గగన్‌యాన్ ఎక్స్‌పెరిమెంట్ ప్రయోగంలో క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టం అంటే ఇదే..
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): రానున్న రెండు మూడేళ్లలో రోదసీలోకి వ్యోమగాములను పంపించి వారిని సురక్షితంగా భూమి పైకి తెచ్చే గగన్‌యాన్–1(మ్యాన్ మిషన్) ప్రయోగాన్ని నిర్వహించే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ మూడో వారంలో గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంగా పిలవబడే ఒక ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
చంద్రుడిపై పరిశోధనలను విజయవంతంగా చేసిన అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు గగన్‌యాన్ ప్రయోగాన్ని నిర్వహించే పనిలో అనేక ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్థారించుకుంటున్నారు. ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఇప్పుడు ఎక్స్‌పెరిమెంటల్‌గా గగన్‌యాన్ ప్రయోగాన్ని నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు.
ఎల్‌వీఎం3 రాకెట్ ద్వారా 8,200 కిలోలు బరువున్న క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టం పేరుతో ప్రయోగాన్ని నిర్వహించే యత్నం చేస్తున్నారు. 3.25 వెడల్పు, 3.58 పొడవుతో క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను రూపొందించారు. ఈ మాడ్యూల్‌ను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టి ఏడు రోజుల తర్వాత మళ్లీ కిందకు.. అంటే భూమికి సురక్షితంగా తీసుకొచ్చే ప్రక్రియను నిర్వహిస్తారు.
చంద్రయాన్–3లో విక్రమ్ ల్యాండర్‌ను దిగిన చోటు నుంచి మరో చోటుకు తరలించే ప్రయత్నాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించడంతో, భవిష్యత్తులో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని వారు చెప్పిన విషయం తెలిసిందే.
క్రూమాడ్యూల్ సిస్టంను కూడా లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపి తిరిగి భూమికి తీసుకొచ్చే సమయంలో మిషన్ విఫలమయ్యే పరిస్థితి సంభవిస్తే.. వ్యోమగాములు సురక్షితంగా బయటపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్థారించుకునేందుకు గగన్‌యాన్ ప్రయోగాత్మక ప్రయోగం ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇలా రెండు ఎక్స్‌పెరిమెంటల్ ప్రయోగాలు చేశాక గగయాన్ సిరీస్‌లో మ్యాన్ మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతామని ఇస్రో శాస్త్రవేత్తలంటున్నారు. వ్యోమగాములను రోదసీలోకి పంపి తిరిగి క్షేమంగా తీసుకురావడమే ఇస్రో ముందున్న లక్ష్యమని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment