న్యూఢిల్లీ: మంగళ్‌యాన్, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలతో విజయోత్సాహంతో ఉన్న భార త అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా చంద్రయాన్-2 మిషన్‌పై దృష్టి సారించింది. మరో రెండు లేదా మూడేళ్లలో చంద్రుడిపైకి ల్యాండర్, రోవర్‌ను పంపేందుకు సిద్ధమవుతున్నట్లు శుక్రవారమిక్కడ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ విలేకరులకు వెల్లడించారు. 2016 లేదా 2017లో చేపట్టనున్న చంద్రయాన్-2లో ఓ రోవర్‌ను, ఓ ల్యాండర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసి జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా పంపనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ల్యాండర్ తయారీ, అది చంద్రుడిపై దిగేలా చేయడం, దిగేందుకు అనుకూలమైన చోటు ఎంపిక చేసుకునేలా చూడటం వంటి సవాళ్లు తమ ముందు ఉన్నాయన్నారు. మార్స్ మిషన్ సందర్భంగా ప్రారంభించిన ఫేస్‌బుక్ పేజీకి విశేష ఆదరణ లభించినందున యువతకు మరింత చేరువయ్యేందుకు యూట్యూబ్‌లోనూ ఇస్రో ఇవీడియోలు పొందుపరుస్తామన్నారు.