GSLV D5
-
ఇస్రో జీఎస్ఎల్వీ ప్రయోగాలు
ప్రయోగం 1 2001, ఏప్రిల్ 18: జీఎస్ఎల్వీ-డీ1 పంపిన ఉపగ్రహం: జీశాట్-1 (1,540 కిలోలు) ఫలితం: విఫలం కారణం: నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ముందే రాకెట్లో ఇంధనం అయిపోయింది. (ప్రయోగం విజయవంతమైనా.. జీశాట్-1 విఫలమైనట్లు ఇస్రో ప్రకటించింది) ప్రయోగం 2 2003, మే 8; జీఎస్ఎల్వీ-డీ2 ఉపగ్రహం: జీశాట్-2 (1,825 కిలోలు) ఫలితం: విజయవంతం ప్రయోగం 3 2004, సెప్టెంబరు 20; జీఎస్ఎల్వీ-ఎఫ్01 ఉపగ్రహం: ఎడ్యుశాట్ (1,950 కిలోలు) ఫలితం: విజయవంతం ప్రయోగం 4 2006, జూలై 10; జీఎస్ఎల్వీ-ఎఫ్02 ఉపగ్రహం: ఇన్శాట్-4సీ (2,168 కిలోలు) ఫలితం: విఫలం కారణం: రాకెట్ దారి మళ్లడంతో ప్రయోగించిన కొన్ని సెకన్లకే కూల్చేశారు ప్రయోగం 5 2007 సెప్టెంబరు 2; జీఎస్ఎల్వీ-ఎఫ్04, ఉపగ్రహం: ఇన్శాట్-4సీఆర్ (2,160 కిలోలు) ఫలితం: పాక్షిక విఫలం కారణం: గెడైన్స్ వ్యవస్థ లోపం వల్ల నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహం చేరలేదు. దశలవారీగా ఉపగ్రహాన్ని నియంత్రిస్తూ నిర్దేశిత క్షక్ష్యకు చేర్చారు. ప్రయోగం 6 2010, ఏప్రిల్ 15; జీఎస్ఎల్వీ-డీ3 (స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో తొలి ప్రయోగం), ఫలితం: విఫలం పయోగం 7 2010, డిసెంబరు 25; జీఎస్ఎల్వీ-ఎఫ్06 ఉపగ్రహం: జీశాట్-5పీ (2,130 కిలోలు) ఫలితం: విఫలం కారణం: ప్రయోగించిన వెంటనే ద్రవ ఇంధన బూస్టర్లు విఫలం కావడంతో బంగాళాఖాతంలో కూల్చేశారు. ప్రయోగం 8 2014, జనవరి 5; జీఎస్ఎల్వీ-డీ5 (స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో రెండో ప్రయోగం) ఉపగ్రహం: జీశాట్-14(1980 కిలోలు) ఫలితం: విజయవంతం జీశాట్-14 విశిష్టతలు.. ఉపయోగాలివీ.. జీశాట్-14 బరువు 1982 కిలోలు. ఇందులో 1131 కిలోలు ఇంధనం కాగా, ఉపగ్రహం బరువు 851 కిలోలు. టెలివిజన్ ప్రసారాలు, టెలికాం రంగంలో విస్తృత సేవలు అందించనుంది. సమాచార ఉపగ్రహాల్లో జీశాట్-14... 23వ ఉపగ్రహం. ఇస్రో పంపిన 10 సమాచార ఉపగ్రహాలు కక్ష్యలో పనిచేస్తూ 225 ట్రాన్స్ఫాండర్లతో డీటీహెచ్ ప్రసారాలు, టెలికాం సేవలు అందిస్తున్నాయి. మూడు, నాలుగేళ్లలో 450 టాన్స్‌పాండర్లను అందుబాటులోకి తేవాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 850 టీవీ చానళ్లు ఉంటే 650 చానళ్లను ప్రభుత్వం గుర్తించింది. 300 చానళ్లకు మాత్రమే వీశాట్ లింక్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇస్రో 120 ట్రాన్స్పాండర్లను ఉపయోగించుకుంటోంది. జీశాట్-14 ద్వారా 12 మరో ట్రాన్స్పాండర్లను అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 3 దశలు మొదటి దశ: 151 సెకన్లలో పూర్తయింది. 160 టన్నుల ద్రవ ఇంధనాన్ని, 138.5 టన్నుల ఘన ఇంధనాన్ని మండించారు. రెండో దశ: 292.5 సెకన్లలో పూర్తయింది. 39.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించారు. మూడో దశ: ఇదే అత్యంత కీలక దశ. క్రయోజెనిక్ ఇంజన్‌ను వాడింది ఈ దశలోనే. ఇంజిన్‌లోని 12.5 టన్నుల ఇంధనాన్ని మండించి 1,015 సెకన్లలో ఈ దశను పూర్తి చేశారు. కక్షలోకి ఎప్పుడు?: సరిగ్గా 1,028 సెకన్లకు జీశాట్-14 ఉపగ్రహాన్ని క క్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఉపగ్రహం దీర్ఘవృత్తాకార కక్షలో భూమికి దగ్గరగా (పెరిజీ) 180 కిలో మీటర్ల దూరంలో, భూమికి దూరంగా (అపోజీ) 35,975 కిలో మీటర్ల దూరంలో పరిభ్రమిస్తోంది. -
