నేడు ‘మార్స్ మిషన్’ రిహార్సల్
శ్రీహరికోట నుంచి సాక్షి ప్రతినిధి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్(ఎంవోఎం) ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఉపగ్రహాన్ని అంగారక గ్రహానికి మోసుకెళ్లేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ 25 రెడీ అయ్యింది. ఉపగ్రహ వాహక నౌకను మొదటి లాంచింగ్ ప్యాడ్‌లో సిద్ధం చేశారు. పీఎస్‌ఎల్‌వీ -సీ25 ప్రయోగానికి సంబంధించి లాంచ్ రిహార్సల్ గురువారం ఉదయం ప్రారంభం కానుంది. నవంబర్ 3వ తేదీ ఉదయం 6.08 నిమిషాలకు కౌంట్‌డౌన్ మొదలుకానుంది. యాభై ఆరున్నర గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగుతుంది.
నవంబర్ 5 మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ25 నింగిలోకి దూసుకెళుతుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ25 ప్రయోగానికి సంబంధించిన వివరాలను ‘సాక్షి’ ప్రత్యేకంగా సేకరించింది. గురువారం లాంచ్ రిహార్సల్ జరగనుండగా.. 2వ తేదీన కౌంట్‌డౌన్‌కు ముందు వ్యవహారాలను ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తారు. మొత్తం ఐదు దశల్లో భూమి చుట్టూ తిప్పిన తర్వాత ఉపగ్రహాన్ని అంగారకుని వైపు పంపుతారు. డిసెంబర్ 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది అంగారకుని కక్ష్యలోకి చేరుకోవడానికి 300 రోజుల సమయం పడుతుందని అంచనా. 2014 సెప్టెంబర్ నాటికి ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అంగారక వాతావరణంలో మిథేన్ వాయువు ఉనికిని గుర్తించడం, క్యుటీరియం.. హెచ్3వో నిష్పత్తిని అంచనా వేయడం, మార్స్ ఫొటోలు తీయడం రూ. 450 కోట్ల విలువైన ఎంవోఎం ఉపగ్రహ ప్రయోగం ముఖ్య లక్ష్యాలు.
ఇందుకోసం ఉపగ్రహంలో ఐదు శాస్త్రీయ పరికరాలను ఇస్త్రో శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. మనకున్న పరిమితుల్లో ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం ‘షార్’లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపగ్రహం కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆరు రౌండ్ స్టేషన్లను వినియోగిస్తున్నామని, వీటిలో రెండు దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని రెండు నౌకల్లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎస్‌సీఐ నలంద, ఎస్‌సీఐ యమునా నౌకలు దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉపగ్రహాన్ని పర్యవేక్షిస్తాయని చెప్పారు. చంద్రయాన్ 2 గురించి రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగంలో ఉపయోగించే ల్యాండర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో సొంతంగా తయారు చేసుకోవాలని నిర్ణయించామని, ఇందుకోసం అదనపు నిధులు సమకూర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి మానవసహిత యాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘షార్’లో మూడో ప్రయోగ వేదిక నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆయనతో పాటు ‘షార్’ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, అసోసియేట్ డెరైక్టర్ వి.శేషగిరిరావు, డెరైక్టర్ కున్ని కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
పది నిమిషాలు గాయబ్
పీఎస్‌ఎల్‌వీ-సీ25 శ్రీహరికోట నుంచి ప్రయోగించిన అనంతరం మూడో దశ ముగిసిన తర్వాత ఒక పది నిమిషాల సేపు శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉండదు. ఉపగ్రహం కదలికలను పర్యవేక్షించే గ్రౌం డ్ నెట్‌వర్క్‌ల మధ్య ఇది కదులుతుండటమే దీనికి కారణం. నాలుగో దశ ప్రయోగం మొదలయ్యే కొద్ది సెకన్ల ముందు దక్షిణ పసిఫిక్‌లోని మొదటి కేంద్రం ఉపగ్రహం సంకేతాలను అందుకుంటుంది.