cryogenic engine
-
‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ టెస్టు సక్సెస్
చెన్నై: భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ మిషన్‌లో మరో ముందడుగు పడింది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్వీఎం3 లాంచ్ వెహికల్ తయారీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది. ఈ లాంచ్ వెహికల్‌కు గుండెకాయ లాంటి ‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్’ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని ఇస్రో బుధవారం వెల్లడించింది. తమ పరీక్షలో క్రయోజనిక్ ఇంజన్ పూర్తి సంతృప్తికరమైన పనితీరు కనబర్చిందని, అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించిందని వెల్లడించింది. గగన్‌యాన్ యాత్రకు ఈ ఇంజన్ అనువైందని తేలినట్లు స్పష్టం చేసింది. పలు రకాల కఠిన పరీక్షల తర్వాత ఈ క్రయోజనిక్ ఇంజిన్ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని పేర్కొంది. మానవ రహిత గగన్‌యాన్–1 యాత్రను 2024లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు. ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేర్చి, మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగన్‌యాన్ మిషన్ లక్ష్యం. మొత్తం మూడు రోజుల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగంలో వ్యోమగాములను ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజనిక్ దశలు ఉంటాయి. ఈ క్రయోజనిక్ దశలో లాంచ్ వెహికల్‌ను గమ్యస్థానానికి చేర్చడంలో సీఈ20 ఇంజిన్ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజన్‌పై ఏడో వాక్యూమ్ టెస్టును ఈ నెల 14న తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆలి్టట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. గగన్‌యాన్ మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించామని బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ యాక్సెపె్టన్స్ టెస్టులు, ఫైర్ టెస్టులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. -
Isro: గగన్‌యాన్..ఇస్రో కీలక అప్డేట్
బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. అంతరిక్షంలోకి మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఈ విషయమై ఇస్రో తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో అప్డేట్ ఇచ్చింది. క్రయోజెనిక్ ఇంజిన్ తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించింది. నింగిలోకి వ్యోమగాములను పంపేందుకు వినియోగించే ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో దీనిని వాడనున్నారు. ‘సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ గగన్‌యాన్‌లో మానవ ప్రయాణానికి అనువైనదిగా రుజువైంది. ఇది కఠిన పరీక్షలను ఎదుర్కొంది. ఇక మానవ రహిత యాత్రకు వినియోగించే ఎల్వీఎం3 జీ1 లాంచ్ వెహికిల్‌లో వాడేందుకు పరీక్షలు పూర్తయ్యాయి’ఇస్రో అని పేర్కొంది. కాగా, గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను నింగిలో 400 కిలోమీటర్ల ఎత్తున్న కక్ష్యలోకి పంపి మళ్లీ వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఈప్రయోగం ఇస్రో 2030లో చేపట్టనుంది. Mission Gaganyaan: ISRO's CE20 cryogenic engine is now human-rated for Gaganyaan missions. Rigorous testing demonstrates the engine’s mettle. The CE20 engine identified for the first uncrewed flight LVM3 G1 also went through acceptance tests.https://t.co/qx4GGBgZPv pic.twitter.com/UHwEwMsLJK — ISRO (@isro) February 21, 2024 ఇదీ చదవండి.. భావి భారతం గురించి నీకేం తెలుసు -
Chandrayaan-3: ఆ శకలంతో ఎటువంటి ప్రమాదం లేదు: ఇస్రో
బెంగళూరు: చంద్రయాన్–3 అంతరిక్ష నౌకను జూలై 14న నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడంలో కీలకమైన క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్‌లోని ఒక భాగం భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిందని ఇస్రో తెలిపింది. ఎల్వీఎం–3 ఎం4కు చెందిన ఈ శకలం బుధవారం మధ్యాహ్నం 2.42 సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు గుర్తించామని గురువారం ఇస్రో వివరించింది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ఇది ఉత్తర పసిఫిక్ సముద్రంలో పడే అవకాశాలున్నాయని తెలిపింది. భారత గగనతలంలోకి ప్రవేశించే అవకాశాల్లేవని ఒక ప్రకటనలో ఇస్రో స్పష్టం చేసింది. -
‘సెమీ క్రయోజనిక్’ టెస్ట్... సూపర్ సక్సెస్.. ఇస్రో కీలక ప్రకటన
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఇంటరీ్మడియట్ కాన్ఫిగరేషన్ పరీక్ష (పవర్ హెడ్ టెస్ట్ ఆరి్టకల్)ను సంస్థ మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి వద్ద ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ) సెంటర్లో జూలై 1న ఈ పరీక్ష జరిపినట్టు సోమవారం ఇస్రో ప్రకటించింది. ‘‘భవిష్యత్తు ప్రయోగ వాహనాలను దృష్టిలో ఉంచుకుని బూస్టర్ దశలను శక్తిమంతం చేయడం, 2000 కేఎన్ థ్రస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేయడం ఈ పరీక్ష లక్ష్యం. గ్యాస్ జనరేటర్, టర్బో పంపులు, ప్రీ–బర్నర్, కంట్రోల్ కాంపోనెంట్ల వంటి కీలకమైన సబ్ సిస్టమ్‌ల సమగ్ర పనితీరును 4.5 సెకండ్ల స్వల్ప వ్యవధిలో హాట్ ఫైరింగ్ చేసి ధ్రువీకరించడం దీని ముఖ్య ఉద్దేశం’’ అని తన వైబ్సైట్లో వెల్లడించింది. ఇంధనం, ఆక్సిడైజర్ పంపులను నడపడానికి ప్రధాన టర్బైన్ను నడిపించే ప్రీ బర్నర్ ఛాంబర్లోని వేడి–గ్యాస్ జ్వలన, ఉత్పత్తిని పరీక్షించారు. ఇప్పటిదాకా లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్‌తో కలిపి క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేశారు. ఈ సెమీ క్రయోజనిక్ ఇంజన్‌ను మాత్రం సరికొత్తగా తయారు చేస్తున్నారు. ఇందులో లిక్విడ్ ఆక్సిజన్‌కు తోడుగా కిరోసిన్ ప్రపొల్లెంట్ కలయికతో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. కిరోసిన్ కలయికతో సెమీ క్రయోజనిక్ ఇంజన్ తయారు చేయాలని చిరకాల ప్రయత్నం ఇప్పటికి కార్యరూపు దాల్చింది. తదుపరి పరీక్షల్లో పనితీరును మరింత మెరుగు పరుచుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునే దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది. 13న చంద్రయాన్–3 ప్రయోగం న్యూఢిల్లీ: చంద్రుడిపై అన్వేషణకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్–3 మిషన్ ఏర్పాట్లు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ నెల 13వ తేదీన ఇస్రో దీనిని ప్రయోగించనుంది. ల్యాండర్–రోవర్ కాంబినేషన్‌తో చేపట్టే ఈ ప్రయోగం లక్ష్యం చంద్రుడిలోని సుదూర ప్రాంతాల అన్వేషణ. ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు లాంచ్ విండో అందుబాటులో ఉంటుంది. అయితే, తొలిరోజే ప్రయోగం చేపట్టాలనుకుంటున్నామని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు. -
ఇస్రో ‘క్రయోజనిక్’ పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపట్టేలా క్రయోజనిక్ ఇంజన్ (సీఈ–20)–22టీ థ్రస్ట్ లెవెల్‌తో చేపట్టిన భూస్థిర పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం దీనిని విజయవంతంగా పరీక్షించినట్టు ఇస్రో వెబ్సైట్లో సంబంధిత అధికారులు శనివారం వెల్లడించారు. ఇప్పటిదాకా క్రయోజనిక్ దశలో సీఈ–12.5, సీఈ–25 ఇంజన్లను తయారు చేసుకుని జీఎస్ఎల్వీ మార్క్–2, జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా సీఈ–20 ఇంజన్‌ను తెరపైకి తెచ్చి దీనికి కూడా భూస్థిర పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారించుకుంటున్నారు. ఇస్రోలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్ స్పేస్ పేరుతో వాణిజ్యపరమైన ప్రయోగాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్వీ రాకెట్లు కూడా వాణిజ్యపరంగా చేశారు కాబట్టి ఈ కొత్తరకం సీఈ–20 ఇంజన్‌ను తయారు చేసుకుని భూస్థిర పరీక్షలు చేశారు. సీఈ–20 ఇంజన్‌ను 650 సెకన్లపాటు మండించి పనితీరును పరీక్షించారు. ఇందులో ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా పరీక్ష విజయవంతంగా ముగిసింది. సీఈ–20 ఇంజన్‌ను కేరళలోని వలియామలై అనే ప్రాంతంలో ఉన్న ఎల్పీఎస్సీలో తయారు చేశారు. జీఎస్ఎల్వీ రాకెట్‌కు మూడో దశలో వినియోగించే క్రయోజనిక్ ఇంజన్ దశ ఎంతో కీలకమైంది. అంటే జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో సీఈ–12.5, సీఈ–25తో పాటుగా ఇకనుంచి సీఈ–20 ఇంజన్ కూడా వినియోగంలోకి రానుంది. తద్వారా జీఎస్ఎల్వీ ప్రయోగాల వేగం కూడా పెరుగుతుంది. -
సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు
న్యూఢిల్లీ: ‘‘సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు చేస్తోంది. ఆ రంగాల్లో మనం సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 36 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించడాన్ని దేశానికి యువత ఇచ్చిన ప్రత్యేక దీపావళి కానుకగా అభివర్ణించారు. ఆదివారం నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘స్వయంసమృద్ధి దిశగా మా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది తాజా తార్కాణం. ఒకప్పుడు మనకు క్రయోజనిక్ రాకెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ మన శాస్త్రవేత్తలు దాన్ని సవాలుగా తీసుకుని దేశీయ పరిజ్ఞానం సాయంతోనే వాటిని నిర్మించి చూపించారు. ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా ఉపగ్రహాలను పంపి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో్ల భారత్ పెద్ద శక్తిగా నిలిచింది. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి తలుపులు తెరవడంతో కొత్త స్టార్టప్‌లు పుట్టుకొచ్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి’’ అన్నారు. మోదెరా స్ఫూర్తి: ప్రపంచమంతా పర్యావరణహిత సౌర విద్యుత్ కేసి మళ్లుతోందని మోదీ అన్నారు. ‘‘పీఎం కుసుమ్ యోజన ద్వారా ఎంతోమంది ఇళ్లపై సోలార్ ప్లాంట్లు పెట్టుకున్నారు. కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను విక్రయించి లాభపడుతున్నారు. గుజరాత్‌లోని మోదెరా దేశంలో తొలి సోలార్ గ్రామంగా నిలిచింది. ఈ స్ఫూర్తితో దేశమంతటా సూర్యగ్రామ్లు వెలుస్తాయి. ఇది త్వరలోనే భారీ ప్రజా ఉద్యమంగా మారడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు. పాత సవాళ్లు వదిలేద్దాం న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత సవాళ్లను ఇక వదిలేద్దామని, నూతన అవకాశాల నుంచి లబ్ధి పొందుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన రోజ్‌గార్ మేళానుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వేగవంతమైన అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించాలని, కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందాలన్నదే తమ ఆశయమని ఉద్ఘాటించారు. మనమంతా కలిసి జమ్మూకశ్మీర్‌ను ఉన్నత శిఖరాలను చేర్చుదామని పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో ప్రస్తుత దశాబ్దం జమ్మూకశ్మీర్ చరిత్రలో చాలా ముఖ్యమైన దశాబ్దమని చెప్పారు. పాత సవాళ్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికై, రోజ్‌గార్ మేళాలో నియామక పత్రాలు అందుకున్న 3,000 మంది యువతకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరో 700 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. తయారీ హబ్‌గా భారత్ వడోదర: రవాణా విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని వడోదరలో రూ.22 వేల కోట్లతో యూరోపియన్ సి–295 మధ్యతరహా రవాణా విమానాల తయారీ కేంద్రానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఈ విమానాలను తయారు చేయబోతున్నారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద తయారీ హబ్‌గా అవతరించిందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణ విషయంలో నూతన చరిత్రను రాస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు స్థిరంగా, దార్శనికతతో కూడి ఉన్నాయన్నారు. కొత్త మైండ్‌సెట్, కొత్త వర్క్‌కల్చర్‌తో ఇండియా ముందడుగు వేస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద వాణిజ్య విమానాలు కూడా మన దేశంలో తయారయ్యే రోజులను మనం చూడబోతున్నామని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’తోపాటు ‘మేక్ ఫర్ వరల్డ్’ అనేదే మన నినాదమని వివరించారు. సి–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో భారత వైమానిక దళం బలోపేతం కావడంతోపాటు మనదేశంలో విమానయాన రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఆ దిశగా ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. -
గగన్‌యాన్–1 క్రయోజనిక్ ఇంజన్ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్–1కు సంబంధించి క్రయోజనిక్ ఇంజన్ దశను తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో బుధవారం సాయంత్రం విజయవంతంగా పరీక్షించారు. సుమారు 12 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని నింపి 720 సెకండ్లపాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఆశించిన లక్ష్యాలను చేరుకునే దిశగా పరీక్ష విజయవంతమైంది. గగన్‌యాన్–1 ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్నిరకాల పరీక్షలను ముందస్తుగా చేయడంలో భాగంగా క్రయోజనిక్ ఇంజన్ల పనితీరును సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ ఇంజన్‌ను మరోమారు 1,810 సెకండ్లపాటు మండించి పరిశీలన జరిపేందుకు మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. గగన్‌యాన్–1 ప్రోగ్రామ్ కోసం క్రయోజనిక్ ఇంజన్ అర్హతను పూర్తి చేయడానికి రెండు స్వల్పకాలిక పరీక్షలు, ఒక్క దీర్ఘకాలిక పరీక్ష చేయాల్సి ఉంది. వాటిని కూడా విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందిస్తోంది. – సూళ్లూరుపేట -
క్రయోజనిక్ దశపై ఇస్రో పట్టు!
- కీలకమైన ఇంజిన్, ఇంధనం సొంతంగా అభివృద్ధి - ఇకపై భారీ రాకెట్లు, బరువైన ఉపగ్రహాల ప్రయోగం ఇస్రో నుంచే శ్రీహరికోట (సూళ్లూరుపేట): మూడు, నాలుగు టన్నుల బరువుండే భారీ ఉపగ్రహాలను అంత రిక్షంలోకి తీసుకెళ్లగలిగిన ‘జీఎస్ఎల్వీ (జియో సింక్రనస్ లాంచ్ వెహికిల్)’రాకెట్లో అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశపై ఇస్రో పట్టుబిగించింది. క్రయోజనిక్ దశను పూర్తిస్థాయిలో అభి వృద్ధి చేసే ప్రక్రియలో సాంకేతికపరమైన ఇ బ్బందులన్నింటినీ అధిగమించి విజయం సాధించింది. సాధారణ జీఎస్ఎల్వీ రాకెట్ లోని మూడో దశలో ఉండే క్రయోజనిక్ దశలో 12.5 టన్నుల ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అదే జీఎస్ఎల్వీ మార్క్–3 తరహా భారీ రాకెట్లో 25 టన్నుల క్రయో ఇంధనం అవస రమవుతుంది. కొన్నేళ్ల కింద జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలు విఫలమైన నేపథ్యంలో ఈ క్రయో వ్యవస్థను పకడ్బందీగా రూపొందించేందుకు కొంత సమయం తీసుకుంది. తాజాగా జీఎస్ఎ ల్వీ మార్క్–3డీ1 ప్రయోగం విజయవంతం కావడంతో క్రయోజనిక్ టెక్నాలజీలో ఇస్రోకు పట్టు చిక్కింది. ఇక భారీ ఉపగ్రహాలు ఇస్రో నుంచే.. గతంలో భారీ ఉపగ్రహాలను ఫ్రెంచిలోని గయా నా కౌరూ అంతరిక్ష పరి శోధన కేంద్రం నుంచి వాళ్ల ఏరియాన్ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తూ వచ్చారు. కానీ తాజాగా విజ యంతో ఇక నుంచి ఐదు టన్నుల వరకు బరువైన ఉప గ్రహాలను షార్ నుంచే పంపించే వెసు లుబాటు కలిగింది. ఇటీవలి వరకు జీఎస్ఎల్వీ ప్రయోగాల కోసం రష్యా తయారు చేసిన క్రయోజ నిక్ ఇంజన్లు ఉపయోగించి ఆరు ప్రయో గాలు, సొంతంగా తయారు చేసిన ఒక క్రయో జనిక్ ఇంజన్‌తో ఒక ప్రయోగం చేశారు. ఇందు లో జీఎస్ఎల్వీ–డీ1 పేరుతో 2001 ఏప్రిల్ 18న చేసిన మొట్ట మొదటి ప్రయోగంలో 2 వేల కిలోల బరువైన జీశాట్–01 సమాచార ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఈ ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో రెండు విఫలమ య్యాయి. 2010 ఏప్రిల్ 15న సొంత క్రయోజనిక్ ఇంజన్లతో కూడిన జీఎ స్ఎల్వీ–డీ3ని ప్రయోగించగా విఫలమైంది. అదే ఏడాది డిసెంబర్ 25న రష్యా క్రయోజనిక్ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం కూడా విఫలమైంది. దీంతో ఇస్రో దాదాపు రెండేళ్లపాటు జీఎస్ఎల్వీ ప్రయోగాల జోలికే వెళ్లలేదు. అనంతరం సొంతంగా పూర్తిస్థాయి క్రయోజనిక్ దశ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రెండేళ్లకుపైగా కృషి.. క్రయోజనిక్ ఇంజన్లో ఇంధనంగా ఉపయో గించే లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్‌లను మైనస్ 220, మైనస్ 270 డిగ్రీల అతి శీతల పరిస్థితుల్లో ఉంచాల్సి ఉంటుంది. అతి సున్నితమైన ఈ క్రయోజనిక్ ప్రక్రియలో బాలారిష్టాలను దాటేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అవిరళ కృషి చేశారు. చివరికి విజయం సాధిం చారు. సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన క్రయోజనిక్ ఇంజిన్లతో చేసిన నాలుగు ప్రయోగాలు వరు సగా విజయాలు సాధించాయి. సోమవారం చేసిన జీఎస్ఎల్వీ మార్క్–3డీ1తో ఇందులో ఇస్రో పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. మామూలు జీఎస్ఎల్వీలో మూడో దశలో ఉండే క్రయోజనిక్ దశలో 12.5 టన్నుల క్రయో ఇంధనాన్ని వాడతారు. అదే జీఎస్ఎల్వీ మార్క్–3లో క్రయోజనిక్ దశలో 25 టన్నులు (సీ–25) ఇంధనం ఉపయోగించారు. ఈ క్రయోజనిక్–25 వ్యవస్థను అభివృద్ధి చేయడా నికి దాదాపు రెండేళ్లు పట్టింది. పకడ్బందీగా బందోబస్తు జీఎస్ఎల్వీ మార్క్–3డీ1 ప్రయోగం సందర్భంగా షార్ వద్ద కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. షార్ మొదటిగేట్లో అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అటకానితిప్ప వద్ద ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నుంచి షార్ వరకు ప్రతి కిలోమీటరుకు ఇద్దరు చొప్పన భద్రతా సిబ్బందిని మోహరిం చారు. షార్ కేంద్రానికి చుట్టూరా, సము ద్రం వైపు నుంచి కూడా బందోబస్తు ఏర్పా టు చేశారు. మరోవైపు మెరైన్ సిబ్బంది కూడా తీర గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి బందోబస్తు నిర్వహించారు. -
రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజన్‌ను రెండోసారి విజయవంతంగా పరీక్షించడం ద్వారా.. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. అమెరికా, రష్యా, జపాన్, చైనా, ఫ్రాన్స్‌ల తర్వాత.. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ సామర్థ్యం సాధించిన దేశంగా గత ఏడాదే నిలిచిన భారత్ తాజా ప్రయోగంతో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ విజయం వచ్చే ఏడాది ప్రయోగించనున్న జీఎస్ఎల్వీ మార్క్ 3కి మరింత ఊతమివ్వనుంది. మార్క్ 3 రాకెట్‌తో నాలుగు టన్నుల కంటే ఎక్కువ బరువుండే ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం లభిస్తుంది. ఇస్రో 17 ఏళ్ల కృషి..: రెండు టన్నుల కన్నా అధిక బరువు గల భారీ ఉపగ్రహాలను నింగిలోకి పంపించటానికి క్రయోజనిక్ ఇంజన్లు కీలకమైనవి. స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ల విజయం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల దశాబ్దాల శ్రమ ఉంది. 1990 ప్రాంతంలో అమెరికా ఆంక్షల కారణంగా ఈ సంక్లిష్టమైన టెక్నాలజీ మనకు అందకుండా పోయింది. అగ్రరాజ్యం ఒత్తిళ్లకు తలొగ్గిన రష్యా తయారీ టెక్నాలజీ బదలాయింపునకు చేసుకున్న ఒప్పందాన్ని కూడా కాదని ఏడు ఇంజన్లను అందించి చేతులు దులుపుకుంది. అప్పటి నుంచే ఈ ఇంజన్లను సొంతంగా తయారుచేసుకోవాలని ఇస్రో శాస్త్రవేత్తలు సంకల్పించా రు. 1994లో మొదలైన ఈ ప్రాజెక్టు 2010 నాటికి తొలి పరీక్షకు సిద్ధమైంది. అప్పుడు జీఎస్ఎల్వీ డీ3లో ఉపయోగించిన తొలి దేశీ క్రయోజనిక్ ఇంజన్ అసలు మండలేదు. ఈ వైఫల్యాన్ని అధిగమించేందుకు ఇస్రో ఎంతో కృషి చేసింది. శాస్త్రవేత్తలు ఎంతో పట్టుదలతో 37 రకాల పరీక్షలు నిర్వహించి క్రయోజనిక్ ఇంజన్‌ను అభివృద్ధి చేశారు. నాలుగేళ్ల తర్వాత 2014 జనవరి 5న జీఎస్ఎల్వీ-డీ5 ద్వారా స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను ఇస్రో దిగ్విజయంగా వినియోగించింది. మళ్లీ ఇప్పుడు స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను వినియోగించి చేసిన ప్రయోగం కూడా సఫలమవటంతో.. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై భారత్ పూర్తిపట్టు సాధించినట్లేనని భావిస్తున్నారు. సంక్లిష్టమైన టెక్నాలజీ..: అంతరిక్ష ప్రయోగాలకు టన్నుల కొద్దీ ఇంధనం అవసరమవుతుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ శక్తిని పొందేందుకు క్రయోజనిక్ ఇంజన్లు మేలైనవి. కానీ ఈ టెక్నాలజీ చాలా సంక్లిష్టమైంది. రాకెట్ ఇంధనాలుగా వాడే హైడ్రోజన్ మైనస్ 253, ఆక్సిజన్ మైనస్ 183 డిగ్రీ సెల్సియస్ వద్ద ద్రవరూపంలోకి మారతాయి. ఇంతటి అత్యంత శీతలమైన స్థితిలో వీటిని నిల్వ చేయడం, ఇంజన్లలో వాడటం కత్తిమీద సామే. రాకెట్‌లోని ఇతర ఇంజన్ల నుంచి వెలువడే వేడి దీన్ని తాకకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అమెరికా 1969లోనే ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని చంద్రుడిపైకి ప్రయోగించిన రాకెట్లో ఉపయోగించింది. ఇక భారీ ప్రయోగాలే లక్ష్యం వాణిజ్యపరంగా ముందంజ: ఇస్రో చైర్మన్ సూళ్లూరుపేట: క్రయోజనిక్ ఇంజన్ రెండోసారి విజయవంతం కావడం తో జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా వాణిజ్య ప్రయోగాలు చేయడానికి మార్గం సుగమం అయిందని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. జీఎస్ఎల్ వీ డి6 ప్రయోగం తరువాత విలేకరులతో మాట్లాడుతూ అమెరికాఅంతరిక్ష సంస్థ ఆంట్రిక్స్ కార్పొరేషన్‌తో 20 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో ఒప్పందం చేసుకుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పీఎస్ఎల్వీ సీ30 ద్వారా 4 నాసా ఉపగ్రహాలను పంపనున్నామన్నారు. క్రయోజనిక్ దశలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ జీఎస్ఎల్వీ మార్క్4 ద్వారా నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని పంపే స్థాయికి పెంచుతామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రోశాట్, డిసెంబర్లో సింగపూర్‌కు చెందిన ఐదు ఉపగ్రహాలతో పాటు 2016 మార్చిలోఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో 3 ఉపగ్రహాలను ప్రయోగిస్తామన్నారు. జీఎస్ఎల్వీ ఎఫ్05 ప్రయోగానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. -
ఇస్రో జీఎస్ఎల్వీ ప్రయోగాలు
ప్రయోగం 1 2001, ఏప్రిల్ 18: జీఎస్ఎల్వీ-డీ1 పంపిన ఉపగ్రహం: జీశాట్-1 (1,540 కిలోలు) ఫలితం: విఫలం కారణం: నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ముందే రాకెట్లో ఇంధనం అయిపోయింది. (ప్రయోగం విజయవంతమైనా.. జీశాట్-1 విఫలమైనట్లు ఇస్రో ప్రకటించింది) ప్రయోగం 2 2003, మే 8; జీఎస్ఎల్వీ-డీ2 ఉపగ్రహం: జీశాట్-2 (1,825 కిలోలు) ఫలితం: విజయవంతం ప్రయోగం 3 2004, సెప్టెంబరు 20; జీఎస్ఎల్వీ-ఎఫ్01 ఉపగ్రహం: ఎడ్యుశాట్ (1,950 కిలోలు) ఫలితం: విజయవంతం ప్రయోగం 4 2006, జూలై 10; జీఎస్ఎల్వీ-ఎఫ్02 ఉపగ్రహం: ఇన్శాట్-4సీ (2,168 కిలోలు) ఫలితం: విఫలం కారణం: రాకెట్ దారి మళ్లడంతో ప్రయోగించిన కొన్ని సెకన్లకే కూల్చేశారు ప్రయోగం 5 2007 సెప్టెంబరు 2; జీఎస్ఎల్వీ-ఎఫ్04, ఉపగ్రహం: ఇన్శాట్-4సీఆర్ (2,160 కిలోలు) ఫలితం: పాక్షిక విఫలం కారణం: గెడైన్స్ వ్యవస్థ లోపం వల్ల నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహం చేరలేదు. దశలవారీగా ఉపగ్రహాన్ని నియంత్రిస్తూ నిర్దేశిత క్షక్ష్యకు చేర్చారు. ప్రయోగం 6 2010, ఏప్రిల్ 15; జీఎస్ఎల్వీ-డీ3 (స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో తొలి ప్రయోగం), ఫలితం: విఫలం పయోగం 7 2010, డిసెంబరు 25; జీఎస్ఎల్వీ-ఎఫ్06 ఉపగ్రహం: జీశాట్-5పీ (2,130 కిలోలు) ఫలితం: విఫలం కారణం: ప్రయోగించిన వెంటనే ద్రవ ఇంధన బూస్టర్లు విఫలం కావడంతో బంగాళాఖాతంలో కూల్చేశారు. ప్రయోగం 8 2014, జనవరి 5; జీఎస్ఎల్వీ-డీ5 (స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో రెండో ప్రయోగం) ఉపగ్రహం: జీశాట్-14(1980 కిలోలు) ఫలితం: విజయవంతం జీశాట్-14 విశిష్టతలు.. ఉపయోగాలివీ.. జీశాట్-14 బరువు 1982 కిలోలు. ఇందులో 1131 కిలోలు ఇంధనం కాగా, ఉపగ్రహం బరువు 851 కిలోలు. టెలివిజన్ ప్రసారాలు, టెలికాం రంగంలో విస్తృత సేవలు అందించనుంది. సమాచార ఉపగ్రహాల్లో జీశాట్-14... 23వ ఉపగ్రహం. ఇస్రో పంపిన 10 సమాచార ఉపగ్రహాలు కక్ష్యలో పనిచేస్తూ 225 ట్రాన్స్ఫాండర్లతో డీటీహెచ్ ప్రసారాలు, టెలికాం సేవలు అందిస్తున్నాయి. మూడు, నాలుగేళ్లలో 450 టాన్స్‌పాండర్లను అందుబాటులోకి తేవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 850 టీవీ చానళ్లు ఉంటే 650 చానళ్లను ప్రభుత్వం గుర్తించింది. 300 చానళ్లకు మాత్రమే వీశాట్ లింక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇస్రో 120 ట్రాన్స్పాండర్లను ఉపయోగించుకుంటోంది. జీశాట్-14 ద్వారా 12 మరో ట్రాన్స్పాండర్లను అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 3 దశలు మొదటి దశ: 151 సెకన్లలో పూర్తయింది. 160 టన్నుల ద్రవ ఇంధనాన్ని, 138.5 టన్నుల ఘన ఇంధనాన్ని మండించారు. రెండో దశ: 292.5 సెకన్లలో పూర్తయింది. 39.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించారు. మూడో దశ: ఇదే అత్యంత కీలక దశ. క్రయోజెనిక్ ఇంజన్‌ను వాడింది ఈ దశలోనే. ఇంజిన్‌లోని 12.5 టన్నుల ఇంధనాన్ని మండించి 1,015 సెకన్లలో ఈ దశను పూర్తి చేశారు. కక్షలోకి ఎప్పుడు?: సరిగ్గా 1,028 సెకన్లకు జీశాట్-14 ఉపగ్రహాన్ని క క్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్షలో భూమికి దగ్గరగా (పెరిజీ) 180 కిలో మీటర్ల దూరంలో, భూమికి దూరంగా (అపోజీ) 35,975 కిలో మీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది. -
20 ఏళ్ల శ్రమ ఫలించింది.. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ఇస్రో 20 ఏళ్లు శ్రమించి సొంతంగా తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజన్తోతొలి విజయం సొంతం చేసుకున్నామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కె.రాధాకష్ణన్ అన్నారు. తమ కష్టం ఫలించిందని, ఇది ఇస్రో శాస్త్రవేత్తల సమష్టి విజయమని పేర్కొన్నారు. దీని వెనుక వారి మొక్కవోని కృషి ఉందన్నారు. క్రయోజెనిక్ ఇంజిన్లను తయారు చేయగల కొద్ది దేశాల సరసన భారత్ నిలిచిందని, భవిష్యత్తులో జీఎస్ఎల్వీ సిరీస్‌లో భారీ ప్రయోగాలు చేపట్టాలని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఆదివారం జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగం విజయం తర్వాత షార్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విలేకర్ల సమావేశంలో షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎన్ఆర్వీ కర్త, శాటిలైట్ డెరైక్టర్ ఎం నాగేశ్వరరావు, ఎల్పీఎస్సీ డెరైక్టర్ ఎం.చంద్రదత్తన్, స్పేస్ అప్లికేషన్ డెరైక్టర్ ఏఎస్ కిరణ్‌కుమార్, ఎన్ఆర్ఈ డెరైక్టర్ వీకే దడ్వాల్, మిషన్ డెరైక్టర్ డాక్టర్ కె.శివన్, వీఎస్ఎస్సీ డెరైక్టర్ ఎస్.రామకృష్ణన్, ఐసాక్ డెరైక్టర్ ఎస్కె. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తాజా ప్రయోగంపై, ఇస్రో భవిష్యత్ కార్యక్రమాలపై రాధాకృష్ణన్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ఒక క్రయోజనిక్ ఇంజిన్‌ను రూపొందించాలంటే 9 నుంచి 10 నెలలు పడుతుంది.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్లతో 2010 లో చేసిన ప్రయోగం విఫలమయ్యాయి. గత ఏడాది జీఎస్ఎల్వీ డీ5 వాయిదా పడింది. ఈ లోపాలను సవరించుకోవడానికి 31 సార్లు భూస్థిర పరీక్షలు జరిపాం. షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ మీదా పరీక్షలు నిర్వహించాం. ఇప్పుడు జీశాట్-14 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ ద్వారా నిర్దేశిత కక్ష్యలో నిర్ణీత సమయంలో ప్రవేశపెట్టాం. నూతన సంవత్సరంలో భారతజాతి గర్వించదగ్గ విజయం నమోదు చేశాం. గత ఏడాది మార్స్ మిషన్ ప్రయోగం విజయవంతంగా కాగానే క్రయోజెనిక్ దశలో పరిణతి సాధించి, విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. దేశ రుణం తీర్చుకున్నాం. ఈ విజయంతో జీశాట్-6, జీశాట్-7ఏ, జీశాట్-9, చంద్రయాన్ లాంటి భారీ ఉపగ్రహాల ప్రయోగాలకు మార్గం సుగమమైంది. ఇకపై భారీ లక్ష్యాలతో వాణిజ్య ప్రయోగాలపై దృష్టి పెడతాం. 2015లో చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహిస్తాం. రాకెట్ గమనాలను అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో క్రయోజెనిక్ ఇంజిన్‌తో అత్యాధునిక జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని చేపడతాం. 4 టన్నుల బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని పంపుతాం. 10 నెలలకు ఓసారి జీఎస్ఎల్వీ ప్రయోగాలకు సిద్ధమవుతున్నాం. దీంతో వాణిజ్య ప్రయోగాలు, అవకాశాలు పెరుగుతాయి. జీశాట్-15, 16, 17, 18 సమాచార ఉపగ్రహాలను పంపేందుకు సిద్ధమవుతున్నాం. ఏడాదికి 8 ప్రయోగాలు చేసేందుకు రూ. 300 కోట్లతో ప్రయోగ వేదికలకు అనుసంధానంగా రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నాం. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్‌లో రెండో ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ24 ద్వారా ఫిబ్రవరిలో ప్రయోగిస్తాం. సమాచార రంగంలో మార్పుల కోసం నాసాతో కలిసి సింథ టిక్ అపాచీ రాడార్ శాటిలైట్‌ను ప్రయోగిస్తాం. గడుసు బాలుడు మాట విన్నాడు జీఎస్ఎల్వీని మేం (ఇస్రో) గడుసు బాలుడిగా పిలిచేవాళ్లం. కానీ ఈ రోజు ఆ గడుసు బాలుడు బుద్ధిమంతుడిలా మాట విన్నాడు! - ఎస్. రామకృష్ణన్ (డెరైక్టర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్) ప్రణబ్, మన్మోహన్, మోడీ అభినందనలు న్యూఢిల్లీ: జీఎస్ఎల్వీ-డీ5ని విజయవంతంగా ప్రయోగించడం శాస్త్ర సాంకేతిక రంగాల్లో మైలురాయి వంటిదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ అభివర్ణించారు. ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందంటూ అభినందించారు. భారత్ దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌ను వాడి అంతరిక్ష పరిజ్ఞానంలో కాకలు తీరిన కొద్ది దేశాల సరసన చేరిందని అన్సారీ పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా అభినందించారు. సీఎం, బాబు ప్రశంసలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతి పక్ష నేత చంద్రబాబు ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈరోజు దేశ చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: జీఎస్ఎల్వీ-డీ5 ప్రయో గం విజయవంత మవడంపై ఇస్రోకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. దేశీయ పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజిన్‌ను రూపొందించి శాస్త్రవేత్తలు దేశ కీర్తిని నలువైపులా చాటారని కొనియాడారు. షార్‌లో మిన్నంటిన సంబరం సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: జీఎస్ఎల్వీ డీ5 విజయంతో షార్‌లో పండగ వాతావరణం నెలకొంది. శ్రీహరికోటలోని భవనాల మీద నుంచి షార్ ఉద్యోగుల కుటుంబాలు, పిల్లలు రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. బందోబస్తులో ఉన్న పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది మీడియా సెంటర్లోని టీవీల్లో ప్రయోగాన్ని వీక్షిస్తూ సంతోషం పంచుకున్నారు. సూళ్లూరుపేట, తడ ప్రాంత ప్రజలు తమ ఊళ్లలోని భవనాలు ఎక్కి రాకెట్ గమనాన్ని తిలకించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తొలి ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు. కన్నీటిపర్యంతమైన నంబినారాయణన్ తిరువనంతపురం: ఇస్రో అంతరిక్ష పరిజ్ఞానాన్ని అమ్ముకున్నారనే ఆరోపణ ఎదుర్కొన్న ఆ సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్ జీస్ఎస్ఎల్వీ-డీ5 ప్రయోగంపై హర్షం వ్యక్తం చేశారు. ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఆనాడు నేను అమ్ముకున్నానన్నది ఈ పరిజ్ఞానాన్నే’ అని ఉద్వేగంగా అన్నారు. నంబినారాయణ్ 1991లో ఇస్రో క్రయోజెనిక్ టెక్నాలజీ అభివృద్ధి ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేశారు. ఇస్రో అంతరిక్ష కార్యక్రమ వివరాలను అమ్ముకున్నారనే ఆరోపణపై 1994లో ఆయనను ఆరెస్టు చేశారు. అయితే 1996లో సుప్రీం కోర్టు ఆయనపై కేసు కొట్టివేసింది. -
క్రయోజెనిక్ ఇంజిన్ అంటే?
మైనస్ 150 డిగ్రీలు, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలపై అధ్యయనాన్ని ‘క్రయోజెనిక్స్’ అంటారు. అత్యంత శీతలీకరించిన ఇంధనాలను ఉపయోగించేందుకు వీలుగా తయారుచేసే ఇంజిన్లనే క్రయోజెనిక్ ఇంజిన్లుగా పిలుస్తారు. రాకెట్లలో వివిధ దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగిస్తారు. ఈ ఘన, ద్రవ ఇంధన దశలకు అదనంగా పైన ఉపయోగించేదే ‘క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ’ దశ. మామూలు ఘన, ద్రవ ఇంధనాలతో పోలిస్తే.. క్రయోజెనిక్ దశలో ఉపయోగించే ఇంధనం శూన్యంలో చాలా సమర్థంగా మండుతూ రాకెట్‌ను అత్యంత బలంగా ముందుకు పంపిస్తుంది. దీంతో అధిక బరువుతో కూడిన పేలోడ్లను, అత్యధిక దూరంలోని కక్ష్యల్లోకి పంపడం సాధ్యం అవుతుంది. అత్యంత బరుైవె న ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకెళ్లాలంటే పీఎస్ఎల్వీ సామర్థ్యం చాలదు కాబట్టి.. జీఎస్ఎల్వీ రాకెట్‌ను ఇస్రో డిజైన్ చేసింది. మామూలు రాకెట్ దశలతో పోలిస్తే.. జీఎస్ఎల్వీలోని క్రయోజెనిక్ దశ చాలా క్లిష్టమైన వ్యవస్థ. మైనస్ 183 డిగ్రీ సెంటిగ్రేడ్ల వద్ద ఉండే ఆక్సిజన్ వాయువును, మైనస్ 253 డిగ్రీ సెంటిగ్రేడ్ల వద్ద ఉండే హైడ్రోజన్ ఇంధనాన్ని శూన్యంలో మండించాలి కాబట్టి ఈ దశ అనేక సమస్యలతో ముడిపడి ఉంటుంది. వేర్వేరు ట్యాంకుల్లో ఉండే ఆక్సిజన్, హైడ్రోజన్‌లను నిమిషానికి 40 వేల సార్లు తిరిగే టర్బో పంపుల ద్వారా దహన చాంబర్లోకి కచ్చితమైన పాళ్లలోనే పంపించాలి. క్రయోజెనిక్ స్టేజీలో ప్రధాన ఇంజిన్, రెండు చిన్న ఇంజిన్లు కలిసి శూన్యంలో 73.55 కిలోనాట్ల పీడనాన్ని సృష్టిస్తాయి. ఫలితంగా రాకెట్ అత్యధిక వేగంతో దూసుకుపోతుంది. -
గ’ఘన’ విజయం
జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగం సక్సెస్ జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రాకెట్ భారత రాకెట్ ప్రయోగాల ప్రస్థానంలో మరో మైలురాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయో జెనిక్ ఇంజిన్‌తో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు ఆదివారం విజయవంతం అయింది. అగ్రదేశాలకు దీటుగా రాకెట్ పరిజ్ఞానంలో భారత్ సత్తా చాటింది. ఈ ఘన విజయానికి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్) వేదికైంది. శ్రీహరికోట(సూళ్లూరుపేట), న్యూస్‌లైన్ సమయం ఆదివారం సాయంత్రం 4.18 గంటలు.. షార్‌లో జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగానికి 29 గంటల కౌంట్‌డౌన్ మరికొన్ని క్షణాల్లో పూర్తి కాబోతోంది.. శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ. అందరిలోనూ టెన్షన్. మిషన్‌కంట్రోల్ సెంటర్ నుంచి మైకులో కౌంట్‌డౌన్ వినిపిస్తోంది.. ఫైవ్.. ఫోర్.. త్రీ.. టూ.. వన్.. జీరో. ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పుదిక్కున ఆకాశం వైపు మళ్లాయి. క్షణాల్లో ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ జీఎస్ఎల్వీ(జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్)-డీ5 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. విజయమా.. విఫలమా..? మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ రాకెట్ గమనాన్ని పరిశీలించారు. రాకెట్ క్రమంగా వేగం పుంజుకుని దూసుకుపోతోంది. ఒక్కో దశ విజయవంతం అవుతుండటంతో శాస్త్రవేత్తల వదనాల్లో మందహాసం. రాకెట్ మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసింది. సరిగ్గా 1,028 సెకన్లకు 1982 కిలోల బరువైన జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తల్లో ఆనందం తొణికిసలాడింది. విజయగర్వంతో శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్వదేశీయంగా తయారుచేసిన క్రయోజెనిక్ దశతో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం 2010 ఏప్రిల్‌లో ఒకసారి విఫలం కావడం, మరోసారి 2013 ఆగస్టు 19న ఇంధన లీకేజీ వల్ల వాయిదా పడటంతో ఈసారి విజయం సాధించడం భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. శాస్త్రవేత్తలు ‘నాటీబాయ్’గా అభివర్ణిస్తున్న జీఎస్ఎల్వీ రాకెట్‌ను స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో ఎట్టకేలకు విజయవంతంగా ప్రయోగించడంతో భారత్ కూడా ఈ టెక్నాలజీ రూపకల్పనలో అగ్రదేశాల సరసన చేరింది. అమెరికా కన్నుకుట్టేలా..! రెండు వేల టన్నుల బరువైన ఇన్శాట్ రకం సమాచార ఉపగ్ర హాలను భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు క్రయోజెనిక్ టెక్నాలజీ అవసరం. ఇంతవరకూ రష్యా, ఫ్రాన్స్‌ల సాయంతో సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన భారత్.. ఇప్పుడు స్వీయ క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది. దీంతో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్ల తర్వాత క్రయోజెనిక్ టెక్నాలజీ సాధించిన ఆరో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. క్రయోజెనిక్ టెక్నాలజీని 1992లోనే భారత్‌కు అమ్మేందుకు రష్యా సిద్ధపడినప్పటికీ.. అమెరికా ఆంక్షల వల్ల వెనకడుగేసింది. ఇస్రో 2001 నుంచి 2010 దాకా ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టగా.. రెండు మాత్రమే విజయవంతం అయ్యాయి. మరో ప్రయోగం పాక్షికంగా సఫలమైంది. ఈ నేపథ్యంలో స్వదేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌తో రాకెట్ ప్రయోగంతో సత్తా చాటడం ద్వారా అమెరికా కన్నుకుట్టేలా భారత్ ఘన విజయం సాధించింది. ఈ టెక్నాలజీ తయారుచేసుకోవడం వల్ల ప్రతి ప్రయోగానికీ.. సుమారు రూ. 500 కోట్ల దాకా విదేశాలకు చెల్లించాల్సిన అవసరం కూడా తప్పిపోయింది.