చరిత్రకెక్కిన పార్కర్ సోలార్ ప్రోబ్
అంతా సవ్యంగా ఉందంటూ సందేశం
న్యూయార్క్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ స్పేస్‌క్రాఫ్ట్ చరిత్ర సృష్టించింది. నాసా ప్రయోగించిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ సూర్యుడికి అత్యంత సమీపానికి చేరుకుంది. ఈ విషయాన్ని నాసా శుక్రవారం ధ్రువీకరించింది. 2018లో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక కొద్దిరోజుల క్రితమే భగభగ మండే సూర్యుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ల(6.1 మిలియన్ కిలోమీటర్లు) దూరానికి విజయవంతంగా చేరుకుంది.
సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా గుండా ప్రయాణించింది. ఎలాంటి ముప్పు లేకుండా సురక్షింగా ఉంది. చరిత్రలో ఇప్పటిదాకా లోకబాంధవుడికి ఇంత సమీపానికి వెళ్లి, సురక్షితంగా ఉన్న అంతరిక్ష నౌక మరొకటి లేదు. అంతా సవ్యంగా ఉన్నట్లు పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి గురువారం రాత్రి నాసాకు సందేశం అందింది. పార్కర్ రాబోయే కొన్ని రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలో చక్కర్లు కొట్టనుంది. దాంతో అక్కడి నుంచి సంకేతాలు ఆగిపోతాయి. సురక్షిత ప్రాంతానికి తిరిగివచ్చిన తర్వాత మళ్లీ సంకేతాలు అందుతాయి.
మానవులు ఇప్పటిదాకా నిర్మించిన అంతరిక్ష నౌకల్లో ఇదే అత్యంత వేగవంతమైంది కావడం గమనార్హం. గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 2,500 డిగ్రీల సెల్సియస్ ఫారెన్‌హీట్(1,370 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రతను సైతం తట్టుకొనేలా పటిష్టమైన హీట్ షీల్డ్‌ను పార్కర్‌పై అమర్చారు. సూర్యుడి నుంచి అత్యధిక ఉష్ణోగ్రత జనించడానికి కారణం ఏమిటన్నది మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఇదిలా ఉండగా, పార్కర్ సోలార్ ప్రోబ్ వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ సూర్యుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించనుంది.
Comments
Please login to add a commentAdd a comment