K. Radhakrishnan
-
‘పరీక్ష’ల సంస్కరణలపై కమిటీ
ఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షలు పారదర్శకంగా, న్యాయంగా, సాఫీగా నిర్వహించేందుకు ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యా శాఖ శనివారం ప్రకటించింది. ఈ నిపుణుల కమిటీకి ఇస్రో మాజీ చైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియ, డాటా భద్రతకు చేపట్టాల్సిన చర్యలు, ఎన్టీఏ నిర్మాణం, పనితీరుకు సంబంధించి చేపట్టాల్సిన సంస్కరణలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. రెండు నెలల్లో ఈ కమిటీ తమ నివేదికకు విద్యాశాఖకు సమర్పిస్తుంది. నీట్, యూజీసీ– నెట్ పరీక్షల్లో అవకతవకలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. కమిటీ సభ్యులు: 1. కె.రాధాకృష్ణన్ (ఇస్రో మాజీ చైర్మన్) 2. డాక్టర్ రణదీప్ గులేరియా (ఎయిమ్స్ మాజీ డైరెక్టర్) 3. ప్రొఫెసర్ బీజే రావు (వైస్ చాన్సలర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)4. ప్రొఫెసర్ రామమూర్తి కె. (ఐఐటీ మద్రాస్) 5. పంకజ్ బన్సల్ (పీపుల్స్ స్ట్రాంగ్ సహా వ్యవస్థాపకుడు)6. ఆదిత్య మిట్టల్ (డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, ఐఐటీ ఢిల్లీ) 7. గోవింద్ జైస్వాల్ (జాయింట్ సెక్రటరీ, కేంద్ర విద్యాశాఖ) -
ఆగస్టు 29న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: నాగార్జున (నటుడు); కె.రాధాకృష్ణన్ (శాస్త్రవేత్త); విశాల్ (నటుడు). ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజసంఖ్య. 9 పరిపూర్ణతకు నిదర్శనం. వీరి పుట్టిన తేదీ 29. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఈ సంవత్సరం కుజచంద్రుల ప్రభావంతో చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. దీనివల్ల విదేశీ యానం, స్థిరాస్తుల కొనుగోలు లేదా అభివృద్ధి జరుగుతుంది. 29 సంవత్సరాలు దాటిన వారికి మంచి మార్పులు వస్తాయి. ఇతర కులస్థులతో ప్రేమలో ఉన్న వారికి అంతగా ఫలప్రదంగా ఉండదు కాబట్టి తగిన జాగ్రత్త అవసరం. సూర్యుడు, గురువు సింహరాశిలో ఉండటం వల్ల రాజకీయాలలో ఉన్న వారికి పదవీ యోగం. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు కానీ, కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవడం కానీ జరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు, సబ్సిడీలు అందుతాయి. కుజుని ప్రభావం వల్ల తోటివారితో వాదనలు పెట్టుకుని దూరం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పదునైన ఆయుధాల వాడేటప్పుడు, వాహనాలను నడిపేటప్పుడూ అప్రమత్తత అవసరం. లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: శని, సోమ, మంగ, శుక్రవారాలు సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, వికలాంగులకు సాయం చేయడం, సోదరులను, తల్లిని కాని, తత్సమానులను కానీ ఆదరించడం, రక్తదానం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
ఇక నవ ఉపగ్రహ శకం
* బిట్స్ పిలానీ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ * వచ్చే ఏడాది చివరికి భారత్‌కు సొంత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ * ఈ ఏడాది మరో రెండు ‘ఐఆర్ఎన్ఎస్ఎస్’ ఉపగ్రహాల ప్రయోగం * అత్యంత వేగం, అధిక సమాచార ప్రసార సామర్థ్యమున్న శాటిలైట్ల రూపకల్పనకు ప్రణాళిక * సెకనుకు 100 జీబీల ప్రసార సామర్థ్యం.. భూమిపై అడుగు ఎత్తుగల వస్తువులను గుర్తించే వీలు * నాసాతో కలిసి ‘మైక్రోవేవ్ ఇమేజింగ్’ ఉపగ్రహం తయారీకి కసరత్తు * వచ్చే ఏడాది ‘ఆస్ట్రోశాట్’ ప్రయోగం సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన పాత ఉపగ్రహాల స్థానంలో పలు అత్యాధునిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళిక రూపొందించామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.రాధాకృష్ణన్ తెలిపారు. భూమి మీద ఉన్న అతి చిన్న దృశ్యాలను కూడా చిత్రీకరించే సామర్థ్యం గల ఉపగ్రహాల తయారీకి కసరత్తు చేస్తున్నామని చెప్పారు. భూమిపై ఒక అడుగు ఎత్తు గల వస్తువులను కూడా గమనించే సామర్థ్యం ఆ ఉపగ్రహాలకు ఉంటుందన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలోని బిట్స్ పిలానీ (హైదరాబాద్ క్యాంపస్)లో జరిగిన స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్, బిర్లా గ్రూపు సంస్థల అధినేత, బిట్స్ పిలానీ విద్యాసంస్థల కులపతి కుమార మంగళం బిర్లా, ఉప కులపతి బిజేంద్రనాథ్ జైన్, డెరైక్టర్ వీఎస్ రావు పాల్గొన్నారు. 589 మంది విద్యార్థులకు డిగ్రీలు, 91 మందికి ఉన్న త డిగ్రీలు, ముగ్గురికి డాక్టరేట్ పట్టాలను అందజేశారు. ఎస్.కె. హర్షిత (ఈఈఈ,ఫిజిక్స్)కు బంగారు పతకం, మయాంక్(సివిల్) వెండి పతకం, నిశీత్ కేతన్(ఈసీఈ)కు కాంస్య పతకాన్ని అందజేశారు. అలుమ్నస్ అవార్డును రాజురెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ప్రసంగించారు. 1971లో తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయానికి ఇస్రో బాలారిష్టాల్లో ఉందని, ఇప్పుడు తామెంతో సాధించామని చెప్పారు. త్రీడీ చిత్రాలను పంపగలిగే ‘ఇన్శాట్ త్రీడీ’ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించిన ఘనత మన దేశానికే దక్కిందన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని సుసంపన్నం చేసేందుకు వ్యూహాత్మక శక్తి సామర్థ్యాలను అందించామని గర్వంగా చెప్పగలననన్నారు. ఈ సందర్భంగా ఇస్రో భవిష్యత్తు ప్రణాళికల గురించి విద్యార్థులకు వివరించారు. రాధాకృష్ణన్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. - మన దేశం ప్రస్తుతం 10 సమాచార ఉపగ్రహాలను కలిగి ఉంది. ఇవి ప్రసార మాధ్యమాలు, డాటా కనెక్టివిటీ తదితర అవసరాలను తీరుస్తున్నాయి. భవిష్యత్తులో 15 కిలోవాట్ల శక్తి, సెకనుకు 100 గిగాబైట్ల వేగంతో సమాచారాన్ని ప్రసారం చేసే సామర్థ్యం గల ఉపగ్రహాల తయారీపై దృష్టి సారించాం. - ఆ ఉపగ్రహాల ద్వారా అత్యధిక వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. - నాసాతో కలిసి ‘డ్యూయల్ ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ ఇమేజింగ్’ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేస్తున్నాం. 2019-20 నాటికి ప్రయోగించనున్న ఈ ఉపగ్రహం తయారీలో ఇస్రో పూర్తిగా తన సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. - 2015 నాటికి ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్)’ ఏడు ఉపగ్రహాల ద్వారా స్వతంత్ర వ్యవస్థగా రూపుదిద్దుకోనుంది. దీని సహాయంతో భారతదేశంతో పాటు సరిహద్దుల ఆవల 1500 కిలోమీటర్ల పరిధిలో స్థితిగతులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రయోగించే ఏడు ఉపగ్రహాల్లో రెండింటిని ఇప్పటికే అంతరిక్షంలోకి పంపాం. ఈ ఏడాది మరో రెండు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. - అతినీల లోహిత, పరారుణ కాంతిని విశ్లేషించి ఖగోళ వస్తువులను గమనించేందుకు.. 2015లో ‘ఆస్ట్రోశాట్’ అనే కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాం. ఒక అడుగు ముందుండాలి: కుమార మంగళం బిర్లా జ్ఞాన సముపార్జనలో ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గగలమని కుమార మంగళం బిర్లా విద్యార్థులకు సూచించారు. గడిచిన దశాబ్ద కాలంలో ఇంటర్నెట్ జన జీవన శైలిలో ఎన్నో మార్పులు తెచ్చిందని, ఇప్పుడు అన్ని రంగాల్లో అది కీలకంగా మారిందని పేర్కొన్నారు. -
ఇస్రో ‘అరుణ’పతాక !
దశాబ్దాలుగా మానవుడి ఊహలతో దోబూచులాడుతున్న... మస్తిష్కానికి నిరంతరం పదునుబెడుతున్న అంగారకుడు మనకూ అందివచ్చినట్టే. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంనుంచి మంగళవారం మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం అంగారకుడు లక్ష్యంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఎలాంటి అవరోధాలూ లేకుండా ప్రారంభించింది. సరిగ్గా అనుకున్న సమయానికే నింగిలోకి దూసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ)-సీ25 రాకెట్... మామ్‌ను జయప్రదంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. మరో నెల్లాళ్లకు మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. గత నెల 28నే నిర్వహించాల్సిన ఈ ప్రయోగాన్ని రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ అవసరమైన స్థాయిలో లేదని గుర్తించి మంగళవారానికి వాయిదావేశారు. ఆదివారం ఉదయం 6.08 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ 56.30 గంటలపాటు కొనసాగింది. ఈ సమయమంతా శాస్త్రవేత్తలు రాత్రింబగళ్లు కళ్లల్లో ఒత్తులువేసుకుని అన్ని వ్యవస్థలనూ ఒకటికి పదిసార్లు నిశితంగా పర్యవేక్షించారు. దాదాపు 40 కోట్ల కిలోమీటర్ల దూరంలోని అరుణగ్ర హానికి ఇది 299 రోజుల్లో... అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్‌నాటికి చేరుతుంది. అటు తర్వాత మామ్‌లో ఉండే అయిదు ముఖ్యమైన పరికరాలు వెనువెంటనే పనులు ప్రారంభిస్తాయి. అంగారకుణ్ణి అన్ని కోణాల్లోనూ జల్లెడపడతాయి. అక్కడ ఒకప్పుడు జీవరాశి ఉండటానికి అనువైన పరిస్థితులుండేవా అన్న అంశాన్ని తేలుస్తాయి. అక్కడి వాతావరణంలో, గ్రహ ఉపరితలంలో ఉన్న పదార్ధాలేమిటో పట్టి చూపుతాయి. ప్రతి 780 రోజులకూ అరుణగ్రహం భూమికి అత్యంత చేరువగా వస్తుంది. ఈ చేరువయ్యే సమయం అక్టోబర్-నవంబర్ నెలల్లో వచ్చింది గనుక మామ్ ప్రయోగానికి ఇదే సరైన అదునుగా శాస్త్రవేత్తలు భావించారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం అనేక విధాల ఎన్నదగినది. అరుణగ్రహమే లక్ష్యంగా ప్రపంచంలో ఇంతవరకూ సాగిన ప్రయోగాలూ... వాటి ఫలితాలూ చూస్తే మన శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలేమిటో అర్ధమవుతాయి. 1960లో అప్పటి సోవియెట్ యూనియన్ అరుణగ్రహాన్ని గురిచూసినప్పటినుంచి ఇంతవరకూ 51 ప్రయోగాలు సాగాయి. అందులో కేవలం 21 ప్రయోగాలు మాత్రమే ఫలించాయి. ఇన్ని ప్రయోగాలనూ చేయగలిగింది అమెరికా, రష్యా, యూరోప్‌కి చెందిన మూడు అంతరిక్ష సంస్థలు మాత్రమే. అంతేకాదు...ఈ సంస్థలన్నీ తొలుత తప్పటడులే వేశాయి. ఏ ఒక్కటీ తొలి ప్రయోగాన్ని విజయవంతం చేయలేకపోయాయి. రష్యాతో కలిసి చైనా రెండేళ్లక్రితం అరుణగ్రహానికి ఉపగ్రహాన్ని పంపడానికి ప్రయత్నించి విఫలమైంది. అది భూకక్ష్యను దాటి ముందుకెళ్లలేక కూలిపోయింది. జపాన్ ప్రయత్నాలూ సఫలం కాలేదు. కానీ, మన శాస్త్రవేత్తలు మాత్రం తొలి ప్రయోగంలోనే తామేమిటో ప్రపంచానికి నిరూపించారు. తమ సత్తా ఏపాటిదో చూపారు. పైగా ఇతర అంతరిక్ష సంస్థలతో పోలిస్తే తక్కువ వ్యవధిలో, అతి తక్కువ వ్యయంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంచేశారు. ఇస్రో ఇంతకాలం సాగించిన ప్రయోగాలు ఒక ఎత్తయితే...ఇప్పుడు పంపిన మామ్ ప్రయోగం మరో ఎత్తు. భూ కక్ష్యను దాటి గ్రహాంతరయానానికి ఒక ఉపగ్రహాన్ని సిద్ధంచేసి పంపడమంటే మాటలు కాదు. అదొక సంక్లిష్టమైన ప్రయోగం. చంద్రయాన్-1 ప్రాజెక్టులో వచ్చిన అనుభవాలతో, దానికి పొడిగింపుగా ఇస్రో ఇప్పుడు ఈ సంక్లిష్ట ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఉపగ్రహానికి సంకేతాలు పంపడానికీ... దాన్నుంచి వచ్చే సమాచారాన్ని అందుకోవడానికీ మధ్య 40 నిమిషాల వ్యవధి పడుతుంది. అంటే, దాని గమనాన్ని నిరంతరం అత్యంత నిశితంగా పరిశీలించి, అంతే ఖచ్చితత్వంతో అంచనావేసుకుని తగినవిధంగా సంకేతాలు పంపాల్సి ఉంటుంది. ఆ సంకేతాలకు అనుగుణంగా అది ముందుకెళ్తుంది. చీకటి ఆకాశంలో తళుకులీనే తారల్లో అంగారకుడిది విశిష్ట స్థానం. నిప్పుల బంతిలా నిత్యం జ్వలిస్తున్నట్టు ఎర్రై కనబడే ఈ గ్రహం ఎప్పుడూ సంభ్రమాశ్చర్యాలకు చిరునామాయే! ఇప్పటికే అక్కడ పాత్‌ఫైండర్, సోజోర్నర్, స్పిరిట్వంటి పరిశోధనా నౌకలు ఎన్నో పరిశోధనలు చేశాయి. ఛాయాచిత్రాలు పంపాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అంగారకుడిపై జీవాన్వేషణకోసమని అంతరిక్ష నౌక ‘క్యూరియాసిటీ’ని పంపింది. అది అక్కడి బిలంలో ఏడాదికాలంలో 1.6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. దాదాపు 40వేల ఛాయాచిత్రాలను పంపడంతోపాటు సంచార ప్రయోగశాలగా కూడా పనిచేసింది. రెండుచోట్ల అంగారకుడి ఉపరితలాన్ని డ్రిల్లింగ్‌చేసి అక్కడి మట్టిలో ఉన్న పదార్ధాలేమిటో విశ్లేషించి చూపింది. ఒకప్పుడు అక్కడున్న నీరు ఆమ్లాలతోనూ, క్షారాలతోనూ కలసి లేదని, అది స్వచ్ఛమైనదేనని నిరూపించింది. అత్యంత వేగంతో నీరు పారినప్పుడు ఏర్పడే గులకరాళ్ల జాడనూ పట్టిచూపింది. ఇప్పుడు ఇస్రో పంపిన ‘మామ్’ ఈ జ్ఞానాన్ని మరింత విస్తరింపజేస్తుంది. అక్కడి వాతావరణంలో మీథేన్ వాయువు లేదని ఇంతవరకూ వెళ్లిన అంతరిక్ష నౌకలు తేల్చగా, మన ‘మామ్’ ఇంకాస్త లోతుగా దీన్ని పరిశోధిస్తుంది. అయితే, ఈ ప్రయోగాన్ని వాస్తవానికి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ) ద్వారా ప్రయోగించాల్సి ఉంది. అయితే, జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రోది విఫల చరిత్ర గనుక దాని జోలికిపోకుండా చంద్రయాన్‌ను విజయవంతంగా పరిపూర్తిచేసిన పీఎస్ఎల్వీనే ఆశ్రయించారు. ముందనుకున్నట్టు జీఎస్ఎల్వీ ద్వారా అయితే, ఇప్పుడు పంపినట్టు 5 పరికరాలతో సరిపెట్టకుండా 12 పరికరాలను పంపడం వీలయ్యేది. పరిశోధనల విస్తృతి మరింత పెరిగేది. అంతేకాక అంగారకుడికి ఇంకాస్త చేరువగా వెళ్లడం సాధ్యమయ్యేది. ఏమైనా ఎన్నో ప్రతికూలతలను అధిగమించి అతి తక్కువ వ్యవధిలో ఇంతటి విజయాన్ని సాధించి అగ్రరాజ్యాల సరసన మన దేశాన్ని నిలబెట్టిన శాస్త్రవేత్తల పట్టుదలకున జాతి మొత్తం జేజేలు పలుకుతుంది. -
ఇదొక మైలురాయి: ప్రణబ్‌ముఖర్జీ
న్యూఢిల్లీ: అరుణ గ్రహ రహస్యాలను చేధించేందుకు ఉద్దేశించిన మార్స్ ఆర్బిటార్ మిషన్(మంగళయాన్) ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హర్షం వ్యక్తంచేశారు. ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ మంగళవారం ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌కు సందేశం పంపించారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక మైలురాయని, ఈ విజయం మరింతమంది శాస్త్రజ్ఙులకు స్పూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మార్స్ మిషన్ విజయవంతం కావడం సంతోషకరమని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తెలిపారు. చరిత్రాత్మకం: ప్రధాని మార్స్ మిషన్ ప్రయోగం సఫలం కావడాన్నిచరిత్రాత్మక విజయంగా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అభివర్ణించారు. ప్రయోగం విజయవంతం కాగానే ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌కు ఆయన స్వయంగా ఫోన్ చేసి ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రజ్ఞులకు అభినందనలు తెలిపారు. అనంతరం రాధాకృష్ణన్, ఆయన సహచరులకు అభినందనలు తెలుపుతూ ప్రధాని ఒక సందేశం పంపించారు. ‘అంతరిక్ష వాహక నౌకల ప్రయోగంలో ఇస్రో అద్భుత నైపుణ్యం కలిగి ఉందనడానికి ఈ ప్రయోగం ఒక నిదర్శనం. భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో మైలురాయిగా నిలిచే ఈ మార్స్ మిషన్ భవిష్యత్ అంచెలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీరు ఈ దేశం గర్వించేలా చేస్తారన్న నమ్మకం నాకుంది’ అని ఆ సందేశంలో ప్రధాని పేర్కొన్నారు. భారతీయులంతా గర్విస్తున్న అద్భుత వైజ్ఞానిక విజయం ఇదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. భూమి పుత్రుడు అంగారకుడు! అంగారకుడిని భూగ్రహానికి కుమారుడిగా భారతీయులు భావిస్తారని, ఆ గ్రహంపై జీవం మనగలిగే పరిస్థితులున్నాయా, లేవా అన్న విషయం ఈ ప్రయోగం ద్వారా తేలుతుందని బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోషి అన్నారు. సీఎం, ఆర్థిక మంత్రి అభినందనలు పీఎస్ఎల్వీసీ-25 ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ రాధాకృష్ణన్, ఇతర శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలోని కీలకమైన నాలుగు దశలు పూర్తి చేసుకుని విజయవంతంగా మార్స్ మిషన్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి చేర్చడంతో భారత అంగారక యాత్ర 300 రోజుల ప్రయాణం విజయవంతంగా ప్రారంభమైందని సీఎం కార్యాలయం పేర్కొంది. ‘ఇస్రో’కు జగన్ అభినందనలు అంగారక గ్రహ యాత్రలో భాగంగా మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్‌తో పాటు శాస్త్రవేత్తల బృందానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. తొలి ప్రయత్నంలోనే అపూర్వ విజయం సాధించడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు తమ అసమాన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని ఆయన కొనియాడారు. ఈ ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం ద్వారా ప్రపంచంలో అంగారక యాత్రను చేపట్టిన నాలుగోదేశంగా భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఇస్రో.. భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలు సాధించాలని జగన్ ఒక సందేశంలో ఆకాంక్షించారు. మరిన్ని ప్రయోగాలు జరపాలి: బాబు పీఎస్ఎల్వీ సీ-25ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను చంద్రబాబు అభినందించారు. అంతరిక్ష రంగంలో భారత్ విజయపతాకను రెపరెపలాడించారని వారిని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు జరపాలని ఓ ప్రకటనలో అభిలషించారు. కాగా.. పీఎస్ఎల్వీసీ 25 ప్రయోగం విజయవంతం కావడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హర్షం వ్యక్తంచేశారు. ప్రజలను పిచ్చివాళ్లను చేయటమే.. ‘‘మార్స్ మిషన్ పూర్తిగా అర్థరహితం. మార్స్‌పై రోవర్ ప్రయోగం నిర్వహించిన నాసా అంగారకుడిపై జీవం ఆనవాలే లేదని బహిరంగంగా ప్రకటించింది. అయినప్పటికీ.. మార్స్ మీద జీవాన్వేషణ కోసం వెళుతున్నామని ప్రకటన చేయటం.. ప్రజలను పిచ్చివాళ్లను చేయటమే.’’ - మాధవన్నాయర్, ఇస్రో మాజీ చైర్మన్ దీపావళి టపాసుల ఖర్చులో పదో వంతే... ‘‘మార్స్ మిషన్‌పై రూ. 450 - 500 కోట్లు ఖర్చు చేశారంటూ భారతీయులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఇది ఖచ్చితంగా భారత్ గర్వించదగ్గ రోజు. పది అడుగులకన్నా ఎత్తుకు వెళ్లని దీపావళి టపాసుల కోసం ఒక్క రోజులో రూ. 5,000 కోట్లు ఖర్చుపెట్టటానికి భారతీయులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అందులో పదో వంతు అంగారకుడి వరకూ వెళ్లటానికి ఖర్చు చేస్తే ఎందుకింత గగ్గోలు?’’ - యు.ఆర్.రావు, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ పాలక మండలి చైర్మన్ ఇస్రోకు కీలక మైలురాయి.. ‘అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకునే యోగ్యత ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు పెరుగుతుంది. ఇస్రోకు ఇది చాలా కీలక మైలురాయి’ - కే కస్తూరిరంగన్, ఇస్రో మాజీ చైర్మన్ మాపై ఆధిక్యం చూపేందుకే: చైనా అంతరిక్షంలో శాంతిని నెలకొల్పేందుకు కలిసి పనిచేద్దామని అంతర్జాతీయ సమాజానికి చైనా పిలుపునిచ్చింది. భారత్ ప్రయోగించిన మార్స్ మిషన్ విజయవంతం కావడంపై చైనా స్పందించింది. ‘అంతరిక్షం మానవాళికందరికీ చెందుతుంది. దానిపై ప్రయోగాలు చేసేందుకు అన్ని దేశాలకు హక్కుంది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హాంగ్లీ వ్యాఖ్యానించారు. అయితే, చైనా అధికారిక మీడియా మాత్రం తమ దేశ అంతరిక్ష ప్రయోగాలపై పైచేయి సాధించేందుకే భారత్ ఈ ప్రయోగాలు చేస్తోందని విమర్శించింది. చైనా గతంలో చేపట్టిన మార్స్ ప్రయోగం విఫలమైంది. -
నేడు ‘మార్స్ మిషన్’ రిహార్సల్
శ్రీహరికోట నుంచి సాక్షి ప్రతినిధి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(ఎంవోఎం) ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఉపగ్రహాన్ని అంగారక గ్రహానికి మోసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ-సీ 25 రెడీ అయ్యింది. ఉపగ్రహ వాహక నౌకను మొదటి లాంచింగ్ ప్యాడ్‌లో సిద్ధం చేశారు. పీఎస్ఎల్వీ -సీ25 ప్రయోగానికి సంబంధించి లాంచ్ రిహార్సల్ గురువారం ఉదయం ప్రారంభం కానుంది. నవంబర్ 3వ తేదీ ఉదయం 6.08 నిమిషాలకు కౌంట్‌డౌన్ మొదలుకానుంది. యాభై ఆరున్నర గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగుతుంది. నవంబర్ 5 మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ25 నింగిలోకి దూసుకెళుతుంది. పీఎస్ఎల్వీ-సీ25 ప్రయోగానికి సంబంధించిన వివరాలను ‘సాక్షి’ ప్రత్యేకంగా సేకరించింది. గురువారం లాంచ్ రిహార్సల్ జరగనుండగా.. 2వ తేదీన కౌంట్‌డౌన్‌కు ముందు వ్యవహారాలను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తారు. మొత్తం ఐదు దశల్లో భూమి చుట్టూ తిప్పిన తర్వాత ఉపగ్రహాన్ని అంగారకుని వైపు పంపుతారు. డిసెంబర్ 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది అంగారకుని కక్ష్యలోకి చేరుకోవడానికి 300 రోజుల సమయం పడుతుందని అంచనా. 2014 సెప్టెంబర్ నాటికి ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అంగారక వాతావరణంలో మిథేన్ వాయువు ఉనికిని గుర్తించడం, క్యుటీరియం.. హెచ్3వో నిష్పత్తిని అంచనా వేయడం, మార్స్ ఫొటోలు తీయడం రూ. 450 కోట్ల విలువైన ఎంవోఎం ఉపగ్రహ ప్రయోగం ముఖ్య లక్ష్యాలు. ఇందుకోసం ఉపగ్రహంలో ఐదు శాస్త్రీయ పరికరాలను ఇస్త్రో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. మనకున్న పరిమితుల్లో ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం ‘షార్’లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపగ్రహం కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆరు రౌండ్ స్టేషన్లను వినియోగిస్తున్నామని, వీటిలో రెండు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని రెండు నౌకల్లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎస్సీఐ నలంద, ఎస్సీఐ యమునా నౌకలు దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉపగ్రహాన్ని పర్యవేక్షిస్తాయని చెప్పారు. చంద్రయాన్ 2 గురించి రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగంలో ఉపయోగించే ల్యాండర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో సొంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించామని, ఇందుకోసం అదనపు నిధులు సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి మానవసహిత యాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘షార్’లో మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆయనతో పాటు ‘షార్’ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, అసోసియేట్ డెరైక్టర్ వి.శేషగిరిరావు, డెరైక్టర్ కున్ని కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. పది నిమిషాలు గాయబ్ పీఎస్ఎల్వీ-సీ25 శ్రీహరికోట నుంచి ప్రయోగించిన అనంతరం మూడో దశ ముగిసిన తర్వాత ఒక పది నిమిషాల సేపు శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉండదు. ఉపగ్రహం కదలికలను పర్యవేక్షించే గ్రౌం డ్ నెట్‌వర్క్‌ల మధ్య ఇది కదులుతుండటమే దీనికి కారణం. నాలుగో దశ ప్రయోగం మొదలయ్యే కొద్ది సెకన్ల ముందు దక్షిణ పసిఫిక్‌లోని మొదటి కేంద్రం ఉపగ్రహం సంకేతాలను అందుకుంటుంది. -
5న ‘మార్స్ మిషన్’ ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహ ప్రయోగం నవంబర్ 5న మధ్యాహ్నం 2.36 గంటలకు నిర్వహించనున్నారు. మంగళవారం బెంగళూరు నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారికంగా ప్రయోగ తేదీని ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించి 56.30 గంటల ముందు అంటే నవంబర్ 3న ఉదయం 6 గంటలకు కౌంట్‌డౌన్ మొదలవుతుంది. నవంబర్ 5న ప్రయాణం మొదలు పెట్టే ఎంవోఎం వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 19న లాంచింగ్ తేదీ ప్రకటించాల్సి ఉన్నా పసిఫిక్ మహా సముద్రంలో వాతావరణం అనుకూలించలేదని వాయిదా వేశారు. దానిని ఇప్పుడు ప్రకటించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదికపై నుంచి అత్యాధునిక ఎక్స్ఎల్ సాంకేతికతతో కూడిన పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహకనౌకద్వారా 1,350 కిలోల బరువు, రూ. 450 కోట్ల విలువైన ఎంవోఎం ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. -
జీఎస్ఎల్వీ ప్రయోగం వాయిదా
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జీఎస్ఎల్వీ-డీ5 ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది. సోమవారం సాయంత్రం 4.50 గంటలకు నిర్వహించాల్సిన ఈ ప్రయోగాన్ని.. రెండో దశలో ఇంధనం లీకేజీని గుర్తించడంతో నిలిపేశారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగంలో కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా సాగి ఇలా మళ్లీ వాయిదా పడింది. ఇందులోని క్రయోజనిక్ దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ప్రయోగానికి 75 నిమిషాల ముందు.. వాస్తవానికి దీన్ని జూలై నెలాఖరులో ప్రయోగించాల్సి ఉండగా ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది. ప్రయోగానికి 29 గంటల ముందు ఆదివారం ఉదయం 11.50 గంటలకు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ‘సతీష్ ధావన్ స్పేస్ సెంటర్’(షార్)లో కౌంట్‌డౌన్ ప్రకియను ప్రారంభించారు. అందులో భాగంగా ద్రవ ఇంధన స్ట్రాపాన్ బూస్టర్ల రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపారు. ఆ తరువాత సోమవారం ఉదయం క్రయోజనిక్ దశలో క్రయో ఇంధనాన్ని(లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనం) నింపే ప్రక్రియను కూడా పూర్తి చేశారు. కౌంట్ డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతున్న సమయంలో మరో 75 నిమిషాల్లో ప్రయోగం జరగాల్సి ఉండగా రాకెట్‌లోని రెండో దశ(జీఎస్-2)లో ఇంధనం లీకేజీ ఉన్నట్లు ఇస్రో చైర్మన్ గుర్తించారు. దీంతో సరిగ్గా 3.45 గంటలకు మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి రాకెట్ వ్యవస్థలన్నింటినీ నిలిపి వేశారు. క్రయోజనిక్ దశలో కూడా సాంకేతిక లోపం తలెత్తిందని మొదట్లో ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. వాయిదా వల్ల క్రయోజనిక్ దశలో ఉపయోగించే క్రయో ఇంధనం పనికి రాకుండా పోతుంది. దీని వల్ల పెద్ద నష్టమేమీ ఉండదని షార్ వర్గాలు అంటున్నాయి. ఈ రాకెట్ ద్వారా 1982 కిలోల జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లోనే ప్రయోగం: రాధాకృష్ణన్ షార్ నుంచి సోమవారం సాయంత్రం 4.50 గంటలకు ప్రయోగించాల్సిన జీఎస్ఎల్వీ డీ5 రాకెట్లో చిన్నపాటి సాంకేతిక లోపం ఏర్పడినందువల్ల ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ ప్రకటించారు. ప్రయోగాన్ని నిలిపివేసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతా సక్రమంగా జరుగుతోందనుకున్న తరుణంలో రెండో దశలో లీకేజీ రావడంతో వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు. లీకేజీ కారణాలపై అధ్యయనం చేసి మరికొన్ని రోజుల్లోనే ప్రయోగాన్ని చేపడతామని చెప్పారు. రాకెట్లో నింపిన ఇంధనాన్ని వెనక్కి తీసి మంగళవారం జీఎస్ఎల్వీ రాకెట్‌ను హుంబ్లికల్ టవర్ (ప్రయోగ వేదిక) నుంచి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ (వ్యాబ్)కు తరలిస్తామని చెప్పారు. రాకెట్ విడిభాగాలను మళ్లీ విడదీసి రెండో దశలోని లీకేజీని అరికట్టి కొద్ది రోజుల్లోనే ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతామని చెప్పారు. ప్రయోగం వాయిదా పడడం వల్ల పెద్దగా నష్టమేమీ లేదని, దీనిపై ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదంటూ ఆయన శాస్త్రవేత్తల వెన్ను తట్టారు. విలేకరుల సమావేశంలో షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ఎల్పీఎస్సీ డెరైక్టర్ ఎం.చంద్రదత్తన్, శాటిలైట్ డెరైక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. చెంగాలమ్మ ఆలయానికి రానందుకే! ప్రయోగం జరిగిన ప్రతిసారీ ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని, శ్రీకాళహస్తిలో శివుడిని, సూళ్లూరుపేటలో చెంగాలమ్మ పరమేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ దఫా చెంగాలమ్మ ఆలయానికి రాకపోవడంతో ప్రయోగానికి అంతరాయం ఏర్పడిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నా రు. 2010లో కూడా చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేయకపోవడం, ఆ ప్రయోగం కూడా విఫలమవడంతో ఇక్కడి వారంతా దీన్ని మరింత బలంగా నమ్ముతున్నారు. -
19న జీఎస్ఎల్వీ డీ-5 ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : జీఎస్ఎల్వీ డీ-5ను ఈనెల 19 సాయంత్రం 4.50 గంటలకు ప్రయోగించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మంగళవారం జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో ముహూర్తం నిర్ణయించారు. ఈ విషయాన్ని వెహికల్ డెరైక్టర్ డాక్టర్ బీఎన్ సురేష్ ప్రయోగతేదీని లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు తెలియజేశారు.