క్రయోజెనిక్ ఇంజిన్ అంటే?
మైనస్ 150 డిగ్రీలు, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలపై అధ్యయనాన్ని ‘క్రయోజెనిక్స్’ అంటారు. అత్యంత శీతలీకరించిన ఇంధనాలను ఉపయోగించేందుకు వీలుగా తయారుచేసే ఇంజిన్‌లనే క్రయోజెనిక్ ఇంజిన్లుగా పిలుస్తారు. రాకెట్లలో వివిధ దశల్లో ఘన, ద్రవ ఇంధనాలను ఉపయోగిస్తారు. ఈ ఘన, ద్రవ ఇంధన దశలకు అదనంగా పైన ఉపయోగించేదే ‘క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ’ దశ. మామూలు ఘన, ద్రవ ఇంధనాలతో పోలిస్తే.. క్రయోజెనిక్ దశలో ఉపయోగించే ఇంధనం శూన్యంలో చాలా సమర్థంగా మండుతూ రాకెట్‌ను అత్యంత బలంగా ముందుకు పంపిస్తుంది. దీంతో అధిక బరువుతో కూడిన పేలోడ్లను, అత్యధిక దూరంలోని కక్ష్యల్లోకి పంపడం సాధ్యం అవుతుంది. అత్యంత బరుైవె న ఉపగ్రహాలను రోదసీలోకి మోసుకెళ్లాలంటే పీఎస్‌ఎల్‌వీ సామర్థ్యం చాలదు కాబట్టి.. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ఇస్రో డిజైన్ చేసింది. మామూలు రాకెట్ దశలతో పోలిస్తే.. జీఎస్‌ఎల్‌వీలోని క్రయోజెనిక్ దశ చాలా క్లిష్టమైన వ్యవస్థ. మైనస్ 183 డిగ్రీ సెంటిగ్రేడ్ల వద్ద ఉండే ఆక్సిజన్ వాయువును, మైనస్ 253 డిగ్రీ సెంటిగ్రేడ్ల వద్ద ఉండే హైడ్రోజన్ ఇంధనాన్ని శూన్యంలో మండించాలి కాబట్టి ఈ దశ అనేక సమస్యలతో ముడిపడి ఉంటుంది. వేర్వేరు ట్యాంకుల్లో ఉండే ఆక్సిజన్, హైడ్రోజన్‌లను నిమిషానికి 40 వేల సార్లు తిరిగే టర్బో పంపుల ద్వారా దహన చాంబర్‌లోకి కచ్చితమైన పాళ్లలోనే పంపించాలి. క్రయోజెనిక్ స్టేజీలో ప్రధాన ఇంజిన్, రెండు చిన్న ఇంజిన్లు కలిసి శూన్యంలో 73.55 కిలోనాట్ల పీడనాన్ని సృష్టిస్తాయి. ఫలితంగా రాకెట్ అత్యధిక వేగంతో దూసుకుపోతుంది.