జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా
భారత దేశం ప్రతిష్ఠాత్మకంగా భావించిన జీఎస్‌ఎల్‌వీ - డీ5 ప్రయోగం వాయిదా పడింది. భారత అంతరిక్ష సంస్థ ఈ ప్రయోగాన్ని వాయిదా వేసింది. రెండో దశలోని ఇంజన్లో లీకేజిని గుర్తించడంతో ప్రయోగాన్ని తాత్కాలికంగా ఆపారు. మళ్లీ ఈ ప్రయోగం ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తారని ఇస్రో అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సోమవారం సాయంత్రం సరిగ్గా 4.50 గంటలకు జీఎస్ఎల్వీని అంతరిక్షంలోకి ప్రయోగించాల్సి ఉండగా, దానికి రెండు గంటల ముందు క్రయోజెనిక్ ఇంజన్లో ఇంధనం నింపాల్సి ఉంది. ఆ సమయంలోనే శాస్త్రవేత్తలు, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వారిలో వారు చర్చించుకోవడం మొదలుపెట్టారు. మిషన్ కంట్రోల్ రూంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ చిన్న చిన్న బృందాలుగా విడిపోయి మానిటర్ల వద్దకు చేరారు. కానీ, అప్పుడే కౌంట్డౌన్ను కొద్దిసేపు ఆపేశారు. అత్యవసరంగా శాస్త్రవేత్తలందరినీ సమావేశానికి పిలిచారు. అక్కడ పూర్తిగా చర్చించిన తర్వాత ప్రయోగాన్ని వాయిదా వేశారు.
జీ ఎస్‌ఎల్‌వీ డీ5లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ ఉంది. జీఎస్‌ఎల్‌వీ డీ5 పొడవు 49.13 మీటర్లు, బరువు 414.75 టన్నులు. దీని ద్వారా 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి జీ శాట్-14 సమాచార ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ ఉపగ్రహం వల్ల 12 ఏళ్లపాటు డీటీహెచ్ ప్రసారాలు, టెలికం రంగానికి సేవలు అందేవి. కానీ ప్రస్తుతం జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా పడటంతో ఇవన్నీ కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశముంది.