Chandrayaan- II
-
చంద్రయాన్–3 ప్రస్థానం ముగిసినట్లేనా!
న్యూఢిల్లీ: Chandrayaan-3 చంద్రుడిపై నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్, రోవర్‌ను మళ్లీ మేల్కొలిపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ల్యాండర్, రోవర్ నుంచి సంకేతాలు అందడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో చందమామపై వాటి ప్రస్థానం ముగిసిపోయినట్లేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ల్యాండర్, రోవర్‌తో అనుసంధానం కోసం ఇస్రో సైంటిస్టులు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా చంద్రయాన్–3 ప్రయోగం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. చందమామ దక్షిణ ధ్రువంపై క్షేమంగా అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా రికార్డుకెక్కింది. చంద్రయాన్–3 మిషన్‌లో అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగింది. అందులో నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచ్చిన, చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుంది. అవి రెండూ 14 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశాయి. జాబిల్లిపై పరిశోధనలు జరిపి, విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేశాయి. అనంతరం సెప్టెంబర్ 2న దక్షిణ ధ్రువంపై సూర్యాస్తమయం కావడంతో స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. మళ్లీ సూర్యోదయం కావడంతో ఈ నెల 22న తిరిగి మేల్కోవాల్సి ఉంది. -
చివరి దశకు చేరిన చంద్రయాన్-3.. ఇస్రో కీలక ప్రకటన!
సాక్షి, బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మరో ఘనత సాధించింది. మిషన్‌లో భాగమైన ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్లు విజయవంతంగా ప్రయాణించించినట్లు ఇస్రో శనివారం వెల్లడించింది. మరోవైపు చంద్రయాన్-3 మిషన్ చివరి దశకు చేరింది. చంద్రునిపై సూర్యకాంతి క్షీణిస్తుండటం వల్ల విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ రెండింటినీ స్లీప్ మోడ్‌లో ఉంచడానికి ఇస్రో సిద్ధమవుతోంది. ఈ తరుణంలో చంద్రయాన్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం కాగా ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రయాన్-3కి చెందిన అన్ని పరికరాలు సవ్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.. ల్యాండర్, రోవర్లు ఇంకా ఫంక్షన్ చేస్తున్నాయన్నారు. రోవర్ పంపిన డేటాను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. మరో ఒకటి రెండు రోజుల్లో రోవర్, ల్యాండర్లను స్లీపింగ్ మోడ్‌లోకి తీసుకువెళ్లనున్నట్లు సోమనాథ్ చెప్పారు. చదవండి: ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతం.. అభినందనల వెల్లువ Chandrayaan-3 Mission: 🏏Pragyan 100* Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ — ISRO (@isro) September 2, 2023 చంద్రయాన్ మిషన్ గురించి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ ఆగస్టు 23న జాబిల్లిపై అడుగుపెట్టింది. జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసి విక్రమ్ ల్యాండర్‌ను చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేసింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది. 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రగ్యాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. -
చంద్రయాన్-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్ నుంచి విడిపోయిన ల్యాండర్
చంద్రయాన్-3లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రోపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ విడిపోయింది. ఈ మేరకు గురువారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రయాన్-3 వ్యోమననౌక చంద్రుడికి మరింత చేరువైంది. ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో ల్యాండ్ కానుంది. Chandrayaan-3 Mission: ‘Thanks for the ride, mate! 👋’ said the Lander Module (LM). LM is successfully separated from the Propulsion Module (PM) LM is set to descend to a slightly lower orbit upon a deboosting planned for tomorrow around 1600 Hrs., IST. Now, 🇮🇳 has3⃣ 🛰️🛰️🛰️… pic.twitter.com/rJKkPSr6Ct — ISRO (@isro) August 17, 2023 బెంగళూరులోని మిషన్ ఆపరేటర్ కాంప్లెక్స్(ఎంఓఎక్స్), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) లాంటి భూ నియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు నేటి నుంచి ముఖ్యమైన ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోగా.. ల్యాండర్లో వున్న ఇంధనాన్ని మండించి ఈ నెల 19, 21న రెండుసార్లు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టనున్నారు. చంద్రయాన్–3 ఇప్పుడు చంద్రుడి చుట్టూ 153 కిలోమీటర్లు, 163 కిలోమీటర్ల స్వల్ప దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. కాగా చందమామపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న చంద్రయాన్–3ప్రయోగించిన విషయం తెలిసిందే. మిషన్ కక్ష్య దూరాన్ని ఐదోసారి పెంచే ప్రక్రియను బుధవారం విజయవంతంగా నిర్వహించిందిదే. దీంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. -
2022లో చంద్రయాన్–3
న్యూఢిల్లీ: చంద్రునిపైకి మూడో మిషన్ ప్రయోగం చంద్రయాన్–3ని 2022లో ప్రయోగించే అవకాశముందని ఇస్రో చీఫ్ కె.శివన్ వెల్లడించారు. కోవిడ్–19 లాక్డౌన్ కారణంగా ఇస్రో చేపట్టాల్సిన చంద్రయాన్–3 వంటి పలు ప్రాజెక్టులు వాయిదా పడ్డాయని తెలిపారు. వాస్తవానికి చంద్రయాన్–3ని 2020 చివర్లో ప్రయోగిం చాల్సి ఉందన్నారు. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్‌నే చంద్రయాన్–3లో ఉపయోగిస్తామన్నారు. 2019లో చంద్ర యాన్–2 మిషన్‌లో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఇస్రో భవిష్యత్తులో చేపట్టే గ్రహాంతర ప్రయోగాలకు చంద్రయాన్–3 కీలకం కానుంది. గత ఏడాది డిసెంబర్లో చేపట్టాల్సిన మొట్టమొదటి మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీని తర్వాత, మరో మానవ రహిత మిషన్ ప్రయోగం ఉంటుం దని, మూడో విడతలో ప్రధాన ప్రయోగం చేపడతామన్నారు. గగన్‌యాన్ ద్వారా 2022లో ముగ్గురు భారతీయులను అంతరిక్షం లోకి పంపనున్నారు. ఇందుకుగాను ఎంపికైన ముగ్గురు పైలట్లు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు. మూడో విడత ప్రయోగించే గగన్‌యాన్ మాడ్యూల్‌కు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుందన్నారు. సరైన సమయంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. -
2020లో చంద్రయాన్–3?
సాక్షి, బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది నవంబర్‌లో చంద్ర యాన్–3 ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. చంద్రయాన్–2 ప్రయోగం ద్వారా ల్యాండర్‌ను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడం నిరాశకు గురైనా.. ఇస్రోలో పట్టుదలను పెంచింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి తీరాలనే దృఢనిశ్చయానికి వచ్చిన ఇస్రో చంద్రయాన్–3 చేపట్టేందుకు నిర్ణయించింది. ఇందుకోసం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ సోమనాథ్ అధ్యక్షతన పనిచే స్తున్న ఈ కమిటీ అక్టోబర్ నుంచి 4 సార్లు సమావేశమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని వివరాలు, ప్రణాళికలతో కూడిన నివేదిక ను ఇది సమర్పించనుంది. ఈ నివేదిక అందాక ప్రాజెక్టును ప్రణాళిక ప్రకారం పట్టాలెక్కిస్తారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఈ ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చంద్రయాన్–2లోని ఆర్బిటర్ విజయ వంతంగా పనిచేస్తున్నందున వచ్చే ఏడాది ల్యాండర్, రోవర్‌లనే చంద్రుడిపైకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. -
చంద్రయాన్-2: కొత్త ఫొటోలు వచ్చాయి!
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ విఫలమైనప్పటికీ.. ఆర్బిటార్ మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ప్రకాశవంతమైన ఫొటోలను ఆర్బిటార్ తీసింది. స్పెక్ట్రోమీటర్‌ను ఉపయోగించి చంద్రుడి ఉపరితలం మీద పడుతున్న సూర్యకాంతిలోని తారతమ్యాలను విశ్లేషించింది. తద్వారా చంద్రుడి ఉపరితలంపై నిక్షిప్తమైన మూలకాల స్థాయిని.. అదే విధంగా చంద్రుడి మూల స్థానం, పరిభ్రమానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే వీలు కల్పించింది. ఈ క్రమంలో ఆర్బిటార్ తీసిన ఫొటోలను ఇస్రో తన ట్విటర్లో అకౌంట్లో షేర్ చేసింది. కాగా చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదన్న సంగతి తెలిసిందే. సూర్యకాంతి అద్దం మీద పడి ప్రతిబింబించినట్లుగా.. చంద్రుడి ఉపరితలంపై కాంతి పడి పరావర్తనం చెందడం ద్వారా చంద్రుడు మెరుస్తున్నట్లుగా కనిపిస్తాడు. అయితే చంద్రుడి ఉపరితలం అంతటా ఈ కాంతి ఒకేవిధంగా పరావర్తనం చెందదు. చంద్రుడికి సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలను కనుగొనేందుకు ఇస్రో పంపిన ఆర్బిటర్ ఉపయోగపడనుంది. ఇక చంద్రయాన్-2 ఆర్బిటర్ తాజాగా విడుదల చేసిన ఫొటోల ఆధారంగా చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఖనిజాల మిశ్రమంలో ఉన్న తేడాల వల్ల చంద్రుడు కొన్నిచోట్ల అత్యంత ప్రకాశవంతంగా.. మరికొన్ని చోట్ల మామూలుగా ప్రకాశిస్తున్నాడని ఇస్రో వివరించింది. తద్వారా చంద్రుడి ఉపరితలం వేటితో నిర్మితమైంది, అక్కడ మూలకాలు, ఖనిజాల స్థాయి ఎంత తదితర రహస్యాలను తెలుసుకనే వీలు కలుగుతుందని పేర్కొంది. ఉత్తరార్థగోళం నుంచి చంద్రుడిపై గుంతల వంటి భాగాలు(సోమర్ఫీల్్డ, స్టెబిన్స్, కిర్క్వుడ్) ఆర్బిటార్ తీసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఆర్బిటార్‌లోని ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ ద్వారా 800 నానోమీటర్ల నుంచి 5000 వేల నానోమీటర్ల పరిధిలో వివిధ ఫొటోలను తీసినట్లు వెల్లడించింది. కాగా చంద్రయాన్-2 ఆర్బిటార్‌లో ఉన్న ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్న విషయం విదితమే. నిజానికి ఆర్బిటార్ జీవితకాలం ఏడాది మాత్రమే అయినా.. దాని జీవితకాలాన్ని పొడగించే అవకాశాలు ఉన్నాయని ఇస్రో పేర్కొంది. ఆర్బిటార్ ద్వారా.. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పలు వివరాలు.. ఇందుకు సంబంధించిన త్రీడీ మ్యాపుల రూపకల్పన చేస్తున్నారు. అదే విధంగా చంద్రుడి ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం, ఐరన్, సోడియం వంటి మూలకాల ఉనికిని గుర్తించేందుకు తోడ్పడడం వంటి మరెన్నో ప్రయోజనాలను ఆర్బిటార్ కలిగి ఉంది. కాగా చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా నీలి రంగులో మెరిసిపోతున్న భూగ్రహం ఫొటోలను కూడా ఇస్రో విడుదల చేసిన సంగతి తెలిసిందే. #ISRO See the first illuminated image of the lunar surface acquired by #Chandrayaan2’s IIRS payload. IIRS is designed to measure reflected sunlight from the lunar surface in narrow and contiguous spectral channels. For details visit:https://t.co/C3STg4H79S pic.twitter.com/95N2MpebY4 — ISRO (@isro) October 17, 2019 -
చంద్రయాన్ 98% సక్సెస్
చెన్నై/భువనేశ్వర్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగం 98 శాతం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. చంద్రయాన్–2లో అమర్చిన విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు మాత్రం పునరుద్ధరించలేకపోయినట్లు తెలిపారు. ల్యాండర్‌కి ఏం జరిగిందో తెలుసుకునేందుకు విద్యావేత్తలు, ఇస్రో నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీ విశ్లేషణ చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు ల్యాండర్ నుంచి తమకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదని.. ఒకవేళ ఏదైనా సమాచారం అందితే దానికి తగినట్లు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రయాన్–2లో ఆర్బిటర్ మాత్రం చాలా బాగా పని చేస్తోందని పేర్కొన్నారు. ఆర్బిటర్‌లో అమర్చిన ఎనిమిది సాంకేతిక పరికరాలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు. ప్రతి పరికరం తన పనిని తాను సమర్థవంతంగా చేస్తోందని చెప్పారు. ఆర్బిటర్ పంపిన కొన్ని చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని.. ఇవి పరిశోధనల్లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆయన భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు ఆర్బిటర్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా 2020లో చేపట్టనున్న చంద్రుడిపై చేపట్టనున్న మరో మిషన్ మీదే అని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పారు. గగన్‌యాన్‌పై దృష్టి.. చంద్రయాన్–2 ఫలితం ప్రభావం గగన్‌యాన్ ప్రయోగంపై ఉండబోదని శివన్ స్పష్టం చేశారు. గగన్‌యాన్ ప్రయోగం భారత్‌కు చాలా ముఖ్యమని.. ఇది దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాల సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి గగన్‌యాన్ ప్రయోగంపై దృష్టి సారించామని వెల్లడించారు. ఐఐటీ భువనేశ్వర్‌లో జరిగిన ఎనిమిదో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2021 డిసెంబర్ కల్లా భారత్ తన సొంత రాకెట్లో వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని తెలిపారు. 2020 డిసెంబర్ కల్లా మానవ రహిత అంతరిక్ష విమానాన్ని అంతరిక్షంలోకి పంపుతామని పేర్కొన్నారు. 2021 డిసెంబర్లో రెండో విమానాన్ని పంపుతామని చెప్పారు. -
విక్రమ్ కనిపించిందా?
లాస్ఏంజెలిస్: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 కు చెందిన విక్రమ్ ల్యాండర్ కనిపించిందా అని ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోని వ్యోమగామిని ప్రశ్నించాడు. కనిపెట్టలేకపోయామని సదరు వ్యోమగామి సమాధానమిచ్చాడు. తన కొత్త చిత్రం ‘ఆడ్ ఆస్ట్రా’ ప్రమోషన్లలో భాగంగా బ్రాడ్‌పిట్ ఐఎస్ఎస్లోని నాసా వ్యోమగామి నిక్ హేగ్‌తో సంభాషించాడు. ఆడ్ ఆస్ట్రా చిత్రంలో బ్రాడ్‌పిట్ వ్యోమగామిగా నటించాడు.20 నిమిషాలపాటు సాగిన ఈ సంభాషణను సోమవారం నాసాటీవీ ప్రసారం చేసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన రోజు తాను నాసా కేంద్రంలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో ఉన్నానని, అప్పుడు ఇస్రోకు నాసా సహ కారమందించడాన్ని గమనించానని తెలిపాడు. -
‘విక్రమ్’ సమస్య కచ్చితంగా పరిష్కారమవుతుంది!
చండీగఢ్ : సైన్స్ అంటేనే తెలియని విషయాలను తెలుసుకోవడం అని.. ఆ క్రమంలో ఒక్కోసారి అపజయాలు కూడా ఎదురవుతాయని నోబెల్ బహుమతి గ్రహీత, ఫ్రెంచి శాస్త్రవేత్త సెర్జ్ హారోచ్ అన్నారు. అద్భుత విజయాలతో పాటు ఓటములను సైతం చిరునవ్వుతో స్వీకరించి వాటిని అధిగమించే దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. చండీగఢ్‌లో జరుగుతున్న ‘నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇండియా 2019’ కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సెర్జ్ మాట్లాడుతూ.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైందని తాను భావించడం లేదన్నారు. విక్రమ్ ల్యాండర్‌కు ఏమైందో తనకు తెలియదు గానీ.. ఇస్రో కచ్చితంగా సమస్యను పరిష్కరించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సైన్స్ విభాగంలో పనిచేసే వారు అస్సలు నిరాశ చెందకూడదు. ప్రయోగాల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారన్న మాట నిజమే. ఆర్థిక అంశాలతో పాటు రాజకీయాలు కూడా దీనితో ముడిపడి ఉంటాయి. ఒక ప్రయోగం చేపట్టేపుడు మీడియా విపరీతంగా కవర్ చేయడం... ఈ క్రమంలో ఏ చిన్న తప్పు జరిగినా అది పెద్దదిగా కనిపించడం సహజమే. అంచనాలు పెరిగే కొద్దీ విమర్శల స్థాయి కూడా పెరుగుతుంది. యువత మెదళ్లపై పెట్టే పెట్టుబడే ఏ దేశానికైనా అత్యుత్తమైనది. యువ సంపద భారీగా ఉన్న భారత్ ఈ మేరకు పెట్టుబడులు పెడుతూ విదేశాల్లో ఉన్న తమ వాళ్లను ఇక్కడికి రప్పించాల్సిన అవసరం ఉంది. గణిత, భౌతిక శాస్త్రాలతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్‌లో కూడా భారత్ నాణ్యమైన విద్యనందిస్తోంది. చంద్రయాత్ర వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మీడియా ప్రచారం కల్పించే ఖర్చుతో మరిన్ని చిన్న ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చనేది నా భావన’ అని సెర్జ్ పేర్కొన్నారు. అదే విధంగా వాతావరణ మార్పుల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్్డ ట్రంప్ వైఖరి గురించి ప్రస్తావించగా..‘ ఆయనకు అసలు మెదడు లేదు. అందుకే ఆయనలోనూ ఏమార్పు ఉండదు’ అని వ్యాఖ్యానించారు. కాగా భౌతిక శాస్త్రం(మెజరింగ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్ క్వాంటం సిస్టమ్)లో తన పరిశోధనలకు గానూ మరో శాస్త్రవేత్త డేవిడ్ జే. విన్లాండ్తో కలిసి సెర్జ్ 2012లో నోబెల్ బహుమతి అందుకున్న విషయం తెలిసిందే. -
షార్.. నిశ్శబ్దం!
షార్‌లో కొన్ని గంటలకు ముందు హుషార్. చివరి క్షణాల్లో ఉద్విగ్న వాతావరణం. అంతలోనే నిశ్శబ్దం. భారత్‌కు ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగే అద్భుత క్షణాల కోసం యావత్ ప్రపంచంతో పాటు షార్ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూశారు. చివరి పావుగంటలో ల్యాండర్ నిర్ణీత కక్ష్యలో పయనిస్తూ వచ్చింది. అన్ని స్టేజీల్లోనూ సవ్యమార్గంలో వచ్చిన ల్యాండర్ చివరి స్టేజీలో గతితప్పింది. ల్యాండర్ చివరి క్షణంలో సిగ్నల్స్ అందకపోవడంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. మరి కొన్ని క్షణల్లో సంబరాలకు సిద్ధంగా ఉన్న శ్రీహరికోటలోని షార్ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు నిరాశకు గురయ్యారు. షార్ కేంద్రంగా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేశారు. గ్రహాంతర ప్రయోగాలు చేసి ఉత్సాహంగా గగన్‌యాన్‌కు ముందడుగు వేస్తున్న ఈ తరుణంలో ఈ విఫలం వారిని ఎంతో బాధకు గురి చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జాము వరకు కళ్లల్లో ఒత్తులేసుకుని టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. సాక్షి, సూళ్లూరుపేట: జిల్లాలోని షార్ కేంద్రంగా ఇప్పటి వరకూ 73 ప్రయోగాలు చేశారు. అందులో పది మాత్రమే విఫలం అయ్యాయి. 2004లోనే గ్రహాంతర ప్రయోగాలకు షార్ వేదికగా ఇస్రో శ్రీకారం చుట్టింది. 2008లో చంద్రయాన్–1 ప్రయోగించిన అనంతరం చంద్రయాన్–2కు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. దశాబ్దం పాటు అహర్నిశలు శ్రమ కోర్చి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రదేశాలకు దీటుగా చంద్రయాన్–2ను తయారు చేశారు. 2009 నుంచి ఎన్నో ప్రయోగాత్మక ప్రయోగాలు చేశారు. పూర్తి స్థాయిలో అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఈ ఏడాది జూలై 14 జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ద్వారా సుమారు 3.6 టన్నుల బరువు కలిగిన ఆర్బిటర్–విక్రమ్ ల్యాండర్– రోవర్ (ప్రజ్ఞాన్) త్రీఇన్‌వన్ ప్రయోగాన్ని చేయాలని మహూర్తం నిర్ణయించుకున్నారు. ప్రయోగం మరో గంటలో ఉందనగా ఆఖరి గంటలో కౌంట్‌డౌన్ సమయాన్ని నిలిపివేశారు. అయినా నిరాశ చెందకుండా చాలెంజ్‌గా తీసుకుని క్రయోజనిక్ దశలో చిన్నపాటి లీకేజీని వారం రోజుల్లో సరిచేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు. జూలై 22వ తేదీన చంద్రయాన్ మిషన్‌ను షార్ రెండో నింగిలోకి పంపారు. ఆ తర్వాత అన్ని దశలనూ విజయవంతంగా నిర్వహించారు. అనుకున్న దానికంటే వ్యోమనౌక నింగిలో దూసుకుపోతూ జాబిల్లి చెంతకు పయనిస్తుండడంతో శాస్త్రవేత్తల ఆనందాలకు అవధుల్లేకుండా పోయింది. ఈ నెల 2వ తేదీన ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ఈ నెల 3, 4 తేదీల్లో ల్యాండర్‌లోని ఇంధనాన్ని మండించి చంద్రుడికి అత్యంత దగ్గరగా తీసుకెళ్లారు. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటలలోపు చంద్రుడి ఉపరితలంపై దించే ఆపరేషన్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చంద్రుడికి 2.1 కిలో మీటర్లు దూరంలోకి చేరుకున్నాక ల్యాండర్ నుంచి బైలాలులోని భూనియంత్రత కేంద్రానికి సిగ్నల్స్ తెగిపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు దేశ ప్రజలంతా కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ 15 నిమిషాలు.. ముందు నుంచి శాస్త్రవేత్తలు ల్యాండర్ దిగే 15 నిమిషాలు ఎంతో కీలకంగా భావించారు. అంతా సవ్వంగా సాగిపోతూ 14 నిమిషాలు దాటిపోయింది. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయి అవాంతరం ఏర్పడింది. ఇస్రో చైర్మన్ డాక్టక్ కే శివన్‌తో పాటు శాస్త్రవేత్తలంతా కలత చెందారు. పదేళ్లు చేసిన కఠోర శ్రమ, మరో వైపు ప్రయోగం జరిగిన తర్వాత 48 రోజులు పడిన శ్రమ ఇలా అయిందని ఆవేదన చెందారు. ఏదైనా అద్భుతం జరుగుతుందా! వికమ్ర్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోతే ప్రయోగం విఫలం అయినట్టు కాదని షార్ ఉద్యోగులు అంటున్నారు. ల్యాండర్ చంద్రుడి వైపునకు వెళుతున్న సమయంలో దానికి ఉన్న సౌరపలకాలు విద్యుత్ సరఫరా చేస్తాయి. అంటే సూర్యుడి కిరణాలు సౌర పలకాలపై ప్రసరిస్తే అందులో నుంచి విద్యుత్ ఉత్పత్తి అయి భూనియంత్రిత కేంద్రానికి సిగ్నల్స్ అందజేస్తుంది. ఇది చదవండి : రైతు బిడ్డ నుంచి రాకెట్ మ్యాన్ సౌర కుటుంబంలోని గ్రహాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరిగే క్రమంలో చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అడ్డం రావడంతో సూర్య కిరణాలు ప్రసరించకపోవడం వల్ల సౌర పలకాల నుంచి విద్యుత్ అందకపోవడంతో సిగ్నల్స్ అందలేదని వాదన వినిపిస్తోంది. ఒక లూనార్ డే అంటే 14 రోజుల పాటు సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డు ఉంటుందని, ఈ 14 రోజులు గడిస్తే మళ్లీ సౌరపలాకలపై సూర్యకిరణాలు ప్రసరించి విద్యుత్ అందజేసిన వెంటనే ల్యాండర్ నుంచి సిగ్నల్స్ అందే అవకాశం లేకపోలేదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ.. క్షణాలను మరిచిపోలేను
సాక్షి, కోదాడ : చంద్రయాన్–2 వీక్షణం కోసం శుక్రవారం రాత్రి ఇస్రో కేంద్రంలో గడిపిన క్షణాలను నా జీవితంలో మర్చిపోలేనని కోదాడలోని తేజ విద్యాలయకు చెందిన 8వ తరగతి విద్యార్థిని మెట్టు నమృత అన్నారు. శనివారం బెంగళూరునుంచి ఫోన్లో ‘సాక్షి’తో నమ్రత మాట్లాడింది. చంద్రయాన్–2ను ఆమె ప్రధాని నరేంద్రమోదీతో కలిసి వీక్షిం చింది. అక్కడ గడిపిన క్షణాలు, అనుభూతులు ఆమె మాటల్లోనే.. ఇస్రో ఆన్లైన్లో నిర్వహించిన క్విజ్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఎంపికయ్యాను. గురువారం బెంగళూరు చేరుకున్న మాకు ఇస్రో సెంటర్లో బస ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు మమ్ములను ఇ స్రో టెస్టింగ్ సెంటర్ వద్ద ఉన్న ఆడిటోరియానికి తీసుకువచ్చారు. అక్కడకు 9 గంటలకు ప్రధాని మోదీ వచ్చి నాతో పాటు అక్కడకు వచ్చిన 76 మంది విద్యార్థులతో దాదాపు గంటసేపు గడిపారు. ప్రతి ఒక్కరితో ఆయన కరచాలనం చేయడంతోపాటు శాస్త్రవేత్తలుగా రాణించి దేశానికి సేవ చేయాలని కోరారు. అనంతరం మమ్మళ్లీ చంద్రయాన్ ప్రయోగం వీక్షించేందుకు సెం ట్రల్ హాల్‌కు తీసుకెళ్లారు. రాత్రి రెండు గంటల వరకు ప్రధాని అక్కడే ఉ న్నారు. రాత్రి 10 గంటల నుంచి రెండు గంటల వరకు తీవ్రమైన ఉత్కంఠను చవిచూశాం. అందరం ఊపిరి బిగపట్టి చూశారు. కానీ ప్రయోగం విజయవంతం కాకపోవడంతో చాలా బాధపడ్డాం. అందరిలోనూ ఒకరకమైన ఆవేదన కనిపించింది. రెండు గంటలకు ప్రధాని వెళ్లి పోయారు. రాత్రి మూడు గంటలకు అక్కడినుంచి మేము విడిది చేసిన ప్రదేశానికి వెళ్లాం అని చెప్పుకొచ్చింది. -
వారు చాలా కష్టపడ్డారు : మమతా బెనర్జీ
సాక్షి, కోల్‌కతా : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సజావుగా సాగిన విక్రమ్ ల్యాండర్ ప్రయాణంలో కుదుపులు చోటుచేసుకున్నప్పటికీ శాస్త్రవేత్తల శ్రమకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్ 2 ప్రయోగంపై మోదీ ప్రభుత్వం అతి చేస్తోందని విమర్శించిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచారు. చంద్రయాన్ 2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చాలా కష్ట పడ్డారని ప్రశంసించారు. వారి కష్టం ఎప్పటికీ వృథా కాదన్నారు. ఈ మేరకు ఆమె ట్విట్ చేశారు. ‘ఇస్రో శాస్త్రవేత్తల పనితీరు మాకు గర్వంగా ఉంది. చంద్రయాన్-2 కోసం చాలా కష్ట పడ్డారు. శాస్త్ర-సాంకేతిక రంగంలో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిపిపేందుకు పునాది వేసిన ఇస్రో వ్యవస్థాపకులకు ఇవే నా నివాళులు’ అంటూ మమతా ట్విట్ చేశారు. (చదవండి : చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది) ఇస్రో శాస్త్రవేత్తల శ్రమ వృథాపోదని, ఈ ప్రయోగం ఎన్నో ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనలకు పునాదిగా నిలుస్తుందని ప్రశసించారు. భారతీయులంతా ఇస్రో శాస్త్ర వేత్తలకు అండగా ఉన్నామని, ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేసి దేశానికి గొప్ప పేరుతేవాలని అంటూ మరో ట్విట్ చేశారు. కాగా, శుక్రవారం బెంగాల్లో అసెంబ్లీలో మమతా మాట్లాడుతూ.. చంద్రయాన్ 2 ప్రయోగంపై నరేంద్ర మోదీ అతి చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఇదే తొలి ప్రయోగం అయినట్టు, మోదీ అధికారంలోకి రాకముందు ఇలాంటివేవీ జరగనట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారని మమతా బెనర్జీ ఆక్షేపించారు. దేశంలో ఆర్థిక విపత్తు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రధాని మోదీ చంద్రయాన్ 2 ప్రయోగాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. We are proud of our scientists. The @isro team worked hard for #Chandrayaan2 . A befitting tribute to our founding fathers who envisioned India’s place in the league of scientifically advanced nations far ahead of their times. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) September 7, 2019 -
ఇది ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తి: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం తుది దశలో విఫలమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్ జాతి అండగా నిలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర్నుంచీ అంతా శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాల కోసం యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా వేచి చూసిన వేళ చేదు ఫలితమే ఎదురైనప్పటికీ ఇదొక స్ఫూర్తివంతమైన ప్రయోగమని కొనియాడుతున్నారు. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి చంద్రయాన్-2 ప్రయోగంపై స్పందిస్తూ.. ‘ ఇస్రో శాస్త్రవేత్తల అద్భుతమైన ప్రయోగం భారత్ జాతికే గర్వకారణం. స్పేస్ సైన్స్‌లో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచానికే వన్నె తెచ్చారు. ఈ తరహా ప్రయోగాలు లక్షల మంది భారత చిన్నారులకు స్ఫూర్తి నింపుతుంది. జైహింద్’ అని ట్వీట్ చేశాడు. ఇస్రో ఎంతగానో శ్రమించింది: కోహ్లి చంద్రయాన్-2 ప్రయోగం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయినా ఇస్రో శాస్త్రవేత్తలపై మాత్రం సానుభూతి వ్యక్తమవుతోంది. ఈ ప్రయోగాన్ని విజయంవంతం చేయాలని సంకల్పించుకున్న ఇస్రో కృషి నిజంగా అమోఘమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొనియాడాడు. మనం చేసిన ప్రయోగమే ఒక సక్సెస్ అని కోహ్లి పేర్కొన్నాడు. సైన్స్‌లో ఫెయిల్యూర్స్ అంటూ ఏమీ ఉండవని ఈ సందర్భంగా తెలిపాడు. రాత్రింబవళ్లు ఎంతగానో శ్రమించిన శాస్త్రవేత్తలను చూసి దేశం గర్విస్తోందన్నాడు. చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన తరుణంలో విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. దాంతో చంద్రయాన్-2 ప్రయోగం తృటిలో చేజారింది. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. -
మామకు మన సామాను
ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్–2లో నగరం పాలుపంచుకుంది. ఈ ప్రయోగంలో కీలకమైన ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లకు కావాల్సిన వస్తువులను కూకట్‌పల్లిలోని నాగసాయి పరిశ్రమ సమకూర్చింది. జూలై 22న శ్రీహరికోట నుంచిజీఎస్‌ఎల్వీ మార్క్–3 రాకెట్లో నింగికి ఎగిరి జాబిల్లి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్–2... 48 రోజుల అనంతరం ల్యాండర్ శనివారం తెల్లవారుజామున చందమామపై దిగనుంది. ఈ ప్రయోగ విజయంతో భారత్ అగ్రదేశాల సరసన చేరనుంది. ఇంతటి ప్రాధాన్యమున్న ప్రయోగంలో నగరం భాగస్వామ్యం కావడం మనకెంతో గర్వకారణం. చంద్రయాన్–1కి సైతం పరికరాలు దజేసిన నాగసాయి ప్రెసిషియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత బి.నాగభూషణ్‌రెడ్డి... చంద్రయాన్–2కి అందజేసిన పరికరాల గురించి‘సాక్షి’కి వివరించారు. కూకట్పల్లి: నాగసాయి ప్రెసిషియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటి వరకు 38 ఉపగ్రహాల తయారీలో కీలక పాత్ర పోషించింది. 1998 నుంచి ఇస్రోకు విడిభాగాలు అందజేస్తున్న ఈ సంస్థను చంద్రయాన్–2కు సంబంధించిన వస్తువుల తయారీ కోసం రక్షణ శాఖ ఎంపిక చేయడం విశేషం. ఈ సంస్థ చంద్రయాన్ సంబంధించి మొత్తం నాలుగు పరికరాలు తయారు చేసింది. ముఖ్యంగా బ్యాటరీలు ఫిక్స్ చేసే అల్యూమినియం స్టాండ్లు, నాసిల్స్, మరో రెండు రకాల వస్తువులు అందజేసింది. గతంలో ఇస్రో నిర్వహించిన పలు ప్రయోగాలకు సైతం నాగసాయి కంపెనీ పరికరాలు అంజేసింది. వాటిపై సంతృప్తి వ్యక్తం చేసిన రక్షణ శాఖ అధికారులు పలు దశల్లో కంపెనీ క్వాలిటీ, స్టాండర్డ్స్‌డ్స్‌పై పరీక్షలు నిర్వహించారు. చంద్రయాన్–2కు కూడా ఈ కంపెనీనే సరైందని నిర్ధారించి అవకాశం కల్పించారు. విమాన విడిభాగాల్లోనూ... చంద్రయాన్–1 ప్రయోగానికి సైతం ఈ కంపెనీ పరికరాలు అందజేసింది. అయితే అప్పట్లో తక్కువ సమయం మూలంగా కొన్ని వస్తువులను మాత్రమే తయారు చేయగా... ఈసారి చంద్రయాన్–2లో మాత్రం కీలకంగా మారింది. ఇందులో కీలకమైన ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లకు సంబంధించి 4 వస్తువులు తయారు చేసిచ్చింది. అత్యంత నాణ్యమైన నాసిల్స్ తయారు చేసిచ్చింది. గతంలో ఈ పరికరాలను తయారు చేయడానికి ఇజ్రాయెల్ నుంచి అల్యూమినియం తీసుకొచ్చేవారు. ప్రస్తుతం బాలానగర్ నుంచే తెప్పించడం విశేషం. ఇవీ కాకుండా హెచ్ఏఎల్, బీఈఎల్‌తో పాటు అన్నేమ్డ్ ఎయిర్ క్రాఫ్ట్ (యూఏఈ) వంటి సంస్థలకు విమాన విడిభాగాలు అందజేస్తోంది. ఈ విధంగా నాగసాయి కంపెనీ దేశ రక్షణ శాఖకు అవసరమైన కీలక పరికరాలు అందిస్తోంది. చంద్రయాన్–2లో పాలుపంచుకునే అవకాశం దక్కినందుకు బీఎన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీఎన్ రెడ్డి ప్రస్థానం... కూకట్‌పల్లిలో నివాసముండే బి.నాగభూషణ్‌రెడ్డి బీటెక్ పూర్తి చేసిన తర్వాత 1982లో చిన్నతరహా పరిశ్రమలో ఉద్యోగంలో చేరాడు. అనంతరం 1984లో బాలానగర్‌లోని సీఐటీడీలో ఎంటెక్ మెకానికల్ పూర్తిచేసి... హైదరాబాద్ అల్విన్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేరాడు. 1994లో కూకట్పల్లి ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక ప్రాంతంలో నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ స్థాపించారు. అప్పటి నుంచి అనేక రకాల ప్రయోగాత్మక వస్తువులను తయారు చేసేవారు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక విమాన కంపెనీలకు విడిభాగాలు అందజేశారు. నాసా, ఇస్రోలకు కూడా తన పరికరాలు అందజేయాలనే సంకల్పంతో 1998లో ఇస్రో అధికారులను సంప్రదించారు. వారు దాదాపు 6నెలలు బీఎన్ రెడ్డి పనితీరు, ఆయన కార్యాచరణ, నైపుణ్యంపై పలు దశల్లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం విడిభాగాలు తయారు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 38 ఉపగ్రహాలకు వస్తువులు అందజేశారు. ఇదో అద్భుతం చంద్రునిపై వాతావరణ పరిస్థితులు, అక్కడ స్థితిగతులు, మంచినీరు, నిక్షేపాలను గుర్తించేందుకు చంద్రయాన్–2 ఎంతగానో దోహదపడుతుంది. అతి తక్కువ బడ్జెట్‌తో ఇస్త్రో చంద్రుడిపైకి చంద్రయాన్–2ను ప్రయోగించడం నిజంగా అద్భుతం. దీని ద్వారా చంద్రునిపై మానవ మనుగడ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. చంద్రునిపై వనరులు, ఖనిజ నిక్షేపాలు... ఇలా ఎన్నో విషయాలను చంద్రయాన్–2 ద్వారా వెలుగులోకి రానున్నాయి. అలాంటి దానికి తాము పరికరాలను అందించడం ఎంతో గర్వంగా ఉంది.– బీఎన్‌రెడ్డి -
మోదీ వద్ద కంటతడి పెట్టిన శివన్
-
శివన్ కంటతడి..ఓదార్చిన మోదీ
సాక్షి, బెంగళూరు: విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరుకునే అపురూప క్షణాల కోసం యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా వేచి చూసిన వేళ ఎదురైన చేదు ఫలితం ప్రతీ ఒక్కరి మనసును కలచివేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ భారత పౌరుడు ఉద్వేగానికి లోనవుతున్నాడు. ఇప్పటిదాకా చంద్రయాన్-2 యాత్ర అప్రతిహితంగా కొనసాగడానికి ఎనలేని కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ఇక చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ కూడా విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మిషన్ ప్రారంభం నుంచి పడిన శ్రమ, ఇస్రో కీర్తిని.. భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు వచ్చిన అవకాశం చేజారుతుందనే భావనతో చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టారు. చంద్రయాన్-2 అంశంపై ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్ట్రాక్)లో ప్రధాని మోదీ ప్రసంగించిన అనంతరం ఆయనను కలిసిన శివన్ భావోద్వేగం తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. శివన్ పరిస్థితిని గమనించిన ప్రధాని మోదీ ఆయనను గుండెలకు హత్తుకుని ఓదార్చారు. శాస్త్రవేత్తల అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని, భవిష్యత్తులో విజయాలు సాధిస్తారంటూ ఆయనలో ధైర్యం నింపారు. చదవండి: చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది.. కాగా సోషల్ మీడియాలో కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, చైర్మన్ శివన్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. విక్రమ్ ల్యాండర్‌తో సిగ్నల్స్ తెగిపోయిన వేళ తల దించుకుని ఉన్న శివన్ ఫొటోను షేర్ చేస్తూ...‘మీరు సాధించింది చిన్న విషయమేమీ కాదు. మీ అంకిత భావానికి, కఠిన శ్రమకు భారత పౌరులంతా సలామ్ చేస్తున్నారు. మీరు తలెత్తుకుని ఉండండి సార్’ అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు. -
చంద్రయాన్-2; ఆనంద్ మహీంద్ర భావోద్వేగ ట్వీట్
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పలువురు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలుస్తున్నారు. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సజావుగా సాగిన విక్రమ్ ల్యాండర్ ప్రయాణంలో కుదుపులు చోటుచేసుకున్నప్పటికీ శాస్త్రవేత్తల శ్రమకు ఎప్పటికైనా ఫలితం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రయాన్ 2 యాత్ర ప్రారంభం నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై స్పందిస్తున్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర భావోద్వేగ ట్వీట్ చేశారు. మూన్‌లాండర్‌తో ఇస్రోకు సిగ్నల్స్ తెగిపోయిన తర్వాత..‘ సంబంధాలు తెగిపోలేదు. చంద్రయాన్ గుండెచప్పుడును ప్రతీ భారత పౌరుడు వినగలుగుతున్నాడు. తొలిసారి విజయం సాధించకపోతే... మళ్లీ మళ్లీ ప్రయత్నించండి అంటూ తాను చెప్పే గుసగుసలు వినగలుగుతున్నాడు’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది.. The communication isn’t lost. Every single person in India can feel the heartbeat of #chandrayaan2 We can hear it whisper to us that ‘If at first you don’t succeed, try, try again.’ https://t.co/YS3y1kQXI2 — anand mahindra (@anandmahindra) September 6, 2019 అదే విధంగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిని చేరే అపురూప క్షణాల కోసం యావత్ భారతావని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన వేళ అనుకోని ఫలితం ఇస్రో బృందం శ్రమను నాశనం చేయలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘ చంద్రయాన్ 2 మిషన్ కోసం కష్టపడిన ఇస్రో టీంకు అభినందనలు. పని పట్ల మీ అంకితభావం ప్రతీ భారత పౌరుడికి స్పూర్తిదాయకం. మీ శ్రమ వృథాపోదు. ఈ ప్రయోగం ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనలకు పునాదిగా నిలిచింది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. Congratulations to the team at #ISRO for their incredible work on the Chandrayaan 2 Moon Mission. Your passion & dedication is an inspiration to every Indian. Your work is not in vain. It has laid the foundation for many more path breaking & ambitious Indian space missions. 🇮🇳 — Rahul Gandhi (@RahulGandhi) September 6, 2019 -
చంద్రుడి పై విక్రమ్ ల్యాండింగ్‌లో సమస్య
-
చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది..
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్–2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. అనంతరం ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ అంశంపై ఓ ప్రకటన చేశారు. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయని తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను ఆసాంతం వీక్షించిన ప్రధాని మోదీకి శివన్ ఈ విషయం తెలియజేయగా.. ఆయన ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు మీరు సాధించింది తక్కువ ఏమీ కాదని శివన్ భుజం తట్టారు. మీరు ధైర్యంగా ముందుకెళ్లండి.. నేను మీకు అండగా ఉంటాను అని ప్రధాని వారిలో భరోసా కల్పించారు. పసిబిడ్డను పొత్తిళ్లలో వేసినట్లే... చంద్రయాన్ –2 ప్రయోగానికి సంబంధించి అన్నీ ముందుగా అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని అంతకుముందు ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ పేర్కొన్నారు. ‘‘చంద్రయాన్ –2 ప్రాజెక్టులో పనిచేసిన శాస్త్రవేత్తలందరిలోనూ ఎంతో ఉత్కంఠత ఉంది. ఎందుకంటే ఈ ప్రయోగం చాలా సంక్లిష్టమైనది. పైగా ఇస్రో ఇలాంటి ప్రాజెక్టు చేపట్టడం ఇదే తొలిసారి కదా!!’’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘సెన్సర్లు, కంప్యూటర్లు, కమాండ్ వ్యవస్థ అన్నీ పక్కాగా పనిచేశాయి. చేస్తాయి కూడా. భూమ్మీద చాలుసార్లు వీటిని విజయవంతంగా పరీక్షించిన ధైర్యంతో ఈ మాట చెబుతున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ చాలా సున్నితమైన ప్రక్రియ అని.. అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఉయ్యాలలో ఎంత జాగ్రత్తగా వేస్తామో ఇది కూడా అంతేనని ఆ అధికారి అన్నారు. భారతీయ ప్రతిభకు తార్కాణం: మోదీ చంద్రయాన్ –2 ప్రయోగం భారతీయ ప్రతిభకు సజీవ తార్కాణమని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ఒక ట్వీట్లో ప్రశంసించారు. శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేస్తూ... చంద్రయాన్ –2 విజయ వంతం కావడం కోట్లాది మంది భారతీ యులకు లాభం చేకూర్చనుందన్నారు. ‘‘130 కోట్ల మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం ఇది. కొన్ని గంటల్లో చంద్రయాన్ –2 తుది ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత్‌తోపాటు మిగిలిన ప్రపంచం కూడా మన అంతరిక్ష శాస్త్రవేత్తల అసాధారణ ప్రతిభను మరోసారి ప్రత్యక్షంగా వీక్షించనుంది’’ అని మోదీ ఇంకో ట్వీట్లో పేర్కొన్నారు. విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్‌ను ఆయన బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్ట్రాక్) ప్రత్యక్షంగా వీక్షించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు, పొరుగుదేశం భూటాన్‌కు చెందిన యువత కూడా తనతోపాటు ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారని... వీరంతా ఇస్రో నిర్వహించిన స్పేస్ క్విజ్‌లో తమ ప్రతిభను కనపరచిన వారని మోదీ తెలిపారు. మై గవ్ వెబ్సైట్లో నిర్వహించిన స్పేస్ క్విజ్‌లో భారీ సంఖ్యలో యువత పాల్గొనడం అంతరిక్షం, సైన్స్ పట్ల దేశ యువతలో ఆసక్తి పెరుగుతోందనేందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ అపురూప ఘట్టాన్ని దూరదర్శన్ శుక్రవారం అర్ధరాత్రి 1.10 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలుపెట్టగా ఇస్రో తన వెబ్సైట్లోనూ కార్యక్రమ లైవ్ వీడియోను అందించింది. వీటితోపాటు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్లోనూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ను అందించింది ఇస్రో. ఈ ఏడాది జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా నింగికి ఎగసిన చంద్రయాన్ –2 సుమారు ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన తరువాత ఆగస్టు 14న భూ కక్ష్యను దాటి జాబిలివైపు ప్రయాణం ప్రారంభించింది. ఆగస్టు 20న జాబిల్లి కక్ష్యలోకి చేరిన తరువాత దశలవారీగా తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సెప్టెంబరు రెండవ తేదీ చంద్రయాన్ –2 ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడింది. ‘గగన్‌యాన్’ తొలిదశ ఎంపిక పూర్తి భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో మరో ముందడుగు పడింది. ఈ యాత్రలో పాల్గొనే వ్యోమగాముల కోసం చేపట్టిన ఎంపిక ప్రక్రియ తొలిదశ పూర్తయిందని భారత వాయుసేన(ఐఏఎఫ్) తెలిపింది. ఈ ప్రక్రియలో ఎంపికైన 25 మంది టెస్ట్ పైలెట్లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్‌లో శరీరదారుఢ్యంతో పాటు పలువైద్య, మానసిక పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా 2021 డిసెంబర్ కల్లా రెండు మానవరహిత, ఓ మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టాలని ఇస్రో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా నలుగురు భారతీయ వ్యోమగాములకు(వ్యోమనాట్స్) రష్యాలోని యూరీగగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో 15 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. చివరగా వీరిలో ముగ్గురు వ్యోమగాములు గగన్‌యాన్‌లో భాగంగా అంతరిక్షంలో 7 రోజుల పాటు గడపనున్నారు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమైతే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మనుషుల్ని పంపిన నాలుగోదేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లను కేటాయించింది. -
చందమామ అందిన రోజు
-
జాబిలి తీరం : బెంజ్ అద్భుత ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అద్భుత క్షణాలు మరికొద్ది గంటల్లో ఆవిష్కారం కానున్నాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్- 2’ లోని విక్రమ్ ల్యాండర్ అందనంత ఎత్తా జాబిలమ్మా..సంగతేద్దో చూద్దాం రా.. అంటూ జాబిల్లిపై దిగనుంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు..అంటే సెప్టెంబరు 7న చంద్రుడిపై దిగే ప్రక్రియ మొదలుకానున్న సంగతి తెలిసిందే. చారిత్రాత్మకమైన ఆ మధుర క్షణాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఆసక్తి నెలకొంది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా అనేక మంది ప్రముఖులు తమ ట్వీట్లతో విక్రమ్‌కు విషెస్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడీజ్ బెంజ్ ఇండియా సంస్థ వినూత్నంగా స్పందించింది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపిస్తూ..భారత ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఇస్రో సంస్థకు అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా అద్భుతమైన ఫోటోను ట్వీట్ చేసింది. సైడ్ మిర్రర్లో జాబిల్లిని చాలా దగ్గరగా ఫోకస్ చేసింది. ఆబ్జెక్ట్స్ ఇన్‌ద మిర్రర్ ఆర్ క్లోజర్ దేన్ దే అప్పియర్ అని హెచ్చరించే.. మిర్రర్ ఫోటోతో తనదైన శైలిలో ట్వీట్ చేసింది. చదవండి : ఆ క్షణాల్ని అందరూ వీక్షించండి : మోదీ A moment in history that was always meant to be made. Congratulations to team ISRO for taking India this far! #Chandrayaan2#Chandrayaan2Live pic.twitter.com/YCQfU96TRQ — Mercedes-Benz India (@MercedesBenzInd) September 6, 2019 -
ఆ క్షణాల్ని అందరూ వీక్షించండి : మోదీ
బెంగుళూరు: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపుతున్న అరుదైన క్షణాల్ని భారత ప్రజలంతా వీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక చంద్రయాన్-2 ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధృవంపై దిగనుంది. ఈ దృశ్యాలను బెంగళూరులోని ఇస్రో సెంటర్లో పలువురు విద్యార్థులతో కలిసి మోదీ వీక్షించనున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. చంద్రయాన్-2 ల్యాండర్ జాబిల్లి దిగే క్షణాల్ని ఆస్వాదించడానికి బెంగుళూరులోని ఇస్రో కేంద్రంలో ఉండడం తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తుందని మోదీ అన్నారు. తనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు భూటాన్ నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు ఈ అద్భుతాన్ని వీక్షించనున్నట్టు మోదీ తెలిపారు. చంద్రయాన్-2తో భారత్ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించనుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై 22న చంద్రయాన్–2 ప్రయోగం ప్రారంభమైనప్పటి నుంచి.. దానికి సంబంధించి ప్రతి అంశాన్ని గమనిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. అలాగే ఈ అద్భుతాన్ని వీక్షిస్తున్న ప్రజలు తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని మోదీ కోరారు. వాటిలో కొన్నింటిన్ని తాను రీ ట్వీట్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, మిషన్చంద్రయాన్–2 విజయం సాధిస్తే మొదటి ప్రయత్నంలోనే జాబిల్లి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోనుంది. ఈ అరుదైన ఘనత సాధించడం ద్వారా భారత శాస్త్రవేత్తల ప్రతిభ ప్రపంచానికి తెలియనుందని మోదీ అన్నారు. ఈ మిషన్ విజయం సాధిస్తే కోట్లాది భారతీయులకు ప్రయోజనం కలగనుందని మోదీ చెప్పారు. -
కీలక ఘట్టానికి చేరిన చంద్రయాన్ 2 ప్రయోగం
-
జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్‌కు కొన్ని గంటలే
-
దేశం గర్వించే ఆ క్షణం
చందమామ రావే.. జాబిల్లి రావే.. అని అమ్మలు పిల్లల కోసం ఎంత పిలిచినా రాలేదు.. అందుకే మన శాస్త్రవేత్తలే చందమామ వద్దకు వెళ్లేందుకు మార్గం కనిపెట్టారు.. జాబిల్లి జాడలు వెతుక్కుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. జూలై 22న శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో నింగికి ఎగిరి జాబిల్లి కక్ష్యలోకి చేరడంతో చం ద్రయాన్–2 యాత్ర ప్రారంభమైంది. 48 రోజులకు ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై శనివారం తెల్లవారుజామున 1.30– 2.30 గంటల మధ్యలో చంద్రుడిపై కాలుమోపనుంది. ఈ యాత్ర ద్వారా చంద్రగ్రహంపై ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది. మొదటి ప్రయత్నంలోనేజాబిల్లి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలిదేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోనుంది. దటీజ్ ఇండియా! గ్రహరాశులనధిగమించి.. ఘనతారల పథము నుంచి.. గగనాంతర రోదసిలో.. గంధర్వగోళ గతులు దాటేందుకు.. రంగం సిద్ధమవుతోంది! భారతీయులుగా మనమంతా గర్వించే రోజు రానే వచ్చింది.. కచ్చితంగా చెప్పాలంటే ఇంక కొన్ని గంటలే.. చంద్రయాన్–2 ఆర్బిటర్ నుంచి వేరుపడ్డ విక్రమ్ ల్యాండర్.. జాబిల్లి దక్షిణ ధృవంపై వాలడమే ఆలస్యం.. అంతరిక్ష యవనికపై భారత త్రివర్ణ పతాకం గర్వంగా నిలవనుంది! 48 రోజుల నిరీక్షణకు తెరపడే శుభసమయం ఇంకో 24 గంటల్లోనే రానుంది. శనివారం తెల్లవారుజామున సుమారు 1.30– 2.30 గంటల (శుక్రవారం అర్ధరాత్రి దాటాక) మధ్యలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ –2 ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధృవ ప్రాంతంపై దిగనుంది. బాలారిష్టాలను దాటుకుని జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్–2 ఐదుసార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి.. ఆ తర్వాత జాబిల్లి కక్ష్యలోకి చేరింది. మూడు లక్షలకుపైగా కిలోమీటర్ల ప్రయాణం తర్వాత వారం రోజుల కింద జాబిల్లి సమీపానికి చేరిన ఈ అంతరిక్ష నౌక దశల వారీగా మన సహజ ఉపగ్రహానికి దగ్గరవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగానికి చివరి ఘట్టమైన సాఫ్ట్‌ల్యాండింగ్ శనివారం తెల్లవారుజామున జరగనుంది. ఎందుకింత ప్రాముఖ్యం? చంద్రయాన్ –2 విజయవంతమైతే ఇస్రో బోలెడు రికార్డులు సృష్టించనుంది. మొదటి ప్రయత్నంలోనే జాబిల్లి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోతుంది. జాబిల్లిపైకి ల్యాండర్‌ను పంపిన నాలుగో దేశంగానూ రికార్డుల్లోకి ఎక్కుతుంది. కాగా, ఆర్బిటర్ నుంచి వేరుపడిన విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా జాబిల్లిపై దిగడం ఈ ప్రయోగంలో అత్యంత కీలక ఘట్టం. ఇతర గ్రహాలపై సాఫ్ట్ల్యాండింగ్కు ప్రయత్నించడం ఇస్రోకు ఇదే తొలిసారి. అనేక క్లిష్ట పరిస్థితుల్లో విక్రమ్ దిగాల్సి ఉంటుంది. భూమితో పోలిస్తే జాబిల్లిపై గురుత్వ శక్తి మూడొంతులే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జాబిల్లి గురుత్వశక్తి ప్రభావానికి గురైన వెంటనే వేగంగా జారిపడిపోవడం మొదలవుతుంది. గాలి కూడా ఉండదు కాబట్టి.. పతనాన్ని నిరోధించే అవకాశం ఉండదు. గాలి లేకుండా ప్యారాచూట్స్ పనిచేయవు. ఇన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ మోటార్ల సాయంతోనే వేగాన్ని నియంత్రించుకుంటూ గంటకు 3.6 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వేగంతో దిగాల్సి ఉంటుంది. రోవర్ వేరుపడటంతో ప్రయోగం పూర్తి.. జాబిల్లిపై విక్రమ్ సాఫ్ట్ల్యాండింగైన తర్వాత కొన్ని గంటలకు అందులోనే నిక్షిప్తమై ఉన్న రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వస్తుంది. జాబిల్లి ఉపరితలంపై తిరుగుతూ ఈ చిట్టి రోబో ప్రయోగాలు చేస్తుంది. ఈ రోవర్లో రెండు పరికరాలు ఉంటాయి. ల్యాండైన ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ.. అక్కడి మట్టిని పరిశీలిస్తుంది. ఏయే మూలకాలు ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తుంది. దక్షిణ ధృవం వద్ద సూర్యరశ్మి ఉండే 14 రోజుల పాటు ఈ రోవర్ పనిచేసేలా డిజైన్ చేశారు. దక్షిణ ధృవం ప్రత్యేకత? అమెరికా, రష్యాతో పాటు చైనా కూడా ఇప్పటికే చందమామపై అనేక ప్రయోగాలు చేపట్టింది. అయితే చంద్రగ్రహ మధ్యరేఖకు కొంచెం అటు ఇటు మాత్రమే ప్రయోగాలు చేశాయి. సూర్యరశ్మి బాగా ఉంటుంది కాబట్టి పరికరాలకు అవసరమైన విద్యుత్తు తయారు చేసుకోవడం సులువు కాబట్టి.. అందరూ ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ.. ఇస్రో ల్యాండర్ దిగనున్న దక్షిణ ధృవ ప్రాంతం మాత్రం వీటన్నింటికంటే భిన్నమైంది. 50 ఏళ్ల జాబిల్లి యాత్రలో ఇప్పటివరకు ఎవరూ కాలు పెట్టని, పరిశీలనలు జరపని ప్రాంతాల్లో ఇది ఒకటి. భూమి నుంచి విడిపోయేటప్పటి శిలాజాలు ఈ ప్రాంతంలో చెక్కు చెదరకుండా ఉండే అవకాశముంది. చంద్రయాన్ –1 ద్వారా జాబిల్లిపై నీరు ఉన్న విషయం స్పష్టమైంది. చంద్రయాన్–2 ద్వారా ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది. ఆ చివరి గంట.. విక్రమ్ సాఫ్ట్ ల్యాండర్‌లోని కెమెరాలు ప్రతి సెకనుకు తాను దిగాల్సిన ప్రాంతం తాలూకు ఫొటోలు తీస్తూ మనకు పంపుతుంటాయి. వాటి నుంచి అనువైన ప్రాంతాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎంపిక చేస్తారు. ఆ ఎంపికకు అనుగుణంగా విక్రమ్‌లోని కంప్యూటర్లు ఎత్తు, వేగం, దూరం వంటి వాటిని లెక్కించుకుని దిగుతుంది. భూమ్మీది నుంచే విక్రమ్‌లోని ఐదు రాకెట్ ఇంజన్లను నియంత్రిస్తుండటం ఇంకో క్లిష్టమైన పరిస్థితి. ముందుగా దాని వేగం తగ్గించడం.. ఆ తర్వాత ఉపరితలానికి కొంచెం ఎత్తులో స్థిరంగా ఉండేలా చేయడం.. దిగాల్సిన ప్రాంతానికి చేరేలా దిశ మార్చడం వంటివన్నీ చాలా కీలకం. ఇలా రియల్ టైమ్‌లో అంతరిక్ష నౌక ల్యాండింగ్ ఏ దేశమూ ఇప్పటివరకూ చేపట్టలేదు. ఇవన్నీ సాధ్యం కావాలంటే.. విక్రమ్‌లోని కెమెరాలు, దూరాన్ని కొలిచే లేజర్ పరికరాలు, కంప్యూటర్లు, భూమ్మీది శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో, సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆర్బిటర్ చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. ఇది సొంతంగా దాదాపున వెయ్యి వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతూ ఏడాది పాటు పనిచేస్తుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది. విక్రమ్ చంద్రయాన్–2 ద్వారా జాబిల్లిపైకి దిగే ల్యాండర్ పేరు ‘విక్రమ్’. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ స్మారకార్థం ల్యాండర్‌కు ఈ పేరు పెట్టారు. ఇది దాదాపు 1,471 కిలోల బరువుంటుంది. ఇది 14 రోజుల పాటు పనిచేస్తుంది. రోవర్ సాఫ్ట్‌ల్యాండ్ అవ్వడంలో కీలక పాత్ర దీనిదే. ప్రజ్ఞాన్ ఆరు చక్రాలుండే రోవర్ పేరు ప్రజ్ఞాన్. 27 కిలోల బరువుంటుంది. చంద్రుడి ఉపరితలంపై అడుగిడిన దగ్గరి నుంచి సౌర శక్తి సాయంతో 500 మీటర్ల మేర ప్రయాణించగలదు. ఇది ఎక్స్‌రే కిరణాలను ప్రసారం చేస్తూ చంద్రుడి ఉపరితలంపై ఏయే మూలకాలు ఎక్కువగా ఉన్నాయో చెబుతుంటుంది. చంద్రయాన్ ప్రస్థానం ఇలా.. జూలై 22 : శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో నింగికి జూలై 24 : భూమి చుట్టూ తిరిగే కక్ష్య దూరం పెంపు. అతిదగ్గరగా 230 బై 45,163 కిలోమీటర్లతో కక్ష్య జూలై 26 : మరోమారు కక్ష్య దూరం పెంపు. ఈ సారి అతిదగ్గరగా 251 బై 54,829 కిలోమీటర్లతో కక్ష్య జూలై 29 : మూడోసారి కక్ష్య దూరం పెంపు. చోదక వ్యవస్థలను సుమారు 989 సెకన్లు వాడుకుంటూ భూమికి అతిదగ్గరగా 276 బై 71,792 కిలోమీటర్లతో కక్ష్య. ఆగస్టు 2 : నాలుగో కక్ష్య పెంపు ప్రయోగం విజయవంతం. భూమికి 277 బై 89,472 కిలోమీటర్ల దూరంగా కొత్త కక్ష్య మార్గం. ఆగస్టు 6 : చివరి కక్ష్య పెంపు పూర్తి. చోదక వ్యవస్థలను ఉపయోగించుకుని భూమికి దగ్గరగా 276 బై 1,42,975 కి.మీ. కక్ష్య. ఆగస్టు 20 : జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్–2ను మళ్లించిన శాస్త్రవేత్తలు. జాబిల్లికి 114 కి.మీ. దగ్గరగా.. 18,072 కిలోమీటర్లు దూరంగా కక్ష్య మార్గం. ఆగస్టు 21 : జాబిల్లి చుట్టూ తిరుగుతున్న కక్ష్య దూరం తగ్గింపు. అతిదగ్గరి దూరం 118 బై 4412 కిలోమీటర్లకు తగ్గింపు. ఆగస్టు 28 : మూడో కక్ష్య కుదింపు ప్రక్రియ విజయవంతం. తాజా కక్ష్య మార్గం అతి దగ్గరగా 179 బై 1412 కి.మీలు. ఆగస్టు 30 : నాలుగో కక్ష్య కుదింపు ప్రక్రియ. చోదక వ్యవస్థలను 1155 సెకన్ల సేపు వాడుకుని కక్ష్య మార్గాన్ని 124 బై 164 కిలోమీటర్లకు కుదించారు. సెప్టెంబర్ 2 : ఆర్బిటర్ నుంచి విజయవంతంగా వేరుపడిన ల్యాండర్ విక్రమ్. జాబిల్లి చుట్టూ 119 బై 127 కిలోమీటర్ల కక్ష్యలో విక్రమ్ భ్రమణం సెప్టెంబర్ 3 : ఆర్బిటర్ కక్ష్య సవరణ ప్రక్రియ మొదలు. 4 సెకన్ల పాటు ఇంజిన్లను వాడుకోవడం ద్వారా విక్రమ్ కక్ష్యను 104 బై 128 కిలోమీటర్లుగా మార్పు. సెప్టెంబర్ 4 : విక్రమ్‌ను జాబిల్లికి మరింత చేరువుగా తీసుకెళ్లే ప్రయత్నం సక్సెస్. తాజాగా విక్రమ్ కక్ష్య 35 బై 101 కిలోమీటర్లు. -
అంతరిక్ష పరిశోధనల్లో భారత్ టాప్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: అంతరిక్ష పరిశోధనల్లో భారత్ నాలుగో అగ్రగామిగా ఖ్యాతి దక్కించుకుందని ఇజ్రాయెల్‌కు చెందిన ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త బ్రిగ్ జెన్ (ఆర్ఈఎస్) ప్రొఫెసర్ చైమ్ ఈష్డె పేర్కొన్నారు. బెంగళూర్ వేదికగా ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్– 2019 సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమత్రి అశ్వర్ధ నారాయణ పాల్గొని మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన అన్నారు అంతరిక్ష విప్లవం భారత్ ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో విప్లవం రానుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త బ్రిగ్ జెన్ అన్నారు. యువ శక్తిశీల దేశమైన భారత్‌లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అపారమన్నారు. ప్రత్యేకించి సైన్స్ , ఇంజినీరింగ్ సాంకేతికతలో అద్భుతాలు సృష్టించే యువత భారత్‌కు అమూల్యమైన సంపద అంటూ కొనియాడారు. భారత్ చంద్రయాన్–2ను విజయవంతంగా నింగికి పంపి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కించుకుందన్నారు. భారత యువతకు ఆ సత్తా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇజ్రాయిల్ టు సౌత్ ఇండియా ప్రత్యేక అతిథిగా హాజరైన డానా కుర్‡్ష మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనల్లో అంకితభావంతో కృషి చేస్తున్న యువత పనితీరు ప్రశంసనీయన్నారు. భారత్, ఇజ్రాయెల్ అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యంతో చేస్తున్న కృషిని కొనియాడారు. ఇండో–ఇజ్రాయెల్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రామ్, నీటి నిర్వహణ తదితర రంగాల్లో భారత్‌కు సహకరిస్తామన్నారు. 75 ఏళ్లు.. 75 ఉపగ్రహాలు 2022కు భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని, ఆ సందర్భంగా 75 విద్యార్థి రూపకల్ప ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చొరవ చూపిస్తామని ఐటీసీ–2019 చైర్మన్ మురళీకృష్ణా రెడ్డి అన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 7 విద్యార్థి రూపకల్పన ఉపగ్రహాలు ఉన్నాయన్నారు. ఐటీ, బీటీ రంగాలే రేపటి భవిష్యత్తు అని అటల్జీ మాటలను పద్మశ్రీ డాక్టర్ వాసుగం గుర్తుచేశారు. ఈ సదస్సులో 7 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంజినీర్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉడే పి.కృష్ణ, ప్రొఫెసర్ ఎంఆర్ ప్రాణేష్, డాక్టర్ బీవీఏ రావులు పాల్గొన్నారు. -
చంద్రుడికి మరింత చేరువగా
సూళ్లూరుపేట: చంద్రయాన్ –2ను చంద్రుడికి దగ్గరగా ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. బుధవారం ఉదయం 9:04 గంటలకు చేపట్టినఈ ప్రయోగంతో మూడోసారి కక్ష్యదూరాన్ని తగ్గించినట్లయింది. బెంగళూరు సమీపంలోని బైలాలు భూనియంత్రిత కేంద్రం (మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్) నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు దీన్నిపూర్తి చేశారు. చంద్రుడికి దగ్గరగా 118 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ సారి చంద్రుడికి దగ్గరగా 179 కిలోమీటర్ల ఎత్తుకు పెంచుకుంటూ పోయి చంద్రుడికి దూరంగా 4,412 కిలోమీటర్లు ఎత్తును 1412 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గిస్తూ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చే ప్రక్రియ పూర్తయింది. చంద్రయాన్–2 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతే, లూనార్ ఆర్బిట్‌లోకి ప్రవేశించాక కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ రావడం చంద్రయాన్–2 ప్రయోగంలో విశేషం. లూనార్ ఆర్బిట్‌లో చంద్రుడికి దగ్గరగా 179 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 1412 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘవృత్తాకారంలో ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. లూనార్ ఆర్బిట్‌లో కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చి చంద్రుడికి దగ్గరగా 30 కిలోమీటర్లు, దూరంగా 100 కిలోమీటర్లు చేరుకోవడం కోసం మరోమారు ఆపరేషన్ చేపట్టేందుకు ఇస్రోశాస్త్రవేత్తలు సంసిద్ధమవుతున్నారు. ఈ నెల 30న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కక్ష్య దూరాన్ని మరోమారు తగ్గించే ప్రక్రియను చేపట్టనున్నట్టు ఇస్రో బుధవారం ప్రకటించింది. -
చంద్రయాన్–2 చూసొద్దాం
సాక్షి, రామగుండం : సాధారణంగా ఇస్రో నుంచి ఉపగ్రహాలను పంపించడం ప్రసార మాధ్యమాల్లో చూస్తుంటాం. ఇటీవల చంద్రయాన్–2ను పంపించి ప్రపంచ దృష్టిని ఆకర్శించింది. అలాంటిది ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి చంద్రయాన్–2 చంద్రుడి మీద దిగడం ప్రత్యక్షంగా చూసే అవకాశం కొంత మంది విద్యార్థులకు దక్కనుంది. ఇందుకుగాను ఎనిమిది నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఇస్రో నిర్వహించచే ఆన్లైన్ పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది. భారత సాంకేతిక ఎదుగుదల గురించి విద్యార్థులకు ఆసక్తి కలిగించేందుకు ‘ఇస్రో మైగవ్’ ఆన్లైన్ ప్రతిభాపాటవ పోటీలను నిర్వహిస్తోంది. ఈనెల 10 నుంచి ఆన్లైన్ ద్వారా అభ్యర్థనలు పంపుకోవాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలు పొందుపరిచారు. ఎనిమిది నుంచి పదో తరగతిచదువుతున్న విద్యార్థులెవ్వరైనా ‘ఇస్రో మై గవ్’లో మొదట ఆన్లైన్ ఖాతా ప్రారంభించాలి. విద్యార్థి నమోదు ధ్రువీకరణ జరిగిన అనంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థికి పెద్దవారు సహకరించవచ్చు. కానీ ఏకంగా వారే సమాధానాలు ఇవ్వకుండా నైతికత పాటించాలని నిర్వాహకులు చెబుతున్నారు. పోటీ ఇలా.. ఆన్‌లైన్‌ను అనుసంధానం చేసుకొని ‘ఇస్రో మై గవ్’ అని ఆంగ్లంలో చిరునామా నమోదు చేయగానే వివరాలు వస్తాయి. రెండో అంశంపై ఎంటర్ నొక్కగానే వివరాలు, నియమ నిబంధనలు తెలిసిపోతాయి. ఈనెల 10వ తేదీ 12.01 గంటల నుంచి 20వ తేదీ, 11.59 గంటల వరకు ఆన్లైన్లో సమాధానాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. పది నిమిషాల వ్యవధిలో ఇరవై ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఒక్కసారి పోటీ ప్రారంభమయ్యాక మధ్యలో ఆపడం ఉండదు. తెరపై ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వాలి. తెలియకపోతే తప్పుకొని తర్వాత వచ్చే ప్రశ్న తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఎంపిక విధానం.. వేగం కచ్చితత్వంతోపాటు స్పందించే మనస్తత్వం ఉన్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరేసి ప్రతిభావంతులను గుర్తిస్తారు. విజేతల సంఖ్య ఎక్కువగా ఉంటే అతి తక్కువ వ్యవధిలో అత్యధికంగా సరైన సమాధానాలు రాసిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జయపత్రం అందిస్తారు. చంద్రయాన్–2 చంద్రుడి మీదకు దిగే క్రమాన్ని స్వయంగా వీక్షించడానికి బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలో విజేతలైన విద్యార్థులు మిగతా రాష్ట్రాల విజేతలతోపాటు ప్రధానమంత్రి మోడీతో కలిసి చంద్రయాన్ చంద్రుడి మీదకు దిగే అపురూపమైన సన్నివేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. తగు ఆధారాలు, ధ్రువపత్రాలతో ఇస్రోను సంప్రదిస్తే విజేతలకు ఆహ్వానం పంపిస్తారు. -
ఫొటోలు పంపిన చంద్రయాన్–2
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్–2 తొలిసారి అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలను పంపింది. ప్రస్తుతం చంద్రయాన్–2 భూమికి–చంద్రుడికి మధ్యలోని భూమధ్యంతర కక్ష్యలో పరిభ్రమిస్తోంది. శనివారం సాయంత్రం 5.28 గంటలకు భూమిని ఉత్తరం ధృవం వైపు నుంచి తీసిన ఐదు ఫొటోలను ఆదివారం ఇస్రో తన సొంత వెబ్సైట్లో అధికారికంగా విడుదల చేసింది. చంద్రయాన్–2 కక్ష్య దూరాన్ని ప్రస్తుతం భూమికి దగ్గరగా 277 కిలోమీటర్లకు, దూరంగా 89,472 కిలోమీటర్ల ఎత్తుకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమికి 5,000 కిలోమీటర్ల దగ్గరగా వచ్చిన సమయంలో 10 నిమిషాల వ్యవధిలో ఐదు ఫొటోలను తీసి బెంగళూరు సమీపంలోని బైలాలు భూ నియంత్రిత కేంద్రానికి పంపింది. చంద్రయాన్–2లో ఉన్న ల్యాండర్ (విక్రమ్)లో ఎల్–14 కెమెరా ఈ చిత్రాలను తీసింది. చంద్రుడి ఉపరితలం మీద దిగే 15 నిమిషాలు విజయవంతమైతే చంద్రయాన్–2 యాత్ర సజావుగా సాగినట్టేనని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫొటోలు ఎప్పుడెప్పుడంటే.. భూమికి ఉత్తర ధృవం నుంచి 5 వేల కిలోమీటర్ల ఎత్తులో ఒక ఛాయా చిత్రం, 5.29 గంటలకు 4,700 కిలోమీటర్ల్ల ఎత్తులోకి వచ్చాక మరో ఛాయాచిత్రాన్ని తీసింది. ఆ తరువాత 5.31 గంటలకు 4,100 కిలోమీటర్ల్ల ఎత్తు నుంచి, 17.34 గంటలకు 3,200 కిలో మీటర్ల ఎత్తు నుంచి, 17.37 గంటలకు 2,450 కిలోమీటర్ల ఎత్తు నుంచి మరో మూడు ఛాయా చిత్రాలను తీసి పంపింది. -
నీలిరంగులో మెరిసిపోతున్న భూమి
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుంచి ఈ నెల 22వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్ -2 మిషన్ ప్రయోగించిన విషయం తెలిసిందే. శుక్ర వారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట ర్లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. చంద్రయాన్–2 మిషన్ రోదసీలో ఆరోగ్యకరంగా ప్రయాణి స్తోందని ఇస్రో శాస్త్ర వేత్తలు అధికారికంగా వెల్లడించారు. తాజాగా శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచే ఆపరేషన్‌ను చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఈ నెల14న చివరిగా చంద్రయాన్–2 మిషన్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఈరోజు విడుదల చేసింది. నీలిరంగులో భూమి మెరిసిపోతుంది. -
చైనా సాయంతో మేము సైతం : పాక్!
ఇస్లామాబాద్ : చైనా ఉపగ్రహాల సహాయంతో 2022లో తమ మొట్టమొదటి వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపుతామని పాకిస్తాన్ గురువారం వెల్లడించింది. ఈ క్రమంలో వ్యోమగామి ఎంపిక ప్రక్రియ 2020 ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ మేరకు...‘ అంతరిక్షంలో అడుగుపెట్టబోయే తొలి పాకిస్తానీ ఎంపిక 2020లో ప్రారంభిస్తాం. ఎంపిక ప్రక్రియలో భాగంగా యాభై మందిని షార్ట్‌లిస్ట్ చేస్తాం. క్రమేణా ఆ జాబితా 25 నుంచి ఒకటికి తగ్గి 2022 నాటికి అంతరిక్షం చేరుకునే మొదటి వ్యక్తిని పాక్ సగర్వంగా ప్రకటిస్తుంది. అంతరిక్ష పరిశోధనల్లో పురోగతి సాధించే విషయమై మా దేశంలో ఇదే అతిపెద్ద కార్యక్రమం. ఈ ప్రకటన చేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నా’ అని ఆ దేశ సాంకేతికాభివృద్ధి మంత్రి ఫవాద్ చౌదరి ట్వీట్ చేశారు. అదే విధంగా ఈ ప్రయోగంలో వ్యోమగాముల ఎంపిక విషయంలో పాక్ వాయు సేన కీలక పాత్ర పోషిస్తుందని ఫవాద్ చౌదరి వెల్లడించారు. కాగా చంద్రుని మూలాలు కనుగొనే క్రమంలో భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. తద్వారా రష్యా, అమెరికా, చైనా దేశాల తర్వాత చంద్రుడిపై పరిశోధనలు చేసిన నాలుగో దేశంగా భారత్ ఖ్యాతి గడించింది. ఈ నేపథ్యంలో దాయాది దేశం తమ అంతరిక్ష ప్రయోగం గురించి ప్రకటన చేయడం గమనార్హం. -
చంద్రయాన్-2పై భజ్జీ ట్వీట్.. నెటిజన్ల ఫైర్
జాబిల్లి రహస్యాలను శోధించే లక్ష్యంతో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల యావత్ భారతం హర్షం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా భారత దేశ అంతరిక్ష పరిశోధన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వారి ప్రతిభను రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ చేసిన ఆసక్తికర ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘కొన్ని దేశాలు తమ జాతీయ జెండాలపై చంద్రున్ని ఉంచుకున్నాయి. కానీ కొన్ని దేశాలు మాత్రం ఆ చంద్రునిపైనే తమ జెండాలను పాతాయి’ అని చంద్రయాన్-2 ప్రయోగం సక్సెస్‌ను ప్రస్తావిస్తూ భజ్జీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో ఆయా దేశాల జెండాలను సైతం జతచేశాడు. అయితే ఈ ట్వీట్‌పై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరూ భజ్జీ ఆసక్తికర ట్వీట్‌ను సమర్ధిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తూ.. ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ‘ నీ ట్వీట్ పట్ల సిగ్గు పడుతున్నాం.. ఎంత చెత్తగా ఆలోచించావో నీ ట్వీట్ తెలియజేస్తుంది. అలాగే భారతీయులంతా చెడ్డవాల్లనేటట్లు ఉంది’ అని ఒకరంటే.. ‘హర్భజన్.. హిందూత్వ ఆలోచనలతో ముస్లిం దేశాలను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నాడు. కానీ హిందూత్వ దేశమైన నేపాల్ జాతీయ జెండాలో కూడా చంద్రుడు ఉన్నాడనే విషయం తెలుసుకోవాలి’ అంటు మరోకరు కామెంట్ చేస్తున్నారు. చంద్రునిపైకి వెళ్తే అభివృద్ధి సాధించినట్లు కాదని ఇంకోకరు చురకలంటిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. (చదవండి: నిప్పులు చిమ్ముతూ...) Singapore, Laos, Mongolia, Nepal also have the moon on their country flags. Nepal was Hindu majority till a few years ago. Sad to see Harbhajanamplifying Hindutva trope and picking on the Muslim nations. Not cool. https://t.co/Ap5AwQnahQ — Faizan Shaikh (@Faizan902894) July 23, 2019 -
ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్
చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో.. అంతరిక్ష ప్రయోగాలలో దేశ ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది. సోమవారం సగర్వంగా ‘చంద్రయాన్–2’ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచంలోనే చంద్రునిపై రాకెట్‌ను ప్రవేశపెట్టిన దేశాలలో భారత్ నాలుగవ స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాలలో వరుసగా అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. ఈ ప్రయోగం సక్సెస్‌పై టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రభాస్.. చంద్రయాన్–2కు తన సినిమా ‘బాహుబలి’ పేరు పెట్టడం గర్వంగా ఉందన్నారు. ప్రయోగంపై ఆనందం వ్యక్తం చేస్తూ, ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చంద్రయాన్-2 మిషన్ విజయం దేశానికే గర్వకారణమని, ఈ ప్రయోగంతో దేశశక్తిని మరోసారి ప్రపంచానికి చూపించామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల కృషికి ఫలితం దక్కిందని, నేడు ప్రతి భారతీయ పౌరుడు గర్వించదగ్గ రోజని కొనియాడారు. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ తొలిసారి తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ సినిమాను మొదట ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సాహో టీం నిర్ణయించినప్పటికీ, ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో ఆగష్టు 30వ తేదీకి వాయిదా వేశారు. View this post on Instagram Hello Darlings! It is a proud day for all of us Indians as ISRO's Chandrayaan-2 took flight today. It is a further honor for the entire Baahubali Team with the rocket being regarded as #Baahubali for its magnum opus scale, years of hardwork in the making & first of its kind capacity to carry tonnes. 🙌🏻 More Power to India 🇮🇳 A post shared by Prabhas (@actorprabhas) on Jul 22, 2019 at 2:27am PDT -
చంద్రయాన్–2 విజయంలో తెనాలి తేజం!
సాక్షి, తెనాలి: భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలు రాయిని ఇస్రో అందుకుంది. ఎంతో సంక్లిష్టమైన ప్రాజెక్టుగా పేరొందిన చంద్రయాన్–2ను సోమవారం విజయవంతంగా ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల్లో మనదేశ సత్తాను ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటింది. 120 కోట్ల ప్రజల ఆకాంక్షలను, ఆశలను గగనానికి మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ విజయంలో గుంటూరు జిల్లా, తెనాలికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ పావులూరు సుబ్బారావు పాత్రకూడా ఉండడం మనందరం గర్వించదగిన విషయం. రాకెట్లకు కావాల్సిన కీలకమైన ఉపకరణాలను ఈయన సంస్థ సరఫరా చేస్తుండడం విశేషం.. తెనాలి వారే.. డాక్టర్ పావులూరి సుబ్బారావు స్వస్థలం తెనాలి సమీపంలోని గోవాడ గ్రామం. ఆయన 1952లో జన్మించారు. తండ్రి పావులూరి శివరామకృష్ణయ్య, తల్లి అమ్మెమ్మ. స్కూలు ఫైనల్ వరకు తెలుగు మీడియంలో చదివిన సుబ్బారావు స్వయంకృషితో రాణించారు. కాలికట్ ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో ఎంఈ చేశాక, బెంగళూరు యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. ‘ఇస్రో’లో శాస్త్రవేత్తగా చేరి, భారత అంతరిక్ష కార్యక్రమాల్లో నైపుణ్యం సాధించారు. మరింత సృజనాత్మకతతో రాణించాలన్న భావనతో ఉన్న ఆయనను అంతరిక్ష వ్యాపారం ఆకర్షించింది. ఫలితంగానే అనంత్ టెక్నాలజీస్ (1993) స్థాపనకు దారితీసింది. రక్షణ, పరిశోధన (డీఆర్డీఓ)లో సిస్టమ్స్ డిజైన్, అభివృద్ధి చేసి, ఫ్యాబ్రికేషన్ చేసే వ్యాపారాన్ని అనంత్ టెక్నాలజీస్ చేపట్టింది. ఉపగ్రహ ప్రయోగ వాహకాలైన పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో, జాతీయ అభివృద్ధికి తోడ్పడే ఏరోస్పేస్ ప్రయోగాలన్నింటిలో విస్తృతంగా పాల్గొంది. అగ్ని, ఆకాశ్, బ్రహ్మోస్, పృథ్వి క్షిపణుల నిర్మాణం, తేలిక రకపు విమానాల తయారీలోనూ పాలుపంచుకున్నారు. చంద్రయాన్, మంగళయాన్ మిషన్స్‌లో శాటిలైట్ కాంపొనెంట్స్ నిర్మాణంలో పాల్గొని ‘మామ్’ శాటిలైట్ మెయిన్‌ఫ్రేమ్ మొత్తాన్ని అభివృద్ధి చేసినట్టు సుబ్బారావు చెప్పారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చేపట్టిన తొలి భారీ అంతరిక్ష ప్రాజెక్టు చంద్రయాన్ –1. పదేళ్ల క్రితం అతితక్కువ ఖర్చుతో చేసిన ఈ ప్రయోగంతో చంద్రుడిపై నీటి ఆనవాళ్లను పసిగట్టారు. మళ్లీ ఇప్పుడు చంద్రయాన్–2 విజయవంతంగా ప్రయోగించి దేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచ యవనికపై ఇస్రో మరోసారి చాటింది . ‘చంద్రుడు ఆవాసంగా నివాసం...అవకాశాలు’ అనేది తాజా ప్రయోగం ముఖ్య ఉద్దేశం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన జీఎస్ఎల్వీ మార్స్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జరిగిన ఈ ప్రయోగం విజయవంతంలో ఓ తెలుగుతేజం భాగస్వామ్యం ఉంది. ఆయనే తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ పావులూరి సుబ్బారావు. కీలక ఉపకరణాలు సరఫరా: ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసిన అనుభవంతో డాక్టర్ సుబ్బారావు స్థాపించిన ఏటీఎల్ స్పేస్ సిస్టమ్స్ అండ్ ఎక్విప్మెంట్ సంస్థ టెలిమెట్రీ, టెలికమాండ్, పవర్, ఆటిట్యూడ్, ఆర్బిట్ కంట్రోల్, ఆన్–బోర్డ్–కంప్యూటర్ వంటి ఎన్నో పరికరాలు ఇస్రోకు అందించింది. రాకెట్ ప్రయోగాల్లో వీటిని కీలకంగా చెబుతారు. ఈ సంస్థ తయారుచేసిన స్టార్ సెన్సార్ వంటి అత్యాధునికమైన స్పందన నమోదుచేసే ముఖ్యమైన పరికరాల్ని ఇస్రో తన శాటిలైట్లలో వినియోగిస్తోంది. వాటివల్ల స్పేస్ క్రాప్ట్–నక్షత్రాల మధ్య గల దూరాలను గుర్తించటానికి వీలవుతుందని, పరిశోధనల్లో ఇదెంతో కీలకమని డాక్టర్ సుబ్బారావు ‘సాక్షి’తో ఫోనులో చెప్పారు. ఇస్రో వాహకనౌకలకు కావాల్సిన ఏవియానిక్స్ సిస్టమ్స్‌ను కూడా ఏటీఎల్ అందిస్తోంది. నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్, ఆధునిక టెలిమెట్రీ, ఆర్ఎఫ్ సిస్టమ్స్, పవర్ మాడ్యూల్స్, డీసీ/డీసీ, ఇనెర్పియల్ సెన్సింగ్ యూనిట్, స్టేజీ హెర్నేసింగ్ అండ్ ఇంటెగ్రేషన్ వంటి వాటిని ఈ సంస్థ సమకూరుస్తున్నారు. సొంతంగా రాకెట్ ప్రయోగం ఇస్రో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ప్రొడక్షన్ ధ్రువీకరించిన ఏటీఎల్‌లో 300 పైగా సుశిక్షితులైన నిపుణులు, ఇంజినీర్లు పనిచేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి అసెంబ్లింగ్ యూనిట్లతోపాటు పరీక్షించే సదుపాయం కూడా సంస్థలో ఉంది. ప్రస్తుతం నాలుగు టన్నుల శాటిలైట్ల నిర్మాణ ప్రారంభ దశ నుంచి పరీక్షకు సిద్ధంచేసే వరకు పూర్తి సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు డాక్టర్ సుబ్బారావు తెలిపారు. అత్యంత సృజనాత్మకమైన ఈ సదుపాయంతో ఇస్రోతో పాటు ఇతర దేశాలకూ శాటిలైట్లు తయారు చేసిస్తామని చెప్పారు. ఏటీఎల్ ఆధ్వర్యంలో ఇప్పటికే ‘ఏ1 శాట్’ అనే సొంత శాటిలైట్‌ను రష్యా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించామని, ప్రస్తుతం అది దక్షిణ అమెరికాలో ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నట్టు వివరించారు. 25 ఏళ్లుగా భాగస్వామ్యం: ఆర్బిటర్, ల్యాండర్ వంటి బహుముఖ వ్యవస్థలు కలిగివున్న బాహుబలి (జీఎస్ఎల్వీ ఎంకే–3) ఉపగ్రహం, చంద్రయాన్–2 మిషన్ ప్రత్యేకత తెలిసిందే. ఇందులోని మూడు ముఖ్యమైన దశలకు చెందిన ఏవియానిక్స్ సిస్టమ్స్‌ను నిర్మించి ఇస్రోకు అందించినది హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్) సంస్థ. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌ను కూడా అందిస్తోందీ సంస్థ. ఏటీఎల్ వ్యవస్థాపకుడు, సీఎండీ తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ పావులూరి సుబ్బారావు కావటం విశేషం. ఇస్రో విజయాల్లో 25 ఏళ్లుగా అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ఏటీఎల్)కు భాగస్వామ్యముంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, తన తిరువనంతపురం యూనిట్ నుంచి పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీలకు ఏవియానిక్స్ సిస్టమ్స్‌ను అందిస్తోంది. కమ్యూనికేషన్స్, రిమోట్ సెన్సింగ్ నావిగేషనల్, సైంటిఫిక్ శాటిలైట్స్ లాంటి అన్ని రకాల ఉపగ్రహాల్లో ఎలక్ట్రానిక్ కక్ష ఉపవ్యవస్థల రియలైజేషన్, డెలివలీ విభాగాలను చాలాకాలంగా ఏటీఎల్ బెంగళూరు యూనిట్ నుంచి అందిస్తోంది. -
మహిళా శక్తి @ చంద్రయాన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్టు సమాచారం. అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తామేమీ తక్కువ కాదన్నట్టుగా చంద్రయాన్–2 ప్రయోగంలో 30 శాతం మంది మహిళలు ఎంతో కృషి చేశారు. త్రీ–ఇన్–ఒన్‌గా భావిస్తున్న చంద్రయాన్–2 ప్రాజెక్టులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పని చేసి ల్యాండర్, రోవర్‌ను రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం కూడా ఉంది. ఇందులో కొంతమందిని మాత్రమే ఇక్కడ ఉదహరిస్తున్నాము. భారతదేశానికి ఎంతో తలమానికంగా నిలిచే ఈ ప్రయోగంలో మహిళా శాస్త్రవేత్తల కృషి దాగి ఉండడం విశేషం. ఇస్రోలో 30 మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా ఈ ప్రయోగంలో రీతూ కరిథల్ మిషన్ డైరెక్టర్‌గా, ఎం.వనిత ప్రాజెక్టు డైరెక్టర్‌గా అత్యంత కీలకంగా ఉన్నారు. బాలు శ్రీ దేశాయ్, డాక్టర్ సీత, కె.కల్పన, టెస్సీ థామస్, డాక్టర్ నేహ సటక్ అనే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములై మహిళాశక్తిని నిరూపించారు. ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ రీతూ.. చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించిన రీతూ కరిథల్ ‘‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’’గా ఇస్రోలో అందరూ పిలుస్తుంటారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలో కూడా ఈమె డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈమె 2007లో మాజీ రాష్ట్రపతి, అణుపరీక్షల నిపుణులు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డును కూడా అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్‌లో అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఉపగ్రహాల తయారీలో దిట్ట.. చంద్రయాన్–2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా పనిచేసిన ఎం.వనిత ఉపగ్రహాల రూపకల్పనలో నిపుణురాలు. ఆమె డిజైన్ ఇంజినీర్‌గా శిక్షణ తీసుకుని చంద్రయాన్–2 అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. ‘‘ఆస్ట్రనామికల్ సొసైటీ అఫ్ ఇండియా ’’నుంచి 2006లో బెస్ట్ ఉమెన్ సైంటిస్టు అవార్డును అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్ బాధ్యతలన్నింటిని వనిత చూసుకుని ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు: గవర్నర్ చంద్రయాన్–2 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో చంద్రయాన్2 మిషన్ భారీ ముందడుగు అని అన్నారు. గొప్ప ముందడుగు: ఏపీ సీఎం జగన్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం అయినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను అభినందించారు. అంతరిక్ష రంగంలో ఈ విజయం అతి గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ విజయంతో భారత్ చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్న దేశాల సరసన చేరిందని అన్నారు. సీఎం కేసీఆర్ అభినందనలు చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో భారతీయ శాస్త్రవేత్తల కఠోర శ్రమ, మేథా సంపత్తి దాగి ఉందని కొనియాడారు. -
చంద్రుడి గుట్టు విప్పేందుకే..!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): చంద్రుడు ఎలా ఉద్భవించాడు? చంద్రుడి ఉపరితలంపై ఉన్న మూలకాలు ఏంటి? భూమి ఏర్పడిన తొలినాళ్లలో చంద్రుడిలాగే ఉండేదా? అనే విషయాలను అధ్యయనం చేయడం కోసమే ఇస్రో చంద్రయాన్–2ను ప్రయోగించింది. చంద్రుడిని అధ్యయనం చేయడం వల్ల తొలినాళ్లలో భూవాతావరణం ఎలా ఉండేదన్న విషయాన్ని అర్థం చేసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు పదేళ్లపాటు కష్టపడ్డారు. జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్–2 కాంపోజిట్ మాడ్యూల్స్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉంటాయి. ముందుగా ఆర్బిటర్ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ అక్కడి సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. అనంతరం కొద్దిసేపటికే ల్యాండర్ నుంచి రోవర్ బయటకొచ్చి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు జరుపుతుంది. ఈ మూడు పరికరాలు సమన్వయంతో పనిచేస్తూ బెంగళూరులోని బైలాలులోని భూనియంత్రిత కేంద్రానికి డేలా పంపిస్తాయి. ఇందులో ల్యాండర్ 14 రోజులే పనిచేస్తుంది. ఆర్బిటర్ చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఏడాది పాటు సేవలు అందిస్తుంది. ఈ ప్రయోగానికి రూ. 978 కోట్లు వెచ్చించారు. ల్యాండర్ ‘విక్రమ్’అత్యంత కీలకం.. చంద్రయాన్2 మిషన్‌లోని ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు ‘విక్రమ్’గా నామకరణం చేశారు. 1471 కేజీల బరువున్న ఈ ల్యాండరే ప్రయోగంలో అత్యంత కీలకమైనది. ఇలా చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ను దించే ప్రయత్నం చేస్తున్న మొట్టమొదటి దేశం భారతే కావడం విశేషం. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా దేశాలు బాల్స్ ద్వారా రోవర్లు పంపారు. అయితే భారత్ మాత్రం నేరుగా ల్యాండర్‌ను దించే ప్రయత్నం చేస్తోంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడిపైకి దిగే 15 నిమిషాలే ఈ ప్రయోగంలో కీలకమైనవి. ల్యాండర్ ‘విక్రమ్’చంద్రుడివైపు నిమిషానికి 2 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే ప్రక్రియ సంక్లిష్టమైంది. ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగగలిగితే ప్రయోగం సక్సెస్ అయినట్లే. ఈ ల్యాండర్లో శాస్త్రవేత్తలు 3 పేలోడ్స్‌ను అమర్చారు. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ‘థర్మో–ఫికల్ ఎక్స్ఫర్మెంట్’ప్లాస్మా సాంద్రతను పరిశోధించేందుకు ‘లాంగ్ ముయిర్ ప్రోబ్’, చంద్రుని మూలాలను తెలుసుకోవడానికి ‘ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీయాస్మిక్ యాక్టివిటి’అనే పరికాలను చంద్రయాన్–2లో ప్రయోగించారు. ప్రజ్ఞాన్ ‘రోవర్’తో త్రీడీ చిత్రాలు ఓసారి ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్నాక అందులోని రోవర్ విడిపోతుంది. దీనికి ‘ప్రజ్ఞాన్’ అని పేరుపెట్టారు. 27 కిలోల బరువుంటే ప్రజ్ఞాన్ సౌరశక్తితో ప్రయాణిస్తుంది. సెకన్‌కు ఒక సెంటీమీటర్ చొప్పున చంద్రుడిపై రోజుకు 500 మీటర్లు ప్రయాణిస్తూ అక్కడి ఉపరితలంపై ఉన్న అణువులను విశ్లేషించి డేటాను ల్యాండర్‌కు పంపుతుంది. ల్యాండర్ ఈ డేటాను ఆర్బిటర్‌కు చేరవేస్తే, అక్కడి నుంచి సమాచారం బెంగళూరులోని భూనియంత్రిత కేంద్రానికి చేరుతుంది. ఈ రోవర్‌కు ముందుభాగంలో మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు మోనోక్రోమాటిక్ నావ్ కెమెరాలున్నాయి. ఇవి ప్రజ్ఞాన్ ఉన్న ప్రదేశానికి సంబంధించిన 3డీ ఫొటోలను పంపుతాయి. ఈ రోవర్లో 2 పేలోడ్స్ ఉన్నాయి. ఇందులోని ఆల్ఫా పర్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, లాజర్ ఇన్డ్యూసెడ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే పరికరాలు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? అక్కడి పరిస్థితులు ఏంటి? అనే విషయాలతో పాటు పలు అంశాలపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టనుంది. ఈ రోవర్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన లాజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే పరికరాన్ని కూడా అమర్చారు. ఈ పరికరం చంద్రుడి అంతర్భాగంతో ఏముందో పరిశోధించి నాసాకు పంపిస్తుంది. ఆర్బిటర్‌లో అయిదు పేలోడ్స్ ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. దీంట్లో 5 పేలోడ్స్ వున్నాయి. ‘లార్ట్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్’అనే ఉపకరణం చంద్రుడి ఉపరితలంపై ప్రధాన మూలకాల మ్యాపింగ్ చేపడుతుంది. ‘ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్’చంద్రునిపై నీరు, మంచు జాడను అన్వేషిస్తుంది. ఇక ‘ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రో మీటర్’ ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని చేరవేస్తుంది. ‘టెరియన్ మ్యాపింగ్ కెమెరా’ ఖనిజాల అధ్యయనం, త్రీడీ మ్యాపింగ్‌లో సాయపడనుంది. -
భారత సంకల్పానికి నిదర్శనం
న్యూఢిల్లీ: చంద్రయాన్–2 ప్రయోగం మన శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలను, శాస్త్రరంగంలో కొత్త లక్ష్యాలను సాధించాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని ట్విట్టర్ ద్వారా ఈ ప్రయోగంలో పాలు పంచుకున్నవారందరికీ ఆడియో మెసేజ్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రయాన్–1 ప్రయోగంలో ఏర్పడిన అవాంతరాలను శాస్త్రవేత్తలు అధిగమించారు. ఈ ప్రయోగం ద్వారా వారి పట్టుదల, సంకల్పం మరోసారి రుజువయ్యాయి. ప్రతి భారతీయుడు ఎంతో గర్వపడుతున్నాడు’ అని పేర్కొన్నారు. ‘ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. చంద్రుని గురించిన మరెన్నో విషయాలు తెలిసే అవకాశాలున్నాయి..ఇప్పటి వరకు ఎవరూ చేపట్టని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంపై అధ్యయనం జరగనుంది. ఘనమైన మన దేశ చరిత్రలో ఇది చాలా ప్రత్యేకమైన సమయం’ అని పేర్కొన్నారు. భారీ టీవీ స్క్రీన్‌పై చంద్రయాన్–2 ఉపగ్రహం ప్రయోగాన్ని తిలకిస్తున్నట్లు ఉన్న తన ఫొటోలను కూడా ప్రధాని జత చేశారు. ట్విట్టర్ ఆడియో సందేశంలో ప్రధాని.. ఇస్రో చైర్మన్ కె.శివన్‌తోపాటు శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు. నైపుణ్యం, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం కలిగిన మన శాస్త్రవేత్తలు ఎలాంటి సవాల్‌నైనా స్వీకరిస్తారనేందుకు ఇది గొప్ప ఉదాహరణ అని తెలిపారు. ‘సవాల్ ఎంత పెద్దదైతే, పట్టుదల కూడా అంతే ఉంటుంది. ప్రయోగం వారం ఆలస్యమైనా సరే, చంద్రయాన్–2 చంద్రుని చేరాలనే లక్ష్యం మాత్రం మారలేదు. ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపైకి మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం చేరనుంది. అలాగే, చంద్రునిపైకి చేరనున్న నాలుగో దేశం భారత్ కానుంది’ అని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలకు పార్లమెంట్ అభినందనలు చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభించిన ఇస్రో శాస్త్రవేత్తలను పార్లమెంట్ అభినందించింది. ఈ ప్రయోగం ద్వారా దేశ అంతరిక్ష ప్రయోగాల్లో భారత దేశం ఆధిక్యత మరోసారి రుజువైందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ‘మన శాస్త్రవేత్తలు సాధించిన ఘనత దేశానికి గర్వకారణం. భారత శాస్త్రవేత్తలకు, ఇందుకు తోడ్పాటు అందించిన ప్రధాని మోదీకి అభినందనలు’ అని స్పీకర్ అన్నారు. దేశీయ పరిజ్ఞానంతో చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు. నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన సమయం: కాంగ్రెస్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ ఘనత తమ పాలనతోనే సాధ్యమైందని కాంగ్రెస్ అంటుండగా, భవిష్యత్తు నాయకత్వం కనిపించనప్పుడు గతాన్ని తవ్వుకోవడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ తిప్పికొట్టింది. చంద్రయాన్–2పై కాంగ్రెస్ పార్టీ ..‘ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన మంచి సమయమిది. అంతరిక్ష పరిశోధనలకు గాను 1962లో ఆయన ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను ఆ తర్వాత ఇస్రోగా పేరు మార్చారు. అలాగే, ప్రధాని మన్మోహన్సింగ్ 2008లో చంద్రయాన్–2కు ఆమోదం తెలి పారు’ అని తెలిపింది. దీనిపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. ‘ఇది నిజంగా దిగజారుడుతనం. ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన ఈ క్షణాన్ని రాజకీయం చేయడం తగదు’ అని పేర్కొన్నారు. -
చంద్రుడిపై పరిశోధనలకు 60 ఏళ్లు!
శ్రీహరికోట(సూళ్లూరుపేట): నెలలో సగం రోజులు చీకటిలో ఉండి, మరో సగం రోజులు చల్లని వెన్నెల కురిపించే నెల రాజు గురించి తెలుసుకోవడానికి 60 ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. చందమామ విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. చంద్రుని చుట్టు కొలత 10,921 కిలోమీటర్లు అని నాసా శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. నానాటికీ చంద్రుని పరిమాణం కూడా తగ్గిపోతోందనే విషయం కూడా వారి పరిశోధనల్లోనే వెల్లడైంది. అదే విధంగానే చంద్రుడు భూమికి మధ్య దూరం పెరిగిపోతోందని, ఏడాదికి సుమారు 15 అంగుళాల చొప్పున చంద్రుడు దూరంగా వెళుతున్నాడని కూడా నాసా వెల్లడించింది. ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలు చాలా వరకు ఇప్పటికి 125 ప్రయోగాలు చంద్రుడిపైకి చేపట్టినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 1958 నుంచి అమెరికా చంద్రుడిపై పరిశోధనలను ప్రారంభించింది. 12 ప్రయోగాలు చేసిన తరువాత 13వ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించగలిగింది. అలా ఇప్పటిదాకా 58 ప్రయోగాలు చేసి 41 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. 1969లో అపోలో రాకెట్ ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలిన్స్ అనే ముగ్గురు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించిన ఘనత అమెరికాదే. ఈ ప్రయోగం జరిగి కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. రష్యా 1958 నుంచి చంద్రునిపైకి 53 ప్రయోగాలు చేసింది. అందులో 35 మాత్రమే విజయం అయ్యాయి. 1990 నుంచి జపాన్ ఆరు ప్రయోగాలు సొంతంగా, ఒక్క ప్రయోగం నాసాతో కలిసి చేసింది. ఇందులో ఐదు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 2010 నుంచి చైనా ఏడు ప్రయోగాలు చేయగా ఒక్క ప్రయోగం మాత్రమే చంద్రుని దాకా వెళ్లగలిగింది. ఇజ్రాయెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రునిపైకి ల్యాండర్‌ను çపంపించినా అది విజయవంతం కాలేదు. జర్మనీ 2003లో చంద్రుని మీదకు ఆర్బిటర్‌ను విజయవంతంగా పంపించింది. 2008లో భారత్ చంద్రుడి మీదకు చంద్రయాన్–1 పేరుతో ఆర్బిటర్ ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని కనుగొంది. అమెరికా, రష్యా, జపాన్, చైనా, జర్మనీ, ఇజ్రాయెల్, భారత్ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగాలు చేసినప్పటికీ అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యాలే ఇప్పటికీ ముందంజలో ఉన్నాయి. తాజాగా, భారత్ రెండో సారి ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దింపి అందులో అమర్చిన రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, రోవర్‌ను ల్యాండర్ ద్వారా పంపి దాన్ని చంద్రుడిపైకి దించడం మాత్రం చేస్తున్నది భారత్ మాత్రమేనని చెప్పుకోవచ్చు. చంద్రుడు, అంగారకుడు మీదకు రోవర్లు పంపిన వారు పెద్ద పెద్ద బాల్స్ వంటి వాటిలో రోవర్లను అమర్చి పంపారు. భారత్ మాత్రం ల్యాండర్‌ను చందమామపై దించే మొట్టమొదటి దేశంగా ఖ్యాతి సాధిస్తోంది. -
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే
శ్రీహరికోట: చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినందుకు గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ తెలిపారు. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిందని వెల్లడించారు. ‘సాంకేతిక కారణాలతో ప్రయోగం నిలిచినా మేం మళ్లీ పుంజుకున్నాం. ప్రయోగానికి కొద్దిసేపటి ముందు సమస్యను గుర్తించగానే మా బృందం రంగంలోకి దిగింది. అప్పట్నుంచి 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించి చంద్రయాన్–2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశాం. జీఎస్ఎల్వీ మార్క్–3 చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించడం ఎంతో సంతోషంగా ఉంది. మేం అనుకున్న దానికంటే 6,000 కి.మీ ఎత్తులో చంద్రయాన్–2ను వాహకనౌక విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చారిత్రాత్మక ప్రయాణం మొదలైంది. కేవలం భారత్ ఒక్కటే కాదు. ప్రపంచమంతా చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కావాలని ఎదురుచూసింది. మేం దాన్ని సాధించాం. చంద్రయాన్–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా సిబ్బందే ఉన్నారు. వీరిలో శాస్త్రవేత్తలు రీతూ కరిథల్, ఎం వనితలు కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్–2 ప్రయోగం ఇంకా పూర్తికాలేదు. చంద్రుడిపై ల్యాండర్ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైనవి. ఈ దశను ల్యాండర్ దాటితే ప్రయోగం విజయవంతం అయినట్లే. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. -
అందరి చూపూ ఇక సెప్టెంబర్ 7 వైపు!
హమ్మయ్యా...! ఒక ఘట్టం ముగిసింది. చంద్రయాన్ –2 ప్రయోగం విజవంతమైంది. ఇంకేముంది.. అంతా హ్యాపీయేనా?. ఊహూ.. అస్సలు కాదు. ఇస్రోకు అసలు పరీక్ష ముందుంది. కచ్చితంగా చెప్పాలంటే సెప్టెంబరు 7వ తేదీన! ఆ రోజు ఏం జరగబోతోంది? చక్కగా వేసిన రహదారిపై వాహనాన్ని నడపడం చాలా సులువే. రహదారి అస్సలు లేకపోతేనే సమస్య. ఇస్రో పరిస్థితి ఇప్పుడు ఇదే. ఇప్పటివరకూ ఎవ్వరూ చేయని విధంగా జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ –2ను దింపాలన్న ఇస్రో ఆలోచన చాలా సమస్యలతో కూడుకున్నది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ స్వయంగా అంగీకరించారు కూడా. జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్ –2 ముందుగా భూమి చుట్టూ కొన్ని చక్కర్లు కొట్టి.. ఆ తరువాత జాబిల్లి కక్ష్యలోకి చేరుతుంది. చందమామను కూడా కొన్నిసార్లు చుట్టేసిన తరువాత ఆచితూచి జాబిల్లిపైకి దిగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంక్లిష్టమైన, సమస్యా పూర్వక ఘట్టం.. జాబిల్లిపై చంద్రయాన్ దిగే చివరి 15 నిమిషాలు మాత్రమే! భూమి చుట్టూ 23 రోజులు, చంద్రుడి చుట్టూ 12 రోజులు భూమికి అతిదగ్గరగా 170 కిలోమీటర్లు (అపోజీ) అతి దూరంగా 40,000 కిలోమీటర్లు (పెరిజీ) ఉండేలా దాదాపు 23 రోజుల పాటు చక్కర్లు కొడుతూ ఉంటుంది. పూర్తిస్థాయి వేగం అందుకున్న తరువాత చంద్రయాన్ –2ను జాబిల్లి కక్ష్యలోకి పంపుతారు. ఇందుకు ఐదు రోజుల సమయం అవసరమవుతుంది. ఒక్కసారి జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞ్యాన్‌లతో కూడిన చంద్రయాన్–2 మాడ్యూల్ దాదాపు 12 రోజుల పాటు చక్కర్లు కొడుతూ క్రమేపీ తన వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరగా చేరుతుంది. ప్రయోగం జరిగిన 48వ రోజున.. అంటే సెప్టెంబరు ఏడున ఆర్బిటర్ (జాబిల్లి చుట్టూ తిరిగి వివరాలు సేకరించే భాగం) నుంచి రోవర్‌తో కూడిన ల్యాండర్ వేరుపడుతుంది. జరిగేది జూలై 15 ప్రణాళిక ప్రకారమే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరుపడటంతో మొత్తం ప్రయోగంలో అత్యంత కీలకమైన ఘట్టం మొదలవుతుంది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇప్పటికే గుర్తించిన రెండు భారీ గుంతల మధ్య దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ల్యాండర్ తన వేగాన్ని నియంత్రించుకుంటూ.. నిర్దిష్ట ప్రాంతంలో దిగాల్సి ఉండటం ఇందుకు కారణం. ఈ ప్రక్రియ కాస్తా విజయవంతమైతే.. కొంత సమయం తరువాత ల్యాండర్ లోపలి నుంచి రోవర్ కిందకు దిగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముందుగా అనుకున్నట్లు చంద్రయాన్ –2 ప్రయోగం జూలై 15న జరిగి ఉంటే.. జాబిల్లిపై ల్యాండింగ్ 54వ రోజు జరగాల్సి ఉండింది. కానీ ప్రయోగం వాయిదా పడింది. అయినాసరే.. సెప్టెంబరు 6–7 మధ్యకాలంలో జాబిల్లిపై ల్యాండ్ అయితే వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇస్రో కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. భూమి చుట్టూ తిరిగే కాలాన్ని 17 నుంచి 23 రోజులకు పెంచింది. అదేసమయంలో జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించడం, అక్కడ చక్కర్లు కొట్టే కాలాన్ని తగ్గించింది. జాబిల్లిపై రోవర్, ల్యాండర్లు చేయాల్సిన ప్రయోగాలకు ఇది కీలకం. ఈ రెండు పరికరాలూ సోలార్ ప్యానెల్స్‌తో విద్యుదుత్పత్తి చేసుకుని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు ఆరవ తేదీ మొదలుకొని కొన్ని రోజుల పాటు ల్యాండర్, రోవర్లు దిగే ప్రాంతం భూమికి అభిముఖంగా ఉంటూ సూర్యుడి కిరణాలు ప్రసారమవుతూంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నిప్పులు చిమ్ముతూ...
జాబిల్లి రహస్యాలను శోధించే లక్ష్యంతో చేపట్టిన చంద్రయాన్ 2 తొలి అడుగు విజయవంతంగా పడింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం 1 రాకెట్.. చంద్రయాన్ 2ను నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇక.. సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండర్‌ను దింపడమనే మలి అడుగు కోసం మానవాళి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా భారత దేశ అంతరిక్ష పరిశోధన శక్తి సామర్థ్యాలను ఇస్రో మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది. శ్రీహరికోట (సూళ్లూరుపేట)/సాక్షి ప్రతినిధి, అమరావతి: చంద్రుణ్ని చేరుకునే ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. బాహుబలిగా పిలిచే, 640 టన్నుల బరువుండే జీఎస్ఎల్వీ–మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్–2ను విజయవంతంగా భూ కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. 3,850 కేజీల బరువున్న చంద్రయాన్–2ను సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో వేదిక నుంచి నింగికి పంపారు. ప్రయోగం సమయంలో మేఘావృతమై ఉన్న ఆకాశంలోకి రాకెట్ నారింజ, పసుపు వర్ణాల్లో నిప్పులు చిమ్ముతూ ఎగిరింది. సరిగ్గా 16.14 నిమిషాల్లో చంద్రయాన్–2 మాడ్యూల్‌ను భూ కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగం సమయంలో ఎంతో ఉత్కంఠతో ఊపిరిబిగబట్టుకుని కూర్చున్న శాస్త్రవేత్తలు, తొలిదశ విజయవంతమైందన్న ప్రకటనతో ఒక్కసారిగా హర్షధ్వానాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 15న తెల్లవారుజామున 2.51 గంటలకే చంద్రయాన్–2 ప్రయోగం జరగాల్సి ఉండగా.. రాకెట్‌లోని మూడో దశ క్రయోజనిక్‌లో పోగో గ్యాస్ బాటిల్స్ నుంచి క్రయోఇంజిన్ ట్యాంక్‌కు వెళ్లే పైపులు బయట ప్రాంతంలో లీకేజిని గుర్తించి ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇస్రో శాస్త్రవేత్తలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 24 గంటల్లోనే లోపాన్ని సరిచేశారు. 48 రోజుల పాటు లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం సెప్టెంబర్ 7న ఈ ఉపగ్రహం జాబిల్లిపై అడుగుమోపనుంది. టెన్షన్.. టెన్షన్ చంద్రుడిపైకి మొట్టమొదటిగా ఆర్బిటర్ ద్వారా ల్యాండర్, ల్యాండర్లో అమర్చిన రోవర్ ప్రయోగం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలందరిలో ఎడతెగని టెన్షన్.. ఈ భారీ ప్రయోగంపైనే అందరి ధ్యాస. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 20 గంటలు ముగిసే సమయం దగ్గర పడింది. షార్‌లోని మీడియా సెంటర్, మిషన్ కంట్రోల్ సెంటర్లోని మైక్‌లలో 6.. 5.. 4.. 3.. 2.. 1.. 0 అనగానే ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పు దిక్కున ఆకాశం వైపునకు మళ్లాయి. క్షణాల్లో ఆకాశంలో కమ్ముకున్న మబ్బులను చీల్చుకుంటూ జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక చంద్రయాన్–2ను మోసుకుని నింగివైపుకెళ్లింది. మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తలు కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఒక్కో దశ విజయవంతంగా దూసుకుపోవడంతో శాస్త్రవేత్తల వదనాల్లో చిరునవ్వులు. ఇలా మూడు దశలను సమర్థవంతంగా పూర్తి చేశారు. చంద్రయాన్–2ను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తల్లో విజయగర్వం తొణికిసలాడింది. చంద్రయాన్–2 భూ కక్ష్యలోకి చేరిందనీ, అంతా సవ్యంగా సాగుతోందని బెంగళూరులోని ఇస్రో మాస్టర్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది.శ్రీహరికోట నుంచి చేసిన అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 75వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. ప్రయోగం ఇలా జరిగింది.. మొత్తం 3,850 కేజీల బరువైన చంద్రయాన్–2 మిషన్‌లో 2,379 కేజీల బరువైన ఆర్బిటర్, 1,471 కిలోల బరువు కలిగిన ల్యాండర్ (విక్రమ్), 27కేజీల బరువైన రోవర్ (ప్రజ్ఞాన్) ఉన్నాయి. ఇందులో మొత్తంగా 13 పేలోడ్లు ఉండగా, వాటిలో 3 యూరప్‌వి, రెండు అమెరికావి, ఒకటి బల్గేరియాది. నాసాకు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ ఎరే (ఎల్ఆర్ఏ) కూడా వాటిలో ఓ పే లోడ్. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ మొదటి దశలో ఇరువైపులా అత్యంత శక్తివంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి తన ప్రయాణాన్ని దిగ్విజయంగా ప్రారంభించింది. ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 132.7 సెకన్లలో మొదటి దశను పూర్తి చేశారు. రెండో దశలో ఎల్–110 అంటే ద్రవ ఇంజిన్ మోటార్లు 110.84 సెకన్లకే స్టార్ట్ అయ్యాయి. 205 సెకన్లకు రాకెట్ శిఖరభాగాన అమర్చిన చంద్రయాన్–2 మిషన్‌కు ఉన్న హీట్‌షీల్డ్స్ విజయవంతంగా విడిపోయాయి. ఇక్కడ 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 307 సెకన్లకు రెండో దశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. క్రయోజనిక్ (సీ–25) మోటార్లు 311.22 సెకన్లకు మండించి 978 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను పూర్తి చేశారు. ఈ దశ నుంచి రాకెట్‌కు శిఖర భాగాన అమర్చిన త్రీ–ఇన్–ఒన్ చంద్రయాన్–2 మిషన్‌ను క్రయోజనిక్ దశతో 978.8 సెకన్లకు (16.55 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 40,000 కి.మీ. ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. రాకెట్ గమన తీరు అత్యంత సజావుగా సాగడంతో అపోజిని మరో 6,000 కి.మీ. దూరం ముందుకు పంపించి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ తన సత్తాను చాటుకుంది. అంటే 46,000 కి.మీ. దూరంలోకి తీసుకెళ్లారు. దీనివల్ల చంద్రయాన్–2 కాలపరిమితి పెరగడమే కాకుండా ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియ తగ్గింది. దీంతోచంద్రయాన్–2లో ఉన్న ఇంధనం కూడా ఆదా అయ్యి దాని జీవిత గమనం పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటినుంచి చంద్రుడిపైకి వెళ్లే వరకు మిషన్‌ను బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్లోనే పూర్తి చేస్తారు. చంద్రుడిపైకి ఇలా... ముందుగా 16 రోజుల్లో ఆర్బిటర్‌లో నింపిన ఇంధనాన్ని మండించి అపోజిని 46,000 కి.మీ. నుంచి 1,41,000 కి.మీ.కు పెంచేందుకు ఆర్బిటర్‌ను మండించి 4సార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌కు ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడివైపు ప్రయా ణం చేసేందుకు మళ్లిస్తారు. అనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూ రెట్రోబర్న్ చేసి వంద కి.మీ. వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి 4సార్లు ఆపరేషన్ చేపడతారు. 100 కి.మీ. నుంచి 30 కి.మీ. ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత ల్యాండర్‌ను 15 నిమిషాలు మండించి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దించే ప్రక్రియను చేపడతారు. ఆ 15 నిమిషాలు... చంద్రయాన్–1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లోనూ ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్‌ను చంద్రు డిపై దించే ప్రక్రియను కొత్తగా రూపొందించారు. ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే కీలకమైన సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతాయోనని ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. ఈ 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు ఈ ప్రయోగంలో ఇస్రో మొదటిసారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించనున్నారు. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మృదువైన చోట ల్యాండ్ అయిన తరువాత ల్యాండర్ తలుపులు తెరుచుకోకుంటే ల్యాండర్ తలుపు బయటకొచ్చేలా డిజైన్ చేశారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి 4 గంటల సమయం తీసుకుంటుంది. తొలిసారిగా చంద్రు ని దక్షిణ ధృవంపై అడుగుపెడుతున్న దేశంగా భారత్ రికార్డులకు ఎక్కనుంది. 14 రోజుల్లో 500 మీటర్లు రోవర్ సెకెండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుం ది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమి మీద మనకు 14 రోజులు. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోది.ఇప్పటి వరకూ రష్యా, అమెరికా, చైనాలకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ఇప్పుడు చంద్రయాన్–2 పేరుతో చంద్రుడి ఉపరితలంపైకి ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంగా నిలిచింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు ఈ ఘనత సాధించాయి. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ ఒన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చందమామ కథ ఇదీ.. అంతరిక్షంపై పట్టు బిగించడానికి అమెరికా గట్టి ప్రయత్నాలే చేసింది. అపోలో మిషన్ ద్వారా చంద్రలోకంపైకి తొలి అడుగు వేసింది. ప్రాజెక్టు జెమినీ ప్రారంభించి అపోలోకు సాంకేతికపరంగా కొత్త హంగులు అద్దడానికి కృషి చేసింది. మొదట్లో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. అపోలో–1 ప్రయోగం విఫలమై ముగ్గురు వ్యోమగాములు మృతి చెందారు. ఆ తర్వాత మరిన్ని పరిశోధనలు చేసింది. మొత్తంగా 6,300 టెక్నాలజీలపై ఆధిపత్యం సాధించింది. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అపోలో–11ను ప్రయోగించింది. 1969 జూలై 16న నాసా కేప్ కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి శాటర్న్–5 రాకెట్ ద్వారా అపోలో–11 నింగికి ఎగిసింది. ఈ ప్రయోగం జరిగిన 3 రోజుల తర్వాత అపోలో–11 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. జూలై 20న జాబిల్లిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తొలి అడుగు వేశారు. ఆ తర్వాత ఆరు గంటల పైగా తేడాతో లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ అల్డ్రిన్ జాబిల్లిపైకి దిగారు. ఇద్దరు వ్యోమగాములు జాబిల్లిపై 21.38 గంటలు గడిపారు. 21.7 కేజీల మట్టి, రాతి నమూనాలను సేకరించారు. జూలై 22న లూనార్ మాడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత అపోలో భూమికి తిరుగు ప్రయాణమైంది. 1969 జూలై 24న ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి వచ్చారు. ఇక సూర్యుడిపై... 2020లో ఆదిత్య ఎల్1 ప్రయోగం న్యూఢిల్లీ: చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై దృష్టి సారించింది. సూర్యుడి ఉపరితలంపై కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ‘కరోనా’ను అధ్యయనం చేసేందుకు ‘ఆదిత్య –ఎల్1’ అనే వ్యోమనౌకను ప్రయోగించనుంది. 2020 ప్రధమార్థంలో ఈ ప్రయోగాన్ని చేపడతామని ఇస్రో తెలిపింది. ‘సూర్యుడి ఉపరితంలపై సాధారణంగా 6,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి బాహ్య ఉపరితల ప్రాంతమైన ‘కరోనా’లో 9.99 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదువుతోంది. కరోనాలో ఇంతభారీగా ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తాజాగా మేం ప్రయోగించనున్న ఆదిత్య–ఎల్1 నౌక కరోనాతో పాటు ట్రోపోస్పియర్, ఫొటోస్పియర్, సూర్యుడి నుంచి కణాల ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది’ అని ఇస్రో వెల్లడించింది. వాతావరణ మార్పులపై కరోనా గణనీయమైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. భూమికి సూర్యుడు 14.96 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రయాన్–1తో పరిశోధనలిలా.. శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2007 దాకా వివిధ రకాలైన రాకెట్ల ద్వారా రిమోట్ సెన్సింగ్, సమాచారం, వాతావరణ పరిశోధన, ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలు మాత్రమే చేస్తూ వచ్చింది. గ్రహాంతర ప్రయోగాలు చేయాలని నిశ్చయించుకుని 2008లో చంద్రయాన్–1 ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా చేపట్టింది. ఆ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపి పరిశోధనలు చేసింది. అయితే చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసే లా రూపొందించారు. అయితే, అందులో పంపిన పరికరాలు పది నెలలకే పనిచేయడం మానేశాయి. అంటే చంద్రయా న్–1 పది నెలలు పనిచేసిన తరువాత సాంకేతికపరమైన లోపంతో పనిచేయడం మానేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి ఇస్రో చరిత్ర సృష్టించి ంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొట్టమొదటి ప్రయోగం ఇదే. అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టి చంద్రుడిపై పరిశోధనలు జరిపింది. చంద్రయాన్–1 మిషన్ పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో దానికి కొనసాగింపుగా చంద్రయాన్–2 మిషన్‌ను ప్రయోగించారు. ఇస్రోకు నాసా అభినందనలు చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా అభినందనలు తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం గురించి ఇస్రో వెలుగులోకి తెచ్చే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తామని తెలిపింది. ‘చంద్రునిపై అధ్యయనానికి చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రోకు అభినందనలు. విశ్వాంతరాళంలో ఉన్న మా సాంకేతిక వనరులను మీకు సాయంగా అందించడానికి గర్విస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువం గురించి మీరు కనుగొనే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే మేం కూడా ఆర్టిమిస్ మిషన్ ద్వారా ఆ ప్రాంతంలోకి వ్యోమగాములను పంపనున్నాం’ అని ట్విట్టర్లో నాసా పేర్కొంది. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కావడం దేశ ప్రజలందరికీ గర్వించదగ్గ క్షణం. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు. – ట్విట్టర్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇది ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం. సాంకేతిక కారణాలతో గత వారం ఈ ప్రయోగం వాయిదాపడినా.. వారంలోనే విజయవంతంగా ప్రయోగం పూర్తి చేశారు. మీకు (ఇస్రో శాస్త్రవేత్తలకు) అభినందనలు. – ట్విట్టర్ ఆడియో సందేశంలో మోదీ గర్వంగా ఉంది. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చరిత్రాత్మక ప్రయాణం మొదలైంది. – డాక్టర్ కె.శివన్, ఇస్రో చైర్మన్ -
చిరునవ్వులు కానుకగా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: నిస్సహాయులకు సహాయపడి వారి ముఖాలపై చిరునవ్వులు తీసుకురావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ నేతలు, కేడర్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటనలు, హోర్డింగ్‌లు, పూల బొకేల కోసం అనవసర ఖర్చులు చేయొద్దని ట్విటర్లో విజ్ఞప్తి చేశారు. కాగా, చంద్రయాన్–2ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రయోగం తో భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని, ఈ క్షణం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణంగా అభివర్ణించారు. -
అద్భుత విజయం
చందమామపై 60 ఏళ్లుగా సాగుతున్న పరిశోధనల పరంపరను కీలక మలుపు తిప్పే అపురూపమైన విజయాన్ని సొంతం చేసుకుని మన శాస్త్రవేత్తలు దేశ కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేశారు. సోమవారంనాడు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లోనే సువర్ణాధ్యాయంగా ఆవిష్కరించదగ్గ ఘట్టం. పెను సవాళ్లు ఇమిడి ఉండే సంక్లిష్టమైన ప్రయోగాలు చేపట్టడంలో, వాటిని విజయతీరాలకు చేర్చడంలో ఇస్రో శాస్త్రవేత్తలకు ఎవరూ సాటిరారు. వారి పరిశోధనా ప్రస్థానంలో అపజయాలు, ఆశాభంగాలు అతి తక్కువ. ఇప్పుడు చంద్రయాన్–2 ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఆ ఒరవడిని కొనసాగించారు. ఈ ప్రాజెక్టుకు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించడం, మొత్తం ప్రాజెక్టులోనే 30 శాతంమంది మహిళలు పాలుపంచుకోవడం ఎన్నదగ్గది. చంద్రయాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్య వనిత, మిషన్ డైరెక్టర్ రితూ కరిథాల్ ఈ ప్రాజెక్ట్‌ను తమ భుజస్కంధాలపై వేసుకుని శ్రమించిన తీరు అందరికీ ఆదర్శప్రాయమైనది. చెప్పాలంటే మన శాస్త్రవేత్తలను అభినందించాల్సింది కేవలం సోమవారం సాధించిన ఘన విజయానికి మాత్రమే కాదు. వారం క్రితం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పెద్దలంతా చంద్రయాన్ ప్రయోగాన్ని స్వయంగా వీక్షించడానికి ఎదురు చూస్తున్న వేళ... సరిగ్గా 56 నిమిషాల ముందు దాన్ని వాయిదా వేయాలని తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి సైతం వీరిని ప్రశంసించాలి. ఎందుకంటే అవి సంక్లిష్టమైన క్షణాలు. పెద్దలంతా కొలువుదీరిన వేళ అత్యంత కీలకమైన మూడో దశ సమయంలో పనిచేయాల్సిన క్రయోజనిక్ ఇంజిన్‌కు సాంకేతిక లోపం ఏర్పడిందని, గ్యాస్ బాటిల్ లీక్ అయిందని కనుగొనడం ఒక ఎత్తయితే... ఏమాత్రం ఊగిసలాట లేకుండా ప్రయోగాన్ని వాయిదా వేయాలనుకోవటం మరో ఎత్తు. నిజానికి ఈ పరిణామం జరగ్గానే కొందరు పెదవి విరిచారు. మళ్లీ ఎన్ని వారాలూ, ఎన్ని నెలలూ పడుతుందోనని నిట్టూర్చారు. కానీ అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ శాస్త్రవేత్తలంతా సత్వరం తమ కర్తవ్యాన్ని పూర్తిచేశారు. లోపం ఎందుకు జరిగిందో, ఎక్కడ జరిగిందో గుర్తించారు. వారం పూర్తయ్యేసరికి విజయం తమదేనని నిరూపించుకున్నారు. ఈ ప్రాజెక్ట్ నిన్న మొన్నటిది కాదు. దీని కోసం గత పదేళ్లుగా ఇస్రో శాస్త్ర వేత్తలు కఠోర శ్రమ చేస్తున్నారు. చంద్రయాన్–1 ద్వారా చంద్రుడిపై నీటిజాడ కనుక్కొన్న చరిత్ర వారిది. పైగా ఇస్రో ఇంతవరకూ చేసిన ప్రయోగాలన్నిటిలోనూ ఇది అత్యంత జటిలమైనది. ప్రతిదీ ఒకటికి పదిసార్లు చూసుకోవాలి. ఎక్కడ ఏమరుపాటుగా ఉన్నా ‘చిర దీక్షా శిక్షా తపస్సమీక్ష’ మొత్తం చెదిరిపోతుంది. మరిన్ని ఏళ్లు శ్రమపడవలసి వస్తుంది. వైజ్ఞానికంగా ఎంతో వెనకబడి పోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న శాస్త్రవేత్తల బృందం ఎంత ఒత్తిడికి లోనయి ఉంటుందో, ఏ స్థాయిలో ఆందోళన పడి ఉంటుందో వీటినిబట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇన్నిటిని తట్టుకుని ఒక అద్భుత విజయాన్ని అందించినందుకు వీరందరూ అభినందనీయులు. మొత్తం 6,400 కిలోల బరువైన జీఎస్ఎల్వీ మార్ 3–ఎం1లో చంద్రయాన్–2 ఉపగ్రహం బరువు 3,850 కిలోలు. ఇందులో 2.3 టన్నుల బరువున్న ఆర్బిటర్, 1.4 టన్నుల బరువున్న ల్యాండర్(విక్రమ్), 27 కిలోల బరువున్న రోవర్(ప్రజ్ఞాన్) ఉన్నాయి. ఈ ప్రజ్ఞాన్‌లో మన దేశ ఉపకరణాలతోపాటు అమెరికా, యూరప్‌లకు చెందిన నాలుగు ఉపకరణాలు కూడా ఉన్నాయి. జీఎస్ఎల్వీ రాకెట్ అనుకున్నట్టుగా ఆర్బిటర్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇక అది 50 రోజులు ప్రయాణించి జాబిల్లిపైకి చేరాలి. ఆర్బిటర్ ఏడాదిపాటు చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ దాని వెలుపలి వాతావరణ స్థితి గతులపై శాస్త్రవేత్తలకు విలువైన సమాచారాన్ని పంపుతుంటుంది. మరోపక్క అది చంద్రుడికి 150 కిలోమీటర్ల దూరంలో ఉందనగా దాన్నుంచి ల్యాండర్ ‘విక్రమ్’ వేరు పడి చంద్రుడి దిశగా ప్రయాణం మొదలుపెడుతుంది. సెప్టెంబర్ 6నాటికి –157 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉండే అతి శీతల దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగుతుంది. ఇది ఇంతవరకూ ఏ దేశమూ తలపెట్టని అరుదైన విన్యాసం. ‘విక్రమ్’ అలా చేరుకున్న కాసేపటికే దాన్నుంచి రోవర్ ‘ప్రజ్ఞాన్’ బయటికొస్తుంది. దాదాపు అరకిలోమీటర్ ప్రయాణించి చంద్రుడి ఉపరితలాన్ని, దాని లోపలి భాగాన్ని పరి శోధిస్తుంది. అనేక ప్రయోగాలు చేపడుతుంది. ఈ ఫలితాలకు సంబంధించిన డేటా అంతా ఎప్పటిక ప్పుడు శాస్త్రవేత్తలకు చేరుస్తుంది. ఈ ప్రయోగాలన్నీ ఒక ‘చాంద్రదినం’(లూనార్ డే)లో ‘ప్రజ్ఞాన్’ ముగించాల్సి ఉంటుంది. ‘చాంద్రదినం’ అంటే మనకు 14 రోజులు! ప్రాచీనకాలం నుంచీ చంద్రుడు మానవాళి జీవితంలో పెనవేసుకుపోయాడు. వినీలాకాశంలో వెన్నెలలు విరజిమ్ముతూ పరవశింపజేసే చందమామ బాల్యంలో అందరికీ నేస్తమే. కవుల ఊహల్లో, కావ్యకల్పనల్లో కథావస్తువు. ఇప్పటికీ అతిలోక సౌందర్యానికి ఉపమానం చెప్పాలంటే ఎవరికైనా ఊహల్లో మెదిలేది చందమామే. 1966లో అప్పటి సోవియెట్ యూనియన్ తొలిసారిగా మానవ రహిత ఉపగ్రహం ‘లూనా’ను ప్రయోగించినప్పటినుంచీ శాస్త్రవేత్తలకు సైతం చంద్రుడు దగ్గర చుట్టమయ్యాడు. 1969లో అమెరికా ఇద్దరు వ్యోమగాములతో అపోలో అంతరిక్ష నౌకను అక్కడికి పంపింది. నిజానికి వెన్నెలరాజు మానవాళి తొలి లక్ష్యం మాత్రమే. గగనాంతర రోదసిలో మును ముందుకు దూసుకుపోవడానికి చందమామ తొలి మెట్టు మాత్రమే. అక్కడికి చేరడం సులభమైతే అంతకన్నా కష్టతరమైన అరుణగ్రహం చేరడం మానవాళి మలి లక్ష్యమవుతుంది. మొత్తంగా సౌర వ్యవస్థపై మన చూపును నిశితం చేసేందుకు దోహదపడే ప్రయోగాల పరంపరలో చంద్రయాన్–2 ఒక మైలురాయి. కనుకనే ఇంతటి అరుదైన ఘన విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు హాట్సాఫ్ చెప్పాలి. -
చంద్రయాన్ -1కి చంద్రయాన్-2కి తేడా ఏంటి?
అసలు చంద్రయాన్-2 ప్రయోగానికి ఎంత ఖర్చయ్యింది? ఇప్పటివరకు చంద్రుడిపై ఎవరూ చేరుకోని ప్రాంతంపై మనం ప్రయోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చంద్రయాన్-2 మిషన్ ప్రయోజనాలేంటి? చంద్రుడి మీదకు పంపుతున్న ల్యాండర్‌కు విక్రమ్ అనే పేరు ఎందుకు పెట్టారు? శ్రీహరికోట రాకెట్ ప్రయోగాలకు కేంద్రంగా ఎలా మారింది? దేశంలో ఏ ప్రాంతానికి లేని ఆవశ్యకత శ్రీహరికోటకు ఏముంది? ఈ విషయాలు తెలుసకుందాం.. చంద్రయాన్-2 విశేషాలను కింది వీడియోలో వీక్షించండి.. -
వచ్చే 24 గంటలు కీలకం: ఇస్రో చైర్మన్
సాక్షి, శ్రీహరికోట : అంతరిక్ష చరిత్రలోనే భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఇస్రో చైర్మన్ కే.శివన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రయాన్-2 ప్రయోగానంతరం మాట్లాడుతూ.. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందన్నారు. అత్యంత కీలకమైన క్రయోజనిక్ దశ విజయవంతంగా ముగిసిందని, నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్-2 ప్రవేశించిందని తెలిపారు. చంద్రుడిపై భారత్ చేసిన చారిత్రాత్మక ప్రయాణం ఇదని అభివర్ణించారు. వచ్చే 24 గంటలు చాలా కీలకమని చెప్పారు. ఇస్రో టీమ్ అహర్నిశలు చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. మూడు ఉపగ్రహాలను ఒకే రోవర్ ద్వారా ప్రయోగించినట్లు తెలిపారు. ఊహించనదానికంటే చంద్రయాన్-2 తొలిదశ ఎక్కు విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. అభినందనల వెల్లువ.. చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి.. భారత్ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఇస్రోశాస్త్ర వేత్తలను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్వీటర్ వేదికగా శాస్త్రవేత్తలను కొనియాడారు. ‘ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగంతో దేశం మొత్తం గర్వించేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ఇస్రో ఇలానే మరిన్ని కొత్త విషయాల కోసం ప్రయోగాలు చేపడుతూ విజయవంతం కావాలి.’ అని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చరిత్రలోనే ఇదో అద్భుత ఘట్టమని, మన శాస్త్రవేత్తల శక్తిని,130 కోట్ల భారతీయుల అంకిత భావాన్ని చంద్రయాన్ ప్రయోగం ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కొనియాడిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను తెలంగాణ గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ‘చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు అభినందనలు. కోట్ల కలలను చంద్రునిపైకి తీసుకెళ్లడం చారిత్రాత్మక సందర్భం. మన శాస్త్రవేత్తలు, ఇస్రో భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Congratulations to ISRO on the successful launch of #Chandrayaan2. Historical occasion for India as a billion dreams are being carried to the moon. Best wishes to our scientists and ISRO for their future endeavors. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019 చదవండి: జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్–2 -
జాబిలమ్మ మీదకు దూసుకెళ్లిన చంద్రయాన్–2
సాక్షి, శ్రీహరికోట : చంద్రుని మూలాలు కనుగొనడానికి ఉద్దేశించి భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. 2008 నుంచి చంద్రయాన్–2 ప్రయోగాన్ని పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చి జూలై 15న వేకువజామున 2.51 గంటలకు ప్రయోగించాలని అనుకున్న చంద్రయాన్–2 మిషన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. వారం రోజులు తిరగకముందే మళ్లీ ప్రయోగానికి సిద్ధమైన శాస్త్రవేత్తలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించారు. బయలుదేరిన 16:13 నిమిషాల తర్వాత చంద్రయాన్-2 నిర్ణీత కక్ష్యలోకి సమర్థవంతంగా ప్రవేశించింది. కక్ష్యలోకి ప్రవేశించాక వాహన నౌక నుంచి చంద్రయాన్-2 ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది. ఉపగ్రహాన్ని చంద్రుని దక్షిణ ధృవంలో ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడిన పని కాగా.. చంద్రునిపై క్లిష్టమైన సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయత్నమిది. ఆర్బిటల్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయాక 15 నిమిషాల అత్యంత కీలకం. రోవర్ సెకెన్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మాలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. అయితే ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోదేశంగా ఖ్యాతి గడించనుంది. ఇప్పటి దాకా రష్యా, అమెరికా, చైనాకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశారు. చంద్రయాన్–1 పేరుతో ఉపగ్రహాన్ని చంద్రుడికి చుట్టూ పరిభ్రమించేలా చేసిన మొట్ట మొదటి దేశంగా భారత్‌కు పేరుంది. ఇప్పుడు చంద్రయాన్–2 పేరుతో ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంలో అవతరించనుంది. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ వన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జాబిలమ్మ మీదకు చంద్రయాన్–2
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్న చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 15న వేకువజామున 2.51 గంటలకు ప్రయోగించాలని అనుకున్న చంద్రయాన్–2 మిషన్‌లో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. వారం రోజులు తిరగకముందే మళ్లీ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. సాక్షి, సూళ్లూరుపేట (శ్రీహరికోట): జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా ‘త్రీ–ఇన్–వన్‌గా చెప్పకునే ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్) కాంపోజిట్ ఎర్త్‌స్టాక్ (పీఈఎస్)ను జాబిల్లి మీదకు పంపించే సమయం ఆసన్నమైంది. జీఎస్ఎల్వీ మార్క్3, ఎం1 రాకెట్ 16.22 నిమిషాల తరువాత భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 38,000 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ ఆర్బిట్ (అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి ప్రవేశపెడుతుంది. ఈ ప్రయోగం జరిగిన 16 రోజుల్లో అపోజిని 38,000 కిలోమీటర్లు నుంచి 1,41,000 పెంచేందుకు ఆర్బిటర్‌ను మం డించి నాలుగుసార్లు కక్ష్యదూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌కు ట్రాన్స్ లూ నార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడివైపు ప్రయాణం చేసేందుకు మళ్లి స్తారు. తదనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూరా రెట్రోబర్న్ చేసి వంద కిలోమీటర్లు వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి నాలుగుసార్లు ఆపరేషన్ చేపడతారు. 100 కిలోమీటర్లు నుంచి 30 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేస్తుంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దిగుతుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయిన తరువాత ల్యాండర్‌ను 15 నిమిషాల పాటు మండించి దాన్ని చంద్రుడి ఉపరితలంపై దించే ప్రక్రియను చేపడతారు. అయితే ఈ 15 నిమిషాలనే ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. చంద్రయాన్–1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లో ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్‌ను చంద్రుడిపై దించే ప్రక్రియను నూతనంగా రూపొందించారు. చంద్రయాన్–1కి చంద్రయాన్–2కు మధ్య 15 నిమిషాల వ్యవధి అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే కీలకమైన సమయంలో ఎలాంటి సాంకేతికపరమైన సమస్యలు తలెత్తుతాయోనని ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత ఆందోళనగా ఉంది. ఈ 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించనుంది. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మృదువైన చోట ల్యాండ్ అయిన తరువాత రోవర్ లోపల ఉండే తలుపు తెరుచుకునే విధంగా డిజైన్ చేశారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి సుమారు నాలుగు గంటల సమయాన్ని తీసుకుని మరీ బయటకు వస్తుంది. రోవర్ సెకెన్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మాలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. అయితే ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోదేశంగా ఖ్యాతి గడించనుంది. ఇప్పటి దాకా రష్యా, అమెరికా, చైనాకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశారు. చంద్రయాన్–1 పేరుతో ఉపగ్రహాన్ని చంద్రుడికి చుట్టూ పరిభ్రమించేలా చేసిన మొట్ట మొదటి దేశంగా భారత్‌కు పేరుంది. ఇప్పుడు చంద్రయాన్–2 పేరుతో ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంలో అవతరించనుంది. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ వన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ
సాక్షి, హైదరాబాద్ : భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్–2ను ప్రయోగించనున్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించారు. 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది. 3.8 టన్నుల బరువున్న చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన జీఎస్ఎల్వీ మార్క్-3ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.15వ తేదీ వేకువజామున ప్రయోగించాలనుకున్న చంద్రయాన్–2ను చివరి గంటలో రాకెట్లో మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి.. వారం తిరగక ముందే సాంకేతిక లోపాన్ని సవరించి ప్రయోగానికి సిద్ధం చేశారు. -
చంద్రయాన్-2 చూసేందుకు వి'ల'క్షణ వేదిక
సాక్షి, సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్న చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకుల కోసం విలక్షణమైన గ్యాలరీని షార్ అధికారులు నిర్మించారు. తొలుత ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున చంద్రయాన్–2 ప్రయోగానికి సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ఇస్రోకే ప్రతిష్టాత్మకం కావడంతో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశా వ్యాప్తంగా పౌరులను ఆహ్వానించింది. వీరి కోసం షార్‌లోని శబరి గిరిజన కాలనీ ప్రాంతంలో సుమారు 60 ఎకరాల అటవీ భూమిలో సుమారు 5 వేల మంది సందర్శకులు కూర్చుని రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వీలు కల్పిస్తూ గ్యాలరీ నిర్మాణం చేపట్టారు. ఈ తరహా గ్యాలరీ నిర్మాణాన్ని సైతం షార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే ప్రయోగానికి గంట వ్యవధిలో సాంకేతిక కారణాలతో కౌంట్ డౌన్ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆహ్వానితులకు మళ్లీ అవకాశం ఈ నెల 15న ప్రయోగం నిర్వహించతలపెట్టినప్పుడు సందర్శకులు దేశంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇస్రో వెబ్సైట్లో ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ఆ పాస్‌లతో రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని ఎన్నో ఆశలతో వచ్చారు. అర్ధరాత్రి వేళ అని చూడకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ప్రయోగం వాయిదా పడడంతో నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అందుకే వారిని సంతృప్తి పరిచేందుకు గతంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న వాళ్లకు ఇచ్చిన సీరియల్ నంబర్లో వెబ్సైట్లో కొడితే అనుమతి వస్తోంది. కొత్తగా రావాలనుకునే వారికి మాత్రం సైట్ ఓపెన్ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్త వారికి కూడా చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించే భాగ్యాన్ని కల్పించాలని పలువురు సందర్శకులు కోరుతున్నారు. -
22న నింగిలోకి.. చంద్రయాన్–2
శ్రీహరికోట,(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 రాకెట్ ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రయోగానికి సంబంధించి ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ వేకువ జామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను నింగిలోకి పంపాల్సి ఉంది. అయితే రాకెట్లో సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. 56.24 నిమిషాల ముందు కౌంట్‌డౌన్ ప్రక్రియను అర్ధంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. జీఎస్ఎల్ మార్క్3–ఎం1 రాకెట్‌లోని క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించి మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. క్రయోజనిక్ దశలోని గ్యాస్ బాటిల్స్ నుంచి ట్యాంకుకు వెళ్లే పైపులు బయట నుంచి లీకేజీ కావడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు 15వ తేదీ రాత్రి నుంచి నిద్రాహారాలు మాని క్రయోజనిక్ దశలో ఉన్నటువంటి 25 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని వెనక్కి తీసేశారు. అనంతరం ట్యాంకులోని ఇంధనపు పొరలు తొలగించేందుకు నైట్రోజన్ వ్యాపర్స్‌ను లోనికి పంపి క్లీనింగ్ చేసే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించారు. ఈ సాంకేతిక పరమైన లోపాన్ని పూర్తి స్థాయిలో సవరించి వారం రోజుల గడువులోనే మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేయడం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి నిదర్శనం. -
చంద్రయాన్–2 ఆగడానికి కారణమిదే
నెలల ఉత్కంఠకు బ్రేక్ పడింది.. జాబిల్లిని ఇంకోసారి అందుకోవాలన్న ఇస్రో ప్రణాళిక వాయిదా పడింది.. అంతా బాగుంది.. చంద్రయాన్ –2 నింగికి ఎగురుతుంది.. అని ఆశించినా.. సాంకేతిక లోపం కారణంగా ప్రయోగం వాయిదా అన్న ప్రకటన భారతీయుల్లో తీవ్ర నిరాశ నింపింది. అయితే.. మలి ప్రయోగం ఎప్పుడు? శ్రీహరికోట (సూళ్లూరుపేట)/సాక్షి నాలెడ్జ్ సెంటర్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సోమవారం ప్రయోగించతలపెట్టిన జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1–చంద్రయాన్–2 ప్రయోగం సాంకేతిక లోపం తలెత్తడంతో నిలిచిపోయింది. క్రయోజనిక్ దశలో సాంకేతిక లోపం కారణంగానే ప్రయోగం ఆగిపోయిందని తెలిసింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ 19.4 గంటల సమయం పూర్తై, ఇంకా 56.24 నిమిషాల కౌంట్‌డౌన్ ఉన్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. 19.4 గంటలపాటు నిర్వహించిన కౌంట్‌డౌన్ సమయంలో ఎల్–110 దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. తర్వాత సీ–25 దశలో అంటే.. మూడో దశలో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. ప్రయోగం ఇక 56.24 నిమిషాల్లో జరుగుతుందనగానే ఉన్నట్టుండి కౌంట్‌డౌన్ ప్రక్రియను నిలిపేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నామని, ప్రయోగం మళ్లీ ఎప్పుడు జరిపేదీ త్వరలోనే తెలియజేస్తామన్న ఇస్రో ప్రకటనతో ఏం జరిగిందన్న అంశానికి ప్రాధాన్యం పెరిగిపోయింది. పోగో గ్యాస్ బాటిల్లో లీకేజీ వల్లే.. ఉపగ్రహ వాహకనౌకలో అత్యంత కీలకంగా భావించే క్రయోజనిక్ దశలో గ్యాస్ బాటిల్ (పోగో బాటిల్) లీకేజీ వల్ల ప్రయోగాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. క్రయోజనిక్ ఇంజన్లకు అతిముఖ్యమైన పోగో గ్యాస్ బాటిల్స్‌లో గ్యాస్ లీకేజీ జరిగితే ఇంజన్లకు తగిన థ్రస్ట్ రాదని భావించి 56.24 నిమిషాలకు ముందే ప్రయోగాన్ని ఆపేశారు. ఎస్–200 బూస్టర్లు, ఎల్–110 దశలో బాగా పనిచేసినా సీ–25 దశలో తగిన వేగం రాదని భావించి కౌంట్‌డౌన్ ప్రక్రియను శాస్త్రవేత్తలు నిలిపేశారు. క్రయోజెనిక్ ఇంజన్లో ఇంధనం లీకేజీ కారణంగానే ప్రయోగం వాయిదా పడిందని కొందరు నిపుణుల అంచనా. శాస్త్రవేత్తలు రాత్రికి రాత్రే క్రయోజనిక్ దశలో 25 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనాన్ని వెనక్కి తీసేశారు. ఇంకా అందులో అడుగు భాగాన, పక్కన ఆనుకుని ఉన్న ఇంధనపు పొరలను తొలగించేందుకు నైట్రోజన్ వ్యాపర్స్‌ను లోపలకు పంపించి పూర్తిగా శుభ్రం చేయాల్సి ఉంది. దీనికి మరో ఐదు రోజులు పడుతుంది. అయితే.. రాకెట్‌ను మొత్తం విప్పదీయాల్సి ఉండడంతో క్రయో ఇంధనంతోపాటు రెండో దశలోని 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని వెనక్కి తీసే ప్రక్రియను సోమవారం ఉదయం నుంచి చేపట్టారు. రాకెట్ విడి భాగాలను మొత్తంగా విప్పదీసి మళ్లీ అసెంబ్లింగ్ చేయాల్సి ఉండడంతో ఈ ప్రయోగం ఈ ఏడాది చివరి వరకు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే.. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్లో క్రయోజనిక్ దశలో సాంకేతిక లోపం తలెత్తడం ఇదే మొదటిసారి కావడంతో దీనిపై పట్టు సాధించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాంకేతిక లోపం ఎలా జరిగిందనే దానిపై ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తున్నారు. దీనిపై ఒక కమిటీని సైతం వేయనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రయోగాన్ని నిలిపివేసి సుమారు రూ.600 కోట్లు ఆదా చేయగలిగారు. జీఎస్ఎల్వీతోనే సమస్య? చంద్రయాన్–2 ప్రయోగానికి వాడుతున్న జీఎస్ఎల్వీ కారణంగానే ప్రయోగం వాయిదా పడిందా? అంటే అవునని అంటున్నారు కొందరు నిపుణులు. జీఎస్ఎల్వీకి చంద్రయాన్–2 కేవలం నాలుగో ప్రయోగం కావడం ఇందుకు ఒక కారణమైతే.. అందులో వాడుతున్న క్రయోజనిక్ ఇంజన్‌తోనూ ఇస్రోకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా ఒత్తిడి మేరకు రష్యా నాలుగు క్రయోజనిక్ ఇంజన్లను మాత్రమే మనకు అందజేసింది. వాటిలో కొన్ని ఇప్పటికే విఫలం కాగా మిగిలి ఉన్న ఒకే ఒక్క ఇంజన్ సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు సొంతంగా పరిశోధనలు చేపట్టి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కొత్త ఇంజన్లను తయారుచేశారు. చంద్రయాన్–1 తర్వాత ఇస్రో సొంతంగా తయారుచేసిన క్రయోజనిక్ ఇంజన్ సాయంతో జీశాట్–4 ఉపగ్రహాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది. అయితే.. ఇంజన్ ఆన్ కాకపోవడంతో రాకెట్ సముద్రంలో కూలిపోయింది. ఆ తర్వాత చేసిన మూడు ప్రయోగాలు విజయవంతం కావడంతో చంద్రయాన్–2కు ఈ రాకెట్‌ను ఎంపిక చేశారు. అయితే క్రయోజనిక్ ఇంజన్ నుంచి అతిశీతల పరిస్థితుల్లో ఉండే ఇంధనం లీక్ కావడం, ఇంజన్‌లోని కొన్ని వాల్వ్‌లు సక్రమంగా పనిచేయకపోవడాన్ని గుర్తించడం వల్ల ప్రయోగాన్ని ఆపేశారని కొంతమంది నిపుణుల అంచనా. ‘అంత పెద్ద ప్రయోగంలో చిన్నచిన్న సమస్యలు సహజమే. సమస్య ఉందని గుర్తించాక ఏ మాత్రం అవకాశం తీసుకోకూడదు’అని డీఆర్డీవో శాస్త్రవేత్త రవిగుప్తా అన్నారు. ‘ప్రయోగం కోసం దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. సమస్య సాధారణమైందా? సంక్లిష్టమైందా? అన్నది ప్రధానం కాదు. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రయోగాన్ని కొనసాగించలేం’అని ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్ మాజీ డైరెక్టర్ జి.బాలచంద్రన్ తెలిపారు. నిరాశగా వెనుదిరిగిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం సాయంత్రం షార్కు వచ్చిన ఆయన జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్‌ను సందర్శించి రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. రాత్రి 12.30 గంటలకు ప్రయోగాన్ని తిలకించేందుకు మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. ప్రయోగం వాయిదా పడటంతో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పి సోమవారం ఉదయాన్నే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లిపోయారు. -
హలో.. హలో..చందమామ
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేతృత్వంలో చంద్రయాన్–2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. 20 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం వేకువజామున 2.51 గంటలకు సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పదేళ్లపాటు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమించి రూపాందించిన 3,850 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉ.6.51 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. గ్రహాంతర ప్రయోగాల్లో భారత్‌కు ఇది మూడోది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి చేస్తున్న రెండో ప్రయోగం ఇది. షార్ నుంచి 75వ ప్రయోగం కావడం కూడా ఓ విశేషం. ఇది చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోనుంది. ఇంత పెద్ద రాకెట్‌ను, ఇంత పెద్ద ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇస్రో చరిత్రలో రికార్డుగా చెబుతున్నారు. అంతకుముందు శనివారం ఎంఆర్ఆర్ కమిటీ సమావేశం అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఎ. రాజరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ల్యాబ్ మీటింగ్‌లో ఆదివారం ఉ.6.51 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 20 గంటల కౌంట్‌డౌన్ సమయంలో భాగంగా ఆదివారం ఉ.8 నుంచి మ.2 గంటల వరకు రాకెట్‌కు రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తిచేశారు. ద్రవ ఇంధనం నింపిన అనంతరం రాకెట్‌కు పలు పరీక్షలు నిర్వహించారు. ప్రయోగానికి అతికొద్ది సమయమే వుండడంతో రాకెట్లో హీలియం గ్యాస్ నింపడం ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తున్నారు. భారత్ త్రీ–ఇన్–వన్ ప్రయోగం ఇలా.. చంద్రయాన్–2 ప్రాజెక్టును ఇస్రో శాస్త్రవేత్తలు త్రీ ఇన్ వన్ ప్రయోగంగా పిలుస్తున్నారు. ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్లను ఒకటిగా అమర్చి పంపుతున్న ప్రయోగం కాబట్టి దీన్ని త్రీ ఇన్ వన్ ప్రయోగమని సంభోదిస్తున్నారు. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ద్వారా ప్రయోగించే చంద్రయాన్–2 కాంపోజిట్ మాడ్యూల్స్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు వుంటాయి. అయితే, వీటిలో అర్బిటర్ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ అక్కడి నుంచి సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. దీని నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది. ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. రాష్ట్రపతి సమక్షంలో ప్రయోగం భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చంద్రయాన్–2 ప్రయోగాన్ని వేక్షించేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో ఆదివారం సా.4.53 గంటలకు ‘షార్’ కేంద్రానికి చేరుకున్నారు. షార్‌లో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్, షార్ డైరెక్టర్ ఎ. రాజరాజన్, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి నక్షత్ర అతిథిగృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం 7 గంటలకు చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించిన రెండో ప్రయోగ వేదిక వద్దకు చేరుకుని జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్‌ను సందర్శించారు. ఆ తరువాత షార్‌లో సుమారు రూ.650 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 7.30 గంటలకు తిరిగి నక్షత్ర అతిథిగృహానికి చేరుకున్నారు. రాత్రి 12 గంటలకు మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకుని ప్రయోగాన్ని వీక్షించారు. చంద్రయాన్–2కు తమిళనాడు నుంచి మట్టి సేలం (తమిళనాడు): చంద్రయాన్–2 ఉపగ్రహం కోసం అనార్తసైట్ మట్టిని అందించామని పెరియార్ యూనివర్సిటీ భౌగోళిక విభాగ డైరెక్టర్ అన్బలగన్ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై చంద్రునిపై ఉన్న మట్టి అనార్తసైట్ అని తెలిసి తమ సాయం కోరినట్టు చెప్పారు. అప్పుడు తాము నామక్కల్ జిల్లా చిత్తంపూండి కున్నమలై నుంచి ఆరు నెలల క్రితం 50టన్నుల అనార్తసైట్ మట్టిని బెంగళూరులో ఉన్న ఇస్రో కేంద్రానికి పంపించామన్నారు. అక్కడ పరిశీలనల్లో ఈ మట్టి, చంద్రునిపై ఉన్న మట్టి ఒకటే అని తేల్చినట్లు చెప్పారు. పెరియార్ యూనివర్సిటీ కేవలం రూ.పది లక్షలతో అనార్తసైట్ మట్టిని సిద్ధంచేసి ఇస్రోకు అందజేయడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. ఈ మట్టి భవిష్యత్తులో అనేక పరిశోధనలకు ఉపయోగంగా ఉంటుందని ఆయన వివరించారు. -
మూన్‌పై మన మార్క్
-
ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు..!
రేదొరా నిను చేరగా..! అంతరిక్షంలో.. ఎన్నో వింతలు..విశేషాలు..మరెన్నో అద్భుతాలు..వాటిని శోధించేందుకు అగ్రదేశాల పోటీ. వాటికి దీటుగా భారత్ ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసింది. ఇస్రోను ప్రధాన ఆయుధంగా మలుచుకుని వినువీధిలో ఎదురులేని శక్తిగా నిలిచింది. 1970లో రష్యా వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపారు. ఆ తర్వాత అమెరికా,చైనా దేశాలు చంద్రునిపై ప్రయోగాలు చేశాయి. 2008లో జిల్లాలోని షార్ వేదికగా చంద్రయాన్–1ను ఇస్రో విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి పంపిన తర్వాతే నీటిజాడలు వెలుగుచూశాయి. ఆ తర్వాత మంగళ్యాన్––1ను అంగారకుడి కక్ష్యలోకి పంపింది. నేడు చంద్రయాన్–2తో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ శోధనలు చేసేందుకు అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. దీనికి వేదికవుతోంది షార్. భారతదేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేసే ఈ ప్రయోగంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా శ్రీహరికోట వైపు చూస్తున్నాయి. – సూళ్లూరుపేట సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు భవిష్యత్ అంతా భారీ ప్రయోగాలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి భారీ ఉపగ్రహ వాహకనౌకను రూపొందించేందుకు 2000 సంవత్సరం నుంచి కృషి చేసి పరిపక్వతను సాధించగలిగారు. తొలుతగా 2014 డిసెంబర్ 23 జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్‌ను ప్రయోగాత్మకంగా ప్రయోగించి నిర్ధారించుకున్నారు. ఆ ప్రయోగంలో ఎస్–200, ఎల్–110 సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. అందులో సీ–25 లేకుండా క్రూ మాడ్యూల్‌ను పంపించి మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టి విజయవంతం చేశారు. ఆ తర్వాత 2017 జూన్ 5న జీఎస్ఎల్వీ–మార్క్3డీ1 ద్వారా 3,136 కిలోల బరువు కలిగిన జీశాట్–19 అనే సమాచార ఉపగ్రహాన్ని, నవంబర్ 14న మార్క్ 3డీ2 ద్వారా 3,700 కిలోల బరువు కలిగిన జీశాట్–29 అనే సమాచార ఉపగ్రహాన్ని సునాయాసంగా ప్రయోగించారు. ఇంతటి భారీ ఉపగ్రహ ప్రయోగాలు విజయాలు సాధించాయంటే అది 19 ఏళ్ల కఠోర శ్రమకు ఫలితమని చెప్పొచ్చు. కీలక దశల్లో స్ట్రాపాన్ బూస్టర్ల తయారీలో పరిణితి ఇందులో కీలకంగా మారిన మొదటి దశ 200 టన్నుల ఘన ఇంధనాన్ని నింపిన రెండు ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్ల అవసరాన్ని గుర్తించారు. మామూలుగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లలో మొదటి దశలో సుమారు 138, 142 టన్నుల ఘన ఇంధనాన్ని వాడతారు. M మార్క్–3 రాకెట్లో అయితే 400 టన్నుల ఘన ఇంధనాన్ని నింపిన రెండు బూస్టర్లు అవసరం కావడంతో వీటిని షార్‌లోని ఘన ఇంధనం తయారీ విభాగం (స్ప్రాబ్)లోనే తయారు చేశారు. 2000 నుంచి 2010 వరకు దీనికి ఏమి అవసరముంటుందో గుర్తించి 2010 జనవరి 24న ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లకు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. రెండో దశలో ఉపయోగించే 110 టన్నుల ద్రవ ఇంధనం నింపిన మోటార్లు (ఎల్–110) వాడతారు. మామూలు ప్రయోగాల్లో అయితే 40 టన్నులకు మించి వాడరు. ఇక్కడేమో ఉపగ్రహం బరువును బట్టి రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తారు. ఎల్–110ను తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్ సెంటర్లో తయారు చేసి 2010 మార్చి 5న భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. ఇక మూడో దశలో అత్యంత శక్తివంతమైన క్రయోజనిక్ ఇంజిన్లను వినియోగిస్తారు. దీన్ని ఇస్రో పరిభాషలో సీ–25గా పిలుస్తారు. మామూలుగా జీఎస్ఎల్వీలో 12.5 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తే అదే మార్క్–3కు వచ్చే సరికి రెట్టింపు క్రయో ఇంధనం అంటే 25 టన్నుల ఇంధనాన్ని వినియోగిస్తారు. 12.5 టన్నుల బరువు కలిగిన క్రయోజనిక్ దశను రూపొందించేందుకు మన శాస్త్రవేత్తలు తీవ్రమైన కృషి చేశారు. 25 టన్నుల క్రయో దశను రూపొందించేందుకు రెండేళ్ల వ్యవధిని తీసుకున్నారు. సీ–25లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించడంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాప్తి చెందుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇస్రోకు బాహుబలి రాకెట్‌గా పేరు పొందిన జీఎస్ఎల్వీ మార్క్–3 సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం కావడం విశేషం. ప్రస్తుతం సుమారు నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 మిషన్‌ను ముచ్చటగా మూడో సారి రోదసీలోకి తీసుకెళ్లేందుకు జీఎస్ఎల్వీ మార్క్ 3–ఎం1 రాకెట్ ద్వారానే నిర్వహించనున్నారు. గగన్‌యాన్ లక్ష్యంగా ... సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2022 నాటికి మానవ సహిత ప్రయోగాలే (గగన్‌యాన్) లక్ష్యంగా 2014, 2016, 2018 సంవత్సరాల్లో మూడు రకాల ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి ముందంజల్లో నిలిచింది. గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. గగన్‌యాన్ తరహా ప్రయోగాలను నిర్వహించేందుకు 2014 డిసెంబర్ 18నే బీజం పడింది. భవిష్యత్‌లో గగన్‌యాన్ ప్రయోగాలు చేసేందుకు ముందుస్తుగానే జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి భారీ రాకెట్‌ను, ఆర్ఎల్వీ టీడీ, పాడ్ అబార్ట్ టెస్ట్ వంటి మూడు ప్రయోగాత్మక ప్రయోగాలను చేపట్టి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలు మంచి జోష్ మీదున్నారు. ఆర్ఎల్వీ టీడీ ప్రయోగమూ విజయమే సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రియూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ–టీడీ) విజయవంతంగా ప్రయోగించారు. ఈ తరహా రాకెట్ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలో మీటర్లు ఎత్తుకెళ్లిన తర్వాత శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువు కలిగిన హైపర్ సోనిక్ పైలట్‌ను విడుదల చేసింది. ఆ పైలట్ 65 కిలో మీటర్లు ఎత్తుకెళ్లి తిరిగి తీసుకువచ్చేందుకు రన్‌వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా హైపర్ సోనిక్ పైలట్‌ను శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 450 కిలో మీటర్లు దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు. దీనికి ఇండియన్ కోస్టల్ గారŠుడ్స, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్ మెజర్మెంట్, షిప్ బర్న్ టెలీమేట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. వ్యోమనాట్స్‌ను రోదసీలో వదిలి పెట్టి మళ్లీ క్షేమంగా తీసుకురావడానికి ఉపయోగపడే రియూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు. గగన్‌యాన్ ప్రయోగం కోసమే పాడ్ అబార్ట్ టెస్ట్ మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగానే నిర్వహించారు. ‘ ప్యాడ్ అబార్ట్æ టెస్ట్’ ప్రయోగాన్ని 259 సెకండ్ల పాటు రాకెట్‌ను నాలుగు దశల్లో మండించి రెండు కిలో మీటర్లు మేర అంతరిక్షం వైపునకు తీసుకెళ్లి ప్యారాచూట్ల ద్వారా క్రూ మాడ్యూల్‌ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు వేచి ఉండి వాటిని రికవరీ చేశారు. అయితే ఈ ప్రయోగంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకున్నప్పటికీ విజయవంతగానే నిర్వహించారు. క్రూ మాడ్యూల్‌ను సముద్రంలో దించే సమయంలో సుమారు 10 నిమిషాల ముందే వదిలేయడంతో మాడ్యూల్ కిందభాగం కొద్దిగా దెబ్బతింది. అయితే వ్యోమగాములే ఉంటే దీని వల్ల ఇబ్బందేమీ ఉండదని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. మానవ సహిత ప్రయోగాల్లో ప్రమాదాల నివారణకే ప్రయోగాలు 2003లో యూఎస్ఏకు చెందిన కొలంబియా స్పేస్ షటిల్ వ్యోమగాములను విజయవంతంగా రోదసీలోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తిరిగి భూమికి చేరుకునే సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే ఉష్ణోగ్రతల్లో తేడాలు వచ్చి ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోయింది. ఇందులో ఆమెరికా వ్యోమగాములతో పాటు భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా కొన్ని పరీక్షలు చేసుకుంటున్నారు. ఈ పరీక్షల్లో భాగంగా ఇద్దరు వ్యోమగాములను భూ సమీప కక్ష్యలోకి పంపించి వారిని సురక్షితంగా ముందుగా నిర్ణయించిన ప్రాంతానికి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి. ఆ సమయంలో రాకెట్ ఎలా పని చేస్తుంది. వాతావరణంలోని మార్పులు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ ప్రయోగాన్ని నిర్వహించి వాటి వివరాలను ఇస్రో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. భవిష్యత్‌లో వ్యోమగాములను రోదసీలోకి పంపి మళ్లీ తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు క్రూ మాడ్యూల్, ఆర్ఎల్వీ–టీడీ, పాడ్ అబార్ట్ టెస్ట్ అనే మూడు రకాల ప్రయోగాత్మక ప్రయోగాలతో సాంకేతిక పరంగా పట్టు సాధించారు. ఈ మూడు ప్రయోగాలకు సుమారు రూ.170 కోట్ల దాకా వ్యయం చేశారని తెలుస్తోంది. అయితే మానవ సహిత ప్రయోగాలను నిర్వహించేందుకు మరో రెండు మానవ రహితంగా ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి నిర్ధారించుకున్న తర్వాత గగన్‌యాన్ ప్రయోగానికి సిద్ధమయ్యేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఇస్రో ఇటీవల కాలంలో చేసే ప్రతి ప్రయోగాత్మక ప్రయోగం మొదటి ప్రయత్నంలోనే విజయవంతం అవుతుండడంతో యావత్ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. 2000లో మార్క్–3కి బీజం సుమారు 3 వేల నుంచి 5 వేల కిలోల బరువు కలిగిన కమ్యూనికేషన్ శాటిలైట్స్‌తో పాటు, మానవుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు, చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనల నిమిత్తం చంద్రయాన్–2 వంటి మిషన్ పంపేందుకు మార్క్–3 వంటి భారీ ఉపగ్రహ వాహకనౌక అవసరమని 2000లో గుర్తించి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 2003లో దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే కాకుండా బడ్జెట్లో రూ. 3 వేల కోట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా షార్‌లోనే రూ.700 కోట్లతో ఈ ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. షార్కు దేశ ప్రథమ పౌరుడు రాక సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు అత్యంత కీలక కేంద్రమైన సతీష్ ధవన్‌స్పేస్ (షార్) సెంటర్‌కు దేశ ప్రథమ పౌరుడు రామనాథ్ కోవింద్ రానున్నారు. షార్‌ను ఇప్పటికి మగ్గురు రాష్ట్రపతులు సందర్శించగా ప్రస్తుతం నాల్గో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఈ నెల 14న షార్‌ను సందర్శించనున్నారు. అయితే షార్‌ను సందర్శించిన భారత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం ఇస్రో శ్రీహరికోట నుంచి చేపట్టిన మొట్టమొదటి ఎస్ఎల్వీ–3డీ1 ప్రయోగ సమయంలో ఆ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా, శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి హోదాలో షార్‌లో రెండో ప్రయోగ వేదికను ప్రారంభించేందుకు విచ్చేశారు. అయితే ఆయన స్వతహాగా శాస్త్రవేత్త కావడంతో రాష్ట్రపతి హోదాలోనే పలుమార్లు ప్రయోగాలను వీక్షించేందుకు విచ్చేసిన సందర్భాలున్నాయి. సుమారు రూ.30 కోట్లతో నిర్మించిన రెండో ప్రయోగ వేదికను 05–05–2005న ఆయన చేతులు మీదుగా ప్రారంభించారు. అదే రోజున రెండో ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ06 ద్వారా కార్టోశాట్–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అయితే ఆయన ఆ సమయంలో 4వ తేదీనే షార్కు చేరుకుని ప్రయోగ పనుల్లో కూడా పాలుపంచుకోవడం విశేషం. ఆ తర్వాత 2012 జనవరి 2న అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభాపాటిల్ కూడా షార్ కేంద్రాన్ని సందర్శించారు. భవిష్యత్‌లో భారీ ప్రయోగాల దృష్ట్యా షార్‌లో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు రూ. 20 కోట్లతో నిర్మించిన న్యూ మిషన్ కంట్రోల్‌రూంను ఆమె చేతులు మీదుగా అప్పట్లో ప్రారంభించారు. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 25న అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్‌ముఖర్జీ పీఎస్ఎల్వీ సీ20 ప్రయోగానికి వీక్షించేందుకు విచ్చేశారు. అయితే ఆయన కేవలం ప్రయోగాన్ని వీక్షించేందుకు మాత్రమే వచ్చి వెళ్లారు. ప్రస్తుత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈ నెల 14న షార్ కేంద్రాన్ని సందర్శించిన నాలుగో రాష్ట్రపతి కావడం విశేషం. షార్‌లో ఇటీవల రూ.695 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను ప్రారంభించేందుకు షార్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 14న సాయంత్రం సెకండ్ వ్యాబ్‌ను ప్రారంభించనున్నారు. -
చందమామపైకి చలో చలో
సూళ్లూరుపేట (శ్రీహరికోట)/తిరుమల: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనున్న ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది. నెల్లూరు జిల్లా సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం వేకువజామున 2.51 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. షార్‌లోని బ్రహ్మ ప్రకాశ్ హాలులో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్యర్యంలో, ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ పర్యవేక్షణలో శనివారం మిషన్ సంసిద్ధత సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 7 నుంచి శనివారం దాకా ప్రయోగ వేదిక మీదున్న రాకెట్‌కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాక ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాకెట్ సిద్ధంగా ఉందని, పరీక్షలన్నీ పూర్తి చేశామని చెప్పి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) చైర్మన్ ఆర్ముగ రాజరాజన్‌కు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో కూడా బోర్డు శనివారం రాత్రి మరోసారి సమావేశమైంది. ఈ సందర్భంగా రాకెట్‌కు కె. శివన్ ఆధ్వర్యంలో మళ్లీ లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. ప్రయోగ సమయానికి 20 గంటల ముందు అంటే ఆదివారం ఉదయం 6.51 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించాలని నిర్ణయించారు. 20 గంటల కౌంట్‌డౌన్ అనంతరం జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్.. 3,850 కిలోల బరువుగల చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని భూమి నుంచి చంద్రుడిపైకి మోసుకెళ్తుంది. జీఎస్ఎల్వీ మార్క్ 3–ఎం1 రాకెట్ పొడవు 43.43 మీటర్లు, బరువు 640 టన్నులు. ఇందులో 3,850 కిలోల బరువుగల చంద్రయాన్–2 మిషన్‌ను పంపుతున్నారు. ఉపగ్రహంలో 2.3 టన్నుల ఆర్బిటర్, 1.4 టన్నుల ల్యాండర్ (విక్రమ్), 27 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)లో 14 ఇండియన్ పేలోడ్స్ (ఉపకరణాలు)తోపాటు ఆమెరికాకు చెందిన రెండు, యూరప్ దేశాలకు సంబంధించి రెండు పేలోడ్స్‌ను పంపిస్తున్నారు. ఇలా పనిచేస్తుంది... – మొదటి దశలో జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్, దాని ఇరువైపులా ఉన్న అత్యంత శక్తివంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి పయనమవుతుంది. ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 131.30 సెకన్లలో మొదటి దశను పూర్తి చేస్తారు. – రెండో దశలో ద్రవ ఇంజన్ మోటార్లు 110.82 సెకన్లకే ప్రారంభమవుతాయి. 203 సెకన్లకు రాకెట్ శిఖర భాగాన అమర్చిన చంద్రయాన్–2 మిషన్‌కు ఉన్న హీట్ షీల్డ్స్ విడిపోతాయి. ఈ దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని ఉపయోగించి 308.50 సెకన్లకు రెండో దశను పూర్తి చేస్తారు. – మూడో దశలో అత్యంత కీలకమైన క్రయోజనిక్ (సీ–25) మోటార్లు 310.90 సెకన్లకు ప్రారంభమవుతాయి. 958.71 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను పూర్తి చేస్తారు. అనంతరం రాకెట్‌కు శిఖర భాగాన అమర్చిన త్రీ–ఇన్–వన్ చంద్రయాన్–2 మిషన్ 973.70 సెకన్లకు (16.21 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ) 170.06 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 39,059.6 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ ఆర్బిట్ (అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత ఈ బాధ్యతను బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ అధీనంలోకి తీసుకొని మిషన్ చంద్రుడిపైకి వెళ్లే వరకు ఆపరేషన్ నిర్వహిస్తుంది. 16 రోజుల్లో కక్ష్య దూరం పెంపు... ప్రయోగం జరిగిన 16 రోజుల్లో అపోజిని 39,059.6 కిలోమీటర్ల నుంచి 1,41,000 పెంచేందుకు ఆర్బిటర్‌ను మండించి నాలుగుసార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌ను చంద్రుడి వైపు మళ్లిస్తారు. తదనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు రెట్రోబర్న్ చేసి వంద కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి నాలుగుసార్లు అపరేషన్ చేపడతారు. 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి ఉపరితలంపైన దక్షిణ ధ్రువ ప్రాంతంలోని మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దిగుతుంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి రావడానికి సుమారు 4 గంటల సమయాన్ని తీసుకుంటుంది. ఇది సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు).. అంటే 14 రోజుల్లో 500 మీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇదంతా జరగడానికి 52 రోజులు పడుతుంది. ఇలా 3.50 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి సెప్టెంబర్ 6న ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు చేరుకుని పరిశోధనలకు శ్రీకారం చుడుతుంది. తిరుమలలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు... తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ శనివారం దర్శించుకున్నారు. చంద్రయాన్–2 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆయన సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు. -
టిక్:టిక్:టిక్
జాబిల్లిపైకి ఓ ల్యాండర్‌ను ప్రయోగించిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించేందుకు ఇక కేవలం కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున 2:51 గంటలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన బాహుబలి రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్–3 ద్వారా చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఒక్క దెబ్బకు మూడు పిట్టలన్న చందంగా ఈ ప్రయోగం ద్వారా ఇస్రో బహుళ ప్రయోజనాలను సాధించనుంది. ఈ ప్రయోగం భారత కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత సంక్లిష్టమైన ప్రయోగం... ఇస్రో ఇప్పటివరకూ చేపట్టిన ప్రయోగాలన్నింటికంటే చంద్రయాన్–2 చాలా సంక్లిష్టమైంది. జాబిల్లి చుట్టూ తిరిగే ఆర్బిటర్.. ఉపగ్రహంపై దిగే ల్యాండర్లు రెండింటినీ జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా పంపనున్నారు. ల్యాండర్ జాబిల్లిపైకి సురక్షితంగా దిగాక అందులోంచి రోవర్ బయటకు వచ్చి ఉపరితలంపై దాదాపు అర కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది. అత్యంత శీతల (–157 డిగ్రీ సెల్సియస్) పరిస్థితుల్లో ఈ యంత్రాన్ని పనిచేయించడం ఒక సవాలే. జీఎస్ఎల్వీ రాకెట్ ఆర్బిటర్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెడితే 50 రోజుల ప్రయాణం తరువాత అది జాబిల్లిపైకి చేరుతుంది. జాబిల్లికి సుమారు 150 కి.మీ. దూరంలో ఉన్న దశలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరుపడుతుంది. నాలుగు రోజులపాటు చక్కర్లు కొడుతూ నెమ్మదిగా వంద కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. దశలవారీగా వేగాన్ని 30 కిలోమీటర్లకు తగ్గించుకొని దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగుతుంది. చందమామ ఉపరితలంపైకి ల్యాండర్ దిగిన నాలుగు గంటల తరువాత అందులోంచి రోవర్ బయటపడుతుంది. సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ల్యాండర్ నుంచి వేరుపడి ఆ తరువాత 14 రోజుల్లో సుమారు 500 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ల్యాండర్‌పై మన జాతీయ పతాకం ముద్రితమై ఉంటుంది. రోవర్‌కు ఉన్న ఆరు చక్రాలపై అశోకచక్రను ముద్రించారు. చంద్రయాన్–2 మొత్తం ఖర్చు రూ. 978 కోట్లుకాగా అందులో రూ. 603 కోట్లు ల్యాండర్, ఆర్బిటర్ల నిర్మాణానికి, నేవిగేషన్, భూమ్మీది నెట్వర్క్ ఏర్పాటుకు ఖర్చు పెట్టారు. మిగిలిన రూ. 375 కోట్లను జీఎస్ఎల్వీ మార్క్–3 నిర్మాణం, క్రయోజెనిక్ ఇంజిన్, ఇంధనాల కోసం ఉపయోగించారు. ఇవీ లక్ష్యాలు... చంద్రయాన్–2 ప్రధాన లక్ష్యం ఇప్పటివరకూ ఏ దేశమూ ప్రవేశించని ప్రాంతాల్లో ప్రయోగాలు చేయడం. తద్వారా ఎప్పుడూ చీకటిలోనే ఉండే దక్షిణ ధ్రువ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు ఏమైనా ఉందా? అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు స్వచ్ఛమైన ఇంధనం హీలియం–3 ఛాయలను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. జాబిల్లిపై ఉన్న హీలియం–3ని సమర్థంగా వాడుకోగలిగితే భూమి మొత్తానికి అవసరమైన విద్యుత్‌ను ఏకంగా 250 ఏళ్లపాటు తయారు చేసుకోవచ్చనని అంచనా. వినువీధిలో భారత పతాక మరోసారి రెపరెపలాడేందుకు రంగం సిద్ధమైంది. జాబిల్లిపై నీటి జాడలను నిర్ధారించిన చంద్రయాన్–1కు కొనసాగింపుగా మరోసారి చందమామపై కాలుమోపేందుకు చంద్రయాన్–2 సిద్ధమైంది. మునుపెన్నడూ.. ఎవ్వరూ చేయని రీతిలో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో... ఓ ల్యాండర్‌ను దింపడం.. రోవర్‌ను నడపడం, జాబిల్లి చుట్టూ ఉపగ్రహాన్ని తిప్పడమన్న లక్ష్యాలతో నింగికి ఎగరనున్న చంద్రయాన్–2 అవసరమేమిటి? ప్రయోగాలు ఏం తేల్చనున్నాయి? ఇస్రో శాస్త్రవేత్తలకు కలాం ఇచ్చిన సలహా... మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఇస్రో శాస్త్రవేత్తలకు ఇచ్చిన సలహా ఈనాటి చంద్రయాన్–2గా పరిణమించిందంటే ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకంటే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ స్వావలంబన సాధించాలని, అందుకుతగ్గ సామర్థ్యం మనకు ఉందని బలంగా నమ్మి, ప్రోత్సహించిన వ్యక్తుల్లో కలామ్ ఒకరన్నది తెలిసిందే. 2003లో జాబిల్లిపై ప్రయోగాలు చేసేందుకు ఇస్రో ఆలోచిస్తోందన్న వార్తలు వస్తున్న తరుణంలో తనను కలిసిన ఇస్రో శాస్త్రవేత్తలతో కలాం మాట్లాడుతూ చంద్రయాన్ ప్రాజెక్టు ద్వారా జాబిల్లిని చేరితే ఆ విజయం దేశ యువత, పిల్లల్లోనూ స్ఫూర్తి నింపుతుందని సూచించారు. అంతేకాకుండా 2009లోనూ జాబిల్లిపైనే ఎందుకు ప్రయోగాలు చేయాలో చెబుతూ భవిష్యత్తులో భూమికి, అంగారకుడికి మధ్య వారధిగా జాబిల్లి ఉపయోగపడుతుందని చెప్పారు. జాబిల్లి చుట్టూ 100 కి.మీ. దూరంలో చంద్రయాన్–1 తిరుగుతూ సమాచారం సేకరిస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు కలాంకు వివరించినప్పుడు అంతదూరం వెళ్లిన అంతరిక్ష నౌకను జాబిల్లిపైకి దింపవచ్చు కదా అని సూచించారట. ఈ సూచన ఫలితంగానే చంద్రయాన్–1లో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ (ఎంఐపీ) రూపకల్పన జరిగిందని, జాబిల్లిపై దిగిన ఈ పరికరం అక్కడ నీరు ఉన్న విషయాన్ని నిర్ధారించిందని చంద్రయాన్–1 ప్రాజెక్టు డైరెక్టర్ ఎం. అన్నాదురై తెలిపారు. భవిష్యత్తులో జాబిల్లి అంతరిక్ష పారిశ్రామిక కేంద్రంగా మారే అవకాశముందని 2009లోనే కలాం అంచనా కట్టారు. కేంద్రక సంలీన చర్య ద్వారా విద్యుదుత్పత్తి సాధ్యమైన రోజున హీలియంకు డిమాండ్ పెరుగుతుందని, దీనిద్వారా తయారు చేసే విద్యుత్‌తో భూమ్మీద వాహనాలు నడుస్తాయని, జాబిల్లిపై మానవ ఆవాసాలకూ ఉపయోగపడుతుందని కలాం అప్పట్లో వివరించినట్లు అన్నాదురై వివరించారు. ట్విట్టరాటీ జాబితాలో అగ్రస్థానంలో జాతీయ పతాకం ‘‘చంద్రయాన్–2 ద్వారా జాబిల్లిపైకి ఏం తీసుకెళితే బాగుంటుంది?’’ఇటీవల ట్విట్టర్ ప్రపంచానికి ఇస్రో వేసిన ప్రశ్న ఇది. ఇందుకు భారీగా స్పందించిన నెటిజన్లు... జాతీయ పతాకాన్ని తీసుకెళ్లాలని సూచించారు. దీంతోపాటు కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ట్వీట్ల ద్వారా పంచుకున్నారు. గౌతమ్ సింగ్ అనే వ్యక్తి.. ఇండియా మ్యాప్‌ను తీసుకెళ్లాలని, భవిష్యత్తులో గ్రహాంతర వాసులెవరైనా జాబిల్లిని సందర్శిస్తే.. ఈ మ్యాప్ చూసి మనం ఎవరో తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు. జాతీయ పతాకం వారికి ఏమాత్రం ఉపయోగపడదని అన్నారు. ఇంకొందరు మన దేశం మట్టిని అక్కడికి తీసుకెళ్లాలని సూచించగా.. కొంతమంది ఈ ఆలోచనకు మద్దతుగా నిలిచారు. ఇంకొందరు మాత్రం ఆ గ్రహాన్ని కలుషితం చేయడం సరికాదని పేర్కొన్నారు. -
చంద్రయాన్-2 ప్రయోగానికి శరవేగంగా ఏర్పాట్లు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
-
జాబిలమ్మ ఒడిలోకి..
ఎన్నో సవాళ్లు..మరెన్నో మైలు రాళ్లు దాటుకుని అద్భుత ప్రయోగాలు విజయవంతం చేసి మరో కీర్తి పతాకాన్ని తన సొంతం చేసుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అడుగులు ముందుకువేస్తోంది. జాబిలమ్మపై వింతలూ..విశేషాలపై పరిశోధనలు చేసేందుకు చంద్రయాన్–1ను విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–2ను విజయవంతం చేసి ప్రపంచ పటంలో భారత్ కీర్తి పతాకాన్ని ఎగురవేసేందుకు సిద్ధం అవుతోంది. షార్ వేదికగా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేసి అంతరిక్షంలో అద్భుతం సృష్టించి అగ్రదేశాల సరసన నిలిచేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. విదేశాల నుంచి 30 ఉపగ్రహాలు 1975 నుంచి 2018 డిసెంబర్ వరకు వంద ఉపగ్రహాలను రోదసీలోకి పంపించి ఇస్రో సెంచరీని పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మరో ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపించి సెంచరీని అధిగమించారు. ఇప్పటి వరకు పంపిన 105 ఉపగ్రహాల్లో 30 ఉపగ్రహాలను రష్యా అంతరిక్ష సంస్థ, ఫ్రెంచి గయానా కౌరు అంతరిక్ష కేంద్రాల నుంచి పంపించారు. విదేశీ వేదికల నుంచి ఇన్శాట్ సిరీస్, జీశాట్ సిరీస్, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను పంపించారు. ఇప్పటి వరకు 34 కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, 33 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, 14 ఎక్స్పర్మెంటల్ ఉపగ్రహాలు, 9 నావిగేషన్ వ్యవస్థ ఉపగ్రహాలు, 9 మెట్రోలాజికల్ ఉపగ్రహాలు, 2 గ్రహాంతర ఉపగ్రహాలు, ఖగోళంలోని స్థితిగతులను పరిశోధించేందుకు 2 స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, 2 స్టూడెంట్ ఉపగ్రహాలను ప్రయోగించారు. చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్–1 పేరుతో చంద్రుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించారు. అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్యాన్–1 పేరుతో అంగారకుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించారు. ఈ రెండు ప్రయోగాలు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం ప్రపంచ దేశాలను అబ్బురపరిచింది. చంద్రుడు, అంగారకుడి కక్ష్యలోకి ఉపగ్రహాలను పంపిన అనతి కాలంలోనే చంద్రయాన్–2 ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధం కావడం విశేషం. చంద్రయాన్–2 పేరుతో ఏకంగా చంద్రుడిపై ల్యాండర్ దింపి రోవర్ ద్వారా చంద్రుడి మూలాలను అన్వేషించేందుకు సమయాత్తమవుతున్నారు. దీనికి ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరు పొందిన జీఎస్ఎల్వీ మార్క్–3 ద్వారా చేస్తున్నారు. ఈ తరహా రాకెట్ సిరీస్‌లో ఇది నాలుగో ప్రయోగం కావడం విశేషం. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కాగానే గగన్‌యాన్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఇప్పటికే మూడు రకాల ప్రయోగాత్మక ప్రయోగాలు చేసి విజయాలను నమోదు చేసుకున్నారు. సాక్షి, శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. సుదీర్ఘమైన అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఇస్రో నేడు చంద్రుడి మీద పరిశోధనలు చేసేందుకు చంద్రయాన్–2 పేరుతో ఆర్బిటర్ ద్వారా ల్యాండర్, రోవర్లు పంపించే స్థాయికి ఎదిగింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో కీర్తి కిరీటంలో చంద్రయాన్–2 ప్రయోగం ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. దేశంలో రాకెట్ ప్రయోగాలు ప్రారంభించిన తొలినాళ్లలో 40 కిలోల ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. ప్రస్తుతం నాలుగు టన్నుల బరువు కలిగిన చంద్రయాన్–2 వంటి అత్యంత శక్తివంతమైన ప్రయోగం చేసే స్థాయికి చేరింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో నాలుగో దేశంగా ఆవిర్భవించనుంది. ఇస్రో ఇప్పటి వరకు 8 రకాల ఉపగ్రహాలను తయారు చేసి వివిధ రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టి ప్రపంచంలో భారత్ సత్తాను చాటింది. సముద్రాలు, భూమిని అధ్యయనం చేసేందుకు, భూమి పొరల్లో దాగి ఉన్న ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు, పట్టణ ప్రణాళికాభివృద్ధి, వాతావరణ పరిస్థితుల అధ్యయనం, ఇంకా రైతులకు ఉపయోగపడే ఎన్నో ప్రయోజనాల కోసం దూర పరిశీలనా ఉపగ్రహాలు (రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్)ను ప్రయోగించారు. రేడియో, టెలివిజన్, డీటీహెచ్, టెలీఎడ్యుకేషన్, టెలీమెడిసన్, ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ టెక్నాలజీ వంటి ఎంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సమాచార ఉపగ్రహాలు (కమ్యూనికేషన్ శాటిలైట్స్)ను ప్రయోగించారు. ఇతర గ్రహాల పరిశోధనకు చంద్రయాన్–1, మంగళ్యాన్–1 (అంగారక ప్రయోగం) అనే రెండు గ్రహాంతర ప్రయోగాలు చేసి విజయాలను సొంతం చేసుకున్నారు. ఉపగ్రహాల సామర్థ్యాన్ని కూడా నిర్ధారించుకునేందుకు ఎక్స్పర్మెంట్ ఉపగ్రహాలు, భారతదేశానికి సొంత దిక్సూచి వ్యవస్థకు నావిగేషన్ ఉపగ్రహాలు, ఖగోళాన్ని తెలిజేసేందుకు స్పేస్ సైన్స్ ఉపగ్రహాలు, విద్యార్థులకు ఉపయోగపడే స్టూడెంట్ శాటిలైట్స్‌ను ప్రయోగించారు. ఇలా ఇప్పటి వరకు 105 ఉపగ్రహాలను పంపించి సెంచరీని అధిగమించారు. ఇప్పటి వరకు షార్ నుంచి 74 ప్రయోగాలు చేసి 105 స్వదేశీ ఉపగ్రహాలు, 297 విదేశీ ఉపగ్రహాలు, పది స్టూడెంట్ ఉపగ్రహాలు, రెండు రియూజబుల్ ప్రయోగాలు చేసి ఇస్రో తన సత్తా చాటుకుంటోంది. ఈ నెల 15న వేకువన 2.51 గంటలకు చంద్రయాన్–2 వంటి భారీ ప్రయోగానికి సిద్ధమవుతూ ఇస్రో ఖ్యాతిని ఖండంతరాలకు చాటేందుకు సిద్ధమవుతోంది. ఎస్ఎల్వీ నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 వరకు అంతరిక్షయానం ఇస్రో ఆవిర్భావంలో రోదసీలోకి ఉపగ్రహాలను పంపేం దుకు ముందుగా సౌండింగ్ రాకెట్ల ద్వారా వాతావరణాన్ని అధ్యయనం చేశారు. 1979–80లో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎల్వీ) రాకెట్ల ద్వారా 40 కిలోల బరువు కలిగిన చిన్నపాటి ఉపగ్రహాలను భూమికి అత్యంత తక్కువ ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఒక అడుగుకు ముందుకేసి 1992లో ఆగ్మెంటెడ్ లాంచింగ్ వెహికల్స్ (ఏఎస్ఎల్వీ) రాకెట్ల ద్వారా 150 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాలను లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1994లో పోలార్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) రాకెట్ల ద్వారా 1400 కిలోల బరువైన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూరపరిశీలనా ఉపగ్రహాలు)ను భూమికి 508 నుంచి 760 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్భిట్)లోకి ప్రవేశపెట్టారు. పీఎస్ఎల్వీ రాకెట్లు ఇస్రోకు బహుళ ప్రయోజనకారిగా మారింది. వాణిజ్యపరమైన ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్, వాతావరణ, సమాచార ఉపగ్రహాలను సైతం పంపించేందుకు పీఎస్ఎల్వీ ఎంతో దోహదపడింది. ఆ తరువాత 2 టన్నుల నుంచి 4 టన్నుల వరకు బరువైన సమాచార ఉపగ్రహాల(కమ్యూనికేషన్ శాటిలైట్స్)ను ప్రయోగించేం దుకు 2001లో జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ), జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లను రూపొందించారు. జీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సాంకేతిక పరమైన పరిణితి సాధించి 2 వేల కిలోల నుంచి 4 వేల కిలోల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాలను రోదసీలోకి పంపించే స్థాయికి చేరింది. ప్రస్తుతం పంపబోయే చంద్రయాన్–2 ఉపగ్రహం బరువు కూడా 3.8 టన్నులు కావడం విశేషం. -
చకచకా చంద్రయాన్–2 ఏర్పాట్లు
సూళ్లూరుపేట: చంద్రుని మూలాలు కనుగొనడానికి ఉద్దేశించి భారత్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్–2 ప్రయోగానికి సంబం«ధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ రెండు దశల అనుసంధానం పనులు పూర్తయ్యాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2008 నుంచి చంద్రయాన్–2 ప్రయోగాన్ని పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చి జూలై 15న నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రయోగానికి సంబంధించి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఆర్బిటర్ మిషన్ చేరుకున్న విషయం కూడా విదితమే. దీనికి సంబంధించి మంగళవారం బెంగళూరులోని అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయంలో 60 మంది శాస్త్రవేత్తలతో రెండో లూనార్ సైన్స్ మీట్ నిర్వహించారు. ఈ ప్రయోగంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 8 ఆర్బిట్ పేలోడ్స్, మూడు ల్యాండర్ పేలోడ్స్, రెండు రోవర్ పేలోడ్స్ పంపించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అంటే ఈనెల 13, 14 తేదీల్లో కూడా చంద్రయాన్–2 ప్రయోగంలో ఇస్రో హెడ్‌క్వార్టర్‌లో సైన్స్ మీట్ నిర్వహించారు. రెండో మారు నిర్వహించిన లూనార్ సైన్స్‌మీట్‌కు వివిధ పరిశోధనా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, ఇస్రో కేంద్రాలు, ప్రయోగశాలలనుంచి సుమారు 60 మంది శాస్త్రవ్తేతలు హాజరయ్యారు. చంద్రయాన్–2లో పంపబోయే నాలుగు పేలోడ్స్ గురించి కూడా వారు చర్చించినట్టు సమాచారం. ఇందులో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, సింథటిక్ ఆపార్చర్ రాడార్, ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్, మాస్ స్పెక్ట్రోమీటర్ వంటి ఆర్బిటర్ పేలోడ్ల యొక్క డేటా విశ్లేషణ పద్ధతి, పేలోడ్ డేటాను సైన్స్ ఉత్పత్తులకు మార్చడంలో వున్న దశల గురించి వారంతా సమావేశంలో విశ్లేషించారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్‌తో పాటు 60 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
చంద్రయాన్–2 ప్రయోగానికి ప్రధాని రాక?
సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న ఇస్రో నిర్వహించనున్న చంద్రయాన్–2 ప్రయోగాన్ని తిలకించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని తెలిసింది. ఆయనతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ నరసింహన్ కూడా హాజరుకానున్నారు. గతంలో మంగళ్యాన్ ప్రయోగ సమయంలోనూ ప్రధాని వచ్చిన విషయం తెలిసిందే. గ్రహాంతర ప్రయోగం.. పైగా దేశానికి ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన స్వయంగా వచ్చి తిలకించనున్నారు. ఈ ప్రయోగానికి ముందుగానే.. సుమారు 1500 మందితో శాస్త్రసాంకేతిక రంగానికి సంబంధించి ఓ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. రూ.500 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు ఇస్రో వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. 2022 కంటే ముందుగానే గగన్‌యాన్ ప్రయోగాన్ని నిర్వహించాలని ప్రధానమంత్రి ఆదేశాలతో రెండో వ్యాబ్‌ను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది. -
ఇద్దరూ ఇద్దరే.. ఎంతటి కష్టమైనా..
ఒకరేమో రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న అనుభవశాలి రీతూ కరిథాల్..మరొకరు తొలిసారిగా ఒక అతి పెద్ద ప్రాజెక్టుని నడిపే అవకాశం అందిపుచ్చుకున్న ముత్తయ్య వనిత..ఇద్దరూ ఇద్దరే. ఎంతటి కష్టమైన బాధ్యతను అప్పగించినా ఇష్టంతో చేస్తారు. ఇస్రోలో చాలా కాలంగా కీలక పదవుల్లో ఉన్న వారిద్దరూ ఇప్పుడు అత్యంత ప్రతిష్మాత్మక ప్రాజెక్టు చంద్రయాన్–2కు నేతృత్వం వహిస్తున్నారు. ఆ జాబిలి రాణుల నేపథ్యమేంటో చూద్దాం.. అంతరిక్ష రంగంలో భారత్ ఘనకీర్తిని అంతర్జాతీయంగా మరో మెట్టుపై నిలబట్టే గొప్ప ప్రాజెక్టు. వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయిన చంద్రయాన్–2ను జూలై 15న తెల్లవారుజామున 2.51 నిముషాలకు ప్రయోగించబోతున్నాం. అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్–2. ఈ ప్రాజెక్టులో ఆఖరి 15 నిమిషాలు చాలా కీలకం. ఉపగ్రహం రోవర్ నుంచి విడిపోయి జాబిలిపైకి ఒడిదొడుకులు లేకుండా దిగడం కీలకం. అంతటి క్లిష్టమైన పనికి ఇద్దరు చంద్రవదనలు నేతృత్వం వహించడం మహిళా లోకానికి నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. 40వ పడిలో ఉన్న వారిద్దరినీ చూస్తూ దేశమే గర్వపడుతోంది. ‘ఇప్పటివరకు కమ్యూనికేషన్లు, ఇతర ఉపగ్రహాల ప్రయోగాలకు మాత్రమే మహిళలు ఆధ్వర్యం వహించారు. కానీ ఇతర గ్రహాలకు పంపే ఒక మిషన్‌కు మహిళలు నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. ఈ ప్రాజెక్టుల్లో 30శాతం మహిళలు పని చేస్తున్నారు.’అని ఇస్రో చైర్మన్ కె. శివన్ అన్నారు. రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతూ రీతూ కరిథాల్. ఆమె ప్రతిభాపాటవాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వయంకృషితో పైకి వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన ఆమె ఏరోస్పేస్లో ఇంజనీరింగ్ చేశారు. రీతూకి చిన్నప్పట్నుంచి అంతరిక్ష రంగం, సైన్స్‌పై ఆసక్తి ఎక్కువ. నక్షత్ర కాంతుల వెనుక ఏముందో కనుక్కోవాలని ఉబలాటపడేవారు. అదే ఆసక్తితో ఇస్రోలో చేరారు. 1997లో ఇస్రోలో చేరిన ఆమె అంచెలంచెలుగా పైకి ఎదిగారు. చేరిన పదేళ్లకే యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు. ఇస్రోలో 20 ఏళ్ల కెరియర్లో ఎన్నో ప్రాజెక్టుల్లో పనిచేశారు. చంద్రయాన్–1లోనూ సభ్యురాలిగా ఉన్నారు. మంగళయాన్‌కి డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించడం ఆమె కెరీర్‌ను తారాపథానికి తీసుకెళ్లింది. రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందారు. ఇప్పుడు చంద్రయాన్–2కి మిషన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చంద్రయాన్–2 ప్రారంభం నుంచి ఆమెనే పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ వనిత ముత్తయ్య వనిత. ఎల్రక్ట్రానిక్ సిస్టమ్స్‌లో ఇంజనీరిం గ్ చదివారు. ఉపగ్రహాలను డిజైన్ చేయడంలో ప్రత్యే క శిక్షణ తీసుకున్నారు. చంద్రయాన్–2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా ఉన్నారు. డైరెక్టర్ అంటే సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోదు. టీమ్‌లో సభ్యులందరూ సక్రమంగా తమ బాధ్యత లు నిర్వహిస్తున్నారా లేదా చూడాలి. గడువులోగా పని పూర్తయ్యేలా చూడాలి. అంటే ఎంతో నాయకత్వ ప్రతిభ ఉండాలి. వనితకు ఇంత పెద్ద ప్రాజెక్టు చేపట్టడం ఇదే మొదటిసారి. అయినా ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. ‘ప్రాజెక్టు పరంగా చూస్తే నిస్సందేహంగా ఆమె కెరీర్‌ను ఇది మేలి మలుపు తిప్పేదే. ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్చార్జ్ కావడం ఇదే మొదటిసారి. కానీ ఆమె ఎన్నో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ప్రయోగాల ప్రాజెక్టులను వనిత సమర్థంగా నిర్వహించారు’ అని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న డైరెక్టర్ అన్నాదురై చెప్పారు. ఇంటర్నేషనల్ సైన్స్ జనరల్ నేచర్ 2019లో కీలక బాధ్యతలు వహిస్తున్న డైరెక్టర్ల జాబితాలో అగ్రస్థానంలో వనిత పేరుని చేర్చింది. 2006లో అస్ట్రానామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ డైరెక్టర్ పురస్కారం అందుకున్నారు. -
మనకూ ఓ అంతరిక్ష కేంద్రం
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మెగా ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది! ఆంక్షల చట్రాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచంలోనే అత్యంత చవకగా ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించగల సత్తా సాధించుకున్న ఇస్రో... ఇప్పుడు సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులువేస్తోంది. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘చంద్రయాన్–2 ప్రయోగం పూర్తయ్యాక సూర్యుడిపై ఆదిత్య–ఎల్1 వాహకనౌక 2020 తొలి అర్ధభాగంలో పంపిస్తాం. అనంతరం 2–3 సంవత్సరాల వ్యవధిలో ఫ్రాన్స్‌తో కలిసి శుక్రుడిని అధ్యయనం చేసేందుకు మరో ప్రయోగం చేపడతాం’ అని తెలిపారు. ఆదిత్య ఎల్1 వాహకనౌక సూర్యుడిలో అత్యంత వేడి ప్రదేశమైన కరోనాను విశ్లేషిస్తుందనీ, దీనివల్ల వాతావరణ మార్పులను అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు. ఇస్రో అంతరిక్ష పర్యాటకంపై దృష్టి సారించడంలేదని డా.శివన్ స్పష్టం చేశారు. 2030 నాటికి పూర్తి భారతీయుల్ని సొంతంగా అంతరిక్షంలోకి పంపేందుకు రూ.10,000 కోట్లతో ఇస్రో చేపట్టిన ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు కొనసాగింపుగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం ఉంటుందని డా.శివన్ తెలిపారు. ‘అమెరికా, జపాన్, కెనడా, రష్యా, ఈయూ దేశాలు కలిసి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బరువు 420 టన్నులు ఉండగా, ఇస్రో ఏర్పాటుచేయనున్న అంతరిక్ష కేంద్రం బరువు 20 టన్నులు మాత్రమే ఉంటుంది. ఈ కేంద్రంలో తొలుత వ్యోమగాములు 15–20 రోజులు గడిపేలా ఏర్పాట్లు చేస్తాం. దాన్ని క్రమంగా విస్తరిస్తాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉంది. ఓసారి ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2030 నాటికి మనకు సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటవుతుంది. దీనికోసం ఐఎస్ఎస్తో కానీ, మరేదేశంతో కానీ పనిచేయబోం’ అని పేర్కొన్నారు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే పరిస్థితుల్లో మానవశరీరంతో పాటు మొక్కలు, ఇతర జీవులు, బ్యాక్టీరియాలు ఎలా ప్రతిస్పందిస్తాయన్న విషయమై ఈ కేంద్రంలో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఇతర దేశాలతో కలిసి చంద్రుడిపై మానవసహిత యాత్రలు చేపడతామని, గ్రహశకలాలను విశ్లేషిస్తామని కె.శివన్ తెలిపారు. అంతరిక్ష కేంద్రం అంటే? భూమికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో కొన్ని రోజులపాటు వ్యోమగాములు ఉండేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాన్ని అంతరిక్ష కేంద్రం అని పిలవొచ్చు. దీనిని భూస్థిర కక్ష్యలో తిరుగుతూ ఉండే ఓ భారీ ఉపగ్రహంగానూ అనొచ్చు. అగ్రరాజ్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎస్ఎస్ను 1998 నుంచి దశలవారీగా విస్తరిస్తూ వచ్చారు. దీంతో ప్రస్తుతం ఐఎస్ఎస్ బరువు దాదాపు 420 టన్నులకు చేరుకుంది. 2000లో తొలిసారిగా ఇందులో ఓ వ్యోమగామి అడుగుపెట్టారు. 2011లో ఐఎస్ఎస్కు చివరి మాడ్యూల్‌ను జోడించారు. ఐదేళ్ల తర్వాత ఐఎస్ఎస్లో వ్యోమగాములు నివాసం ఉండేందుకు వీలుగా ప్రత్యేకమైన గాలిబుడగలాంటి నిర్మాణాన్ని ఏర్పాటుచేశారు. 2030 వరకూ పనిచేసే ఈ ఐఎస్ఎస్లో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతాయి? పదార్థాల భౌతిక ధర్మాలు మారతాయా? బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై ప్రభావం ఎలా ఉంటుంది? వంటి అంశాలపై అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. గగన్‌యాన్ తర్వాతే.. జూలై 15న చంద్రయాన్ –2 ప్రయోగం పూర్తయ్యాక గగన్‌యాన్‌పై దృష్టి సారిస్తామని శివన్ తెలిపారు. ‘వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ముందు రెండుసార్లు వారు ప్రయాణించే మాడ్యూల్‌ను పరీక్షిస్తాం. 2022లో తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపడతాం. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను రాబోయే 6 నెలల్లో ఎంపిక చేస్తాం. ఆ తరువాత వీరికి ఏడాది పాటు శిక్షణ ఇస్తాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించింది’ అని శివన్ చెప్పారు. గగన్‌యాన్ ప్రయోగం పూర్తయ్యాక దానికి కొనసాగింపుగా అంతరిక్ష కేంద్రం నిర్మాణంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. -
చంద్రయాన్–2 మరోసారి వాయిదా
న్యూఢిల్లీ : చంద్రయాన్–2 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగం వాయిదా పడటం ఇది రెండోసారి. తొలుత ఈ ప్రయోగాన్ని ఏప్రిల్‌లో నిర్వహించాలని భావించారు. ప్రయోగానికి ముందు మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, దీంతో ప్రయోగాన్ని అక్టోబర్ లేదా నవంబర్‌కు వాయిదా వేయాలని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అది వాయిదా పడింది. తాజాగా అక్టోబర్ మొదటి వారంలో చేపట్టాల్సిన ప్రయోగం డిసెంబర్ చివరికి లేదా వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసినట్టు ఇస్రో వెల్లడించింది. చంద్రుడి కక్ష్య చుట్టూ అధ్యయనం చేయడం కోసమే చంద్రయాన్–1 ప్రయోగాన్ని చేపట్టారు. చంద్రుడి కక్ష్యతోపాటు ఉపరితలంపై రోవర్‌ను దింపి అక్కడ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు గాను చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇటీవల ఇస్రో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాలు సరైన ఫలితాలనివ్వలేక పోయాయి. జీశాట్–6ఏతో సంబంధాలు కోల్పోవడం, జీశాట్–11 ప్రయోగ తేదీని మార్చడం, ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్ నేవిగేషన్ ఉపగ్రహంలో హీట్‌షీల్డ్ పనిచేయక పోవడంతో అది విఫలమవడం లాంటి సంఘటనల నేపథ్యంలో చంద్రయాన్–2పై ఇస్రో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. -
సక్సెస్ అయితే.. నాసా కంటే ఇస్రోనే తోపు
సాక్షి, న్యూఢిల్లీ : అంతరిక్ష ప్రయోగ చరిత్రలో చంద్రయాన్-2ను ఓ మరుపురాని ప్రాజెక్టుగా మార్చేందుకు భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (ఇస్రో) సిద్ధమైపోయింది. సుమారు 800 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సిద్ధం చేస్తున్న ఈ ప్రాజెక్టును ఏప్రిల్‌లో ప్రయోగించాలని నిర్ణయించుకుంది. నాసో అపోలో మిషన్ల కన్నా చంద్రయాన్-2 చాలా శక్తివంతమైందని కేంద్ర మంత్రి(అంతరిక్ష వ్యవహారాల శాఖ ఇన్‌ఛార్జి మంత్రి) జితేంద్ర సింగ్ చెబుతున్నారు. ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ‘ఇస్రో ఇప్పటిదాకా చేపట్టిన ప్రయోగాలలో చంద్రయాన్-2 ప్రత్యేకంగా నిలవబోతోంది. ప్రపంచంలోనే ఓ అద్భుత ఘట్టంగా దీనిని తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిపై నిశితంగా స్పేస్ క్రాఫ్ట్‌లను ల్యాండ్ చేయటంలో విజయవంతం అయ్యాయి. ఇప్పుడు భారత్ గనక ఆ ఘనత సాధిస్తే ఇస్రో చరిత్ర సృష్టించినట్లే. ఎందుకంటే నాసా(అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) కంటే ఇస్రో 20 రేట్లు తక్కువ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్టును ప్రయోగించబోతోంది’ అని జితేంద్ర వెల్లడించారు. చంద్రుడి మీద దక్షిణ దృవంలో చంద్రయాన్-2 ల్యాండ్ అయ్యే దిశగా ఇస్రో ప్రణాళికలు చేస్తోంది. 2008లో చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం కాగా, 2009లో నీటి జాడలు ఉన్నట్లు స్పేస్ క్రాఫ్ట్ గుర్తించింది. ఈ విజయం నింపిన ఉత్సా హంతో ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సిద్ధమవుతున్నది. ప్రయోగం ఎలా సాగుతుందంటే... చంద్రయాన్-2 వ్యోమనౌక,ల్యాండర్,రోవర్.. ప్రధాన,ఉప వ్యవస్థల అనుసంధానాలు అవుతాయి. చంద్రయాన్-1 లా కాకుండా వ్యోమనౌక నెమ్మదిగా దిగేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. దీని ప్రకారం వ్యోమనౌకను 100 మీటర్ల ఎత్తునుంచి కిందకు జార విడుస్తారు. వ్యోమనౌక కక్ష్య నుంచి రోవర్ చంద్రునిపై కుప్పకూలకుండా నెమ్మదిగా వాలేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందందని సైంటిస్టులు భావిస్తున్నారు. ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం 100 మీటర్ల ఎత్తులో చంద్రమండలంలోని గురుత్వాకర్షణ వాతావరణాన్ని సృష్టిస్తారు. 500 కిలో గ్రాముల బరువైన వ్యోమనౌకను మండించడం ద్వారా కిందకు శాటిలైట్‌ను జారవిడుస్తారు. నౌక దిగాల్సిన దగ్గర రాళ్లు,బండలు ఉంటే మరో సురక్షిత స్థానాన్ని గుర్తించి అక్కడ దిగేందుకు అడ్డం-నిలువు విన్యాసాలు సాయపడుతాయన్నారు. ప్రస్తుతం వ్యోమనౌక సమర్ధతను తమిళనాడు మహేంద్రగిరి ఇస్రో ఇందన కేంద్రంలో పరీక్షిస్తున్నారు. చంద్రునిపై రోవర్.. ఖనిజ వనరులు, మూలకాల్ని, మానవ జాతి మనుగడకు గల సాధ్యాసాధ్యాలను పరీక్షిస్తుంది. -
30 ఉపగ్రహాలు ఒకేసారి నింగిలోకి!
బెంగళూరు: వచ్చే డిసెంబర్ ద్వితీయార్థంలో పీఎస్ఎల్వీ వాహకనౌక ద్వారా 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిస్తామని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. భారత్‌కు చెందిన కార్టోశాట్–2తో పాటు 25 నానో ఉపగ్రహాలు, మూడు మైక్రో ఉపగ్రహాలు, ఓ వర్సిటీకి చెందిన శాటిలైట్‌ను పీఎస్ఎల్వీ–సీ40 ద్వారా ప్రయోగిస్తామని వెల్లడించారు. ‘భారతీయ అంతరిక్ష కార్యక్రమం– పరిశ్రమ సరళి, అవకాశాలు’ అన్న అంశంపై వచ్చే నెల 20 నుంచి 21 వరకు ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ సదస్సు వివరాలను కిరణ్ సోమవారం మీడియాకు తెలియజేశారు. మార్చిలో చంద్రయాన్–2: వచ్చే మార్చిలో చంద్రయాన్–2ను ప్రయోగిస్తామని కిరణ్ తెలిపారు. 2008లో ప్రయోగించిన చంద్రయాన్–1 పంపిన ఫొటోల ద్వారానే చంద్రునిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని ప్రపంచానికి తొలిసారిగా తెలిసింది. జీఎస్ఎల్వీ మార్క్–ఐఐ ద్వారా ప్రయోగించనున్న చంద్రయాన్–2తో జాబిల్లిపై మంచు, నీటి అణువులతోపాటు ఇతర మూలకాల గురించి పరిశోధించవచ్చని వెల్లడించారు. -
మూడేళ్లలో చంద్రయాన్-2’
న్యూఢిల్లీ: మంగళ్యాన్, జీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలతో విజయోత్సాహంతో ఉన్న భార త అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా చంద్రయాన్-2 మిషన్‌పై దృష్టి సారించింది. మరో రెండు లేదా మూడేళ్లలో చంద్రుడిపైకి ల్యాండర్, రోవర్‌ను పంపేందుకు సిద్ధమవుతున్నట్లు శుక్రవారమిక్కడ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ విలేకరులకు వెల్లడించారు. 2016 లేదా 2017లో చేపట్టనున్న చంద్రయాన్-2లో ఓ రోవర్‌ను, ఓ ల్యాండర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా పంపనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ల్యాండర్ తయారీ, అది చంద్రుడిపై దిగేలా చేయడం, దిగేందుకు అనుకూలమైన చోటు ఎంపిక చేసుకునేలా చూడటం వంటి సవాళ్లు తమ ముందు ఉన్నాయన్నారు. మార్స్ మిషన్ సందర్భంగా ప్రారంభించిన ఫేస్బుక్ పేజీకి విశేష ఆదరణ లభించినందున యువతకు మరింత చేరువయ్యేందుకు యూట్యూబ్‌లోనూ ఇస్రో ఇవీడియోలు పొందుపరుస్తామన్నారు.