20 ఏళ్ల శ్రమ ఫలించింది.. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ఇస్రో 20 ఏళ్లు శ్రమించి సొంతంగా తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజన్తోతొలి విజయం సొంతం చేసుకున్నామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కె.రాధాకష్ణన్ అన్నారు. తమ కష్టం ఫలించిందని, ఇది ఇస్రో శాస్త్రవేత్తల సమష్టి విజయమని పేర్కొన్నారు. దీని వెనుక వారి మొక్కవోని కృషి ఉందన్నారు. క్రయోజెనిక్ ఇంజిన్లను తయారు చేయగల కొద్ది దేశాల సరసన భారత్ నిలిచిందని, భవిష్యత్తులో జీఎస్ఎల్వీ సిరీస్‌లో భారీ ప్రయోగాలు చేపట్టాలని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఆదివారం జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగం విజయం తర్వాత షార్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విలేకర్ల సమావేశంలో షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎన్ఆర్వీ కర్త, శాటిలైట్ డెరైక్టర్ ఎం నాగేశ్వరరావు, ఎల్పీఎస్సీ డెరైక్టర్ ఎం.చంద్రదత్తన్, స్పేస్ అప్లికేషన్ డెరైక్టర్ ఏఎస్ కిరణ్‌కుమార్, ఎన్ఆర్ఈ డెరైక్టర్ వీకే దడ్వాల్, మిషన్ డెరైక్టర్ డాక్టర్ కె.శివన్, వీఎస్ఎస్సీ డెరైక్టర్ ఎస్.రామకృష్ణన్, ఐసాక్ డెరైక్టర్ ఎస్కె. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తాజా ప్రయోగంపై, ఇస్రో భవిష్యత్ కార్యక్రమాలపై రాధాకృష్ణన్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. ఒక క్రయోజనిక్ ఇంజిన్‌ను రూపొందించాలంటే 9 నుంచి 10 నెలలు పడుతుంది.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్లతో 2010 లో చేసిన ప్రయోగం విఫలమయ్యాయి. గత ఏడాది జీఎస్ఎల్వీ డీ5 వాయిదా పడింది. ఈ లోపాలను సవరించుకోవడానికి 31 సార్లు భూస్థిర పరీక్షలు జరిపాం. షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ మీదా పరీక్షలు నిర్వహించాం. ఇప్పుడు జీశాట్-14 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ ద్వారా నిర్దేశిత కక్ష్యలో నిర్ణీత సమయంలో ప్రవేశపెట్టాం. నూతన సంవత్సరంలో భారతజాతి గర్వించదగ్గ విజయం నమోదు చేశాం. గత ఏడాది మార్స్ మిషన్ ప్రయోగం విజయవంతంగా కాగానే క్రయోజెనిక్ దశలో పరిణతి సాధించి, విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. దేశ రుణం తీర్చుకున్నాం. ఈ విజయంతో జీశాట్-6, జీశాట్-7ఏ, జీశాట్-9, చంద్రయాన్ లాంటి భారీ ఉపగ్రహాల ప్రయోగాలకు మార్గం సుగమమైంది. ఇకపై భారీ లక్ష్యాలతో వాణిజ్య ప్రయోగాలపై దృష్టి పెడతాం. 2015లో చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహిస్తాం. రాకెట్ గమనాలను అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో క్రయోజెనిక్ ఇంజిన్‌తో అత్యాధునిక జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని చేపడతాం. 4 టన్నుల బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని పంపుతాం. 10 నెలలకు ఓసారి జీఎస్ఎల్వీ ప్రయోగాలకు సిద్ధమవుతున్నాం. దీంతో వాణిజ్య ప్రయోగాలు, అవకాశాలు పెరుగుతాయి. జీశాట్-15, 16, 17, 18 సమాచార ఉపగ్రహాలను పంపేందుకు సిద్ధమవుతున్నాం. ఏడాదికి 8 ప్రయోగాలు చేసేందుకు రూ. 300 కోట్లతో ప్రయోగ వేదికలకు అనుసంధానంగా రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నాం. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్‌లో రెండో ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ24 ద్వారా ఫిబ్రవరిలో ప్రయోగిస్తాం. సమాచార రంగంలో మార్పుల కోసం నాసాతో కలిసి సింథ టిక్ అపాచీ రాడార్ శాటిలైట్‌ను ప్రయోగిస్తాం. గడుసు బాలుడు మాట విన్నాడు జీఎస్ఎల్వీని మేం (ఇస్రో) గడుసు బాలుడిగా పిలిచేవాళ్లం. కానీ ఈ రోజు ఆ గడుసు బాలుడు బుద్ధిమంతుడిలా మాట విన్నాడు! - ఎస్. రామకృష్ణన్ (డెరైక్టర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్) ప్రణబ్, మన్మోహన్, మోడీ అభినందనలు న్యూఢిల్లీ: జీఎస్ఎల్వీ-డీ5ని విజయవంతంగా ప్రయోగించడం శాస్త్ర సాంకేతిక రంగాల్లో మైలురాయి వంటిదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ అభివర్ణించారు. ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందంటూ అభినందించారు. భారత్ దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌ను వాడి అంతరిక్ష పరిజ్ఞానంలో కాకలు తీరిన కొద్ది దేశాల సరసన చేరిందని అన్సారీ పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా అభినందించారు. సీఎం, బాబు ప్రశంసలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతి పక్ష నేత చంద్రబాబు ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈరోజు దేశ చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: జీఎస్ఎల్వీ-డీ5 ప్రయో గం విజయవంత మవడంపై ఇస్రోకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. దేశీయ పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజిన్‌ను రూపొందించి శాస్త్రవేత్తలు దేశ కీర్తిని నలువైపులా చాటారని కొనియాడారు. షార్‌లో మిన్నంటిన సంబరం సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: జీఎస్ఎల్వీ డీ5 విజయంతో షార్‌లో పండగ వాతావరణం నెలకొంది. శ్రీహరికోటలోని భవనాల మీద నుంచి షార్ ఉద్యోగుల కుటుంబాలు, పిల్లలు రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. బందోబస్తులో ఉన్న పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది మీడియా సెంటర్లోని టీవీల్లో ప్రయోగాన్ని వీక్షిస్తూ సంతోషం పంచుకున్నారు. సూళ్లూరుపేట, తడ ప్రాంత ప్రజలు తమ ఊళ్లలోని భవనాలు ఎక్కి రాకెట్ గమనాన్ని తిలకించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తొలి ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు. కన్నీటిపర్యంతమైన నంబినారాయణన్ తిరువనంతపురం: ఇస్రో అంతరిక్ష పరిజ్ఞానాన్ని అమ్ముకున్నారనే ఆరోపణ ఎదుర్కొన్న ఆ సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్ జీస్ఎస్ఎల్వీ-డీ5 ప్రయోగంపై హర్షం వ్యక్తం చేశారు. ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఆనాడు నేను అమ్ముకున్నానన్నది ఈ పరిజ్ఞానాన్నే’ అని ఉద్వేగంగా అన్నారు. నంబినారాయణ్ 1991లో ఇస్రో క్రయోజెనిక్ టెక్నాలజీ అభివృద్ధి ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేశారు. ఇస్రో అంతరిక్ష కార్యక్రమ వివరాలను అమ్ముకున్నారనే ఆరోపణపై 1994లో ఆయనను ఆరెస్టు చేశారు. అయితే 1996లో సుప్రీం కోర్టు ఆయనపై కేసు కొట్టివేసింది. -
క్రయోజెనిక్ ఇంజిన్ అంటే?
మైనస్ 150 డిగ్రీలు, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలపై అధ్యయనాన్ని ‘క్రయోజెనిక్స్’ అంటారు. అత్యంత శీతలీకరించిన ఇంధనాలను ఉపయోగించేందుకు వీలుగా తయారుచేసే ఇంజిన్లనే క్రయోజెనిక్ ఇంజిన్లుగా పిలుస్తారు. రాకెట్లలో వివిధ దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగిస్తారు. ఈ ఘన, ద్రవ ఇంధన దశలకు అదనంగా పైన ఉపయోగించేదే ‘క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ’ దశ. మామూలు ఘన, ద్రవ ఇంధనాలతో పోలిస్తే.. క్రయోజెనిక్ దశలో ఉపయోగించే ఇంధనం శూన్యంలో చాలా సమర్థంగా మండుతూ రాకెట్‌ను అత్యంత బలంగా ముందుకు పంపిస్తుంది. దీంతో అధిక బరువుతో కూడిన పేలోడ్లను, అత్యధిక దూరంలోని కక్ష్యల్లోకి పంపడం సాధ్యం అవుతుంది. అత్యంత బరుైవె న ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకెళ్లాలంటే పీఎస్ఎల్వీ సామర్థ్యం చాలదు కాబట్టి.. జీఎస్ఎల్వీ రాకెట్‌ను ఇస్రో డిజైన్ చేసింది. మామూలు రాకెట్ దశలతో పోలిస్తే.. జీఎస్ఎల్వీలోని క్రయోజెనిక్ దశ చాలా క్లిష్టమైన వ్యవస్థ. మైనస్ 183 డిగ్రీ సెంటిగ్రేడ్ల వద్ద ఉండే ఆక్సిజన్ వాయువును, మైనస్ 253 డిగ్రీ సెంటిగ్రేడ్ల వద్ద ఉండే హైడ్రోజన్ ఇంధనాన్ని శూన్యంలో మండించాలి కాబట్టి ఈ దశ అనేక సమస్యలతో ముడిపడి ఉంటుంది. వేర్వేరు ట్యాంకుల్లో ఉండే ఆక్సిజన్, హైడ్రోజన్‌లను నిమిషానికి 40 వేల సార్లు తిరిగే టర్బో పంపుల ద్వారా దహన చాంబర్లోకి కచ్చితమైన పాళ్లలోనే పంపించాలి. క్రయోజెనిక్ స్టేజీలో ప్రధాన ఇంజిన్, రెండు చిన్న ఇంజిన్లు కలిసి శూన్యంలో 73.55 కిలోనాట్ల పీడనాన్ని సృష్టిస్తాయి. ఫలితంగా రాకెట్ అత్యధిక వేగంతో దూసుకుపోతుంది. -
గ’ఘన’ విజయం
జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగం సక్సెస్ జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన రాకెట్ భారత రాకెట్ ప్రయోగాల ప్రస్థానంలో మరో మైలురాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయో జెనిక్ ఇంజిన్‌తో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు ఆదివారం విజయవంతం అయింది. అగ్రదేశాలకు దీటుగా రాకెట్ పరిజ్ఞానంలో భారత్ సత్తా చాటింది. ఈ ఘన విజయానికి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్) వేదికైంది. శ్రీహరికోట(సూళ్లూరుపేట), న్యూస్‌లైన్ సమయం ఆదివారం సాయంత్రం 4.18 గంటలు.. షార్‌లో జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగానికి 29 గంటల కౌంట్‌డౌన్ మరికొన్ని క్షణాల్లో పూర్తి కాబోతోంది.. శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ. అందరిలోనూ టెన్షన్. మిషన్‌కంట్రోల్ సెంటర్ నుంచి మైకులో కౌంట్‌డౌన్ వినిపిస్తోంది.. ఫైవ్.. ఫోర్.. త్రీ.. టూ.. వన్.. జీరో. ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పుదిక్కున ఆకాశం వైపు మళ్లాయి. క్షణాల్లో ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ జీఎస్ఎల్వీ(జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్)-డీ5 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. విజయమా.. విఫలమా..? మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ రాకెట్ గమనాన్ని పరిశీలించారు. రాకెట్ క్రమంగా వేగం పుంజుకుని దూసుకుపోతోంది. ఒక్కో దశ విజయవంతం అవుతుండటంతో శాస్త్రవేత్తల వదనాల్లో మందహాసం. రాకెట్ మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసింది. సరిగ్గా 1,028 సెకన్లకు 1982 కిలోల బరువైన జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తల్లో ఆనందం తొణికిసలాడింది. విజయగర్వంతో శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందించుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్వదేశీయంగా తయారుచేసిన క్రయోజెనిక్ దశతో జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం 2010 ఏప్రిల్‌లో ఒకసారి విఫలం కావడం, మరోసారి 2013 ఆగస్టు 19న ఇంధన లీకేజీ వల్ల వాయిదా పడటంతో ఈసారి విజయం సాధించడం భారత్‌కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. శాస్త్రవేత్తలు ‘నాటీబాయ్’గా అభివర్ణిస్తున్న జీఎస్ఎల్వీ రాకెట్‌ను స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్‌తో ఎట్టకేలకు విజయవంతంగా ప్రయోగించడంతో భారత్ కూడా ఈ టెక్నాలజీ రూపకల్పనలో అగ్రదేశాల సరసన చేరింది. అమెరికా కన్నుకుట్టేలా..! రెండు వేల టన్నుల బరువైన ఇన్శాట్ రకం సమాచార ఉపగ్ర హాలను భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు క్రయోజెనిక్ టెక్నాలజీ అవసరం. ఇంతవరకూ రష్యా, ఫ్రాన్స్‌ల సాయంతో సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన భారత్.. ఇప్పుడు స్వీయ క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంది. దీంతో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్ల తర్వాత క్రయోజెనిక్ టెక్నాలజీ సాధించిన ఆరో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. క్రయోజెనిక్ టెక్నాలజీని 1992లోనే భారత్‌కు అమ్మేందుకు రష్యా సిద్ధపడినప్పటికీ.. అమెరికా ఆంక్షల వల్ల వెనకడుగేసింది. ఇస్రో 2001 నుంచి 2010 దాకా ఏడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు చేపట్టగా.. రెండు మాత్రమే విజయవంతం అయ్యాయి. మరో ప్రయోగం పాక్షికంగా సఫలమైంది. ఈ నేపథ్యంలో స్వదేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌తో రాకెట్ ప్రయోగంతో సత్తా చాటడం ద్వారా అమెరికా కన్నుకుట్టేలా భారత్ ఘన విజయం సాధించింది. ఈ టెక్నాలజీ తయారుచేసుకోవడం వల్ల ప్రతి ప్రయోగానికీ.. సుమారు రూ. 500 కోట్ల దాకా విదేశాలకు చెల్లించాల్సిన అవసరం కూడా తప్పిపోయింది. -
స్టాండ్‌బై ఇంజన్‌తో జీఎస్ఎల్వీ ప్రయోగం!
చెన్నై: జీఎస్ఎల్వీ ప్రయోగం సోమవారం నిలిచిపోయిన నేపథ్యంలో, దీనిని సాధ్యమైనంత త్వరలో ప్రయోగించేందుకు స్టాండ్‌బై ఇంజన్‌ను ఉపయోగించే అవకాశాలను ‘ఇస్రో’ పరిశీలిస్తోంది. తమ వద్ద రెండో దశ స్టాండ్‌బై ఇంజన్ సిద్ధంగా ఉందని ‘ఇస్రో’ అధికారి ఒకరు మంగళవారం చెప్పారు. అయితే, సోమవారం ప్రయోగం నిలిచిపోయే పరిస్థితులకు దారితీసిన సమస్యను అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఏదైనా విడిభాగంలో సమస్య ఏర్పడినట్లు తేలితే, ఆ బ్యాచ్‌కు చెందిన విడిభాగాలన్నింటినీ మార్చాల్సి ఉంటుందన్నారు. స్టాండ్‌బై ఇంజన్‌ను ఉపయోగించడం, విడిభాగాలను మార్చడం లేదా సమస్యను సరిదిద్దడం వంటి అన్ని అవకాశాలనూ ‘ఇస్రో’ పరిశీలిస్తోందని చెప్పారు. ఒకవేళ ఇంజన్లోనే అంతర్గత సమస్య ఏర్పడినట్లు తేలితే, మొత్తం ఇంజన్‌నే ధ్వంసం చేయాల్సి ఉంటుందన్నారు. -
జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది. సోమవారం సాయంత్రం 4.50 గంటలకు నిర్వహించాల్సిన ఈ ప్రయోగాన్ని.. రెండో దశలో ఇంధనం లీకేజీని గుర్తించడంతో నిలిపేశారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగంలో కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా సాగి ఇలా మళ్లీ వాయిదా పడింది. ఇందులోని క్రయోజనిక్ దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ప్రయోగానికి 75 నిమిషాల ముందు.. వాస్తవానికి దీన్ని జూలై నెలాఖరులో ప్రయోగించాల్సి ఉండగా ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది. ప్రయోగానికి 29 గంటల ముందు ఆదివారం ఉదయం 11.50 గంటలకు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ‘సతీష్ ధావన్ స్పేస్ సెంటర్’(షార్)లో కౌంట్‌డౌన్ ప్రకియను ప్రారంభించారు. అందులో భాగంగా ద్రవ ఇంధన స్ట్రాపాన్ బూస్టర్ల రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపారు. ఆ తరువాత సోమవారం ఉదయం క్రయోజనిక్ దశలో క్రయో ఇంధనాన్ని(లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనం) నింపే ప్రక్రియను కూడా పూర్తి చేశారు. కౌంట్ డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతున్న సమయంలో మరో 75 నిమిషాల్లో ప్రయోగం జరగాల్సి ఉండగా రాకెట్‌లోని రెండో దశ(జీఎస్-2)లో ఇంధనం లీకేజీ ఉన్నట్లు ఇస్రో చైర్మన్ గుర్తించారు. దీంతో సరిగ్గా 3.45 గంటలకు మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి రాకెట్ వ్యవస్థలన్నింటినీ నిలిపి వేశారు. క్రయోజనిక్ దశలో కూడా సాంకేతిక లోపం తలెత్తిందని మొదట్లో ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. వాయిదా వల్ల క్రయోజనిక్ దశలో ఉపయోగించే క్రయో ఇంధనం పనికి రాకుండా పోతుంది. దీని వల్ల పెద్ద నష్టమేమీ ఉండదని షార్ వర్గాలు అంటున్నాయి. ఈ రాకెట్ ద్వారా 1982 కిలోల జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లోనే ప్రయోగం: రాధాకృష్ణన్ షార్ నుంచి సోమవారం సాయంత్రం 4.50 గంటలకు ప్రయోగించాల్సిన జీఎస్ఎల్వీ డీ5 రాకెట్లో చిన్నపాటి సాంకేతిక లోపం ఏర్పడినందువల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ ప్రకటించారు. ప్రయోగాన్ని నిలిపివేసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతా సక్రమంగా జరుగుతోందనుకున్న తరుణంలో రెండో దశలో లీకేజీ రావడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు. లీకేజీ కారణాలపై అధ్యయనం చేసి మరికొన్ని రోజుల్లోనే ప్రయోగాన్ని చేపడతామని చెప్పారు. రాకెట్లో నింపిన ఇంధనాన్ని వెనక్కి తీసి మంగళవారం జీఎస్ఎల్వీ రాకెట్‌ను హుంబ్లికల్ టవర్ (ప్రయోగ వేదిక) నుంచి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)కు తరలిస్తామని చెప్పారు. రాకెట్ విడిభాగాలను మళ్లీ విడదీసి రెండో దశలోని లీకేజీని అరికట్టి కొద్ది రోజుల్లోనే ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతామని చెప్పారు. ప్రయోగం వాయిదా పడడం వల్ల పెద్దగా నష్టమేమీ లేదని, దీనిపై ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదంటూ ఆయన శాస్త్రవేత్తల వెన్ను తట్టారు. విలేకరుల సమావేశంలో షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ఎల్పీఎస్సీ డెరైక్టర్ ఎం.చంద్రదత్తన్, శాటిలైట్ డెరైక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. చెంగాలమ్మ ఆలయానికి రానందుకే! ప్రయోగం జరిగిన ప్రతిసారీ ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని, శ్రీకాళహస్తిలో శివుడిని, సూళ్లూరుపేటలో చెంగాలమ్మ పరమేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ దఫా చెంగాలమ్మ ఆలయానికి రాకపోవడంతో ప్రయోగానికి అంతరాయం ఏర్పడిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నా రు. 2010లో కూడా చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేయకపోవడం, ఆ ప్రయోగం కూడా విఫలమవడంతో ఇక్కడి వారంతా దీన్ని మరింత బలంగా నమ్ముతున్నారు. -
జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా
-
జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా
భారత దేశం ప్రతిష్ఠాత్మకంగా భావించిన జీఎస్ఎల్వీ - డీ5 ప్రయోగం వాయిదా పడింది. భారత అంతరిక్ష సంస్థ ఈ ప్రయోగాన్ని వాయిదా వేసింది. రెండో దశలోని ఇంజన్లో లీకేజిని గుర్తించడంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా ఆపారు. మళ్లీ ఈ ప్రయోగం ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తారని ఇస్రో అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సోమవారం సాయంత్రం సరిగ్గా 4.50 గంటలకు జీఎస్ఎల్వీని అంతరిక్షంలోకి ప్రయోగించాల్సి ఉండగా, దానికి రెండు గంటల ముందు క్రయోజెనిక్ ఇంజన్లో ఇంధనం నింపాల్సి ఉంది. ఆ సమయంలోనే శాస్త్రవేత్తలు, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వారిలో వారు చర్చించుకోవడం మొదలుపెట్టారు. మిషన్ కంట్రోల్ రూంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ చిన్న చిన్న బృందాలుగా విడిపోయి మానిటర్ల వద్దకు చేరారు. కానీ, అప్పుడే కౌంట్‌డౌన్‌ను కొద్దిసేపు ఆపేశారు. అత్యవసరంగా శాస్త్రవేత్తలందరినీ సమావేశానికి పిలిచారు. అక్కడ పూర్తిగా చర్చించిన తర్వాత ప్రయోగాన్ని వాయిదా వేశారు. జీ ఎస్ఎల్వీ డీ5లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ ఉంది. జీఎస్ఎల్వీ డీ5 పొడవు 49.13 మీటర్లు, బరువు 414.75 టన్నులు. దీని ద్వారా 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి జీ శాట్-14 సమాచార ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ ఉపగ్రహం వల్ల 12 ఏళ్లపాటు డీటీహెచ్ ప్రసారాలు, టెలికం రంగానికి సేవలు అందేవి. కానీ ప్రస్తుతం జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా పడటంతో ఇవన్నీ కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశముంది. -
19న జీఎస్ఎల్వీ డీ-5 ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : జీఎస్ఎల్వీ డీ-5ను ఈనెల 19 సాయంత్రం 4.50 గంటలకు ప్రయోగించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మంగళవారం జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో ముహూర్తం నిర్ణయించారు. ఈ విషయాన్ని వెహికల్ డెరైక్టర్ డాక్టర్ బీఎన్ సురేష్ ప్రయోగతేదీని లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు తెలియజేశారు.