దశాబ్దాలుగా మానవుడి ఊహలతో దోబూచులాడుతున్న... మస్తిష్కానికి నిరంతరం పదునుబెడుతున్న అంగారకుడు మనకూ అందివచ్చినట్టే. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంనుంచి మంగళవారం మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం అంగారకుడు లక్ష్యంగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ఎలాంటి అవరోధాలూ లేకుండా ప్రారంభించింది. సరిగ్గా అనుకున్న సమయానికే నింగిలోకి దూసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్‌ఎల్‌వీ)-సీ25 రాకెట్... మామ్‌ను జయప్రదంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. మరో నెల్లాళ్లకు మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. గత నెల 28నే నిర్వహించాల్సిన ఈ ప్రయోగాన్ని రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ అవసరమైన స్థాయిలో లేదని గుర్తించి మంగళవారానికి వాయిదావేశారు. ఆదివారం ఉదయం 6.08 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ 56.30 గంటలపాటు కొనసాగింది. ఈ సమయమంతా శాస్త్రవేత్తలు రాత్రింబగళ్లు కళ్లల్లో ఒత్తులువేసుకుని అన్ని వ్యవస్థలనూ ఒకటికి పదిసార్లు నిశితంగా పర్యవేక్షించారు. దాదాపు 40 కోట్ల కిలోమీటర్ల దూరంలోని అరుణగ్ర హానికి ఇది 299 రోజుల్లో... అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్‌నాటికి చేరుతుంది. అటు తర్వాత మామ్‌లో ఉండే అయిదు ముఖ్యమైన పరికరాలు వెనువెంటనే పనులు ప్రారంభిస్తాయి. అంగారకుణ్ణి అన్ని కోణాల్లోనూ జల్లెడపడతాయి. అక్కడ ఒకప్పుడు జీవరాశి ఉండటానికి అనువైన పరిస్థితులుండేవా అన్న అంశాన్ని తేలుస్తాయి. అక్కడి వాతావరణంలో, గ్రహ ఉపరితలంలో ఉన్న పదార్ధాలేమిటో పట్టి చూపుతాయి.
ప్రతి 780 రోజులకూ అరుణగ్రహం భూమికి అత్యంత చేరువగా వస్తుంది. ఈ చేరువయ్యే సమయం అక్టోబర్-నవంబర్ నెలల్లో వచ్చింది గనుక మామ్ ప్రయోగానికి ఇదే సరైన అదునుగా శాస్త్రవేత్తలు భావించారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం అనేక విధాల ఎన్నదగినది. అరుణగ్రహమే లక్ష్యంగా ప్రపంచంలో ఇంతవరకూ సాగిన ప్రయోగాలూ... వాటి ఫలితాలూ చూస్తే మన శాస్త్రవేత్తల ప్రతిభాపాటవాలేమిటో అర్ధమవుతాయి. 1960లో అప్పటి సోవియెట్ యూనియన్ అరుణగ్రహాన్ని గురిచూసినప్పటినుంచి ఇంతవరకూ 51 ప్రయోగాలు సాగాయి. అందులో కేవలం 21 ప్రయోగాలు మాత్రమే ఫలించాయి. ఇన్ని ప్రయోగాలనూ చేయగలిగింది అమెరికా, రష్యా, యూరోప్‌కి చెందిన మూడు అంతరిక్ష సంస్థలు మాత్రమే. అంతేకాదు...ఈ సంస్థలన్నీ తొలుత తప్పటడులే వేశాయి. ఏ ఒక్కటీ తొలి ప్రయోగాన్ని విజయవంతం చేయలేకపోయాయి. రష్యాతో కలిసి చైనా రెండేళ్లక్రితం అరుణగ్రహానికి ఉపగ్రహాన్ని పంపడానికి ప్రయత్నించి విఫలమైంది. అది భూకక్ష్యను దాటి ముందుకెళ్లలేక కూలిపోయింది. జపాన్ ప్రయత్నాలూ సఫలం కాలేదు. కానీ, మన శాస్త్రవేత్తలు మాత్రం తొలి ప్రయోగంలోనే తామేమిటో ప్రపంచానికి నిరూపించారు. తమ సత్తా ఏపాటిదో చూపారు. పైగా ఇతర అంతరిక్ష సంస్థలతో పోలిస్తే తక్కువ వ్యవధిలో, అతి తక్కువ వ్యయంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంచేశారు. ఇస్రో ఇంతకాలం సాగించిన ప్రయోగాలు ఒక ఎత్తయితే...ఇప్పుడు పంపిన మామ్ ప్రయోగం మరో ఎత్తు. భూ కక్ష్యను దాటి గ్రహాంతరయానానికి ఒక ఉపగ్రహాన్ని సిద్ధంచేసి పంపడమంటే మాటలు కాదు. అదొక సంక్లిష్టమైన ప్రయోగం. చంద్రయాన్-1 ప్రాజెక్టులో వచ్చిన అనుభవాలతో, దానికి పొడిగింపుగా ఇస్రో ఇప్పుడు ఈ సంక్లిష్ట ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఉపగ్రహానికి సంకేతాలు పంపడానికీ... దాన్నుంచి వచ్చే సమాచారాన్ని అందుకోవడానికీ మధ్య 40 నిమిషాల వ్యవధి పడుతుంది. అంటే, దాని గమనాన్ని నిరంతరం అత్యంత నిశితంగా పరిశీలించి, అంతే ఖచ్చితత్వంతో అంచనావేసుకుని తగినవిధంగా సంకేతాలు పంపాల్సి ఉంటుంది. ఆ సంకేతాలకు అనుగుణంగా అది ముందుకెళ్తుంది.
చీకటి ఆకాశంలో తళుకులీనే తారల్లో అంగారకుడిది విశిష్ట స్థానం. నిప్పుల బంతిలా నిత్యం జ్వలిస్తున్నట్టు ఎర్రై కనబడే ఈ గ్రహం ఎప్పుడూ సంభ్రమాశ్చర్యాలకు చిరునామాయే! ఇప్పటికే అక్కడ పాత్‌ఫైండర్, సోజోర్నర్, స్పిరిట్‌వంటి పరిశోధనా నౌకలు ఎన్నో పరిశోధనలు చేశాయి. ఛాయాచిత్రాలు పంపాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అంగారకుడిపై జీవాన్వేషణకోసమని అంతరిక్ష నౌక ‘క్యూరియాసిటీ’ని పంపింది. అది అక్కడి బిలంలో ఏడాదికాలంలో 1.6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. దాదాపు 40వేల ఛాయాచిత్రాలను పంపడంతోపాటు సంచార ప్రయోగశాలగా కూడా పనిచేసింది. రెండుచోట్ల అంగారకుడి ఉపరితలాన్ని డ్రిల్లింగ్‌చేసి అక్కడి మట్టిలో ఉన్న పదార్ధాలేమిటో విశ్లేషించి చూపింది. ఒకప్పుడు అక్కడున్న నీరు ఆమ్లాలతోనూ, క్షారాలతోనూ కలసి లేదని, అది స్వచ్ఛమైనదేనని నిరూపించింది. అత్యంత వేగంతో నీరు పారినప్పుడు ఏర్పడే గులకరాళ్ల జాడనూ పట్టిచూపింది.
ఇప్పుడు ఇస్రో పంపిన ‘మామ్’ ఈ జ్ఞానాన్ని మరింత విస్తరింపజేస్తుంది. అక్కడి వాతావరణంలో మీథేన్ వాయువు లేదని ఇంతవరకూ వెళ్లిన అంతరిక్ష నౌకలు తేల్చగా, మన ‘మామ్’ ఇంకాస్త లోతుగా దీన్ని పరిశోధిస్తుంది. అయితే, ఈ ప్రయోగాన్ని వాస్తవానికి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) ద్వారా ప్రయోగించాల్సి ఉంది. అయితే, జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇస్రోది విఫల చరిత్ర గనుక దాని జోలికిపోకుండా చంద్రయాన్‌ను విజయవంతంగా పరిపూర్తిచేసిన పీఎస్‌ఎల్‌వీనే ఆశ్రయించారు. ముందనుకున్నట్టు జీఎస్‌ఎల్‌వీ ద్వారా అయితే, ఇప్పుడు పంపినట్టు 5 పరికరాలతో సరిపెట్టకుండా 12 పరికరాలను పంపడం వీలయ్యేది. పరిశోధనల విస్తృతి మరింత పెరిగేది. అంతేకాక అంగారకుడికి ఇంకాస్త చేరువగా వెళ్లడం సాధ్యమయ్యేది. ఏమైనా ఎన్నో ప్రతికూలతలను అధిగమించి అతి తక్కువ వ్యవధిలో ఇంతటి విజయాన్ని సాధించి అగ్రరాజ్యాల సరసన మన దేశాన్ని నిలబెట్టిన శాస్త్రవేత్తల పట్టుదలకున జాతి మొత్తం జేజేలు పలుకుతుంది.
ఇస్రో ‘అరుణ’పతాక !
Published Wed, Nov 6 2013 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM
Advertisement
Advertisement