ఇక నవ ఉపగ్రహ శకం
* బిట్స్ పిలానీ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్
* వచ్చే ఏడాది చివరికి భారత్‌కు సొంత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ
* ఈ ఏడాది మరో రెండు ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్’ ఉపగ్రహాల ప్రయోగం
* అత్యంత వేగం, అధిక సమాచార ప్రసార సామర్థ్యమున్న శాటిలైట్ల రూపకల్పనకు ప్రణాళిక
* సెకనుకు 100 జీబీల ప్రసార సామర్థ్యం.. భూమిపై అడుగు ఎత్తుగల వస్తువులను గుర్తించే వీలు
* నాసాతో కలిసి ‘మైక్రోవేవ్ ఇమేజింగ్’ ఉపగ్రహం తయారీకి కసరత్తు
* వచ్చే ఏడాది ‘ఆస్ట్రోశాట్’ ప్రయోగం
సాక్షి, హైదరాబాద్: కాలం చెల్లిన పాత ఉపగ్రహాల స్థానంలో పలు అత్యాధునిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళిక రూపొందించామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.రాధాకృష్ణన్ తెలిపారు. భూమి మీద ఉన్న అతి చిన్న దృశ్యాలను కూడా చిత్రీకరించే సామర్థ్యం గల ఉపగ్రహాల తయారీకి కసరత్తు చేస్తున్నామని చెప్పారు. భూమిపై ఒక అడుగు ఎత్తు గల వస్తువులను కూడా గమనించే సామర్థ్యం ఆ ఉపగ్రహాలకు ఉంటుందన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలోని బిట్స్ పిలానీ (హైదరాబాద్ క్యాంపస్)లో జరిగిన స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్, బిర్లా గ్రూపు సంస్థల అధినేత, బిట్స్ పిలానీ విద్యాసంస్థల కులపతి కుమార మంగళం బిర్లా, ఉప కులపతి బిజేంద్రనాథ్ జైన్, డెరైక్టర్ వీఎస్ రావు పాల్గొన్నారు.
589 మంది విద్యార్థులకు డిగ్రీలు, 91 మందికి ఉన్న త డిగ్రీలు, ముగ్గురికి డాక్టరేట్ పట్టాలను అందజేశారు. ఎస్.కె. హర్షిత (ఈఈఈ,ఫిజిక్స్)కు బంగారు పతకం, మయాంక్(సివిల్) వెండి పతకం, నిశీత్ కేతన్(ఈసీఈ)కు కాంస్య పతకాన్ని అందజేశారు. అలుమ్నస్ అవార్డును రాజురెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ ప్రసంగించారు. 1971లో తాను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయానికి ఇస్రో బాలారిష్టాల్లో ఉందని, ఇప్పుడు తామెంతో సాధించామని చెప్పారు. త్రీడీ చిత్రాలను పంపగలిగే ‘ఇన్‌శాట్ త్రీడీ’ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించిన ఘనత మన దేశానికే దక్కిందన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని సుసంపన్నం చేసేందుకు వ్యూహాత్మక శక్తి సామర్థ్యాలను అందించామని గర్వంగా చెప్పగలననన్నారు. ఈ సందర్భంగా ఇస్రో భవిష్యత్తు ప్రణాళికల గురించి విద్యార్థులకు వివరించారు. రాధాకృష్ణన్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
- మన దేశం ప్రస్తుతం 10 సమాచార ఉపగ్రహాలను కలిగి ఉంది. ఇవి ప్రసార మాధ్యమాలు, డాటా కనెక్టివిటీ తదితర అవసరాలను తీరుస్తున్నాయి. భవిష్యత్తులో 15 కిలోవాట్ల శక్తి, సెకనుకు 100 గిగాబైట్‌ల వేగంతో సమాచారాన్ని ప్రసారం చేసే సామర్థ్యం గల ఉపగ్రహాల తయారీపై దృష్టి సారించాం.
- ఆ ఉపగ్రహాల ద్వారా అత్యధిక వేగవంతమైన ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
- నాసాతో కలిసి ‘డ్యూయల్ ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ ఇమేజింగ్’ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేస్తున్నాం. 2019-20 నాటికి ప్రయోగించనున్న ఈ ఉపగ్రహం తయారీలో ఇస్రో పూర్తిగా తన సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది.
- 2015 నాటికి ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్)’ ఏడు ఉపగ్రహాల ద్వారా స్వతంత్ర వ్యవస్థగా రూపుదిద్దుకోనుంది. దీని సహాయంతో భారతదేశంతో పాటు సరిహద్దుల ఆవల 1500 కిలోమీటర్ల పరిధిలో స్థితిగతులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రయోగించే ఏడు ఉపగ్రహాల్లో రెండింటిని ఇప్పటికే అంతరిక్షంలోకి పంపాం. ఈ ఏడాది మరో రెండు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
- అతినీల లోహిత, పరారుణ కాంతిని విశ్లేషించి ఖగోళ వస్తువులను గమనించేందుకు.. 2015లో ‘ఆస్ట్రోశాట్’ అనే కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాం.
ఒక అడుగు ముందుండాలి: కుమార మంగళం బిర్లా
జ్ఞాన సముపార్జనలో ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉంటేనే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గగలమని కుమార మంగళం బిర్లా విద్యార్థులకు సూచించారు. గడిచిన దశాబ్ద కాలంలో ఇంటర్‌నెట్ జన జీవన శైలిలో ఎన్నో మార్పులు తెచ్చిందని, ఇప్పుడు అన్ని రంగాల్లో అది కీలకంగా మారిందని పేర్కొన్నారు.