GSLV rocket
-
ఇస్రో ‘క్రయోజనిక్’ పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపట్టేలా క్రయోజనిక్ ఇంజన్ (సీఈ–20)–22టీ థ్రస్ట్ లెవెల్‌తో చేపట్టిన భూస్థిర పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం దీనిని విజయవంతంగా పరీక్షించినట్టు ఇస్రో వెబ్సైట్లో సంబంధిత అధికారులు శనివారం వెల్లడించారు. ఇప్పటిదాకా క్రయోజనిక్ దశలో సీఈ–12.5, సీఈ–25 ఇంజన్లను తయారు చేసుకుని జీఎస్ఎల్వీ మార్క్–2, జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాల్లో వినియోగిస్తున్నారు. తాజాగా సీఈ–20 ఇంజన్‌ను తెరపైకి తెచ్చి దీనికి కూడా భూస్థిర పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారించుకుంటున్నారు. ఇస్రోలో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్ స్పేస్ పేరుతో వాణిజ్యపరమైన ప్రయోగాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్వీ రాకెట్లు కూడా వాణిజ్యపరంగా చేశారు కాబట్టి ఈ కొత్తరకం సీఈ–20 ఇంజన్‌ను తయారు చేసుకుని భూస్థిర పరీక్షలు చేశారు. సీఈ–20 ఇంజన్‌ను 650 సెకన్లపాటు మండించి పనితీరును పరీక్షించారు. ఇందులో ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా పరీక్ష విజయవంతంగా ముగిసింది. సీఈ–20 ఇంజన్‌ను కేరళలోని వలియామలై అనే ప్రాంతంలో ఉన్న ఎల్పీఎస్సీలో తయారు చేశారు. జీఎస్ఎల్వీ రాకెట్‌కు మూడో దశలో వినియోగించే క్రయోజనిక్ ఇంజన్ దశ ఎంతో కీలకమైంది. అంటే జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో సీఈ–12.5, సీఈ–25తో పాటుగా ఇకనుంచి సీఈ–20 ఇంజన్ కూడా వినియోగంలోకి రానుంది. తద్వారా జీఎస్ఎల్వీ ప్రయోగాల వేగం కూడా పెరుగుతుంది. -
‘వికాస్ ఇంజన్’ సామర్థ్య పరీక్ష విజయవంతం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భవిష్యత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించనున్న గగన్‌యాన్–1కు సంబంధించి మూడోసారి నిర్వహించిన వికాస్ ఇంజన్ సామర్థ్య పరీక్ష విజయవంతమైంది. ఈ నెల 20న తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ (ఐపీఆర్సీ)లో నిర్వహించిన సామర్థ్య పరీక్షను వివరాలను ఇస్రో అధికారులు శనివారం మీడియాకు వెల్లడించారు. మానవరహిత ఉపగ్రహాల ప్రయోగాన్ని నిర్వహించే ముందుగా ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని రకాలు పరీక్షలను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తారు. ముందుగా క్రయోజనిక్, వికాస్ ఇంజన్ల పనితీరును, సామర్థ్యాన్ని పరీక్షించుకుంటారు. గగన్‌యాన్–1 ప్రాజెక్ట్ కోసం వికాస్ ఇంజన్ అర్హతను నిర్ధారించేందుకు దీర్ఘకాలిక పరీక్ష అవసరం ఉందని, వాటిని విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో ప్రణాళికలు రూపొందించింది. ఆ మేరకు ముందుగా రాకెట్‌లోని ఇంధన దశలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. గగన్‌యాన్–1 ప్రయోగాన్ని జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రెండు సార్లు వికాస్ ఇంజన్లను పరీక్షించారు. వికాస్ ఇంజన్‌ను 25 సెకన్ల పాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. -
5న కక్ష్యలోకి జీఐశాట్–1
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్–10) ఉపగ్రహ వాహక నౌక ద్వారా జీఐశాట్–1 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సా.5.43 గంటలకు దీనిని రోదసిలోకి పంపుతారు. దేశరక్షణ వ్యవస్థకు, విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్–1 ముఖ్యోద్దేశం. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటి సారిగా భూస్థిర కక్ష్యలోకి పంపిస్తున్నారు. ప్రయోగమిలా... మంగళవారం : ఎంఆర్ఆర్ (మిషన్ రెడీనెస్ రివ్యూ) కమిటీ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్ బుధవారం : బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్ఆర్ చైర్మన్ బీఎన్ సురేష్, కాటూరి నారాయణ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధత సమావేశం. అనంతరం మూడు దశల రాకెట్ అనుసంధానం. తర్వాత తుదివిడత పరీక్షలు. లాంచ్ ఆ«థరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగింత. బుధవారం సాయంత్రం : ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో రిహార్సల్స్. సా.3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం. ఆ వెంటనే రెండో దశలో 42.21 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభం. గురువారం : సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి దూసుకుపోనున్న జీఎస్ఎల్వీ. భూస్థిర కక్ష్యలోకి జీఐశాట్ – 1. -
జీఎస్ఎల్వీ ఎఫ్10 అనుసంధానం పూర్తి
సూళ్లూరుపేట: జీఎస్ఎల్వీ ఎఫ్10 ఉపగ్రహ వాహకనౌకను ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5.43 గంటలకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ప్రయోగించనున్నారు. దీని ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన జీఐశాట్–1ను రోదసీలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్వీ రాకెట్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో అనుసంధానం పనులు పూర్తయ్యాయి. అనంతరం వ్యాబ్ నుంచి ఉంబ్లికల్ టవర్(యూటీ) రాకెట్‌ను శనివారం ఉదయం 6 గంటలకు తరలించి రెండో ప్రయోగవేదికకు అనుసంధానం చేశారు. ఈ నెల 3వ తేదీ వరకు అన్నిరకాల పరీక్షలు పూర్తి చేసి అదేరోజున లాంచ్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. 3న సాయంత్రం మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ(ఎంఆర్ఆర్) సమావేశం జరుగుతుంది. 4వ తేదీ మధ్యాహ్నం 3.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
భళా.. ‘బాహుబలి’!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్3–డీ2 రాకెట్.. కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్29ను విజయవంతంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల కమ్యూనికేషన్ అవసరాలను ఈ ఉపగ్రహం తీర్చనుంది. మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన 27 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే బుధవారం సాయంత్రం 5.08 గంటలకు మార్క్3–డీ2 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని ప్రయోగ కేంద్రం ఇందుకు వేదికైంది. ఉపగ్రహాన్ని వాహకనౌక విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో చేర్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. లాంచ్‌ప్యాడ్ నుంచి బయల్దేరిన 16 నిమిషాల్లోనే రాకెట్ నిర్ణీత కక్ష్యను చేరుకుంది. దీంతో ప్రయోగాన్ని వీక్షిస్తున్న శాస్తవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. గజ తుపాను నేపథ్యంలో ఓ దశలో ప్రయోగ నిర్వహణపై ఆందోళనలు నెలకొన్నా, చివరకు వాతావరణం సహకరించడంతో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకున్నారు. జీఎస్ఎల్వీ మార్క్3– డీ2 రాకెట్ ప్రయోగం రెండోసారీ విజయవంతం కావడం విశేషం. 2017లో జీశాట్19ను నింగిలోకి పంపేందుకు మార్క్2–డీ1ను వాడారు. భవిష్యత్తులో చేపట్టనున్న మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’లో ఈ రాకెట్‌నే వినియోగించనున్న నేపథ్యంలో తాజా ప్రయోగం శాస్త్రవేత్తల మనోధైర్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. మూడు దశల్లో ప్రయోగం.. ఈ ప్రయోగాన్ని మూడు దశల్లో 16.43 నిమిషాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే రాకెట్‌కు మొదటి దశలో రెండు వైపులా అమర్చిన 200 టన్నుల ఘన ఇంధన బూస్టర్లు (ఎస్–200)ను మండించడంతో రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం 1.54 నిమిషాలకు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనం (ఎల్–110)ను మండించి రాకెట్ వేగాన్ని పెంచారు. తరువాత 2.19 నిమిషాలకు మొదటి దశలోని ఎస్–200 రెండు బూస్టర్లను విడదీసి మొదటి దశను విజయవంతంగా పూర్తిచేశారు. ఎల్–110 దశ 5.18 నిమిషాలకు రెండో దశను పూర్తి చేసింది. ఆ తర్వాత 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనం(సీ–25)తో మూడో దశను ప్రారంభించారు. 16.28 నిమిషాలకు క్రయోజనిక్ దశ కటాఫ్ అయిపోయింది. 16.43 నిమిషాలకు రాకెట్‌కు శిఖర భాగంలో అమర్చిన 3,423 కిలోల జీశాట్–29ను విడదీసి భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. శాస్త్రవేత్తలకు జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: జీఎస్ఎల్వీ మార్క్ 3–డీ2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాన్ని జయప్రదం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో చేసే ప్రయోగాలు సైతం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారతీయ అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదొక మైలురాయి అని జగన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయోగం.. ఎవరెస్ట్‌తో సమానంఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే ఈ ప్రయోగం మాత్రం ఎవరెస్ట్ అంత ఎత్తయినదని ఇస్రో చైర్మన్ కె.శివన్ అభివర్ణించారు. మన సమాచార ఉపగ్రహాలనే కాకుండా విదేశాలకు చెందిన భారీ ఉపగ్రహాలను కూడా పంపే స్థాయికి చేరుకోవడం గర్వకారణమని అన్నారు. తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం ‘గగన్‌యాన్’ను డిసెంబర్ 2021 నాటికి చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి ముందు ప్రయోగాత్మకంగా మానవ రహిత గగన్‌యాన్‌ను డిసెంబర్ 2020 నాటికి పరీక్షించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, 2019 జనవరిలో చంద్రుడిపై పరిశో«ధనలు చేసేందుకు చంద్రయాన్–2 గ్రహాంతర ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. 2019లో 10 ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని వివరించారు. అధునాతన పేలోడ్లతో.. జీశాట్–29లో ప్రత్యేకించి కేయూ–బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్ బీమ్స్, కేఏ–బ్యాండ్ ఫోర్ యూజర్ స్పాట్ భీమ్‌తో పాటు వన్ యూజర్ స్టీరిబుల్ భీమ్, క్యూ/వీ– బ్యాండ్ కమ్యూనికేషన్ పేలోడ్, జియో హైరిజల్యూషన్ కెమెరా, ఆప్టికల్ కమ్యూనికేషన్ పేలోడ్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇలాంటి పేలోడ్స్ పంపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని మారుమూల గ్రామాలను ఈ ఉపగ్రహం ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తుంది. విలేజ్ రీసోర్స్ సెంటర్స్ అంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు, సదుపాయా లు, ఇతర ఏర్పాట్లను గుర్తించి సమాచారాన్ని అందించడమే కాకుండా భారత సైనిక అవసరాలకూ దోహదపడుతుంది. ఉపగ్రహం వివరాలు.. ► రాకెట్: జీఎస్ఎల్వీ మార్క్ 3–డీ2 ► ఉపగ్రహంతోకలిపి మొత్తం బరువు: 640 టన్నులు ► ఎత్తు: 43.39 మీటర్లు ► వ్యాసం: 4 మీటర్లు ► ప్రయోగ దశలు: మూడు (ఘన, ద్రవ, క్రయోజెనిక్) ► జీశాట్29 ఉపగ్రహం బరువు: 3,423 కిలోలు ► ఉపగ్రహ జీవితకాలం: 10 ఏళ్లు ► పనిచేయడానికి కావాల్సిన విద్యుత్: 4600 వాట్లు రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ శివన్ -
జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ప్రయోగం
-
జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ప్రయోగం విజయవంతం
-
జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ప్రయోగం విజయవంతం
సాక్షి, శ్రీహరికోట/నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ద్వారా జీశాట్–29 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్–29లో కేఏ, కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అమర్చారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్ ప్రజల ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. నమ్మకమైన వాహనం.. జీఎస్ఎల్వీ–మార్క్3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్ కె.శివన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. మార్క్ 3 ప్రయోగాంతో దేశీయంగా అధిక బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టామని వెల్లడించారు. పీఎస్ఎల్వీ తరహాలోనే జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ కూడా ఇస్రో ప్రయోగాలకు నమ్మకమైన వాహనంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపడతామని వెల్లడించారు. ఇక మానవ సహిత ప్రయోగాలకు శ్రీకారం చుడతామనీ.. గగన్‌యాన్ ద్వారా మానవుడిని అంతరిక్షంలోకి పంపుతామని శివన్ స్పష్టం చేశారు. ఐదో తరం రాకెట్.. జీఎస్ఎల్వీ–మార్క్3 ఇస్రో అభివృద్ధి చేసిన ఐదో తరం రాకెట్. 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను కూడా ఇది భూస్థిర బదిలీ కక్ష్య (జీటీవో–జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టగలదు. ఈ రాకెట్ 43.43 మీటర్ల పొడవుతో 640 టన్నుల బరువుంటుంది. జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారి ఆలయంలో రాకెట్ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి శివన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరిన్ని విజయాలు సాధించాలి.. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీఎస్ఎల్వీ–మార్క్3 ప్రయోగం విజయవంతమవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. -
మూడేళ్లలో చంద్రయాన్-2’
న్యూఢిల్లీ: మంగళ్యాన్, జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలతో విజయోత్సాహంతో ఉన్న భార త అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా చంద్రయాన్-2 మిషన్‌పై దృష్టి సారించింది. మరో రెండు లేదా మూడేళ్లలో చంద్రుడిపైకి ల్యాండర్, రోవర్‌ను పంపేందుకు సిద్ధమవుతున్నట్లు శుక్రవారమిక్కడ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ విలేకరులకు వెల్లడించారు. 2016 లేదా 2017లో చేపట్టనున్న చంద్రయాన్-2లో ఓ రోవర్‌ను, ఓ ల్యాండర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా పంపనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ల్యాండర్ తయారీ, అది చంద్రుడిపై దిగేలా చేయడం, దిగేందుకు అనుకూలమైన చోటు ఎంపిక చేసుకునేలా చూడటం వంటి సవాళ్లు తమ ముందు ఉన్నాయన్నారు. మార్స్ మిషన్ సందర్భంగా ప్రారంభించిన ఫేస్బుక్ పేజీకి విశేష ఆదరణ లభించినందున యువతకు మరింత చేరువయ్యేందుకు యూట్యూబ్‌లోనూ ఇస్రో ఇవీడియోలు పొందుపరుస్తామన్నారు.