పీఎస్‌ఎల్‌వీ సీ25 ప్రయోగం విజయవంతం
సూళ్లూరుపేట: అంతరిక్ష రంగంలో భారత్ విజయకేతనం ఎగురవేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ25 ప్రయోగం విజయవంతమైంది. ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి బయలుదేరిన పీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహకనౌక 44 నిమిషాల తర్వాత లక్ష్యాన్ని చేరుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో షార్లో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. షార్ శాస్తవేత్తలకు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. ప్రయోగంలో పాలుపంచుకున్న సీనియర్ శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. తొలి ప్రయత్నంలోనే మంగళయాన్ విజయవంతం కావడం పట్ల హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.
భారత అంతరిక్ష ప్రయోగాల్లో మార్స్ మిషన్ కీలకమైనది మిషన్ డైరెక్టర్ కున్హికృష్ణన్ అన్నారు. ఈ విజయం తొలి అడుగు అని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ రామకృష్ణన్ అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తల సమిష్టి విజయమిదని షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రయోగంలో పాలుపంచుకున్న వారందరికీ ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు.