జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం వాయిదా
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది. సోమవారం సాయంత్రం 4.50 గంటలకు నిర్వహించాల్సిన ఈ ప్రయోగాన్ని.. రెండో దశలో ఇంధనం లీకేజీని గుర్తించడంతో నిలిపేశారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన జీఎస్‌ఎల్‌వీ డీ5 ప్రయోగంలో కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా సాగి ఇలా మళ్లీ వాయిదా పడింది. ఇందులోని క్రయోజనిక్ దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు.
ప్రయోగానికి 75 నిమిషాల ముందు..
వాస్తవానికి దీన్ని జూలై నెలాఖరులో ప్రయోగించాల్సి ఉండగా ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది. ప్రయోగానికి 29 గంటల ముందు ఆదివారం ఉదయం 11.50 గంటలకు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ‘సతీష్ ధావన్ స్పేస్ సెంటర్’(షార్)లో కౌంట్‌డౌన్ ప్రకియను ప్రారంభించారు. అందులో భాగంగా ద్రవ ఇంధన స్ట్రాపాన్ బూస్టర్ల రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపారు. ఆ తరువాత సోమవారం ఉదయం క్రయోజనిక్ దశలో క్రయో ఇంధనాన్ని(లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనం) నింపే ప్రక్రియను కూడా పూర్తి చేశారు.
కౌంట్ డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతున్న సమయంలో మరో 75 నిమిషాల్లో ప్రయోగం జరగాల్సి ఉండగా రాకెట్‌లోని రెండో దశ(జీఎస్-2)లో ఇంధనం లీకేజీ ఉన్నట్లు ఇస్రో చైర్మన్ గుర్తించారు. దీంతో సరిగ్గా 3.45 గంటలకు మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి రాకెట్ వ్యవస్థలన్నింటినీ నిలిపి వేశారు. క్రయోజనిక్ దశలో కూడా సాంకేతిక లోపం తలెత్తిందని మొదట్లో ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. వాయిదా వల్ల క్రయోజనిక్ దశలో ఉపయోగించే క్రయో ఇంధనం పనికి రాకుండా పోతుంది. దీని వల్ల పెద్ద నష్టమేమీ ఉండదని షార్ వర్గాలు అంటున్నాయి. ఈ రాకెట్ ద్వారా 1982 కిలోల జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది.
మరికొన్ని రోజుల్లోనే ప్రయోగం: రాధాకృష్ణన్
షార్ నుంచి సోమవారం సాయంత్రం 4.50 గంటలకు ప్రయోగించాల్సిన జీఎస్‌ఎల్‌వీ డీ5 రాకెట్‌లో చిన్నపాటి సాంకేతిక లోపం ఏర్పడినందువల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ ప్రకటించారు. ప్రయోగాన్ని నిలిపివేసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతా సక్రమంగా జరుగుతోందనుకున్న తరుణంలో రెండో దశలో లీకేజీ రావడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు.
లీకేజీ కారణాలపై అధ్యయనం చేసి మరికొన్ని రోజుల్లోనే ప్రయోగాన్ని చేపడతామని చెప్పారు. రాకెట్‌లో నింపిన ఇంధనాన్ని వెనక్కి తీసి మంగళవారం జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను హుంబ్లికల్ టవర్ (ప్రయోగ వేదిక) నుంచి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)కు తరలిస్తామని చెప్పారు. రాకెట్ విడిభాగాలను మళ్లీ విడదీసి రెండో దశలోని లీకేజీని అరికట్టి కొద్ది రోజుల్లోనే ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతామని చెప్పారు. ప్రయోగం వాయిదా పడడం వల్ల పెద్దగా నష్టమేమీ లేదని, దీనిపై ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదంటూ ఆయన శాస్త్రవేత్తల వెన్ను తట్టారు. విలేకరుల సమావేశంలో షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ఎల్‌పీఎస్‌సీ డెరైక్టర్ ఎం.చంద్రదత్తన్, శాటిలైట్ డెరైక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
చెంగాలమ్మ ఆలయానికి రానందుకే!
ప్రయోగం జరిగిన ప్రతిసారీ ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని, శ్రీకాళహస్తిలో శివుడిని, సూళ్లూరుపేటలో చెంగాలమ్మ పరమేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ దఫా చెంగాలమ్మ ఆలయానికి రాకపోవడంతో ప్రయోగానికి అంతరాయం ఏర్పడిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నా రు. 2010లో కూడా చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేయకపోవడం, ఆ ప్రయోగం కూడా విఫలమవడంతో ఇక్కడి వారంతా దీన్ని మరింత బలంగా నమ్ముతున్నారు.