క్రయోజనిక్ ఇంజన్ (సీఈ–20) భూస్థిర పరీక్ష నిర్వహించి సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న దృశ్యం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపట్టేలా క్రయోజనిక్ ఇంజన్ (సీఈ–20)–22టీ థ్రస్ట్ లెవెల్‌తో చేపట్టిన భూస్థిర పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్‌లో శుక్రవారం సాయంత్రం దీనిని విజయవంతంగా పరీక్షించినట్టు ఇస్రో వెబ్‌సైట్‌లో సంబంధిత అధికారులు శనివారం వెల్లడించారు.
ఇప్పటిదాకా క్రయోజనిక్ దశలో సీఈ–12.5, సీఈ–25 ఇంజన్లను తయారు చేసుకుని జీఎస్‌ఎల్‌వీ మార్క్–2, జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 ప్రయోగాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా సీఈ–20 ఇంజన్‌ను తెరపైకి తెచ్చి దీనికి కూడా భూస్థిర పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారించుకుంటున్నారు. ఇస్రోలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్ స్పేస్ పేరుతో వాణిజ్యపరమైన ప్రయోగాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్‌వీ రాకెట్లు కూడా వాణిజ్యపరంగా చేశారు కాబట్టి ఈ కొత్తరకం సీఈ–20 ఇంజన్‌ను తయారు చేసుకుని భూస్థిర పరీక్షలు చేశారు. సీఈ–20 ఇంజన్‌ను 650 సెకన్లపాటు మండించి పనితీరును పరీక్షించారు. ఇందులో ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా పరీక్ష విజయవంతంగా ముగిసింది. సీఈ–20 ఇంజన్‌ను కేరళలోని వలియామలై అనే ప్రాంతంలో ఉన్న ఎల్‌పీఎస్‌సీలో తయారు చేశారు.
జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు మూడో దశలో వినియోగించే క్రయోజనిక్ ఇంజన్ దశ ఎంతో కీలకమైంది. అంటే జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల్లో సీఈ–12.5, సీఈ–25తో పాటుగా ఇకనుంచి సీఈ–20 ఇంజన్ కూడా వినియోగంలోకి రానుంది. తద్వారా జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల వేగం కూడా పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment