20 ఏళ్ల శ్రమ ఫలించింది.. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ 20 years of toil on cryogenic engine has paid off', says ISRO chairman K. Radhakrishnan | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల శ్రమ ఫలించింది.. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్

Published Mon, Jan 6 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

20 ఏళ్ల శ్రమ ఫలించింది.. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్

 సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ఇస్రో  20 ఏళ్లు శ్రమించి సొంతంగా తయారు చేసిన క్రయోజెనిక్ ఇంజన్‌తోతొలి విజయం సొంతం చేసుకున్నామని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కె.రాధాకష్ణన్ అన్నారు. తమ కష్టం ఫలించిందని, ఇది ఇస్రో  శాస్త్రవేత్తల సమష్టి విజయమని పేర్కొన్నారు. దీని వెనుక వారి మొక్కవోని కృషి ఉందన్నారు. క్రయోజెనిక్ ఇంజిన్లను తయారు చేయగల కొద్ది దేశాల సరసన భారత్ నిలిచిందని, భవిష్యత్తులో జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో భారీ ప్రయోగాలు చేపట్టాలని నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఆదివారం జీఎస్‌ఎల్‌వీ డీ5 ప్రయోగం విజయం తర్వాత షార్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విలేకర్ల సమావేశంలో షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ప్రాజెక్ట్ డెరైక్టర్ ఎన్‌ఆర్‌వీ కర్త, శాటిలైట్ డెరైక్టర్ ఎం నాగేశ్వరరావు, ఎల్‌పీఎస్‌సీ డెరైక్టర్ ఎం.చంద్రదత్తన్, స్పేస్ అప్లికేషన్ డెరైక్టర్ ఏఎస్ కిరణ్‌కుమార్, ఎన్‌ఆర్‌ఈ డెరైక్టర్ వీకే దడ్వాల్, మిషన్ డెరైక్టర్ డాక్టర్ కె.శివన్, వీఎస్‌ఎస్‌సీ డెరైక్టర్ ఎస్.రామకృష్ణన్, ఐసాక్ డెరైక్టర్ ఎస్‌కె. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తాజా ప్రయోగంపై, ఇస్రో భవిష్యత్ కార్యక్రమాలపై రాధాకృష్ణన్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..

     ఒక క్రయోజనిక్ ఇంజిన్‌ను రూపొందించాలంటే 9 నుంచి 10 నెలలు పడుతుంది.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజన్లతో 2010 లో చేసిన ప్రయోగం విఫలమయ్యాయి. గత ఏడాది జీఎస్‌ఎల్‌వీ డీ5 వాయిదా పడింది. ఈ లోపాలను సవరించుకోవడానికి 31 సార్లు భూస్థిర పరీక్షలు జరిపాం. షార్‌లోని రెండో లాంచ్ ప్యాడ్ మీదా పరీక్షలు నిర్వహించాం. ఇప్పుడు జీశాట్-14 ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ-డీ5 రాకెట్ ద్వారా నిర్దేశిత కక్ష్యలో నిర్ణీత సమయంలో ప్రవేశపెట్టాం. నూతన సంవత్సరంలో భారతజాతి గర్వించదగ్గ విజయం నమోదు చేశాం. గత ఏడాది మార్స్ మిషన్ ప్రయోగం విజయవంతంగా కాగానే క్రయోజెనిక్ దశలో పరిణతి సాధించి, విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. దేశ రుణం తీర్చుకున్నాం.
     ఈ విజయంతో జీశాట్-6, జీశాట్-7ఏ, జీశాట్-9, చంద్రయాన్ లాంటి భారీ ఉపగ్రహాల ప్రయోగాలకు మార్గం సుగమమైంది. ఇకపై భారీ లక్ష్యాలతో వాణిజ్య ప్రయోగాలపై దృష్టి పెడతాం.
     2015లో చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహిస్తాం. రాకెట్ గమనాలను అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో క్రయోజెనిక్ ఇంజిన్‌తో అత్యాధునిక జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగాన్ని చేపడతాం. 4 టన్నుల బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని పంపుతాం. 10 నెలలకు ఓసారి జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలకు సిద్ధమవుతున్నాం. దీంతో వాణిజ్య ప్రయోగాలు, అవకాశాలు పెరుగుతాయి.
     జీశాట్-15, 16, 17, 18 సమాచార ఉపగ్రహాలను పంపేందుకు సిద్ధమవుతున్నాం. ఏడాదికి 8 ప్రయోగాలు చేసేందుకు రూ. 300 కోట్లతో ప్రయోగ వేదికలకు అనుసంధానంగా రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నాం.
     ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్‌లో రెండో ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ24 ద్వారా ఫిబ్రవరిలో ప్రయోగిస్తాం. సమాచార రంగంలో మార్పుల కోసం నాసాతో కలిసి సింథ టిక్ అపాచీ రాడార్ శాటిలైట్‌ను ప్రయోగిస్తాం.
 
 గడుసు బాలుడు మాట విన్నాడు
 
 జీఎస్‌ఎల్‌వీని మేం (ఇస్రో) గడుసు బాలుడిగా పిలిచేవాళ్లం. కానీ ఈ రోజు ఆ గడుసు బాలుడు బుద్ధిమంతుడిలా మాట విన్నాడు! - ఎస్. రామకృష్ణన్ (డెరైక్టర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్)
 
 ప్రణబ్, మన్మోహన్, మోడీ అభినందనలు
 
 న్యూఢిల్లీ: జీఎస్‌ఎల్‌వీ-డీ5ని విజయవంతంగా ప్రయోగించడం శాస్త్ర సాంకేతిక రంగాల్లో మైలురాయి వంటిదని  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ అభివర్ణించారు. ప్రయోగాన్ని నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందంటూ అభినందించారు. భారత్ దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌ను వాడి అంతరిక్ష పరిజ్ఞానంలో కాకలు తీరిన కొద్ది దేశాల సరసన చేరిందని అన్సారీ పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా అభినందించారు.
 
 సీఎం, బాబు ప్రశంసలు
 
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతి పక్ష నేత చంద్రబాబు ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఈరోజు దేశ చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసించారు.
 
 ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు
 
 సాక్షి, హైదరాబాద్: జీఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయో గం విజయవంత మవడంపై ఇస్రోకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. దేశీయ పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజిన్‌ను రూపొందించి శాస్త్రవేత్తలు దేశ కీర్తిని నలువైపులా చాటారని కొనియాడారు.
 
 షార్‌లో మిన్నంటిన సంబరం
 
 సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: జీఎస్‌ఎల్‌వీ డీ5 విజయంతో షార్‌లో పండగ వాతావరణం నెలకొంది.  శ్రీహరికోటలోని భవనాల మీద నుంచి షార్ ఉద్యోగుల కుటుంబాలు, పిల్లలు రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. బందోబస్తులో ఉన్న పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మీడియా సెంటర్‌లోని టీవీల్లో ప్రయోగాన్ని వీక్షిస్తూ సంతోషం పంచుకున్నారు. సూళ్లూరుపేట, తడ ప్రాంత ప్రజలు తమ ఊళ్లలోని భవనాలు ఎక్కి రాకెట్ గమనాన్ని తిలకించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే తొలి ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు.

 కన్నీటిపర్యంతమైన నంబినారాయణన్

 తిరువనంతపురం: ఇస్రో అంతరిక్ష పరిజ్ఞానాన్ని అమ్ముకున్నారనే ఆరోపణ ఎదుర్కొన్న ఆ సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబినారాయణన్ జీస్‌ఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయోగంపై హర్షం వ్యక్తం చేశారు. ఆనందంతో కన్నీటి  పర్యంతమయ్యారు. ‘ఆనాడు నేను అమ్ముకున్నానన్నది ఈ పరిజ్ఞానాన్నే’ అని ఉద్వేగంగా అన్నారు. నంబినారాయణ్ 1991లో ఇస్రో క్రయోజెనిక్ టెక్నాలజీ అభివృద్ధి ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేశారు. ఇస్రో అంతరిక్ష కార్యక్రమ వివరాలను అమ్ముకున్నారనే ఆరోపణపై 1994లో ఆయనను ఆరెస్టు చేశారు. అయితే 1996లో సుప్రీం కోర్టు ఆయనపై కేసు కొట్టివేసింది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement