జీఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయోగం సక్సెస్
జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రాకెట్
భారత రాకెట్ ప్రయోగాల ప్రస్థానంలో మరో మైలురాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయో జెనిక్ ఇంజిన్‌తో జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు ఆదివారం విజయవంతం అయింది. అగ్రదేశాలకు దీటుగా రాకెట్ పరిజ్ఞానంలో భారత్ సత్తా చాటింది. ఈ ఘన విజయానికి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్) వేదికైంది.
శ్రీహరికోట(సూళ్లూరుపేట), న్యూస్‌లైన్
సమయం ఆదివారం సాయంత్రం 4.18 గంటలు.. షార్‌లో జీఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయోగానికి 29 గంటల కౌంట్‌డౌన్ మరికొన్ని క్షణాల్లో పూర్తి కాబోతోంది.. శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ. అందరిలోనూ టెన్షన్. మిషన్‌కంట్రోల్ సెంటర్ నుంచి మైకులో కౌంట్‌డౌన్ వినిపిస్తోంది.. ఫైవ్.. ఫోర్.. త్రీ.. టూ.. వన్.. జీరో. ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పుదిక్కున ఆకాశం వైపు మళ్లాయి. క్షణాల్లో ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ జీఎస్‌ఎల్‌వీ(జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్)-డీ5 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. విజయమా.. విఫలమా..? మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ రాకెట్ గమనాన్ని పరిశీలించారు. రాకెట్ క్రమంగా వేగం పుంజుకుని దూసుకుపోతోంది. ఒక్కో దశ విజయవంతం అవుతుండటంతో శాస్త్రవేత్తల వదనాల్లో మందహాసం. రాకెట్ మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసింది. సరిగ్గా 1,028 సెకన్లకు 1982 కిలోల బరువైన జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తల్లో ఆనందం తొణికిసలాడింది. విజయగర్వంతో శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్వదేశీయంగా తయారుచేసిన క్రయోజెనిక్ దశతో జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగం 2010 ఏప్రిల్‌లో ఒకసారి విఫలం కావడం, మరోసారి 2013 ఆగస్టు 19న ఇంధన లీకేజీ వల్ల వాయిదా పడటంతో ఈసారి విజయం సాధించడం భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. శాస్త్రవేత్తలు ‘నాటీబాయ్’గా అభివర్ణిస్తున్న జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో ఎట్టకేలకు విజయవంతంగా ప్రయోగించడంతో భారత్ కూడా ఈ టెక్నాలజీ రూపకల్పనలో అగ్రదేశాల సరసన చేరింది.
అమెరికా కన్నుకుట్టేలా..!
రెండు వేల టన్నుల బరువైన ఇన్‌శాట్ రకం సమాచార ఉపగ్ర హాలను భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు క్రయోజెనిక్ టెక్నాలజీ అవసరం. ఇంతవరకూ రష్యా, ఫ్రాన్స్‌ల సాయంతో సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన భారత్.. ఇప్పుడు స్వీయ క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది. దీంతో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్‌ల తర్వాత క్రయోజెనిక్ టెక్నాలజీ సాధించిన ఆరో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. క్రయోజెనిక్ టెక్నాలజీని 1992లోనే భారత్‌కు అమ్మేందుకు రష్యా సిద్ధపడినప్పటికీ.. అమెరికా ఆంక్షల వల్ల వెనకడుగేసింది. ఇస్రో 2001 నుంచి 2010 దాకా ఏడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టగా.. రెండు మాత్రమే విజయవంతం అయ్యాయి. మరో ప్రయోగం పాక్షికంగా సఫలమైంది. ఈ నేపథ్యంలో స్వదేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌తో రాకెట్ ప్రయోగంతో సత్తా చాటడం ద్వారా అమెరికా కన్నుకుట్టేలా భారత్ ఘన విజయం సాధించింది. ఈ టెక్నాలజీ తయారుచేసుకోవడం వల్ల ప్రతి ప్రయోగానికీ.. సుమారు రూ. 500 కోట్ల దాకా విదేశాలకు చెల్లించాల్సిన అవసరం కూడా తప్పిపోయింది.
గ’ఘన’ విజయం
Published Mon, Jan 6 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement