విమానం మాదిరి ల్యాండ్ కూడా కాగలదు. అయితే 2003లో స్పేస్ షటిల్ కొలంబియా ప్రమాదానికి గురై అందులో భారతీయ సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా మరణించింది మొదలు స్పేస్ షటిల్‌ల యుగం క్రమేపీ అంతరించింది. 2011 నాటికి పూర్తిగా నిలిపివేశారు. ఆ తరువాత కొన్నేళ్లకు ‘నాసా’ రష్యా తయారీ సోయుజ్ సాయంతో ఐఎస్ఎస్కు సరుకులు, వ్యోమగాములను రవాణా చేయడం మొదలుపెట్టింది. ప్రైవేట్‌రంగ ప్రవేశం...అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ కంపెనీలు పాల్గొనడం స్పేస్ షటిల్ కార్యక్రమం ముగిసిన తరువాతే మొదలైంది. దీర్ఘకాలిక అవస రాలను దృష్టిలో పెట్టుకుని నాసా అమెరికన్ కంపెనీల నిధులు, టెక్నా లజీల సాయంతో అంతరిక్ష రవాణా వ్యవస్థలను నిర్మించుకుంది. ఈ క్రమంలోనే ఐఎస్ఎస్కు సరుకులు, సిబ్బందిని రవాణా చేసే పని ప్రైవేట్ కంపెనీల పరమైంది. ఈ విధానం పుణ్యమా అని స్పేస్ఎక్స్, యునైటెడ్ లాంచ్ అలయన్స్(యూఎల్ఏ) వంటి పలు ప్రైవేట్ కంపె నీలు అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టాయి. 2012 నుంచి తన ఫాల్కన్ రాకెట్ల ద్వారా పలు మార్లు ఐఎస్ఎస్కు సరుకులు రవాణా చేసిన తరువాత స్పేస్ఎక్స్ 2020లో మొదటిసారి సిబ్బంది రవాణా బాధ్యతను నిర్వర్తించింది. ఇంకోవైపు యూఎల్ఏ కూడా తన అట్లాస్ వీ రాకెట్ ద్వారా పలు కార్గో ట్రిప్‌లు విజయవంతంగా పూర్తి చేసి సిబ్బంది రవాణ చేపట్టింది. ఈ ఏడాది జూన్ లో భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను ఐఎస్ఎస్కు మోసుకెళ్లిన స్టార్ లైనర్ యూఎల్ఏ తయారీనే. అయితే ఐఎస్ఎస్ చేరిన తరువాత ఈ స్టార్ లైనర్ మళ్లీ భూమ్మీదకు వచ్చే స్థితిలో లేనట్లు స్పష్టమైంది. థ్రస్టర్లలో సమస్యలు రావడంతో అది ఐఎస్‌ఎస్‌తోనే ఉండిపోయింది. శుభాంశూ శుక్లాను ఐఎస్ఎస్కు చేర్చే బాధ్యతను ఇస్రో ప్రైవేట్ కంపెనీ ‘ఆక్సియామ్ స్పేస్’కు అప్పగించింది. వాణిజ్య స్థాయిలో వ్యోమగాముల రవాణా చేపట్టగల సత్తా దీనికి ఉందని నాసా స్వయంగా సర్టిఫై చేసి ఉండటం గమనార్హం. అయితే ఆక్సియామ్కు సొంతంగా రాకెట్లు లేవు. స్పేస్‌ఎక్స్‌పై ఆధారపడుతోంది. 2021 మే నుంచి ఇప్పటివరకూ ఆక్సియామ్ మూడుసార్లు ఐఎస్ఎస్కు సిబ్బంది, సరుకులను రవాణా చేసింది. శుక్లాను మోసుకెళ్లడం నాలుగో మిషన్ అవుతుంది. కానీ ఆక్సియామ్, ఇస్రోల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందానికి లోబడి శుక్లా ఐఎస్ఎస్కు వెళతారా? లేక ఇస్రో – నాసాల ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా (సర్వీస్ ఛార్జీలు ఉన్నా లేకున్నా) వెళతారా? అన్నది స్పష్టం కాలేదు. 1984లో భారత్, సోవి యట్ యూనియన్ల మైత్రీ బంధానికి ప్రతీకగా రాకేశ్ శర్మ సోవియట్ అంతరిక్ష కేంద్రం సాల్యూట్కు వెళ్లారు. ఈ యాత్ర, శిక్షణలకు సంబంధించి సోవియట్ యూనియన్ కు భారత్ డబ్బు ఏమీ చెల్లించలేదు. సాల్యూట్ తరువాత వచ్చిన మిర్ పైకి సోవియట్ యూనియన్ 13 దేశాలకు చెందిన 104 మంది వ్యోమగాములను తీసుకెళ్లింది. 2001లో మిర్ కూలిపోయే ముందు వరకూ ఈ యాత్రలు జరిగాయి. చాలా యాత్రలకు ఆయా దేశాలు డబ్బులు చెల్లించడం గమనార్హం. 1990–2000 మధ్యకాలంలో నిర్మాణమైన ఐఎస్ఎస్లో భారత్‌కు భాగస్వామ్యం లేదు. వ్యోమగామిని పంపే అవకాశమూ రాలేదు. అప్పట్లో ఇస్రో, నాసాల మధ్య సంబంధాలు అంత బాగా లేవు. రష్యా నుంచి మనం క్రయోజెనిక్ ఇంజిన్లు తెచ్చుకోవడంపై పెద్ద వివాదమే నడుస్తుండేది. ఇస్రో కూడా తన ఉపగ్రహ కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. పైగా వనరుల కొరత ఇస్రోను బాధిస్తూండేది. ఇస్రో అజెండాలోకి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం చేరే సమయానికి ఐఎస్ఎస్ను సందర్శించే వారి జాబితా పెరిగిపోయింది. గత పాతికేళ్లలో 23 దేశాలకు చెందిన 280 మంది వ్యోమగాములు ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చారు. వీరిలో కొంతమంది రెండు, నాలుగు సార్లు కూడా వెళ్లడం గమ నార్హం. సునీతా విలియమ్స్‌నే ఉదాహరణగా తీసుకుంటే, ఆమె ఐఎస్ఎస్కు వెళ్లడం ఇది మూడోసారి. అమెరికా, రష్యాల వ్యోమగాములు సుమారు 220 మంది ఐఎస్ఎస్ వెళ్లిన వారిలో ఉండగా... మిగిలిన వాళ్లు జపాన్ , కెనెడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, యూకే, బెల్జియం, స్పెయిన్, స్వీడన్ , నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , బెల రూస్, మలేషియా, దక్షిణాఫ్రికా, కొరియా, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈలకు చెందినవారు. ఈ జాబితాలో 13 మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. ఆక్సియామ్ చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రలోనూ నలుగురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు.2018లో ఇస్రో గగన్‌యాన్‌పై పని మొదలుపెట్టినప్పుడు భార తీయ వ్యోమగామిని ఐఎస్ఎస్పైకి పంపాలన్న ఆలోచన లేదు. ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములను యూరీ గగారిన్ స్పేస్ సెంటర్‌కు శిక్షణ కోసమని పంపారు. రష్యా అంతరిక్ష ప్రయోగసంస్థలతో కుదిరిన ఒప్పందంలోనూ మానవ సహిత అంతరిక్ష యానా నికి సంబంధించిన శిక్షణ ప్రస్తావన మాత్రమే ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ 2022లో భారత స్వాతంత్య్ర 75 సంవత్సరాల వేడుకల సందర్భంగా గగన్ యాన్ గడువు ఆచరణ సాధ్యం కానంత తక్కువ సమయానికి కుదించడంతో పరిస్థితి మారిపోయింది. అందుకేనేమో... ఏడాది తరువాత ఐఎస్ఎస్ ఆలోచన వచ్చింది. మోదీ అమెరికా పర్య టన సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేశారు. అయితే గగన్ యాన్ యాత్ర కోసం ఐఎస్ఎస్కు వెళ్లాల్సిన అవసరమేదీ లేదు కానీ అంతరిక్ష యాత్రకు సంబంధించి వాస్తవిక అనుభవం గడించేందుకు మాత్రం ఉపయోగపడుతుంది. ఏమైనప్పటికీ... అంతరిక్షంలోకి చేరిన తొలి వ్యోమగామిగా రాకేశ్ శర్మ రికార్డు సృష్టించిన నలభై ఏళ్లకు మరో భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నాడంటే, అది మనందరికీ గర్వకారణమే.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
టిక్.. టిక్.. టిక్... మిగిలింది 19 రోజులే
వాషింగ్టన్: బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికే (ఐఎస్ఎస్) పరిమితమైన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. వారు మరో 19 రోజుల్లో వారం అక్కడి నుంచి బయల్దేరకపోతే మరో కీలక ప్రయోగాన్ని నిలిపివేయక తప్పదు. అందుకే నాసా సైంటిస్టులు, బోయింగ్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఎందుకీ ఆందోళన? విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ సంస్థ తొలిసారి అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు సునీత, విల్మోర్ జూన్ 5న ఐఎస్ఎస్కు బయలుదేరారు. అయితే నింగిలోకి దూసుకెళ్తున్న క్రమంలోనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 28 థ్రస్టర్లకు గాను 5 మొరాయించాయి. సరీ్వస్ మాడ్యూల్లో ఐదు చోట్ల హీలియం లీకేజీలు బయటపడ్డాయి. సానా సైంటిస్టులు భూమి నుంచే రిమోట్ కంట్రోల్‌తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. తర్వాత స్టార్‌లైనర్ ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమై జూన్ 13న సునీత, విల్మోర్ ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టారు. షెడ్యూల్ ప్రకారం వారం తర్వాత స్టార్‌లైనర్‌లో వెనక్కు రావాలి. కానీ దానికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తే తప్ప బయల్దేరలేని పరిస్థితి! మరోవైపు స్పేస్ఎక్స్ ‘క్రూ–9 మిషన్’లో భాగంగా నాసా వ్యోమగాములు జెనా కార్డ్‌మాన్, నిక్ హేగ్, స్టెఫానీ విల్సన్, అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ నెల 18న ఐఎస్ఎస్కు బయలుదేరాల్సి ఉంది. వారు 23 కల్లా అక్కడికి చేరేలా గతంలోనే షెడ్యూల్ ఖరారైంది. ఐఎస్ఎస్ నుంచి స్టార్‌లైనర్ వెనక్కి వస్తే తప్ప ‘క్రూ–9’ను పంపలేని పరిస్థితి! దాంతో ఏం చేయాలో అర్థంకాక నాసా తల పట్టుకుంటోంది. దీనికి తోడు ఐఎస్ఎస్లో సునీత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్లు సమాచారం. స్టార్‌లైనర్ త్వరలో సిద్ధం కాకుంటే ఆమెను రప్పించడానికి ప్రత్యామ్నాయం చూడాల్సి రావొచ్చు. -
ఐఎస్ఎస్ నుంచి త్వరలో సునీత రాక!
వాషింగ్టన్: బోయింగ్ తయారీ స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమికి తిరుగుపయనంపై ఆశలు ఇంకాస్త చిగురించాయి. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేర్చాక స్టార్‌లైనర్‌లోని రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థలోని కొన్ని థ్రస్టర్లు మొరాయించిన విషయం విదితమే. నౌకను శూన్యంలో సరైన దిశలో తిప్పేందుకు చిన్నపాటి ఇంజన్లవంటి థ్రస్టర్లు అత్యంత కీలకం. హీలియం సైతం లీక్ అవుతుండటంతో సునీత, విల్మోర్ల తిరుగుప్రయాణాన్ని వాయిదావేసి రిపేర్ల పనిపట్టడం తెల్సిందే. తాజాగా థ్రస్టర్లను ఒకదాని తర్వాత మరొకటి ఇలా 27 థ్రస్టర్లను మండించి వాటి పనితీరును పరిశీలించారు. 97–02 శాతం ఖచి్చతత్వంతో అవి పనిచేశాయని హాట్ ఫైర్ పరీక్షకు నాయకత్వం వహించిన ఫ్లైట్ డైరెక్టర్ కోలోయి మెహరింగ్ చెప్పారు. ఈ పరీక్ష జరిపినంతసేపు హీలియం వ్యవస్థలు సవ్యంగానే పనిచేశాయని మెహరింగ్ ప్రకటించారు. ఈ ఫలితాలను వచ్చేవారు సమీక్షించనున్నారు. ఐఎస్ఎస్ను ఏ రోజున భూమికి తిరుగుపయనం మొదలెట్టాలనే విషయాన్ని వచ్చేవారం సమీక్షలో చర్చించనున్నారు. -
ఐఎస్ఎస్లోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి గమ్యస్థానం చేరుకున్నారు. బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో బుధవారం అంతరిక్ష ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు సాహసికులు గురువారం మధ్యాహ్నం 1.34 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి(ఐఎస్ఎస్) విజయవంతంగా అడుగుపెట్టారు. అవాంతరాలను అధిగమించి స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. ఐఎస్ఎస్లో ఇప్పటికే ఏడుగురు వ్యోమగాములుండగా, సునీత, బుచ్ విల్మోర్తో తొమ్మిదికి చేరారు. కొత్తగా తమ వద్దకు చేరిన సునీతా, విల్మోర్కు ఏడుగురు అస్ట్రోనాట్స్ ఘన స్వాగతం పలికారు. ఆలింగనం చేసుకున్నారు. సునీత ఆనందంతో నృత్యం చేశారు. వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘ఐఎస్ఎస్ వ్యోమగాములంతా నా కుటుంబ సభ్యులే. వారిని కలుసుకున్నందుకు వేడుక చేసుకున్నా. ఇదో లిటిల్ డ్యాన్స్ పార్టీ’’ అన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వారం తర్వాత స్టార్‌లైనర్‌లో భూమిపైకి తిరిగి రానున్నారు. -
Voyager-1: హస్త లా విస్తా.. బేబీ!
వోయేజర్–1. ఈ పేరే ఖగోళ శాస్త్రవేత్తలకు ఎనలేని స్ఫూర్తి. నింగికేసి ఉత్సాహంగా చూసేలా కొన్ని తరాలను పురి గొలి్పన ప్రేరణ శక్తి. అలుపెరుగని యాత్ర. కోట్లాది కిలోమీటర్ల జైత్రయాత్ర. అర్ధ శతాబ్ద కాలపు వైజ్ఞానిక పరిశోధనల సారం. మానవాళి కలలుగన్న ‘సుదూర’ లక్ష్యపు సాకార రూపం. గ్రహాంతర హద్దులను దాటి నక్షత్రాంతర రోదసికెగసిగిన విశ్వవిఖ్యాత వ్యోమనౌక వోయేజర్–1. అంతరిక్షంలో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు ఇదే. 1977 సెపె్టంబరు 5న అమెరికా ప్రయోగించిన ఈ వ్యోమనౌకది 46 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఈ జనవరి నాటికి అది భూమి నుంచి 2,440 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉంది. ఇప్పుడీ వ్యోమనౌకకు అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. గత నవంబరు నుంచి భూమికి సరైన సమాచారమివ్వడం లేదు. నాసాకు పిచ్చి పిచ్చి సందేశాలు పంపుతోంది. ఎలా చూసినా వోయేజర్–1 చరిత్ర ఇక ముగిసిన అధ్యాయమేనని అనిపిస్తోంది. అద్భుతమేదైనా జరిగితే తప్ప అది మనకిక హస్త లా విస్తా (వీడ్కోలు) చెప్పినట్టే! వోయేజర్–1లోని ఓ కంప్యూటర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో కాలిఫోర్నియాలోని పసడెనాలో జెట్ ప్రొపల్షన్ లే»ొరేటరీలో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ కేంద్రానికి వ్యోమనౌక నుంచి అర్థరహిత సమాచారం అందుతోంది. వోయేజర్–1ను నిర్మించి ప్రయోగించినప్పటి నాసా సిబ్బందిలో చాలామంది కాలం చేశారు. దాంతో తాజా సమస్యను పరిష్కరించి వ్యోమనౌకను మళ్లీ గాడిన పెట్టేందుకు దాని నిర్మాణం తాలూకు పాత పత్రాలను ముందేసుకుని శాస్త్రవేత్తలు కొన్ని నెలలుగా కుస్తీలు పడుతున్నారు. ఈ సమస్య నుంచి వ్యోమనౌక బయటపడితే అద్భుతమేనని 2010 నుంచి ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సుజానే డాడ్ అన్నారు. సౌరవ్యవస్థను దాటి మున్ముందుకు! హీలియోస్ఫియర్. సౌరవ్యవస్థ చుట్టూ సూర్యుడు నేరుగా ప్రభావం చూపే పొడవైన బుడగ లాంటి ప్రదేశం. దీని అంచును హీలియోపాజ్ అంటారు. వోయేజర్–1 2012లోనే ఈ హీలియోపాజ్నును దాటేసి నక్షత్రాంతర రోదసిలోకి ప్రవేశించింది. అలా ఇంటర్ స్టెల్లార్ స్పేస్‌లోకి అడుగిడిన తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డుకెక్కింది. 2018లో వోయేజర్–2 కూడా ఇంటర్ స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. కాస్మిక్ కిరణాలు, నక్షత్రాంతర ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో అసాధారణ అలజడులు, ప్లాస్మా కణాలపై వోయేజర్–1 అధ్యయనం చేస్తోంది. భూమి నుంచి దానికి ఆదేశం పంపడానికి 22.5 గంటలు, దాన్నుంచి డేటా స్వీకరించడానికి మరో 22.5 గంటలు.. ఇలా సమాచారం ఇచి్చపుచ్చుకోవడానికి రమారమి రెండు రోజులు పడుతోంది. జంట విజయాలు... వోయేజర్ ప్రాజెక్టులో వోయేజర్–1, 2 భాగస్వాములు. వోయేజర్–2ను వోయేజర్–1 కంటే రెండు వారాల ముందు ప్రయోగించారు. నిజానికి వీటిది కేవలం నాలుగేళ్ల మిషన్. కానీ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. వోయేజర్–2 ప్రస్తుతం పనిచేస్తున్నా దాన్నీ సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. పయనీర్–10, 11 వ్యోమనౌకల యాత్రలకు కొనసాగింపుగాం గురు, శని గ్రహాల అన్వేషణకు వోయేజర్ జంట నౌకలను పంపారు. వీటితో గురు గ్రహంపై పెద్ద ఎర్ర మచ్చ, శని వలయాలు, ఈ రెండు గ్రహాల కొత్త చంద్రుళ్లకు సంబంధించి ఎన్నో విశేషాలు వెలుగు చూశాయి. వోయేజర్–1 1979లో గురుగ్రహాన్ని 3.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి తిలకించింది. దాని చంద్రుడు ‘అయో’పై క్రియాశీల అగి్నపర్వతాలను గుర్తించింది. భూమి మినహా సౌరకుటుంబంలోని తక్కిన ఖగోళ వస్తువుల్లో అగి్నపర్వత క్రియాశీలతను కనుగొనడం అదే తొలిసారి. 1990 ఫిబ్రవరి 14న సూర్యుడికి 600 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ‘లేత నీలి చుక్క’లా కనిపిస్తున్న భూమి ఫొటోను వోయేజర్–1 కెమెరా బంధించింది. ఆ సింగిల్ పిక్సెల్ ఫొటో ‘మానవాళి తనకుతాను గీసుకున్న స్వీయ చిత్తరువు’లా అనిపిస్తుంది. ఇక యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్–2 పేరుగాంచింది. శిలాగ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడిని అంతర గ్రహాలంటారు. వాయుమయ గురు, శని, యురేనస్, నెప్ట్యూన్లను బాహ్య గ్రహాలుగా పిలుస్తారు. 4 బాహ్య గ్రహాలను దగ్గరగా సందర్శించిన ఏకైక వ్యోమనౌకగా వోయేజర్–2 1989లో రికార్డు సృష్టించింది. – జమ్ముల శ్రీకాంత్ -
ఆచితూచి అడుగేద్దాం!
శాస్త్రవిజ్ఞాన విజయాలతో మానవాళి ఎప్పటికప్పుడు ముందడుగేయడం చరిత్రలో సంతోష సందర్భమే. గతవారం అలాంటి మరో సందర్భం ఎదురైంది. పుడమికి అతి సమీపంలో ఉండే గ్రహమైన చంద్రునిపై మరోసారి మానవ మేధ సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగింది. ఇప్పటి దాకా వివిధ దేశాల ప్రభుత్వాలు అధికారిక అంతరిక్ష పరిశోధనా సంస్థలతో అద్భుత విజయాలు సాధించడం చూశాం. ఈసారి ఓ ప్రైవేట్ సంస్థ చందమామపై జయకేతనం ఎగరేసింది. అమెరికాకు చెందిన ‘ఇన్ట్యూటివ్ మెషిన్స్’ (ఐఎం) సంస్థ ఫిబ్రవరి 22న ఓ రోబోటిక్ వ్యోమనౌకను చందమామపై సాఫ్ట్ ల్యాండ్ చేసింది. ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేట్ సంస్థగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం అయిదే దేశాలు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. అలా చూస్తే, ఒక ప్రైవేట్ సంస్థ ఆ అపురూప విన్యాసం చేయడం చెప్పుకోదగ్గ మైలురాయి. అయితే, చరిత్రలో రెండో పర్యాయం ఇప్పుడు మళ్ళీ జాబిల్లిపై వ్యోమయానం ఊపందుకున్న వేళ రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా నిర్దిష్టమైన అంతరిక్ష విధానం, ప్రత్యేక అంతరిక్ష చట్టం అవసరం ఉందని అర్థమవుతోంది. అమెరికా అంతరిక్ష నౌక ఒకటి చంద్రమండల ఉపరితలంపై దిగడం గత 50 ఏళ్ళ పైచిలుకులో ఇదే ప్రథమం! అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ 1972లో అపోలో ప్రోగ్రామ్‌కు తెర దించిన తర్వాత మళ్ళీ ఆ దేశం చంద్ర మండల పునఃప్రవేశం మళ్ళీ ఇప్పుడే! చంద్రునిపై వ్యోమనౌక దిగడమనే సవాలులో మానవజాతి ఎన్నో ఏళ్ళుగా విజయాలు, వైఫల్యాలు – రెండూ చవిచూసింది. చంద్రునిపై దిగడంలో విఫలమైన ప్రతిసారీ వ్యోమనౌకల శకలాలు చంద్రోపరితలంపై చెల్లాచెదరై పడివుండడమూ చూశాం. అంతెందుకు... గత నెలలో మరో అమెరికన్ సంస్థ ‘ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ’ సైతం ఓ ల్యాండర్‌ను చంద్రునిపైకి పంపాలని చూసింది. ఇంధనం లీకేజీతో ఆ యత్నాన్ని అర్ధంతరంగా ముగించింది. సదరు ల్యాండర్ భూవాతావరణంలోకి పునఃప్రవేశించి, పసిఫిక్ మహాసముద్రంపై దగ్ధమైంది. విఫలమైన ఆ ‘ఆస్ట్రోబోటిక్’, విజయవంతమైన ‘ఐఎం’ సంస్థ... రెండూ ‘నాసా’ అండతో వాణిజ్యపంథాలో చంద్రునిపైకి వ్యోమనౌకల్ని పంపే కృషిలో భాగమే. గగనాంతర సీమల గవేషణలో ప్రైవేట్ రంగ ప్రమేయం పెరుగుతున్న తీరుకు ఇది ఉదాహరణ. చరిత్ర గమనిస్తే – 1966లోనే సోవియట్ యూనియన్ ‘లూనా9’ తొలిసారిగా చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. నాలుగు నెలల తర్వాత ‘సర్వేయర్1’తో అమెరికా విజయం సాధించింది. అది క్రమంగా చంద్రునిపైకి మానవయాత్రకు దారి తీసింది. 1969లో నాసా ‘అపోలో11’తో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్ద్రిన్లు చంద్రునిపై అడుగిడిన తొలి వ్యక్తులుగా చరిత్ర సృష్టించినప్పటి నుంచి ఇప్ప టికి అరడజనుకు పైగా యాత్రల్లో డజను మంది చంద్రునిపై కాలుమోపారు. 2026 చివరి కల్లా మరోసారి చంద్రునిపైకి మానవ యానానికి అమెరికా సిద్ధమవుతోంది. మూడో దేశంగా చైనా, గత ఏడాది ‘చంద్రయాన్3’ ద్వారా రెండో ప్రయత్నంలో విజయం సాధించి నాలుగో దేశంగా భారత్ చంద్రునిపై ల్యాండింగ్ చేశాయి. ఈ జనవరిలో జపాన్ తప్పుదిశలో ల్యాండింగ్ జరిపినప్పటికీ, అసలంటూ చేసిన అయిదో దేశంగా ఆ జాబితాలో చేరింది. ఇప్పుడు ఐఎం విజయంతో చంద్రమండల యాత్రల్లో ప్రైవేట్ రంగ శక్తియుక్తులు హెచ్చనున్నాయి. మరిన్ని యాత్రలకు సన్నాహాలు సాగుతు న్నందున లోతైన అన్వేషణ, శాస్త్రీయ పరిశోధనలకు కలువలరేడు కేంద్రబిందువు కానున్నాడు. నిజానికి, చంద్రునిపై దిగేందుకు ప్రైవేట్ సంస్థలు గతంలోనూ అనేక యత్నాలు చేశాయి. 2019లో ఇజ్రాయెల్ బెరేషీట్ చంద్రునిపై కుప్పకూలింది. 2023లో ఓ జపనీస్ సంస్థ తాలూకు ల్యాండర్ పడిపోయింది. తాజా ప్రైవేట్ ప్రయోగ విజయంలోనూ లోటుపాట్లు లేకపోలేదు. గ్రీకు పురాణా ల్లోని తెలివైన వీరుడు ‘ఒడిస్సియస్’ పేరు పెట్టుకున్న ఐఎం వారి వ్యోమనౌక ఆఖరుఘట్టంలో జాబిల్లి దక్షిణ ధ్రువానికి దగ్గరలో నేరుగా కాక అనుకున్నదాని కన్నా వేగంగా, పక్కవాటుగా దిగింది. దాంతో, ముందనుకున్నట్టు వారం కాకుండా, 2–3 రోజుల ముందే తట్టాబుట్టా సర్దుకుంటోంది. అయితే, అసలంటూ ఐఎం విజయవంతం కావడంతో నాసా ‘కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్’ (సీఎల్పీఎస్) కార్యక్రమం కింద మరిన్ని ప్రైవేట్ ప్రయత్నాలు సాగుతాయి. 2020 నాటికి పూర్తయ్యేలా మరో 14 ప్రైవేట్ సంస్థలతో నాసా పెట్టుకున్న 260 కోట్ల డాలర్ల కాంట్రాక్టులే అందుకు తార్కాణం. ఇటీవలే భారత్ సైతం జాతీయ అంతరిక్ష రంగంలో నూరు శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టు బడులకు ద్వారాలు తెరిచింది. అంటే రానున్న రోజుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)పై భారం తగ్గి, ప్రైవేట్ రంగంలో భారతీయ అంకుర సంస్థల మధ్య పోటాపోటీ పెరగనుంది. ప్రపంచమంతటా ఇలాంటి ప్రైవేట్ ప్రయత్నాలతో కష్టాలూ తప్పవు. 1967 నాటి ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ మినహా ఇప్పటికీ అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనలేవీ లేవు. ఆ ఒడంబడిక సైతం అనుసరించాల్సిన విధుల జాబితాయే తప్ప, పాటించి తీరాల్సిన ఆదేశాలు కావు. తాజా ఒడిస్సియస్ దెబ్బతో వివిధ సంస్థలు చంద్రునిపైకి ఏవైనా పంపి, దాన్ని ఎలాగైనా నింపే వీలుంది. అందుకే, ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష, చంద్రమండల చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఇప్పటికే ఉప గ్రహాలతో క్రిక్కిరిసిన దిగువ భూకక్ష్య లానే చంద్రమండలమూ నిండవచ్చని శాస్త్రవేత్తల జోస్యం. చంద్రునిపై నిర్ణీత ప్రాంతాలు శాస్త్రీయ పరిశోధనా శాలలకు కీలకం గనక అవాంఛనీయ పోటీ తప్పదు. విలువైన హీలియమ్3 కోసం చంద్రునిపై గనుల తవ్వకాలు జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. కాబట్టి, ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భమిది. నైతికతకు కట్టుబడి పరిశోధనలు సాగిస్తూనే, వెన్నెలరేడు వాతావరణాన్ని విధ్వంసం చేయనిరీతిలో చట్టాలు చేసుకోవాల్సిన సమయమిది. -
‘మూన్ స్నైపర్’ బతికేనా?.. జపాన్ ‘దింపుడు కళ్ళం’ ఆశ!
జపాన్ ప్రయోగించిన ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ మూడు రోజుల క్రితం చంద్రుడిపైనున్న షియోలీ బిలం వాలులో దిగింది. ఆ ప్రదేశంలో ప్రస్తుతం భానోదయం. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి ఆగమిస్తున్నాడు. ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) మాత్రం పడమటి దిక్కు వైపు మోహరించి ఉన్నాయి. ఫలితంగా వ్యోమనౌకలో సౌర విద్యుత్ తయారీకి ఇప్పుడు అవకాశం లేదు. అందుకే... భవిష్యత్తులో ల్యాండర్ పునఃప్రారంభ అవసరాల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా తమ ‘మూన్ స్నైపర్’ బ్యాటరీని స్విచ్ ఆఫ్ చేసినట్టు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సోమవారం ప్రకటించింది. వ్యోమనౌక ఆన్‌బోర్డ్ బ్యాటరీలో 12% (కనీస) పవర్ ఉందని, చంద్రుడిపై ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ దిగిన మూడు గంటలకు దాని బ్యాటరీని స్విచాఫ్ చేశామని ‘జాక్సా’ తెలిపింది. అవసరమైనప్పుడు ల్యాండరును రీ-స్టార్ట్ చేయడానికి అందులో ఉన్న 12% పవర్ సరిపోతుందని సంస్థ పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత సూర్యుడు పడమటి దిక్కుకు వాలినప్పుడు ల్యాండర్ సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశముంది. అప్పుడు ల్యాండరును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం ‘జాక్సా’ వివరించింది. ప్రస్తుతం ల్యాండర్ నిద్రాణ స్థితిలో ఉంది. సౌరవిద్యుత్ తయారీ దృష్ట్యా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు వంటి వ్యోమనౌకల్ని సాధారణంగా జాబిలిపై సూర్యుడు సరిగ్గా ఉదయించే వేళల్లోనే/ప్రదేశాల్లోనే దిగేలా చూస్తుంటారు. చంద్రుడిపై పగటి సమయం (పగలు) 15 రోజులు ఉంటుంది. అలాగే రాత్రి సమయం కూడా 15 రోజుల పాటు ఉంటుంది. చంద్రుడిపై ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రదేశంలో భానుడు ప్రస్తుతం తూర్పు దిక్కు నుంచి పడమటి వైపుగా ప్రయాణం సాగిస్తున్నాడు. అక్కడ సూర్యుడు నడి నెత్తి నుంచి అంటే... మధ్యాహ్నం తర్వాత కాస్త ఆవలకు దిగి పొద్దు వాలితే గానీ ‘మూన్ స్నైపర్’ సోలార్ ప్యానెళ్లకు సూర్యరశ్మి సోకదు. సూర్యకాంతి తగిలితేనే, దాని నుంచి సౌరవిద్యుత్ తయారుచేసి వినియోగించుకోగలిగితేనే ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కోలుకున్నట్టు. జపాన్ మూన్ మిషన్ విజయవంతమైనట్టు. తమ ‘స్లిమ్’ ల్యాండర్ నుంచి చాలా డేటా సేకరించామని, త్వరలో దాన్ని వెల్లడిస్తామని ‘జాక్సా’ ప్రకటించింది. - జమ్ముల శ్రీకాంత్ -
Aditya-L1: లగ్రాంజ్ పాయింట్లోకి ఆదిత్య
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యునిపై సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో గత ఏడాది ప్రయోగించిన సోలార్ అబ్జర్వేటరీ వ్యోమనౌక ఆదిత్య ఎల్1 ఎట్టకేలకు తన తుది కక్ష్యలోకి చేరుకుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు వ్యోమనౌక తన గమ్యస్థానాన్ని చేరుకోవడంతో ఇస్రో తన అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిని దాటింది. భూమి నుంచి సూర్యునివైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్య(ఎల్1 పాయింట్)లోకి శనివారం ఆదిత్య వ్యోమనౌక చేరుకుందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. గ్రహణాల వంటి సందర్భాల్లోనూ ఎలాంటి అడ్డూలేకుండా నిరంతరంగా సూర్యుడిని చూసేలా అనువైన ఎల్1 పాయింట్లో ఉంటూ ఆదిత్య ఎల్1 అధ్యయనం చేయనుంది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్–3 సాఫ్ట్‌ల్యాండింగ్ విజయవంతమైన కొద్దినెలలకే సూర్యుడి సంబంధ ప్రయోగంలోనూ భారత్ ఘన విజయం సాధించడం విశేషం. భూమికి సూర్యునికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లుకాగా అందులో ఒక శాతం అంటే 15 లక్షల కిలోమీటర్ల దూరాన్ని లగ్రాంజ్ పాయింట్(ఎల్1)గా గణిస్తున్నారు. ఈ పాయింట్ ఉన్న హాలో కక్ష్యలో వ్యోమనౌక ఉంటే సూర్యగ్రహణం వంటి సందర్భాల్లోనూ నిరంతరంగా శూన్యంలో అంతరిక్ష వాతావరణంలో సూర్య సంబంధ శోధన చేసే సువర్ణావకాశం చిక్కుతుంది. మూన్‌వాక్ నుంచి సన్‌డ్యాన్స్ దాకా.. ‘‘ భారత్ మరో మైలురాయిని చేరుకుంది. భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ తన కక్ష్యను చేరుకుంది. సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాలను సఫలం చేస్తూ మన శాస్త్రవేత్తలు అంకితభావానికి ఈ సంఘటనే చక్కని తార్కాణం. వీరి అసాధారణ ప్రతిభకు దేశం గరి్వస్తోంది. మానవాళి సంక్షేమం కోసం నూతన శాస్త్రీయ పరిశోధనలు ఇకమీదటా ఇలాగే కొనసాగాలి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ట్వీట్ చేశారు. ‘‘ఇస్రో మరో ఘనత సాధించింది. ఈ మిషన్‌తో యావత్ మానవాళికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ మిషన్‌తో సూర్యుడు–భూమి మధ్య మనకున్న జ్ఞానాన్ని మరింత పెంచుతుంది. గొప్ప విజయం సాధించిన భారత శాస్త్రవేత్తలకు నా అభినందనలు’’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సైతం ఆనందం వ్యక్తంచేశారు. ‘‘మూన్ వాక్ నుంచి సన్ డ్యాన్స్ వరకు..!. భారత్‌కు ఎంతటి ఉజ్వల సంవత్సరమిది’’ అని ట్వీట్‌చేశారు. ‘‘ అంతరిక్షంలోనూ భారత జైత్రయాత్ర కొనసాగుతోంది’ అని హోం మంత్రి అమిత్ షా ట్వీట్‌చేశారు. ► గత ఏడాది సెపె్టంబర్ రెండో తేదీన ఆదిత్యను మోస్తూ పీఎస్ఎల్వీ–సీ57 రాకెట్ శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ► దాదాపు 63 నిమిషాల తర్వాత 235 ్ఠ19,500 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తర్వాత దాని కక్ష్యలను ఇస్రో పలుమార్లు మార్చుతూ చివరకు శనివారం తుదికక్ష్యలోకి చేర్చింది. ► దీని బరువు దాదాపు 1500 కేజీలు. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావాయిలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్–1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ అనే పేలోడ్లను ఈ ఉపగ్రహంలో అమర్చారు. -
Aditya L1: భారత తొలి సన్ మిషన్‌లో రేపు కీలక పరిణామం
బెంగళూరు: సూర్యునిపై పరిశోధనలకు భారత్ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్1 వ్యోమనౌక శనివారం(జనవరి 6)వ తేదీన ఉదయం నిర్దేశించిన కక్ష్యలోకి చేరనుంది. ఇక్కడికి చేరిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆదిత్య ఎల్1 నిరంతరం సూర్యునిపై అధ్యయనం చేయగలుగుతుంది. సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఆదిత్య ఎల్1 నాలుగు దశలు దాటి ఇప్పటికే భూమికి,సూర్యునికి మధ్యలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్‌కు చేరుకుంది. అయితే శనివారం మరో 63 నిమిషాల 20 సెకన్లు ప్రయాణించి నిర్దేశిత కక్ష్యలోకి చేరుతుంది.లాంగ్రాంజియన్ పాయింట్లో భూమి,సూర్యుని గురత్వాకర్షణ శక్తి బలాలు ఒకదానికొకటి క్యాంసిల్ అయి దాదాపు జీరో స్థితికి చేరుకుంటాయి. అంటే ఇక్కడ గ్రావిటీ ఉండదు. దీంతో సూర్యుని చుట్టూ తిరిగేందుకుగాను ఈ పాయింట్లో ఉన్న వ్యోమనౌకలకు పెద్దగా ఇంధనం అవసరం ఉండదు. ఈ కారణం వల్లే పరిశోధనలకు ఎల్1 పాయింట్ అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య ఎల్1లో ఏడు సైంటిఫిక్ పేలోడ్లు ఉంటాయి. సూర్యునిపై ఉండే ఫొటోస్పియర్, క్రోమో స్పియర్, కరోనా పొరలను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఏడు పేలోడ్లు నిరంతరం అధ్యయనం చేసి డేటాను భూమికి పంపిస్తుంటాయి. ఇదీచదవండి..టెట్రిస్ గేమ్‌ను జయించిన బాలుడు -
Chandrayaan-3: ఆ శకలంతో ఎటువంటి ప్రమాదం లేదు: ఇస్రో
బెంగళూరు: చంద్రయాన్–3 అంతరిక్ష నౌకను జూలై 14న నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడంలో కీలకమైన క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్‌లోని ఒక భాగం భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని ఇస్రో తెలిపింది. ఎల్వీఎం–3 ఎం4కు చెందిన ఈ శకలం బుధవారం మధ్యాహ్నం 2.42 సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు గుర్తించామని గురువారం ఇస్రో వివరించింది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ఇది ఉత్తర పసిఫిక్ సముద్రంలో పడే అవకాశాలున్నాయని తెలిపింది. భారత గగనతలంలోకి ప్రవేశించే అవకాశాల్లేవని ఒక ప్రకటనలో ఇస్రో స్పష్టం చేసింది. -
ఫ్లాష్ బ్యాక్: ఒక ఉపగ్రహం కూలిన వేళ
కొన్నేళ్ల క్రితం చంద్రయాన్–2ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చందమామ మీద నేలకూలి్చన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలా ఇస్రో నేలకూలి్చన శాటిలైట్లలో అదే మొదటిది కాదు. చంద్రయాన్ 1ను పదేళ్ల క్రితమే ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేసింది. అది 2008. నవంబర్ 14. మధ్యాహ్న వేళ. ఉక్కపోత చుక్కలు చూపుతోంది. గుజరాత్‌లోని రాజ్ కోట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ శివాలెత్తుతున్నాడు. మహా మహా ఇంగ్లండ్ పేస్ బౌలర్లను వీర బాదుడు బాదుతున్నాడు. కేవలం 78 బంతుల్లో అతను చేసిన 138 పరుగుల సాయంతో భారత్ మరపురాని విజయం సాధించింది. దేశమంతా సంబరాల్లో మునిగి పోయింది. కానీ, అదే సమయంలో అక్కడికి 1,600 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరులో పరిస్థితి మరోలా ఉంది. మరో దారిలేని పరిస్థితుల్లో, ఒక మినీ విస్ఫోటనానికి ఇస్రో భారంగా సిద్ధమవుతోంది. ఎందుకా విస్ఫోటనం? ఏమా కథ? అసలేం జరిగింది? చూద్దాం రండి...! 2008 అక్టోబర్ 22న చంద్రయాన్ మిషన్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. భూ కక్ష్యకు ఆవలికి శాటిలైట్‌ను పంపడం భారత్‌కు అదే తొలిసారి. అప్పటిదాకా రష్యా, అమెరికా, జపాన్, యూరప్ స్పేస్ ఏజెన్సీల పేరిట ఉన్న ఘనత అది. చంద్రునిపై నీటి ఆనవాళ్లను తొలిసారిగా ప్రపంచానికి పట్టిచి్చన ప్రయోగంగా చంద్రయాన్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే అందరికీ తెలిసిన ఈ ఘనత వెనక బయటికి తెలియని మరో గాథ దాగుంది... ప్రోబ్... కూలేందుకే ఎగిరింది చంద్రయాన్ లో భాగంగా 32 కిలోల బరువున్న మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రునిపైకి పంపింది ఇస్రో. ► 2008 నవంబర్ 17వ తేదీ రాత్రి 8 గంటల వేళ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రుని ఉపరితలం మీద కావాలనే కుప్పకూల్చేందుకు సిద్ధమైంది. ► అందులో భాగంగా చంద్రునికి దాదాపు 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ప్రోబ్ తన అంతిమ ప్రయాణానికి సిద్ధమైంది. ► చంద్రయాన్ కక్ష్య నుంచి క్రమంగా విడివడటం మొదలు పెట్టింది. ► దానిలోని స్పినప్ రాకెట్లు జీవం పోసుకుని గర్జించాయి. అయితే, ప్రోబ్ వేగాన్ని పెంచేందుకు కాదు, వీలైనంత తగ్గించేందుకు! చంద్రుని ఉపరితలం కేసి తిప్పి అనుకున్న విధంగా క్రాష్ చేసేందుకు!! ► ఎట్టకేలకు, చంద్రయాన్ మిషన్ నుంచి విడివడి అరగంటకు క్రాష్ ల్యాండ్ అయింది. ప్రోబ్ కథ అలా కంచికి చేరింది. ► తద్వారా, అంతదాకా అందరాని చందమామతో తొలిసారిగా కరచాలనం చేసి ఇస్రో కొత్త చరిత్ర సృష్టించింది. ఆ మూడింటి ముచ్చట్లు ప్రోబ్ లో మూడు పరికరాలను ఇస్రో పంపింది. అవి ఫొటోలు, వీడియోలు తీసి భూమికి పంపే వీడియో ఇమేజింగ్ సిస్టం, ప్రోబ్ చంద్రునిపైకి పడ్డ వేగాన్ని కొలిచేందుకు రాడార్ ఆల్టిమీటర్, చంద్రుని వాతావరణాన్ని విశ్లేíÙంచేందుకు మాస్ స్పెక్ట్రం మీటర్. భావికి బాటలు... కూల్చేయడమే అంతిమ లక్ష్యంగా ఇస్రో ప్రయోగించిన ’విఫల’ చంద్రయాన్ మిషన్ తర్వాతి రోజుల్లో చంద్రయాన్–2, చంద్రయాన్ –3 ప్రయోగాలకు బాటలు వేసింది. ఆగస్ట్ 23న చంద్రునిపై సగర్వంగా దిగి చంద్రయాన్–3 సాధించబోయే అంతిమ విజయం కోసం దేశమంతా ఇప్పుడు ఎదురు చూసేందుకు మూల కారణంగా నిలిచింది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
Chandrayaan 3: జాబిల్లి వైపు వడివడిగా..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చందమామపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ కక్ష్య దూరాన్ని ఐదోసారి పెంచే ప్రక్రియను బుధవారం విజయవంతంగా నిర్వహించారు. దీంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. చంద్రుడి ఉపరితలంపై దిగే కీలక ఘట్టానికి చంద్రయాన్–3 మరింత చేరువైంది. ఇక ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ వేరుకావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మిషన్ చంద్రుడి సమీప కక్ష్యలోకి(లూనార్ ఆర్బిట్) ఎలాంటి అవరోధాలు లేకుండా చేరుకుంది. చంద్రయాన్–3 ఇప్పుడు చంద్రుడి చుట్టూ 153 కిలోమీటర్లు, 163 కిలోమీటర్ల స్వల్ప దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. అలాగే చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరుకుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను వేరుచేసే విన్యాసాన్ని ఈ నెల 17న చేపట్టనున్నట్లు ఇస్రో తెలియజేసింది. నేటి నుంచే ముఖ్యమైన ఆపరేషన్ బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంప్లెక్స్(ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) లాంటి భూ నియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం నుంచి ముఖ్యమైన ఆపరేషన్లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తర్వాత ల్యాండర్లో వున్న ఇంధనాన్ని మండించి ఈ నెల 19, 21న రెండుసార్లు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టనున్నారు. ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్! -
సెప్టెంబర్‌లో ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చందమామపై పరిశోధనల కోసం చంద్రయాన్–3 మిషన్‌ను ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఆదిత్య–ఎల్1 పేరిట అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది. సెపె్టంబర్ మొదటివారంలో ప్రయోగం ఉటుందని ఇస్రో సోమవారం వెల్లడించింది. ఆదిత్య–ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్ బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి శ్రీహరి కోటలో ఉన్న ‘షార్’కు చేరుకుంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగిస్తారు. ఇక్కడి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో మూడు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేశారు. ఆదిత్య–ఎల్1కు క్లీన్‌రూంలో పరీక్షల అనంతరం రాకెట్ శిఖరభాగంలో అమర్చుతారు. ప్రయోగం ద్వారా సూర్యుడు–భూమి వ్యవస్థలోని లాంగ్రేంజ్ పాయింట్ 1(ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఇది భూమికి 10.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనానికి అడ్డంకులుండవని సైంటిస్టులు చెబుతున్నారు. -
చంద్రునిపై కూలిన జపాన్ వ్యోమనౌక!
టోక్యో: జపాన్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ ఐస్పేస్ ప్రయోగించిన ల్యాండర్ మంగళవారం చంద్రునిపై దిగే క్రమంలో కుప్పకూలినట్టు సమాచారం. చంద్రుని ఉపరితలానికి కేవలం 10 మీటర్ల దూరంలో ఉండగా దానితో సంబంధాలు తెగిపోయాయి. 6 గంటలకు పైగా విఫలయత్నం చేసిన అనంతరం, చివరి అంకంలో ల్యాండర్ చంద్రున్ని ఢీకొట్టి కుప్పకూలిందని ఐస్పేస్ ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై ల్యాండర్‌ను దించిన తొలి ప్రైవేట్ కంపెనీగా అది చరిత్రకెక్కేది. ఇంతటితో కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నిస్తామని దాని సీఈఓ హకమడ ప్రకటించారు. -
నేడే ఓరియాన్ రాక
వాషింగ్టన్: చంద్రునిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆర్టెమిస్ 1 ద్వారా దాదాపు నెల క్రితం ప్రయోగించిన ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా పని పూర్తి చేసుకుని తిరిగి రానుంది. ఏకంగా 13 లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఎట్టకేలకు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి భూమిని చేరనుంది. అయితే ఇది ఆద్యంతం హై రిస్కుతో కూడుకున్న తిరుగు ప్రయాణమని నాసా చెబుతోంది. ఎందుకంటే భూ వాతావరణంలోకి ప్రవేశించాక ఓరియాన్ ఏకంగా గంటకు పాతిక వేల మైళ్ల వేగంతో దూసుకురానుంది. ఈ క్రమంలో ఏర్పడే ఘర్షణ వల్ల ఏకంగా 2,760 డిగ్రీల వేడి కూడా పుట్టుకొస్తుంది. అంటే సూర్యునిపై ఉండే వేడిలో సగం! అంతటి వేగాన్ని, వేడిని తట్టుకుంటూ ఆర్టెమిస్ పసిఫిక్ మహాసముద్రంలో కాలిఫోర్నియాలోని శాన్ డియాగో వద్ద తీరానికి దాదాపు 50 మైళ్ల దూరంలో క్షేమంగా దిగాల్సి ఉంటుంది. ఇది పెను సవాలేనని నాసా సైంటిస్టులంటున్నారు. అందుకే వారిలో ఇప్పట్నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైగా ఓరియాన్ ల్యాండింగ్ కోసం నాసా తొలిసారిగా ‘స్కిప్ ఎంట్రీ’ టెక్నిక్‌ను వాడుతుండటం ఉత్కంఠను మరింత పెంచుతోంది. దీనిప్రకారం నీళ్లలోకి విసిరిన రాయి మాదిరిగా ఓరియాన్ భూ వాతావరణం తాలూకు పై పొరలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా దాని అపార వేగం చాలావరకు తగ్గడమే గాక వేడి కూడా అన్నివైపులకూ చెదిరిపోతుందట. అంతిమంగా ఓరియాన్ వేగాన్ని గంటకు 20 మైళ్లకు తగ్గించాలన్నది లక్ష్యం. ఇందుకోసం 11 భిన్నమైన పారాచూట్లను వాడనున్నారు. అయితే వేగం అదుపులోకి వచ్చేలోపు 2,760 డిగ్రీల వేడిని ఓరియాన్ ఏ మేరకు తట్టుకుంటుందన్నది అత్యంత కీలకం. ‘‘దీనికి ప్రస్తుతానికి మా దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే, ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం’’ అని నాసా సైంటిస్టు ఒకరు చెప్పుకొచ్చారు. ఆ అపార వేడిని సమర్థంగా తట్టుకునేందుకు రక్షణ పరికరాల ఉత్పత్తి దిగ్గజం లాక్‌హీడ్–మార్టిన్ తయారు చేసిన అత్యంత మందమైన హీట్ షీల్డ్‌ను ఓరియాన్కు అమర్చారు. ఆ ఏడు నిమిషాలే కీలకం...: ఓరియాన్ భూ వాతావరణంలోకి ప్రవేశించాక తొలి ఏడు నిమిషాలను అత్యంత కీలకమైనవిగా నాసా అభివర్ణిస్తోంది. ఆ సందర్భంగా కనీసం 10 నిమిషాల పాటు స్పేస్‌క్రాఫ్ట్‌తో అన్నిరకాల సమాచార సంబంధాలూ తెగిపోతాయని చెబుతోంది. -
సూర్యుడికి ఆయుక్షీణం
లండన్: జగతికి వెలుగునిస్తూ భూగోళంపై జీవజాలం మనుగడకు ఆధారభూతమైన సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందట. సూర్యగోళం జీవితకాలం మరో 457 కోట్ల సంవత్సరాలేనని, ఆ తర్వాత అదొక కాంతిహీనమైన తెల్లటి మరుగుజ్జు గ్రహంగా మిగిలిపోతుందని యూరోపియన్ అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) చెబుతోంది. భానుడి జీవితకాలం సగం ముగిసిపోయిందని, మరో సగమే మిగిలి ఉందని పేర్కొంటోంది. ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. అంతరిక్ష పరిశోధనల కోసం ఈఎస్ఏ ప్రయోగించిన గైయా స్పేస్ అబ్జర్వేటరీ(స్పేస్‌క్రాఫ్ట్) భానుడి జీవితకాలాన్ని లెక్కగట్టింది. మన సౌర వ్యవస్థలో కేంద్ర స్థానంలో ఉన్న సూర్యుడు నిరంతరం మండే ఓ అగ్నిగోళం. అందులో సౌర తుపాన్లు సంభవిస్తుంటాయి. అత్యధిక శక్తి వెలువడుతుంది. సూర్యుడి ఆయువు క్షీణిస్తుండడానికి కారణం ఏమిటంటే.. అందులోని హైడ్రోజన్ నిల్వలే. సూర్యుడి ఉపరితలం ఉన్న హైడ్రోజన్ హీలియం వాయువులో సంలీనం చెందుతూ ఉంటుంది. ఫలితంగా ఉష్ణం ఉద్గారమవుతుంది. భవిష్యత్తుతో హైడ్రోజన్ హీలియంలో సంలీనం చెందకుండా సూర్యుడి కేంద్ర స్థానం వైపు వెళ్తుందట! దాంతో సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతాయి. సూర్యగోళం మొత్తం వయసు 10,110 కోట్ల సంవత్సరాలు అనుకుంటే, 800 కోట్ల సంవత్సరాల వయసు నాటికి గరిష్ట ఉష్ణోగ్రతకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అనంతరం ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, పరిమాణం తగ్గిపోతుందని చెబుతున్నారు. -
అంతరిక్షంలో తెలుగు ధీర
అంతరిక్షం అచ్చ తెలుగులో ‘నమస్కారం’ అనే పలకరింపు విననుంది. కోట్లాదిమంది తెలుగువారి చారిత్రక, జీవన పరంపరకు ప్రతినిధిగా ఒకరు తన వద్దకు వచ్చినందుకు అది విస్మయపు ముచ్చటపడనుంది. యుగాలుగా తల ఎత్తి తెలుగువారు దిగంతాలలో చూపు గుచ్చి ఉంటారు. ఇవాళ పై నుంచి ఒక తెలుగమ్మాయి మనకు చేయి ఊపి హాయ్ చెప్పనుంది. అవును. చరిత్రలో తొలిసారిగా తెలుగు ధీర శిరీష బండ్ల అంతరిక్ష ప్రయాణం కట్టనుంది. అంతరిక్షయానం చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఇది సామాన్యుల ఊహకు అందేది కాదు. శ్రీమంతులు అందుకోగల ఆలోచనా కాదు. అంతరిక్ష శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు మాత్రమే సాధ్యమయ్యే ఈ జాబితాలో ‘కమర్షియల్ స్పేస్‌క్రాఫ్ట్’ ద్వారా ఇటీవల అత్యంత సంపన్నులు చేరుతున్నారు. టెస్లా సి.ఇ.ఓ ఎలాన్ మస్క్ నుంచి అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వరకూ అంతరిక్షం అంచులు తాకాలనువారు ఈ రేస్‌లో ఉన్నారు. అటువంటిది– ఈ అద్భుత ప్రయాణం చేసే అవకాశం మన తెలుగింటి అమ్మాయి బండ్ల శిరీషకు దక్కింది. ఇది ఒక చరిత్రాత్మక అవకాశం. తెలుగువారి చరిత్రలో తొలి అంతరిక్ష యానం చేసిన వ్యక్తిగా/మహిళగా బండ్ల శిరీష ఎప్పటికీ నిలిచిపోతుంది. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్తో కలిసి మరో తొమ్మిదిరోజుల్లో శిరీష రోదసిలో అడుగుపెట్టబోతోంది. చీరాలలో పుట్టింది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాపర్ల వెంకట నరసయ్య, రమాదేవిల కుమార్తె అనూరాధ సంతానం శిరీష. అనురాధ భర్త డాక్టర్ బండ్ల మురళీధర్ ఒక్లహామా స్టేట్ యూనివర్సిటీలో ప్లాంట్ వైరాలజీలో పీహెచ్డీ చేసి అమెరికాలో స్థిరపడడంతో చీరాలలో పుట్టిన శిరీష నాలుగేళ్ల వయసులో తన అక్క ప్రత్యూషతో అమెరికా వెళ్లింది. శిరీష విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. చిన్నప్పటి నుంచి స్పేస్సైన్స్ను అమితంగా ఇష్టపడే శిరీష పర్డ్యూ యూనివర్సిటిలో ఏరోనాటికల్ అండ్ అస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ అయ్యాక కమర్షియల్ స్పేస్‌ఫ్లైట్ ఫెడరేషన్ (సీఎస్ఎఫ్)లో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా పనిచేస్తూ అధునాతన విమాన విడిభాగాలను రూపొందించేది. మరోపక్క జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది.‡ఈ క్రమంలోనే 2015లో రిచర్డ్ బాన్సన్ ‘స్పేస్‌ఫ్లైట్’ సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా చేరిన అంచెలంచెలుగా ఎదిగి పరిశోధనా విభాగంలో వైస్‌ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహిస్తోంది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తో్తన్న వర్జిన్ ఆర్బిట్ వ్యహారాలను చూస్తూ, మరోపక్క అమెరికన్ ఆస్ట్రోనాటికల్ అండ్ ఫ్యూచర్ స్పేస్ లీడర్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్లలో సభ్యురాలిగా, పర్డ్యూ యూనివర్సిటీ యంగ్ ప్రొఫెషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యురాలిగా ఉంది. ఫలితంగా ఆమెకు అంతరిక్షయానం అవకాశం దక్కింది. బ్రాన్సన్తో కలిసి వర్జిన్ గెలాక్టిక్ నిర్వహించనున్న నాలుగో స్పేస్ ట్రిప్పులో వర్జిన్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తనతో కలిపి మొత్తం ఆరుగురు టీమ్‌తో పాల్గొననున్నాడు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు పైలట్లు, ముగ్గురు స్పేస్ స్పెషలిస్టులు ఉన్నారు. శిరీష ఈ స్పేస్ స్పెషలిస్టుల్లో ఉంది. ఈ నెల 11వ తేదీన తెల్లవారుజామున వీరి స్పేస్‌క్రాఫ్ట్ న్యూమెక్సికో నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనితో అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ప్రైవేటు ధనిక వ్యక్తిగా రిచర్డ్ బ్రాన్సన్, స్పేస్‌లో అడుగుపెట్టిన తొట్టతొలి తెలుగమ్మాయిగా శిరీషలు చరిత్ర సృష్టించనున్నారు. కల్పనా చావ్లా తర్వాత భారత్‌లో పుట్టి స్పేస్‌లో అడుగుపెట్టబోతున్న రెండో మహిళగానూ, రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తరువాత భారత సంతతి నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో వ్యోమగామిగా శిరీష నిలవడమే గాక ఈ మిషన్‌లో వెన్నెముకగా పనిచేయనుంది. ఈ క్రూ టీమ్‌లో శిరీషతోపాటు బెత్ మోసెస్ అనే మరో మహిళ కూడా ఉన్నారు. నా మనసంతా అంతరిక్షమే ‘‘నేను చిన్నప్పటి నుంచి వ్యోమగామి అయి అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకునేదాన్ని. ఎప్పుడూ అందుకు సంబంధించిన ఆలోచనలతో నా మనసు నిండిపోయి ఉండేది. హ్యూస్టన్‌లో మా ఇంటికి దగ్గర్లో జాన్సన్ స్పేస్ సెంటర్ ఉండేది. ఆ సెంటర్‌ను సందర్శించినప్పుడల్లా నా కోరిక మరింత బలపడేది. ముందు పైలట్ అవ్వాలి ఆ తర్వాత నాసాలో వ్యోమగామి అవ్వాలి అనుకుని ఆ దిశగా అడుగులు వేద్దామనుకున్నాను. కానీ స్కూల్లో ఉన్నప్పుడే నా కంటి చూపు సరిగా ఉండేది కాదు. దీంతో పైలట్టే కాదు ... ఆస్ట్రోనాట్ కూడా కాలేను అనుకున్నాను. అయితే 2004లో తొలి ప్రైవేటు వాహనం అంతరిక్షంలోకి వెళ్లిందని తెలిసి నాసా ద్వారానే కాదు వ్యోమగామి అయ్యేందుకు మరో మార్గం ఉందనిపించింది. దీంతో అప్పుడు ఏరో స్పేస్ ఇంజినీర్ అయ్యి వాణిజ్య స్పేస్ సెక్టార్లో పని చేయవచ్చని అనుకున్నాను. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివేటప్పుడు మైక్రో గ్రావిటీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఆ తరువాత నేను సీఎస్‌ఎఫ్‌లో చేసిన ఉద్యోగానుభవం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా చిన్ననాటి కల ఈరోజు తీరనున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ శిరీష గతంల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. తాతయ్య మాట ‘శిరీషకు ఊహ తెలిసినప్పటి నుంచి అంతరిక్షంపై ఆసక్తి కనపరిచేది. వయసుతోపాటు, ఆకాశం, విమానాలు, రాకెట్లపై ఆసక్తి పెరుగుతూనే వచ్చింది. నాలుగేళ్ల వయసులో ఓ రోజు ఇంట్లో కరెంటు పోతే ఒంటరిగా భయపడుతోన్న అమ్మమ్మకు ధైర్యం చెప్పింది’ అని తాతయ్య నరసయ్య సాక్షితో చెప్పారు. ‘2016లో మా వివాహ స్వర్ణోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి శిరీష ఇక్కడకు వచ్చింది. చదువు, ఉద్యోగంతో ఎంత బిజీగా ఉన్నా తరచూ ఫోనులో మా యోగక్షేమాలు తెలుసుకునేది. చిన్నపిల్లగానే మాకు తెలిసిన శిరీష ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లనుందని చెబుతుంటే ఆశ్చర్యంగా, అంతకుమించిన సంతోషంగా ఉంది’ అన్నారు. – పి.విజయ, సాక్షి ఫీచర్స్ డెస్క్ ఇన్పుట్స్: బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి -
అంతరిక్ష ప్రయోగాలు.. చైనా మరో ముందడుగు
బీజింగ్: అంతరిక్షంలో పాగా వేయాలని భావిస్తున్న చైనా ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మర చేస్తుంది. ఇప్పటికే స్పేస్‌స్టేషన్ నిర్మాణం తలపెట్టని చైనా మరో ముందడుగు వేసింది. నిర్మాణంలో ఉన్న స్పేస్‌స్టేషన్‌లోకి ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్తున్న అంతరిక్ష నౌకను గురువారం ప్రయోగించింది. ఈ ముగ్గురిని టియాంగాంగ్ స్టేషన్ నుంచి లాంగ్ మార్చి -2 ఎఫ్ రాకెట్ ద్వారా స్పేస్ స్టేషన్లోకి పంపించారు. అక్కడ వారు మూడు నెలలు గడుపుతారు. చైనా గోబి ఎడారిలో ప్రయోగించిన ఈ రాకెట్ గురువారం ఉదయం 9.22 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. చైనా తన సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోన్న స్పేస్ స్టేషన్ పూర్తి చేసే క్రమంలో షెన్‌జౌ -12.. 11 మిషన్లలో మూడవది. వీటిలో నాలుగు బృందాలు ఉంటాయి. మూడు మాడ్యూళ్ళలో మొదటిది, అతిపెద్దది అయిన టియాన్హే ప్రారంభించడంతో ఏప్రిల్‌లో స్పేస్ స్టేషన్ నిర్మాణం ప్రారంభమైంది. వ్యోమగాములు నీ హైషెంగ్(56), లియు బోమింగ్(54), టాంగ్ హాంగ్బో(45), భవిష్యత్ అంతరిక్ష కేంద్ర నివాస గృహమైన టియాన్హేలో మూడు నెలలు పని చేయవలసి ఉంటుంది. చైనా షెన్‌జౌ -12 అంతరిక్ష నౌక ఏప్రిల్ 29 న భూమికి 340 నుంచి 450 కిమీ ఎత్తులో ఒక నిర్ధిష్ట కక్ష్యలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోని టియాన్హె ప్రధాన విభాగంతో డాక్ అవుతుంది. మాడ్యుల్లో ప్రతి దానికి ప్రత్యేక లివింగ్ స్పేస్, వ్యాయామం కోసం ట్రెడ్మిల్, గ్రౌండ్ కంట్రోల్‌తో ఈమెయిల్, వీడియో కాల్ల కోసం కమ్యూనికేషన్ సెంటర్ సదుపాయం ఉంది. మిషన్ కోసం తయారు కావడానికి, సిబ్బంది 6,000 గంటలకు పైగా శిక్షణ పొందారు. చైనా అంతరిక్ష సంస్థ వచ్చే ఏడాది చివరి వరకు మొత్తం 11 ప్రయోగాలను ప్లాన్ చేస్తోంది, వీటిలో మరో మూడు మిషిన్లలో మనుషులను తీసుకెళ్లనున్నారు. ఇవి 70 టన్నుల స్టేషన్‌ను విస్తరించడానికి రెండు ల్యాబ్ మాడ్యూళ్లను, సిబ్బందిని తీసుకెళ్తాయి. వీరు ఆన్‌బోర్డ్‌లో వ్యవస్థలను పరీక్షించి, స్పేస్ వాక్‌ను నిర్వహిస్తారు, శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. చదవండి: అంతరిక్షంపై డ్రాగన్ నజర్...! -
గ్రహశకలంపై వాలిన ఒసిరిస్ రెక్స్
వాషింగ్టన్: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన రోబోటిక్ అంతరిక్ష నౌక ఒసిరిస్ రెక్స్ విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై వాలింది. మంగళవారం ఉదయం 6.12 గంటలకు అమెరికాలోని కొలరాడోలోని డెన్వర్ ప్రాంతంలో ఉన్న లాక్‌హీడ్ మార్టిన్ స్పేస్ సెంటర్ నుంచి ఒసిరిస్ రెక్స్‌ను గ్రహశకలంపై దింపగలిగారు. ‘నేలపై వాలడం పూర్తయింది’అన్న ప్రకటన వినగానే కేంద్రంలోని శాస్త్రవేత్తలందరూ హర్షధ్వానాలు చేశారు. భూమికి సుమారు 33 కోట్ల కిలోమీటర్ల దూరంలోని రోబోటిక్ అంతరిక్ష నౌకను నియంత్రించడం, దానితో బెన్నూ గ్రహశకలం నమూనాలను సేకరించడం అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు!. నాసా సుమారు పన్నెండేళ్లుగా ఈ ప్రాజెక్టుపై పనిచేస్తూండగా బెన్నూ గ్రహశకలంపై వాలి కేవలం 16 సెకన్ల కాలంలో నమూనాలు సేకరించింది. ఓ మినీ వ్యాన్ అంత సైజుండే ఒసిరిస్ 11 అడుగుల పొడవైన రోబోటిక్ చేతితో బెన్నూ ఉత్తర ధ్రువ ప్రాంతంలోని రాళ్లను సేకరించి ఆ వెంటనే గ్రహశకలం నుంచి వేరుపడింది. ఈ నమూనాల ఫొటోలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. రానున్న ఏడు రోజుల్లో ఈ ఫోటోలు నాసాకు చేరనుండగా.. వాటి ఆధారంగా మరిన్ని నమూనాలను సేకరించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు. 60 గ్రాముల నుంచి 2 కిలోల వరకూ... బెన్నూ గ్రహశకలం నుంచి అరవై గ్రాముల నుంచి రెండు కిలోగ్రాముల వరకూ రాతి నమూనాలను సేకరించాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. కర్బనం ఎక్కువగా ఉండే ఈ రాళ్ల ద్వారా మన సౌర కుటుంబం పుట్టుకకు సంబంధించిన రహస్యాలు తెలుసుకోవచ్చు. మంగళవారం నాటి ప్రయోగం అంతా అనుకున్నట్లుగానే సాగిందని, ఒసిరిస్ రెక్స్ చేయి పీడనంతో కూడిన వాయువును విడుదల చేయడం ద్వారా నమూనాలను సేకరించిందని ప్రాజెక్టు పర్యవేక్షకుడు డాంటే లారెట్టా తెలిపారు. -
నింగిలోకి తొలి అరబ్ స్పేస్ మిషన్
టోక్యో : రెడ్ ప్లానెట్ గుట్టుమట్లను ఆవిష్కరించేందుకు అంగారక గ్రహానికి తొలి అరబ్ స్పేస్ మిషన్ హోప్‌ను జపాన్ నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అభివృద్ధి చేసిన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను సోమవారం ఉదయం జపాన్ రాకెట్ అంతరిక్షంలోకి విజయవంతంగా మోసుకెళ్లిందని అధికారులు తెలిపారు. అరబిక్‌లో అల్-అమల్‌గా పేరొందిన ఈ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. ప్రయోగం జరిగిన గంటతర్వాత స్పేస్‌క్రాఫ్ట్ రాకెట్ నుంచి విడిపోయి నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశించిందని రాకెట్ తయారీ సంస్థ మిట్సుబిషి హెవీ ఇండస్ర్టీస్ పేర్కొంది. తమ స్పేస్‌మిషన్ యూఏఈ సహా ఈ ప్రాంతానికి కీలక మైలురాయి వంటిదని మహ్మద్ బిన్ రషీద్ స్సేస్ సెంటర్ డైరెక్టర్ హమద్ అషియబని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి హోప్ అంగారక గ్రహంపై అడుగుపెడుతుందని భావిస్తున్నారు. అంగారక గ్రహంపైకి తొలి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపడంపై యూఏఈ ప్రభుత్వం ట్విటర్లో స్పందిస్తూ ఇది అరబ్ ప్రాంతానికి గర్వకారణంతో పాటు సరికొత్త ఆశలు చిగురింపచేసేదని వ్యాఖ్యానించింది. హోప్ మిషన్ ప్లానెట్‌పై ప్రత్యేక అంశాలను ఆవిష్కరిస్తుందని మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఒమ్రన్ షరాఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2021 సెప్టెంబర్‌లో హోప్ మిషన్ భూమండలానికి సమాచారాన్ని చేరవేస్తుందని, ఈ సమాచారం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు అథ్యయనం కోసం అందుబాటులో ఉండనుంది. చదవండి : అంగారక గ్రహ ఆనవాళ్లను కళ్ళకు కడుతూ... -
చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
వాషింగ్టన్: అంతరిక్షయానంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రైవేటు కంపెనీ స్పేస్ ఎక్స్ నిర్మించిన వ్యోమనౌక తొలిసారి రోదసిలోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.22 గంటలకు లాంచ్ ప్యాడ్ 39ఏ నుంచి క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను మోసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్9 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. అమెరికాకు చెందిన వ్యోమగాములు బాబ్ బెహంకన్ (49), డో హార్లీ (53)లను తీసుకొని ఈ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బయల్దేరింది. నింగిలోకిదూసుకెళ్లిన 19గంటల తర్వాత ఐఎస్ఎస్కు చేరుకుంది. నలుపు తెలుపు రంగుల్లో బుల్లెట్ ఆకారంలో ఉన్న డ్రాగన్ కాప్సూ్యల్ నింగికి ఎగరడానికి ముందు ‘లెట్స్ లైట్ దిస్ క్యాండిల్’అంటూ వ్యోమగామి హార్లీ ఉద్నిగ్నంగా అరిచి చెప్పారు. ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములతో వీరూ పనిచేస్తారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో జరిగిన ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అధ్యక్షుడు ట్రంప్ నేరుగా వీక్షించారు. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్‌తో ట్రంప్ ముచ్చటించారు. ఆయనని ఒక మేధావి అంటూ ప్రశంసించారు. ఒక ప్రైవేటు సంస్థ వ్యోమగాముల్ని తీసుకొని రోదసి యాత్ర చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా ప్రభుత్వాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. అగ్రరాజ్యానికి ఊరట కరోనా వైరస్ విజృంభణతో లక్ష మందికిపైగా మరణించడం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయిన తరుణంలో స్పేస్ ఎక్స్ సాధించిన విజయం అగ్రరాజ్యానికి బాగా ఊరటనిచ్చింది. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక వాయిదా పడింది. 2011 తర్వాత మానవసహిత అంతరిక్ష ప్రయాణాలు అమెరికా నేల మీద నుంచి జరగలేదు. చంద్రుడు, అంగారకుడిపైకి మనుషుల్ని పంపే ప్రయోగాలపైనే నాసా దృష్టి సారించింది. రష్యాకు చెందిన సూయజ్ అంతరిక్ష నౌకలో అమెరికా వ్యోమగాముల్ని రోదసిలోకి పంపిస్తోంది. ఇంచుమించుగా దశాబ్దం తర్వాత అమెరికా గడ్డ మీద నుంచి ఒక ప్రైవేటు సంస్థ రోదసిలోకి మనుషుల్ని పంపడంతో అమెరికా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నట్టయింది. స్పేస్ ఎక్స్.. అంగారక గ్రహంపై నివసించడానికి వీలుగా కాలనీలు నిర్మించాలని, అంతరిక్ష ప్రయాణానికయ్యే వ్యయ భారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రారంభమైంది. అమెరికాకు చెందిన బిలియనీర్ ఎలన్ మస్క్ 2002లో కాలిఫోర్నియాలో ఈ సంస్థను ప్రారంభించారు. అప్పట్నుంచి వ్యోమనౌకల తయారీ పనులు, ఇతర అంతరిక్ష పరిశోధనల్లో ఈ సంస్థ నిమగ్నమైంది. 2011 తర్వాత ఐఎస్ఎస్ కేంద్రానికి సరకు రవాణా చేసిన అనుభవం కూడా ఉంది. ప్రయోగ బృందంలో భారతీయుడు ఈ మధ్య కాలంలో చరిత్ర సృష్టించే అన్ని ప్రయోగాల్లోనూ భారత్ భాగస్వామ్యం ఏదో విధంగా ఉంటోంది. అలాగే స్సేస్ ఎక్స్ డెమో–2 ప్రయోగంలోనూ భారత ఇంజనీర్ ఒకరు ఉండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పేస్ క్రూ ఆపరేషన్స్ అండ్ రీసోర్సెస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాల రామమూర్తి ఈ ప్రయోగం సమయంలో కెన్నడీ లాంచ్ కంట్రోల్ సెంటర్ ఫైరింగ్ రూమ్ 4లో విధులు నిర్వర్తించారు. చెన్నైకి చెందిన రామమూర్తి అన్నా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తొమ్మిదేళ్లుగా ఆయన స్పేస్ ఎక్స్‌లో పనిచేస్తున్నారు. ఇవాళ అద్భుతమైన రోజు. దేశం సంక్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ స్పేస్ ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అందుకే నేను స్వయంగా దీనిని వీక్షించడానికి వచ్చాను. నాసాకు, ఎలన్ మస్క్‌కు అభినందనలు. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు పట్టరాని భావోద్వేగంతో నోట మాట రావడం లేదు. నేను కన్న కలలు, స్పేస్ ఎక్స్‌లో ప్రతీ ఒక్కరి కల నిజమైన రోజు. స్పేస్ ఎక్స్ బృందం చేసిన కృషితో అత్యుత్తమ ఫలితాన్ని సాధించింది. నాసా, ఇతర భాగస్వాముల సహకారంతో ఇది సాధ్యమైంది. ఎలన్ మస్క్, స్పేస్ ఎక్స్ సీఈవో నింగిలోకి దూసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్ -
ఆస్టరాయిడ్ సమీపానికి నాసా నౌక
వాషింగ్టన్: ఉత్తరార్థగోళంలోని బెన్ను గ్రహశకలంలోని అగ్ని పర్వత ప్రాంతమైన నైటింగేల్‌కు 620 మీటర్ల దూరంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ఓస్రిస్ రెక్స్ అంతరిక్ష నౌక విహరించింది. నౌక తన 1.2 కిలోమీటర్ల కక్ష్యను వదిలేసి 11 గంటల పాటు ఆస్ట రా యిడ్ చుట్టూ తిరిగిందని అమెరికాలోని గోడార్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్లోని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వచ్చే ఆగస్టులో అంతరిక్ష నౌక నైటింగేల్ ప్రాంతం నుంచి న మూనాలను సేకరించనుంది. ఈ అంతరిక్ష నౌక 250 మీటర్ల దగ్గరగా రెండుసార్లు ఆస్టరాయిడ్ చుట్టూ తిరుగు తుందని తెలిపింది. -
నేలకు దిగిన బోయింగ్ ఆశలు!
కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో నింగిలోకి దూసుకెళ్లిన బోయింగ్ కంపెనీ స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌక ఆదివారం న్యూమెక్సికోలోని ఎడారిలో సురక్షితంగా ల్యాండైంది. అయితే అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లకుండానే వెనుదిరిగి రావడంతో వచ్చే ఏడాది వ్యోమగాములతో చేయాల్సిన ప్రయోగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కిందకు దిగే క్రమంలో మూడు పారాచ్యూట్లు తెరుచుకోవడంతోపాటు ఎయిర్‌బ్యాగులు కూడా సరిగా పనిచేయడం వల్ల సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. వారం రోజులకు పైగా అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సిన నౌక.. కేవలం ప్రయోగించిన రెండు రోజులకే వెనుదిరగాల్సి వచ్చింది. సురక్షిత ల్యాండింగ్ కావడం కొంతమేర సానుకూల అంశం. నాసా భాగస్వామ్యంతో నిర్మించిన స్టార్‌లైనర్ క్యాప్సూ్యల్ డమ్మీ అంతరిక్ష నౌకను మానవరహితంగా ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ప్రయోగించారు. అట్లాస్–5 రాకెట్‌తో నింగిలోకి ఎగిరిన స్టార్‌లైనర్ 15 నిమిషాలకు దాని నుంచి వేరుపడింది. అయితే ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తమ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్య నుంచి దారి తప్పిందంటూ బోయింగ్ ట్వీట్ చేసింది. దాన్ని సరైన కక్ష్యలోకి తెచ్చే ప్రయత్నాల్లో తాము నిమగ్నమైనట్లు తెలిపింది. వచ్చే ఏడాది వ్యోమగాములను స్టార్‌లైనర్ ద్వారా అంతరిక్ష యాత్రకు పంపాలని సంకల్పించిన క్రమంలో తాజా వైఫల్యం తీవ్ర ఆందోళన కలిగించే అంశం కానుంది. వచ్చే ఏడాది స్టార్‌లైనర్ కాప్సూ్యల్లో ముగ్గురు వ్యోమగాములను పంపేందుకు బోయింగ్ సన్నాహాలు చేస్తోంది. -
ఆ ప్రపంచం.. అరుదైన ఆకారం
వాషింగ్టన్: ‘అల్టిమా తులే’ మన భూమికి సుమారు 400 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న మనలాంటి ఓ చిన్న ప్రపంచం. దీని ఆకారానికి సంబంధించిన కొత్త విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు వారు ఊహిస్తున్న దానికంటే అనేక రెట్లు సమాంతరంగా ఉన్నట్లు నాసా హారిజాన్స్ స్పేస్‌క్రాఫ్ట్ పంపిన తాజా చిత్రాల్లో వెల్లడైంది. అల్టిమా తులేకు అతి సమీపంలోకి వెళ్లిన సమయంలో హారిజాన్స్ ఈ చిత్రాలను తీసింది. ఒక క్రమపద్ధతిలో తీసిన ఈ చిత్రాలు అల్టిమాకు సంబంధించిన ఆకారాన్ని స్పష్టంగా కనుగొన్నట్లేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను ఇంతకుముందు తీయలేదని అమెరికాలోని సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఈ మిషన్ ముఖ్య పరిశోధకులు అలన్ స్ట్రెన్ తెలిపారు. -
సూర్యుడికి అత్యంత చేరువలో ‘పార్కర్’
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘పార్కర్’ అంతరిక్ష నౌక సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లి రికార్డు సృష్టించింది. మానవుడు తయారు చేసిన ఓ వస్తువు సూర్యుడికి చాలా సమీపానికి వెళ్లడం ఇదే తొలిసారని నాసా వెల్లడించింది. అంతరిక్ష వాతావరణంపై సూర్యుడి ఉపరితల వాతావరణం చూపే ప్రభావం తదితర రహస్యాలను చేధించేందుకు ఈ ఏడాది ఆగస్టు 12న ‘పార్కర్’ను ప్రయోగించారు. అక్టోబర్ 29 నాటికి సూర్యుడి ఉపరితలానికి ఈ పార్కర్ 4.2 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నట్లు పార్కర్ సోలార్ ప్రోబ్ బృందం లెక్కించింది. 1976 ఏప్రిల్‌లో జర్మన్–అమెరికన్ హీలియోస్–2 అంతరిక్ష నౌక సూర్యుడికి సమీపంలోకి వెళ్లి రికార్డు సృష్టించింది. పార్కర్ దూసుకెళ్తున్న కొద్దీ తన రికార్డును తానే బద్దలు కొడుతుందని, చివరికి సూర్యుడికి 61.6 లక్షల కిలోమీటర్ల దూరంలో ఆగుతుందని, 2024లో ఈ అద్భుతం చోటు చేసుకునే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. -
సూర్యుడిపై ప్రయోగానికి నాసా సిద్ధం
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక ఘట్టం మరి కొద్ది రోజుల్లో ఆవిష్కృతం కానుంది. సూర్యుడి వాతావరణాన్ని శోధించేందుకు గాను ‘పార్కర్ సోలార్ ప్రోబ్’అంతరిక్ష నౌకను వచ్చే నెల 6వ తేదీలోపు ప్రయోగించేందుకు నాసా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటివరకు ఎవరూ చేపట్టని ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు నాసా కృషి చేస్తోంది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ డెల్టా–4 హెవీ లాంచింగ్ వెహికల్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక కూడా ప్రవేశించని సూర్యుడి కరోనా కక్ష్యలో ఈ నౌక పరిభ్రమించనుంది. ఆ ప్రాంతంలో ఉండే వేడి, రేడియేషన్‌ను తట్టుకుని సౌర గాలులు ఏర్పడటానికి గల ప్రాథమిక కారణాన్ని కనుగొననుంది. సంపూర్ణ సూర్య గ్రహణ సమయంలో సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కప్పడంతో వృత్తాకారంగా కనిపించే సూర్యుడి రూపమే ఈ కరోనా. మరో విధంగా చెప్పాలంటే సూర్యుడి బాహ్యవలయం. ఏళ్లుగా శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న అనేక ప్రశ్నలకు కొత్త ప్రయోగం ద్వారా ఈ కరోనా ప్రాంతంలో సమాధానాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
అంగారకుడిపైకి ‘ఇన్సైట్’
వాండెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ (అమెరికా): అంగారకుడిపై దిగి గ్రహాంతర్భాగాలను అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శనివారం ‘ఇన్సైట్’ అనే అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.35 గంటలకు అట్లాస్ వీ రాకెట్ సహాయంతో ఇన్సైట్ ల్యాండర్ అరుణ గ్రహం దిశగా దూసుకెళ్లింది. అమెరికా పశ్చిమ తీర ప్రాంతం నుంచి నాసా చేపట్టిన మొట్టమొదటి ఇంటర్‌ప్లానెటరీ ప్రయోగమిది. అన్నీ సజావుగా సాగితే ఈ ఏడాది నవంబర్ 26 నాటికి గ్రహం ఉపరితలంపై ఇన్సైట్ దిగనుంది. ‘ఇన్సైట్’ పూర్తి పేరు ఇంటీరియర్ ఎక్స్‌ప్లోరేషన్ యూజింగ్ సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసి అండ్ హీట్ ట్రాన్స్పోర్ట్. ఈ ప్రాజెక్టు కోసం నాసా సుమారు రూ.6,635 కోట్లు(99.3 కోట్ల డాలర్లు) ఖర్చుచేసింది. సౌరవిద్యుత్, బ్యాటరీతో పనిచేసే ల్యాండర్ 26 నెలలపాటు గ్రహంపై అధ్యయనం కొనసాగించనుంది. అంతర్భాగంపై అధ్యయనం.. గ్రహంపై అడుగుపెట్టిన తర్వాత ఉపరితలాన్ని 10 నుంచి 16 అడుగుల లోతుకు తవ్వి అంతర్భాగ పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. అనంతరం దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని అందించడంతోపాటు కొన్ని కోట్ల ఏళ్ల కిందట భూమి లాంటి రాతి గ్రహాలు ఏవిధంగా ఏర్పడ్డాయన్నది తెలుపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. భూకంపాల మాదిరిగానే అంగారకుడిపై ప్రకంపనలు, హిమపాతాలు, ఉల్కాపాతాలు చోటుచేసుకున్న విషయం తమకు తెలిసిందేనని.. అయితే ఇవి ఎలా జరుగుతాయన్న ముఖ్యమైన సమాచారాన్ని దీని ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామని నాసా ముఖ్య శాస్త్రవేత్త జిమ్ గ్రీన్ చెప్పారు. ఇన్సైట్ అక్కడి ఉష్ణోగ్రతలను పరిశీలించనుంది. గ్రహం మధ్యధరా రేఖ ప్రాంతంలో వేసవి కాలంలో పగటి పూట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కాగా.. రాత్రి మైనస్ 73 డిగ్రీలకు పడిపోతుంది. -
మొదటి అడుగు
కథ ‘‘ఈ ప్రపంచంలోని మనుషుల్లో నూటికి తొంభై మంది స్వార్థ్ధపరులే. అసలు మనుషులే కనిపించని ప్రపంచానికి వెళ్లిపోదామనిపిస్తోంది’’ అవంతిక తరచుగా అనే మాటలివి. ‘‘మనుషులు కనపడని ప్రపంచం అంటూ ఉంటుందా?’’ అని నవ్వేవాడిని నేను ఆమె మాటలకి. కానీ ఇప్పుడు చూస్తున్నాను. రోజుల తరబడి వెదికినా ఒక్క మనిషి కూడా కనబడని ప్రపంచాన్ని కళ్ల ఎదుట చూస్తున్నాను. మేము ప్రయాణం చేస్తున్న అంతరిక్ష నౌక భూమిని దాటి దాదాపు రెండు వందల ఎనభై మిలియన్ కిలోమీటర్లకి పైగా అంతరిక్షంలో ప్రయాణం చేసి వచ్చి అప్పుడే అంగారక గ్రహాన్ని చేరుకుంది. ఏ దేశమూ ఊహించని విధంగా మొట్టమొదటిసారిగా అంగారక గ్రహమ్మీదకి భారతదేశం తన వ్యోమగాములని పంపించింది. అంతరిక్ష పరిశోధనలో ఎంతో ముందుండే అమెరికా సైతం అప్పటిదాకా అంగారక గ్రహమ్మీదకి పరిశోధనా శాటిలైట్లని మాత్రమే పంపగలిగింది కానీ వ్యోమగాములని పంపి అంగారక గ్రహమ్మీద మనిషి చేత మొదటి అడుగు వేయించలేకపోయింది. అలాంటిది భారతదేశం మొట్టమొదటిసారిగా అంగారక గ్రహమ్మీదకి మనుషులని పంపడంతో ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇటే ఉంది. మానవజాతి మనుగడనే మలుపు తిప్పగల పరిశోధన ఇది అని అందరికీ తెలుసు. మా నలుగురిలోకీ ఎక్కువ ఉద్వేగంగా కనిపిస్తున్నది ప్రణీత్. ఎందుకంటే, మరికొద్దిక్షణాల్లో మా అంతరిక్ష నౌక అంగారక గ్రహమ్మీదకి అడుగుపెట్టగానే, ఆ గ్రహమ్మీద మొట్టమొదటిసారిగా కాలు మోపబోయేది అతడే! మానవజాతి చరిత్రలోనే తన పేరు సుస్థిరంగా నిలిచిపోయే సంఘటన కొద్ది క్షణాల్లో జరగబోతోందని తెలిసిన ఏ మనిషికైనా అలాంటి ఉద్వేగం కలుగడం సహజమే. మిగిలిన ఇద్దరినీ వదిలేసి నేను ప్రత్యేకంగా ప్రణీత్ హావభావాలని గమనించడానికి కారణం ఉంది. అదేమిటంటే, కొన్ని పరిస్థితుల వల్ల, ఈ ప్రయోగంలో అతడు కెప్టెన్ స్థానంలో ఉన్నాడు కానీ, నిజానికి ఆ స్థానంలో ఉండాల్సిన వ్యక్తిని నేను! వయసులోనూ, హోదాలోనూ నాకంటే చిన్నవాడైన అతడు చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల అతడు ఆ అవకాశాన్ని దక్కించుకోగలిగాడు కానీ, నిజానికి ఆ స్థానానికి అన్ని విధాలుగా అర్హుడినైన వ్యక్తిని నేను. పై అధికారుల ముందు ధైర్యం చేసి నా బాధని వెళ్లగక్కినా, ఎన్నో విషయాలని పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా రూపొందించిన ఎంపిక ప్రక్రియ ఇది. అయినా ఇందులో నువ్వు బాధపడే విషయం ఏముంది? ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో నువ్వు కూడా ఉన్నావు కదా? మీ నౌక అంగారక గ్రహం మీద దాదాపు ఆరు గంటలు ఉంటుంది. అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటే, మీరు కూడా ఆ గ్రహమ్మీద కాలు పెడతారు. ఒకరు ముందూ ఒకరు వెనుకా అంతే అన్న సమాధానమే వచ్చింది. ఒకరు ముందూ, ఒకరు వెనుకా అని ఎంత తేలికగా అనగలిగారు?! రోవర్‌ను ఈ గ్రహమ్మీదకి పంపి ఇక్కడి వాతావరణాన్ని పరిశీలించడం దగ్గర నుంచీ ఈరోజు వరకూ అంగారక గ్రహమ్మీద పరిశోధనలో కీలక పాత్ర వహిస్తూ మొదటినుంచీ ఈ ప్రయోగం మీద ఎంతో శ్రద్ధతో, ప్రేమతో పని చేసిన నాకు దక్కాల్సిన అపురూపమైన అవకాశాన్ని మరొకరు దక్కించుకుంటే, ఆ బాధ ఎలాంటిదో అనుభవించే నాకు తెలుస్తుంది కానీ వాళ్లకేం అర్థమౌతుంది? నీల్ ఆర్మ్ స్ట్రాంగ్తోపాటు ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ కూడా అపోలో-11 నౌకలో ప్రయాణించారు. కానీ చంద్రుడిపై అడుగిడిన తొలివ్యక్తిగా నీల్ ఆర్మ్ స్ట్రాంగే ప్రపంచానికి గుర్తుంటాడు కానీ మిగిలినవాళ్ల పేర్లు ఎవరికి తెలుసు? కొలంబియా అంతరిక్ష నౌకలో కల్పనా చావ్లాతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములు కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల పేర్లు ఎంతమందికి తెలుసు? నేను ఆలోచనల్లో ఉండగానే మా అంతరిక్ష నౌక అంగారక గ్రహమ్మీద ల్యాండ్ అవడం, బయటి వాతావరణం వ్యోమగామి దిగడానికి అనువుగా ఉందన్న సంకేతాన్ని నౌకలో ఉన్న సూపర్ కంప్యూటర్లు నిర్ధారణ చేయడం జరిగిపోయాయి.తను వేసుకున్న స్పేస్ సూట్‌ని మరోసారి సవరించుకుని, ఆక్సిజన్ సిలిండర్‌ని సరి చూసుకుని, మావైపు విజయ సూచకంగా బొటన వేలు ఎత్తి చూపించాడు ప్రణీత్. నేను అప్రయత్నంగా అతడి కళ్లలోకి చూసాను. సరిగ్గా అదే సమయానికి ప్రణీత్ కూడా నావైపు చూసాడు. బయటి వాతావరణం ముఖానికి తాకకుండా రక్షణ కవచంలా వున్న స్పేస్ సూట్లోని హెల్మెట్ వంటి అమరిక తాలూకు దళసరి అద్దాల వెనుకనుంచి నుంచి కూడా అతడి కళ్లల్లోని భావం స్పష్టంగా కనిపించింది నాకు. ఆ కళ్లలో స్నేహ భావం కానీ, కృతజ్ఞత కానీ లేదు. విజయం సాధించే ముందు యుద్ధంలో ప్రత్యర్ధి వైపు చూసే చూపులా కసిగా, గర్వంగా ఉంది. ఒక్క క్షణం నా మనస్సు కలుక్కుమంది. ఎవరికి తెలియకపోయినా, ఈ ప్రయోగంలో కెప్టెన్ స్థానాన్ని దక్కించుకోవడానికి మా ఇద్దరి మధ్య ఉన్న పోటీ మాకు తెలుసు! ఆ క్షణంలో అతడి చూపులని తట్టుకోలేక గిలగిలలాడిపోయాను. మన మౌనాన్ని అవతలివారు చేతకానితనం అనుకుంటే అంతకన్నా పరాజయం మరొకటుండదు. భరింపశక్యం కానటువంటి ఒకానొక భావోద్వేగంలో అనాలోచితంగానే చేసేశాను ఆ పనిని. అంతరిక్ష నౌకలో నాకున్న అనుభవాన్నంతా ఉపయోగించి మెరుపు వేగంతో మేము ఉన్న ప్రదేశానికి వెనుక వైపుకు కదిలాను. మొదటి నుంచీ ఈ ప్రయోగంలో మమేకమైపోయి పనిచేయడం వల్ల ఆ నౌకలో ఉన్న అంగుళం అంగుళం, అందులోని సాంకేతిక విషయాలతో సహా నాకు పరిచయమే. ఎక్కడ ఏ మీట నొక్కితే ఏం జరుగుతుందో, దాన్ని ఎలా సరిచేయవచ్చో అన్న విషయాల మీద నాకున్న అవగాహన మా నలుగురిలో మరెవ్వరికీ లేదు. క్షణాల్లోనే నౌకా స్వరూపమంతా కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సహా నా మెదడులో కదలాడింది. క్షణంలో వెయ్యో వంతు కాలంలో నేను చెయ్యదలుచుకున్న పనికి మెదడులో ఒక క్రమరూపం ఏర్పడిపోయింది. నా చేతులు వేగంగా కదిలి అక్కడి మీటలని నొక్కాయి. నేను చేసిన ఆ పని వల్ల ఎవ్వరూ ఊహించని విధంగా నాకోసం అంతరిక్ష నౌక వెనుక భాగంలో సన్నని ద్వారం తెరుచుకుంది ! ముందు భాగంలో అంగారక గ్రహమ్మీద అడుగుపెట్టడానికి ప్రణీత్ ఇంకా కౌంట్ డౌన్ చేస్తుండగానే వెనుకవైపు తెరుచుకున్న ద్వారం గుండా నేను బయటకి దూకేసాను. నేను దూకిన మరుక్షణంలోనే తెరుచుకున్న ఆ సన్నని ద్వారం మరలా యధావిధిగా మూసుకుపోయింది. మేము తిరిగి వెళ్లాక ఈ విషయం ఒక చర్చనీయాంశం అవుతుందని నాకు తెలుసు. వెనుక వైపు ద్వారం సాంకేతిక లోపం వల్ల తెరుచుకుందనీ, దానిని మూసే ప్రయత్నంలో నేను అనుకోకుండా బయటికి అడుగు పెట్టాల్సి వచ్చిందని చెప్పచ్చు. నేను చేసిన ఆ పని వల్ల ఆ క్షణంలో నా శరీరంతో పాటు మనసు కూడా గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది. అంగారక గ్రహమ్మీద కాలుపెట్టబోతున్న మొట్టమొదటి మానవుడ్ని నే...నే!! సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు దూకడం వల్ల ఒక్కసారిగా నా కాలు నేల (ఈ ప్రయోగం సరైనది కాదేమో, అంగారగ గ్రహ ఉపరితలం అనాలనుకుంటా) మీద ఆనలేదు. కాలు ఒక్కసారి గ్రహ ఉపరితలాన్ని తాకడం వల్ల, నేను రెండు మూడు పల్టీలు కొట్టినట్టుగా గాల్లోకి ఎగిరాను. భూమికీ అంగారక గ్రహానికీ ఉన్న అతి ముఖ్యమైన తేడాల్లో గ్రావిటీ ఒకటి. భూమి మీద ఉండే గ్రావిటీలో సగానికన్నా తక్కువ అంగారక గ్రహమ్మీద ఉంటుంది. భూమి మీద వంద కేజీల బరువుండే మనిషి అంగారక గ్రహమ్మీద కేవలం ముప్ఫై ఎనిమిది కేజీలు మాత్రమే ఉంటాడు. భూమి మీద అడుగు వేసేంత ఒత్తిడితో అంగారకుడి మీద అడుగు వెయ్యాల్సిన అవసరం ఉండదు. బహుశా నేను పల్టీలు కొట్టడానికి అదే కారణం అయి ఉంటుందనుకుంటూ, నా శరీరం అంగారకుడి మీద దొర్లుతుంటే, ఆ స్పర్శని ఆస్వాదిస్తున్నట్టుగా ఉండిపోయాను కొద్దిసేపు. భూమికీ అంగారక గ్రహానికీ ఉష్ణోగ్రతలోనూ, వాతావరణ ఒత్తిడిలోనూ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. నేను వేసుకున్న స్పేస్ సూట్, దానిలో అమర్చి ఉన్న ఆక్సిజన్ మాస్కు నాకు ఆ తేడాని పెద్దగా తెలియనివ్వడం లేదు. నా శరీరం ఆగకుండా మరిన్ని పల్టీలు కొడుతుంటే, నేను ఆ గ్రహమ్మీద నిలదొక్కుకోలేకపోవడానికి కారణం గ్రావిటీలో ఉన్న తేడా కాదేమోనని, బహుశా నేను దిగిన వెనక వైపు భాగంలో ఏదో చిన్నపాటి లోయ వంటిది ఉందేమో, నేను ఆ లోయలో పడిపోతున్నానేమోనన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం రాగానే నా గుండె దడదడలాడింది. భయంగా చుట్టూ ఉన్న పరిసరాలని గమనించాను. మొదలేదో చివరేదో తెలియనట్టుగా ఎటు చూసినా నారింజ రంగుతో మెరిసిపోతున్న పరిసరాలు... అప్పటి వరకూ కొన్ని వందలసార్లు సాటిలైటు తీసిన ఛాయాచిత్రాలలో చూసిన వాటిని ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తున్నాను. మనసులో ఆ అనుమానమే లేకపోతే దానినంతా ఎంతో బాగా ఆస్వాదించేవాడిని. పల్టీలు కొట్టిన తరువాత చాలాసేపటికి నేను తిన్నగా నిలబడగలిగాను. శరీరం నా స్వాధీనంలోకి వచ్చిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని మా అంతరిక్ష నౌక ఎక్కడ ఉందా అని వెతకడం! కనుచూపు మేరలో ఎక్కడా మా నౌక వున్న జాడలు కనిపించలేదు. నేను ఊహించినది నిజమే. నేను ఏదో లోయలోకి జారి చాలా దూరం వచ్చేసాను. నా గుండెలు దడదడలాడాయి. హెల్ప్... అని గట్టిగా అరవాలనిపించింది. నేను అరిచినా అక్కడ ఎవరికీ వినిపించదని తెలుసు. అసలు నేను వేసుకున్న స్పేస్ సూట్లోంచి ఆ శబ్దం బయటికే రాదు. పరిశోధన చేస్తున్న సమయంలో అంగారక గ్రహమ్మీద కాలు పెట్టగానే ఏవేవో చెయ్యాలనుకున్నాను. అక్కడి శిలాజాలని సేకరించాలనీ, వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలనీ, అంగారకుడి మీద గడిపిన కొద్ది సమయంలో ఒక థీసిస్‌కి సరిపడినంత పరిజ్ఞానాన్ని బుర్రలో నింపుకోవాలనీ, ప్రపంచానికి అంగారకుడ్ని కొత్తగా పరిచయం చెయ్యాలనీ ఎన్నెన్నో అనుకున్నాను. కానీ ప్రస్తుతం నా మనసులో భయం తప్ప మరో ఆలోచన రావడం లేదు. వచ్చిన దిక్కుకే వేగంగా వెనక్కి పరిగెత్తాలనుకున్నాను. ఉద్రిక్తతతో గట్టిగట్టిగా అడుగులు వేస్తే గ్రావిటీ తేడా వల్ల మళ్లీ శరీరం గాలిలోకి ఎగరవచ్చేమోనన్న అనుమానం వచ్చి నెమ్మదిగానే అడుగులు వేస్తూ వెనుదిరిగాను. వెనుదిరిగాక అప్పుడు మెదిలింది అసలైన ప్రశ్న నా మెదడులో... ఇప్పుడు నేను ఎటు వైపుకు వెళ్లాలి?! గాల్లో పల్టీలు కొడుతూ రావడం వల్ల అసలు నేను ఎటు వైపు నుంచి వచ్చానో అన్న విషయం కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఏ వైపుకు వెళ్లి మా అంతరిక్ష నౌకని వెదకాలి?! నా స్థానంలో ప్రణీత్‌ని మా పరిశోధనకి కెప్టెన్‌గా నియమిస్తున్నామన్న ప్రకటన విన్నప్పుడు కూడా రాని ఏడుపు అప్పుడు నాకు తన్నుకుని వచ్చింది. నన్ను నేను సంభాళించుకున్నాను. గాలిలో పల్టీలు కొట్టినా గ్రావిటీ తక్కువగా ఉన్న ఆ గ్రహమ్మీద నేను మా నౌకకి ఎక్కువ దూరం వచ్చి ఉండనని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. కళ్లు మూసుకుని ముందుగా ఏదో ఒక వైపు ప్రయాణం సాగించాలి. ఆ వైపు కొద్ది దూరం వెళ్లాక నౌక కనిపించకపోతే మళ్లీ వెనక్కి వచ్చి మరో దిక్కుకి ప్రయాణం సాగించాలి. అటు కూడా అలాగే చెయ్యాలి. ఏదో ఒక వైపుకే గుడ్డిగా నడుచుకుంటూ వెళ్లడం కన్నా, ఇలా అన్ని వైపులకీ కొద్ది కొద్ది దూరం వెళ్లి ప్రయత్నించడం వల్ల మా వాళ్లని వెదికి పట్టుకోవడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అనుకుని మనసులోనే లెక్కలు వేసుకుని నడక ప్రారంభించాను. నేను దొర్లుతూ వచ్చిన సమయాన్ని లెక్కకట్టి, ఆ వేగాన్ని అంచనా వేసి ఒక్కో దిక్కుకీ ఎంత దూరం నడవాలో లెక్కలు కట్టుకుని ఒక్కో దిక్కులో దిక్కులేనివాడిలా ఇనుప ఖనిజాలతో ఎర్రబారిన అంగారక గ్రహం ఉపరితలమ్మీద నడక సాగించాను. ఎంత దూరం నడిచినా మా నౌక జాడ తెలియడం లేదు. సమయం గడుస్తున్న కొద్దీ నా ప్రాణాలర్పించైనా మావాళ్లని చూడాలన్న తహతహ మొదలైంది నాలో. మా అంతరిక్ష నౌక కేవలం ఆరు గంటలపాటే అంగారక గ్రహమ్మీద గడపగలదు. ఆరుగంటల లోపు అక్కడి నుంచి బయలుదేరకపోతే అది తిరుగు ప్రయాణం చెయ్యడానికి పనికి రాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే, నేను వెళ్లినా వెళ్లకపోయినా సరిగ్గా ఆరు గంటలయ్యే సరికి వాళ్లు ముగ్గురూ తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏమిటి?! అవంతిక అన్న అసలు మనుషులే లేని ప్రపంచంలో నిజంగా గడపాల్సి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అర్ధమౌతున్న కొద్దీ నేను చేసిన పనికి నాలో పశ్చాత్తాపం కలుగసాగింది. అంగారక గ్రహం మీద రోజు యొక్క పరిమాణానికీ, భూమికీ పెద్దగా తేడా ఉండదు. దూరంగా అంగారక గ్రహమ్మీద సూర్యాస్తమయం కనిపిస్తోంది. ఆకాశంలో సూర్యుడి గమనాన్ని బట్టి మేము అక్కడ అడుగుపెట్టి ఎంత సమయం అయ్యిందో అంచనా వెయ్యగలిగాను. మా అంతరిక్ష నౌక బయలుదేరడానికి ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే సమయం ఉందన్న విషయం అర్థమైంది నాకు. అప్పటివరకూ నౌక కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. ఇంకా ఎన్ని లోయలు దాటాలో, ఎన్ని పర్వతాలని ఎక్కాలో... అదంతా ఈ కొద్ది నిమిషాల్లో సాధ్యమయ్యే పనేనా? నిస్సత్తువ ఆవరించడంతో కుప్పకూలిపోయాను. ఆ నౌక వెళ్లిపోయిందంటే, ఇంక భూమితో నా సంబంధాలు శాశ్వతంగా తెగతెంపులైపోతాయి. నేను ఈ గ్రహమ్మీద తప్పిపోయానన్న విషయం తెలిసినా నాకోసం, నన్ను వెదకడం కోసం ఇన్ని కోట్లు ఖర్చుచేసి ప్రభుత్వం మళ్లీ మరొక వ్యోమ నౌకని ఇక్కడికి ఎట్టి పరిస్థితులలోనూ పంపదు. అసలు నేను అప్పటిదాకా జీవించి ఉండగలనన్న నమ్మకం కూడా భూమ్మీద ఎవరికీ ఉండదు. సైంటిస్టుగా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఎన్నో కలలు కన్న నా జీవితం ఇలా అనామకంగా ఈ అన్య గ్రహమ్మీద అంతమౌతుందన్న విషయం నేనెన్నడూ ఊహించలేదు. నా స్థితికి సంతాపం తెలియ చేస్తున్నట్టుగా నేను కిందపడ్డ చోట ఎర్రగా పైకి లేచింది ఒక ధూళి మేఘం. నీరసంతో సోలిపోతున్న నా కళ్లకి ఆ ధూళిలోంచి మసగ్గా కనిపించింది దూరంగా ఒక చిన్న కదలిక. కళ్లు చిట్లించుకుని మళ్లీ చూసాను. అది భ్రమ కాదు... నిజమే. దూరంగా ఒక కదలిక కనిపిస్తూ క్షణాల్లోనే ఆ దృశ్యం క్రమంగా నా కళ్లకి స్పష్టమౌసాగింది. నా కళ్లు మెరిసాయి. దూరం నుంచి నావైపే నడుచుకుంటూ వస్తున్నది... స్పేస్ సూట్లో ఉన్న ప్రణీత్!! అతడ్ని గుర్తుపట్టగానే, ఏదో శక్తి నాలోంచి తన్నుకు వస్తున్నట్టుగా నన్ను లేపింది. గ్రావిటీ గురించి కూడా ఆలోచించకుండా శక్తి కొలదీ అడుగులు వేస్తూ పరుగుపెడుతూ వెళ్లి ప్రణీత్‌ని గాఢంగా కౌగిలించుకున్నాను! ప్రణీత్ కూడా నన్ను ఆలింగనం చేసుకుంటూ నా కళ్లలోకి కళ్లుపెట్టి చూసాడు... అతడి కళ్లలో ప్రేమ... స్నేహం!! నేను తేరుకునే లోగానే అతడు నా చేతిని పట్టుకుని నన్ను దాదాపుగా లాక్కుని వెడుతున్నట్టుగా పరిగెట్టసాగాడు. ఏమీ ఆలోచించే స్థితిలో లేని నేను ఏదో అపురూపమైన పెన్నిధిని పట్టుకున్నట్టుగా ప్రణీత్ చెయ్యి పట్టుకుని అతడు లాక్కుని వెడుతున్న వైపు కదిలిపోతున్నాను. దాదాపు పది నిమిషాలకి మేము మా అంతరిక్ష నౌక ముందు ఉన్నాము. అలాగే నన్ను లాక్కు వెడుతున్నట్టుగా నౌకలోకి ఎక్కించేసాడు ప్రణీత్. మేము ఎక్కిన వెంటనే, క్షణాల్లోనే నౌక తలుపులు మూసుకోవడం, నౌక గాలిలోకి లేవడం జరిగిపోయాయి. ‘‘అసలు ఏం జరిగింది?’’ మిగిలిన వ్యోమగాములు అన్నారు. ‘‘సాంకేతిక లోపం వల్ల వెనుక తలుపు తెరుచుకుంది. దాన్ని సరిచేసే ప్రయత్నంలో నేను బయటకి జారిపోయాను. అటువైపు లోయ ఉన్నట్టుంది’’ గొంతులోని అపరాధ భావం నాకే తెలిసిపోతోంది. ‘‘ఏది ఏమైనా ప్రణీత్ కన్నా ముందర నువ్వే అంగారక గ్రహమ్మీద అడుగు పెట్టావు. అంగారక గ్రహమ్మీద మొదటి అడుగు పెట్టిన మానవుడిగా నీ పేరు చరిత్రలో స్థిరంగా ఉండిపోతుంది’’ నవ్వుతూ అన్నారు వాళ్లు. ఒకప్పుడైతే వాళ్ల మాటలకి నాకు గర్వంగా అనిపించేది. కానీ అప్పుడు అలా అనిపించలేదు. ప్రణీత్ వైపు చూసాను. అతడు నా వైపు చూడడం లేదు. ఏదో పనిలో ఉన్నాడు. నా మనసులో ఒకే ప్రశ్న... ఎన్నడూ లేనిది అంగారక గ్రహమ్మీద నన్ను వెదుక్కుంటూ వచ్చినప్పుడు ప్రణీత్ కళ్లలో నాకు ప్రేమ, స్నేహం ఎందుకు కనపడ్డాయి?! బాగా ఆలోచిస్తే నాకొక విషయం అర్థమైంది. ఆ క్షణంలో ప్రేమ, స్నేహం అన్న భావనలు నిజానికి అతడివి కావు... నావి! అతడి చూపులు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. తేడా అల్లా నేను ఊహించుకోవడంలోనే. అంటే, అంతకుముందు శిక్షణలో నేను అతడి కళ్లలో చూసిన స్వార్ధం, అంగారక గ్రహం మీద దిగబోయే ముందు అతడి కళ్లలో చూసిన కసి, శత్రుత్వం... అవి కూడా నావేనా?! అసూయ బానిసజాతి సహజ లక్షణం. ఈ అసూయే మన జాతీయ శీలానికి దాపురించిన వినాశకారి. సర్వశక్తిమంతుడైన ఆ పరమేశ్వరుడు సైతం మనలోని ఈ అసూయ కారణంగానే, మనకేమీ చెయ్యలేకున్నాడు’ స్వామి వివేకానంద మాటలు గుర్తుకు వచ్చాయి. మరో ఎనిమిది నెలలు ప్రయాణం చేసి తిరిగి భూమ్మీదకి చేరుకుంది అంతరిక్షనౌక. ఈ ఎనిమిది నెలల కాలం నా ఆలోచనల్లో చాలా మార్పుని తీసుకువచ్చింది. అంగారక గ్రహమ్మీద మొదటి అడుగుపెట్టిన మానవుడిగా అప్పటికే ప్రపంచం మొత్త్తమ్మీద నా పేరు మార్మోగిపోతోంది. భూమి మీద విజయవంతంగా ల్యాండ్ అయిన మా అంతరిక్ష నౌకలోంచి మొదటగా ప్రణీత్ దిగాడు. తరువాత మిగిలిన ఇద్దరూ దిగారు. అందరికన్నా చివరగా నేను కిందకి దిగి భూమ్మీద కాలుపెట్టాను. అంగారక గ్రహమ్మిద పెట్టినది కాదు - మారిన మనిషిగా తిరిగి వచ్చి భూమ్మీద పెట్టినదే నేను గర్వించగలిగే నా ‘మొదటి అడుగు’ అనిపించింది నాకు. - ఆకునూరి మురళీకృష్ణ -
చంద్రుడిపైకి ‘టీమ్ఇండస్’!
న్యూఢిల్లీ: చంద్రుడి పైకి రోబోను పంపేందుకు ‘టీమ్ ఇండస్’ను గూగుల్ షార్ట్‌లిస్ట్ చేసింది. భారత్ నుంచి ఎంపికైన ఏకైక కంపెనీ ఇదే కావడం విశేషం. గూగుల్ చేపట్టిన ‘లూనార్ ఎక్స్‌ప్రైజ్’ పోటీకి టీమ్ఇండస్ అంతరిక్ష నౌక ఎంపికైతే వచ్చే ఏడాది లూనార్పైకి వెళ్తుంది. అదే జరిగితే తొలిసారిగా చంద్రుడి పైకి వెళ్లే ప్రైవేటు అంతరిక్ష నౌక ఇదే అవుతుంది. టీమ్ఇండస్.. చంద్రుడిపైకి పంపేందుకు ఓ ప్రాజెక్టును డిజైన్ చేయడానికి యువతను ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా 25 ఏళ్ల లోపు వయసున్న అనేక మంది యువకులు తమ ఐడియాలను పంపారు. దాదాపు వచ్చిన 1600 ఆలోచనల నుంచి 20 ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్ చేయనుంది. ఈ టీమ్ ఇండస్ 2017 చివరికల్లా చంద్రుడి పైకి వెళ్లే అవకాశం ఉంది. -
యూఎఫ్‌వోనా? సూర్యుడి ఎఫెక్టా!?
గ్రహాంతరవాసుల వ్యోమనౌక నేలకు దిగుతున్నట్లున్న ఈ దృశ్యం హాలెండ్లోని గ్రోనింజెన్‌లో కనిపించింది. హ్యారీ పెర్టన్ అనే బ్లాగర్ తన ఇంటి నుంచి ఇటీవల తుపాను వాతావరణాన్ని ఫొటోలు తీస్తుండగా ఆకాశంలో మెరుపు మెరిసింది. ఫొటోలు వచ్చాక చూస్తే ఇలా.. ఓ యూఎఫ్‌వో(గుర్తు తెలియని ఎగిరే పళ్లెం) నేలకు దిగుతున్నట్లుగా కనిపించింది. ఇది యూఎఫ్వోనే కావొచ్చని కొందరు.. వాతావరణం మారిపోవడంతో ఇలా కనిపించి ఉంటుందని మరికొందరు అంటున్నారు. తుపాను మేఘాల్లోకి సూర్యకిరణాలు చొచ్చుకొచ్చి ఇలా రంగుల కాంతి విరజిమ్మి ఉంటుందని శాస్త్రవ్తేలు చెబుతున్నారు. -
చంద్రుడి మీదకు మానవరహిత అంతరిక్ష నౌక
చైనా: చంద్రుడి మీదకు మానవ రహిత అంతరిక్ష నౌకను సిష్వాన్ ప్రాంతంలోని షిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి చైనా దేశం శుక్రవారం ప్రయోగించింది. చంద్ర మండలంపైకి చైనా తొలి ప్రయోగం చేసింది. చంద్రమండలంపైకి ప్రయోగించిన అంతరిక్ష నౌకకు ఎలాంటి పేరును పెట్టలేదు. చంద్రుడి కక్ష్య చుట్టూ తిరిగాక స్పేస్ క్రాఫ్ట్ భూమికి దిగి రానుంది. మానవ రహిత అంతరిక్ష నౌకను ప్రయోగించిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ వెలుపల కొన్ని సమస్యలు తలెత్తినట్టు చైనా అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు. దాంతో ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత చంద్రుడి కక్ష్య గమనాన్ని శాస్త్రజ్క్షులు తగ్గించినట్టు తెలుస్తోంది. -
మార్స్ ఆర్బిటార్ ప్రయోగం సక్సెస్
-
వ్యోమనౌకలకు ‘మైక్రోవేవ్’ ఇంధనం!
వాషింగ్టన్: అంతరిక్షంలో వ్యోమనౌకలు దూసుకుపోతున్నాయి.. చంద్రుడి మీదకి, భూమి మీదకి వస్తూ, వెళుతున్నాయి.. కానీ వాటి నుంచి ఎలాంటి శబ్దం లేదు.. మంటలు, పొగ, ఉష్ణం వంటివేవీ విడుదల కావడం లేదు.. అసలు వాటిలో ఇంధనమే లేదు.. ఇదేంటి? ఆ వ్యోమనౌకలు ఎలా ప్రయాణిస్తాయని అంటారా? కేవలం ‘మైక్రో తరంగాలు’.. అంటే రేడియోల్లో కార్యక్రమాలను ప్రసారం చేయడానికి వినియోగించే తరంగాలు! ఈ మైక్రో తరంగాలను వినియోగించి వ్యోమనౌకలకు శక్తినిచ్చే ఇంజన్ డిజైన్‌ను నాసా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఒక ప్రత్యేకమైన చాంబర్లోకి మైక్రో తరంగాలను ప్రయోగిస్తే... అవి అందులోని అన్ని అంచుల మధ్య బంతిలా అటూ ఇటూ పరావర్తనం చెందడంతో శక్తి ఉత్పన్నమవుతుంది. దీనిని ‘మైక్రోవేవ్ థ్రస్టర్ సిస్టమ్’గా పేర్కొంటున్నారు. ఇందులో మైక్రో తరంగాలను ఉత్పత్తి చేయడం కోసం సౌరశక్తిని వినియోగిస్తారు. దీనివల్ల ఎలాంటి సాంప్రదాయ ఇంధనాలూ అవసరం లేకుండా వ్యోమనౌకలు పనిచేస్తాయి. కృత్రిమ ఉపగ్రహాలు కక్ష్యలోనే ఉండేలా నియంత్రించేందుకు, గ్రహాంతర ప్రయాణాలకు ఈ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుందని నాసా శాస్త్రవేత్తలంటున్నారు. అన్నింటికన్నా విశేషం ఏమిటంటే.. 14 ఏళ్ల కిందటే 2000వ సంవత్సరంలో రోజర్ షాయర్ అనే శాస్త్రవేత్త ‘ఎమ్డ్రైవ్’ పేరుతో ఇదే తరహా ఇంజన్ నమూనాను రూపొందించారు. కానీ అది పనికిరాని పరిశోధన అంటూ.. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొట్టిపారేయడం గమనార్హం. -
బుధుడి ఫొటో.. అతి సమీపం నుంచి!
సూర్యుడికి అతి సమీపంలో ఉన్న బుధగ్రహాన్ని నాసా ‘మెస్సెంజర్’ వ్యోమనౌక అతి సమీపం నుంచి తీసిన ఫొటో ఇది. ఈ వ్యోమనౌక తీసిన అన్ని ఫొటోల్లోనూ ఇదే అత్యంత స్పష్టమైనదట. చిత్రంలో కనిపిస్తున్నవి బుధగ్రహం ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన చిన్నచిన్న బిలాలు(క్రేటర్లు). గతంలో ఈ గ్రహాన్ని ఖగోళ వస్తువులు ఢీకొట్టినప్పుడు పెద్దపెద్ద బిలాలు ఏర్పడ్డాయని, ఆ సందర్భంగా పదార్థం లేదా ఖగోళ వస్తువుల ముక్కలు పక్కకు ఎగిరిపడటం వల్లే పక్కన ఈ చిన్నచిన్న బిలాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో పెద్ద బిలాలు కొన్ని వందల మీటర్లు, చిన్నవి పదుల మీటర్ల వైశాల్యంతో ఉన్నాయట. శుక్రవారం బుధగ్రహానికి 100 కిలోమీటర్ల సమీపంలోకి వెళ్లిన మెస్సెంజర్ ఈ చిత్రాన్ని తీసింది. ఈ ఫొటోను జూమ్‌చేసి 2 మీటర్ల బిలాలను కూడా స్పష్టంగా చూడొచ్చట. ఆగస్టు 19న ఇది బుధుడికి మరింత దగ్గరగా.. జస్ట్ 50 కిలోమీటర్ల సమీపంలోకే వెళ్లి ఫొటోలు తీయనుందట. 2004లో నింగికి ఎగిరి, 2011లో బుధుడి కక్ష్యను చేరిన ఈ వ్యోమనౌక వచ్చే ఏడాది మార్చివరకూ పనిచేయనుందట.‘మెస్సెంజర్’ -
చంద్రుడిని ఢీకొట్టిన ‘ల్యాడీ’!
వాషింగ్టన్: చంద్రుడి వాతావరణంపై అధ్యయనం కోసం గతేడాది పంపిన ల్యాడీ(లూనార్ అట్మాస్పియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్‌ప్లోరర్) వ్యోమనౌకను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూల్చివేసింది. ఆరు నెలల మిషన్ కోసం ల్యాడీని పంపగా.. ప్రస్తుతం ఆ కాలపరిమితి పూర్తయింది. ఇంధనం కూడా పూర్తిగా అయిపోవడంతో ల్యాడీని గత శుక్రవారం చంద్రుడి ఉపరితలంపై కూల్చేసినట్లు నాసా వెల్లడించింది. హైపవర్ రైఫిల్ బుల్లెట్ కన్నా మూడు రెట్లు వేగంగా, గంటకు 5,800 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ ల్యాడీ చంద్రుడిని ఢీకొట్టిందని తెలిపింది. చంద్రుడిని ఢీకొట్టిన వ్యోమనౌక ముక్కలుచెక్కలై ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ల్యాడీ పడిన చోటు, సమయం వంటివాటిని త్వరలో నిర్ధారించనున్నారు. ఆ చోటుకు సంబంధించిన ఫొటోలనూ సేకరించనున్నారు. టూ-వే లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ అమర్చిన తొలి వ్యోమనౌక అయిన ల్యాడీని నాసా 2013 సెప్టెంబర్‌లో ప్రయోగించింది. ల్యాడీలోని ‘లూనార్ లేజర్ కమ్యూనికేషన్ డెమాన్‌స్ట్రేషన్(ఎల్ఎల్సీడీ)’ వ్యవస్థ లేజర్ కిరణాల ద్వారా సమాచారాన్ని ప్రసారం చేసింది. ఎల్ఎల్సీడీ ద్వారా చంద్రుడి నుంచి భూమికి(3.84 లక్షల కి.మీ. దూరం) 622 ఎంబీపీఎస్ వేగంతో సమాచారాన్ని పంపి ల్యాడీ చరిత్ర సృష్టించింది. -
మానవ నిర్మిత అంతరిక్ష అద్భుతం.. వాయేజర్
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) మూడు దశాబ్దాల క్రితం ప్రయోగించిన ‘వాయేజర్-1’ ఎట్టకేలకు సౌర కుటుంబం అంచులను దాటేసింది.. అంతరిక్షంలో 36 ఏళ్లుగా నిరంతరంగా ప్రయాణిస్తున్న ఈ వ్యోమ నౌక తాజాగా దాదాపు1,900 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏకంగా నక్షత్రాంతర రోదసి (రెండు నక్షత్రాల మధ్య ప్రాంతం)లోకి అడుగుపెట్టింది.. మానవ నిర్మిత అంతరిక్ష వస్తువు ఒకటి ఇలా నక్షత్రాంతర రోదసిలోకి చేరడం ఇదే తొలిసారి.. త ద్వారా వాయేజర్-1 మానవ జాతికి మరో అద్భుత విజయాన్ని అందించింది.. ఈ వ్యోమనౌక రోదసిలోని తీవ్ర రేడియేషన్‌ను కూడా తట్టుకోగలదు. సి. హరికృష్ణ సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ రోదసి అన్వేషణలో మానవుడు ఒక సరికొత్త మైలురాయిని అధిగమించాడు. ఒక మానవ నిర్మిత అంతరిక్ష సాధనం తొలిసారిగా సౌర వ్యవస్థను దాటి అంతర నక్షత్ర రోదసి ప్రాంతంలోకి ప్రవేశించింది. 1977లో నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ) ప్రయోగించిన వాయేజర్-1.. 2012, ఆగస్టు 25 నాటికి సౌర వ్యవస్థను దాటినట్లు ఈ ఏడాది సెప్టెంబర్ 12న నాసా ప్రకటించింది. వాయేజర్ విజయంతో భవిష్యత్‌లో ఇతర సౌర వ్యవస్థల్లోకి సైతం అంతరిక్ష నౌకలను ప్రయోగించే వెసులుబాటు కల్పిస్తుంది. ఏడాది కాలంగా: వాయేజర్-1 నుంచి అందిన సమాచారం మేరకు అది ఏడాది కాలంగా సౌర కుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసిలో ఉండే ప్లాస్మా తరంగాలు లేదా అయోనైజ్డ్ వాయువుల గుండా ప్రయాణిస్తున్నట్లు అంచనా వేశామని వాయేజర్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త ఎడ్ స్టోన్ తెలిపారు. వాయేజర్-1 నుంచి వెలువడే సంకేతాలు కాంతి వేగంతో ప్రయాణిస్తూ 17 గంటల్లో భూమిని చేరతాయని, ప్రస్తుత సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు. నక్షత్రాంతర ప్రదేశంలోకి ప్రవేశించినప్పటికీ.. సూర్యుడి ప్రభావం పూర్తిగా లేని ప్రాంతానికి వాయేజర్ ఎప్పుడు చేరుతుందనే విషయంలో స్పష్టత లేదు. గ్రాండ్ టూర్: సౌర వ్యవస్థలో బాహ్య గ్రహాల అన్వేషణ ఉద్దేశంతో ‘ప్లానెటరీ గ్రాండ్ టూర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని 1964లో జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (ఖీజ్ఛి ఒ్ఛ్ట ్కటౌఞఠటజీౌ ఔ్చఛౌట్చ్టౌటడ)కి చెందిన గ్యారీ ఫ్లోరిడా ప్రతిపాదించాడు. ఇందులో భాగంగా రూపొందించిన మిషన్‌లో తొలుత నాలుగు అంతరిక్ష నౌకలను ప్రయోగించాలని నిర్ణయించారు. గురు, శని, ప్లూటో గ్రహాల అధ్యయనం కోసం 1976-77లో రెండు నౌకలను, గురు, యురేనస్, నెఫ్ట్యూన్ గ్రహాల అధ్యయనం కోసం 1979లో మరో రెండు అంతరిక్ష నౌకలను ప్రయోగించాలని ప్రతిపాదించారు. ఆర్థిక కారణాలతో 1972లో ఈ గ్రాండ్ టూర్ నిలిచిపోయింది. అయినప్పటికీ.. గ్రాండ్ టూర్లో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో అధిక శాతం అంశాలను వాయేజర్ కార్యక్రమంలో చేర్చారు. వాయేజర్ ప్రాథమిక మిషన్: జంట నౌకలుగా వాయేజర్ 1, 2లను నాసా 1977లో ప్రయోగించింది. ఈ రెండింటిలో తొలుత వాయేజర్-2ను 1977, ఆగస్టు 20న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి టైటాన్-సెంటార్ రాకెట్ నుంచి ప్రయోగించారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న వాయేజర్-1ను ప్రయోగించారు. 16 రోజుల తేడాతో ఈ రెండు నౌకల ప్రయోగం జరిగింది. వాయేజర్ మిషన్‌ను ప్రాథమికంగా బాహ్య గ్రహాల అధ్యయనం కోసం నాసా చేపట్టింది. గురు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను వాటి 48 చంద్రులను, ఆ గ్రహాల చుట్టూ ఉన్న వలయాలను వాయేజర్-1, 2 జంట నౌకలు అన్వేషించాయి. ఇందులో 1979, మార్చి 5న వాయేజర్-1 గురు గ్రహానికి అతి దగ్గరగా చేరుకుంది. 1979, జూలై 9న వాయేజర్-2 కూడా గురు గ్రహాన్ని సమీపించింది. అదేవిధంగా శని గ్రహానికి వాయేజర్-1 1980, నవంబర్ 12న, వాయేజర్-2 1981, ఆగస్టు 25న అతి దగ్గరగా ప్రయాణించాయి. యురేనస్‌కు దగ్గరగా 1986, జనవరి 24న, నెప్ట్యూన్‌కు 1989, ఆగస్టు 25న వాయేజర్-2 సమీపించింది. వాయేజర్ కంటే ముందే పయొనీర్ 10, 11ను బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం నాసా ప్రయోగించింది. అయితే 1998, ఫిబ్రవరి 17న వాయేజర్-1 అంతరిక్ష నౌక, పయొనీర్-10 చేరిన దూరాన్ని అధిగమించింది. వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్ (Voyager Inter-stellar Mission-VIM): వాయేజర్ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ సౌర వ్యవస్థ ఆవల అంటే హీలియోస్పియర్ దాటి వాయేజర్ అంతరిక్ష నౌకలను తీసుకు వెళ్లాలని నిర్ణయించిన నాసా వీఐఎం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి వాయేజర్-1 సూర్యుని నుంచి దాదాపు 40 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో, వాయేజర్-2 సూర్యుని నుంచి 31 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నాయి. వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్‌లో మూడు దశలు ఉన్నాయి. అవి.. టెర్మినేషన్ షాక్, హీలియోషీత్ అన్వేషణ, అంతర నక్షత్ర (Interstellar) అన్వేషణ. సౌర అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉన్న సౌర వ్యవస్థ మలి ప్రాంతంలో ఏదో ఒక ప్రదేశం వద్ద సూపర్ సౌర గాలులు, అంతర నక్షత్ర గాలులు ఒక దానికి ఒకటి తారసపడతాయి. వాయేజర్ అంతరిక్ష నౌక ఈ ప్రాంతాన్ని చేరడంతో టెర్మినేషన్ షాక్ దశ పూర్తయింది. ఇక్కడ సూపర్ సోనిక్ సౌర గాలులు సబ్ సోనిక్ వేగానికి తగ్గి సౌర అయస్కాంత క్షేత్రంలో భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. టెర్మినేషన్ షాక్ దశను వాయేజర్-1.. 94 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నప్పుడు 2004లో అధిగమించింది. అదేవిధంగా 84 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నప్పుడు 2007లో వాయేజర్-2 ఈ దశను దాటింది. ఆ తర్వాత హీలియోషీత్ ప్రాంతానికి వాయేజర్ జంట నౌకలు చేరుకున్నాయి. హీలియోస్పియర్ బాహ్య భాగాన్ని హీలియోషీత్ అంటారు. హీలియోషీత్ కొన్ని పదుల ఆస్ట్రనామికల్ యూనిట్ దూరంలో విస్తరించి ఉంటుంది. ఈ భాగాన్ని ప్రయాణించడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. హీలియోషీత్ను దాటిన తర్వాత అంతర నక్షత్ర రోదసి అన్వేషణ ప్రారంభమవుతుంది. వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్ ప్రధాన లక్ష్యం ఈ అంతర నక్షత్ర రోదసిని చేరడం. హీలియోస్పియర్ దాటి అంతర నక్షత్ర రోదసిల మధ్య ప్రాంతం హీలియోపాజ్. సూర్యుడి నుంచి హీలియోపాజ్ 8 నుంచి 14 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం వద్దనే మిలియన్ మైళ్ల వేగం ఉండే సౌర గాలులు 25 లక్షల మైళ్ల వేగానికి తగ్గుతాయి. మొదటి మానవ నిర్మిత సాధనం: 2012, ఆగస్టు 25 నాటికి సూర్యుడి నుంచి 18.78 బిలియన్ కిలోమీటర్ల దూరంలో అంతర నక్షత్ర రోదసిలోకి ప్రయాణించిన మొదటి మానవ నిర్మిత సాధనంగా వాయేజర్ గుర్తింపు తెచ్చుకుంది. ఏప్రిల్‌లో వాయేజర్-1 నుంచి అందిన సమాచారం ఆధారంగా గతేడాది ఆగస్టులో అది రెండు నక్షత్రాల మధ్య ఉండే అంతర నక్షత్ర రోదసిలోకి ప్రవేశించిందని నాసా, ఇతర విశ్వవిద్యాలయాల అధ్యయనంలో వెల్లడైంది. వాయేజర్-2 ప్రస్తుతం 15.3 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. 2020 వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు ప్రయాణించగల శక్తి వాయేజర్ అంతరిక్ష నౌకలకు ఉంది. ఇది సాధ్యమైతే 2020 నాటికి వాయేజర్-1 సూర్యుని నుంచి 19.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలో, వాయేజర్-2 16.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. గోల్డెన్ రికార్డ: జంట వాయేజర్ నౌకలు 12 అంగుళాల బంగారు పూతతో కూడిన రాగి డిస్క్ పరికరాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఒక ఫోనోగ్రాఫ్ రికార్డు. భూమిపై ఉన్న జీవ సంప్రదాయ వైవిధ్య సమాచారాన్ని ఈ డిస్క్‌లో పొందుపరిచారు. కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్ల్ సగన్ ఆధ్వర్యంలోని ఒక కమిటీ ఈ డిస్క్‌లో పొందుపరిచిన సమాచారాన్ని సేకరించింది. 115 చిత్రాలు, పలు సహజ ఆవాసాల శబ్దాలను ఇందులో ఉంచారు. గాలి, ఉరుము, పక్షులు, తిమింగలాలు, ఇతర జంతువుల శబ్దాలను ఇందులో పొందుపరిచారు. భూమిపై వివిధ కాలాలు, ప్రాంతాలు, సంప్రదాయాలకు చెందిన సంగీతాన్ని కూడా నిక్షిప్తం చేశారు. 55 భాషల్లో వ్యక్తుల సందేశాలతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వాల్దీం (Kurt Josef Waldheim) సందేశాలు గోల్డెన్ రికార్డలో ఉన్నాయి. గ్రహాంతర వాసులకు ఈ రికార్డ అందితే భూమి, దాని గురించి అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. వాయేజర్-1 ప్రస్థానం లక్ష్యం: గ్రహాలు, నక్షత్రాంతర రోదసి పరిశోధన బరువు: 722 కిలోలు పరికరాలు: శ్రీహై గెయిన్ యాంటెన్నా (సౌర కుంటుంబం ఆవలి నుంచి రేడియో సంకేతాలు పంపే శక్తిమంతమైన యాంటెన్నా. భూమిపై మూడు డీప్‌స్పేస్ నెట్వర్క్ కేంద్రాలకు సిగ్నళ్లు పంపుతుంది. ఈ సిగ్నళ్లు భూమి ని చేరటానికి 17 గంటల సమయం పడుతుంది). శ్రీలో-ఫీల్డ్ మ్యాగ్నెటోమీటర్ (రోదసిలోని అయస్కాంత క్షేత్రాలను గుర్తిస్తుంది). శ్రీరేడియోఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జెనరేటర్ (దీనిలోని మూడు యూనిట్లు విద్యుత్‌ను అందిస్తాయి. ఇందులోని ఒక్కో యూనిట్లో పీడనానికి గురి చేసిన ప్లుటోనియం-238 ఆక్సైడ్ స్పియర్లు ఉంటాయి). శ్రీప్లానెటరీ రేడియో ఆస్ట్రానమీ (సూర్యుడు, గ్రహాలు, అంతరిక్షం నుంచి వచ్చే రేడియో సిగ్నళ్లను గుర్తిస్తుంది). శ్రీప్లాస్మావేవ్ సబ్‌సిస్టమ్ (ప్లాస్మా, అయస్కాంత తరంగాలను గుర్తిస్తుంది). శ్రీమ్యాగ్నెటోమీటర్ (అయస్కాంత కేత్రాలు, గ్రహాలపై సూర్యుడి ప్రభావాన్ని అంచనా వేస్తుంది). శ్రీకాస్మిక్ రే డిటెక్టర్ (కాస్మిక్ కిరణాలు, ప్లాస్మాలోని కణాలను గుర్తిస్తుంది). శ్రీప్లాస్మా స్పెక్ట్రోమీటర్ (ప్లాస్మాలో అతి తక్కువ విద్యుదాత్మకతగల కణాలను, వాటి వేగాలను, మార్గాలను గుర్తిస్తుంది). శ్రీన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, రేడియో మీటర్ (ఉష్ణోగ్రత, రసాయన మూలకాలు, దృశ్య పరారుణ కాంతిని అంచనా వేస్తుంది). శ్రీఫోటో పోలరీ మీటర్ (గురు, శని, యురేనస్ భౌతిక ధర్మాలను గుర్తిస్తుంది). శ్రీఇమేజింగ్ సైన్స్ సిస్టమ్ (గ్రహాలు, వస్తువులను రెండు కెమెరాలతో ఫోటోలు తీస్తుంది). శ్రీఅల్ట్రావయిలెట్ స్పెక్ట్రోమీటర్ (పరిసరాల్లోని వాతావరణం, రేడియేషన్‌ను అంచనా వేస్తుంది). శ్రీలో-ఎనర్జీ చార్జ్డ్ పార్టికల్ డిటెక్టర్ (రోదసి నుంచి దూసుకు వచ్చే విద్యుదావేశ కణాల వేగం, దిశ, పరిమాణాన్ని గుర్తిస్తుంది) డీప్ స్పేస్ కమాండ్ నెట్వర్క్ ద్వారా రేడియో సిగ్నళ్లు పంపుతుంది. ఇంధనం-ప్లుటోనియం-238 ప్రయోగం-1977, సెప్టెంబర్ 5 ప్రయాణించిన దూరం- దాదాపు 1,900 కోట్ల కిలోమీటర్లు (125 AU) ఆగస్టు 2013 నాటికి ప్రస్తుత వేగం: సెకన్‌కు 17 కిలోమీటర్లు ఆగస్టు 2013 నాటికి 1979లో గురు గ్రహం దాటింది 1980లో శని గ్రహం దాటింది 2013లో సౌర కుటుంబం వెలుపలకు చేరింది గురు, శని గ్రహాలు, వాటి సహజ ఉపగ్రహాలకు సంబంధించి స్పష్టమైన చిత్రాలు పంపిన తొలి నౌక వాయేజర్-2 అత్యధిక రోజులు పని చేస్తున్న వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది. వాయేజర్-1, 2 లను 1977లో 16 రోజుల తేడాతో ప్రయోగించారు. ఇవి అప్పటి నుంచి 36 ఏళ్లుగా నిరంతరంగా ప్రయాణిస్తూ సమాచారం పంపుతూనే ఉన్నాయి. -
స్పెషల్ ఎడిషన్: కనిపించట్లేదు