
తమిళనాడులో చేపట్టిన ఇస్రో
బెంగళూరు: ‘నిల్వచేసిన గ్యాస్ వ్యవస్థ’లో కాకుండా బూట్ర్‌స్టాప్ విధానంలో శూన్యంలో క్రయోజనిక్ ఇంజన్(సీఈ20)ను విజయవంతంగా మండించి చూశామని ఇస్రో శనివారం ప్రకటించింది. అంతరిక్షంలో ఎలాంటి వాయువులు లేని శూన్య స్థితి మాత్రమే ఉంటుంది. లాంఛ్ వెహికల్ మార్క్(ఎల్‌వీఎం3) వ్యో మనౌకలోని పైభాగాన్ని మరింత పైకి తీసుకెళ్లేందుకు దోహదపడే సీఈ20ను శుక్రవారం విజయవంతంగా పరీక్షించామని ఇస్రో పేర్కొంది.
వ్యోమగాములతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గగన్‌యాన్ వంటి ప్రాజెక్టులో ఈ కొత్త విధానంతో క్రయోజనిక్ ఇంజన్లను సమర్థవంతంగా మండించవచ్చని ఇస్రో వెల్లడించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఉన్న హై ఆలి్టట్యూడ్ పరీక్షా కేంద్రంలో ఈ పరీక్ష జరిపారు.
మార్గమధ్యంలో ఉన్నప్పుడు క్రయోజనిక్ ఇంజన్‌ను ట్యాంక్ ఒత్తిడి పరిస్థితుల్లో రీస్టార్ట్ చేసేందుకు, శూన్యంలో విభిన్న మూలకాలతో తయారుచేసిన ఇగ్నైటర్‌తో ఇంజన్‌ను మండించి చూశామని ఇస్రో పేర్కొంది. పరీక్ష ఫలితాలు అనుకున్న రీతిలో సాధారణంగా వచ్చాయని వెల్లడించింది. క్రయోజనిక్ ఇంజన్‌ను రీస్టార్ట్‌చేయడం అనేది ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. సంప్రదాయకమైన గ్యాస్ సిస్టమ్‌లో కాకుండా బూట్‌స్ట్రాప్ విధానంలో టర్బోపంప్‌లను ఉపయోగించి క్రయోజనిక్ ఇంజన్‌ను మళ్లీ మండించడం కష్టమైన పని. దీనిని ఇస్రో విజయవంతంగా చేసి చూపింది. ఈ ఇంజన్‌ను ఇస్రో వారి లికివ్‌డ్ ప్రొపల్షన్ సెంటర్ వారు అభివృద్ధిచేశారు.
ఇంజన్ పరీక్ష మేలిమి మలుపు
ఇంజన్ పరీక్ష విజయవంతం అనేది తదుపరి ప్రాజెక్టుల పురోగతికి ముందడుగు వేసేలా చేసిందని ఇస్రో ఛైర్మన్, అంతరిక్ష విభాగ కార్యదర్శి వి.నారాయణన్ వ్యాఖ్యానించారు. శనివారం బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ఇంటర్నేషనల్ సెమినార్,2025 కార్యక్రమంలో నారాయణన్ మాట్లాడారు. ‘‘ఇస్రో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కొందరు యథాలాపంగా అనేస్తుంటారు. వాస్తవానికి ఇస్రో చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎంతో సంక్లిష్టత, శ్రమ, ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పటికే క్రయోజనిక్ టెక్నాలజీని సముపార్జించిన దేశాలు దానికి భారత్‌కు ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో భారత్ సొంతంగా జీఎస్‌ఎల్వీ మ్యాక్3 కోసం సీ25 క్రయోజనిక్ ప్రొపల్షన్ వ్యవస్థను, ఇంజన్‌ను తయారుచేసుకుంటోంది.
ఇప్పుడు సీ25 ప్రాజెక్టుతో భారత్ ప్రపంచ రికార్డులు నెలకొల్పబోతోంది. ఇంజన్ డిజైన్ దశ నుంచి తయారీ, పరీక్ష స్థాయికి చేరుకోవడానికి ఇతర దేశాలకు 42 నెలల సమయంపడితే భారత్ కేవలం 28 నెలల్లో ఈ ఘనత సాధించింది. సాధారణంగా ఈ స్థాయికి చేరడానికి 10, 12 రకాల ఇంజన్లను తయారుచేస్తే మనం కేవలం మూడు ఇంజన్లతోనే ఈ స్థాయికి ఎదిగాం. ఈ విజయంలో గత ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ కృషి దాగి ఉంది. డిజిటల్ సిములేషన్ తర్వాత నేరుగా పరీక్షకు వెళ్లేలా ఆయనే నాడు మార్గదర్శకం చేశారు. గతంలో మేం విఫలమయ్యాం. దాదాపు రూ.1,200 కోట్లు వృథా అయ్యాయి. కానీ ఇప్పుడు మేం చరిత్ర సృష్టించాం’’అని నారాయణన్ ఆనందం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment