గగన్‌యాన్–1కు సంబంధించిన క్రయోజనిక్ ఇంజన్ దశను పరీక్షిస్తున్న దృశ్యం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్–1కు సంబంధించి క్రయోజనిక్ ఇంజన్ దశను తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం విజయవంతంగా పరీక్షించారు. సుమారు 12 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని నింపి 720 సెకండ్లపాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఆశించిన లక్ష్యాలను చేరుకునే దిశగా పరీక్ష విజయవంతమైంది.
గగన్‌యాన్–1 ప్రయోగంలో ముందుగా మానవ రహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్నిరకాల పరీక్షలను ముందస్తుగా చేయడంలో భాగంగా క్రయోజనిక్ ఇంజన్ల పనితీరును సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ ఇంజన్‌ను మరోమారు 1,810 సెకండ్లపాటు మండించి పరిశీలన జరిపేందుకు మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. గగన్‌యాన్–1 ప్రోగ్రామ్ కోసం క్రయోజనిక్ ఇంజన్ అర్హతను పూర్తి చేయడానికి రెండు స్వల్పకాలిక పరీక్షలు, ఒక్క దీర్ఘకాలిక పరీక్ష చేయాల్సి ఉంది. వాటిని కూడా విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందిస్తోంది.
– సూళ్లూరుపేట
Comments
Please login to add a commentAdd a comment